మా ఇంట శరన్నవరాత్రులు

చిన్నప్పుడు చందమామ లో ఓ కథ చదివాను. ఒకతను పొలం లో గుమ్మడి కాయలు పండిస్తాడు. పిందెలు వేసినప్పటినుంచీ ఒక్కొక్క కాయ కి ఒక్కొక్క పేరు పెట్టుకుని పిలిచుకుంటూ ఉంటాడు. ఆ కాయలు కాపుకి వస్తాయి.  ఎవరో దొంగిలించి  బజారులో అమ్ముతుంటారు. ఆ రైతు వెళ్ళి అవి తనవే అని చెప్పినా బజారులో ఎవరూ నమ్మరు. ఒక్కొక్క కాయని పేరు పెట్టి పిలుస్తూ ఏడుస్తుంటాడు . అందరూ పిచ్చివాడనుకుని నవ్వుతారు. కానీ న్యాయాధికారి అతనిని నమ్మి న్యాయం జరిగేలా చూస్తాడు.  

ప్రతి ఏడాది వసంత ఋతువు రాగానే కొన్ని విత్తనాలు వేసి, కొన్నిచిన్ని మొక్కలు స్వయంగా నా  చేతులతో పెట్టి చిన్ని తోట చూసుకుని రోజు మురిసిపోతుంటాను.

IMG_8975

IMG_8920

పూజకోసం పూలు కోయడానికి వెళ్ళగానే  ‘దయలేని వారు ఆడవారు’  అంటూ పూలు ఏడుస్తున్నట్లే అనిపిస్తుంది. పది కోసేద్దామని వెళ్లి రాలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓ రెండుపూలు కోసుకుని వచ్చేస్తాను. ఒక్కోసారి కారు ఆపుకుని ఇంట్లోకి వెళ్తుంటే సీతాకోకచిలుకలు ఎగురుతూ  కనులవిందు చేస్తూ, నన్ను అక్కడే కూర్చోబెట్టేస్తాయి .

ఇది ‘మూణ్ణెల్ల’ ముచ్చటే  అని తెల్సినా, పైన చెప్పిన  చందమామ కథలో చెప్పిన రైతులాగాప్రతి చెట్టుతో అనుబంధం పెంచేసుకుంటాను. ఇక నవంబర్  నెలలో అన్నిటినీ  మూట కట్టి వాకిట్లో పెట్టేస్తుంటే, ఒక కఠోర జీవన సత్యం అవగతమవుతూ, ఎంత బాధేస్తుందో … మాటలలో చెప్పలేను…

ఆ అందాల వర్ణననలు నాకు వ్రాతల్లో అంత అందంగా చెప్పడం రాదు.  ఈ శరన్నవరాత్రులలో,  మా ఇంటి ముందు ఈ రూపంలో కొలువైయున్న  ఆ లలితా త్రిపుర సుందరీ  దేవిని ఇలా బ్లాగులోకానికి పంచుకుంటూ ….. దసరా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ….  శరచ్చంద్రిక

IMG_3566

21729030_1566355956790462_2693370930815001919_o

IMG_2697

 

బ్లాగర్లందరికీ విన్నపం

మొన్న కష్టేఫలి గారు ఏవో సామెతలు చెబుతూ టపా పెట్టినట్లున్నారు (నేను చదవలేదు). అందులో ఒక సామెత అభ్యంతరకరంగా అనిపించినట్లుంది. శ్యామలీయం గారు తొలగించమన్నారు. కష్టేఫలి గారు తొలగించారు. ఆ గొడవేదో అంతవరకూ అయిపోయింది. ఆ విషయాన్నీ అంతటితో వదిలేస్తే బావుంటుంది. దాన్ని పెద్ద రాద్ధాంత విషయం గా చిత్రీకరిస్తూ ‘రమ్యంగా కుటీరాన ….. ’ బ్లాగరు నీహారిక గారు నిన్న’శ్యామలీయం గారికి నీహారిక వ్రాయునది… ‘ అంటూ ఒక టపా పెట్టారు. అక్కడ నీహారిక గారివి కొన్ని వ్యాఖ్యలు చూసాను.

శ్యామలీయం గారు,
దీనిగురించి మీరు మీ సమయాన్ని వృధా చేయనవసరం లేదు.క్షమించమని చెప్పేస్తే శిక్ష ఉండదా ? తెలిసే చేసేనని మరీ చెపుతున్నారు, తెలిసి చేస్తే శిక్షలుండవా ? జగన్, చంద్రబాబు, అద్వానీ కూడా (తెలిసే)చేసాను క్షమించమంటే క్షమించి వదిలి పెట్టేస్తారా ? చేసిన పాపం చెపితే పోతుందా ? శిక్షలు అక్ఖర్లేదా ?

“క్షమించమని వేడుకున్నారు గాబట్టి శిక్ష తగ్గిస్తాను. ఒక నెలరోజులపాటు ఆయన బ్లాగింగ్ మానుకోవాలి.ఫాతపోస్టుల్లో కూడా ఎవరూ వ్యాఖ్యానించడానికి వీలు కల్పించకూడదు. ఒక నెల రోజులపాటు బ్లాగింగ్ మానుకోపోయినా ఆయన బ్లాగుల్లో కామెంట్స్ ఎవరు చేసినా వారిని నేను తీవ్రంగా శిక్షార్హులుగా భావిస్తాను. ఒక మంచి వాతావరణం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి నా మద్దతు ప్రకటిస్తున్నాను. తరువాత మీఇష్టం !

ఈ శిక్ష తగ్గించడం ఏమిటి? ఆయన నెలరోజులు బ్లాగులు వ్రాయకూడదని చెప్పడం ఏమిటి? ఈవిడ ఎవరు చెప్పడానికి ? ‘ఒక నెల రోజులపాటు బ్లాగింగ్ మానుకోపోయినా ఆయన బ్లాగుల్లో కామెంట్స్ ఎవరు చేసినా వారిని నేను తీవ్రంగా శిక్షార్హులుగా భావిస్తాను.’ ఇది ప్రజాస్వామ్యమా లేక పెత్తనమా ?

నీహారిక గారు శర్మ గారిని ‘ఖర్మ’ గారు అంటూ, గోదావరి జిల్లాల్లో బ్రాహ్మణులు ‘కొబ్బరిచిప్పల బ్యాచి’ అంటూ ఎద్దేవా చేస్తారు . ఇలా ఒక సారి కాదు ఎన్నో సార్లు జరిగింది. చాలా సార్లు ఈవిడ వ్యాఖ్యలతో, టపాలలో చెప్పాల్సింది చెప్పలేకపోవడం, టపాలు ఎత్తివేయడం కూడా జరిగింది నా మటుకు నాకు. ఎవరైనా సరే విమర్శ, వ్యాఖ్య చేయవచ్చు. లేదా ఆ టపా నచ్చకపోతే వారి అభిప్రాయాలూ వారి బ్లాగులో చెప్పుకోవచ్చు. తప్పు లేదు. బ్లాగుల్లో ప్రతీ టపాని హేళన చేస్తూ ఉంటే ఉన్న నాలుగు బ్లాగులు కూడా ఉండవు కదా !!

ఏ ఒక్క బ్లాగరు, శర్మ గారిని దూషిస్తున్నా , ఒక కులాన్ని ‘కొబ్బరిచిప్పల బ్యాచి’ అంటూ ఉన్నా ఖండించకపోవడం చాలా శోచనీయం(ఈ కులం వాళ్ళు ఏమి అనరు అని నీహారిక గారికి బాగా తెల్సు). వారు పోస్టు చేసిన సామెత కంటే, ఈ వ్యక్తిగత దూషణ ( ఈ సామెత టపా రాకముందు కూడా ఈవిడ చాలా సార్లు అన్నారు ఈ మాటలు) చాలా ఖండించాల్సిన విషయము!!

ఈ రోజు శర్మ గారికి warning లు వచ్చాయి. రేపు ఇంకో బ్లాగరుకి వస్తాయి. మనకెందుకులే మన బ్లాగు మనకి ఉంటే చాలు అనుకుంటే నేనేం చెప్పలేను !! ‘ఈ సామెత ఎందుకొచ్చిదండీ’, ‘ఆ కూర ఎలా ఉంటుందండీ’ అని మనం కాలక్షేపం కోసం అడిగే ప్రశ్నలకి కబుర్లు చెప్పే శర్మ గార్లు మనకి దొరకరు !! ఆలోచించండి!!

ఆధ్యాత్మిక ఫాసిస్టులు ‘ ట ‘ బ్రాహ్మణులు

ఈమధ్యనే ఒకరు ‘వైధవ్యం’ గురించి వ్రాసిన ఒక టపా చదివాను (మాలిక లో).  ఆ ఆచారాన్ని ఖండిస్తూ వ్రాసిన వ్యాసం. ఆ ఆచారాన్ని ఖండించడం అనేది ఒప్పుకోదగ్గ విషయమే!! ఇక్కడ ఇంకో విషయం దాగుంది. ఏంటంటే ఈ దురాచారానికి  కారణం  ‘బ్రాహ్మణీయ భావజాలం’ ట.   అసలు ఈ మధ్య సమాజం లో ఏం జరిగినా దానికి కారణం ‘బ్రాహ్మణజాలం‘ ,’బ్రాహ్మణిజం’ ,‘బ్రాహ్మణత్వం’  – అలా  వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.  ఈ ‘technical terms’ ఎందుకు వాడతారంటే,  ఎప్పుడో ( మరి ఏ యుగమో , ఏ కాలమో నాకు తెలీదు)

 • బ్రాహ్మణులే కులాలని/వర్ణాలని విభజించారు!!  
 • వేదాలన్నీ  బ్రాహ్మణులే  కంట్రోల్ లో   పెట్టుకున్నారు!!
 • బ్రాహ్మణులే  అధర్మాలన్నీ  చెప్పారు!!.
 • బ్రాహ్మణులే   పీఠాధిపత్యం తీసుకుంటారు !! సంగీతం/నాట్యం లాంటి కళలు  బ్రాహ్మణులకే సొంతం!!
 • బ్రాహ్మణుడు తప్ప ఇంకెవరైనా వేదం వింటే చెవుల్లో సీసం పోయించమన్నారు!!

(ఇంతేనా  బ్రాహ్మణులు చేసిన పనులు ఏమైనా మర్చిపోయానా ?)

అందుకని ఆ  technical terms వాడతారు అని నాకు కొంచెం  కొంచెం గా అర్ధమయ్యింది. …

సరే ఇటువంటి వారు చెప్పినట్లే –  బ్రాహ్మణుడు అన్నీ కులాలలో తానే గొప్ప అనుకున్నాడు అనుకుందాం !!  బ్రాహ్మణులే నేటి సమాజంలో అన్నీ దుస్థితులకి  కారణం అనే అనుకుందాం.  ఈ క్రింద వ్రాసినదంతా చదివి చెప్పండి ఆ మాట అనటం ఎంత వరకు సబబు అని !!

నాకు తెలిసిన ‘కొన్ని’  ఉదాహరణలు ఇవి:

 • నాలుగు శునకాలతో  ఎదురుపడ్డ  ఛండాలుడిని పరమ శివుడిగా గుర్తించిన ఆది శంకరాచార్యుల వారు ఒక బ్రాహ్మణుడు!!
 • చంద్రగుప్తుడిని చక్రవర్తిని చేసి భారతావనిని ఒక్కటి  చేసిన  చాణుక్యుడు బ్రాహ్మణుడే.  చాణుక్యడు లేకపోతే చంద్రగుప్తుడు లేడు. చంద్రగుప్తుడు లేకపోతే  బింబిసారుడు లేడు .  బింబిసారుడు లేకపోతే  బౌద్ధమతానికి పెద్ద పీట  వేసిన అశోకుడు ఉండేవాడు కాదు. ‘అశోకుడు చెట్లు నాటించెను’ అని మనం చిన్నప్పుడు చదువుకొని ఉండేవాళ్ళం కాదు!!
 • రాముడెవరు ? ఒక క్షత్రియుడు. నిధి కంటే ఆ శ్రీరాముని సన్నిధి చాలా సుఖమని నాదోపాస చేసిన త్యాగరాజు ఒక బ్రాహ్మణుడు.  నగలు  చేయించినందుకు కారాగారం లో బంధింపబడినా కూడా శ్రీరామచంద్రుడిని తలుచుకొని కీర్తించినదీ ఒక బ్రాహ్మణుడే. . ఆ కీర్తనలకి సంగీతం బాణీ  కట్టి రేడియో లో వినిపించినదీ  ఒక  బ్రాహ్మణుడే. ఆ శ్రీరాముడి మీద కల్పవృక్షం వ్రాసినది బ్రాహ్మణుడే.
 • మహాభారతం లో  పాండవులు ఎవరు ? క్షత్రియులు. మరి తన సొంత కొడుకుని( ఆ కొడుక్కి ఇవ్వడానికి గుక్కెడు పాలు కూడా లేవు)  కాకుండా క్షత్రియుడైన అర్జునుడిని ధనుర్విద్యా పారంగతుడను  చేసింది ఒక బ్రాహ్మణుడే. ఆ భారతాన్ని తెనిగించిన నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగ్గడ  బ్రాహ్మణులే!!
 • మనకి అల్లరి చేసే పిల్లలని చూస్తే ఎవరు గుర్తొస్తారు ? బుజ్జి   శ్రీకృష్ణుడు.  పిల్లలని బుజ్జగించి లాలించే  తల్లి ని చూస్తే ఎవరు గుర్తొస్తారు ? యశోదా  దేవి. మరి  శ్రీకృష్ణుడు ఎవరు ? ఆ కృష్ణుడిని లాలించిన యశోదా  దేవి ఎవరు ? యాదవులు. ఆ కృష్ణుడినిపై  అంత అందంగా భాగవతాన్ని తెనిగించిన  పోతనామాత్యుడు బ్రాహ్మణుడు.  ‘ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు’ ,’ ‘పిలువరే  కృష్ణునీ ‘ అంటూ గానం  చేసినది ఒక బ్రాహ్మణుడు.
 • గుడిలో భగవంతుడి ఎదుట కోర్టు కేసు గురించి  ఆలోచిస్తున్న రాణి రాసమణి చెంప పగులగొట్టి భగవధ్యానంలో ఉండమని చెప్పిన రామకృష్ణ పరమహంస కూడా బ్రాహ్మణుడే.  ‘సోదర సోదరీ మణులారా ‘ అంటూ ప్రపంచానికి భారత దేశం ఉనికి చాటి చెప్పిన భారత వీర నరేంద్రం, వివేకానందుడు ఒక బ్రాహ్మణుడే!!
 • తన కులం లో వారే కదా అని వదిలి పెట్టకుండా ‘తాంబూలాలిచ్చేసానిక తన్నుకు చావండి’ అంటూ ఒక సాంఘిక దురాచారానికి  కారకులైన  అగ్నిహోత్రావధాని, లుబ్దావధానుల గురించి తన రాతల ద్వారా చెప్పింది ఒక బ్రాహ్మణుడే!!
 • హిందువా ముస్లిమా అని అర్ధం కాని  వారికి  సాయి దైవమే  అని తెలియజేస్తూ బాబా జీవిత చరిత్ర  వ్రాసిన హేమాద్రి పంత్ , అన్నా సాహెబ్ ధబోల్కర్  ఒక బ్రాహ్మణుడే!!
 • ‘అపరంజి మదనుడే’ అంటూ  ఏసుక్రీస్తుని , ‘శంకరా నాద శరీరాపరా ‘  అంటూ శంకరుడిని  స్తుతి చేసిన వేటూరి ఒక బ్రాహ్మణుడే.
 • నారదుడు వాల్మీకికి వర్ణించిన  శ్రీరామచంద్రుడిని,  ఈ రోజున తన మాటలతో కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ  42 రోజులు రామాయణ ప్రవచనం & పోతన గారు చూసిన చిన్ని కృష్ణుడిని ఒక్కసారి మన కళ్ళెదురుగా నిల్చోబెడుతూ భాగవత ప్రవచనాలు  చేసిందీ/చేస్తున్నదీ  ఒక  బ్రాహ్మణుడే.

మరి కులాలని తనే  విభజిస్తే, రాముడిని ఎందుకు పూజించమన్నాడు ? బ్రాహ్మణుడే భగవద్గీత చెప్పి ఉండవచ్చు గా ? శ్రీ కృష్ణుడు ఎందుకు చెప్పాలి ? ఆ కృష్ణుడినే  ఎందుకు పూజించాలి ? దశావతారాల్లో బ్రాహ్మణులైన వామనుడు, పరశురాముడుని  ఎందుకు పూజించము? రామావతారాన్ని, కృష్ణావతారాన్ని  కాకుండా  వామనావతారాన్ని, పరశురామావతారాన్ని పూజించమని ఏ బ్రాహ్మణుడు కూడా ఎందుకు చెప్పలేదు ?  ప్రతి ప్రవచనాకారుడి నోటా రాముడు, కృష్ణుడే ఉంటారు మరి !!

రావణాసురుడు బ్రాహ్మణుడు. వేదం చదువుకున్నవాడు. అతడిని చంపితే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది. అయినా సరే,  ధర్మాన్ని విడిచిపెట్టాడు కనుక  వదలద్దు  చంపేయమని  రాముడికి అస్త్రాలు ఇచ్చి మరీ చెప్పారు బ్రాహ్మణులు !!

ఒక బ్రాహ్మణుడు చెప్పినది ఏంటి  – ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించమనటం.  అది తప్పా?  ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పడం. అది  తప్పా? మంచిని మంచిగా చూడమని -చెడుని చెడుగా చూడమని బోధించడం. అది తప్పా?  ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించు అని చెప్పడం. అది తప్పా?   

