వరసలు

‘చందు మామ్మా !! రామ్ తాత కి ఫోన్ ఇవ్వు’ వరస కనిపెట్టేసిన 8 ఏళ్ళ మా ఆడపడుచు మనవడి మాటకి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. మా ఆడపడుచు ‘మరీ పాపం మామ్మ ఏవిట్రా? అత్తా అను’ అని చెప్పారు. ‘పర్వాలేదు వాడిని అలాగే పిలవనివ్వండి’ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అమ్మకి అత్తని కానీ, వాడికి కాదుగా!! మా వారి – పిన్ని- బావగారి కొడుకు – కూతురు పెళ్లయ్యాక అమెరికాకు చేరి మాకు ఫోన్ చేసింది. నన్ను ‘ఆంటీ’ , మావారిని ‘ అంకుల్’ అంది. అప్పుడు వరస చెప్పి ‘కాదమ్మా పిన్ని, బాబాయి అని పిలు’ అని చెప్పాను. మా అత్తల పిల్లలందరూ నన్ను ‘అక్కా’ , మావారిని ‘ అన్నా’ అంటుంటారు. ‘వదినా అని పిలవండే. లేకపోతే మా వరస మారిపోతుంది’ అని చెప్తాను. మా వారు కూడా వరసలు మార్చేస్తుంటారు. గుర్తు చేసి మరీ చెప్తుంటాను ‘మీరు, నేను ఒకే వరస పెట్టి ఎవరినైనా పిలిస్తే మన వరస మారిపోతుంది’ అంటూ . చిన్నప్పుడు మా తమ్ముడిని, దూరపు చుట్టమైన ఓ బుల్లి కజిన్ చక్కగా ‘బావా’ అంటుంటే ఆ పిల్లేదో తనని కావాలని ఏడిపిస్తుందనుకుని ‘కొడ్తా నిన్ను ఇంకోసారి అలా పిల్చావంటే’ అని బెదిరించేసాడు. మా నాన్న మేనమామలు, పిన్ని దాదాపు ఓ 4-5 ఏళ్ళ లోపు ఆయన వయసు వారే. ‘అరేయ్’ అని పిల్చుకోవడమే కాదు. అందరూ కలిసి అల్లరి కూడా చేసేవారట. ఆ మేనమామల్ని మేము ‘తాత’ అనే వాళ్ళం(మాకు చిన్నప్పటినుంచీ చాలా లాజిక్ కదా!! ). వాళ్ళు ‘మామ’ అనండర్రా అని మొత్తుకునేవారు. వాళ్ళ పిల్లల్ని ‘పిన్ని, మావయ్య ‘ అనడానికి ప్రయత్నించేవాళ్ళం. వాళ్ళకి కోపాలు వచ్చేవి. మా అక్క కొడుకుని మా బాబాయి ‘నన్ను తాత అనాలి రా’ అంటే వాడు, ‘నువ్వలా లేవు. నేను అనను’ అనే వాడు. పొంగిపోయేవాడు మా బాబాయి.

ఇంటికెవరైనా తెలియని వారో, స్నేహితులో వస్తే , ‘అత్తయ్య, మావయ్యా’ అనే వాళ్ళం. ఈ రోజున పిల్లలు ‘ఆంటీ, అంకుల్’ అంటూ పిలుస్తూ, కనీసం అత్తగారిని కూడా ‘అత్తయ్య/అత్తమ్మ’ అనట్లేదు. అత్తగారు ‘ఆంటీ’ , మావగారు ‘అంకుల్’ అయిపోయారు !! అమెరికాలో మా పిల్లల బళ్ళో, ఒక దేశీ Math club coachని దేశీ పిల్లలందరూ ఇలాగే ‘అంకుల్’ అని పిలవగానే, ఓ పిల్లాడికి ( ఇంకో దేశం) సందేహం వచ్చింది ‘Are you guys related?’ అన్నాడు. ‘No. That’s an Indian way of calling’ అంటూ మా పిల్లల సమాధానం !!

భారతదేశంలో ఉన్న ఇతర భాషలలో ‘వరసల’ గురించి నేను ఇప్పుడు చర్చించదలచుకోలేదు. కాబట్టి అవి పక్కన పెట్టేస్తాను. ఈ వరసలు అనేవి ఎన్ని రకాలో !! అక్క, చెల్లి , అన్న, తమ్ముడు, మేనత్త ,మేనమామ, బావ,వదిన,పెద్దమ్మ , పిన్ని, పెద్దనాన్న, బాబాయి, అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మ, తాతమ్మ, ముత్తాత !!, ప్రతీ విషయాన్నీ చాదస్తం క్రింద పక్కన పెట్టేస్తున్నాం. మనం పిల్లలకి ఎవరు ఏ వరస అవుతామో కనీసం చెప్పను కూడా చెప్పటం లేదు. ముఖ్యంగా దూరపు బంధువుల వరసలు!! వారికి అర్ధం అవ్వదు అనే అనుకుంటాం. పైగా అదో టైం వేస్ట్ పని అన్నట్లు ‘ఎలా పిలిస్తే ఏముందీ’ అనేస్తాం కూడా. ‘వరస’ అనేది తెలుసుకోవాలంటే కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాల్సిందే కదా !! అది చెప్తే పిల్లలకి కొంచం బుర్ర పెరుగుతుందేమో కూడాను!! వరస పెట్టి పిలిచే పిలుపులో కనిపించని ఆప్యాయత కూడా ఉంటుంది

మేనత్త/ మేనమామ పిల్లలు వేరు. పిన్ని & బాబాయిల పిల్లలు వేరు. అమ్మ కి అమ్మమ్మ. నాన్నకి అమ్మ నానమ్మ. ఎందుకు పెట్టారో ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, వయసుతో నిమిత్తం లేకుండా ‘నీ తరం వేరు. నా తరం వేరు’ అని ఖచ్చితంగా చెప్పడానికే పెట్టారేమో అని. ఛేదించగలిగితే వంశవృక్షాలు కూడా చేధించవచ్చునేమో మరి !! ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మన సంస్కృతి భద్రంగా దాచి మనకి ఇస్తే, మనం దాన్ని చెత్త అనుకుని పక్కన పడేస్తున్నాం కదూ !!

 

నన్ను దడిపించిన ‘అల్లరి’

నేను అమెరికా వచ్చిన కొత్తల్లో  మావారు నన్ను తన స్నేహితుడొకాయనకి పరిచయం చేస్తూ ‘ ఇదిగో! ఈవిడా హైద్రాబాదే ‘ . ఆయన చాలా సంబర పడిపోయి  ‘ఎక్కడ’ అన్నారు. ‘నల్లకుంట & విద్యానగర్’ అని చెప్పి ‘ మీది’ అన్నాను. ఆయన ‘టప్పాచ పుత్ర. తెలుసా?’ అన్నారు. నాకు  బాగా నవ్వొచ్చేసింది. ఆపుకుంటూ ‘ఎప్పుడూ వెళ్ళలేదు కానీ విన్నాను’ . ఆయనకి నేను నవ్వు ఆపుకుంటున్నానని అర్ధమయ్యింది. ఆయన నవ్వేసి ‘ ఆ ఏరియా ఎందుకు తెలీదండీ తెలుస్తుంది. కర్ఫ్యూ  ఏరియా కదా’  అన్నారు.

నా చిన్నప్పుడు హైదరాబాద్లో బోనాలో, నిమజ్జనమో అంటే ముందు వచ్చేది  కర్ఫ్యూ. ఇక రంజాన్ కూడా కలిస్తే కర్ఫ్యూ పండగే !! రేడియో లోనో, టీవి లోనో చెప్పేవారు ‘టప్పాచ పుత్ర, ఆసిఫ్ నగర్, చాదర్ ఘాట్,  మంగళ్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్ , చార్మినార్, అఫ్జల్ గంజ్…..(ఇంకా ఏవో ) ప్రాంతాలలో కర్ఫ్యూ విధించడమైనది’ అంటూ. ఆ ప్రకటన వచ్చినపుడు  మా మావయ్య మాతోనే ఉంటే, ‘ఏవిటే మీఊర్లో పేటల పేర్లు. టప్పాచ పుత్ర ఏమిటి? అర్ధంతెలుసా నీకు? బిట్రగుంటలో పేర్లు చూడండే ఎంత బావుంటాయో’ అని ఏడిపించేవాడు. కోపం వచ్చేది నాకు. ‘బోగోలు ఏమన్నా బావుందా’ అని పెద్ద వాదన వేసుకునేదాన్ని. ఏదో snow season లాగా కర్ఫ్యూ season  అది. ఆ ప్రాంతాలలో బళ్ళకి సెలవులు. అందుకే అంత బాగా గుర్తుండిపోయాయి.

మా నాన్న మావయ్య వాళ్ళు సైదాబాద్లో ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇంటి నుంచీ వస్తూ సైదాబాద్ బస్టాండ్లో మేము కోటి బస్సుకోసం వచ్చి నిల్చున్నాము. వాళ్ళ అబ్బాయి శ్రీను మమ్మల్ని బస్సు ఎక్కిస్తానని వచ్చాడు. ఓ కూరల కొట్టు పక్కనే నిల్చున్నాం మేము. ఇక ఒక కథ మొదలు పెట్టాడు. కర్ఫ్యూ వదిలిన సమయంలో ఆ  కూరల కొట్టు దగ్గర తల్వార్లు పెట్టి ఎలా పొడుచుకున్నారో చాలా detailed గా ‘అరే ! ఎట్లా పొడుచుకున్నార్ తెల్సా ‘ అంటూ కళ్ళకి కట్టినట్లు చెప్పాడు. నేను దడుచుకోవడం చూసి మా నానమ్మ ‘వాడు అన్నీ కోతలు కోస్తాడు’ అని చెప్పింది మాకు. తరువాత కొన్నాళ్ళకి వాళ్ళ ఇంట్లో పైన గదులు వేసి ఇల్లు గృహప్రవేశం అన్నారు. ఆ సాయంత్రానికల్లా కర్ఫ్యూ ( నాకు తెలిసిందల్లా ఒక్కటే. According to శ్రీను, కర్ఫ్యూ అంటే చంపేస్తారు)!! అమ్మ ఆవిడకి సహాయం అంటూ ముందే వెళ్ళిపోయింది. ఆవిడని దింపడానికి నాన్న, వాళ్లతో బాటే తమ్ముడు బండి మీద వెళ్లిపోయారు. దేనికైనా భయపడని మా నానమ్మేమో అమెరికాకి వెళ్ళింది. నన్ను, మా అక్క ని బడికి వెళ్లి వచ్చాక బాబాయి & పిన్నితో కలిసి రమ్మని చెప్పారు. పిన్నేమో కొత్త. అక్కకి పిరికిదాన్నని చులకన. భయపడి చచ్చా !! కోటి వెళ్లెవరకూ బానే ఉన్నా. తరువాత  కోటిలో బస్సు దగ్గర ఆ జనాలని చూసి ఏడుపు తన్నుకు వచ్చేసింది. నా ఏడుపు చూసి ఆటో మాట్లాడాడు బాబాయి. వాడి ఛార్జీలకు దడుసుకుని మళ్ళీ బస్సే ఎక్కించారు. బస్సులో అందరూ నాకేదో అయ్యిందనుకున్నారు. మొత్తానికి క్షేమంగానే వెళ్ళాము. ఎలా వచ్చామో మరి గుర్తు లేదు.

ఇప్పుడు నవ్వొస్తుంది కానీ ఆరోజుల్లో భయపడి చచ్చేవాళ్ళు జనాలు.  నాకు తెలిసి కొందరు ఈ గొడవల వల్ల భయపడి ఎంత చవకగా వచ్చినా అటువైపు ఇల్లు కూడా కొనుక్కునేవారు కాదు.

‘గుజరాత్ అల్లర్లు’ అంటూ ఎవరో మాట్లాడుతూ  ఉంటే, నన్ను దడిపించిన ఈ ‘అల్లరి’ కూడా నాకు గుర్తొచ్చింది.

ఏదో అందరితో పంచుకుందామని సరదాగా వ్రాసిన టపా