ధరిత్రీ దినోత్సవం -2017

ఈ రోజు ధరిత్రీ  దినోత్సవం. సంవత్సరానికి ఒకసారి ఈ రోజు వస్తుంది పోతుంది. కానీ  మనం  చేసే పనులలో ఎంత మార్పు ఉంటుందో కానీ మనం చేసే పనుల వలన , పాపం ఈ ధరణి పరిస్థితి మాత్రం రోజు రోజుకి  మారిపోతోంది !!

అమెరికా లో  మా లాంటి వారి సంగతే చూద్దాం.

అమెరికాలో ఒక ఇంటికి  పిల్లలకి తలా  ఒక గది,తల్లితండ్రులకి ఒక గది,అథితులకి ఒక గది,  వంట చేసుకోవడానికి , భోజనాలకి ఒక గది,  అతిథులు వస్తే  కూర్చోడానికి ఒక గది, భోజనాలకి ఇంకో గది, వీలైతే చదువుకోవడానికి ఒక గది , వ్యాయామం చేసుకోవడానికి ఒక గది     ఓ మూడు  స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి భూగృహం.   కార్లు పెట్టుకోడానికి గది( గారేజ్) ఇలా ఇన్ని గదులు ఉంటాయి.  అమెరికా లో దాదాపు ప్రతి  మధ్య తరగతి కుటుంబం ఇల్లు ఎంత చిన్నదయినా దాదాపు  ఇలాగే ఉంటుంది (ఇన్ని గదులు కట్టుకోవడానికి  వరం ఇఛ్చిన దేవుడికి మాత్రం గది  కేటాయించలేదండోయ్  మా అమెరికా వారు!! అది వేరేవిషయం !!). ఇక ఈ ఇంటిని అన్ని రకాల హంగుల తో , అలంకరించడానికి, అనేక ప్రయత్నాలు.   వినియోగదారుడి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటానికి అన్నీ  అందిస్తూ  పెద్ద పెద్ద దుకాణాలు. ఆ దుకాణాలకు చైనా వారు భారీ ఎత్తున వస్తువులు దిగుమతి. రోజుకి ఉండే 24 గంటలలో కనీసం ఒక  గంట సేపు కూడా ప్రశాంతం గా కూర్చుని ఇంటిని ఆస్వాదించలేని పరిస్థితి. మరి ఈ హంగులు , ఆర్భాటాలు ఎందుకో అర్ధం కాదు.  భారత దేశం నుండి వచ్చేటపుడు ఓ రెండు సూటుకేసులతో వచ్చి ఇంట్లోప్రతి అడుగు నింపిపడేస్తాము దేనికా అనిపిస్తుంటుంది .

ఇంట్లో ప్రతి ఒక్కరికీ  కారు. అందులో ఒకటి తప్పకుండా, గుటుక్కుమని పెట్రోల్ తాగేసి  దాహం తీర్చుకునే భారీ వాహనం అయి ఉంటుంది. ఈ కార్ల కోసం పెద్ద రోడ్లు.  అమెరికా లో కార్ల గురించి వేరే  చెప్పవలసింది ఏముంది ? ఒక రాష్ట్రం మొత్తం వీటి పేరు చెప్పుకుని  బ్రతికేస్తుంది. ఇక కారు తాగే పెట్రోల్ కోసం ఈ దేశం పడే అవస్థ అంతా ఇంతా కాదు!! ఒక  కారు జీవిత కాలం అవ్వగానే దాన్ని విరాళం ఇచ్చివేయటం జరుగుతుంది.  మరి కారు భాగాలు ఉపయోగిస్తారో లేక కారును junk yard  లో పడేస్తారో అర్ధం కాదు.  

ఇక తిండి, బట్టలు.  అమెరికా లో తిండికి  కొదువ లేదు. తాజా ఆహారం  తక్కువ గా  కనిపిస్తుంది.   కాన్ లలో , అందమైన ప్లాస్టిక్ బాగ్  పా కెట్ లలో , ఫ్రీజర్ లలో , ఫాస్ట్ ఫుడ్ లలో  ఎక్కువ గా కనిపిస్తుంది.  అందరూ  ఎప్పుడూ  బిజీ నే కదా మరి!! చేతులు కడుక్కునే సమయం కూడా ఉండదు. ఇక అంట్లుతోమే సమయం ఎక్కడిది ? అందుకే అన్నిటికీ  Short Cut లే!! తిండి విషయం లో మరీ ఎక్కువ !! ఇక వారాంతం పార్టీలు, పుట్టిన రోజు పార్టీలకి కొదవే లేదు.  కేక్ అంటే నానా  చెత్తని అందం గా పేర్చటం అన్పిస్తుంది నాకైతే. ఎందుకు కోస్తారో తెలీదు.  కోసాకా  ఎవరికీ తినటం ఇష్టం ఉండదు. ‘కొంచం ఇవ్వండి చాలు’ అన్న మాట వినిపిస్తుంటుంది.  అది ఫ్రిడ్జ్ లో పెట్టి  ఒక వారంపాటు తినడం లేక చెత్తలో వేయటం.  పార్టీలు అయ్యాక చెత్తసంచుల లో పార్టీ మొదలువుతుంది ప్లాస్టిక్ చెంచాలు, పళ్లేలు , వాడేసిన నలిపి పడేసిన అల్యూమినియం ట్రేలతో.

ఇదంతా అమెరికా జాడ్యం!!

ఇక భారతదేశం సంగతి చూద్దాం !! అమెరికా ని అనుకరించే  జాడ్యం 90 దశకం చివర  అమెరికా వలసలతో భారతదేశం లో కూడా  మొదలయింది.  అమెరికా వాతావరణం  వేరు మన వాతావరణం వేరు. గడ్డ కట్టుకుపోయే చలికి పక్క వారింటికి వెళ్లాలన్నా  కారులో వెళతాము. మనకి భారత దేశం లో ఉన్న వాతావరణానికి, మరీ దక్షిణ భారతం  లో అయితే , ఎంత దూరం అయినా  అసలు కారు అవసరం లేదు. కానీ కారు లేకుండా ప్రయాణించలేని పరిస్థితి లా అయింది. దానికి తోడు కాలినడక బాటలు కూడా లేకుండా రోడ్లు.  కాలుష్యం గా ఉంది అంటూ కార్లలో ప్రయాణిస్తుంటే కాలుష్యం చేస్తున్నది ఎవరు అనాలనిపిస్తుంది.  నడక అనేది లేక  శరీరాలు బరువులు పెరిగి చక్కర, రక్తపోటు వ్యాధులు.

నా చిన్నపుడు ఎయిర్ కూలర్ ఉన్నా వట్టివేరు తడికలు కట్టి నీళ్లు పొసే వారం.  మరి ఇప్పుడు ఇంటి చుట్టూ పక్కల ఒక్క చెట్టు ఉండదు.  ఈ ఎండలు భరించలేము అంటూ  ప్రతి ఇంట్లో ఇన్వెర్టర్ లు, ఏసీలు. చక్కటి పంచవటి లాంటి ఇల్లు ఉంటే  చాలు.  దాన్ని, దాని చుట్టూ ఉండే నాలుగు చెట్లని  పడగొట్టి పది అపార్టుమెంట్లు చేయడం. పైగా  ‘డెవలప్మెంట్’ దాని పేరు !! తరువాత నీటి వనరులు సరిపోలేదు అనటం.  ఒక ఇల్లు ఉంటే  సరిపోదు. ఆ ధనదాహార్తి చల్లారక ఇంకొకటి  కొనుక్కోవడం. జీవం ఉన్న పచ్చటిపొలాలు మాయమవుతుంటే జీవం లేని కాంక్రీట్ భవంతులని  చూసి మురిసిపోతున్నాం.  

ఇక అవసరం లేని ఆర్భాటాలు!! ఒక పెళ్లికి వెళ్తే అది పెళ్ళో ఫుడ్ మేళానో అర్ధం కాదు. 100 రకాల మెనూ లు. ఎన్ని రకాలు పెడితే అంత గొప్ప!! ఇక చీరలు ఫ్యాషన్లు చెప్పనక్కర్లేదు.  కట్టిన చీర కట్టకూడదు, పెట్టిన నగ పెట్టకూడదు  అన్న లక్ష్యం పెట్టుకుని ఉంటారు.  ఇక Retun gift అని ఎవరు కనిపెట్టారో ఎందుకు కనిపెట్టారో కానీ చైనా వాడు సగం బతికి పోతున్నాడు ప్రపంచానికంతా చౌకబారు ప్లాస్టిక్ సరుకులు అమ్ముకుంటూ .  పండు తాంబూలం కంటే ముఖ్యం ఇది!! పైగా మనవారు ఇది ఒక ఆచారం లాగా కూడా చేసేసారు.   

కంప్యూటర్లు,ఫోన్లు, టాబ్ ల వాడకం గురించి అమెరికా లో , ఇండియా లో చెప్పనే అక్కరలేదు.  అవి ఎప్పుడూ  కొత్తగా తళతళలాడుతూ ఉండాలి. పాతవి ఏం  చేస్తారు అని తలచుకోబుద్ధి కూడా కాదు.

వ్యాపారం  & వాణిజ్యపరం గా చూస్తే ఇవన్నీ ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి అన్పిస్తుంది. నిజమే. అమెరికా లో అన్నీ  వ్యాపారమే అయినా,  వాతావరణ కాలుష్యం తగ్గించుకోవడానికి కొన్ని  ఖచ్చితం గా నియమాలు పాటిస్తారు. వాటి వలన వనరులు అంతరించుకుపోవు. ముఖ్యం గా నీరు. చెట్లు పెంచటం, పార్కులని,  పరిరక్షించుకోవడం చేస్తారు. లాన్ తప్పనిసరిగా పెంచుతారు.  ప్రతి చోటా storm water ponds ఉంటాయి.  ఏదైనా కొత్త కట్టడం చేస్తుంటే వాన నీరు కి ఉన్న Soil Erosion అవ్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారు. మేము రోజు వాకింగ్ కి వెళ్తుంటే పక్కనే చెట్లలో జింకలు పరిగెడుతుంటాయి. ఇక  ఉడుతలు, కుందేళ్ళ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు.  చెప్పాలంటే పెరటిలో వేసిన కూరలని  వీటి బారి నుండి పరిరక్షించుకోవాల్సివస్తుంటుంది.  ఇదంతా ఎందుకు చెప్తున్నాను  అంటే ప్రకృతి తన ఉనికిని కోల్పోలేదు ఇక్కడ.

కాగితపు  పళ్లేల వాడకం పూర్వమే అరిటాకులు, విస్తరాకులు, బాదం ఆకులలో తినటం తెలుసు  మనకి!!   పెన్సిల్ &  కాగితం లేకుండా, బ్యాక్ ప్యాక్ లు భుజాన వేసుకోకుండా కేవలం  పలకా బలపం తో చదివి ఈ రోజున పెద్ద పీఠాలు  అధిష్టించినవారిని చూసాం!! మనం రోజూ చేసే ప్రతి పనీ ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఎలా బ్రతకాలో నేర్పింది భారతీయ సనాతనధర్మం.  భారతదేశం ఇలా తన  ఉనికి మరిచిపోతూ ఇంకొకరిని అనుసరించడం  ఎంత  శోచనీయం??

టపా ఇప్పటికే పెద్దదయిపోయింది.

చేసే ప్రతిరోజువారీ   పనిని గమినించుకుని ఆలోచిస్తుంటే, రాబోయే తరాలకి తిండి, నీరు  తప్ప అన్నీ ఇస్తామేమో అన్పిస్తోంది !!

9 thoughts on “ధరిత్రీ దినోత్సవం -2017”

  1. ఆవేదనాభరిత వ్యాసం వ్రాసారు.
    ఒకప్పుడు The Good Earth. ఇప్పుడంతా వ్యాపార మాయాజాలం, విలువలకు తిలోదకాలు, షో చేయడం. భారతదేశ సమాజమయితే భావదాస్యం మూలాన వీటిల్లో మరీ కూరుకుపోయిన పరిస్ధితి. ప్చ్, బయటపడే అవకాశాలు దరిదాపుల్లో కనపడడంలేదు – Peace in our lifetime లాగా 🙁.

    మెచ్చుకోండి

  2. బావుందండి. మందు మోతాదులో వేసుకొంటేనే ఫలితం ఉంటుంది. అలాగే అవసరం ఉన్నాలేకపోయినా ఉన్నాయికదా అని వనరులన్నీ వాడేస్తే, తరవాత తరాల పరిస్థితి ఏమిటి అన్నది బాగా వ్రాసారు. మనకి అమెరికాని తెల్లవాళ్ళని చూసి వాతలేసుకొనే గుణం ఉన్నంతకాలం మనపరిస్థితిలో మార్పేమీ ఉండదు. (ప్రదేశంతో సంబంధం లేకుండా భారతీయులకి, ముఖ్యంగా తెలుగు జాతికి).

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి