మా ఇంట క్రిస్మస్ పండగ

డిసెంబర్ మాసం వస్తే చలి తో పాటు  అమెరికా అంతటా పండగ శోభ కూడా పోటి పడి వచ్చేస్తుంది. కుటుంబం అంతటికి  పండగ కి కానుకలు కొనేక్కునే వినియోగదారుల తో, వివిధ దీపాలంకరణ ల తో దేదీప్య మానం గా  వెలిగిపోతుంటాయి  దుకాణాలన్నీ.  వీధులన్నీ ఇళ్ళల్లోని  క్రిస్మస్  చెట్ల అందాలతో,  విద్ద్యుత్  దీపాలంకరణల సోయగాలతో మెరిసిపోతుంటాయి .  బడులలో, కార్యాలయాల్లో కేకులు, కుకీలతో క్రిస్మస్  వేడుకలు. అనాధ పిల్లలకి బొమ్మలు సేకరిస్తూ,  నిరాశ్రయులకు ఉచిత భోజనాలూ వడ్డిస్తూ స్వచ్ఛంద సంస్థలు. చర్చిలలో భక్తి గీతాలు.  ‘Dashing through the snow’ అంటూ క్రిస్మస్ కార్రోల్స్ తో ’Ho Ho’ అంటూ ఎక్కడ చూసినా  పండుగ  హడావిడి!!  

img_3081

డిసెంబర్ 24 వ తారీఖు నుండి జనవరి 1 వ తారీఖు వరకు ఉండే రోజుల్ని ‘Holidays’ అంటారు. అంటే ‘Holy’ ‘Days’ అర్ధం ట. ఒకసారి దీనికి సంబంధించిన వ్యాసం ఒకటి మా అమ్మాయి పుస్తకం లో చదివాను. ఉత్తరధృవం సమీపం లో ఉన్న దేశాలలో డిసెంబర్ నెల లో పగలు తక్కువ రాత్రి ఎక్కువ.  ఇది వరకు రోజుల్లో ప్రతి దేశం లో జీవనాధారం అంటే వ్యవసాయమే కదా. అక్టోబర్, నవంబర్ నెలల కల్లా పంట కోతలు అయిపోవటము  తో మళ్లీ వసంత కాలం  వచ్చేవరకు చేయటానికి  ఎవరికీ ఏమి ఉండేది కాదు.  పైగా చెట్లు మోడువారి పోయి  చలి, మంచు మరియు చీకటి తో వాతావరణం మనసులో ఏదో కోల్పోయిన భావన వస్తుంది . పండించుకున్న ఆహారాన్ని భూగృహాల్లో   దాచుకుని, మనసుని ఉల్లాస పరచుకునేందుకు  ఆ రోజుల్లో ప్రజలు ఇలా వేడుకలను  ఏర్పాటు చేసుకున్నారని ఆ వ్యాసం లో వివరించారు.  

img_3021

నవంబరు నెలలో  అమెరికాలో అడుగిడిన నాకు  ఈ హడావిడి చూసి అమెరికా దేశం లో పండుగలు ఇంత బాగా చేసుకుంటారా  అని చాలా  ఆశ్చర్యం కలిగింది. అమెరికా కి వచ్చాక నేను చేసుకున్న మొట్టమొదటి  భారతీయ పండుగ సంక్రాంతి. జీవితం లో మొట్ట మొదట సారి పండగ  రోజు పండుగలా  లేదు అన్పించింది.  నా  బెంగ చూసి మా వారు  మా ఊరి  లో ఉన్న తెలుగు అసోసియేషన్  వారు వారంతం నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి తీసుకెళ్లారు. సినిమా పాటలు వాటికి నాట్యాలు తప్పితే అక్కడ సంక్రాంతి శోభ లేదు. ఇక ఏ పండగ వచ్చినా ఏదో మొక్కుబడి గా చేసుకుంటున్నట్లే అనిపించేది.

అమెరికా వచ్చిన కొత్తల్లో థాంక్స్ గివింగ్, క్రిస్మస్ అంటే ఏదో  డిస్కౌంట్లు, సేల్ అన్నట్లు ఉండేది మాకు !!  ఎవరైనా ‘Happy Thanks Giving’  , Merry Christmas’  అనో మాతో  అంటే ‘మాకు ఈ పండగ ఏంటి’ అని మనసులో నవ్వుకునే వాళ్ళము.  మా అమ్మాయి ఏడాది పిల్లపుడు  Halloween  రోజున  అనుకోకుండా  వేరే ఊరు నుండి నా చిన్ననాటి స్నేహితురాలు కుటుంబం తో వచ్చింది. చిన్నపిల్లలందరూ  రకరకాల వేషాల తో వచ్చి తలుపు తడుతుంటే, సరదా గా  అనిపించి మా అమ్మాయికి , వాళ్ళ అమ్మాయికి పట్టు పరికిణీ వేసి ఇద్దరికీ  ఒక సంచీ  చేతికిచ్చి trick  or  treat  కి పట్టుకెళ్ళాము. ఆ రోజు నాకు అమెరికాలో  మొట్టమొదటి సారి  ఏదో పండగ చేసుకున్నట్లు అన్పించింది.

