విజయం ఎవరిదయినా విజయమే కదా?

రెండేళ్ళ  క్రితం అనుకుంటాను, భారత సుప్రీమ్ కోర్టు ఒక అతీతమయిన కేసు లో –  ఓ భార్య, తన భర్త ను ఆయన మీద ఆధారపడ్డ తల్లితండ్రుల నుంచి బెదిరించి విడదీయాలని చూస్తే,  ఆ భర్త ఆవిడకి విడాకులు ఇవ్వవచ్చు– అని తీర్పు ఇచ్చింది. ఇక చూడండి !! ఇదెక్కడి న్యాయం అంటూ వాట్సాప్ లోనూ, fb లోనూఓ పెళ్లికూతురు ఫోటోతో సందేశం.  ముఖ్యంగా ఆడవారి దగ్గర నుంచీ. దీని గురించి ఓ టపా కూడా వ్రాసిన గుర్తు నాకు. ఎక్కడ ఆశ్చర్యం వేసింది అంటే, సోషల్ మీడియాలో ఎంత మాత్రం active గా ఉండని వారు కూడా ఆ కేసు విషయంలో తెగ react అయిపోయారు. ఇక శబరిమల తీర్పు వచ్చినపుడు సంగతి గురించి విడమరచి చెప్పనే అక్కరలేదనుకుంటా. 

 

మొన్నటికి మొన్న ‘తానా’ పత్రిక బొమ్మ గురించి ‘అమ్మాయి పరికిణీ వేసుకుంది, అబ్బాయి దుక్క లాంటి జీన్స్ వేసుకున్నాడు’, ‘very stereotypical’ అంటూ ఓ పెద్ద చర్చ!!  రేయింబగళ్ళు కష్టపడి ఆ పుస్తకానికి అంత అందంగా అచ్చు వేయిస్తే (వాలంటీర్లే. పైగా ఇది వారి profession కూడా కాదు), లోపల వ్రాసిన విషయాల గురించిన చర్చ కాకుండా బొమ్మ మీద  చేసిన అంత ఘాటైన విమర్శలు & వారి ఆలోచనాతీరు చూసి చాలా ఆశ్చర్యపోయాను. 

 

ఇక్కడ  ‘తానా పత్రిక’, సుప్రీమ్  కోర్ట్ తీర్పు, శబరిమలలో మహిళల  ప్రవేశం అనేది చర్చనీయాంశం అనట్లేదు నేను. .  దీనినిబట్టి అర్ధమవుతుంది ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి కూడా మనం స్పందిస్తాము అని. కాదనలేని విషయం. ఒకవిధంగా మంచిదే. విషయమే. ఇలా మహిళలు తెగించి పోరాడారు/పోరాడుతున్నారు కాబట్టే  ఎన్నో సాంఘిక దురాచారాల నుంచీ బయటపడి, ఈ తరం స్త్రీలు ఆ స్వేచ్చని అనుభవిస్తున్నారనే చెప్పాలి.. కానీ అమ్మాయిలు విమానాలు నడిపేస్తున్న ఈరోజుల్లోకూడా కొంతమంది స్త్రీలు కొన్నిదురాచారాల కోసం పోరాడుతూనే ఉన్నారు. అదీ, అతి పెద్ద ప్రజాస్వామ్యం  అని గర్వంగా చెప్పుకునే  భారతదేశంలో !! అదే triple talaq !!సోషల్ మీడియాలో కానీ,  ఓ కథా వస్తువు గా కానీ పెద్దగా స్పందించని విషయం. మూడు మార్లు ‘తలాక్’ అని చెప్పగానే ఆ భార్యాభర్తల బంధం   తెగిపోయినట్లే. ఇస్లాము మతం చెప్పినట్లే చేస్తున్నాం అంటూ, మూడు మార్ల మంత్రాన్ని జపించిడానికి ప్రపంచంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారుట. వాట్సాప్, ట్విట్టర్, ముఖపుస్తకం, విద్యుల్లేఖ ఏది దొరికితే అది!!  ప్రపంచంలో ఇస్లాం దేశాలే ఈ విధానం తప్పు అంటుంటే, ఆ విధానం భారతదేశంలో ఉండటం, అది నేరం క్రింద నమోదు చేయడానికి ఏ చట్టము లేకపోవడం ఆశ్చరం కాదా? రాముడు అన్యాయంగా సీతని అడవిలో వదిలేసాడని అని తిడతారు కొందరు. గురజాడ వారి  ‘కన్యాశుల్కం ‘ , కందుకూరి వీరేశలింగం పంతులుగారు జరిపిన వితంతు వివాహాల గురించి ‘మా తెలుగే వారే’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేస్తారు. అటువంటిది, ఈ రోజుకి కూడా సంఘంలో ఇంతటి అన్యాయం, దురాచారం జరుగుతున్నా మహిళా సంఘాలు, మానవతావాదులు మాట్లాడగా  నేను వినలేదు.. ఆశ్చర్యంగా లేదా? 

 

అంతే  కాదు. మొన్న triple talaq bill  గురించిన వార్త వచ్చాక, ఎన్నో విషయాలు చర్చించే సోషల్  మీడియా లో మాత్రం దాని గురించి పెద్ద చర్చ లేదు. హర్షం ఎవరూ చూపించడం లేదు. ఎందువలన ? విజయం సాధించిన మహిళలు మైనారిటీలనా లేక ఆ మతవిషయాలలో తలదూర్చకూడదనా లేక సాటి ముస్లిం స్త్రీలకి  అన్యాయాలే జరగలేదా లేక భాజపా ఆ బిల్లు తెచ్చిందనా? 11 ఏళ్ళ పిల్లని అరబ్బుషేకుకి పెళ్ళి పేరుతో అమ్మేస్తే ఒక ఎయిర్ హోస్టెస్ ఆ పిల్లని రక్షించింది. అది మర్చిపోయామా మనం? ‘Baazaar’ సినిమాలో చూపించిన అన్యాయం నిజం కాదా?  ‘సారంగ’ లో అనుకుంటాను ఒక ముస్లిం రచయిత్రి వ్రాసిన ఒక కథ చదివాను. కథ పేరు గుర్తులేదు. అది కథలా అనిపించలేదు. చదివాకా ఓ రోజు నిద్రపోలేదు. కథ ఏంటంటే అరబ్బు దేశాలనించి వచ్చేషేకులు, ఆడపిల్లల్ని ఒక్కరోజుకి (ఒక్క రాత్రికి అంటే బావుంటుందేమో) పెళ్లిచేసుకుని, ఆ రోజుకి విడాకులు ఇచ్చేస్తారు. ఇంకో మారు ఇంకో అమ్మాయినిపెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి కూడా ఎప్పటికప్పుడు భర్తలు మారిపోతుంటారు. ఒక తల్లి పిల్లల్ని పోషించలేక, పెళ్లిళ్లుచేయలేక  తన కూతురి జీవితాన్ని ఈ విధంగా పణంగా పెట్టేయడమే కథ. పవిత్రమైన పెళ్లి పేరు చెప్పి ఇటువంటి సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట వేయటానికి చేసిన ఓ ప్రయత్నమే నిన్న వచ్చిన ఆ చట్టం. 

 

ఓ చట్టం వచ్చినంత మాత్రానా  మార్పులు వచ్చేస్తాయా అంటే రావచ్చు రాకపోవచ్చు.  దుర్వినియోగ పరచవచ్చు కూడా. ఉదాహరణకి కట్నం తీసుకోవడం, బాల్యవివాహాలు ఆగాయా అంటే ఆగలేదు. కానీ నేరం నమోదు చేయడానికైనా ఓ చట్టం అంటూ ఉండాలిగా? 

 

ఏది ఏమైనా పోరాటం చేసి  చేసి అలసిపోయి, ఆ బిల్లు రాగానే మిఠాయిలు తింటూ, ఆనందభాష్పాలతో  సంబరాలు చేసుకుంటున్నా తోటి ముస్లిము మహిళామణుల విజయాన్ని ఆ మాత్రం  అభినందించలేమా ?