ఏ రాజు అయినా బ్రాహ్మణుడుని సలహాదారుగా, గురువుగా, మంత్రి గా పెట్టుకునేవాడు. ఎందుకు ? వారు చెప్పిన దానిలో ‘మంచి’ అనేది ఉంది!!  ఆ బ్రాహ్మణుడికి ‘నిజాయితీ’ ఉంది
!! ఏ  కులగురువో అయితే  ఆకులు , అలములు తిని బ్రతుకుతుంటాడు.  డబ్బు, పదవీ వ్యామోహం అనేదే లేదు! !  కాబట్టే ఏ రాజయినా కూడా  బ్రాహ్మణుడి మాటలు విన్నాడు. నచ్చకపోతే ముందు ఆ బ్రాహ్మణుడి మీదే తన క్షత్రియ బలం & శక్తి  ఉపయోగించేవాడుగా !! 

ఒక సంస్థ చక్కగా నడుస్తోంది అంటే అందరూ మేనేజర్ లు ఉండరు గా !!  మేనేజర్  లకి సెక్రెటరీలు ఉంటారు.  మేనేజర్ క్రింద క్లర్క్ లు ఉంటారు. ఏ ఒక్కరు లేకపోయినా సంస్థలో  పని జరగదు.అన్ని సంస్థల్లోకి తన సంస్థ బాగుండాలంటే  మేనేజర్  ఎప్పుడూ  ఎత్తు పైన ఎత్తు వేస్తూనే ఉండాలి.  దానికి నమ్మకస్తులైన ఉద్యోగులు ఉండాలి.  అందరికీ  మంచి వేతనాలు ఉంటేనే సంస్థలో ఉంటారు. లేకపోతే ఉద్యమం మొదలవుతుంది.

మరి భారత సమాజం కూడా అన్ని కులాలు/వర్ణాలతో కలిసిమెలిసి ఒక సంస్థలాగే ఉండేది  కాబట్టే  దేశం సుభిక్షంగా ఉండేది.  అందుకే ఎన్నో దాడులకు కూడా గురయ్యింది. ఇది భారత దేశం లో ఈ రోజుకి కూడా ఎంత మందికి అర్ధమవుతుందో కానీ,  యూరోపియన్లకి మాత్రం బాగా అర్ధమయ్యింది. అందుకనే భారత దేశపు వ్యవస్థ ని కూకటి వేళ్ళతో సహా పీకివేశారు.  ఇంటిలో శుభకార్యం అయితే ఇంటి రజకుడు, క్షురకుడు ఎంత ముఖ్యమో చూసిన తరం మనది !!  ఆ విధంగా సమాజం లో ప్రతిఒక్కరూ  ముఖ్యమే అని చెప్పిన భారత సమాజం  గురించి ఎవరో పరాయిదేశం వారు  చెప్పనక్కరలేదు కదా !! అయినా సరే, మనం బుర్రపెట్టి ఎందుకు ఆలోచిస్తాము ?  ఒక తెల్లదొర చెప్పగానే  నమ్మేస్తాము!! తోటిసహోదరులని గేలిచేస్తాం !!  

కొందరి మాటలు చూడండి !! మరి ఎటువంటి సంతృప్తి వస్తుందో వీరికి అర్ధం కాదు !!

“పరశురాముడు క్షత్రియులని చంపాడు. విశ్వామిత్రుడు అంటే క్షత్రియుడు కాబట్టి దేవతలకి ఇష్టం లేదు/ వశిష్ఠుడు  బ్రాహ్మణుడు కాబట్టి అంటే బాగా ఇష్టం.  అందుకే విశ్వామిత్రుడుని తపస్సు చేసుకోనివ్వలేదు” . పురాణాన్ని వక్రీకరించడం కాకపోతే అర్ధం ఉందా ఇలాంటి మాటలకి ? కామక్రోధాలని జయించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడి లో కన్పించేది  ‘క్షత్రియ కులం’,  ఎంత కష్టంలో  కూడా క్రోధాన్ని అదుపులో పెట్టుకున్న వశిష్ఠుడిలో కన్పించింది ‘బ్రాహ్మణ కులం’ !! ఒక మానవుడు ఎంతో నేర్చుకోవాల్సిన కథలో కులాలు తప్ప ఏవీ  కనిపించవా ?

ఒక బ్రాహ్మణుడు, ‘బ్రాహ్మణుడు’ అనిపించుకోవాలి  అంటే , బ్రాహ్మణ  కులంలో పుట్టగానే సరికాదు. ధర్మం ప్రకారం ఆ కర్మలు కూడా ఆచరించాలి!!అందుకే అసలు వేదం చదువుకొనని  వాడు బ్రాహ్మణుడే కాదు అని కూడా చెప్పారుగా శాస్త్రాలలో మరి!! మరి ఈ రోజున ఇది ఎంతవరకూ అనువర్తిస్తుంది? కేవలం బ్రాహ్మణ వృత్తిలోనే కాక ఎన్నో రకాల వృత్తులలో ఉన్నారు బ్రాహ్మలు. మేము మధుర వెళ్తే జంధ్యం వేసుకుని, పిలక పెట్టుకుని ఒక బ్రాహ్మణ పిల్లవాడు మాకు గైడ్ లాగా వచ్చాడు. గైడ్ గా ఎంత అడిగాడో అంతే ఇచ్చాము కానీ జంధ్యం వేసుకున్నాడని అగ్రహారాలు ఇవ్వలేదే ?  ఈ మధ్య  ఒక వీడియో చూసాను. కొంత మంది సులభ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్నారు . కొంత మంది రిక్షాలు తొక్కుకుంటూ బ్రతుకుతున్నారు.  మరి కొందరు పెద్ద పెద్ద కంపెనీ లలో CEO లు గా కూడా ఉన్నారు. వ్యాపారాలు కూడా చేస్తున్నారు!!పైగా ప్రతి పనికి, ఈ రోజుకి కూడా బ్రాహ్మణుడు అనేవాడు ఒక  ప్రామాణికము !!. బహుశా ఇది  బ్రాహ్మణుడి వలన ఏ ఒక్క తప్పు జరిగినా ముందు వారి కులం పేరు చెప్పి వేలు చూపించడానికేమో !!

‘పేరుకి బ్రాహ్మణుడు. కానీ లంచాలు తీసుకుంటాడు !!’

‘ ఈ రోజుల్లో బ్రాహ్మలే  మాంసం బాగా తింటున్నారు’

‘బ్రాహ్మలయి కూడా ఆచారం పాటించరు’

మన సంస్కృతిలోని ఉన్న ఆశ్చర్యపరిచే అనేక విషయాలలో వేదం ముఖ్యమైనది . వేదాలు  ఎప్పటివో, ఏనాటివో తెలియదు. కేవలం గురుశిష్య పరంపర ద్వారా  ఒకరి నోటినుండి విని నేర్చుకొని ఇంకొకరికి చెప్పడం.  కొన్ని తరాలుగా సాగిపోతున్న ప్రక్రియ.  ఎన్నో ఏళ్ళనుంచి చదువుతున్న విష్ణుసహస్రనామం, లలిత సహస్రనామం చదివేవారే మరచిపోతున్నామని పుస్తకం ఎదురుగా పెట్టుకుని చదువుతారే !!అటువంటిది అంత క్లిష్టమైన వేదం పఠించే బ్రాహ్మణులని దేశ సంస్కృతి లో ముఖ్యభాగంగా చూపించి గర్వించాల్సింది పోయి, ఎద్దేవా చేయడం, దూషించడం !! ఏ దేశంలోనూ సంస్కృతి లోను ఇటువంటివి చూడము!! కళ్ళెదురుగా అద్భుతం కనిపిస్తుంటే, ఎక్కడో ఈజిప్ట్ లో కట్టిన సమాధిల గురించి మాట్లాడతాము!!

నేను ఎప్పుడూ  కులం గురించిన టపాలు  బ్లాగులో కానీ  ముఖపుస్తకం లో కానీ  టపాలు వ్రాయలేదు. నాకు తెలిసి నేను  ఒక కులాన్ని ఎద్దేవా చేయడం కూడా  జరగలేదు.  మరి ఇప్పుడు మాత్రం ఇలా ఎందుకు వ్రాస్తున్నాను అంటే  –   తెలియక కొందరు, వితండ వాదన కోసం కొందరు మాట్లాడే మాటలు చూసి చూడనట్లు వదిలి వేయవచ్చు. అలా వదిలివేయడం జరిగింది కూడా !!

బ్రాహ్మణులూ’ అంటూ మనుష్యుల్ని విభజించి,  కులాన్ని ఎద్దేవా చేస్తూ, దోషుల్ని మాట్లాడినట్లు  మాట్లాడుతూ, మనోభావాల్ని గాయపరుస్తూ ఏకంగా పుస్తకాలే వ్రాసేస్తుంటే  చూసి చూడనట్లు ఎలా ఊరుకుంటాము ? మౌనంగా ఉండటం కూడా వారి మాటలని సమర్థిస్తున్నట్లు కాదా ?ఇష్టం వచ్చినట్లు కులాల పేర్లు చెప్పి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం కులాల్ని నిర్మూలించండి, కులరహిత సమాజం కావాలి అని మాట్లాడటం.  ఈ దూషణకి ఒక పేరు “Freedom  of Speech” !! చట్టపరంగా వీరు మాట్లాడేది నేరం కాకపోవచ్చునేమో  మరి నాకు తెలియదు.  కానీ  మాట్లాడే ఆ రంపపు కోతల్లాంటి  మాటలే  అహంకారానికి కొలమానం  కాదా??  

ఒక విశ్వవిద్యాలయంలో  పని చేసే గురువు తన ధర్మం మరచి, కులాలని దూషిస్తూ & విభజిస్తూ పుస్తకాలూ వ్రాస్తూ,   విద్యార్థుల మనసులు విషతుల్యం చేస్తుంటే చూసీచూడనట్లు ఊరుకోవచ్చంటారా ? ఆయన  వ్రాయటం ఒక ఎత్తు  & ఆ మహానుభావుడిని మద్దతు తెలిపేవారు ఉండటం ఇంకో ఎత్తు .  పుస్తకాలు వ్రాయటం చట్టప్రకారం తప్పు కాకపోవచ్చునేమో. కానీ ఇటువంటివి పాఠ్యాంశాలుగా బోధింపబడుతున్నాయిట. మరి అదే నిజమయితే …???? క్రికెట్ చూసి పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనుకుంటే టీవీనో, స్మార్ట్ ఫోనో చేతికి ఇవ్వనక్కర  లేకుండా సరిపోతుంది. సినిమాలు పిల్లల మనసుల్ని విషతుల్యం చేస్తున్నాయి అంటే, పంపించకుండానో  డబ్బులివ్వకుండానో  ఉంటే  సరిపోతుంది. కానీ ఒక గురువే వీటిని విద్యార్థులకి  బోధిస్తూ, వారి మనసుల్ని విషతుల్యం చేస్తుంటే ……….  ఒప్పుకోవాల్సిన విషయం మాత్రం  కాదేమో ఆలోచించండి!!

ఏది ఏమైనా చెప్పదల్చుకున్నది ఒక్కటే   – మన కులం కాదు  ‘అగ్రస్థానం’ లో ఉండాల్సింది. మన బుద్ధి !! దానిని  బట్టే  ‘అగ్రపూజలు’ అందుకోనువచ్చు !!  ‘అధః పాతాళం’ లోనూ  ఉండవచ్చు !! Its  always a choice !!

పాత  చింతకాయ పచ్చడి కబుర్లు

ఎవరికో నేను చాగంటి గారి ప్రవచనాలు వింటాను అంటే,  ‘అబ్బా ఆయన  గొంతు, ఆ గోదావరి యాస  వింటేనే టీవీ కట్టేయాలన్పిస్తుంది’ అన్నారు.  ఒకసారి ఇంకోచోట  ఎక్కడో  కొన్ని వ్యాఖ్యలలో చదివాను ‘ ఆయన  టీవీలోకి రాగానే  మా  పిల్లలు ఆ మాటలు వినకుండా టీవీ కట్టేస్తాను,’ అని వ్రాసారు.  

ఈ మధ్య  ఎవరో ‘చాగంటి పాత  చింతకాయ పచ్చడి కబుర్లు వినటానికి ఎక్కడ నుంచీ  వస్తుందండీ ఓపిక’ అన్నారు.  ‘జ్వరం వస్తే కానీ తేలేదు కదా పాత చింతకాయపచ్చడి విలువ.  అందుకే కదా ఎప్పుడు రోగం వస్తుందో తెలీదు కాబట్టే ఇండియా వారయితే జాడీలలో పెట్టి దాచుకుంటారు. అమెరికా వారయితే packing  చేసి కస్టమ్స్ వారి కళ్ళు కప్పి మరీ తెచ్చుకుంటారు .’ అని సమాధానం చెప్పాను.

మొన్న ముఖపుస్తకం లో కొత్తగా వచ్చిన సినిమా బాలేదని,సెన్సార్ వారు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని ఓ  సినిమా మీద  ఓ నాలుగు ఠావుల  review లు వ్రాసారు కొంతమంది. ఎవరిష్టం వారిది. ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ కాదనలేం కదా !!

అదే ముఖ పుస్తకం లో ఆ హీరో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ  ‘ఎవరికి  నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది. ఈ సారి  ఏదైనా religious  సినిమా తీసి మీకు చూపిస్తాను. అప్పుడు మీరు చూడండి. నేను కుర్చీలో పడుకుంటాను’ అని చెప్తున్నాడు. Exactly ఇవే మాటలు కాదు.  దాదాపుగా అదే అర్ధం వచ్చేలా ఉన్నాయి . ( నాకెందుకు ఆ వీడియో కనిపిస్తోందా  అనుకుంటే ఆ వీడియో పైన  ‘Popular video’  ‘perfect  answer’ అంటూ గోల )!! ఒక పక్క కొన్ని కాలేజీలలో గురువులు చాగంటి గారిని, గరికపాటి గారిని పిలిచి తీసుకొచ్చి నాలుగు మంచి మాటలు విద్యార్థులకు చెప్పమని అర్థిస్తుంటే, ఇంకో పక్క  డబ్బులకోసం యువతనే  లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ, ఇష్టం వచ్చినట్లు డైలాగులు వ్రాస్తూ సమాజాన్ని విషతుల్యం చేసే వారిని ఏమనాలి ?  సరే, ఈ సినిమాలలో ‘ప్రేమ’ అనే పదం గురించి రాసుకుంటూ పోతే పెద్ద గ్రంధాలే వ్రాయచ్చును కూడా !!

పైగా ప్రతీ అనైతిక పనిని సమర్థించేవారు వారు ఎక్కువ తయారయ్యారు. వారు అనే మాట  – ‘Its okay. You have to go with the flow’. ఒక రోజు ఒక వాట్సాప్ గ్రూప్ లో మద్యం గురించి, ఆడపిల్లల బట్టలు ఎంత పక్షపాతంగా డిజైన్ చేస్తున్న వైఖరి గురించి వాదించేసరికి, నాకు  మంచి స్నేహితురాలు అనుకునే వ్యక్తి  నా రాతలు వాదనలు చదివి, ‘నువ్వు కొంచెం తేడా అయ్యావే ‘ అంది.  

మా అమెరికాలో పిల్లల చేతిలో smart phone లేకపోతే బడిలో తోటివారు  వారిని ఏడిపిస్తున్నారు ( Bullying). మా అమ్మాయికి చాలా రోజులు phone కొనలేదు. ఇంటికి వచ్చి రోజూ  ఏడుపే – ‘ అందరికీ  ఉంది నాకు లేదు’ అని. ఇద్దరికీ తలా  ఒకటి కొనిచ్చాక వాళ్ళకోసం కాకుండా వాళ్ళ ఫోన్ లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాము. గురువులేమో మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి అంటారు. మరి బళ్ళలో ఎందుకు ఇలా cell phones అనుమతిస్తున్నారు, అంటే  సమాధానం ఉండదు. ఈ మధ్య bring your  own  device  అంటూ ipad లు , laptop లు పట్టుకొచ్చుకోండి అంటారు. ఈ పిల్లలు వాటిల్లో ఏ ఆటలు ఆడతారో ఏం  చేస్తారో ఆ భగవంతుడికే ఎరుక !! ఇంట్లో పనులే చేసుకుంటామా 24 గంటలు వీళ్ళు ఏం  browse  చేస్తున్నారో చూస్తామా ? ఇవన్నీ చూసి మొన్న బడులు మొదలవ్వగానే  ‘Say  NO to Smart phone’ అనే క్లబ్ మొదలపెడతాను అని చెప్పాను మా పిల్లలతో. బ్లాగు మొదలు పెట్టినట్లే అన్నంత పనీ చేస్తానేమో అని ఇద్దరూ  ‘దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు’ అన్నారు.

ఏం  చేస్తాం? మంచి మాటలు కాస్త గట్టిగా చెప్తే పాత  చింతకాయ పచ్చడి, లేదా తేడా మనుష్యులం  అయిపోతున్నాం.  చాగంటి గారు ఒక పాత  చింతకాయ పచ్చడి!! ‘Religious’ అంటే మనుష్యులకు నిద్రపోవాలి అనిపించేంత చిరాకు.  అది ‘perfect  answer’!! మనం ఎక్కడా దేవుడిని చూడము కానీ అన్నీ  చోట్లా  దేవుడు కన్పించాలి అనుకోవడం అత్యాశ కాదూ ……

ఇదంతా  ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎప్పుడూ  చెప్పే గోలే !! ప్రతిదానికి మనుష్యులు మారాలి. సమాజం లో మార్పు రావాలి అంటాము.  మార్పు ఎందుకొస్తుంది?మొక్క గా ఉన్న  చెడు  విషయాన్నీ ఖండించము. చూసి చూడనట్లు ఊరుకుంటాము. మనం చేసే పనులు దేనికి ఆమోదముద్ర వేస్తున్నామో చెప్పకనే చెప్తాయి. మొక్క గా ఉన్న ఆ  చెడే  మానై ఎదిగి కాటు వేసాక , అందరం కలిసి కాసేపు ఏడవటం  అనేది ఎలాగూ ఉండనే ఉన్నది !!