Parent teen book club

చాలా middle schools లో Parent teen book club అని ఉంటుంది. ఆ club ఏంటంటే  పిల్లలు, తల్లితండ్రులు ఒకటే పుస్తకం చదివి, ఆ పుస్తకం అందరూ కలిసి చర్చిస్తారు.  సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది. ఓ నాలుగు రకాల పుస్తకాలు ఉంటాయి. మనకు నచ్చిన పుస్తకం  ఎన్నుకుని club లో నమోదు చేసుకోవాలి !! ఈ club లో ఖాళీలు ఎంత తొందరగా నిండిపోతాయంటే email వచ్చిన కొద్దిసేపట్లో నమోదు చేసేసుకోవాల్సిందే!!  పిల్లలు ‘అలా మా అమ్మానాన్నలతో కలిసి చదువుకుంటే మాకేమి వస్తుంది’ అంటారని, ఓ project లో credit లాంటిది ఏదో పెడతారు. అలా మూడుసార్లకీ ఇవ్వరు.  ఏదో ఒకసారి మాత్రమే credit ఉంటుంది. నాకు ఆ మూడు సార్లు మా అమ్మాయితో కలిసి చదవాలని ఉంటుంది. కానీ ఆ credit ముక్కకోసం ఒక్కసారికి నాతో చదువుతుంది.పైగా మా పిల్ల నా గురించి ‘ఈవిడ ఇండియాలో పుట్టి పెరిగింది. తెలుగు బళ్ళో టీచరు. ఇంగ్లీష్ లో చదువుతుందా  పెడుతుందా ‘ అనుకుంటుందేమో అని నా అనుమానం. ఈ రకం పిల్లలని ఆశ్చర్యపరుస్తూ అక్కడకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది నాలాగా భారతవలసదారులే అవడం, పైగా పుస్తకాన్ని నమిలిమింగేసి వచ్చి చర్చలు చేయడం జరుగుతుంటుంది 🙂

చర్చ ఎలా ఉంటుంది అంటే ,  పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పడం, చివరి దాకా ఉత్కంఠ ఉందా లేదా, వ్రాసిన శైలి,  పుస్తకానికి పెట్టిన పేరు సరిపోయిందా లేదా , ఏవైనా స్వానుభవాలు, ఇటువంటి పుస్తకాలు ఇంకేమైనా ఉన్నాయా.

పోయిన ఏడాది  ‘March: Book One by John Lewis’ అనే graphic నవల చదివాము. అమెరికాలో ‘Civil Rights Movement’ గురించిన పుస్తకం.’Civil Rights’, ‘non violence’ మీద చర్చ చేసారు.

ఈ ఏడాది మేము ఎంచుకున్న  పుస్తకం ‘The Night Diary  by Veera Hiranandani’ . ఎందుకు ఎంచుకున్నాం అన్న ప్రశ్నకి సమాధానం –  స్కూలు వారు చెప్పిన పుస్తకాలలో కొన్నిgraphic నవలలు ఉండటం, ఈ సారికి graphic నవలలు వద్దు అనుకోవడం , మాఅమ్మాయి ఇలా diary లాంటి పుస్తకాలు అంటే చాలా ఇష్టపడుతుండడం చేత!!  కథ ఏంటో, రచయిత ఎవరో కూడా తెలీదు (రచయితపేరు చెప్పరు.మనం గూగుల్ చేసుకోవచ్చు కావాలంటే).

పుస్తకం గురించి గూగులించితే తెలిసినది ఏమంటే వ్రాసింది పుస్తకం భారత సంతతికి చెందిన రచయిత్రి. భారతదేశం పాకిస్తాను విభజన గురించినది. దాంతో కొంచెం ఉత్కంఠ పెరిగింది. పుస్తకం రాగానే చదివాను. ఎక్కడా ఆపబుద్ధి కాలేదు. కథ ఏంటంటే ఒక పన్నెండేళ్ళ నిషా అనే అమ్మాయి గురించి. ఇప్పుడు పాకిస్తాన్ లో వాళ్ళ నివాసం.  బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇస్తున్నారు అన్న ఆనందం కొన్ని రోజులకే విషాదంగా మారిపోతుంది వారి కుటుంబానికి. నిషా తల్లి ఒక ముస్లిము . తండ్రి హిందువు. పుట్టగానే తల్లిని కోల్పోతారు కవల పిల్లలైనా నిషా, నిషా సోదరుడు అమిల్. కథలో — కవలలు, తల్లి మతం ఇస్లాము , తండ్రి హిందువు — కొంచెం ‘బొంబాయి’ సినిమా గుర్తొచ్చింది. నిషా తన తల్లితో కబుర్లు చెప్పుకున్నట్లు రోజూ డైరీ వ్రాసుకుంటుంది . కథంతా దేశ విభజన, వారు పడ్డ కష్ఠాలు, ఇబ్బందులు, రోజులు ఏవిధంగా మలుపు తిరిగిపోతుంటాయి అన్నవాటి గురించి ఆ డైరీ ద్వారా మనకి తెలుస్తుంటుంది.తల్లిని కోల్పోయిన ఆ పిల్లకి, తల్లి జ్ఞాపకాలు చెప్పే ఆ ఇల్లు ఆ ఊరు విడిచివెళ్ళడం చాలా బాధ కలిగిస్తుంది. ఒక పన్నెండేళ్ళ పిల్ల ఎంత అభద్రతా భావానికి లోనవుతుందో చాలా బాగా విడమరిచి చిన్నపిల్లల మనస్సుకి హత్తుకునేలా చెప్పారు రచయిత్రి. ఆవిభజనలో ఎన్నోహింసాత్మకమైన ఘటనలు జరిగాయి. ఆ ఘటనలన్నిటినీ విడమరచి చెప్పారు. ఏదీ కూడా విడిచిపెట్టలేదు. నాకు చాలా నచ్చిన అంశం ఏంటంటే పిల్లలకి భయం కలిగించేలా వ్రాయలేదు. చెప్పవలసిన రీతిలో చాలా చక్కగా చెప్పారు.  

nightdiary

ఈ పుస్తకం చర్చించడానికి  అందరూ భారతీయులే ఉంటారు అనుకుని వెళ్ళాము.ఆశ్చర్యపరుస్తూ భారతీయులు మాతో కలిపి ముగ్గురే. ఇంకో ఆరుగురు పిల్లలు వేరే వారు వచ్చారు. నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఈవిభజన గురించి అందరికీ పెద్దగా తెలియదు అని. చర్చ ప్రారంభించిన టీచర్ గారికి కూడా ఇన్ని లక్షలమంది వలస వెళ్ళారు అంటే ఆశ్చర్యం వేసిందట. ఈ పుస్తకం గురించి  బళ్ళో హిస్టరీ టీచర్ల కి చెబుతానని చెప్పారు.

భారతదేశం చరిత్రలో మర్చిపోలేనిది దేశవిభజన. దీని గురించి పిల్లలకి చెప్పాలి అనుకునే తల్లితండ్రులు ఈపుస్తకం తప్పకుండా చదివించాలి. ఇంకా విషయాలు తెలుసుకోవడానికి ఈపుస్తకం ప్రారంభం అవ్వచ్చు. ఇక్కడ ఇంకోవిషయం కూడా చెప్పాలి. చర్చించడానికి బడికి వెళ్లే ముందు పుస్తకం బయట పెట్టేసరికి, మాపెద్దమ్మాయి హోంవర్క్ పక్కనపడేసి ఈపుస్తకం చదువుతూ కూర్చుంది.  ‘I never knew that partition was this painful’ అంది.

అమెరికాలో  పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తే  మన వాళ్ళే అన్నట్లు మాట్లాడుతాము. ఎన్నో కబుర్లు చెప్పేసుకుంటాము. ఆనాడు ఉన్నట్టుండి అంత బద్ధ శత్రువులుగా ఎలా మారిపోయారా  అనిపిస్తుంది.