మీడియా – సినిమా – దొందూ దొందే !!

శ్రీదేవి మరణం. చాలా బాధాకరం !! ముఖ్యంగా ఆవిడ పిల్లలిద్దరికీ.   మధ్యలో మీడియా కామెడీ. మీడియా అంత ధూర్తులు లేరు అన్నారు కొందరు. నిజమే మీడియా వాళ్ళు సర్కస్ లే చేసేసారు.ఒక్కొక్కరు ఎన్ని రకాల మాటలో. ఎన్ని పోస్టులో !! ‘దీపం ఉండగానే ఇల్లు ఛక్కబెట్టుకోవాలి అనే మాట వాళ్ళకి బాగా తెలుసు . ఎవరి తల క్రిందైనా దీపం పెట్టగానే వాళ్ళ ఇళ్ళు  నిలబెట్టుకుంటారు.

నేను శ్రీదేవి మరణం విషయం లో మీడియా వారిని సపోర్ట్ చేయను. కానీ ఒకటి!! సినిమా వారు మరీ అంత విరుచుకు పడనక్కర్లేదేమో. సగం మీడియా వల్లే  కదా వారూ బ్రతుకుతున్నారు. ఇద్దరికీ ఒకరికొకరు కావాల్సిందే. జనం నెత్తిన శివ తాండవం చేయాల్సిందే కదా.

శ్రీదేవి అంత్యక్రియలప్పుడు మీడియా వారిని రాకుండా చేయడం నాకైతే  అంత సబబుగా అనిపించలేదు. శ్రీదేవి అభిమానులందరూ ముంబై కి వెళ్ళలేరు కదా.  అటువంటి వారు నిరాశపడే ఉంటారు. రోజంతా కాకపోయినా ఒక అరగంటసేపైనా రానివ్వ వలసింది.  ప్రభుత్వ లాంఛనాలప్పుడు మాత్రం మీడియా వారిని వదిలినట్టున్నారు. భారత దేశంలో జనాలు అమాయకులు. సినిమావారే జీవితం అనుకునేవారు చాలా మందే  ఉంటారు. పాపం ఆ రోడ్డు మీద త్రోసుకుంటూ త్రొక్కిసలాట లో ఆ వాహనంతో బాటు నడిచి ఉంటారు చాలామంది. ఆ రోజు లాఠీచార్జి కూడా చేసారని విన్నాను. అదే కాసేపు ఈ పిచ్చి అమాయక  జనాల కోసం, ఆవిడని టీవీలో చూపించి ఉంటే అంత ఎగబడి వచ్చేవారు కాదేమో అని నా అభిప్రాయం. సినిమా రిలీజ్ అయినపుడు మాత్రం టిక్కెట్ల కోసం జనాలు కావాలి. వాళ్ళు ఎగబడాలి!! వారి అవసరం లేనప్పుడు వారు క్రమశిక్షణతో మెసులుకోవాలి అంటే న్యాయం కాదుగా !!

ఆ రెండు రోజులు అమెరికాలో జనాల దగ్గరనుంచీ అమలాపురం జనాల వరకూ  FB లో, వాట్సాప్ లో శ్రీదేవి గురించి తప్పితే ఇంకోటి లేదు. నేను కూడా  ‘ఆకు పిందె తడిసే’ పాట చూసి రోత పుట్టి FB లో పోస్టు కూడా పెట్టేసా.

ఆశ్చర్యం ఎక్కడ వేస్తోందీ  అంటే ‘ప్రైవసీ కావాలి మాకు’ అని చెప్పిన కపూర్ కుటుంబం  శ్రీదేవి మరణం పన్నెండు రోజుల సంతాపం కూడా పూర్తి కాకుండానే రోజుకో పోస్టుతో instagram లో ప్రత్యక్షం అవుతోంది.

ఈ మధ్యలో అమల గారు  ‘నన్ను ఇలా బతకనిస్తారా. నాలో జ్ఞానాన్ని గుర్తించండి’  అంటూ పెట్టిన ఒక పోస్టు నాకు కనిపించింది. ‘Will you let me age gracefully?’ అన్నారు అమల గారు. నవ్వొచ్చింది అది చూస్తే!! వీళ్ళ కుటుంబం మూడు తరాలని  ప్రేక్షకులు పోషించేసారు. వీలైతే నాలుగో తరాన్ని కూడా తెచ్చి పెడతారు పోషించమని. ఉన్నదాంతో సంతృప్తిగా & ‘Graceful ‘ గా ఉండచ్చు కదా ?? అలా ఉండరు గాక ఉండరు.  ఎందుకో మరి !!

మన దేశంలో ముఖ్యంగా తెలుగు వారికి , సినిమానే జీవితం!!  సినిమా వారంటే దేవుళ్ళు. నటుడు/నటి అంటే మనం కొనే టికెట్ డబ్బులతో బ్రతుకుతెరువు లాగించేవాడు అని ఒక సగటు తెలుగు మానవుడికి ఎంత చెప్పినా అర్ధం కాదు.  క్రొత్త సంవత్సరం వేడుకలు, వంటా వార్పు కార్యక్రమాలు (ఏం వంటలొచ్చు అని చేస్తారో అర్ధంకాదు ), ముఖాముఖీ ఇంటర్వ్యూలు. ఒకటేవిటి రకరకాలు. ఇందుగలడు అందులేడని,  సినిమా వారు ఎందులో ఉండరు అని అడగొచ్చు. ఏ సబ్బు , ఏ క్రీము వాడాలో చెప్పేది వాళ్ళే . ఈమధ్య వివాహ వేడుకల్లో సంగీత్ లో సినిమా పాటలు & గెంతులు. కొంచం పిల్లలు బాగా పాడితే చాలు ‘ పాడుతా తీయగా’లో పాడించలేకపోయారా  అని అడుగుతారు. సినిమా వాళ్ళు & వాళ్ళను ఓ దేవుళ్ళలాగా చూపించే మీడియా వారు అమాయక జనాన్ని, యువతని parasite లలా పీక్కుతుంటున్నారు అనిపిస్తుంది. ఈ నటులకి సినిమా జీవితం అయ్యాక జనాలని ఎలా దోచుకోవాలో తెలీక రాజకీయాలలో ప్రవేశించడం లేదా ఇంకో తరాన్ని సినిమాల్లో పెట్టడం లేదా టీవీషోలలో  రావటం. ఒక్కోసారీ ఆ టీవీషోలలో ఎదుటివాడి కష్టాలు విని తనకే వచ్చినట్లు మొసలి కన్నీరు కారుస్తూ ఉండటం. ఎన్నివిన్యాసాలో !! ఇలా మధ్యలో ‘ మమ్మల్ని graceful వదిలేయచ్చు కదా’ అని మాట్లాడుతుంటారు.

ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా వీళ్ళని ఓ పెద్ద దొరబాబుల్లా చూడటం. ఈ మధ్య నటుల కులాలవారీగా  ఫ్యాన్లని చూస్తున్నా. ఫ్యాన్లు అంటే ఎక్కడో ఉంటారని విన్నా చిన్నప్పుడు. కళ్ళతో చూసాకా అర్ధమయ్యింది ఈ పిచ్చి ఎంత ఉంటుందో అని. సరదాకి కూడా ఆ నటుడుని/ ఆ కుటుంబాన్ని ఏమీ  అనకూడదుట.

సినిమాలో పాత్ర చూసి నిజమనుకుని  వాళ్ళ చుట్టూ భ్రమణ చెందటం కల్లు తాగిన కోతిలా మత్తులో పడిపోవటమే కాదూ  !!

4 thoughts on “మీడియా – సినిమా – దొందూ దొందే !!”

  1. లాభం నైతికతని ఎప్పుడు వెనక్కి నెట్టేసిందో, అప్పటి నుంచి అన్నింటి స్థితి ఇదే. ఏది తప్పు, ఏది ఒప్పు మధ్యన ఉన్న రేఖ క్రమంగా మాయమైపోతోంది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

Leave a reply to Chandrika స్పందనను రద్దుచేయి