వింటే భారతమే వినాలి – 1

చాగంటి వారి మహాభారతం వింటున్నాను.  ఆది పర్వం, సభా పర్వం  అయ్యాయి.  తెల్సిన వారొకరు  ముందు విరాటపర్వం వినమని చెప్పారు. అందుకని విరాట పర్వం మొదలు పెట్టాను. వింటున్నప్పుడు ఏదో మామూలు  కథ లాగా అనిపించినా, రోజు వారీ  జీవితం ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతున్నట్లే ఉంటుంది.

ఎప్పుడో వ్రాసి పెట్టుకున్న  టపా అంచెలంచెలు గా వ్రాస్తూ  రెండు భాగాలు గా ఈ రోజు  పూర్తి చేయడం అయింది.

ఒక రోజు చాగంటిగారి ప్రవచనం మహాభారతం ఆదిపర్వం 45 /51 భాగం  వింటున్నాను.  చివరగా దాదాపు అరగంట  ఉంది అనగా మరీ రాత్రి అవుతోందని  ఆపేసి పడుకున్నాను. మర్నాటి పొద్దున్న లేవగానే ఆపేసిన భాగం పెట్టాను. ఆ రోజు  నవరాత్రుల మొదటి రోజు.  మహత్తు ఏంటంటే మిగిలిన భాగం అంతా  కూడా  ద్రౌపది  దేవి గురించి.  ద్రౌపది దేవి ఒక అయోనిజ. అమ్మవారు  కాబట్టే అన్ని కష్ఠాలు భరించింది, ఆవిడ ఎవరు అన్నదాని  మీద  చాగంటి వారు ఆ అరగంట లో  ద్రౌపది  దేవి గురించి చాలా అద్భుతం గా వివరించారు.  ఆ కాస్త చాలు భారతం ఎందుకు అంత గొప్పదో తెలుసుకోవడానికి!! అనుకోకుండా ఈ  ఏడాది నవరాత్రులు ఆ విధం గా మొదలయినందుకు చాలా ఆనందం గా అన్పించింది.

ద్రుపదుడు అర్జునుడుని  అల్లుడు గా పొందడానికి  కూతురి పుట్టాలని యాగం చేస్తాడు.  ఆ యాగం నుంచీ  పుట్టిన ఆడపిల్ల  ద్రౌపది. మత్య్స యంత్రం చేధించిన వారికే పిల్లనిస్తాను అని స్వయంవర ప్రకటన ఇస్తాడు ద్రుపద మహారాజు.  అర్జునుడు మాత్రమే ఛేదిస్తాడు.  స్వయంవరానికి వచ్చిన రాజులంతా అర్జునుడు ఒక బ్రాహ్మణుడు అను.కుంటారు. మత్య్స యంత్రాన్ని చేధించినవాడు అర్జునుడే అన్న అనుమానం కూడా ఎవరికీ కలుగదు. ద్రౌపది కూడా బ్రాహ్మణుడే అనుకుని  అర్జునుడి మేడలో వరమాల వేస్తుంది.  స్వయంవరం తరువాత భీమార్జునులతో  వారు ఉన్న నివాసానికి వెళ్తుంది.  ఇవన్నీ అందరికీ  తెలిసిన విషయాలే !!

ఇక్కడ నుంచీ, వేరొక దృష్టి కోణం లో ఇక కొన్ని విషయాలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది !! రోజూ  పంచ భక్ష్య పరమాన్నాలతో భుజించే ఆమె, పాండవులు భిక్షాటన చేసి తెచ్చిన భిక్షని అందరికీ  వడ్డించి తాను తింటుంది.  హంస తూలికా తల్పం పైన నిదురించే ఆమె, కటిక నేలపై పడుకుంటుంది. కుంతి  ఎలా చెప్తే ఆలా వింటుంది.  ఇక్కడ ఏంటంటే ఆవిడ దేనికి దుఃఖపడదు. పైపెచ్చు సంతోషం గా ఉంటుంది. పంచపాండవులందరినీ  పెళ్లి చేసుకోవడం లో కూడా  ఆవిడ నిర్ణయం ఏది లేదు.  ఆ విధం గా పెళ్లి చేసుకోవాల్సివచ్చినపుడు ఆవిడ  దుఃఖపడినట్లు  కూడా ఎక్కడా అనిపించదు.  ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాగంటి గారు  ద్రౌపదీ దేవి వివాహం గురించి చెబుతూ, ‘మీలో ఎవరైనా వ్యాసుడంతటి వాడు వచ్చి చెప్తే పిల్లని అలా  ఐదుగురికి ఇచ్చి వివాహం చేస్తారా లేక ద్రుపదుడిలాగా ఆలోచిస్తారా ? ‘ అని ప్రవచనం వింటున్నవారిని ప్రశ్నించారు.  ఎవరూ  సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ‘ ఎవరైనా మీలాగే ఆలోచిస్తారు. మీ ఆలోచన తప్పు కాదు. అలవాటు లేని ఆచారం అంటే ఎవరూ  ఆమోదించరు’ అన్నారు. (Sri changanti.net/ మహాభారతం/ఆది పర్వం 45/51  24:00-26:00).

ప్రతి విషయం లో  ద్రౌపది  దేవి చూపించిన ఓర్పు, ఆమోదం(acceptance) చూసి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది అన్పించింది. స్వయంవరంలో మత్య్స యంత్రం చేధించిన వాడు ఎవరో ఆవిడకి తెలియదు. ఆవిడ తండ్రి చెప్పిన నిబంధన ప్రకారం  మత్య్స యంత్రం చేధించాడు, కాబట్టి వరమాల వేసి అతడితో వచ్చేసింది. “అయ్యో !!నేను అర్జునిడి ని చేసుకోవాల్సినదానను, కానీ ఇతను ఎవరో తెలీదు  ఇతని మెడలో  వరమాల ఎందుకు వేసాను” అని బాధపడలేదు.   అదే విధం గా  గమనించవలసినది   ఏంటంటే, ఏ విషయాన్నీ ఆమోదించకూడదో అది ద్రౌపది  దేవి ఆమోదించలేదు కూడా !! తనని అవమానించిన దుర్యోధన, కర్ణ, దుశ్శాసనులను విడిచిపెట్టనివ్వలేదు. యుద్ధం జరిగేలా చేసింది. దీని నుంచి నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఒక  స్త్రీ మూర్తి  వ్యక్తిత్వం ఎలా ఉండాలో ఎలా ఉంటుందో  చెప్తుంది ద్రౌపది దేవి వ్యక్తిత్వం.  

విరాటపర్వం లో  కూడా  ద్రౌపదీ  దేవి గురించి చెప్పారు చాగంటి వారు.  ఆదిపర్వం లో కంటే విరాటపర్వం లో  బాగా చెప్పారనిపించింది. విరాటపర్వం లో ద్రౌపది, కుంతీ, గాంధారి ముగ్గురి గురించి చెప్పారు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 6/24 16:00- చివర && 7/24 మొదలు – 3:30). ప్రతి ఒక్కరు వినవలసినవి !!

ఈ ముగ్గురి స్త్రీ జీవితాలు చూపించి జీవితం లో ఏ తప్పులు చేయకూడదు అని భారతం చెప్పిందో, అటువంటి తప్పులు చేసే దిశ లోనే పయనం చేస్తూ ఫెమినిజం అంటూ రంగు పులుముతున్నారు సోషల్ మీడియా లో  ఈ మధ్య . పైగా కొన్ని అంశాల మీద టీవీ లో వాదోపవాదనలు, కథలు !!   

‘అమ్మాయి అత్తగారింటికే  ఎందుకు వెళ్ళాలి? అబ్బాయి అత్తగారింటికి రావచ్చు కదా!!’ .

‘పెళ్లే  చేసుకోవాలా ? సహజీవనం చేస్తే సరిపోదా ?’.

‘ మా బట్టలు మా ఇష్టం. ఏదైనా వేసుకుంటాం’ . ‘It’s my choice’ .

బట్టలు డిజైన్ చేసేవాడు దుశ్శాసనుడి  కంటే దారుణం గా ఆలోచించి ఆడపిల్లల దుస్తులు తాయారు చేస్తుంటే, దాన్ని ఫాషన్, ఛాయస్ అనే పేరు తో ఆమోదిస్తున్నాం.  మగవాడికి కూడా  అటువంటి  దుస్తులు తయారు  చేయమని అడగట్లేదు ఆడవారెవరూ  కూడా !! సినిమాల్లో, వాట్సాప్ లో  ఆడవారిని  అవమానిస్తూ జోకులు (ట). ఆడవారే వాటిని ప్రోత్సహిస్తుంటారు కూడా !!  భర్త పోయాక పుట్టింటికి వెళ్లకుండా ధైర్యం గా పిల్లలని తీసుకుని అత్తవారింటికి వెళ్లిన కుంతీ దేవిని చూసి తమకు తామై ఎలా నిలబడాలో నేర్చుకోవాలి ఈ రోజున ఆడపిల్లలు.

ఆసక్తి గా అనిపించే ఇంకొక విషయం.అర్జునుడికి ఏదైనా విద్య నేర్చుకోవాలంటే అన్నీ అనుకూలమే. కానీ కర్ణుడికి ప్రతిదీ ప్రతికూలం.  అందుకే కర్ణుడు, అర్జునుడి కంటే శక్తి వంతుడు. కానీ ఒక్కొక్కటి పోగొట్టుకుని కర్ణుడు బలహీనుడు అయ్యాడు. ఒక్కొక్కటి  అర్జునుడు  పొంది బలవంతుడయ్యాడు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 10/24 43:00-46:00 ) ఎందుకు అలా  జరిగింది అనేది ఒక జీవిత పాఠం. బలహీనుడయినా అన్ని అస్త్రశాస్త్రాలు  అర్జునుడు ఎలా సాధించాడు అనేది ఒక విద్యార్థి తెలుసుకోవలసిన ముఖ్యాంశం.

 

5 thoughts on “వింటే భారతమే వినాలి – 1”

 1. ద్రౌపది గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. కష్టాలన్నీ ఓర్పుతో తట్టుకున్న వ్యక్తి. “తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా” అంటూ చాలా గొప్ప ధర్మసందేహాన్ని కురుసభలోనే లేవనెత్తిన ధైర్యవంతురాలు.
  భారత రామాయణాల్లోంచి మేనేజ్మెంట్ పాఠాలు కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. నన్నడిగితే అవి ఏ MBA పుస్తకాలకీ తీసిపోవు.

  మెచ్చుకోండి

 2. బట్టలు డిజైన్ చేసేవాడు దుశ్శాసనుడి కంటే దారుణం గా ఆలోచించి ఆడపిల్లల దుస్తులు తాయారు చేస్తుంటే, దాన్ని ఫాషన్, ఛాయస్ అనే పేరు తో ఆమోదిస్తున్నాం. — ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం 100% కరెక్ట్ చంద్రిక గారు . పోస్ట్ లో మంచి పాయింట్స్ టచ్ చేశారు.

  మెచ్చుకోండి

 3. మీరు శ్రీచాగంటివారిని వినేవిధానం బావుంది. అంటే ఫలానా ఆడియో క్లిప్లోని విషయం ఇది అని చెప్పటం. తెలుగు చదువుకోవటం వచ్చినా, చెవులకింపుగాను, మనస్సుకు హత్తుకొనే విధంగా గురువుగారు చెప్తూ ఉంటె, వింటూ పని చేసుకొంటుంటే ఆ హాయి వేరు. మన పురాణస్త్రీలని సరిగ్గా గమనిస్తే, మంచి చెడు ఇంకోళ్ళ సాయం లేకుండా గ్రహించవచ్చు. వాళ్ళ గురించిన మీ వ్యాసం బావుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: