ఓ చిక్కుడు పాదు కథ

ఇప్పుడు మేముండే ఇల్లు గృహప్రవేశానికి దేశీ కొట్లో నవధాన్యాల పొట్లం ఒకటి కొన్నాం. అన్నీ నవధాన్యాలు వాడలేదు . వాటిని ఓ పక్కన పెట్టాము. అలా ఏళ్ళు గడిచాయి. ఇక వసంతకాలం రాగానే ఏవో ఒక మొక్కలు వేసేసి కూరగాయలు పండించేయాలి అన్న తాపత్రయంలో ఉండగా, ఈ నవధాన్యాల పొట్లం గుర్తొచ్చింది. పొట్లం చూస్తే అందులో కొన్ని చిక్కుడు గింజలు కనిపించాయి. వెంటనే చిన్న కుండీలలో పెట్టడం వాటిల్లోంచి ఓ రెండు మొక్కలు రావటం జరిగింది. ఇక చలి చచ్చిపోయింది మొక్కలు పెరట్లో నాటొచ్చు అని నిర్ధార్థించుకున్నాక, ఆ మొక్కల్ని భూమిలో నాటి, అటూ ఇటూ ఓ రెండు కర్రలు పెట్టి వాటిని అల్లుకోమని మొక్కల్ని వదిలేసాను.

IMG_8935

ఇక ఆ రెండు మొక్కలు ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లు మిగతా మొక్కల్ని తొక్కేస్తూ తీగల్ని పెంచుకుంటూ అల్లుకుంటూ గడ్డి మీదికి వెళ్ళిపోయాయి . అన్నీ తీగలకీ దారాలు కట్టి పక్కింట్లోకి పోకుండా మా deck మీదే పాకేటట్లు చేశాను. కాకర, బెండ, బచ్చలి మొక్కలు పాపం, దీని ధాటికి తట్టుకోలేక దీనికే దారి ఇచ్చేసాయి. ఇక సెప్టెంబర్ నెలలో కొంచెం, కొంచెం పూత రావటం మొదలు పెట్టింది. చాలా ఆనందం వేసింది.ఎందుకంటే చిక్కుడు బతికి తీగకట్టి, కాయలు కాసేలోగా చలికి చచ్చిపోతుంది అని స్నేహితురాలు ఒకావిడ చెప్పారు. అలాంటిది కాయలు చేతికి వస్తున్నాయి కదా. పైగా పక్కనే పొడుగు వంకాయలు తెగ కాస్తున్నాయి. చిక్కుడు కాయ, వంకాయ కలిపి కూర చేద్దామని ఆశ!!.

IMG_3389

ఓ శుభ ముహూర్తాన కాయలు వచ్చాయి. వాట్సాప్ లో అందరికీ ఫోటోలు పెట్టి హడావిడి చేసాను. ఓ రెండు రోజులు ఆగి వంకాయలు కూడా కలిపి కూర చేసాను. కూరంతా కటిక చేదు 😦 . చేదు వచ్చినవి వంకాయలా లేక చిక్కుడు కాయలా అనేది అర్ధం కాలేదు. ఇక అక్టోబర్ నెల వచ్చేసరికి చిక్కుడు పాదు సగం deck ని ఆక్రమించేసింది. ఇక చిక్కుడు కాయలు గుత్తులు గుత్తులు గా రావటం మొదలు పెట్టాయి. దసరాల్లో బాలవికాస్ పూజకి విచ్చేసిన వారందరూ ‘ఇంత బాగా ఎలా పెంచారు’ అని నన్ను tips కూడా అడిగేసారు 😀. వాళ్ళకి నెమ్మదిగా విషయం చెప్పా. కాయలు రూపురేఖలు బావున్నా కటిక చేదు అని. ఎవరూ నమ్మలేదు. ‘కనరెక్కిన వంకాయలతో కలిపి ఉంటావు అందుకే చేదు’ అంటూ ఓ ఇద్దరు కోసుకెళ్ళారు కూడా. కూర చేసి, వచ్చిన result చెప్పారు ‘చేదుగానే ఉందీ’ అంటూ. అంత కాపు పడెయ్యలేక పులుసుబెల్లం పెట్టిన కూర కూడా చేసాను. అదేం కాయో కానీ, అయినా చేదు కొంచెం కూడా విరగలేదు. పక్కన కాకరకాయ పాదు కూడా వేయటం వలన చేదు వచ్చిందా అన్న పిచ్చి సందేహం కూడా వచ్చేసింది. తరవాత వెతకగా వెతకగా గూగులమ్మ చెప్పింది కొన్ని ‘Lima beans’ అని చిక్కుడు కాయలు ఉంటాయి. అవి చేదుగా ఉంటాయి అని. నిజమో కాదో తెలీదు మరి !!

ఇదిలా ఉండగా, ఇంత పెద్ద పాదు చూసి చక్కగా దాని కింద పడుకోవచ్చని ఓరోజు ఓ సర్పరాజం గారు అతిథి గా వేంచేశారు. వెంటనే పాదు మొత్తం మా గడ్డికోసే అబ్బాయితో పీకించేసాం. ఇక పొరపాటున కూడా చిక్కుడు పెంచకూడదని నాకు కఠినమైన ఆజ్ఞలు జారీ అయ్యాయి.

అదండీ చిక్కుడు పాదు కథ.

7 thoughts on “ఓ చిక్కుడు పాదు కథ”

  1. Hi mam,
    నా పేరు రాజేశ్వరి, బెంగళూరు నుంచి ..మీ పోస్ట్ చూశాను. ఫోటో లో ఉన్న కాయలు చిక్కుడు కాదు చిక్కుడు జాతి కి చెందినవి ఇక్కడ కర్ణాటక లో అవిరేకాయలు లేదా అనప కాయలు అంటారు.తెలుగు లో అనప కాయ అంటే సొరకాయ. వీటిని తొక్కలు తినరూ ,గింజలు మాత్రము వండుకొంటారు. తొక్కలు చేదు. వీటిని కర్నాటక లో నవధాన్యాల పాకెట్స్ లో అమ్ముతారు.బహుశా అవి మీకు వచచ్చాయేమో. మేము అవిరికాయ మొక్క తీగ మా ఇంట్లో పెట్టాము.
    బై,
    రాజేశ్వరి.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

    1. ధన్యవాదాలండీ ఈ పజిల్ ని విప్పి చెప్పినందుకు 🙂 . అనపకాయల గురించి విన్నాను. కానీ అది ఒక తీగ అని, కాయలు చేదు గా ఉంటాయి అని తెలీదు.

      మెచ్చుకోండి

  2. పాదులు చక్కగా ఉన్నాయి. పామొచ్చిందని పాదులు మానేస్తారా? మన పని మనది, వాటి పని వాటిదే. మంచి దేశి విత్తనాలు దొరికే షొపులు ఆన్లైన్లో బోల్డన్ని ఉన్నాయి. ఈసారి మంచి చిక్కుడు రకాలని పెంచండి.

    మెచ్చుకోండి

    1. మాకు వచ్చేవి garden snakes కాబట్టి పెద్ద భయపడనక్కరలేదు అనే అంటారు. పూల చెట్లయితే బాధ లేదు కాస్త నీళ్లు పోసి వదిలేస్తాం. కూరల చెట్లయితే కోసుకోవాలంటే కొంచెం భయం. ఈ పాదుల చెట్లు పెడితే ఇంకో చెట్టు బ్రతకనీవు కూడాను.

      మెచ్చుకోండి

  3. అనుములు,బొబ్బర్లు వగైరా పప్పుల్ని విరివిగానే వాడతారు. బొబ్బర్లు ఎక్కువ వాడతారు ఉత్తరాదిన దీన్ని రాజ్మా అంటారు. అనుములు చేదుండవు, ఇవెందుకు చేదొచ్చేయో చెప్పలేము.

    అనుముల పప్పుని అనప పప్పు అంటారు సాధారణంగా,
    ఆనప అన్నది సొరకాయ.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

Leave a reply to Chandrika స్పందనను రద్దుచేయి