పనికిమాలిన వాదనలు

మా పెద్దమ్మాయి KG లో ఉండగా back to school night కి వెళ్ళాము. మా జీవితంలో, ఇక్కడ బళ్ళల్లో, ఇలాంటివి ఎలా ఉంటాయో తెలుసుకోవడం మొట్ట మొదటి సారి!!. అంటే ఆ రోజున ఆ తరగతి టీచర్ తాను ఆ సంవత్సరం ఏ విధంగా బోధిస్తారో, పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటారో చెప్తారు. వెళ్ళగానే మా టీచర్ గారి మొదటి ప్రశ్న ‘ మీలో ఎంత మంది మీ పిల్లలు బడి నుంచీ ఇంటికి రాగానే, వారి బ్యాక్ ప్యాక్ లు మీరే సర్దేసారు ? ‘, ముప్పావు వంతు మందిమి గొప్పగా చేతులెత్తేసాం !! దాని ఆవిడ వెంటనే ‘ Please never do that !! ‘ అని చెప్పారు. ‘పిల్లలు వాళ్ళంతట వాళ్ళు కొన్ని పనులు చేసుకోవడం అలవాటు చేయాలి. అది వారి బాధ్యతే అని గుర్తు చేయాలి. అందులో ముఖ్యమైనవి వాళ్ళ లంచ్ బాక్స్ తీయడం, బ్యాక్ ప్యాక్ లో సర్ది పెట్టేయడం. అన్నిటికీ మేము ఉన్నాము అంటూ చేయద్దు’ అన్నారు. KG తరగతి అంటే పెద్దగా చదవటం ఉండేది కాదు. ఎక్కువగా పిల్లల క్రమశిక్షణ మీద focus చేసేవారు.
ఆరవ తరగతిలో బళ్ళో ఓ 5 గంటల పాటు మీ అమ్మాయి సమాజసేవ చేయాలి లేకపోతే మార్కులు తగ్గుతాయి అని చెప్పారు. మళ్ళీ ఎనిమిదో తరగతి లోనూ దాదాపు అంతే. 8 గంటలు కావాలి అని చెప్పినట్లు గుర్తు. ఇక హైస్కూల్ పాస్ అవ్వడానికి 50 గంటల సమాజసేవ ఉండాలి అన్నారు. ఇప్పుడు ఆ పనిలో పడ్డాం!! ఇక పిల్లలు Girls/Boys scouts, National Honor roll society లాంటి వాటిల్లో ఉంటే ఆ నియమాలు వేరుగా ఉంటాయి. 30 గంటల నుంచీ 100 గంటల వరకూ సమాజ సేవ చేయాల్సి ఉంటుంది. కాలేజీల దరఖాస్తుల గురించిన నేపథ్యంలో, ఈ మధ్య తెలిసినది ఏంటంటే కొన్ని medical programs కి, హై స్కూల్ లోనే 450 గంటలు medical field లోనే సమాజ సేవ చేయాలిట. minimum requirement అట !!
సమాజ సేవ అంటే? homeless shelter లలో, నర్సింగ్ home లో వృద్ధులకి సేవ, ఓ గుళ్లోనూ, చర్చిలోను ఏదైనా పండుగలలో సహాయం చేయటం, చిన్న పిల్లలకి హోంవర్కులు చేయించడం , ఆసుపత్రులలో అయితే డిశ్చార్జ్ చేసేటపుడు రోగి ని wheel చైర్ కూర్చోబెట్టి కారు దాకా దింపడం ఇలా రకరకాలు. ఏమొస్తోంది దాని వలన అంటే – ఒక సామజిక బాధ్యత. ఎంత మ్రొక్కుబడిగా చేసినా ఒక విత్తనం నాటినట్లే కదా!!
ఇలా ఎన్నో చేసే అమెరికాలో పిల్లలు చాలా బుద్ధిమంతులు అని నేను చెప్పడం లేదు. ఈ రోజుకి మా అమ్మాయి లంచ్ బాక్స్ తీయదు. మరుసటి ఉదయం వెతుక్కోవాల్సిందే. ఎప్పుడూ ఫోన్లోనే సగం జీవితం గడుపుతుంది. తనకి కావాల్సిన పిండివంటలు బ్రహ్మాండంగా చేసుకుంటుంది కానీ ఇంటో ఒక్క పని చేయదు. అటువంటిది ఈ సమాజ సేవ చేయడానికి వెళ్ళినపుడు పార్కుల్లో చెత్త ఏరివేయడం, టీచర్ గారి పుస్తకాలూ సర్దిపెట్టడం, నర్సింగ్ హోమ్ లోని వృద్ధులతో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మాట్లాడ్డం వంటివి బాగానే చేస్తుంది.
చదవక ముందు కాకరకాయ చదివాకా కీకరకాయ అన్నారట. ‘మానవసేవే మాధవ సేవ’, ‘దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న’ అని, ‘Arise,awake and do not stop until the goal is reached’ అంటూ ఎన్నో నేర్పిన దేశంలో, నిన్న టీవీ9 లో జాఫర్ గారి కార్యక్రమం చూస్తే అసహ్యం వేసింది!! ప్రతి ఊర్లో అందర్నీ పోగేసి ‘ప్రేమించాలా/లేచిపోవాలా’ అనే టాపిక్ మీద ‘కొట్టుకోండి’ అనే కార్యక్రమాలు పెట్టినట్లున్నారు. నీకెలా తెలుసు అని మాత్రం అడగద్దు 🙂. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటే ఇండియాలో మనుష్యులకు బుద్ధి అనేది ఉందా అనిపిస్తోంది. కొంతమంది ఆడపిల్లలు ‘ మాకు కావాల్సిన బట్టలు కొనిస్తారు. అన్నీ చేస్తారు. మాకు కావాల్సిన వాణ్ణి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు? 20 ఏళ్ళు పెంచుతారు. 80 ఏళ్ళు జీవితాంతం ఉండాల్సిన వాడిని మేమే చూసుకుంటాం’ అంటూ వాదిస్తున్నారు. విజయవాడ లో డాక్టర్ సమరం గారు మాట్లాడిన మాటలు వింటే మతిపోయింది నాకు. ‘తల్లితండ్రులు పిల్లలు తమ ఆస్థి అనుకుంటున్నారు. 14 ఏళ్ళకి పిల్లలకి ఇండివిడ్యువాలిటీ మొదలవుతుంది. పిల్లలు తల్లితండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రేమించాము అంటే అది ప్రేమే కాబట్టి అంగీకరించండి ప్రేమ వివాహాలు చేసుకోండి. arranged పెళ్లిళ్లు వద్దు. మా ఇంట్లో అందరం అలాగే చేసుకున్నాం. అందరం బావున్నాం’  ఇదా ఇలా పెద్దవారు యువతకి ఇచ్చే సందేశం?? దీనికి విపరీతంగా చప్పట్లు !! ప్రేమించాను అని ఎవడైనా చెప్పి వేశ్యాగృహాలకి అమ్మివేస్తే, ఈ పెద్దమనిషి వచ్చి వాళ్ళ పిల్లని రక్షించి తెచ్చిస్తాడా ? ఎన్ని జరగట్లేదు?? సునీత కృష్ణన్ గారి బ్లాగు చదవని వాళ్ళు చదవండి !! ప్రపంచం ఎంత భయంకరమైనదో తెలుస్తుంది !!
ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని ఎక్కడైనా ఎవరైనా ప్రోత్సహం ఇస్తుంటే, పెళ్ళే జీవితలక్ష్యం అని మాట్లాడే ఈ పిల్లలని చూసి ఏమనాలో అర్ధం కావట్లేదు నాకు. ఏదో ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి ‘పథకం పెడితే తెగ విమర్శలు చేసారు కొందరు స్త్రీ వాదులు. ఇటువంటి వాదనలు ఖండిచట్లేదా వీరు ??
వేలకి వేలు, లక్షలు కుమ్మరించి తల్లితండ్రులు చచ్చేట్టు కష్టపడి చదివిస్తుంటే టీవిల్లో ఇటువంటి పనికిమాలిన వాదనలు !! కొన్ని కాలేజీలు చాగంటి గారిని, గరికపాటి గారిని వచ్చి విద్యార్థులకి సందేశం ఇవ్వమని చెప్తున్నారు. చాగంటి గారి వెబ్ సైట్ లో విద్యార్థులకి ఇచ్చిన స్పీచ్ లు ఎవరైనా వినచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం !!

 

టీనేజ్ కి వచ్చాక అమ్మానాన్న శత్రువుల్లా కనపడ్డం, తమ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అనుకోవడం పిల్లల్లో మాములే !! అగ్ని కణికలు!! పిల్లలకి సామజిక బాధ్యత గుర్తు చేసే చల్లటి కబుర్లు చెప్పి ఈ అగ్నిని చల్లార్చాలి కానీ సమరం గారి లాంటి వారి మాటలు చెప్పి అగ్నికి ఆజ్యం పోసి ఏం సాధిస్తున్నట్లు ?

7 thoughts on “పనికిమాలిన వాదనలు”

  1. హ్హ హ్హ హ్హ , న్యూస్ ఛానెల్స్ చూడడం ఏమిటండీ మరీనూ 😀😀 ? నేనయితే వార్తల కోసం ప్రభుత్వం వారి ఛానెల్ “దూరదర్శన్” మాత్రమే చూస్తాను. ఇతర ప్రోగ్రామ్స్ కోసం అయినా సరే ప్రైవేట్ వార్తాఛానెల్స్ ను చూడడం చాలా చాలా అరుదు (ఎవరైనా ప్రముఖులతో ఇంటర్వ్యూలు, అలాంటి వేరే ఆసక్తికరమైన ప్రోగ్రాములుంటే తప్ప) …. అందులోనూ వాటి చర్చాకార్యక్రమాలు అస్సలంటే అస్సలు చూడను, వాటిల్లో భండారు శ్రీనివాసరావు గారు పాల్గొంటున్నప్పటికీ కూడా 😳.

    మీ పోస్ట్ చదివిన తరువాత డాక్టర్ సమరం గారి ప్రసంగం విడియో చూశాను యూట్యూబ్ లో. ఆయన లాంటి ప్రముఖుడు అలా మాట్లాడడం ఆశ్చర్యకరం, దురదృష్టం. సమరం గారి తదితర బంధువుల గురించేమో గానీ వారి తండ్రి గారు (ప్రముఖ హేతువాది, సమాజసంస్కరణాభిలాషి, స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అయిన గోరా గారు) మాత్రం తన పిల్లల్లో కొందరికి ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలు చేశారు అని విన్నాను, అయితే అవి ప్రేమపెళ్ళిళ్ళు కూడానా I don’t know. ఏమైనప్పటికీ 79 ఏళ్ళ సమరం గారు అలా మాట్లాడడం అపరిపక్వ యువతని ఎగదోసినట్లుంటుందని నా అభిప్రాయం కూడా.

    మెచ్చుకోండి

  2. *ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు.. పెళ్ళే జీవితలక్ష్యం అని మాట్లాడే ఈ పిల్లలని చూసి ఏమనాలో అర్ధం కావట్లేదు *

    అందరికి చదువు మీద ఆసక్తి ఉండదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొంటామో అంటే అడ్డుకోవటం అనవసరం. ప్రతివారి నెత్తిమీద చదువు రుద్ది నాశనం చేస్తున్నారు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి