మేము తయారు చేసిన వాయులీనం

‘గతం గతః’ అని మనం  మర్చిపోయినా Facebook మాత్రం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య ఓ రోజు ఉన్నట్టుండి ఎప్పుడో ఓ నాలుగేళ్ళ క్రితం నేను  పెట్టిన పోస్టుని, అందరికీ మళ్ళీ పంచుతావా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది మేము స్వయంగా వాయులీనం చేసిన సంగతి. ఓ టపాగా వ్రాస్తే బావుంటుందేమోమని ఈ టపా .

అది ఎలా చేసామో, ఎందుకు చేసామో  చెబుతాను.

మా అమ్మాయి మూడో తరగతి నుండి Science Olympiad  లో పాల్గొనేది. మొత్తం ఆ రాష్ట్రానికి అంతటికీ Science Olympiad board లాంటిది ఉంటుంది. వాళ్ళు Olympiad కోసం రకరకాల science topics  ఇస్తారు. Science Olympiad లో పాల్గొనాలి అంటే ప్రతీ బడి జట్టు ఆ board తో నమోదు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే topics అన్నిటిలోను పాల్గొనాలి. లేకపోతే బడికి రావాల్సిన points  రావు. రావాల్సిన points రాకపోతే state tournament కి వెళ్ళలేరు. అదన్నమాట ముఖ్య విషయం. ఇంత కంటే details అక్కర్లేదు లెండి.

పిల్లల్ని వారికి  ఏ topics నచ్చుతాయో చెబితే,  అవే నచ్చిన ఒక partner తో కలిపి చేయమంటారు.  మా అమ్మాయి anatomy తీసుకుంటుంది ఎప్పుడూ. అందులో ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది అని నమ్మకం తనకి. ఇక చెప్పాకదా కొన్ని  నచ్చినా నచ్చకపోయినా బడి points కోసం తీసుకోవాల్సి వస్తుంది. అలా చచ్చినట్లు తీసుకోవాల్సి వచ్చింది ‘Sound of Music ‘ అనే topic .

Anatomy ఇచ్చేసారు బాగా చదివేసుకోవచ్చు అన్న ఆనందంలో ఈ  ‘Sound of music ‘ ఏంటో మా పిల్లకి , దాని స్నేహితురాలికి అర్ధం కాలేదు. తర్వాత వాళ్ళ నియమాలు ఉన్న కాగితం చూసాక నాకు భయం వేసింది. ‘11 ఏళ్ళ  పిల్లలు చేసేదేనా ఇది, వీళ్ళు మరీ అతి’ అనుకున్నాను. ఆ కాగితం లో చెప్పింది ఏంటంటే, ఇద్దరూ తలా ఒక వాయిద్యం తయారు చేయాలి. ఒకటి percussion ఒకటి string. వాటిని తాయారు చేసి  శృతి పెట్టి, వాళ్ళు చెప్పిన పాట వాయించాలి. వీళ్ళకి తెల్సిన పాట కూడా వాయించాలి. ఏ శృతి లో వాయించాలో చెప్పారు కూడాను. ఒక చిన్న పరీక్ష పెడతారు Physics – Sound లో. అది కూడా వ్రాయాలి. ముఖ్యమైన నియమం ఏంటంటే తల్లితండ్రులు చేయకూడదు. పిల్లలు చేస్తుంటే చూడాలి.

మా అమ్మాయి  ‘మీకెందుకు నేను  వయోలిన్ చేసేస్తాను’ అంది. దీని భాగస్వామి  ‘ PVC pipes తో పియానో లాంటిది చేసి పడేస్తాను’ అంది.  అక్కడనుంచీ మా తల్లితండ్రుల కష్టాలు మొదలు. ఎలా చేయాలో ఏమైనా తెలిస్తే కదా. సరే, గూగులించితే సిగార్ పెట్టె తో వయోలిన్  చేయచ్చు అని తెల్సింది. సిగార్ పెట్టెలు అమ్మే కొట్టుకి వెళ్లి ఓ రెండు పట్టుకొచ్చాము. డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఆ కన్నాలు చేస్తుంటే ఆ చిన్ని చేతుల్లో ఎక్కడ గుచ్చుకుంటుందో అని నాకు భయం. చెక్కలు కొట్టేబాధ లేకుండా చెక్కలు అమ్మేవాడే కాస్త  ముక్కలు కూడా చేసి పెట్టాడు. నేను ఏవి ఎలా అతికించాలో చెప్పడం. పిల్ల అతికించడం. ఒక్కోసారి బాగానే అతికించేది. ఒక్కోసారి తిట్లు తినేది పాపం. అన్నీ అతికించి, వాయిద్యాలు అమ్మే కొట్టుకి వెళ్లి తీగలు పట్టుకొచ్చాము. తీగలు పెట్టి, శృతి చేసి, ‘అమ్మయ్య అయిపొయింది’ అనుకునేలోపు  ‘Bow’ (కమాన్) చేయాలి అని చెప్పింది పిల్ల. మళ్ళీ గూగులించితే గుర్రం తోక జుట్టు తో చేయాలి అని ఉంది. అమెజాన్ వాడు అది కూడా అమ్ముతాడట. ఆ జుట్టు తెప్పించి , craft store లో చిన్న కర్ర ఒకటి కొని కమాన్ కూడా చేసాం. ఇన్ని చేసాక వయోలిన్ పలుకుతుందా లేదా అనో సందేహం. పలకటం మొదలుపెట్టేసరికి భలే ఆనందం వేసింది. అది పలుకుతుంది అని తెలిసాక  ముందు గణపతి పాట వాయించాల్సిందే అని నేను పట్టుబడితే, ‘శక్తి సహిత గుణపతిం’ వాయించి చూపించింది మా అమ్మాయి.

882719_641770109249056_51461561_o

తన స్నేహితురాలు కూడా చాలా కష్టపడి పైపులు అన్నీ పెట్టి ఓ భోషాణం లాంటి వాయిద్యం చేసింది. ఇక ఇద్దరూ  కలిసి కచేరి చేసారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చూసినా home depot కొట్టులో ఉన్నట్టే అనిపించేది మాకు 🙂

అలా పోటీ రోజు రానే వచ్చింది. ఈ వాయిద్యాలని జాగ్రత్తగా తీసుకెళ్ళాము. చిన్న కచేరి చేసారు. వీళ్ళకి medal  రాలేదు కానీ 22 జట్టుల్లో 8వ స్థానంలో వచ్చారు. అంటే వీళ్ళని మించిన వాళ్ళు ఉన్నారు అక్కడ 🙂  అందరూ ఇదే వయసు వాళ్ళే.  కొందరు భోషాణాలు మోసుకొస్తే కొందరు చిన్న చిన్న వాయిద్యాలు పట్టుకొచ్చారు. బహుమతి రాలేదేమో కానీ మరిచిపోలేని ఒక అందమైన తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది మా ఇంట్లో అందరికీ.

అమెరికాలో చాలా చాలా నచ్చే విషయాలలో మొదటిది ఏంటంటే సంగీతం. మనం అనుకుంటాము సంగీతం అందరికీ ఎక్కడ వస్తుందిలే అని.  కానీ ప్రతీ బడిలో KG నుండీ 5వ తరగతి వరకూ తప్పనిసరిగా సంగీతం వాయిద్యం, గాత్రం ఏదో ఒక రూపంలో  పిల్లలకి నేర్పిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద తరగతుల్లో కూడా కావాలంటే నేర్చుకోవచ్చు కూడా. ‘బడ్జెట్ లేదు పీకేస్తాం’ అంటూ ఒక్కోసారి బెదిరింపులు వచ్చినా, ఇప్పటి వరకూ  చెక్కు చెదరకుండానే నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలు.

4 thoughts on “మేము తయారు చేసిన వాయులీనం”

  1. వాగ్గేయకారుల్లో త్యాగరాజాది బాలమురళీపర్యంత హెచ్చుమంది తెలుగువారు కావటంతో తెలుగు అనేది సంగీతపు మాతృభాషలా ఐనది. కాని దురదృష్టం ఏమిటంటే తెలుగువారికి సంగీతంపై ఆసక్తి తక్కువే. ఒకప్పుడు తెలుగిళ్ళలో ఆడపిల్లలు పెళ్ళిచూపుల్లో కాస్త పాడటం కోసం సమ్గీతం నేర్చుకొనేవారు అదీ తగినంత మాత్రమే. ఆ తరువాత సినిమాల్లో పాడే అవకాశం కోసం కొన్నాళ్ళు పిల్లలు సంగీతం నేర్చుకోవటం మొదలెట్టారు – అందులోనూ లలితసంగీతపు షార్టుకట్టులో. ఇప్పుడు సినిమాల్లో పాడటానికి అసలు సంగీతం రానవసరమే లేదు – రాకపోవటం ఒక క్వాలిఫికేష్ కూడాను. ఈనాడు సంగీతం పేరుతో చెలామణీ అవుతున్న రొద అంతా మన కొత్తసంగీతం అన్నమాట. ఈ విషయంలో పాశ్చాత్యులు మనకంటే వెనుకబడి ఉండవచ్చును.

    మెచ్చుకోండి

    1. మన తెలుగువారు & సంగీతం అనే విషయం తీసుకుంటే ఏమీ చెప్పలేమండీ, ఎవరికైనా గుర్తింపు రాగానే ‘ మా తెలుగు వాడే’ అనుకోవడం తప్పించి 🙂

      మెచ్చుకోండి

  2. మీ అమ్మాయి చేసిన వాయులీనం బ్రహ్మాండంగా ఉంది. దాని చేత సంగీతం పలికించారంటే ఆశ్చర్యంగా ఉంది. దాన్ని కూడా అందుబాటులో ఉంటె ఇక్కడ పెట్టవలసింది. చూడటానికి సింపుల్గా ఉన్నా ఇందులో ఎంత కష్టం ఉందొ నాకు తెలుసు. home depot లాంటివి అమెరికాలో ఉన్నవాళ్ళకి తెలుస్తాయి. ఇంకొంచెం వివరణ ఇస్తే అందరికి అర్థం అవుతాయని నా అభిప్రాయం.

    మెచ్చుకోండి

    1. వీడియోలు తీసామండీ . ఎక్కడో భద్రంగా పెట్టేస్తాం కదా 🙂 . ఎక్కడ పెట్టానో గుర్తు లేదు. Science Olympiad గురించే పెద్ద explantaion వ్రాసాను అని ఇక home depot గురించి వ్రాయలేదు.

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి