తోబుట్టువులు

కౌముది పత్రిక  లో  జూన్ కథా కౌముది లో వచ్చిన  పొత్తూరి విజయలక్ష్మి గారి కథ  ‘ భాస్కర్ కి ఒక ఉత్తరం’ చదివాను.

అటువంటి కథలు చదివినపుడు కథ నచ్చింది, అందులో ఏదైనా సందేశం ఉంది అనుకుంటే మావాళ్ళని అందర్నీ కూర్చోబెట్టి ‘Story time’ అని చెప్పి చదివేస్తాను. ఈ కథ కూడా ఇలాగే   చదివాకా, బ్లాగులో దీని గురించి చెప్పచ్చు కదా అన్న మావారు  ఇచ్చిన ఆలోచన తో వచ్చినదే ఈ టపా.

కథ మనసుకి ఎంతగా హత్తుకుందీ  అంటే, చివరి భాగం చదువుతుంటే తెలియకుండా కన్నుల్లో నీరు వచ్చేసింది. కథా వస్తువు అందరి ఇళ్ళల్లో  జరిగే మాములు విషయాలే. ఆ ‘మాములు’ విషయాన్నే అంత  బాగా అక్షరరూపంలో పెట్టడం అటువంటి చేయి తిరిగిన రచయిత్రులకే సాధ్యం!!  కథ చదవటం మొదలు పెట్టగానే, ఎవరో ప్రేమికురాలు వ్రాసిన ఉత్తరమేమో  అనుకుంటాము.  ఒక అక్క తమ్ముడికి వ్రాసిన ఉత్తరం. ఈ రోజుల్లో తోడబుట్టిన వారితో, చిన్న చిన్న విషయాలకు  అహంకారంతో బంధాలు ఎలా పాడుచేసుకుంటున్నామో కళ్ళకి కట్టినట్లు చెప్పారు రచయిత్రి.  చదవగానే నాకు తెలిసిన కొన్నిజీవితాలు గుర్తు వచ్చి text  to life  కి అన్వయించుకున్నాను. 

story1

story2

రచయిత్రి చెప్పిన ఒక మాట బాగా నచ్చింది  ‘ దుర్యోధనుడు శకుని చెప్పుడు మాటలు విన్నాడు కానీ భరతుడు కైక మాట వినలేదు గా ‘ అని. రామాయణం, భారతం లేకుండా ఏ నీతి కూడా చెప్పలేమేమో అన్పించింది ఈ వాక్యం చదివాకా.  అన్నదమ్ముల విషయంలో రామలక్ష్మణుల్లా ఉండమని దీవిస్తారు. కానీ  ఆలోచిస్తే రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ  ఒక్క తల్లి బిడ్డలు కాదు. రాముడు ఎప్పుడూ  ధర్మం వీడలేదు.  అదే వాలిసుగ్రీవులయితే  కవలపిల్లలు. కానీ  ధర్మం మర్చిపోయిన వాడు వాలి. అన్న అంటే భయపడి పారిపోయి దాక్కున్న వాడు సుగ్రీవుడు. ఇంకో ఉదాహరణ రావణాసురుడు, విభీషణుడు.  ఇన్ని  ఉదాహరణలు చూపించి  అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం. తోబుట్టువుల ఐకమత్యానికి ఇంకో ఉదాహరణ పాండవులు. పెద్దవాడు ధర్మస్వరూపుడు కావాలి, ధర్మస్వరూపుడు అయితే మిగిలిన వారిని ధర్మం తో నడిపిస్తాడు అనుకున్నాడు పాండురాజు. అందుకే ముందు ధర్మరాజు పుట్టాడు.  భారతంలో కొన్ని ఘట్టాలలో యుధిష్ఠరుడి ధర్మం తమ్ములందరినీ కాపాడింది. భీముడికి ఎంత బలం ఉన్నా అన్నయ్య మాట విని చాలా సార్లు కోపాన్ని నిగ్రహించుకున్నాడు. 

చాగంటి గారు కూడా  ఈవీడియో లో అన్నదమ్ములఅనుబంధం గురించి  ఎంత బాగా చెప్పారో చూడండి :

https://www.youtube.com/watch?v=Xv2HAXBQyUo

ఒక్క తల్లికి పుట్టిన పిల్లలు  చిన్నప్పటినుంచీ ఒకే చోట తింటూ తిరుగుతూ పెరిగినవారు బద్ధశత్రువులు గా మారిపోతున్నారు. అందరూ  అని చెప్పను. కొందరు అని చెప్పచ్చు. అసూయాహంకారాలు ఒక ముఖ్య కారణాలు అనిపిస్తుంది నాకైతే. తోడపుట్టిన వారితోటే  వైరం పెట్టుకున్నవారు, ఇక ఎవరితో కలసిమెలసి ఉండగలరు?  తోబుట్టువులతో బద్ధవైరం పెంచుకున్న వారు , ఎన్ని విషతుల్యమైన విషయాలని  బోధిస్తున్నారో ఆలోచించండి. మేనత్త, మేనమామ, బాబాయి, పిన్ని ఇటువంటి బంధుత్వాల మధ్య పెరిగితే ఆ పిల్లలు అదే తీపితనాన్ని ఇంకో తరానికి అందించగలరు. తోబుట్టువులతో కలిసి ఉంటేనే కదా అవసాన దశలో ఉన్న తల్లితండ్రుల్ని సుఖపెట్టగలరు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి సాధించినట్లు ? వయసుతో  పెరుగుతున్నకొద్దీ  రాగద్వేషాలు తగ్గాలి కదా. వయసుతో పాటు అవీ పెరిగితే ఇక మనిషికి జంతువుకి తేడా ఏంటి?

అన్నయ్య చీర పెట్టకపోతే కోపం తెచ్చుకోనక్కరలేదు. చెల్లికి చీర పెట్టడం వీలు అవ్వకపోతే వీలు కాలేదని ఆ చెల్లికే చెప్పచ్చు. చిన్న చిన్న విషయాలే చిలికి గాలి వానలు చేసుకుంటారు.  ఇక ఆస్తుల కోసం  జరిగే cold war ల సంగతులు చెప్పనే అక్కరలేదు. ఎంత నీచానికి దిగజారిపోతారో చెప్పనక్కరలేదు!!

‘కలిసిమెలిసి ఉండటం చెప్పినంత సులువు కాదు, జీవిత భాగస్వామి మీద కూడా ఆధారపడి ఉంటుంది’ అని అనచ్చు. వచ్చిన జీవిత భాగస్వామి మరీ ఇక psycho personality అయితే చెప్పలేం కానీ, మన బంగారం మంచిదయితే  ఆ స్వభావంతో వేరే వారిని మార్చటం పెద్ద కష్టతరమేమీ కాదు.  జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారుంటారు కానీ ఒకే తోబుట్టువుని రెండుసార్లు పొందిన వాళ్లుండరు  కదా. ఈ జన్మకి వాళ్లే  తోబుట్టువులు!!

ఈ కథ ప్రతి ఒక్కరూ  చదివి తీరవలసిన కథ.  ఈ  వీడియో కూడా తప్పకుండా చూడవలసిన వీడియో!!

తోబుట్టువులనే కాదు కానీ, ఎవరి విషయం లో అయినా సరే, కోపాన్ని కసిగా మార్చుకోకూడదు.  జీవితం లో ఎప్పుడూ చిన్న చిన్న తీపి గుర్తులే మనల్ని ముందుకి నడిపించాలి కానీ చేదు జ్ఞాపకాలు కాదు.

 

 

4 thoughts on “తోబుట్టువులు”

 1. మీరు చెప్పినది, చాగంటి వారు చెప్పినది విలువైన మాటలు. అయితే నేను చూసినది ఇటువంటి పొరపొచ్చాలు సాధారణంగా వృద్ధాప్యం సమీపిస్తున్నప్పుడు సర్దుకుంటాయి. వేడి, దూకుడు, ఓపిక తగ్గడంతో, పిల్లలు దూరప్రాంతాలలో ఉండడంతో తోబుట్టువుల విలువ ముఖ్యం అని తెలిసివస్తుంది, అప్పుడు ఆప్యాయతలు మళ్ళీ మొదలవుతాయి. ఖచ్చితంగా చెప్పలేం కానీ ఈలోగా కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగినా, దురదృష్టకర సంఘటనలు జరిగినా విభేదాలు కొంత తగ్గుముఖం పట్టచ్చు.

  మీరేమనుకున్నా సరే చంద్రిక గారు, అన్నిటికంటే ముఖ్యపాత్ర పోషించేది జీవిత భాగస్వామి అని చెప్పక తప్పదు. తన సహకారమే లేకపోతే బంధుత్వాలు నిలబెట్టుకోవడం కష్టం. సైకో కాకపోయినా మరీ మొండిగా వ్యవహరిస్తుంటే తనని మార్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఫలించవు. అటువంటి పరిస్ధితులలో పరువు బజారున పడేసుకోవడం ఇష్టం లేకా, పిల్లల కోసమూ మగవాడు తనే సమాధాన పడిపోతాడు. తన తోబుట్టువులతో రాకపోకలు చెడతాయి. మరోటి గమనించారా, తతిమ్మా చుట్టాలతో బాగానే ఉంటారు అటువంటి భాగస్వామి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. మీ వ్యాఖ్యలు భలే ప్రోత్సాహంగా ఉంటాయండీ. ‘అన్నిటికంటే ముఖ్యపాత్ర పోషించేది జీవిత భాగస్వామి అని చెప్పక తప్పదు’ – నిజమే. జెనెరలైజ్ చేయను కానీ నేను చూసిన కొన్ని ఉదాహరణలు మాత్రం పోట్లాడుకున్నది డబ్బు, జీవిత భాగస్వామి వలన కాదు. కేవలం అహంకారం వలన !!ఇందులో ఒక్కోసారి తల్లితండ్రుల పాత్ర కూడా ఉండవచ్చు. కొందరు వారు వారి తోబుట్టువులతో బాగానే ఉంటారు. వారి భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరూ శత్రువులే. ‘మన’ లో ‘మ’ తీసేసి ‘న’ మాత్రమే ఉంచుకుంటున్నాము రోజు రోజుకి. అదే బాధ !!

   మెచ్చుకోండి

 2. ఇందాకటి నా వ్యాఖ్యలో చెబుదామనుకుని మర్చిపోయాను. మీరు పైన story time అన్నట్లుగానే మా కోడలు family time అంటుంటుంది. రూల్స్ ఏమిటంటే – ఆ టైములో కుటుంబ సభ్యులందరూ కలిసి హాల్లో కూర్చోవాలి, కలిసి మాట్లాడుకోవాలి; టీవీ, లాప్టాపులు, ఐపాడ్లు ఆ టైములో వాడకూడదు; అలాగే ఆ టైములో సెల్ ఫోన్ లో వీడియోలు చూడకూడదు. బాగుంది కదా.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: