నాకు ఒకే లక్ష్యం ఉండేది చిన్నప్పుడు. బీకామ్ చదవటం, బ్యాంకు లో క్లర్క్ పోస్టు తెచ్చుకోవడం. పదవ తరగతి ఉత్తీర్ణం కాగానే ఇంటర్మీడియట్ కి దరఖాస్తులు పెట్టుకోవడం మొదలు పెట్టాను. సెయింట్ ఆన్స్ లోనో, సెయింట్ ఫ్రాన్సిస్ లోనో CEC గ్రూప్ లో చేరిపోదాం అని నిర్ణయించేసుకున్నాను. అదే విషయం మా నాన్నతో చెప్పాను. సరే అనేసారు. ‘ఓ పని చేయి ఎందుకైనా మంచిది. ఇంటి దగ్గరే కదా, రెడ్డి కాలేజీ లో కూడా ఓ దరఖాస్తు పడేయి’ అన్నారు. ‘CECతో పాటు MPC కూడా పెట్టు’ అన్నారు. సరే ఎక్కడా రాకపోతే రెడ్డి కాలేజీ ఉంటుంది అనుకుని పెట్టేసాను. తీరా సెయింట్ ఫ్రాన్సిస్ లో రాలేదు. జీవితం లో చాలా కోల్పోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను. సెయింట్ ఆన్స్ లో అనుకున్నట్లే సీటు వచ్చేసింది. చేరిపోవడం తరువాయి అనుకుంటున్న సమయం లో రెడ్డి కాలేజీ లిస్ట్ చూసి రమ్మన్నారు. MPC లో పేరు లేదు. హమ్మయ్య అని అనుకుంటుంటే, మా నాన్న అమ్మని పిలిచి రెడ్డి కాలేజీ లో ఒక లెక్చరర్ పేరు చెప్పి, ‘ఆవిడకి దీని సైన్స్, లెక్కల లో మార్కులు చెప్పి MPC లో సీటు ఇస్తారేమో కనుక్కో’ అనేసారు. పరిస్థితి తారుమారు అయిపోతుంటే భయం వేసింది. అయినా కొంచం ధైర్యం గానే ‘MPC లో చేరను’ అని తేల్చి చెప్పేసాను. మా అక్క క్లాసుల మీద క్లాసులు పీకేసింది. మా నాన్న మాటే వినదల్చుకోలేదు ఇదెంతలే అనుకున్నా!! మా ఇంటి క్రింద ఉండే లెక్చరర్ ఒకావిడ బయటకి వెళ్తుంటే కనిపించి ఏ గ్రూప్ అని అడిగి చెప్పగానే, నాకు క్లాసు పీకింది ‘ ఈ రోజుల్లో CEC ఏంటమ్మా, MPC తీసుకుని ఇంజనీర్ అవ్వు ‘ అని. చెప్పింది లెక్చరర్ కదా. కొంచం ఆలోచన మొదలయింది. నాన్న నెమ్మదిగా ఒక్కటే చెప్పారు ‘MPC తీసుకో. రెండేళ్ళు చదువు. నచ్చకపోతే డిగ్రీ లో బీకామ్ చేరు’ అని. ఇదేదో బానే ఉంది అన్పించింది. అమ్మ వెళ్ళటం ఆ లెక్చరర్ తో మాట్లాడటం, రెడ్డి కాలేజీ లో చేర్పించడం జరిగిపోయింది.
Agrwal classes నుంచి IIT material తెప్పించుకోమన్నారు. ‘ఉట్టికెక్కలేనమ్మ’ అన్న సామెత గుర్తొచ్చింది. వాళ్ళు పదవ తరగతి మార్కుల బట్టి material పంపుతారు. నాకు ఎప్పుడు పంపాలీ అనుకున్నా. నా సైన్స్, లెక్కల మార్కులు నచ్చాయి కాబట్టి పంపేస్తున్నాం అంటూ ఉత్తరం పంపారు వాళ్ళు. మొదటి సంవత్సరం ఇప్పటి పిల్లల్లా 900 తెచ్చుకోలేదు కానీ ఒక మాదిరి గా బానే వచ్చాయి. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం. విద్యానగర్ లో TRT quarters లో ఉండే IIT రామయ్య గారింటికి తీసుకెళ్లారు. ఆయన రెండవ సంవత్సరం లో తీసుకోవడం అసలు కుదరదు అని ఖచ్చితంగా చెప్పారు. అది తల్చుకుంటే అనిపిస్తుంటుంది, మా నాన్నగారు నా మీద మరీ ఆశలు పెట్టుకున్నారేమో అని 🙂 ‘ఒకసారి EAMCET కోచింగ్ కి వెళ్ళిరా, వస్తే వస్తుంది లేకపోతే లేదు’ అంటూ శెట్టి ట్యూషన్ లో చేర్పించేసారు. తెలీకుండా ఆ ఏడాది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను.
అప్పట్లో EAMCET ఒక్కొక్క యూనివర్సిటీ వారు నిర్వహించేవారు. ఆ ఏడాది REC వరంగల్ వారు నిర్వహించారు. దరఖాస్తు పెట్టాక acknowledgement కార్డు రాలేదు. మళ్ళీ ఏడుపు మొదలు !! మా తమ్ముడిని, నన్ను పిలిచి వరంగల్ REC కి ఎలా వెళ్లాలో ఒక map వేసి చూపించి, ఎవరిని కలవాలో చెప్పారు. ఒక రోజు పొద్దున్నే కృష్ణా ఎక్సప్రెస్ లో కాజీపేట లో దిగి ఆటోలో REC క్యాంపస్ కి వెళ్ళాము. ఆయన పేరు గుర్తు లేదు కానీ, ఆయన నాన్న పేరు చెప్పగానే మమ్మల్ని కూర్చోబెట్టి, అన్ని వేల దరఖాస్తులలో ఎలా వెతికించారో తెలీదు కానీ acknowledgement కార్డు ఇచ్చారు. వాళ్లింట్లోనే భోజనం కూడా పెట్టారు పాపం !! మళ్ళీఅదే రోజు సాయంకాలానికి ఈస్ట్ కోస్ట్ లో సికింద్రాబాద్ వచ్చేసాం. ఆ ప్రయాణం తలుచుకుంటే నాకు, మా తమ్ముడికి – ఒక్కరమే ట్రైన్లో తెలీని ఊరు వెళ్లడం కనుక్కోడం – ఒక adventure గా అన్పిస్తుంది. ఆ రోజే మా తమ్ముడు ఎలాగైనా REC లో చదవాలి అని నిశ్చయించేసుకున్నాడు కూడా !! నేను సాధించలేదు కానీ, వాడు సాధించేసాడు!! కాకపోతే వరంగల్ కాదు !! ఇక అది వేరే విషయం.
ఇక అసలు ఘట్టం !! EAMCET రోజు రానే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెంటర్ !! మా నాన్నే స్వయంగా తీసుకెళ్లి దిగబెట్టారు. కొన్ని రోజులకి ఫలితాలు రానే వచ్చాయి!! నా నెంబర్ పక్కన నా ర్యాంకు. అది చూసి ఇంట్లో అందరూ ఎగిరిగెంతులే !! ఏదో స్టేట్ ఫస్ట్ వచ్చాననుకుంటున్నారేమో !! కాదండీ !! నా ర్యాంకు 2680!! దానికే అంత సంబరం అంటారా 🙂 CEC తీసుకుందామనుకున్న నాకు ఇలాంటి ర్యాంకు రావడం వింతల్లో వింతే కదా !! మొత్తానికి అలా ఇంజనీర్ని అయ్యానండీ.
నాకొచ్చిన ర్యాంకు కి REC ఏం వస్తుందిలే అన్ని నేను అసలు అప్లై చేయలేదు. ‘ఒక్కోసారి ఉన్నటుండి గవర్నమెంట్ వాళ్ళు ladies quota అని చెప్తే ఏం చేస్తావు. ఓ అప్లికేషన్ పడేయటంలో తప్పులేదు కదా ‘ అని తనే స్వయంగా వరంగల్ కి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు. నిజంగానే ఆయన చెప్పినట్లు, నా ఇంజనీరింగ్ అయిపోగానే , ladies quota పెట్టారు 🙂
ఈ కథంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్న నా పదవతరగతి మార్కులని బట్టి నేను ఏం చదవగలనో తనే నిర్ణయించేసుకుని మనసులో సంకల్పం చేసేసుకున్నారు ‘ ఈ పిల్లని ఇంజనీరింగ్ చదివించేయాలని’ . బలవంతంగా రుద్దకుండా, ఎక్కడా కోపతాపాలకు తావి లేకుండా తాను చేయాల్సిందంతా సైలెంట్ గా చేసేసారు. మా పిల్లలతో కూడా ఇదే పద్ధతి పాటిద్దామనే ఎంతో ప్రయత్నిస్తుంటాను నేను.
ఇలా ప్రతి విషయంలో తెలీకుండా మాకు ఎన్నో పాఠాలు నేర్పేసారు మా నాన్న గారు. ఇప్పుడు మా పిల్లలకి నేర్పిస్తున్నారు 🙂 !!
మీ తండ్రి గారు అసాధ్యులండోయ్. నెప్పి తెలియకుండా మిమ్మల్ని ఇంజనీర్ చేసేశారు. వారి చాకచక్యాన్ని మెచ్చుకోవాలి 👏.
మెచ్చుకోండిమెచ్చుకోండి
విన్నకోట వారు అన్నట్టు మీ నాన్న గారు అసాధ్యులే. మీరు కూడ హనుమంతుళ్ల మీ బలం గుర్తెరగలేదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలు అన్యగామి గారు
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలు విన్నకోట గారు
మెచ్చుకోండిమెచ్చుకోండి