అందమైన ఆకాశం

701968_1041400002619396_8214060848905847950_o“సెగెట్రీ ,ఆకాశం లో ఎవరో మర్డర్ చేసినట్టు  లేదూ.  మనిషన్నాక  కాసింత కళా  పోషణ ఉండాలోయ్!!” ముత్యాల ముగ్గు లో రావుగోపాలరావు డైలాగ్ . ఈ చిన్న డైలాగ్  బట్టి చెప్పచ్చు ఆ మనిషి యొక్క మనస్తత్వం. అందమైన ఆకాశాన్ని చూస్తే  ఒక విలన్ పాత్ర  ఇంత  వికృతం గా  ఆలోచించడమే  కాదు  ఆయన  సెక్రటరీ ని కూడా అలా  ఆలోచింపచేయిస్తున్నాడు.

ఈ రోజు ఆఫీస్ నుంచి వస్తుంటే చూసాను.  ఆకాశం మేఘావృతం అయ్యేలా అయింది. ఒకతను పెద్ద కెమెరా పట్టుకుని  ఆ మబ్బుల్ని తన కెమెరా తో బంధించాలని చూస్తున్నాడు. అప్పుడు అన్పించింది  – అందమైన ఆకాశం చూస్తే కవి కవిత్వం అల్లుతాడు, చిత్రకారుడు  చిత్రం గీసేస్తాడు, రచయిత కథలు అల్లేస్తాడు, విలన్ పాత్ర ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిస్తాడు అని ముళ్ళపూడి వారు చిన్న డైలాగ్ తో ఎంత బాగా చెప్పారో  కదా అని !!

అందుకే ఆ చలన చిత్రాలు ఇప్పటికీ  అలా గుర్తుండిపోయాయేమో

 

ఇంతకీ చెప్పేదేంటంటే ఇటువంటి చిత్రాలు  నా లాంటి బ్లాగరు అయితే బ్లాగు ద్వారా ప్రపంచానికి చాటి చెప్తారు  

బ్లాగులు – వ్యాఖ్యలు – ఒక అభ్యర్థన

బ్లాగులు  అనేవి  కొంత మంది తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి వ్రాస్తారు. కొందరు సమాచారం చెప్పడానికి వ్రాస్తారు. కొందరు తమ జీవితానుభవాల నుంచి వ్రాస్తారు. కొన్ని బ్లాగులు చాలా ఆలోచింపచేసేవి గా ఉంటాయి. మాలిక, బ్లాగిల్లు లోని బ్లాగులు చూసాక  ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయా  అన్పిస్తూ ఉంటుంది ఇవన్నీ చదివినపుడు.  చాలా మందికి బ్లాగు వ్రాయటం ఒక అభిరుచి మాత్రమే. అదే వారి వృత్తి మాత్రం కాదు.  సమస్య పూరణ, శంకరాభరణం లాంటి బ్లాగులు నేను చదవను, అనుసరించను.  కానీ ఆ బ్లాగుల్లో వచ్చే అన్ని వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగు అంతరించిపోయే భాష కాదు అన్న సంతోషం వేస్తుంది.

ఇలా అందరిని చూసి ప్రేరణ చెంది నేను బ్లాగు వ్రాయడం మొదలు పెట్టాను మొన్న ఉగాది నుండి.  నేను బ్లాగు వ్రాస్తున్నాను అంటే నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న తెలుగు లో అంత ఓపిక గా ఎలా టైప్ చేస్తారు అని.   నేను ఒక రాజకీయ పార్టీ ని మెచ్చుకోవడానికో, తిట్టడానికో / ఒక వర్గం ని తిట్టడానికో  వ్రాయడం నేను బ్లాగు మొదలు పెట్టలేదు.  నాకు తోచిన, గమనించిన  విషయాలు  వ్రాస్తున్నాను.  భాజపా  నాయకులని మెచ్చుకుంటే  కాంగ్రెస్ ని తిట్టినట్టు కాదు. కాంగ్రెస్ నాయకులని మెచ్చుకుంటే  భాజపా తిట్టినట్టు  కాదు.

నేను నా బ్లాగుని ముందు గా  నా ముఖపుస్తకం లో , వాట్సాప్ లో పంచడం జరిగింది. ఒకరో ఇద్దరి నుంచి  తప్ప పెద్ద గా స్పందన లేదు. చూసిన వారు చాలా బాగా ఉంది అన్నారు.  ఎప్పుడైనా  ఏ విషయం లో అయినా సరే,  మనల్ని మెచ్చుకుంటూ ఉంటే  గర్వం గా ఉంటుంది తప్పితే  మనల్ని మనం మెరుగు పరచుకోవడం అంటూ ఉండదు.   ఒక విమర్శ వస్తేనే మన తప్పులు మనం గుర్తించుకోవడం జరుగుతుంది.  అందుకే అది ఆశించి మాలిక, లో శోధిని లోను పెట్టడం జరిగింది.

నేను ఆశించినట్లే కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. ముందు వ్యాఖ్యలు చూడగానే నా టపా ని ఓపిక గా చదివారు అన్న సంతోషం వేసింది . రాను రాను ఆ వ్యాఖ్యలు మరీ  దూషించినట్లుగా అన్పించింది.  నా బ్లాగు లోనే కాదు వేరే బ్లాగుల్లో కూడా కొంతమంది ఈ విధం గానే వ్యాఖ్యలు చేస్తున్నారు.   ఒక్కోసారి ఆ వ్యాఖ్యలు చూస్తే మనసు చివుక్కుమంటుంది.  వ్రాసిన ప్రయోజనం వేరు. ఆ ప్రయోజనం అందేలోపే వీరు వాటి మీద నీరు జల్లుతున్నారు అన్పించింది . ఉదాహరణ కి భండారు శ్రీనివాసరావు గారు ఒక టపా వేశారు  ‘జై జవాన్’ అంటూ. చదివిన కాసేపన్నా ఆ వీర జవాన్లని  తల్చుకున్నాము.  అంతలోనే  అందులో ఎవరో ఒక వ్యాఖ్య వ్రాసారు ‘ The soldiers did their duty. No need to heap winsome praise’ .  ఇందులో ఎవరి మనోభావాలైనా  దెబ్బ తిన్నాయా లేక ఏదైనా వివాస్పదమైన అంశం ఉన్నదా ? ఎందుకింత దురుసైన  వ్యాఖ్య మరి?

వ్యాఖ్యలు చేసేవారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం మంచిది. ( నా అభిప్రాయం మాత్రమే)

  • మెచ్చుకోకపోయినా  పరవాలేదు.  
  • విమర్శ చేయాలి . మీరు విమర్శిస్తేనే బ్లాగు మెరుగు పర్చుకోవడం జరుగుతుంది.
  • తప్పుడు సమాచారం ఇచ్చినా చెప్పవచ్ఛు.  
  • బ్లాగు లో విషయం సమాజానికి హాని కలిగించేది ఉన్నా, మీ  మనోభావాలు దెబ్బ తీసేవిధం గా ఉన్నా వారికి తెలియచేయాలి నా అభిప్రాయం.  తెలియజేయకపోతే  మీరు మీ నిశ్శబ్దం తో  పరోక్షం గా వారికి మద్దతు ఇఛ్చినట్లే.
  • మీకు కావలసినట్టు గా బ్లాగరు వ్రాయరు. కేవలం వారి అభిప్రాయం చెప్తారు. ఆ అభిప్రాయం తో మీరు ఏకీభవించనవసరం లేదు.
  • మనం ఏమి గాంధీ మహాత్ముల లాంటి వాళ్ళం కాదు. ఆరు శత్రుల  తో నిరంతరం పోరాడేవారమే. ఒక్కొక్క సారి దురుసు గా వ్యాఖ్య ని చేసినా  కానీ బ్లాగరు ని దూషణ చేయవద్దు  అని మనవి.  వ్యక్తిగత దూషణ అసలు వద్దు.  ముఖ్యం గా బ్లాగరు వివాదాస్పదమైనటువంటివి  వ్రాయనప్పుడు కూడా .(నేను పైన  చెప్పిన ఉదాహరణ  చదవండి).

ఎంత విదేశానికి వలస వెళ్లినా ఏళ్ళు గడుస్తున్నా మార్పు రానిది ఒకటి ఉంటుంది.  అదే  – మన ఆలోచనలు మాట్లాడే  భాష!!  మన మాతృ భాష తెలుగు.    అదే  కదా  మన అందరినీ  కలుపుతున్నదీ !! ‘ అబ్బా తెలుగు లో ఏం చదువుతాం’ అంటూ ఫ్యాషన్ గా మాట్లాడేవారు ఎక్కువ అవుతున్న తరుణం లో తెలుగు భాష ని  ఏదోవిధం గా పరిరక్షిస్తున్న బ్లాగరు ని,   మెచ్చుకోకపోయినా పరవాలేదు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి నిరుత్సాహపరచవద్దని మనవి. 

ఇది సదుద్దేశ్యం తోనే చెప్తున్నాను ఎవరినీ  బాధ పెట్టాలని మాత్రం కాదు. ధన్యవాదాలు.

నా గురువు నాటిన విత్తనం

‘అంజయ్య నల్లన అంజయ్య బొజ్జ పెద్దన ఎందువలన ? ‘ అంటూ ఒక రోజు మేము సప్తపది సినిమాలో  ‘గోవుల్లు తెల్లన’ కి పేరడీ కి కట్టిన పాట పాడుతూ గట్టిగా నవ్వుకుంటున్నాము. ఇంతలో మా క్లాసు టీచర్ రావటం మా పాట వినటం జరిగింది.  అలా పాడిన వారిని లేచి నిల్చోబెట్టి మన రాష్ట్ర ముఖ్య మంత్రి ని వెక్కిరించటం అంటే ఇంట్లో తండ్రిని వెక్కిరించినట్లే  అని మందలిచ్చారు. ఆయన ఎవరో ఆ స్థాయి కి ఎలా వచ్చారో మీకు తెలీదు కాబట్టి అలా  హేళన చేయద్దు అన్నారు. ఈ సంఘటన నేను ఎలిమెంటరీ స్కూల్  తరగతి  లో ఉన్నపుడు బహుశా 1981-82 ల మధ్య జరిగినది. మేము  పాడిన ఆ పాట  అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  T.అంజయ్య గారిపై (అంజయ్య గారు   హైదరాబాదు లో  Allwyn ఫ్యాక్టరీ లోని  ఒక సామాన్య ఉద్యోగి స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యారు).  

ఒక ఆర్నెల్ల క్రిందట – రాహుల్ గాంధీ బెంగళూరు కాలేజికి వెళ్లి  ‘స్వచ్చ్ భారత్  పని చేస్తున్నదా’  అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. ఆ విద్యార్థినులు  ‘పని చేస్తోంది’ అని చెప్పగానే భారత దేశం అంతా  ముఖపుస్తకం లోను,  whatsapp లో పడీ పడీ  నవ్వుకున్నారు .  

ఈ మధ్య భాజపా  రెండేళ్ల పాలన పూర్తి అయిన కారణం గా ఏదో టీవీ ఛానెల్ లో స్మృతి  ఇరానీ  గ్గారు – ఆవిడ శాఖ ఏమి  చేసిందో ఏమి చేస్తుందో  ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా చెప్తున్నారు.  మధ్యలో ఎవరో కాంగ్రెస్ వారు (నాకు పేరు  తెలియదు) ఒక అప్రస్తుత ప్రసంగం చేశారు –  “గూగుల్  లో  ‘Most Stupid PM’  అంటే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరే వస్తుంది చూడండి” అంటూ .  

పోయిన వారం నరేంద్ర మోదీ అమెరికా పర్యటన లో క్యాపిటల్ హిల్ లో ప్రసంగం అయిన  రెండో రోజున whatsapp లో ఈ సందేశం:

**********************************************************************

I got a call from my American friend today.

He asked me – what is “Monkey Bath”?

I was very much surprised…. Monkey Bath!!  I have never heard about it.

He told me that entire America is talking about this Monkey Bath between Obama and Modi.

I told him – You stupid…It is not Monkey Bath, but it is ..

मन की बात

😜😃

***********************************************************************

భారత ప్రధాని  నరేంద్ర మోదీ – ఒకప్పుడు రైలు స్టేషన్ టీ అమ్ముకున్న యువకుడు – ఈ రోజున ప్రపంచం లో అతి పెద్దదైయిన  ప్రజాస్వామ్యం లో  అత్యధిక మెజారిటీ  తో ఎన్నిక కాబడిన  నాయకుడు.  అటువంటి వ్యక్తి యువతకి ఎంతో  స్ఫూర్తి దాయకం. ఆయన చెప్పే పనుల చేయమని  యువత ని ప్రోత్సహించవలసింది పోయి మనమే ప్రతిదీ హాస్యాస్పదం గా మార్చటం వలన ఎవరికి నష్టం కలిగిస్తున్నాము ? దేనికి నష్టం కలిగిస్తున్నాము?  ప్రతి రైలు పెట్టె దగ్గరికి వెళ్లి’ చాయ్ చాయ్’ అంటూ అరిచిన  పిల్లవాడు అమెరికా క్యాపిటల్ హిల్ లో Standing Ovation తీసుకున్నవ్యక్తి గా మారిన విషయం  మన కి జోక్  గా కన్పిస్తే –  మన పిల్లలకి  కూడా ఆ వ్యక్తి జోకర్ గానే కన్పిస్తాడు. రేపు  వారికి పెంచిన తల్లి తండ్రులు, విద్య నేర్పే గురువులు ఎంత పెద్ద జోకర్లు  అవుతారో ఒకసారి ఆలోచించండి!!

రాహుల్ గాంధీ ఇలా ఒక విద్యాసంస్థ కి కి వెళ్లి,  విద్యార్థులతో ఈ విధం గా మాట్లాడవచ్ఛునా  అని ఎవరు మాట్లాడినట్లు లేదు.  ఎంత  ప్రతి పక్షం లో ఉన్నా కనీసపు నీతి నియమాలు పాటించలేని ఇటువంటి వ్యక్తుల తీరును ఎవరూ ఖండించినట్లు గా  కూడా వినలేదు మరి.

నా ఈ టపా కి కారణం: పైన చెప్పిన whatsapp లో సందేశం చూసి నేను చాలా తీవ్రం గా  స్పందించడం జరిగింది.  ఆ సందేశం పంచిన వ్యక్తి మనసు గాయపరిచానేమో !! కానీ  – ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’ అంటూ  భారత దేశం ఖ్యాతి ని  ప్రపంచం నలుమూలల చాటుతున్న ఆ ప్రధానిని, ఆ సందేశం ఆ విధం గా హేళన  చేస్తుంటే దాని  గురించి మాట్లాడకపోవడం కూడా  నేను పరోక్షంగా  నా మౌనంతో సమ్మతి ని చెప్పినట్లే  కదా అన్పించింది.

ఆ రోజు టీచర్ మమ్మల్ని ఎందుకు మందలిచ్చారో మాకు అస్సలు అర్ధం కాలేదు. ‘ జోకు ని జోకు లాగా  తీసుకోవచ్ఛు కదా ‘ అనే అనుకున్నాము. ఆ తరువాత ఎప్పుడూ ఎవరినయినా హేళన చేయాలంటే  తిడతారేమో అని భయం వేసేది .  ఎందుకు చెప్పారో అర్ధం అయ్యాక  హేళన చేయడానికి మనసు రాలేదు. పైగా అమెరికా లో  పెరిగే మా పిల్లలకి  ‘ Look at the bright side of it’ అంటూ  చెప్పడం మొదలుపెట్టాను.  నాకు ఆ రోజు ఈ విత్తనం నా మనసు లో నాటి, ఈ అవగాహన ని కల్పించిన నా గురువుకి పాదాభివందనములు _/\_.

గమనిక: నేను  నరేంద్ర మోదీ భక్తురాలిని కాదు. నేను ఆయనని ఓటు వేసి ఎన్నుకోలేదు.

మన బంగారం మంచిదయితే..

వారాంతం అవ్వగానే సోమవారంనాడు ఇక ఈ వారం  మొదలు అనుకుంటూ ఏ  విఘ్నాలు కలగ కుండా చూడమని  గణేశుడిని  ప్రార్థిస్తూ నా కారు లో  నేను పెట్టుకునే మొదటి పాట  ‘ముదకరాత్తమోదకం’.  నా చేయి నాకు తెలియకుండానే  మొదటి సీడీ  లోని మొదటి పాటని పెట్టేస్తుంది.  నా మెదడు సోమవారానికి అంతగా  ప్రోగ్రాం చేయబడింది. ప్రతి విషయాన్నీ గుర్తు చేయించుకునే  మా పిల్లలు కూడా,  మేము  గుర్తు చేయకుండానే –  ప్రతి ఏడు బడి మొదలయ్యేటప్పటికి   బాలవికాస్ లో  వినాయక చవితి చేసేసుకుని,   పూజ చేసుకున్న చిన్ని వినాయకుడి విగ్రహాలు కొత్త బాక్ పాక్ ల లో సర్దేసుకుంటారు.  బడిలో ఏదైనా పరీక్షా  ఉంటే  ఇంట్లో నుంచి బయలుదేరే ముందు బాగా మార్కులు వచ్చేయాలని  ఓ  మూడు గుంజిళ్ళు చేసి, మా గుమ్మం దగ్గరే ఉన్న  వినాయకుడి దగ్గర ఆశిస్సులు తీసుకుంటారు.  వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు, ప్రతీ  పని ఆయనకి  ముందు చెప్పాలి అన్న నమ్మకం మా మెదళ్ల  లో గుడి కట్టేసుకుంది.

ఇలా మా కుటుంబం ఒక్కటే కాదు, హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి వారికీ ఇలాంటి  ఒక నమ్మకం ఉంటుంది.   అందునా  గణేశుడు అంటే మరీ !! అటువంటి నమ్మకం ఉన్నహిందూ ధర్మాన్ని పాటించే వారి మనోభావాలు దెబ్బ తీస్తూ  Amazon  వారు  గణేశుడు బొమ్మ  ఉన్న కాలి పట్టాలు (కాళ్ళు తుడుచుకునే  doormat)  అమ్మకాలు మొదలు పెట్టారు. ఎంత  హేయమైన ఆలోచన!! హిందూ ధర్మాన్ని పాటించే వారు, కొంత మంది  ట్విట్టర్ లో గొడవ చేసాక వారి వెబ్సైటు లో నుంచి అవి తొలగించారు.  Amazon వారికీ వ్యాపారం తో పని కాబట్టి పెద్ద గొడవ లేవీ లేకుండానే తొలగించారు. సరే, Amazon  వారు విదేశీయులు  వాళ్ళకి తెలీదు. కాబట్టి  ఒక విధం గా క్షమించవచ్చేమో !!

PK చలనచిత్రం మాటేమిటి? శివుడు వెళ్లి  Restroom లో దాక్కోవడం , బాబాలని క్రించపరుస్తూ  చివరికి  ఆ ముగింపు  ఏంటి ? సరే PK చలనచిత్రం లో నటించిన అమీర్ ఖాన్ తన నటన తో పొట్టపోసుకునే వాడు, ఇస్లాము మతానికి చెందిన వాడు కాబట్టి ఆయనకి తెలియదు అనుకుని క్షమించి వేయవచ్చు !!

అత్తారింటికి దారేది  చలనచిత్రం చూసిన  ఒక స్నేహితురాలు ఒకరు  అందులో హీరో సన్యాసుల లా నటించిన పాట  గురించి, అహల్య పాత్ర తో ఒక హాస్య సన్నివేశం గురించి చెప్తే యూ ట్యూబ్  లో చూసాను.  హిందూ ధర్మం ని , రామాయణం లోని పాత్ర ని ఎందుకోసం ఇంత క్రించపరచారు అనిపించింది. మొన్నటికి మొన్న ‘బ్రహ్మోత్సవం’  చలన చిత్రం!! అలా  పేరు పెట్టచ్చా  పెట్టకూడదా  అన్న ఇంగితజ్ఞానం, ఆలోచన కూడా లేదు.  మొన్న ఒక తెలుగు బ్లాగు లో కూడా దీని  మీద ఎవరో ఆవేదన వ్యక్త్యం చేసారు కూడా!!  సరే వీరందరూ సినిమా వాళ్ళు. నటించాక, మనం కొనే ఆ టికెట్ డబ్బులతో పొట్ట పోషించుకునే వారు పాపం – అనుకుని వీరిని కూడా క్షమించేయచ్చు !!

ఇక మీడియా వారైతే వారి గురించి చెప్పనే అక్కర్లేదు.  హిందూ మతాన్ని ఎంత దూషిస్తే అంత మంచిది కాస్త రోజు గడుస్తుంది అన్నపద్దతి  లో ఉంటారు.

ఇలా ఎవర్నయినా క్షమించాలి  అన్పిస్తుంది కొందర్నితప్ప. కొంతమంది ని ముఖపుస్తకం లో చూస్తుంటాను. గోడ ఒకటి దొరికింది కదా అని ఏదో ఒకటి వ్రాసేస్తూ ఉంటారు. మేము అంత బాగా చదువుకున్నాము,  ఇంత బాగా సేవ చేస్తున్నాము అంటూ చెప్పుకుంటూనే హిందు ధర్మం గురించి మాత్రమే దూషణ, హేళన మొదలు పెడుతుంటారు.  ఎలా అంటే మచ్చుకి కొన్ని ఉదాహరణలు  :  చాగంటి గారు లాంటి వారు  చెప్పిన దాంట్లో ఆవగింజ లో అరవయ్యవ భాగం ఏదో ఒకటి విని, ఆయన గురించి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ మాట్లాడేసేయటం.  ఈ అయ్యప్పకి ఆడవాళ్ళం టే పడదా అంటూ హేళన చేయడం (ఇది ఎంత దాకా  వచ్చిందంటే ఎవరి నమ్మకాలతో కూడా పనిలేకుండా – అయ్యప్ప గుడిలో ఆడవారిని అనుమతిచ్చే దాకా). ‘ఈ స్వాములను ముట్టుకోకూడదు కానీ పొప్ చూడండి  అందర్నీ కౌగిలించుకుంటారు’ అంటూ జీయర్ స్వామిని,  పీఠాధిపతులనీ అవమానించటం. అది వేరే మతస్తులు కాదు. హిందువులే !! అదీ  భారతదేశపు వాసులే !! ఇటువంటి వారికి – వారి  చదువు, ఇతరుల కి వారు చేస్తున్న సేవ  నేర్పిస్తున్న సంస్కారం ఇదేనా అన్పిస్తుంది. సాటి  భారతీయుడి నమ్మకాల మీద ఎందుకింత అగౌరవం? అమెజాన్  అమ్మకాలు అయితే ఆపగలిగాము కానీ  మరి ఇటువంటి వారిని ఏం  చేస్తున్నాము ? ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా  పట్టలేడు కదా మరి !!  మన బంగారం మంచిదయితే అమెజాన్ వారి లాంటి వారిని అనుకోవడం దేనికి ?

భారతీయులందరూ నా సహోదరులు అని రోజు ప్రతిజ్ఞ చేయటం కాదు. సాటి  మనిషిని, వారి సంప్రదాయాలని గౌరవిస్తూ చేసిన ప్రతిజ్ఞ ని ఆచరణ లో కూడా పెట్టాలి. లేకపోతే   రోజు అమెజాన్ వినాయకుడి మీద  కాళ్ళు తుడిపించేందుకు ప్రయత్నించారు.  రేపు అంగారకగ్రహం వారు వచ్చి ఇంకో విధం గా ఈ హిందూ ధర్మాన్ని అవమాన పరచినా ఆశ్చర్యపోనక్కరలేదేమో మరి!!

చిప్స్ సంచీలు మరియు పర్యావరణం పై వాటి ప్రభావం

ఉపోద్గాతము:

మా అమ్మాయి ప్రపంచ పర్యావరణ దినోత్సవ  సందర్భం గా ఒక వ్యాస పోటి రచనలకి ఆంగ్లము లో వ్యాసము వ్రాసింది. ఆ  వ్యాసానికి తనకి  ప్రథమ బహుమతి వచ్చింది.  నా బ్లాగు లో  వ్రాయాలని – సిలికానాంధ్ర మనబడి లో నేర్చుకున్నతెలుగు  భాషా  పరిజ్ఞానం తో, google translate సహాయం తో, ఆ ఆంగ్ల వ్యాసాన్ని  తనే  స్వయం గా తెలుగు లో అనువదించింది.  తన  ఈ చిన్నిప్రయత్నాన్ని ఒక టపా గా  పోస్టు  చేస్తున్నాను.  మా అమ్మాయి అమెరికాలో  పుట్టి పెరిగినా తెలుగు అనర్గళం గా మాట్లాడగలదు, వ్రాయగలదు కూడా.  అందుకే  తనని ప్రోత్సహించాలని ఈ వ్యాసం లో కొన్ని తప్పులు  కనిపించినా, ఆంగ్ల పదాలు వాడినా – నేను దిద్దలేదు, మార్చలేదు. ఈ వ్యాసం  ముఖ్య ఉద్దేశ్యం  ప్రపంచ పర్యావరణ దినోత్సవ  సందర్భం గా చిప్స్ సంచీల గురించి అవగాహన కల్పించటం.

వ్యాసము

మనం రోజు తినే పదార్థాలలో చిప్స్ అనేవి ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. పార్టీలైనా, స్నాక్స్ ఐనా, ప్రతీ అమెరికన్ ఇంట్లో చిప్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. కాని, ఆ చిప్స్ ప్యాకెట్లు తిన్న తరువాత వాటిని రీసైకిల్ చెయ్యకుండా పారవేసేస్తున్నారు – ఈ సమస్య పర్యావరణానికి రోజు రోజుకి పెద్ద అపాయం అవుతోంది. పార్టీలకు వెళ్ళినప్పుడల్లా నేను గమనించినది ఏమిటంటే ఒక చిప్స్ ప్యాకెట్ మొత్తం తినేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీస్కోవడానికి వెళ్తాము. నేను చిప్స్ పాకెట్స్ ని పడేయటానికి వెళ్ళి చెత్త బుట్టలోకి చూస్తే “ఈ రెండు గంటల సమయంలో ఇన్ని చిప్స్ పాకెట్లా! అమ్మో!” అని ఆశ్చర్యంతో ప్రతీ సారి అనుకుంటాను. అప్పుడు నేను అనుకుంటూ ఉంటాను – ఈ పాకెట్లన్ని Chesapeake Bay లోకి వెళ్ళిపోతే, దాంట్లో ఉన్న ప్రాణులకు ఏమవుతుంది పాపం? ప్రతి సారి తలచుకున్నప్పుడు జాలి వేస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఈ పాకెట్లను పడేయటం వల్ల చాలా పెద్ద ప్రమాదం అవుతోంది.

చిప్స్ కొనుక్కునే వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, చిప్స్  పౌచెస్ ని 100% తగరంతో తయారుచేయ్యరు – నిజానికి, ఒక మామూలు చిప్స్ ప్యాకెట్ ని ఏడు పొరల ప్లాస్టిక్ తో తయారు చేసి, దానిని తగరంతో పూత వేస్తారు. ఫ్రీటో లే, పెప్సికో లాంటి కంపెనీలకు ఇలాంటి పాకెట్లు వాడుకోవడం వలన చాలా ఉపయోగం, ఎందుకంటే ఈ పౌచెస్ చాలా తక్కువ బరువు ఉంటాయి – దానితో పాటు అవి షిప్పింగ్ వాల్యూమ్ ని కూడా తగ్గించడం వలన, దుకాణాల్లో అల్మారలలో తక్కువ స్థలం తీసుకుంటాయి. కానీ ఈ మల్టీ లేయర్డ్ పౌచెస్ తో సమస్య ఏంటంటే వీటిని పారువేసిన తరువాత ఆ ఎక్కువ ప్లాస్టిక్ వలన  పర్యావరణానికి ప్రమాదం కలుగుతోంది. ఈ పౌచెస్ ని రిసైకిల్ చెయ్యాలన్నా కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వేస్ట్ మానేజ్మెంట్ మల్టీ ప్యాకేజింగ్ కంపనీలో ఉన్న సస్టైనబిలిటి నిపుణులు చెప్పేదాని ప్రకారం, మల్టీ లేయర్డ్ ప్రొడక్ట్స్ ని రిసైకిల్ చెయ్యడానికి చాలా ఖర్చవుతుంది. అదే కాక, ఇంత ప్లాస్టిక్ ఉన్నప్పుడు చాలా పర్యావరణ హాని అని కూడా చెబుతున్నారు. కాని ఒక మంచి విషయం ఏమిటంటే, ఈ పర్యావరణ కాలుష్యాన్ని ప్రజల అవగాహనతో అడ్డుకోవచ్చు.

ఈ సమస్య మొదలవుతున్నది ప్రజలు కొనుక్కునే చిప్స్ సంఖ్యతో , వాటిని తిన్నతరువాత  ఆ  పౌచెస్ ని ఏ విధంగా పారవేస్తున్నారో. నా స్థానిక కాస్ట్కో దుకాణంలో, నేను పదిహేను నిమిషాల సేపు చిప్స్ సెక్షన్ ని గమనించాను. మొత్తం మీద, ఆ పదిహేను నిమిషాలలో, వచ్చిన మనుషులు 21 పెద్ద బ్యాగులు, 5 ఇండివిడ్యువల్-పౌచ్ ప్యాక్స్ కొన్నారు – 21 పెద్ద బ్యాగులంటే పర్యావరణానికి చాలా ఎక్కువ ప్లాస్టిక్ కదా! నా ఇరుగు పొరుగు దగ్గర నేను సర్వే నిర్వహించి, చిప్స్ తిన్న తరువాత వాటి పౌచెస్ తో ఏం చేస్తారని అడిగాను. సర్వేలో పాల్గొన్నవారిలో 86.4% మంది ఆ చిప్స్ పౌచెస్ ని చెత్తలో పడేస్తారని చెప్పారు. ట్రాష్ డంప్స్ లో ఇంత ప్లాస్టిక్ పెరుకుపోతూంటే -అది వెళ్ళే జలమార్గాలు, మరియు వాటిలో నివసించే ప్రాణులకి పెద్ద ప్రమాదమే. మరి ఈ సమస్యని  ఆపడానికి ఏ ఉపాయాలున్నాయి?

చిప్స్ కంపెనీ ఫ్రీటొ లే ఒక ఉపాయం తయారు చేసారు – బయోడిగ్రెడబిల్ మెటీరియల్స్ తో తయారయిన చిప్స్ పౌచ్. మామూలు చిప్స్ ప్యాకెట్ లాగా తక్కువ బరువు ఉండకపోవచ్చు – కానీ పర్యావరణ హానులను అడ్డుకునే శక్తి ఉంది, ఎందుకంటే బయోడిగ్రెడబిల్ పౌచెస్ ని తేలికగా భూమిలోకి కలిసిపొతాయి. నేను సూచించే ఈ ఇంకో విధానాన్ని కూడా ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం – ఆ విధానానికి పేరు upcycling. Upcycling అంటే రీసైక్లింగ్, రీయుసింగ్ ని కలపడం – దీనికి అర్థం ఏంటంటే ఒక వస్తువు యొక్క రూపాన్ని, ఉపయోగాన్ని మార్చడం. ఉదాహరణకి, ఒక చిప్స్ ప్యాకెట్ ని చెత్తలో పడేయటం కాకుండా, దానిని ఒక వాల్లెట్ లోకి మార్చడాన్ని upcycling అంటారు. దానితో డబ్బులు ఆదా అయ్యి, పర్యావరణానికి కూడా మంచే అవుతుంది. చిప్స్ పౌచెస్ కోసం ప్రత్యేక డిస్పోసల్ సెంటర్స్ కూడా పెడితే ప్రజలకు అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మీద ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన  కలిగితే, ఒక్క నా రాష్ట్రానికే కాదు – అమెరికా మొత్తానికి భవిష్యత్తు వెలిగిపోతుంది.

 

 

పెర్ల్ హార్బర్ పర్యటన

“టోర్నమెంట్ పెర్ల్ హార్బర్ రోజు కాదు ఎనిమిదో తారీఖున” అన్నాడు లారెన్స్, మా అమ్మాయి లెగో లీగ్ కి కోచ్. డిసెంబర్ ఏడో  తారీఖు అనటానికి బదులు పెర్ల్ హార్బర్ రోజు అని చెప్పడం విని చాలా ఆశ్చర్యపోయాను అతను చెప్పిన విధానానికి. ‘ఆ రోజు  ఎంత బాగా గుర్తుంది ఇతనికి’ అని మనసులో అనుకున్నాను.  పెర్ల్ హార్బర్ రోజు – లారెన్స్ లాగా చాలా మంది అమెరికన్ల కి మర్చిపోలేని రోజు.  రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్  అమెరికా హవాయిరాష్ట్రం  లోని పెర్ల్ హార్బర్ మీద  దాడి జరిపి భీభత్సం సృష్టించిన  రోజు.

IMG_0723

అమెరికా వారి Naval  station అయిన పెర్ల్ హార్బర్ –  హోనులులు  నగర సమీపం లోనే ఉన్నది.  మేము  ఈ పెర్ల్ హార్బర్  లో  దాదాపు నాలుగు  గంటలు గడిపాము. ఈ  ప్రదేశం లో USS Arizona స్మారకము,  Mighty Mo/USS Missouri  అనబడే  యుద్ధ నౌక స్మారకము, USS Oklahoma  స్మారకము,  USS Bowfin Submarine అనే  మ్యూజియం మొదలైనవి చూసాము.

USS Arizona అంటే –  డిసెంబర్ 7 ,1941 రోజున  జపాన్ వారు జరిపిన దాడి లో చిన్నాభిన్నమైన  ఒక యుద్ధ నౌక.  USS Arizona స్మారకము అంటే – ఆ దాడి  లో ఆ నౌక లో మరణించిన దాదాపు 1200 యుద్ధ వీరుల కోసం నీటి లో కట్టిన ఒక స్మారకము.   ఈ USS Arizona స్మారకమును చూడడానికి  యాత్రికులను  ఒక పడవ లో తీసుకువెళ్తారు. యాత్రికులు పడవ ఎక్కవలసిన నిర్దిష్ట సమయం వారికి  ఇచ్చిన టికెట్టు మీద ఉంటుంది. ఈ పడవ  ఎక్కేముందు మనకి ఒక 23 నిమిషాల చిన్న డాక్యుమెంటరీ చూపిస్తారు. ఆ చిత్రం లో  జపాన్ వారు ఎందుకు దాడి  చేసారు, ఏ  విధం గా  యుద్ధ నౌకలను మట్టు పెట్టారు, సాక్షుల కథనాలు  చూపిస్తారు. ఆ చలనచిత్రం చూసిన తరువాత గుండె బాధ తో బరువెక్కి పోయింది. నీటి లో తేలియాడుతూ , 75 ఏళ్ల  తరువాత  కూడా కూలిన ఓడ నుంచి  చమురు ఓడుతూ ఆ స్మారకం చుట్టూ  ఉన్న ఆ యుద్ధ నౌక శకలాలని చూసాక మరీను!!

Mighty Mo/USS Missouri  ఒక యుద్ధ నౌక/మ్యూజియం.  జపాన్ వారు లొంగి పోయినప్పుడు ఈ నౌక లోనే వ్రాత పూర్వకం గా ఒప్పందం జరిగింది.  ఒక విధం గా రెండవ ప్రపంచ యుద్ధం అధికారం గా  ముగిసిన స్థలం అని చెప్పవచ్చు. ఆ రోజున వాడిన కలములు (Pens) కూడా ప్రదర్శన గా ఉంచారు.  నౌక అంతా తిరిగి  చూసాక ఆ రోజుల్లోనే  అమెరికా వారు ఎంత  సాంకేతిక పరిజ్ఞానం వాడారా  అన్పించింది. ఈ  యుద్ధ నౌక ని కొరియా, గల్ఫ్ యుద్ధాలలో కూడా ఉపయోగించారుట.  

ఇవి చూడటం అన్నీ ఒక ఎత్తయితే, ఆ  రోజు పొద్దున్నే యుద్ధం చూసిన  ఒక సాక్షి ప్రత్యక్షం గా మనతో మాట్లాడటం ఒక ఎత్తు.. ఒక  93 ఏళ్ళ  Veteran ఒకరు చక్రాల బండి లో, అంత మండుటెండ లో తను ఆనాడు చూసింది చెప్పారు. ఆయన  మా పిల్లలు వేసిన  ప్రశ్నలకి సమాధానాలు చెప్పి,  వారి బడులలో పంచమని కొన్ని కరపత్రాలు కూడా ఇచ్చారు.  ఆ వయసు లో ఆయన దేశభక్తి చూస్తే చెయ్యెత్తి నమస్కరించాలి అన్పించింది మాకు. ఈ కధనాలు  విన్నాక  యుద్ధం అంటే ఏంటో దగ్గరినుంచి  చూస్తున్నట్లు అన్పించింది.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఈ ప్రదేశం చూసి వచ్చిన తరువాత – అమెరికా వారు జపాన్ పై అణు బాంబు లతో చేసిన దాడి అనివార్యమేమో కదా అన్న అభిప్రాయం కలిగింది .  ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే !! నేను అమెరికా లో పుట్టి పెరిగిన దానను  కాదు.   ఈ స్థల పర్యటన, వారు వివరించిన విధానము  నాకే అటువంటి అభిప్రాయం కలిగించింది. మరి  అమెరికా లో పుట్టి పెరిగే పిల్లలకి, వారి బడులలో నేర్పే ఈ యుద్ధ కథనం వింటే దేశభక్తి, గౌరవం ఎంత గా పెంపొందుతాయో కదా అన్పించింది. అందుకేనేమో అమెరికన్లు పెర్ల్ హార్బర్ రోజుని అంతగా గుర్తు పెట్టుకుంటారు మరి !!