మార్చి 2 – Read Across America

మార్చి  2 అమెరికాలో అన్ని బడులలో Dr. Seuss గారి పుట్టిన రోజు సందర్భం గా  Read Across America అంటూ పిల్లలని పుస్తకాలు చదవటం ప్రోత్సహిస్తారు.

అమెరికా బడుల్లో  చిన్న తరగతుల్లో (ఒకటి, రెండు)  ఉన్న పిల్లలకి  ఇంటి పని (హోంవర్కు) అసలు ఇవ్వరని చెప్పాలి.  బడి మానకుండా వెళ్లి, గురువు చెప్పినది అర్ధం చేసుకుంటే  చాలు. మరీ ఇక,  Kindergarten వారు అంటే ఇంటికి వెళ్లి ఆడుకోవడమే.  మా అమ్మాయిలు చదివిన బడి  కూడా మినహాయింపు కాదు కానీ  ఒక తిరకాసు పెట్టేవారు.  దాన్నినొప్పి లేకుండా మొట్టికాయ  వేయటం అంటాను నేనైతే. రోజుకొక పుస్తకం చదివో,  చదివించుకునో  తల్లితండ్రుల తో సంతకం చేయించుకు రావాలి. అలా  ఒక నెలరోజులు చదివిన వారికీ  Pizza Hut వారు ప్రశంసా పత్రం తో పాటు గా ఉచితం గా ఒక చిన్న పిజ్జా ఇచ్చేవారు. ప్రతీ  నెలా ఆ  చిన్న పిజ్జా ముక్క కోసం, పోటాపోటీ గా చదివేవారు మా పిల్లలు.  ఆ విధం గా  పది నెలలలో (ఒక సంవత్సరం లో)  దాదాపు 100-120 పుస్తకాలు చదివేవారు.  బడిలో సంవత్సరాంతం లో  ఒక కథ/చిన్న పేరా  ఇచ్చి అప్పటికప్పుడు చదవమని, దాని మీద  మౌఖిక పరీక్ష పెట్టేవారు. దానినే DRA2 assessment అంటారు. చదివిన పుస్తకం లోని కథ యొక్క నేపధ్యం, మొదలు,మధ్య, చివర భాగాలు  అడుగుతారు.  చివర గా – నీ నిజ జీవితం లో ఏదైనా సంఘటన తో కలిపి చెప్పగలవా/ ఇటువంటిదే  ఇంకొక పుస్తకం లో ఏదైనా పాత్ర తో పోల్చగలవా/ ప్రపంచం లోని ఏదైనా విషయం తో పోల్చగలవా  (connect Text to Self, Text to Text, Text to World) అని గురువులు ప్రశ్నిస్తారు. సునాయాసంగా చదివారా, spelling లు సరిగ్గా చెప్పారా లేదా అన్న దాని కంటే, పిల్లల  అవగాహన  మీద దృష్టి పెడ్తారు.  పిల్లల  అవగాహనని   బట్టి  score వేస్తారు.  అందులో ఉత్తీర్ణులవ్వటం అవ్వకపోవటం అంటూ ఏమి ఉండదు. ఆ వచ్చిన score ప్రకారం ఎటువంటి పుస్తకాలు చదవాలో టీచర్ సిఫార్సు  చేసేవారు. ఈ విధం గా ఇక్కడ పిల్లలు  దాదాపు ఐదోయేట నుంచి ఒక పుస్తకం మీద చర్చ చేస్తారు.

అమెరికా లో పబ్లిక్ గ్రంధాలయాలే కాక, ప్రతీ  బడిలో గ్రంధాలయాలు &  ప్రతి తరగతి గదిలో ఆ టీచర్ గారి దగ్గర  కూడా ఒక చిన్న సైజు గ్రంధాలయం ఉంటాయి. అంతే కాక ప్రతి బడి లో సంవత్సరానికి రెండు సార్లు scholastic publishers వారి బుక్ ఫెయిర్లు  జరుగుతాయి. దాని ముఖ్యోద్దేశ్యం ఏంటంటే- ఆ పబ్లిషర్ వారు, వారికి వచ్చిన లాభాలలో కొంత బడికి కూడా ఇవ్వటం చేస్తారు.  ఎండాకాలం సెలవల్లో అమెరికాలో  ప్రతి గ్రంధాలయం లో పిల్లలకి Summer Reading Program ఉంటుంది. గ్రంధాలయం వారి లిస్ట్ లో ఉన్న పుస్తకాలూ చదివితే ఉచిత ఐస్ క్రీం, పార్కులకి ఉచిత టికెట్ లాంటి కూపన్ లు ఇస్తారు. గ్రంధాలయాలలో పెద్దలకే కాక, పిల్లలకి కూడా పుస్తకాల మీద చర్చా వేదికలు ఉంటాయి. Story reading programs – చిన్న పిల్లలకి  కథ చదివే కార్యక్రమాలు. ఇవన్నీ పూర్తిగా ఉచితం. వాలంటీర్ల సాయం తో నడుస్తాయి.  

పిల్లల పుస్తకాలూ కూడా ఎంత బావుంటాయంటే అతి సులభమైన భాష లో, రక రకాల బొమ్మలతో , రోజు వారీ జీవితం చెప్తూ ఉంటాయి. నేను వాళ్ళతో పాటే చిన్న పిల్లనయి పోయి చదివేదాన్ని. వాటిల్లో నాకు ఇప్పటికీ  ఇష్టమైన పుస్తకం ‘The Very Hungry Caterpillar’. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక గా మారే క్రమం లో జరిగే కథ.  ఆదివారము నాడు  అరటి మొలచింది  పద్యం లాగా Science, Math, వారాలు  అన్నీ  చెప్పి ఒక నీతి కూడా చెప్తాడు రచయిత.

ఏ భాషయినా పర్వాలేదు ఒక పుస్తకం తీసుకుని పిల్లలతో కూర్చుంటే ఆ పుస్తకము పెంచే అనుబంధమే వేరు అనిపిస్తుంటుంది. పిల్లలు అన్నం తింటున్నప్పుడు టీవీ ఎక్కడ అలవాటు చేసుకుంటారో అని అన్నం పెడుతూ పుస్తకం చదివే వాళ్ళం మేము. ఆ అలవాటు వలన ఇప్పుడు కూడా ఫోన్లు డైనింగ్ టేబుల్ దగ్గర రాకూడదు అని అనగానే అది కాక పోతే ఇది అన్నట్లు  పుస్తకాలతో తయారవుతారు 🙂 ఈ పుస్తకాల వలన కొన్ని నష్టాలూ కూడా ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు ఆ పుస్తకాలలో తింగరి పాత్రల ని అనుసరిస్తుంటారు కూడా.

High School, Middle school లలో కూడా కొన్ని పుస్తకాలు  చదవటం, వాటి మీద చర్చలు జరపటం, ప్రాజెక్టులు చేయటం ఉంటుంది. అటువంటి పుస్తకాలలో ఉదాహరణలు  –  To Kill a  Mockingbird , Romeo and Juliet .  

ఎన్ని కొత్త పద్దతులు వచ్చినా ఇంకా కొన్ని విధానాల్లో పాత  పద్ధతులే కన్పిస్తాయి అమెరికా లో. మనకి తెలుగు లో ebooks  ఇంకా అంత రాలేదు కానీ ఇక్కడ చాలా మటుకు వచ్చేసాయి. అయినా గ్రంథాలయానికి వెళ్తే అక్కడ పిల్లలు, పెద్దలు సంచులలో పుస్తకాలూ నింపుకుని వెళ్లే పాత పధ్ధతి కన్పిస్తుంది.   హై స్కూల్  డిప్లొమా కి,  కాలేజీ కి లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే  కనీసం మూడేళ్ళ పాటు  కోర్స్ లో రెండవ భాష (Second Language) చదివి ఉండాలి.  ఆ మూడేళ్ళు  ఇక్కడి పిల్లలు భాష మీద చిన్న పట్టు సంపాదిస్తారనే చెప్పచ్చు. అంటే  ఖచ్చితం గా నేను ఇంటర్మీడియట్ లో సంస్కృతం చదివినట్లు మాత్రం ఉండదు. దీనిని బట్టి భాష  – Language Arts అన్నదానికి ఎంత విలువ ఇస్తారో అర్ధం చేసుకోవచ్చు.

అసలే అమెరికా చిరాకు గా ఉంటే అమెరికా గురించి ఇంత గొప్ప చెప్పాలా అనచ్చు. కొన్ని మంచి విషయాలు కన్పించినపుడు చెప్పడం లో తప్పు లేదు కదా !!భారత దేశం లో  మనవారు, పిల్లలు  అమెరికా కి రావాలన్న తపన తో, పోటీల ప్రపంచం లో తమ ఉనికినే  మర్చిపోతున్న తరుణం లో ఇటువంటివి తప్పకుండా గమనించాలి అంటాను.  నా చిన్నపుడు చందమామ, అమర చిత్ర కథ ల  కోసం పోట్లాడుకున్న రోజులు ఉన్నాయి. వారానికి ఒకసారి మా స్కూల్ లో మాకు లైబ్రరీ తరగతి ఉండేది.  ఇక AIR లో వచ్చే బాలావినోదం సంగతే వేరు. రేడియో అక్కయ్య, కంగారు మావయ్య, జేజి మావయ్య పాటలు , రూపకాలు చెప్పుకుంటే పోతే ఇంకో టపా  కూడా అయిపోవచ్చు. ఆంగ్లం లో  ‘Gingerbread  Man’  కథ ఆధారం గా  ‘దిబ్బరొట్టి  అబ్బాయి’ రూపకాన్ని ఎప్పటికి మర్చిపోలేను. భారత దేశం లోని బడులలో  ఈ రోజుల్లో  కనీస వసతులే  ఉండట్లేదు అంటున్నారు. మరి గ్రంథాలయాలు ఉన్నాయా అన్నది ప్రశ్నే!!

అమెరికా ని చూసి  Valentine’s day, Mother’s day, Father’s day చేసుకున్నట్లే Read Across India పండుగ కూడా చేసుకోవాలని ఆశిస్తూ  ఈ టపా ….

 

12 thoughts on “మార్చి 2 – Read Across America”

  1. manchi prastavana, aithe munupati taraalalo gnyanam kosam chaduvukune varu kaabatti daanilo vishaya sangrahana vundedi, kaanee ipudu chaduvulu vudyoga sekarana kosam maatrame jarugutunnayi. daanivalana potee perigipoindi, chaduvukune sthayi nundi chaduvu kone sthayi ki edigindi. kaabitti chaduvulo vishaya grahana avasaramlekundaa poindi, okappudu ganitamulo algebra ante bhayapadi poyevaaru, kaanee ee rojulalo vyakaranam aavasyakata enta mandiki telusu? maatrubhasha dinotsavam roju mokkubadigaa konni karyakramaalu chesesi chetulu dulipesukovatam tappa, daani aavasyakata gurinchi entha mandiki telusu. ippudu padava taragati chaduvutunnavaaru entha mandi telugu peparu chadavagalaru. edo chalana chitramlo cheppinatlu ‘vishvaksenudi putraratnma taskaskambhotlu’ rayamante adedo mana bhasha kaadu anukune pareestitulalo vunnadi ikkada vyavasta. vudaaharanagaa monna oka manthri garu B.Com lo physics chadivaanani vaadinchinatlu.

    intkaee emi cheputunnanante chaduvu gnyanam kosam kakundu ammakam kosame annatlugaa vunna ee paristitulalo nuvvu aasinchinadi jarugutundantaavaaa.???????

    vyavastalo samoolamaina maarpu raavaali. prabhutva mariyu talli tandrula dhrukpatham maaraali. ivannee jaragaalante mundu manishi yaantrika jeevanam nundi manishi gaa maaraali.

    naakemanipustundante annitikee kooodaa moolakaranam kutumba vichchithi anipistondi. vummadi kutumbaalalo yuvataralaki manchi sophanaalu erpadagalavani anipistondi.

    mukhyamga mana dainandini lo TV, MOBILES entha takkuvagaa chotu chesukunte antha baagaa abhivrudhi vuntundi anpistondi.

    మెచ్చుకోండి

    1. ధన్యవాదాలు నాని. ముందు తల్లితండ్రుల్లో మార్పు వస్తే చాలు. పోటీ ప్రపంచం లో పరుగెత్తాలి. కాదనను. అమెరికా లోను ఫోన్లు, గాడ్జెట్స్ ఉన్నాయి. అయినా ఈ పాత పద్ధతి లోనే ఉండటం మెచ్చుకోవాలి

      మెచ్చుకోండి

      1. మంచి పోస్ట్. ముఖ్యంగా లైబ్రరీలు, స్కూళ్ళు మొదలైన చోట పుస్తకాల లభ్యత, వాటిని పిల్లలతో చదివించటానికి ఉన్న ప్రోత్సాహకాలు భలే వ్రాసారు. మా పిల్లల చిన్నతనంలో మేము కొన్ని మీలాగే వాళ్ళతో చదివేవాళ్ళము. వాటిలో Matilda అన్నది బాగా గుర్తున్న పుస్తకాల్లో ఒకటి. ఆతర్వాత అది సినిమాగా కూడా తీశారు.

        మెచ్చుకోండి

  2. అమెరికా ని చూసి Valentine’s day, Mother’s day, Father’s day చేసుకున్నట్లే Read Across India పండుగ కూడా చేసుకోవాలని ఆశిస్తూ ఈ టపా ….

    ఈ లైను బాగా నచ్చిందండి – చంద్రికా – నాకు 🙂

    మెచ్చుకోండి

  3. నిన్న మా స్కూల్ డిస్త్రిక్ట్ వాళ్ళు మల్టీ కల్చరల్ రీడింగ్ నైట్ పెట్టారు. చాలా మంది తెలుగు వాళ్ళు, ఇంకా ఇతర భారతీయ భాషల వాళ్ళూ, జర్మన్, భాషల వాళ్ళూ వచ్చారు. ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన గది, ఇద్దరు ముగ్గురు చదువరులు ఏర్పాటు చేసారు. మన భాషలకి మన దేశంలోనైనా ఇంత సేవ మన ప్రభుత్వాలు, స్కూళ్ళూ చేస్తున్నాయా అని ఆశ్చర్యం వేసింది.

    మెచ్చుకోండి

    1. క్షమించాలి అరుణ్ గారు. ఆలస్యం గా స్పందిస్తునందుకు. అమెరికా లో నచ్చే విషయం అదేనండి . విషయం కొత్తదైనా తెల్సుకుంటుంటారు. తిరిగి అదే విధం గా మనం ఉండము ( ఎక్కువ శాతం గురించి నేను చెప్పేది )

      మెచ్చుకోండి

  4. మంచి పోస్ట్ చంద్రిక గారు. చివర్లో మీ conclusion నచ్చింది. కమర్షియల్ గా వర్కౌట్ అవదని ఇలాంటి వాటిని వ్యాపార సంస్థలు ఇండియా లో ప్రమోట్ చెయ్యక పోయి ఉండచ్చు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి