ఇంట్లో రోజూ వారీ పని, పిల్లలు, వాళ్ళ బడులు , హోంవర్కులు అనేవి అందరికీ ఉండే బాధ్యతలు.అమెరికా లో నివాసించే మా లాంటివారికయితే రెండు సంస్కృతుల మధ్య పిల్లల ని పెంచటం అనేది ఇంకా అదనపు బాధ్యత. ఈ వత్తిడి తట్టుకోవడానికి ఒక్కొక్కరం ఒక్కో విధానం ఆచరిస్తుంటాము. పుస్తకాలు, సినిమాలు, పూజలు… ఇలా రకరకాలు. నేను అనుసరించే విధానం తెలుగు పత్రికలు చదవటం, పాటలు, సంగీతం వినటం. ఇలా అనుకోకుండా ఒక రోజు బ్రహ్మశ్రీ చాగంటి గురువు గారి ‘గంగావతరణ ఘట్టం’ ప్రవచనము వినడం జరిగింది. దీనిని గురించి నా పాత టపా రామాయణం – ఒక అద్భుత కావ్యం లో చెప్పడం జరిగింది. అలా చాలానే ప్రవచనాలు విన్నాను. ఏ విషయమైనా ఇంకో కోణం లో నుంచి చూడటం మొదలు పెట్టాను. ఆ విధం గా ప్రవచనాలు నన్ను నేను సంస్కరించుకోవడానికి, ఈ వత్తిడి నుంచి కాపాడుకోవడానికి అన్పించింది.
కానీ ఒక రెండు రోజుల క్రితం అనుకోకుండా చాగంటి గారి ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ లో చూసాక ఆయన చెప్పిన విషయం విని అంతకుమించి ఆలోచించలేకపోయానే అనుకున్నాను.
ఇంటర్వ్యూ మొత్తం రెండు భాగాలు గా ఉంది. లంకెలు ఇస్తున్నాను.
మొదటి భాగం https://www.youtube.com/watch?v=D4jsD6ewKk8
రెండవ భాగం https://www.youtube.com/watch?v=20YxX5rECE0
ఆ ఇంటర్వ్యూ లిఖిత పూర్వకం గా ఈ లంకె లో ఉన్నది. వీడియో చూడలేని వారు ఇది చదువుకొనవచ్చును.
విజయ్ కుమార్ గారు చాగంటి వారి ని “యువత కి సమాజ హితమే భక్తి అని చెప్పడానికి మీరేం చేస్తారు? ” అని ఒక ప్రశ్న వేశారు. దానికి చాగంటి వారు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరు విని తీరాలి. చాగంటి గారు ప్రవచించిన భాగవతం విని, బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి చేసిన సమాజ సేవ గురించి వివరించారు. అది నేను వివరించేకన్నా ఆయన చెప్పినది వింటేనే బావుంటుంది.
సాక్షి వారి వెబ్సైటు లోనే ఈ విధంగా వ్రాసారు:
“నేను ఒకప్పడు భాగవతం గురించి చెబుతూ కృష్ణలీలలన్నీ కథలు కాదు సమాజసేవని చెప్పాను. పూతన సంహారం సమాజసేవ. కాళీయమర్దనం యమునానది నీళ్లు పాడవకుండా చేసిన సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషం పొందాడు. అవే మనం నేర్చుకోవాలని చెప్పా. ఆ తర్వాత కొద్దిరోజులకి ప్రవచనానికి వెళ్లిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి. ఎవరు నువ్వనడిగితే బీటెక్ చదువుకుంటున్నాను, మీకు నమస్కారం చేయాలని వచ్చానంది. నేను ప్రవచనానికి వెళుతున్నానమ్మా మళ్లీ వెనక్కివచ్చి నీతో మాట్లాడే సమయం లేదన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు కనబడ్డారు చాలు నమస్కారం అంది. ఇద్దరం లిఫ్టులో దిగుతుండగా నాకు నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగాను. మీ మాటల వల్ల ప్రేరణ చెందానని చెప్పడంతో ఆశ్చర్యపోయి ఏం ప్రేరణ చెందావని అడిగా. మీరు చెప్పిన కృష్ణలీలలు సమాజ సేవన్నారు అది ప్రేరణ కల్పించిందని, నా స్థాయిలో సమాజ సేవ చేశానంది. కారెక్కబోతున్నవాడిని ఆగి ఏం సమాజ చేశావని అడిగాను. ప్రతిరోజూ ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటానని, నిరక్షరాస్యులు, రూపాయి లేని వాళ్లకి, ఓపి టికెట్ రాయడం రానివారికి సహాయపడతానని చెప్పింది. వాళ్లకి వార్డులు చూపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, మందులిప్పించి పంపిస్తానంది. ఈ మధ్య ఇంట్లో కాలుజారి పడిపోయిన ఒక గర్భిణీని ఇక బతకదు అన్న స్థితిలో తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన ఉపకారం వల్ల ఆవిడ బతికి ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఆ పిల్లకు తన పేరు పెట్టుకున్నారని, అది తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పింది.
నేను కారెక్కి వెళ్లిపోతున్నవాడిని ఆగి ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్లి పసుపు కుంకుమలు, బట్టలూ ఇచ్చి పంపాను. దీన్ని ఒకసారి టీవీ లైవ్లో చెప్పాను. దాన్ని చూసి చాలామంది పిల్లలు ఇది తమకు నచ్చిందంటూ తాము కూడా సమాజ సేవ చేస్తున్నామని ఉత్తరాలు రాశారు”
చాగంటి గారివి కొన్ని గంటల ప్రవచనాలు విన్నాను నేను. వినటానికి మాత్రం చక్కగా విన్నాను. కానీ ఒక్కరోజు కూడా పైన చెప్పిన అమ్మాయి లాగా ఎందుకు ఆలోచించలేదు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే – కొంతమంది ఆయన ప్రవచనాలు విని సగమే అర్ధం చేసుకుని, మిగితా సగం వదిలేస్తున్నారు . అటువంటి వారు చేసే చాదస్తపు పనులు చూస్తే చాగంటి వారంటే తెలియని వారికి కూడా విసుగు కలుగజేస్తుంది. దాని నుంచి ఆయనని చూస్తే తెలియని చికాకు, ద్వేషం మొదలవుతుంది. ఉదాహరణ కి రోజుకి రెండుసార్లు సంధ్యావందనం చేయాలి అని చెప్తే, అమెరికా లో మంచుతుఫాను పడ్డా ఇంట్లో పనులన్నీ ఆపేసి సంధ్యావందనం చేసే చాదస్తులు ఉన్నారు. గంధం పెట్టామా, బొట్లు పెట్టామా, కుడి వైపా , ఎడమ వైపా – ఇటువంటి చాదస్తాలు లెక్క ఉండవు !! నా అనుభవం లో ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అమెరికా లో దేనికి భయపడకపోయినా అగ్గి అంటే భయపడతారు . ప్రతిదీ చెక్కలతో కట్టి ఉంటారు కాబట్టి. ఒక రోజు ఆయన, ‘ దీపం రోజు వెలిగించాలి ఇంట్లో’ అంటూ ఏదో చెప్తున్నారు. అది విని, నాకున్న పరిస్థితి కి నూనె వేసి రోజూ దీపారాధన చేయలేను కదా. దేవుడి మందిరం లో ఒక చిన్న lamp పెట్టుకుని అదే దీపారాధన అనుకుంటాను. పండగ రోజులలో మాత్రమే దీపారాధన చేస్తాను.
ఈ సోషల్ మీడియా లో కొందరు వీడియో లు తమకి కావలసినంత మేరకి కత్తిరించి పంచుతున్నారు. ఈ రెండు నిమిషాల వీడియో లు చూసి ఆయన ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో అర్ధం కాదు మొట్ట మొదట చూసిన వారికి. 42 రోజుల రామాయణం, 35 భాగాల భారతం విన్న నేనే, పైన చెప్పిన అమ్మాయి లాగా ఒక్క రోజు ఆలోచించలేదు. ఈ రెండు నిమిషాల వీడియో చూసిన వారికి ఇక ఏ అవగాహన వస్తుంది ఆయన ఏమి చెప్తున్నారో ?
చాగంటి వారు ప్రవచనం అనేది అందరికీ ఒకటే చెప్తారు. ఇన్ని వేలమంది వింటూ ఉంటే, ప్రతి ఒక్కరికీ customize చేసి చెప్పలేరు కదా. మనకి ఏది కావాలో అది మనమే గ్రహించుకోవాలి!! పైన చెప్పిన అమ్మాయి లాగా సమాజ సేవ చేయకపోయినా పరవాలేదు కానీ ఆయన చెప్పేది సమాజహితవు కోసమే అని అన్న ఒక్క విషయం గ్రహించగలితే చాలు!!