వింటే భారతమే వినాలి – 2

ఒక అంత్యేష్టి సంస్కారానికి వెళ్లి విచలిత మనసుతో  ఉన్న నన్ను  మా వారు, మా అమ్మాయి  భగవద్గీత ప్రవచనం కి తీసుకెళ్లారు.  అక్కడ స్వామిజీ  చెప్పిన  కర్మ యోగ శ్లోకం 21  మనసు ని బాగా పట్టుకుంది. నాకు భారతం లో ఇంకో కోణం కూడా కన్పించింది.  

అరణ్య పర్వం లో  కొలను దగ్గర చనిపోయిన తన అతి పరాక్రమ వంతులైన  నలుగురి తమ్ముళ్లను చూసి విచలితుడు అయి కూడా ఓర్పు తో యక్షప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. అంత బాధలోనూ ఒక్క తమ్ముడికే  జీవితం ప్రసాదిస్తాను అంటే, మాద్రి కొడుకైన నకులుడిని  ఇవ్వమని అడిగాడు.   యక్ష ప్రశ్నలలో నన్ను ఎప్పుడూ  ఆలోచింప చేసే ప్రశ్న  – ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం) ( వికీ సౌజన్యం తో ).

భగవద్గీత, విష్ణు సహస్రనామం  రెండూ  కూడా పంచమ వేదం గా భావించే  మహాభారతమే  ప్రసాదించింది. చాలా మంది భావన ఏంటంటే జీవితం చివరి దశ లో ఉన్నపుడు  భగవద్గీత  చదువుకోవాలి అని.  అది సరి కాదు.   భగవద్గీత మనిషి కి  మానసికం గా చాలా బలం, స్వాంతన  చేకూరుస్తుంది.  ఆ విషయాన్నీ మనము పూర్తిగా విస్మరిస్తున్నాము.  నేను అమెరికా లో  కొందరి జీవితాల గురించి విన్నాను.  వారి జీవితాలలో అన్ని కష్టాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోయాను.  చెపితే నమ్మరేమో కానీ  వారు అనుసరించిన మార్గం భగవద్గీత !!

ఇలా ఎన్నో విషయాలు చెప్పే రామాయణ  మహాభారతాలని చదివి లేదా విని మనం స్ఫూర్తి పొందాలి, నేర్చుకోవాలి. అవి  వదిలేసి(ఆక్షేపిస్తూ ), ఎన్ని పుస్తకాలూ చదివినా నేర్చుకునేది ఏమి ఉండదు అంటాను నేను.  ముఖ్యం గా యువతరం వీటిని చదవాలి. సమాజం చదివేటట్లు చేయాలి. ఇవేవో మత గ్రంధాలు అనుకుంటే అక్కడే పెద్దపొరపాటు చేస్తున్నట్లు లెక్క.  రామాయణ భారతాలు  వినవలసిన రీతి లో వింటే ఎంతటి కౌన్సిలింగ్ కూడా పనికి రాదు.

చాగంటి వారి మాటల్లో “ఇతిహాసము – ఇతి హా అసము. ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు”.  రామాయణ భారతాలు యదార్థగాథలు అని ఖచ్చితం గా నమ్మే వాళ్ళల్లో నేను ఒక దాన్ని. ఈ రోజుల్లో చాలా మంది చేసే వాదన ‘ ఇలా జరిగాయా పెట్టాయా!! అన్నీ  కట్టు కథలు’ . నాకు ఇంకొక చిరాకు కలిగించే విషయం. రామాయణ భారతాలని  Indian Mythology అనటం. Mythology అంటే Collection of myths. పోనీ  Myth అనే  అనుకున్నా –  కథ ల్లో కాలక్రమం  ఎలా ఉంటుంది? కట్టు కథలే అయితే ఇంత పెద్ద కథలు వ్రాయటానికి జరిగిన విషయాలే  కొంత కల్పితం జోడించి కథ గా మలచి ఉండచ్చు కదా. కౌముది పత్రిక లో మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు, యద్దనపూడి సులోచన రాణి గారు వారి ఒక్కొక్క నవల, ఆ పాత్రల గురించి  చెప్పారు. (వ్యాసాల  పేర్లు నాకు గుర్తుకు లేవు ). నవలలలో కొన్నిపాత్రలు  వారి నిజ జీవితం లో తారసపడ్డారు !! ఈ మధ్య కథలు, కవితలు వ్రాసే వారు ఏ విషయం/అంశం  మీద ప్రేరణ చెంది వ్రాస్తున్నారో చెప్తున్నారు. మరి  వాల్మీకి, వ్యాసడంతటి  వారు వారి ఇష్టం వచ్చినట్లు కల్పితం వ్రాస్తారా?

తెలుగు ప్రథమ భాష గా చదువుకున్న నా లాంటి దానికే   కవిత్రయం వ్రాసిన ఆంధ్ర మహా భారతం చదివే శక్తి  భగవంతుడు ప్రసాదించలేదు.  అందుకే  శ్రీ  చాగంటి కోటేశ్వర రావు గారి లాంటి మహానుభావులు  చెప్తున్నది వింటుంటే ఎవరో పూనుకుని ఆయన తో చెప్పిస్తున్నట్లే అన్పిస్తుంది _/\_.  సాంకేతిక పరిజ్ఞానం తో Sri changanti.net ద్వారా కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్న మా లాంటి వారందరికీ  అందజేస్తున్న వారికీ శతకోటి నమస్కారాలు.

వింటే భారతమే వినాలి – 1

చాగంటి వారి మహాభారతం వింటున్నాను.  ఆది పర్వం, సభా పర్వం  అయ్యాయి.  తెల్సిన వారొకరు  ముందు విరాటపర్వం వినమని చెప్పారు. అందుకని విరాట పర్వం మొదలు పెట్టాను. వింటున్నప్పుడు ఏదో మామూలు  కథ లాగా అనిపించినా, రోజు వారీ  జీవితం ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతున్నట్లే ఉంటుంది.

ఎప్పుడో వ్రాసి పెట్టుకున్న  టపా అంచెలంచెలు గా వ్రాస్తూ  రెండు భాగాలు గా ఈ రోజు  పూర్తి చేయడం అయింది.

ఒక రోజు చాగంటిగారి ప్రవచనం మహాభారతం ఆదిపర్వం 45 /51 భాగం  వింటున్నాను.  చివరగా దాదాపు అరగంట  ఉంది అనగా మరీ రాత్రి అవుతోందని  ఆపేసి పడుకున్నాను. మర్నాటి పొద్దున్న లేవగానే ఆపేసిన భాగం పెట్టాను. ఆ రోజు  నవరాత్రుల మొదటి రోజు.  మహత్తు ఏంటంటే మిగిలిన భాగం అంతా  కూడా  ద్రౌపది  దేవి గురించి.  ద్రౌపది దేవి ఒక అయోనిజ. అమ్మవారు  కాబట్టే అన్ని కష్ఠాలు భరించింది, ఆవిడ ఎవరు అన్నదాని  మీద  చాగంటి వారు ఆ అరగంట లో  ద్రౌపది  దేవి గురించి చాలా అద్భుతం గా వివరించారు.  ఆ కాస్త చాలు భారతం ఎందుకు అంత గొప్పదో తెలుసుకోవడానికి!! అనుకోకుండా ఈ  ఏడాది నవరాత్రులు ఆ విధం గా మొదలయినందుకు చాలా ఆనందం గా అన్పించింది.

ద్రుపదుడు అర్జునుడుని  అల్లుడు గా పొందడానికి  కూతురి పుట్టాలని యాగం చేస్తాడు.  ఆ యాగం నుంచీ  పుట్టిన ఆడపిల్ల  ద్రౌపది. మత్య్స యంత్రం చేధించిన వారికే పిల్లనిస్తాను అని స్వయంవర ప్రకటన ఇస్తాడు ద్రుపద మహారాజు.  అర్జునుడు మాత్రమే ఛేదిస్తాడు.  స్వయంవరానికి వచ్చిన రాజులంతా అర్జునుడు ఒక బ్రాహ్మణుడు అను.కుంటారు. మత్య్స యంత్రాన్ని చేధించినవాడు అర్జునుడే అన్న అనుమానం కూడా ఎవరికీ కలుగదు. ద్రౌపది కూడా బ్రాహ్మణుడే అనుకుని  అర్జునుడి మేడలో వరమాల వేస్తుంది.  స్వయంవరం తరువాత భీమార్జునులతో  వారు ఉన్న నివాసానికి వెళ్తుంది.  ఇవన్నీ అందరికీ  తెలిసిన విషయాలే !!

ఇక్కడ నుంచీ, వేరొక దృష్టి కోణం లో ఇక కొన్ని విషయాలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది !! రోజూ  పంచ భక్ష్య పరమాన్నాలతో భుజించే ఆమె, పాండవులు భిక్షాటన చేసి తెచ్చిన భిక్షని అందరికీ  వడ్డించి తాను తింటుంది.  హంస తూలికా తల్పం పైన నిదురించే ఆమె, కటిక నేలపై పడుకుంటుంది. కుంతి  ఎలా చెప్తే ఆలా వింటుంది.  ఇక్కడ ఏంటంటే ఆవిడ దేనికి దుఃఖపడదు. పైపెచ్చు సంతోషం గా ఉంటుంది. పంచపాండవులందరినీ  పెళ్లి చేసుకోవడం లో కూడా  ఆవిడ నిర్ణయం ఏది లేదు.  ఆ విధం గా పెళ్లి చేసుకోవాల్సివచ్చినపుడు ఆవిడ  దుఃఖపడినట్లు  కూడా ఎక్కడా అనిపించదు.  ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాగంటి గారు  ద్రౌపదీ దేవి వివాహం గురించి చెబుతూ, ‘మీలో ఎవరైనా వ్యాసుడంతటి వాడు వచ్చి చెప్తే పిల్లని అలా  ఐదుగురికి ఇచ్చి వివాహం చేస్తారా లేక ద్రుపదుడిలాగా ఆలోచిస్తారా ? ‘ అని ప్రవచనం వింటున్నవారిని ప్రశ్నించారు.  ఎవరూ  సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ‘ ఎవరైనా మీలాగే ఆలోచిస్తారు. మీ ఆలోచన తప్పు కాదు. అలవాటు లేని ఆచారం అంటే ఎవరూ  ఆమోదించరు’ అన్నారు. (Sri changanti.net/ మహాభారతం/ఆది పర్వం 45/51  24:00-26:00).

ప్రతి విషయం లో  ద్రౌపది  దేవి చూపించిన ఓర్పు, ఆమోదం(acceptance) చూసి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది అన్పించింది. స్వయంవరంలో మత్య్స యంత్రం చేధించిన వాడు ఎవరో ఆవిడకి తెలియదు. ఆవిడ తండ్రి చెప్పిన నిబంధన ప్రకారం  మత్య్స యంత్రం చేధించాడు, కాబట్టి వరమాల వేసి అతడితో వచ్చేసింది. “అయ్యో !!నేను అర్జునిడి ని చేసుకోవాల్సినదానను, కానీ ఇతను ఎవరో తెలీదు  ఇతని మెడలో  వరమాల ఎందుకు వేసాను” అని బాధపడలేదు.   అదే విధం గా  గమనించవలసినది   ఏంటంటే, ఏ విషయాన్నీ ఆమోదించకూడదో అది ద్రౌపది  దేవి ఆమోదించలేదు కూడా !! తనని అవమానించిన దుర్యోధన, కర్ణ, దుశ్శాసనులను విడిచిపెట్టనివ్వలేదు. యుద్ధం జరిగేలా చేసింది. దీని నుంచి నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఒక  స్త్రీ మూర్తి  వ్యక్తిత్వం ఎలా ఉండాలో ఎలా ఉంటుందో  చెప్తుంది ద్రౌపది దేవి వ్యక్తిత్వం.  

విరాటపర్వం లో  కూడా  ద్రౌపదీ  దేవి గురించి చెప్పారు చాగంటి వారు.  ఆదిపర్వం లో కంటే విరాటపర్వం లో  బాగా చెప్పారనిపించింది. విరాటపర్వం లో ద్రౌపది, కుంతీ, గాంధారి ముగ్గురి గురించి చెప్పారు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 6/24 16:00- చివర && 7/24 మొదలు – 3:30). ప్రతి ఒక్కరు వినవలసినవి !!

ఈ ముగ్గురి స్త్రీ జీవితాలు చూపించి జీవితం లో ఏ తప్పులు చేయకూడదు అని భారతం చెప్పిందో, అటువంటి తప్పులు చేసే దిశ లోనే పయనం చేస్తూ ఫెమినిజం అంటూ రంగు పులుముతున్నారు సోషల్ మీడియా లో  ఈ మధ్య . పైగా కొన్ని అంశాల మీద టీవీ లో వాదోపవాదనలు, కథలు !!   

‘అమ్మాయి అత్తగారింటికే  ఎందుకు వెళ్ళాలి? అబ్బాయి అత్తగారింటికి రావచ్చు కదా!!’ .

‘పెళ్లే  చేసుకోవాలా ? సహజీవనం చేస్తే సరిపోదా ?’.

‘ మా బట్టలు మా ఇష్టం. ఏదైనా వేసుకుంటాం’ . ‘It’s my choice’ .

బట్టలు డిజైన్ చేసేవాడు దుశ్శాసనుడి  కంటే దారుణం గా ఆలోచించి ఆడపిల్లల దుస్తులు తాయారు చేస్తుంటే, దాన్ని ఫాషన్, ఛాయస్ అనే పేరు తో ఆమోదిస్తున్నాం.  మగవాడికి కూడా  అటువంటి  దుస్తులు తయారు  చేయమని అడగట్లేదు ఆడవారెవరూ  కూడా !! సినిమాల్లో, వాట్సాప్ లో  ఆడవారిని  అవమానిస్తూ జోకులు (ట). ఆడవారే వాటిని ప్రోత్సహిస్తుంటారు కూడా !!  భర్త పోయాక పుట్టింటికి వెళ్లకుండా ధైర్యం గా పిల్లలని తీసుకుని అత్తవారింటికి వెళ్లిన కుంతీ దేవిని చూసి తమకు తామై ఎలా నిలబడాలో నేర్చుకోవాలి ఈ రోజున ఆడపిల్లలు.

ఆసక్తి గా అనిపించే ఇంకొక విషయం.అర్జునుడికి ఏదైనా విద్య నేర్చుకోవాలంటే అన్నీ అనుకూలమే. కానీ కర్ణుడికి ప్రతిదీ ప్రతికూలం.  అందుకే కర్ణుడు, అర్జునుడి కంటే శక్తి వంతుడు. కానీ ఒక్కొక్కటి పోగొట్టుకుని కర్ణుడు బలహీనుడు అయ్యాడు. ఒక్కొక్కటి  అర్జునుడు  పొంది బలవంతుడయ్యాడు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 10/24 43:00-46:00 ) ఎందుకు అలా  జరిగింది అనేది ఒక జీవిత పాఠం. బలహీనుడయినా అన్ని అస్త్రశాస్త్రాలు  అర్జునుడు ఎలా సాధించాడు అనేది ఒక విద్యార్థి తెలుసుకోవలసిన ముఖ్యాంశం.

 

మా ఇంట క్రిస్మస్ పండగ

డిసెంబర్ మాసం వస్తే చలి తో పాటు  అమెరికా అంతటా పండగ శోభ కూడా పోటి పడి వచ్చేస్తుంది. కుటుంబం అంతటికి  పండగ కి కానుకలు కొనేక్కునే వినియోగదారుల తో, వివిధ దీపాలంకరణ ల తో దేదీప్య మానం గా  వెలిగిపోతుంటాయి  దుకాణాలన్నీ.  వీధులన్నీ ఇళ్ళల్లోని  క్రిస్మస్  చెట్ల అందాలతో,  విద్ద్యుత్  దీపాలంకరణల సోయగాలతో మెరిసిపోతుంటాయి .  బడులలో, కార్యాలయాల్లో కేకులు, కుకీలతో క్రిస్మస్  వేడుకలు. అనాధ పిల్లలకి బొమ్మలు సేకరిస్తూ,  నిరాశ్రయులకు ఉచిత భోజనాలూ వడ్డిస్తూ స్వచ్ఛంద సంస్థలు. చర్చిలలో భక్తి గీతాలు.  ‘Dashing through the snow’ అంటూ క్రిస్మస్ కార్రోల్స్ తో ’Ho Ho’ అంటూ ఎక్కడ చూసినా  పండుగ  హడావిడి!!  

img_3081

డిసెంబర్ 24 వ తారీఖు నుండి జనవరి 1 వ తారీఖు వరకు ఉండే రోజుల్ని ‘Holidays’ అంటారు. అంటే ‘Holy’ ‘Days’ అర్ధం ట. ఒకసారి దీనికి సంబంధించిన వ్యాసం ఒకటి మా అమ్మాయి పుస్తకం లో చదివాను. ఉత్తరధృవం సమీపం లో ఉన్న దేశాలలో డిసెంబర్ నెల లో పగలు తక్కువ రాత్రి ఎక్కువ.  ఇది వరకు రోజుల్లో ప్రతి దేశం లో జీవనాధారం అంటే వ్యవసాయమే కదా. అక్టోబర్, నవంబర్ నెలల కల్లా పంట కోతలు అయిపోవటము  తో మళ్లీ వసంత కాలం  వచ్చేవరకు చేయటానికి  ఎవరికీ ఏమి ఉండేది కాదు.  పైగా చెట్లు మోడువారి పోయి  చలి, మంచు మరియు చీకటి తో వాతావరణం మనసులో ఏదో కోల్పోయిన భావన వస్తుంది . పండించుకున్న ఆహారాన్ని భూగృహాల్లో   దాచుకుని, మనసుని ఉల్లాస పరచుకునేందుకు  ఆ రోజుల్లో ప్రజలు ఇలా వేడుకలను  ఏర్పాటు చేసుకున్నారని ఆ వ్యాసం లో వివరించారు.  

img_3021

నవంబరు నెలలో  అమెరికాలో అడుగిడిన నాకు  ఈ హడావిడి చూసి అమెరికా దేశం లో పండుగలు ఇంత బాగా చేసుకుంటారా  అని చాలా  ఆశ్చర్యం కలిగింది. అమెరికా కి వచ్చాక నేను చేసుకున్న మొట్టమొదటి  భారతీయ పండుగ సంక్రాంతి. జీవితం లో మొట్ట మొదట సారి పండగ  రోజు పండుగలా  లేదు అన్పించింది.  నా  బెంగ చూసి మా వారు  మా ఊరి  లో ఉన్న తెలుగు అసోసియేషన్  వారు వారంతం నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి తీసుకెళ్లారు. సినిమా పాటలు వాటికి నాట్యాలు తప్పితే అక్కడ సంక్రాంతి శోభ లేదు. ఇక ఏ పండగ వచ్చినా ఏదో మొక్కుబడి గా చేసుకుంటున్నట్లే అనిపించేది.

అమెరికా వచ్చిన కొత్తల్లో థాంక్స్ గివింగ్, క్రిస్మస్ అంటే ఏదో  డిస్కౌంట్లు, సేల్ అన్నట్లు ఉండేది మాకు !!  ఎవరైనా ‘Happy Thanks Giving’  , Merry Christmas’  అనో మాతో  అంటే ‘మాకు ఈ పండగ ఏంటి’ అని మనసులో నవ్వుకునే వాళ్ళము.  మా అమ్మాయి ఏడాది పిల్లపుడు  Halloween  రోజున  అనుకోకుండా  వేరే ఊరు నుండి నా చిన్ననాటి స్నేహితురాలు కుటుంబం తో వచ్చింది. చిన్నపిల్లలందరూ  రకరకాల వేషాల తో వచ్చి తలుపు తడుతుంటే, సరదా గా  అనిపించి మా అమ్మాయికి , వాళ్ళ అమ్మాయికి పట్టు పరికిణీ వేసి ఇద్దరికీ  ఒక సంచీ  చేతికిచ్చి trick  or  treat  కి పట్టుకెళ్ళాము. ఆ రోజు నాకు అమెరికాలో  మొట్టమొదటి సారి  ఏదో పండగ చేసుకున్నట్లు అన్పించింది.

మా అమ్మాయికి మూడేళ్ల ప్పుడు క్రిస్మస్ చెట్టు పెట్టమని అడిగింది. దీపాలతో ఒక జింక ని తెచ్చి ఇంటి ముందు పెట్టాము. చిన్నక్రిస్మస్ చెట్టు తెచ్చి దాని క్రింద కానుకలు పెట్టాము.  మా అమ్మాయి ఆనందానికి అవధులు లేవు!!  నెమ్మది గా కొన్ని విషయాలు  అర్ధం అవ్వటం మొదలయ్యాయి. మా పిల్లలు ఇక్కడికి సంబంధించిన వారు. మనభారతీయ పండగల కంటే  ఈ  పండుగలే వారి సంస్కృతి లో ముఖ్య భాగం అని.   అంతే కాదు పండగ అంటే పూజలు, పునస్కారాలు,ఆచారాలు కాదు.  ఏపండగైనా  మన చుట్టూ ఉన్నవారు చేసుకున్నప్పుడే  ఆ  ఆనందం వారితో కలిసి పంచుకోవడం అని కూడా  అర్ధమయ్యింది.  

img_3005

అప్పటి నుండి మా ఇంట్లో థాంక్స్ గివింగ్ (నవంబరు  నెల నాలుగో గురువారం వస్తుంది), క్రిస్మస్ పండుగలు చేసుకోవడం మొదలు పెట్టాము.  థాంక్స్ గివింగ్ అంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవడం.  మన సంక్రాంతి రోజున  పండిన కూరలతో  ఎలా వేడుక చేసుకుంటామో ఈ పండగ కూడా అలాగే చేసుకుంటారు. నేను ఆ రోజు రక రకాల కూర గాయాలతో  ముఖ్యం గా గుమ్మడి తో ముక్కల  పులుసు, క్రాన్బెర్రీల  తో ఆవకాయ (వాక్కాయ లాగా ఉంటుంది ) ,  Pumpkin pie  చేస్తాను.  ఇక క్రిస్మస్ చెట్టు ని  మా ఇష్టదైవం గణేశుడు, ముగ్గులు, జెండాలు వంటి  ఆభరణాలతో అలంకరిస్తుంటాము. గత ఏడాది దశావతారాలతో అలంకరించాము. చెట్టు క్రింద పిల్లలకి కానుకలు,  శాంతా తాత గారికి కుకీస్ ఇక మాములే!! సాధారణం గా  ఎక్కడికీ  వెళ్లకుండా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము . హాయిగా సోఫా లో కూర్చుని వెచ్చగా దుప్పట్లు కప్పుకుని  – This is the most wonderful time – అనుకుంటాము !!