మా అమ్మాయికి మూడేళ్ల ప్పుడు క్రిస్మస్ చెట్టు పెట్టమని అడిగింది. దీపాలతో ఒక జింక ని తెచ్చి ఇంటి ముందు పెట్టాము. చిన్నక్రిస్మస్ చెట్టు తెచ్చి దాని క్రింద కానుకలు పెట్టాము.  మా అమ్మాయి ఆనందానికి అవధులు లేవు!!  నెమ్మది గా కొన్ని విషయాలు  అర్ధం అవ్వటం మొదలయ్యాయి. మా పిల్లలు ఇక్కడికి సంబంధించిన వారు. మనభారతీయ పండగల కంటే  ఈ  పండుగలే వారి సంస్కృతి లో ముఖ్య భాగం అని.   అంతే కాదు పండగ అంటే పూజలు, పునస్కారాలు,ఆచారాలు కాదు.  ఏపండగైనా  మన చుట్టూ ఉన్నవారు చేసుకున్నప్పుడే  ఆ  ఆనందం వారితో కలిసి పంచుకోవడం అని కూడా  అర్ధమయ్యింది.  

img_3005

అప్పటి నుండి మా ఇంట్లో థాంక్స్ గివింగ్ (నవంబరు  నెల నాలుగో గురువారం వస్తుంది), క్రిస్మస్ పండుగలు చేసుకోవడం మొదలు పెట్టాము.  థాంక్స్ గివింగ్ అంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవడం.  మన సంక్రాంతి రోజున  పండిన కూరలతో  ఎలా వేడుక చేసుకుంటామో ఈ పండగ కూడా అలాగే చేసుకుంటారు. నేను ఆ రోజు రక రకాల కూర గాయాలతో  ముఖ్యం గా గుమ్మడి తో ముక్కల  పులుసు, క్రాన్బెర్రీల  తో ఆవకాయ (వాక్కాయ లాగా ఉంటుంది ) ,  Pumpkin pie  చేస్తాను.  ఇక క్రిస్మస్ చెట్టు ని  మా ఇష్టదైవం గణేశుడు, ముగ్గులు, జెండాలు వంటి  ఆభరణాలతో అలంకరిస్తుంటాము. గత ఏడాది దశావతారాలతో అలంకరించాము. చెట్టు క్రింద పిల్లలకి కానుకలు,  శాంతా తాత గారికి కుకీస్ ఇక మాములే!! సాధారణం గా  ఎక్కడికీ  వెళ్లకుండా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము . హాయిగా సోఫా లో కూర్చుని వెచ్చగా దుప్పట్లు కప్పుకుని  – This is the most wonderful time – అనుకుంటాము !!

 

5 thoughts on “మా ఇంట క్రిస్మస్ పండగ”

  1. <"ఏపండగైనా మన చుట్టూ ఉన్నవారు చేసుకున్నప్పుడే ఆ ఆనందం వారితో కలిసి పంచుకోవడం అని కూడా అర్ధమయ్యింది. "
    —————–
    బాగా చెప్పారు. అలా చుట్టూ ఉన్న వారితో ఆనందం పంచుకోవడానికే కదండీ మన దేశంలో – ఆంధ్రదేశంలో – కోడిపందాలు, ఎడ్లపందాలు నిర్వహిస్తారు 😀😀, పోలీసులే పడనివ్వరు గానీ. సరదాకి అన్నాలెండి – "జిలేబి" గారన్నట్లు jk 🙂.
    అయితే ఇంకొక సామూహిక కార్యక్రమం తప్పక జరుగుతుందండి, అదే కార్తీక వన భోజనాలు, కాకపోతే కులాలవారీగా ….. మాత్రమే …… కులం పేరుతో బ్యానర్ కట్టి మరీ ….. జరుగుతాయి 🙁.
    అందరితో కలిసి పండగ ఆనందం పంచుకోవడం అని చాలా కరక్ట్ గా అన్నారు మీరు (సీరియస్ లీ).

    మీ దేశంలో తెలుగు సంఘాలు చేసే వేడుకలు చాలా మటుకు ప్రధానంగా సినిమాల, సినిమా జనాల చుట్టూ తిరిగేట్లు తయారవడం విచారకరం. మళ్ళా దాంట్లో రాజకీయాలు, సిగపట్లు. 🙁.

    మీరు మీ కుటుంబంతో కలిసి అమెరికా పండగల్ని (ఆ సంస్కృతి పట్ల మీకు అవగాహన పెరుగుతుంది), భారతీయ పండగల్ని (మన సంస్కృతి పట్ల మీ పిల్లలకి అవగాహన పెరుగుతుంది) చక్కగా జరుపుకోవడం మంచి పని చేస్తున్నారు 👏.

    మెచ్చుకోండి

    1. ధన్యవాదాలు విన్నకోట వారు. ఇక్కడ పుట్టిన పిల్లల అటు మన సంస్కృతికి ఇటు ఇక్కడ సంస్కృతికి కాకుండా అయిపోతున్నారు అన్పిస్తుంది. అందుకే ఇదొక ప్రయత్నం.

      మెచ్చుకోండి

      1. ప్రవాసీయుల్లో మీరు చెప్పిన dichotomy కి ఆస్కారం ఎక్కువే చంద్రిక గారు. అయినప్పటికీ మీరన్నట్లు ప్రయత్నం చెయ్యాలి కదా. శర్కరి జ్యోతిర్మయి గారి లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీ ప్రయత్నం కొనసాగించండి.
        మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

        మెచ్చుకోండి

  2. చంద్రిక గారు బాగున్నాయండి మీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్. క్రిస్మస్ చెట్టు ని గణేశుడు తో అలంకరించడం వెరైటీ గా ఉంది.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి