ఈ ఏడు సంక్రాంతి బొమ్మల కొలువు కథ

భాగవతం అనేది పోతన గారు తెలుగు వారికి ఇచ్చిన ఒక అమూల్యమైన మణి  అంటాను నేను. ఈ సంగతి అర్ధమయ్యేసరికి నా జీవితకాలం దాదాపు సగం గడిచిపోయింది. తెలుగు పాఠ్యపుస్తకం లో కొన్ని  పద్యాలు నేర్చుకున్నాను. కథ కొంచెం కొంచెంగా బాగానే తెలుసు. కానీ నాకు ఆ కథని కళ్ళకి కట్టినట్లు చెప్తూ, మనసుకి హత్తుకునేలా , ఆ పురాణం significance  విశిదీకరించిన వారెవరో చెప్పనక్కరలేదనుకుంటాను 🙂 _/\_ . గత ఏడాది చాగంటి గారి భాగవత ప్రవచనం మొత్తం విన్నాను. తరువాత సామవేదంవారివి కూడా కొన్ని ఘట్టాలు విన్నాను. తరువాత http://telugubhagavatam.org/ వెబ్సైటు  తయారు చేసిన వారి గురించి తెలిసి ఆశ్చర్యం వేసింది. జీవితాన్ని సార్థకత చేసుకోవడం అంటే ఇదే కదా అనిపించింది.

ఇక ఒకరోజు మా  నానమ్మ పద్యాలూ చదివే విధానం  వింటుంటే (చాలా మంది దృష్టిలో ఆవిడ నిరక్ష్యరాస్యురాలు అనగా Illiterate)  ఆ పద్యాలూ నోటికి రాకపోతే జీవితం దేనికి అని అనిపించింది. ఇక నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. సఫలీకృతం మాత్రం కాలేదు.

సరే ఇలా భాగవతం గురించి ఆలోచిస్తూ ఉండగా,   దసరా పండగ రోజుల్లో చాలా మంది తమిళుల ఇంట బొమ్మలకొలువులు ప్రత్యక్షంగా , వాట్సాప్ లో చూడటం జరిగింది.  ఒక్కొక్కరు ఒక్కొక్క కథని అంటే రామాయణం, ఆదిశంకరులు, కంచి పీఠాధిపతులు, బ్రహ్మోత్సవాలు అలా ఒక ప్రాజెక్టులాగా  పెట్టారు . అవి అన్నీ చూసాక, నాకు ఓ ఆలోచన వచ్చింది. మన తెలుగు వారికున్న అమూల్యమైన నిధి పోతన గారి భాగవతం. దానిని తెలుగు వాళ్లమై ఉండి ఆయన  గొప్ప చూపించకపోతే ఎలా అనిపించింది. అనుకోవడమే తరువాయి. సంక్రాంతి బొమ్మల కొలువుకి నా ప్రాజెక్ట్ ఇదే అని సంకల్పం చేసుకున్నాను. కానీ అన్ని బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు పట్టుకొస్తారు అన్నది ప్రశ్న.  

 

గజేంద్ర మోక్షం:

కావలసిన బొమ్మలు లిస్ట్ తాయారు చేసుకున్నాను.   ‘Golu dolls ‘ అని గూగుల్ లో కొట్టగానే, తమిళం వాళ్ళ మట్టి బొమ్మలు చూపిస్తోంది.  గజేంద్ర మోక్షం బొమ్మ ఉంది, కానీ పోతన గారు వర్ణించినట్లు లేదే!!

ఒక రోజు అనుకోకుండా dollar  tree కొట్టుకి( అక్కడ ప్రతీ వస్తువు ఒక డాలర్ మాత్రమే)  వెళ్ళాను. అక్కడ నోరు తెరుచుకున్న మొసలి, పక్కన ఏనుగులు కనిపించాయి. ఇంక అంతే. నేనే గజేంద్ర మోక్షం చేసేద్దాం అని నిర్ణయానికి వచ్చేసా.  నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏది తాయారు చేయలేదు.

ఏనుగులని చేతిసంచీ బట్టలతో, చమ్కీలతో అలకరించాను. ఆ కొట్టులోనే కాగితం చెట్లు కన్పించాయి. వాటిని thermocol  కి అంటించి, గులకరాళ్లు పెట్టి కాస్త అందంగా చేసా. ఇక జలపాతం కోసం చూస్తే అదీ చేసుకోవచ్చని వీడియోలు పెట్టారు . అది చూసి నేర్చుకుని , ఆ ఘట్టానికి  దగ్గరగా అనీ వచ్చేలా చేసాను. ఇక విష్ణుమూర్తి రావాలి. అందుకు సరిగ్గా బాపు గారి బొమ్మ తప్ప సరిగ్గా లేవు, కానీ ఆయన బొమ్మ కొనకుండా ప్రిన్స్ చేయడం ఇష్టం లేక, ఒక్క విష్ణువు మాత్రమే వచ్చేట్లు గూగుల్ లో దొరికిన ఫోటో ఒకటి ప్రింట్ తీసుకున్నాను. ఒక చిన్న కర్రకి అతికించి ,ఇంకో thermocol  కొండ కి గుచ్చి కింద రాళ్ళూ పెట్టి అది పూర్తి చేసాను . దానితో మొత్తం ఘట్టం నేను అనుకున్నట్లే వచ్చింది.

తరువాత  ఉలూఖల బంధనముకి:

అమ్మకి ఫోన్ చేసి, యశోద రోటికి కట్టిన కృష్ణుడిని కొనమన్నాను. ఆలా దొరకలేదు ఒక్క కృష్ణుడే దొరికాడు అంది, దానితో డాలర్ ట్రీ  బొమ్మనే యశోదగా మార్చేసాను. ఒక్క క్రొత్త దీపావళి ప్రమిదని వెన్న కుండగా మార్చి, ఒక చెక్కకి ముగ్గులు వేసి , కవ్వం పెట్టి వెన్న చిలుకుతున్నట్లు చేసాను.

కుబేరుడి కుమారులను ఏవిధంగా చేయాలి అని మళ్ళీ సమస్య. ఒక craft  blog లో ఎవరో ఆలోచన ఇచ్చారు. రెండు barbie boy బొమ్మలు తెచ్చి వాటికీ పంచలు తయారు చేసి కట్టాను, మళ్ళీ  చెట్లు ఒక thermocol కి అతికించి, రంగులు వేసా .

గోవర్ధన గిరి :

ఇవన్నీ చేసాక గోవర్ధన గిరి పెద్దచేయటం  కష్టం కాదు అనుకుని Michaels craft store లో peg  dolls కొని వాటిని గోపాలురు లాగా చేసాను. ఆవులు డాలర్ కొట్లో కొనేసాను.  నా దగ్గరే చిన్న కృష్ణుడిని కొండ క్రింద నిల్చోబెట్టేసాను.

ఇక నందవ్రజం లాగా చేయటానికి bird  houses ని పల్లెటూరి ఇళ్ళలాగా మార్చాను. గోవుల  కొష్టం కూడా చేసాను. బాగా రాలేదు..

ఇంత కష్టపడ్డాక తీరా పేరంటం అనుకునే రోజుకి ఒక అడుగు మంచు కురిసింది మా ఊర్లో.  మరునాడు బళ్ళకి సెలవు అనగానే గబగబా అప్పటికప్పుడు చుట్టుపక్కల వారిని పిలిచి పేరంటం చేసాను.  ఒక చిన్న పాప యక్షులని చూసి ‘I know this story’ అంటే ఎంత సంతోషం వేసిందో!! మళ్ళీ వాతావరణం బావున్న  రోజున అందరినీ పిలిచి ఉత్తుత్తి పేరంటం చేస్తాను. ఈ జనవరి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు!!

అన్నీ  ఘట్టాలు పెట్టలేకపోయినా చిన్న ప్రయత్నం చేసాను.  నాకు అంత చేయి తిరిగే కళ లేదు. అంత బలమైన సంకల్పమే నా చేత ఇలా చేయించింది అని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఈ కొలువు చూసి చేతిలో కళ  ఉన్నవారు కొందరైనా ఈ ఘట్టాలను పెట్టి రాబోయే తరాల వారికి భాగవతం చెప్పేస్తారన్న అత్యాశతో మీ అందరితో పంచుకుంటున్నాను.

అన్నట్లు ఆ రెండూ పద్యాలు  మా అమ్మాయి వ్రాసి నా జీవితం ధన్యం చేసింది 🙂

ఇన్ని రోజులు బ్లాగు వ్రాయకుండా , ఎక్కడా వ్యాఖ్యలు చేయకుండా ఏం  చేస్తున్నానో నా బ్లాగు మిత్రులందరికీ అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నాను