పెళ్ళిళ్ళు, పుట్టు వెంట్రుకలు, పరీక్షలు, ఎంట్రన్సులు దేనికైనా ఆపద మొక్కుల వాడిని తలచుకోని తెలుగు కుటుంబం ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం లో వాటికన్ సిటీ తర్వాత రెండవ స్థానం లో ఉన్న మతపరమైన సందర్శనా ప్రదేశం తిరుపతి. భారత దేశం లో ఎన్ని దేవాలయాలకి ట్రస్ట్ లు ఉన్నాయో నాకు తెలీదు కానీ ఈ దేవాలయానికి టీటీడీ ట్రస్ట్ మరియు దానికి ఒక IAS అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేవాలయానికి ఎంత రాబడి ఉండకపోతే ఇటువంటి ట్రస్ట్ ఉంటుంది ? వడ్డీ కాసుల వాడి దర్శనం చేసుకోవడానికి టాక్సీలు, రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కి వచ్చే భక్తులు. ఆ బస్సులకు బస్టాండ్లు, రైళ్ల కి రైల్వే స్టేషన్, విమానాలకు విమానాశ్రయం. భక్తుల కి సదుపాయాలు ఇస్తూ వారికి ధర్మసత్రాలు, అన్నదానాలు. అవి నచ్చని వారికీ హోటళ్లు. స్వామి పేరు మీద విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, చెప్పుకుంటూ పోతే అంతే లేదు ఈ ఏడుకొండల వాడి దయ మీద బ్రతికే వారి గురించి !!
నిన్న ముఖ పుస్తకం తెరవగానే కనిపించిన చిత్రం – మొక్కుబడి చెల్లించుకుంటున్న కెసిఆర్ గారి కుటుంబం. ఒకటి కాదు దాదాపు నాలుగైదు టపాలు. ‘ప్రజల సొమ్ము ని గుడి పాలు చేయడానికి ఈయన కి హక్కు ఎక్కడిది’ అని ఒకరు, ‘Shameless’ అని ఇంకొకరు. ‘దేవుడికి అలంకారం అవసరమా,పేదలకి ఇవ్వవచ్చు కదా’ ’ అని మరొకరు. ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నపుడు అందరూ ఆ స్వామి సొమ్ము తిన్నవారే కదా ? సొమ్ము ఎక్కడికి వెళ్తోంది ? కోట్లు గడించి తిరిగి భక్తులకి తెచ్చిపెట్టే ఆ స్వామికే కదా ? ఈ మధ్య ‘పేదలకి ఇవ్వవచ్చు కదా’ అన్న మాట వింటే నాకు చిర్రెత్తుకొస్తోంది. మనం రోజుకో దుస్తులు వేసుకుంటాం, రోజుకో రకమైన రుచి తో భోజనం తింటాము, వీలైతే రోజుకో నగ పెట్టుకుంటాం. 80 ఏళ్ళు, మహా అయితే 90 ఏళ్ళు ఉండే ఈ జీవితానికి ఇన్ని సుఖాలు కావాలా ? మరి మీరు కూడా సంపాదించేది అంతా పేదలకి ఇచ్చి సన్యాసం పుచ్చుకోవచ్చు కదా ? మీరు సన్యాసులు అవ్వరు కానీ ఇన్ని వేలమంది ప్రతి రోజు ఆయన సొమ్ము తింటుంటే ఆ స్వామి మాత్రం నిరాడంబరం గా ఉండాలా ? ఇదెక్కడి న్యాయం ? ఆయన ఒక రాతి విగ్రహం కాబట్టి ఆయనకేమి అక్కర్లేదు అనుకుంటే మీకు ఏమి చెప్పనవసరం లేదు.
పరమతస్తుడైన తానీషా శ్రీరామకల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపి తన భక్తి చాటుకున్నాడు. కెసిఆర్ అయినా, తానీషా అయినా పరమాత్ముడు వినియోగించుకున్న పనిముట్లు. అందుకే మీకు టీవీ లైవ్ లో కెసిఆర్ కన్పిస్తే మా లాంటి వారికీ ఆ నగలు పెట్టుకున్న పరమాత్ముడు కనిపించాడు.
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు _/\_ !!