మహనీయ మధురమూర్తే

“వస్తా వట్టిదే పోతా వట్టిదే

ఆశ  ఎందుకంటా ?

చేసిన ధర్మము చెడని పదార్థము.

చేరును నీ వెంటా”

 తరుచుగా వినే పాట అయినా ఈ రోజు వింటుంటే  తెలియకుండా కనుల వెంట నీరు కారింది. బాలమురళి కృష్ణ గారి గురించి వ్రాద్దామనుకుని ఎప్పుడో సగం వ్రాసిన ఈ టపా కి ఆయన పోయిన రోజుననే  ముగింపు ఇవ్వవలసి వస్తుంది అనుకోలేదు.

ఐదేళ్ల వయసు నుంచీ  మేము రోజూ  విన్న పాటలు బాలమురళి కృష్ణ  గానాలు, సుబ్బులక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (అయినా ఒక్క రాగం కూడా గుర్తు పట్టలేను.  మంగళ హారతి పాటలు పాడటానికి తప్ప ఎందుకు పనికి రాను).  “పొద్దుగాలే  మొదలు పెట్టిండా  మీ నాన్న పాటలు వినుడు ?”   ఆడుకోవడానికి వెళ్తున్న మమ్మల్ని  మా ఇంటి ఓనర్  పెద్ద రెడ్డి గారు నవ్వుతూ అడిగే ప్రశ్న . రోజూ పొద్దున్నే రెండు పెద్ద స్పీకర్లతో  గ్రామ్  ఫోన్  ప్లేయర్ లో బాలమురళి కృష్ణ  కీర్తనలు పెట్టేవారు మా నాన్న. మా నాన్న గారి ఉద్యోగరీత్యా   తెలంగాణ లో మేము ఉండిన  ఒక చిన్న పల్లెటూరి లో ఇలా పెద్ద సౌండ్ తో సంగీతం వినటం  అందరికీ  కొంచం వింతగా అనిపించేది.

మాకు ఊహ తెలిసాక మా నాన్నగారు  ఎన్ని  సినిమాల కి  వెళ్లారో / తీసుకెళ్లారో  వేళ్ళ మీద లెక్కపెట్ట వచ్చేమో  కానీ ఆయన వెళ్లిన సంగీత కచేరీలు, ముఖ్యం గా బాలమురళి వి –  లెక్క నాకు మాత్రం గుర్తు లేదు. . కొన్నిసార్లు మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు. ఈ రోజుల్లో లాగా అందరికి కార్లు ఉన్నట్టుంటే  ఆయన  వెళ్లిన ప్రతి కచేరి కి మేము వెళ్ళేవాళ్ళమేమో.  ఉండేది టు వీలర్ కావటం తో  మా అమ్మ మాత్రమే వెళ్ళేది.   మా నాన్న కి ఒక స్నేహ బృందం ఉండేది. వీళ్లందరినీ ‘బాలమురళి ఫాన్స్’ అనచ్చేమో.  ఆ స్నేహితుల్లో ఒకరు కొడుకు పుడితే ‘బాలమురళి కృష్ణ’ అని కూడా నామకరణం చేసారు. మోర్సింగ్ వాయించే వాద్యకారునికి వీళ్ళు ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు.  కచేరి లో వీళ్ళందరూ ఒక చోట చేరి,  వీరు కోరుకున్న కీర్తనలు చిట్టీ  మీద వ్రాసి వేదిక పై గాన కచేరి చేస్తున్న  బాలమురళి గారికి ఇచ్చేవారు.  బాలమురళి  ఆంధ్ర దేశం లో కచేరీలు మానేసాక వీళ్ళందరికీ పిచ్చి పట్టినట్లయిందనే చెప్పాలి.

బాలమురళి  కచేరి అంటే మాకు  వినోదం గా అనిపించేది . అందుకే  మేము ఎప్పుడూ  ఆయన కచేరి కి వెళ్ళడానికి సుముఖం గా ఉండేవారం.   ఇక ఆయన వాయిద్య సహకార బృందం లో మృదంగం ఎల్లా వెంకటేశ్వరా రావు గారు వాయిస్తున్నారు అంటే  చెప్పనే అక్కర్లేదు. వినోదమే వినోదం !! బాలమురళి కృష్ణ  ముఖ్యం గా స్వరాలూ వేస్తూ పక్కన వారిని నవ్వుతూ చూడటం.  నాకు బాగా గుర్తు ఏంటంటే ‘ఎంత ముద్దు ఎంత సొగసు’ అన్న దానికి  ఆయన  మూతి సున్నాలా చుట్టి  పాడేవారు .   ‘నగుమోము’,’ త్రిపుర సుందరి’ వంటివి బాలమురళి నోటా విన్నాక ఎవరివీ  వినబుద్ధి కాదు. ఆయన  ముద్ర పడిపోయిందేమో వాటికి  అన్పిస్తుంది.  అసలు బాలమురళి కృష్ణ గాత్రం ఒకసారి అలవాటు పడ్డాక ఇంకొకరిది అలవాటు చేసుకోవడానికి ఎంత కష్టమో!! మా అమ్మాయి సంగీతం గురువులు కూడా ‘ఆయన  సంగీతం ఎక్కువ వినకు. ఆయన లాగా ఎవరు పాడలేరు . He is not for beginners” అని చెప్తుంటారు.

మా నాన్నగారికి బాలమురళి కృష్ణ గానం ఎంత ఇష్టం అంటే  అసలు గ్రామ్  ఫోన్ ప్లేయర్ కూడా ఆ గాత్రం వినడానికే కొన్నారనుకుంటా. ఒక్కొక్క రికార్డు 50-100 రూపాయల దాక ఉండేది. కొత్తది రావటం ఆలస్యం వెంటనే కొనుక్కొచ్చుకునే వారు. మా చుట్టాలలో కొంత మంది విచ్చలవిడిగాఇలా డబ్బు ఖర్చు పెడతారు అని  చెప్పుకునేవారు కూడా.  ఇప్పుడు అవన్నీ అంతే జాగ్రత్త గా mp3 లలో కి మార్చి hard drive లో పెట్టి అడిగినవాళ్లందరికి ఇస్తుంటారు.  నాకు ఇచ్చిన వాటిని  సీడిల లోకి మార్చి  కారులో వింటూ ఉంటాను.లేని రికార్డులు అంటూ  లేవు మా నాన్న గారి దగ్గర!!

2010 లో  Cleveland ఆరాధన  లో జరిగిన  బాలమురళి కృష్ణ, సుధా రఘునాథన్   కచేరి కి మా పిల్లలని కూడా తీసుకుని వెళ్ళాము. అప్పటికి మా పిల్లలు చిన్నవాళ్ళనే చెప్పాలి  !! దాదాపు ఆ రెండు గంటల కచేరి లో ఒక్కసారి కూడా  వెళ్దామా  అని అడగలేదు. పైగా తర్వాత కూడా ఇంకో రెండు కచేరీలకి అడగగానే ఉత్సాహం గా వచ్చారు.  అంత చిన్న పిల్లల్ని కూడా మంత్రం వేసి కూర్చో పెట్టే శక్తి  ఆయన  గాత్రం కే  ఉంది 🙂  ఈ మధ్య మా అమ్మాయి ‘క్షీర సాగర విహార’  అన్న ఉత్సవ సాంప్రదాయ కీర్తన నేర్చుకుని ‘బాలమురళి పాడినట్లే  వచ్చిందా లేదా’ అని అడిగింది మా నాన్న గారిని.

Cleveland ఆరాధన లో మా అమ్మాయి కొనుక్కున్న టీషీర్ట్ , ఆయన  మమ్మల్ని ఆశీర్వదించి చేసిన ఆటోగ్రాఫ్ !! మా అమ్మాయి తెలుగు లోనే ఆటోగ్రాఫ్ చేయమని కోరితే ‘ఎవరూ అడగలేదే నన్నుఇలా ‘ అంటూ నవ్వుతూతెలుగులోనే ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.

2011 లో అనుకుంటాను.  మజుందార్ తో జుగల్బందీ కచేరి చూసాము . మజుందార్ గారు ఆయన  వేణువులు అన్నీ పక్కన పెట్టేసి ఏది కూడా బాలమురళి గాత్రానికి సరిపోవు అని చెప్పేసారు. ఇది నా కళ్ళతో నేను స్వయం గా చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి మహనీయుడిని చూడగలిగిన తరం లో పుట్టానా అని ఆనందం వేసింది.

మా నాన్నగారి కుటుంబం లో ఎవరికీ  సంగీతం రాదు.తెలియదు.  బాలమురళికృష్ణ గాత్రం విని  ఎందుకు మా నాన్నగారికి అంత ఆసక్తి వచ్చిందో  భగవంతుడి కృప ఏమో అన్పిస్తుంది.

సంగీతం అంటేనే  బాలమురళి. బాలమురళి అంటేనే సంగీతం. అందుకే ఆయనెప్పుడూ  ‘బాలమురళి కృష్ణుడే ‘!!

14 thoughts on “మహనీయ మధురమూర్తే”

    1. చాలా బాగా వ్రాశారు. ఆయన జీవితం గురించి మీడియాలో ఆల్రెడీ ఉన్న విషయాలను కాకుండా ఆయన గురించి, ఆయన సంగీతం గురించి మీ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇది చాలా నచ్చింది

      మెచ్చుకోండి

  1. చక్కటి వ్యాసం. మీరన్న “ఇటువంటి మహనీయుడిని చూడగలిగిన తరం లో పుట్టానా అని ఆనందం వేసింది.” అనే మాటలు చదివి ఓ హాలివుడ్ సినిమాలో చెప్పినట్లు Let them say I too lived in the time of Mangalampalli అనాలనిపిస్తుంది.

    మెచ్చుకోండి

  2. చాలా బాగా వ్రాశారు. ఆయన జీవితం గురించి మీడియాలో ఆల్రెడీ ఉన్న విషయాలను కాకుండా ఆయన గురించి, ఆయన సంగీతం గురించి మీ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇది చాలా నచ్చింది

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి