పెసర పచ్చడి

ఆరోగ్యకరమైనదీ, పొయ్యి జోలికి పోకుండా సులువుగా  చేసుకోగలిగినదీ  అయిన  తిండి పదార్థం అంటే,  చారు తరువాత ‘పెసరపచ్చడి’  అంటాను నేను.  సాధారణంగా సాయంత్రాలు పప్పు తింటే అరగదని ఇటువంటి రోటి పచ్చళ్ళు చేస్తుంటారు.   మా నానమ్మ చాలా అద్భుతంగా చేస్తుంది ఈ పచ్చడి. రెసిపీ చదివాక ఇందులో ఏముందండీ చేయటం అంటే నేను చెప్పలేను. ఆ పచ్చడి రుబ్బే విధానంతోటే రుచి వస్తుంది. .ఆవిడ చేసినట్లు రానే రాదు నాకు.

చాలా మంది చేస్తారు. గూగుల్ అంతా గాలించినా సరియైన ‘పెసరపచ్చడి’ ఫోటో కానీ రెసిపీ కానీ కనిపించలేదు నాకు. అందుకే తెలీని వారికి  తెలుస్తుంది అని ఈ రెసిపీ మరియు ఫోటో :

కావలసినవి:

నానబెట్టిన పెసరపప్పు (నీళ్లు వాడ్చేయాలి)

ఎండుమిర్చి

జీలకర్ర

తగిన ఉప్పు

పోపు (optional) :

ఓ చెంచాడు నూనె లోకి

జీలకర్ర

ఆవాలు

మినపప్పు

ఇంగువ

ముందు  ఎండుమిర్చి రెండు, మూడు ముక్కలుగా విరిచేసి కచ్చాపచ్చాగా (అంటే crushed  red  pepper flakes లాగా) దంచాలి.

నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, తగిన ఉప్పు  చేర్చి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.  నేను food processor  వాడతాను. అందుకే మరీ మెత్తగా రాదు.

తరువాత  కావాలంటే పోపు పెట్టుకోవాలి.

అన్నంలో కలుపుకుని  నెయ్యి  వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఎండుమిర్చి తగ్గించి పిల్లలకు పెట్టచ్చు. వడపప్పు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి మిగిలిన వడపప్పు ఇలా చేసేసుకోవచ్చు.

గూగుల్ లో రెసిపీలుచూస్తే మామిడికాయ లేకపోతే నిమ్మకాయ/ చింతపండు రసం పిండినట్లు  చెప్పారు. నన్నుఅడిగితే వద్దనే అంటాను. ఎందుకంటే పులుపు పదార్థాలు కలిపితే ఈ పచ్చడికి ఉన్న చక్కటి కమ్మటి రుచి పోతుంది.

వంట/ వంటిల్లు

‘ The Great Indian Kitchen ‘ సినిమా గురించి ఓ review చదివిన , వెంటనే చెప్పాను ‘ఇదేదో ఓ కుట్రలా ఉంది’ అని. ఆ review పంచినావిడ కి కోపం వచ్చి ‘ హిందూ మతానికి మీరొక్కరే జవాబు దారీ నా ?’ అంటూ నన్ను ‘unfriend ‘ చేసిందావిడ. ఎందుకు ఆ విధంగా అన్నానో ఆవిడకి కూడా కనిపిస్తుందని ముఖపుస్తకంలో ఈ టపా వ్రాసాను. బ్లాగుకి ఎక్కించడం మరచిపోయాను. అందుకే ఈ రోజు ఇలా ఈ టపా 🙂

బారసాల మొదలుకొని తద్దినం వరకూ తిండి అనేది సంస్కృతిలో ఓ పెద్ద భాగమే. ప్రపంచంలో ఎక్కడయినా ఎవరికైనా!! హిందూ సంస్కృతిలో వినాయకచవితి అంటే ఉండ్రాళ్ళు, దసరా అంటే రకరకాల అన్నాలు , సంక్రాంతి అంటే అరిసెలు, జంతికలు ఇలా పండగ అంటే చాలు పిండివంటలు, నైవేద్యాలు. ఏ దేవుడూ ఫలానా పదార్థం నివేదన చేయకపోతే వరాలు ఇవ్వను అని ఏం చెప్పడు. కానీ చేసేస్తాం. పండగ అంటే దేవుడికి ఓ నమస్కారం చేసి కూర్చోండి చాలు అంటే అది పండగలా ఉంటుందా అసలు? ఒక్కసారి ఊహించుకోండి తిండి అనేది లేని వేడుకల్ని. అంటే 100 course menu అని చెప్పటం లేదు. అంతే కాదు ఒక్కరమే కూర్చుని తింటే ఏ పదార్థమైనా రుచి ఉండదు. ఆ పండగలో కుటుంబంలో అందరితో కలిసి ఆ పదార్థాలు తింటేనే ఆనందం.

వంట అనేది ఓ కళ. ఎంత ఇష్టంగా చేస్తే తెలీకుండానే అమృతమైన రుచి వస్తుంది. ‘ఎందుకు చేయాలి ‘ అంటూ కష్టంగా చేస్తే ఆ వంట కూడా ఏడుస్తున్నట్లే ఉంటుంది. మా తాతయ్య అటువంటి వంటలకి చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టేవారు. నవ్వలేక చచ్చేవాళ్ళం. సరే వంట ఎవరు చేయాలి ? పెద్ద పెద్ద కేటరింగ్ అంటే నలభీములు ఉంటారు. ఇంట్లో ? ఇంట్లో ఆడవారే చేస్తారు. అమ్మ, నానమ్మ , అమ్మమ్మ . ఒక్కొక్కరితో ఒక్కో వంటకం ప్రత్యేకం ఉంటుంది. అదే వాళ్ళతో మనకి ఓ అనుబంధం ఏర్పడేలా చేస్తుంది.

సంస్కృతి అంటే పైన చెప్పినంత అందంగా ఉంటుందా ? ఉండదు. ఎక్కడో ఒక చోట అనుబంధాల కోసం తపిస్తూ, వంట చేసే ఆడవారి passionని అలుసుగా తీసుకుని ఓ దురాచారం గా కూడా ఉంటుంది. ఇటుపుల్ల అటు పెట్టకుండా ఆడవారితో అన్నీ చేయించుకునే మగవారు ఉండేవారు/ ఉన్నారు.

***********************************************

ఓ సంస్కృతిని నాశనం చేయాలి అంటే, దానిలో భాగంగా ఈ ‘ తిండి’ అనే దానితో లంకె వేసుకున్నవన్నీ నాశనం చేస్తే సగం నాశనం చేసినట్లే . ఇది భారత దేశంలో, అదీ హిందూ సంస్కృతి పైన ఖచ్చితంగా జరుగుతోంది.

1. లోకల్ తిండి నాశనం చేయాలి: 👇👇

ఓ 20 ఏళ్ళ క్రితం భారతదేశంలో oatmeal, avocado, pasta, pizza, burger ఇటువంటివి విరివిగా తినడం విన్నారా ? తినటం మంచిది కాదు అని నేను అనట్లేదు. ఈ oatmeal , avocado అనేవి లోకల్ కాదు. అయినా ఆరోగ్యమైన తిండి జాబితాలోకి ఎక్కాయి. లోకల్ గా లభ్యమయ్యే కొన్ని ఆరోగ్యమైన తిండ్లు కనుమరుగయ్యాయి.

2. ఆ తిండితో కూడుకున్న వేడుకలు నాశనం చేయాలి.: 👇👇

ప్రతీ హిందూ పండగనీ ఏదో విధంగా హేళన / విమర్శిస్తుంది మీడియా. ఆఖరికి ‘తద్దినం పెడితే వాళ్ళు వచ్చి తింటారా పెడతారా’ అని ఇంట్లో తద్దినాలు కూడా మానేసే స్థాయికి వచ్చారు జనాలు.

3. ఆ బంధాలు & అనుబంధాలు నాశనం చేయాలి: 👇👇

మనది పితృస్వామ్యం. అది పోతే దేశం బాగుపడుతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళతో పాటూ వంట చేయాలి. ఇంట్లో పనులు చేయాలి. చేయకపోతే మొగుడితో పోట్లాడాలి. అదే స్త్రీ వాదం .

ఇప్పుడు కొత్తగా ఏమి చేయాలంటే: 👇👇

‘ఆదిశక్తి & అన్నపూర్ణ’ లాంటి మాటలు చెప్పి పొగుడుతూ ఆడవారిని బానిసలగా చేసిన పితృస్వామ్యం వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే, ముఖ్యంగా ‘హిందూ’ కుటుంబాలలో జరిగే తంతు చూడాలంటే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ లాంటి చక్కటి సినిమాలు చూడాలి.

ఇక్కడ ఓ సందేహం రావచ్చు. ‘అంటే ఇటుపుల్ల అటు పెట్టకుండా ఆడవారితో అన్నీ పనులు చేయించే మగవారిని సమర్థిస్తున్నారా ‘ అని. పొరపాటున కలలో కూడా అటువంటి పనులు చేయను. నా ఉద్దేశ్యంలో అది మొత్తానికే వేరే విషయం.

సినిమా బావుందా బాలేదా అని నేను మాట్లాడ్డం లేదు. చూసానా చూడలేదా ప్రశ్న కాదు. సంస్కృతిలో ఒక దురాచారం అంటూ కనిపించగానే ఆ దురాచారామే ఆ సంస్కృతిగా చూపించడం మేధావుల ఉత్తమ లక్షణం. వీళ్ళ వ్రాతలు ఎంత అందంగా వ్రాస్తారో, ఇటువంటి సినిమాలు అంతే అందంగా తీయగలరు. సినిమా చాలా బాగా తీసి ఉండవచ్చు. రేపు ఆస్కార్ లాంటి అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. అప్పుడు ఎవరైనా బయటివారు ‘ఇలా ఆడవారిని కించ పరచడమేనా మీ భారతీయ సంస్కృతి’ అంటే ‘అంతే. నిజమే. మా సంస్కృతిలో మగవాళ్ళు ఏ పనీ పాటా చేయరు’ అంటూ పిల్లల కోసం పొద్దున్నలేచి బండ చాకిరీ చేసే తండ్రుల్ని కూడా కలిపేసి మరీ గొప్పగా చెప్తాము.

ఎంత preplanned గా narrative ని తెస్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేధావులు అని వీళ్ళని ఊరికే అనరు.

Natural Living

Global Climate change/Global warming.  ఈ మాట వింటేనే చాలా చిరాకొస్తోంది ఈ మధ్య. ఎవరినైనా గద్దె ఎక్కించడానికి/దింపడానికి  వాడుకునే పదం అని స్పష్టంగా  అర్థమయ్యింది.. 

ఏదో  నాలుగు వ్రాతలు చదివో /వినో నేను ఈ మాట చెప్పడం లేదు. నాలో నేను వేసుకున్న ప్రశ్నలు. కేవలం తర్కం మాత్రమే!! 

భూమాతని బాధపెడుతున్నాము అనిపించినపుడల్లా  చాలా సార్లు పోస్టులలో నా ఆవేదన కూడా వ్యక్తపరచాను.

చిప్స్ సంచీలు మరియు పర్యావరణం పై వాటి ప్రభావం

ధరిత్రీ దినోత్సవం -2017

ధరిత్రి దినోత్సవం

అమెరికాలో  ప్లాస్టిక్ వాడకుండా రోజు గడవదు..ఉరుకుల పరుగుల జీవితాలు. 

అంట్లు తోముకోవడానికి సమయం చిక్కదు. disposable వాడేస్తే ఆ రోజుకి కంచాలు , గ్లాసులు కలిసొస్తాయి. అమెరికాలో కొన్ని కుటుంబాలలో ఇవే రోజూ వాడతారు అంటే అతిశయోక్తి కాదు. costco, walmart  లాంటి కొట్లలో అతిచౌకగా దొరుకుతాయి ఈ వస్తువులు. $10-12 పెడితే 200 plates.  Go green అంటూ అదే compostable plates walmartలో అయితే 125/$25. రెట్టింపు ధర!!  

అమెరికాలో మేము అంట్లు తోమాల్సివస్తుందని  ఒక్కోసారి వంట కూడా తప్పించేసుకుంటాం. బయట నుంచీ తెప్పించుకోవడం ఒక దారి. లేదా frozen food తెచ్చుకుని వేడి చేసుకోవడం ఇంకోదారి. అదీ కాదూ!!  frozen కూరలు తెచ్చుకుని పోపులో వేసుకోవడం. ఓ గంట సమయం ఆదా కోసం disposablesని రకరకాల రూపాల్లో ఉపయోగించి భూమాతకి భారాన్ని పెంచేస్తాము. ఇలాంటప్పుడూ మాకు ఏ global warming అనేది గుర్తు కూడా రాదు.

organic తినమని/naturalగా బ్రతకమని అమెరికాలో ప్రతీ ఒక్కడూ చెప్పేవాడే. ఖర్చు లేకుండా/తక్కువలో ఎలా చేయాలో మాత్రం ఎవరూ చెప్పరు. ఇక్కడ నా అనుభవం ఒకటి చెప్తాను.మా పాత ఆఫీసులో పొద్దున్నే ఓ  పెద్దావిడతో వంటింట్లో కబుర్లు చెబుతూ చిన్నపుడు మా బడి బయట జామకాయలు,  రేగిపళ్ళు ఎలా ఎగబడి కొనుక్కునేవాళ్ళమో చెప్పి, ‘మధ్యతరగతి వాళ్ళం కదా candy అంటే మాకు అందుబాటులో ఉండే వస్తువు కాదు ఆరోజుల్లో’ అన్నాను. దానికి ఆవిడ ‘ఇక్కడ మధ్యతరగతికి పళ్ళు అంటే ఈరోజుకి కూడా luxury నే. సంవత్సరం పొడుగునా అలా పండవు కదా. అదే ఏ packaged  food అనుకో. ఇంటిల్లి పాది తినచ్చుకదా.’ అంది. చాలా తేలికగా చెప్పినా నిజం!! అమెరికాలో ప్రతీ పండక్కి కొట్లలో అమ్మే candy అతిచౌక. అదే అరటిపండు కొనాలంటే 45cents/లlb తక్కువ ఎవరూ అమ్మరు. వీలైతే ఇంకో పదిసెంట్లు వేసి ‘ఇది organic ఫలం’ అని చెప్తారు. Vitamin C డబ్బాలో పెట్టిన మాత్ర తింటే చౌక.అదే ఏ clementine/ orange/kiwi కొనాలి అంటే అంత కంటే ఖరీదు పెట్టాలి. 

ఓ steel bottle కొనాలంటే కనీసం $10 పెట్టాలి. ఆ ఖరీదుతో  నీళ్లతో సహా bottles దొరుకుతుంటే steel bottle ఎవరు కొంటారు :)?  

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.

ఆదిమానవుడిలా బ్రతకాలి అని చెప్పట్లేదు. Global Climate change/Global warming అంటే దేశాలన్నీ Agreementలు వ్రాసుకోవడం కాదు. అమెరికాలాంటి దేశంలో ఓ మధ్య తరగతి మానవుడు కనీసం ఓ పూట తిండి తినడంలో నైనా naturalగా జీవనం గడపగలగడం. సంవత్సరం  పొడుగునా పంటలు పండించే భారత్ లాంటి దేశాల అవసరం ప్రపంచానికి చాలా ఉంది. చిన్న వయసులో పెద్ద పెద్ద మాటలు  మాట్లాడే Greta Thunberg  లాంటి వారికీ ఇంత చిన్న తర్కం తెలీదా  లేక ఆవిడ మాటలు చిలకపలుకులా ?  

రేపు ఇంకో టపాతో ….మళ్ళీ