విన్నకోట వారి విలువైన వ్యాఖ్య

మాలిక, శోధిని, తెలుగు బ్లాగులు అనుసరించేవారికి విన్నకోట వారి పరిచయం అక్కరలేదు. ఆయన  వ్రాసే చక్కటి వ్యాఖ్యలే నా లాంటి బ్లాగర్లకి పెద్ద విటమిన్లు అని చెప్పచ్చు. ఆయన  వ్యాఖ్య చూసినప్పుడల్లా ఎవరో ఒక బ్లాగరు వారిని  బ్లాగు ప్రారంభించమని అడుగుతుంటారు. దానికి ఈ రోజు వారు అన్న మాట ‘అందరూ  పల్లకి ఎక్కితే మోసేవారు ఎవరు’ అని _/\_!!  మొన్న ఈ మధ్య ఈ రోజుల్లో వస్తున్న సినిమాల  మీద ఆయన వ్యాఖ్య రూపం లో చెప్పిన ఈ విలువైన మాట  చాలా ఆలోచింపచేసేదిగా  అనిపించి, దానిని ఒక చోట పెట్టడం & అందరికి పంచడం చాలా అవసరం అనిపించింది. అందుకు నా బ్లాగే  ఎందుకు ఉపయోగించకూడదు అనిపించింది. వారి అనుమతి తో  ఈ టపా :

సినిమా వినోదానికే అంటుంటారు సరే. అయితే ఎంత వినోదం కోసమైనా, వ్యాపారం కోసమైనా కాస్తైనా సమాజం పట్ల బాధ్యత చూపించాలిగా. ఒక వయసు దాటిన ప్రేక్షకులు ఆఁ ఏదో తీసారులే అనుకుని పెద్దగా పట్టించుకోపోవచ్చు. కానీ యువత మీద, అంతగా విశ్లేషణ చేయలేనివారి మీద, సినిమా వారిని పిచ్చిగా వ్యక్తిపూజ చేసే వారి మీద సినిమాల ప్రభావం ఎంత తీవ్రంగా పడుతోందో ఈనాటి సమాజంలో కనిపిస్తూనే ఉంది. పాతకాలంలో నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల నిర్మాణంలో బాధ్యతారాహిత్యం చూపించలేదే. మరి వారు మాత్రం వినోదం కోసం తీయలేదా, వ్యాపారం చేయలేదా?

తర్వాత తర్వాత సినిమాలు మాస్ కోసం తీస్తున్నాం అనే ధోరణి ఎక్కువైపోయింది. మాసే బాసూ మనల్ని ఈరోజున ఈ లెవెల్లో నిలబెట్టింది అంటూ అన్యాపదేశంగా తన గురించి సినిమాలో తనే డైలాగులు చెప్పుకున్న “ఘనమైన” స్టార్లూ ఉన్నారు. మాస్ కోసమంటూ అర్ధంపర్ధంలేని, భౌతికశాస్త్ర సూత్రాలకు కూడా అతీతమైన విన్యాసాలు ఎక్కువైపోయినాయి – గ్రాఫిక్స్ వచ్చిన తరవాత మరీ కోతికి కొబ్బరికాయ దొరికినట్లయపోయింది. అడుగడుగునా విపరీతమైన హింస చూపించడం రివాజయిపోయింది – బహుశః అదే హీరోయిజం అనే భ్రమలో, మాస్ కి నచ్చుతుంది అనే భ్రమలో.  

నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమించానంటూ వెంటబడడం, పెళ్ళింట్లోనుంచి పెళ్ళికూతుర్ని తప్పించడం – హీరోయిజమా? వికారమా? సంస్కారరాహిత్యమా? బాధ్యతారాహిత్యమా? మనకి పంచే వినోదమా? అటువంటి సినిమాలు యువత మీద చెడు ప్రభావం చూపించవంటారా? అది సమాజానికి మంచేనా?

ఇక ఆ డాన్స్ లు చెప్పనక్కరలేదు – హీరో వెనకాలో 20 మంది, హీరోయిన్ వెనకాలో 20 మంది హఠాత్తుగా ప్రత్యక్షమౌతారు. అసలవి “డాన్సులా”? చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ మాస్టారు చేయించిన డ్రిల్ లాగానూ, కుంటి నడక లాగానూ, ఒళ్ళు నెప్పులన్నవాళ్ళు ఒళ్ళు విరుచుకున్నట్లూనూ ఉంటాయి. పైగా జుగుప్స కలిగించేట్లు వెనక్కి తిరిగి పృష్టభాగం ఊపులు – అదీ కెమేరా మీదకొచ్చి – అంటే ప్రేక్షకుల మొహాలమీద ఊపడం. అదేమంటే మాస్ కోసం. పాతకాలం సినిమాల్లోనూ డాన్సులుండేవి (ఇప్పుడంత అసభ్యంగా కాదు), ఫైట్లుండేవి (ఇప్పుడంత బీభత్సంగా కాదు), మరి ఆ రోజుల్లోనూ మాస్ ఉండేవారు, వాళ్ళూ సినిమాలు చూసేవారు, శతదినోత్సవాలూ జరిగేవి.  

సినిమా తీసేవాళ్ళ దృక్పథం ఎంతలా మారిపోయిందో తెలుస్తోంది. వీళ్ళని బయట జనాలు గుడ్డిగా అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే జనం ఎంతగా ప్రభావితులైపోతున్నారో అనిపిస్తుంది. వీళ్ళని ప్రత్యక్షదైవాలన్నట్లు జనాలు వెర్రిగా ఆరాధించడం – వాళ్ళని చూసి చొంగ కారిపోవడమొకటే తక్కువ.  

ఇటువంటి ధోరణులు సామాజిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయనే బాధ్యత కరువైపోతోందే అన్నదే “సామాజిక స్పృహ” కొరవడింది అంటే. పైగా నిరంతర మీడియా కవరేజ్ లు, వీళ్ళనే ఆధారం చేసుకునే టీవీ షో లు 24 గంటలూ. జనాలకి వేరే ప్రపంచం లేకుండా తయారయేంత ప్రభావం పడుతోంది.

తాము నటించే సినిమాలలోనే కాక ఇటువంటి బాధ్యతారాహిత్యం ఈ సోకాల్డ్ “సెలెబ్రిటీలు” మోడల్ చేసే అడ్వర్టైజ్మెంట్లలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి : ఓ సాఫ్ట్ డ్రింక్ సీసా కోసం భవనాల మీదనుంచీ, బ్రిడ్జిల మీదనుంచీ, కొండల మీదనుంచీ దూకినట్లు చూపిస్తున్న ప్రకటనలలో నటించే మోడల్ – పైగా పేరున్న నటుడు కూడానూ – కొంచమయినా బాధ్యత కలిగున్నవాడు అనగలమా? నిజజీవితంలో ఇటువంటి విన్యాసమే అనుకరించబోయి ఓ కుర్రవాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న సంగతి తెలిసి కూడా ఆ కంపెనీ తమ పద్ధతి మార్చుకోలేదంటే, ఆ “సెలెబ్రిటీ” వాటికి మోడల్ చేస్తూనే ఉన్నాడంటే – డబ్బు వ్యామోహానికి, బాధ్యతారాహిత్యానికి, సమాజంపట్ల నిర్లక్ష్యానికి, insensitivity కి పరాకాష్ఠ అనవద్దూ ! తెర మీద ఓ disclaimer పడేసి చేతులు దులుపుకోవడం. పైగా స్వేచ్ఛ అనే సాకుతో ప్రభుత్వాన్ని టీవీ మీద ఆంక్షలు సెన్సార్ పెట్టనీయకపోవడం.  

మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటుంటారు సినిమా వాళ్ళు చాలా తెలివిగా. మీరు తీస్తున్నవే మేం చూస్తున్నాం అని జనాలు అనే వాదమే సరైనది. ఎందుకంటే జనాలకి ఛాయిస్ ఏమీ లేదు, చిత్రనిర్మాణంలో జనాల పాత్ర ఏమీ లేదు. విడుదలకు ముందు కీలక పాత్ర పోషించవలసిన ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ వారే న్యాయం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి – ఎందుకంటే డబ్బొకటే ప్రాధాన్యమైపోయిన నిర్మాతలు, దర్శకులు, నటులు ఈ విలువలు పట్టించుకుంటారని ఆశించడం అనవసరం.

ఇంతలా భ్రష్టు పట్టిపోయిన రంగంలో కె.విశ్వనాథ్ లాంటి మహానుభావుడు వంటరిగా ధైర్యం చేసి సంస్కారవంతమైన సినిమాలు తీస్తే ఆయనకు అత్యున్నత పురస్కారం వచ్చినప్పుడు తప్పులు పట్టే ప్రయత్నం చెయ్యడం మాత్రమే కొంతమంది జనాలకు చేతనయినదిలా తోస్తోంది.


ఎవరి అభిప్రాయాలు, అభిరుచులు వారివి, కానీ సినిమాలు బాధ్యతాయుతమైన వినోదం అందించాలి, తాము జీవిస్తున్న సమాజం యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం అనే స్పృహ కలిగుండాలి అని సమాజం expect చేస్తుంది అని సినిమా వాళ్ళు తెలుసుకోవాలి.

 

ప్రకటనలు

14 thoughts on “విన్నకోట వారి విలువైన వ్యాఖ్య”

 1. ఇన్య్జోయి వినిమాలకి వాటిని తీసే వారు రెండు బ్లాకు బస్తర్ల్సలో మొదటిది ఇచ్చేశాను చూసి బాగున్నా,బాగోక పోయినా మా మోహనో మీ డబ్బులు వేదజల్లండి పెద్ద గొప్పగా మీడియా స్తేమెంట్లు ఇవ్వడం హాశ్యాస్పదంగా లేదా శర్మగారు..

  మెచ్చుకోండి

 2. సంచారమ్ముల విన్నకోట నరసింహారావు పల్కుల్ భళా !
  సోంచాయింతురు గాక యెల్లరుజనుల్ సోంబేరులై బోవకన్ !
  మించారన్ సినిమా కథల్ నలుగురన్ మెచ్చంగ నాణ్యంబుగా
  కుంచెన్చిత్రములన్ జిలేబి చెలమై గూర్చంగ మేలౌనహో !

  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. నా వ్యాఖ్య నచ్చి, దాన్ని పోస్ట్ రూపంలో మరింత వెలుగులోకి తీసుకువచ్చిన మీ అభిమానానికి కృతజ్ఞతలు, చంద్రిక గారు 🙏.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. చక్కటి వ్యాసానికి లింక్ నిచ్చిన “అన్యగామి” గారికి కృతజ్ఞతలు. ఈ విషయంలో గొల్లపూడి మారుతీరావు గారి లాంటి ప్రముఖుడి అభిప్రాయాలలోనూ, నాలాంటి సామాన్యుడి అభిప్రాయాలలోనూ సామ్యం కనిపించడం నాకు చాలా గొప్పగా ఉంది – ఎంత గొప్పగా అంటే ‘జలపాతాన్ని ఈ వైపు నుండి ఆ వైపుకు ఒకే గంతులో దాటినంత’ గొప్ప ఫీలింగ్ గా ఉంది 🙂. చెయ్యి తిరిగిన రచయిత కాబట్టి, సినిమాలతో ప్రత్యక్షానుభవం కలిగిన వ్యక్తి కాబట్టి గొల్లపూడి గారు అద్భుతంగా వివరించారు.

  నిజానికి సినిమా కళ అంటే నాకు చాలా గౌరవం. సృజనాత్మకత నావిష్కరించడానికి ఎంతో ఆస్కారం గల రంగం. ఆ రకంగానే సినిమాలు రూపొందించారు ఒకనాటి సినీ పెద్దలు, బాధ్యతతో కూడిన వినోదమూ అందించారు. ఒక సినిమా నిర్మించడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. అయినా బాధ్యతారహితంగా వ్యవహరించలేదు వారు. అటువంటి రంగం భ్రష్టు పట్టిపోతోందే అని విచారం.

  ఈ చర్చలో పాల్గొన్నవారందరికీ 🙏.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s