‘స్వస్తిక్’ గుర్తు గురించి మాట్లాడొచ్చా?

హిందువుల పండుగలప్పుడు ముఖ్యంగా దీపావళి ముగ్గులలో సర్వసాధారణంగా కనిపించేది స్వస్తిక గుర్తు. ఇది శుభానికి సంకేతం. ఇది భారతీయ హిందువులకి అందరికీ తెలిసినదే.

అమెరికాకి వలస వచ్చాక కానీ కొందరు హిందువులకి తెలియదు ఇది ఎక్కడపడితే అక్కడ వాడితే ప్రమాదాల్లో ఇరుక్కుంటారని. ముఖ్యంగా భారతదేశం నుండీ వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా తెల్సుకోవాలి.

ఈ మంగళప్రదమైన గుర్తుని 45 డిగ్రీల కోణంలో తిప్పి తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం యూదు జాతి మీద ప్రయోగించి మారణహోమం సృష్టించారు కొందరు దుర్మార్గులు. అందుకే ఈ గుర్తుని ఒక ‘hate symbol ‘ గా అమెరికాలో పరిగణిస్తారు. కొన్ని రాష్ట్రాలు, బడులు చట్టాలు కూడా చేసాయి.

మూడు రోజుల క్రితం ఒక ప్రభుత్వ కార్యాలయంలోని లిఫ్ట్ లో ఈ గుర్తు కనిపించిందని అమెరికా అధ్యక్షులు ఇటువంటి హింసాత్మకమైన ఆలోచనలకి ఇక్కడ చోటు లేదు అని స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు. ఎవరు పెట్టారు ఏమిటీ అనేది కూడా investigation కూడా జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఆయన చెప్పింది అక్షరాలా సరియైనదే. దాన్లో సందేహం లేదు.

ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే అమెరికా లో హిందువులు కూడా నోరు విప్పి మాట్లాడాలి. మాట్లాడకపోతే కూడా జరిగే నష్టాలు ఉంటాయి. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు. ఇదివరకు రోజుల్లో ఇంట్లోనే పూజలు చేసుకునే వాళ్ళం. బాధ లేదు. ఇప్పుడు పూజ చేసాక దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఆ స్వస్తిక్ గుర్తు కలశం మీద ఉండవచ్చు . తోరణాలలో ఉండచ్చు. ముగ్గులలో ఉండచ్చు. పని చేసే కార్యాలయాలలో అవి ఉన్న ఫోటోలు పంచుకుంటే, అవతల వ్యక్తికి హిందూ మతం మీద అవగాహన లేకపోతే మీ గురించి రిపోర్ట్ వెళ్ళిపోతుంది . తప్పులేదు. చెప్పా కదా ఇక్కడ బడులలో కూడా చట్టాలు చేసారు. ఆ బడులకు వెళ్ళే హిందూ పిల్లలు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒక పక్క ‘మన సంస్కృతి కాపాడు’ అంటాము. ఓ పక్క ‘బయట దీని గురించి అస్సలు ఏమీ మాట్లాడకు’ అంటాము. సోషల్ మీడియాలో వాగ్యుద్దాలే జరుగుతుంటాయట. అమెరికాలో అవతల వారికి ఏ ఇబ్బందీ కలిగించకుండా ఎవరి మతం వారు పాటించవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందర్నీ కలుపుకు పోవడమే ఉద్దేశ్యం. నేను బహిరంగంగా హిందూ మత గొప్పదనం గురించి చెప్పమని చెప్పట్లేదు. తెలియని వారికి అవగాహన కలుగ జేయండి అంటున్నాను. Jewish స్నేహితులు ఉన్నట్లయితే వారితో interfaith పెట్టి చెప్పవచ్చు. వారి పిల్లలకి మన పిల్లలకి dialogue ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంటి చుట్టు పక్కల వారికీ చెప్పవచ్చు. మన బాధ మనం చెప్పకపోతే ఎవరూ వచ్చి చెప్పరు. వారికి తెలియదు కాబట్టి.

HAF వారు దీని గురించి చాలా పోరాటాలే చేసారు. న్యూయార్కు రాష్ట్రం లో చట్టం రాకుండా ఆపగలిగారు. మనం ఏమీ కష్టపడకుండానే చక్కటి వీడియో కూడా రూపొందించారు. అవి పంచుకుంటే చాలు. https://www.hinduamerican.org/swastika-reporters-guide

వీలైతే వీరికి donation కూడా ఇవ్వండి. వీరి ‘Dharma Ambassador’ కార్యక్రమంలో పాల్గొనండి. 5 నిముషాలలో హిందూమతం అంటే తెలియని వారికి ఎలా చెప్పాలో నేర్పిస్తారు. ప్రతీ నెలా ఒక session ఉంటుంది. Online లోనే .

కన్యాకుమారి

యావత్ భారతదేశం గురించి చెప్పేటప్పుడు తరచుగా మాట్లాడే మాట ‘ కాశ్మీరు నుండీ కన్యాకుమారి ‘ వరకూ అని. కన్యాకుమారి అనే ప్రదేశం భారతదేశానికి ఓ సరిహద్దు మాత్రమే కాదు. అమ్మవారు నివసించే ఓ పుణ్యక్షేత్రం కూడా. కన్యాకుమారి అమ్మవారు శివుని కోసం ఈనాడు అనబడే వివేకానంద rock మెమోరియల్ మీద తపస్సు చేసినది అని పురాణం. అమ్మవారి పాదాలు కూడా అక్కడ ఉంటాయి.

అమ్మవారు పెళ్ళి చేసుకోకుండా కన్యలాగా ఉండిపోవడానికి ఓ స్థల పురాణం/కథ ఉంది. బకంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కన్యాకుమారి అందరూ అక్కాచెల్లెళ్లు. వాళ్ళని పెళ్లిళ్లు చేసుకున్నాక శివుడు ఈవిడని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ చెప్పిన సమయానికి రాకపోవడం, ముహూర్త సమయం మించి పోవడంతో ఈవిడకి కోపం వచ్చి పెళ్ళి చేసుకోకుండా కన్యలా ఉండిపోతుంది. అంతేకాక ఆ పెళ్ళి మండపంలో ఉన్న వస్తువులని చూసి శపిస్తుంది. అందుకే అక్కడ ఇసుక రకరకాల రంగుల్లో కనిపిస్తుందని చెప్తారు.

2016 లో మేము కన్యాకుమారి వెళ్ళాము. ఆ అమ్మవారిని చూసాక గుడిలో ఏదో విగ్రహమా ఆ తల్లే అలా మనకి దర్శనం ఇస్తోందా అనేది ఆవిడని స్వయంగా దర్శనం చేసుకుంటేనే అర్ధమవుతుంది. అసలు అక్కడ నుంచీ కదలబుద్ధి కాదు. అంత అద్భుతం!!. ఈవిడ ముక్కు పుడక ఎంత మెరిసిపోతుంది అంటే నావికులకి దిక్సూచి లాగా ఉండేదిట. ఇక వివేకానంద rock మెమోరియల్. సముద్రం మధ్యలో ఉంటుంది. ఆయన ఆ సముద్రంలో ఈత కొడుతూ ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడే మూడు రోజుల పాటు ధ్యానంలో ఉండి పోయారు. అక్కడే వారికి జ్ఞానోదయం కలిగింది.

మేము వెళ్ళినపుడు హోటల్ సముద్రానికి ఎదురుగా తీసుకున్నాము. రూమ్ లో నుంచి గుడి, వివేకానంద rock మెమోరియల్, సూర్యోదయం అన్నీ కనిపిస్తాయి. పక్కనే ఓ చర్చినో ఏదో ఉంది. రాత్రి కాసేపు అయ్యేసరికి భక్తి గీతాలు మొదలు పెట్టారు. అర్ధరాత్రి వరకూ అదే తంతు. పుణ్యక్షేత్రానికి వచ్చామా ఇది వినడానికి వచ్చామా అనిపించింది. ఇదే అనుభవం కావాలంటే అమెరికాలోనే దొరుకుతుంది కదా. అక్కడిదాకా మేము ఎందుకు వెళ్లడం చెప్పండి? ఇది వేరే మతాన్ని దూషించడం కాదు. అమ్మవారి గుడి పక్కనే చర్చి ఏమిటి ? ఆ పాటలు ఏంటి ? భారత దేశంలో చర్చి అనేది కొత్తగా వచ్చింది. గుడి అంతకుముందే ఉండినదే కదా. ఇక్కడ ఇంకో మతాన్ని గౌరవించాలి అన్న ఇంగితం లేనిది ఎవరికి?

అంతకుముందు మధురలో కృష్ణుడుని చూద్దాం అని వెళ్తే ఇదే అనుభవం. పక్కన మసీదులో మైకులో ప్రార్థనలు.

ఇతర మతాల పుణ్యక్షేత్రాలలో వేరే మతాల వారు ఉంటారా ? హిందూ మతంలో పుణ్యక్షేత్రాలు అంటే భారతదేశంలోనే చూడాలి. ప్రపంచంలో ఇంకో చోట లేవు. మరి ఇంక పవిత్రత అనేది ఏముంటుంది? ఈ మాట అడిగితే ‘అన్నీ మతాలు ఒకటే. హిందువులకే ఈ మధ్య పిచ్చి పట్టి మతోన్మాదం ఎక్కువయింది’ అంటారు. ఒక పుణ్యక్షేత్రంలో ఆ దేవీదేవుళ్ళ తాలూకు ఆనవాళ్ళు మాయం అయి ఇంకేవో కనిపిస్తుంటే ఆ సంస్కృతి ఉన్నట్టా ? పోయినట్టా?

‘Rakalokam’ ఛానల్ లో కన్యాకుమారి మీద వారి వీడియో చూడండి. నా బాధ ఏంటో అర్ధమవుతుంది.

భావితరాలకి భావజాలం పాఠాలు

అన్వేషి  ఛానల్ వారి వీడియో ఒకటి చూసాను. దాని సారాంశం ఏమిటంటే  ప్రపంచంలో  ఎన్నో  సంస్కృతులు కనుమరుగు అయిపోయినా ,  ఎన్నో వేల  ఏళ్ళ  చరిత్ర  కలిగి &  బ్రతికి ఉన్న ఒకే  ఒక  సంస్కృతి భారతీయ సంస్కృతి అని.  కానీ  బాధ ఏంటంటే ఈ సంస్కృతిని  రక్షించాల్సింది/రక్షించుకోవాల్సింది  పోయి  దీనిని కనుమరుగు చేయాలనే కంకణం  కట్టుకున్నారు చాలా మంది.  ఇది  వరకు పరాయిదేశం నుంచీ/ పరాయి వారి నుంచీ  భౌతిక దాడులు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం  కొన్ని  వింటుంటే సంస్కృతి మీద  దాడి రకరకాల రూపాలు సంతరించుకుంటుంది  అనిపిస్తోంది.  మొన్న పిల్లలకి పాఠాలు చెప్పే వంకతో  తమ భావజాలాన్ని వారికి నేర్పించే కొన్ని వీడియోలు చూసాను. 

మేము  హైదరాబాద్ లో మాడపాటి హనుమంత రావు గారి బళ్ళో చదువుకున్నాము. ఆ బళ్ళో చదివాను కాబట్టే  ఈ మాత్రం తెలుగు చదువుతున్నాను.  సంస్కృతి అంటూ ఏదో  ఒకటి చెప్తుంటాను.  మా బళ్ళో భోజనాల సమయంలో భగవద్గీత బోధించేవారు.   గాంధీ గారి వర్ధంతి రోజు తప్పనిసరిగా గీత చదివేవారు.      

Final  exams  ముందు ప్రతీ తరగతి వారితో  సరస్వతీ  దేవి పూజ చేయించేవారు.   మా  బళ్ళో భవనాల పేర్లు  మొల్ల, ఝాన్సీ , గార్గి,  సరోజినీ దేవి,  లీలావతి,  మయూరి ఇలా ఉండేవి.  మా బడి బ్యాడ్జి  సూర్యోదయం లో విచ్చుకుంటున్న తమ పూవులతో ‘సత్యం, శివమ్ , సుందరం’  అని వ్రాసి ఉండేది.   చక్కగా  జడలు వేసుకుని , పూవులు, బొట్టు పెట్టుకుని వెళ్ళే వాళ్ళం.  ఒక మతాన్ని/సంస్కృతిని దూషించడం అనేది నా గురువుల దగ్గర వినలేదు.  ఈ ఫలానా  సంస్కృతే పాటించాలి అన్న నియమం కూడా ఉండేది కాదు.  అన్ని బళ్ళలో లాగే  ఎన్నో పోటీలు  ఉండేవి.  ‘పైసా fund’  అంటూ  ప్రతి తరగతిలో  గల్లా పెట్టె ఒకటి పెట్టి , వచ్చిన డబ్బులతో పేద విద్యార్థులకి యూనిఫామ్ కుట్టించేవారు.  లైబ్రరీ,Labs  ఉండేవి ఆ రోజుల్లో.  ఉన్నత తరగతి నుంచి పేద విద్యార్థుల వరకు అందరం కలిసి చదువుకునేవారం. మా యూనిఫామ్ లంగా & ఓణీ  లేదా చుడీదార్. 

ఇప్పుడంటే choice  పెద్దగా  లేదు కానీ, ఆ రోజుల్లో  తెలుగు/ఆంగ్ల మాధ్యమం అనే  choice  ఉండేవి. ఆంగ్ల మాధ్యమంలో  చదువుకోలేని  చదువు ఓ చదువే కాదనుకునేవారు చాలా మంది తల్లితండ్రులు (మా నాన్న గారు ఈ బడి బావుంటుంది అంటే చేదు మొహం పెట్టిన వారిని కూడా చూసాను నేను)   ‘St. ‘ అన్న మాట ఉంటేనే ఆ బళ్ళలో చేర్చే వారు. కొన్ని బళ్ళలో తెలుగు నేర్పేవారు కాదు. Rosary convent  ఒకటి అనుకుంటా అందులో. Please correct me if I am wrong.  దానితో  తెలుగు భాష అనేది ఆ తరంలోనే ఆగిపోయింది కొందరి కుటుంబాలలో.  ఆ బళ్ళలో తెలుగులో మాట్లాడితే fine, పూలు  & గాజులు వేసుకుంటే fine కట్టేవారు.  పైగా కొంతమంది అదొక గొప్పలా  చెప్పుకునేవారు. ఆ అమాయకత్వాన్ని తల్చుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. ఒకటి రెండు సార్లు  Inter  school  competitions/field  trips  వెళ్ళినప్పుడు మేము ‘మాడపాటి ‘ అని పేరు చెప్పగానే వెంటనే ‘మీ మొహంలే ‘ అన్నట్టు ఆంగ్లంలో మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళు  తెలుగు  చదవకపోవడం వల్ల  నష్టం ఏముంది అని ప్రశ్నిస్తే  , నా సమాధానం ‘ వాళ్ళకి  ఆంగ్లం ఒక్కటే వచ్చు.  నాకు ఆంగ్లంతో పాటు  తెలుగు కూడా వచ్చు’ .  తెలుగు నేర్చుకోవడం అంటే నాకు తెలియకుండానే  నా ఉనికి నేను తెలుసుకున్నాను.  ఇంకో తరానికి కాస్తో కూస్తో నేర్పిస్తున్నాను. ఓ విశ్వనాథ  అంటే ఎవరో తెలుసు.  ఆయన  ఏమి వ్రాసారో తెలుసు. ఇంకో  తరం వారికి కాస్తో కూస్తో ఆయన  గొప్పతనం చెప్పగలను.    ఆయన రచనల భండాగారం తలుపులు తీసే తాళంచెవి ఖచ్చితంగా అందివ్వగలను.  ఆ రోజుల్లో తెలుగు నేర్చుకోలేని వారికి  వారి జీవితకాలం లో ఓ రైలు తప్పిపోయినట్లే. 

సంస్కృతిని  బ్రతికించాలా  చంపేయాలా అనేది మన చేతుల్లో  ఉంటుంది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం  చెప్పగలను? మన పిల్లలు తెలుగు చదవి దాన్నేం ఉద్దరించక్కర్లేదు లేదులే అని అనుకుని చేసిన పని వలన, తెలుగు సినిమాలకే పరిమితం అయిపొయింది.  

ఆ వీడియోల్లో వారికి  కావలసిన భావజాలం నేర్పుతున్నారు. పిల్లలు  రేపు అదే నేర్చుకోని  అదే భస్మాసుర హస్తం వారి మీదే పెడతారు. 

 భారత దేశం పుణ్యభూమి కావడం వలననేమో కొందరు మహానుభావుల పుట్టారు.  అందువలననే  ఎంత నరికేద్దాం అని ప్రయత్నాలు చేసినా,  అటువంటి వారి వల్ల  ఈ మాత్రం కట్టు, బొట్టు, భాష   మిగిలాయేమో  అనిపిస్తోంది ఈ రోజు . 

పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుల పరిస్థితి

ఇదండీ పౌరోహిత్యం/ వైదిక కర్మలు చేసుకునే బ్రాహ్మణుల పరిస్థితి.

వీడియోలో రాంబాబు గారి చెప్పినట్లు, పరిస్థితి ఇలాగే ఉంటే మన తరువాత ఇంకో రెండు తరాలు చూస్తారేమో . ఎన్నో రోజులు పట్టదు ఇది అంతరించి పోవడానికి. మరీ అతిగా చెప్తున్నారు ఆయన అంటారేమో. విపరీతమైన మార్పు అనేది గత రెండు దశాబ్దాలుగా జరిగిపోయింది. మనం నిద్ర లేవకుండా తెల్లారలేదు అంటే ఎలా ? ‘ఎందుకు చాదస్తం’ అంటూ సగం వదిలేసాం మనం. ఉన్నది కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.

బ్రాహ్మణులు వారి వృత్తి చేపట్టకపోతే ?

ముహుర్తాలు పెట్టే వారు ఉండరు.

పంచాంగాలు వ్రాయడం ఉండదు.

గుళ్ళలో పూజలు ఉండవు. గుళ్ళు విహార స్థలాలు గా మారిపోతాయి.

పెళ్ళిళ్ళు , బారసాలలు, అన్న ప్రాసనలు , పుట్టువెంట్రుకలు , షష్టిపూర్తి , గృహప్రవేశాలు , వ్రతాలు అన్ని రికార్డులు పెట్టి చేసుకోవాల్సిందే.

ఏది చేసినా చేయకపోయినా అపరకర్మలు అనేవి అందరికీ Sentiment. అవి చేసే వారు కరువయిపోతారు.

బ్రాహ్మడి ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అన్ని క్రతువులు చేసుకోవాలి అనుకునే మన అందరికీ ఆ వృత్తి మీద నమ్మకం /గౌరవం లేకపోవడం. ఇహ సినిమాల్లో వీళ్ళ మీద జోకులు చెప్పనే అక్కరలేదు. ఆహారం, కట్టు, బొట్టు దగ్గర నుంచీ ఎన్నో నియమాలు పాటించాలి అంటే ఏ ఆడపిల్లలు ముందుకి రారు. అందులోనూ సమానత్వం / నా బట్టలు నా ఇష్టం/ స్త్రీ బానిస కాదు అంటూ మాట్లాడేవాళ్ళు ఈ వృత్తి లో వారిని వివాహం చేసుకుంటారా ? చాలా సార్లు చెప్తుంటాను సంస్కృతిని ఏ విధంగా direct గాను/ indirect గాను కూకటి వేళ్ళతో ఎలా పీకుతారు అని . ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది. వీరేదో నా కులం వారు అని ఇలా చెప్పడం లేదు. ఈ క్రతువులన్నీ ఆగిపోతే హిందూ ధర్మం అనేది పుస్తకాలకి పరిమితం అవుతుంది. ‘ఉండేదిట ‘ అని చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎన్నో తట్టుకుని ఈ రోజు వరకూ నిలిచి ఉన్న సంస్కృతి ఇదొక్కటే. దాన్నిగర్వంగా చెప్పుకుంటూ ‘celebrate ‘ చేసుకోవాల్సింది పోయి వదిలేస్తూ గర్వపడుతున్నాం

చరిత్ర పునరావృతం కాకూడదు అంటే ఏం చేయాలి?

ఈ మధ్య  కెనడాలో  751 పిల్లల సమాధులు కనుగొన్నట్టు వార్తలలో చూసాము. అక్కడ  Catholic చర్చి వారు Indian  Residential Schools లో  చేసిన  దారుణాలకి  సంబంధించిన వార్త. ఏమిటా ఈ వార్త అని  వాటి మీద కొన్ని డాక్యూమెంటరీలు  చూసాక మనసు కలిచివేసింది.  ‘ మీ పిల్లలకి చదువు నేర్పుతాం’ అంటూ  అక్కడ  ఉన్న  native  జాతి వారి భాష, కట్టు, బొట్టు  అన్నీ మరుగున పడిపోయేలా చేసారు చర్చి వారు . వారి మతాన్ని మార్చేశారు.  ఆ  పాఠశాలలలో తప్పనిసరిగా చేరాలి అని అప్పటి ప్రభుత్వం ఒక Act  పెట్టిందిట. ఆ విధంగా తల్లిదండ్రులకి , తోబుట్టువులకి దూరమయిపోయారు పిల్లలు.  ఆ హింసని తట్టుకోలేక  చనిపోయిన పిల్లలు ఎంతో మంది ఉన్నారట.  ఇందులో చాలా మెచ్చుకోవలసిన అంశాలు  ఏంటంటే అక్కడ native జాతి వారు కలిసికట్టుగా  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.  ప్రభుత్వం వారు క్షమాపణలు చెప్ప డమే  కాదు. నష్టపరిహారం కూడా ఇచ్చారు.  పిల్లల సమాధులు కనుగొన్నట్టు వార్త రాగానే Pope  గారు కూడా స్పందించారట. 

ఇవన్నీ చూస్తున్న క్రమంలో .. 

ముఖ్యంగా ‘Goa  Inquisition ‘ గుర్తొచ్చింది. జలియన్ వాలా బాగ్  సంఘటన గుర్తొచ్చింది.  ప్రపంచ యుద్ధాలలో  బ్రిటిష్ వారి తరఫున పోరాడిన ప్రాణాలు కోల్పోయిన  భారతదేశ సైనికులు…. 

… అలా  చాలా చాలా గుర్తొచ్చాయి.  

భారత దేశ చరిత్రలో 450 ఏళ్ళ  క్రితం  హిందువుల మీద మతం అన్న పేరుతో  జరిగిన  అత్యంత దారుణమైన హింసా కాండ  ‘Goa  Inquisition ‘.  గూగుల్ లో ఈ  అంశం మీద  బోలెడు వీడియోలు ఉన్నాయి. పుస్తకాలూ ఉన్నాయి.  అయినా కొన్ని మాటలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. 

Inquisition  అనేది  కాథలిక్ చర్చి వారు చేసిన మతపరమైన విచారణ.  పోర్చుగల్, స్పెయిన్  దేశాలని  పరిపాలనించిన రాజులూ , రాణులు  వారి వారి  colonies లో ప్రజలు ప్రతి ఒక్కరూ  క్రైస్తవం పాటించేలా చూసేవారు. ముఖ్యంగా  యూదులు, ఇస్లాము మతస్థులని target  చేసేవారు.  క్రైస్తవం లో  మారలేని వారు వారి వారి స్థలాలు వదిలేసి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళేవారు .  మారిన  ప్రజలు  తిరిగి పాత మతం లో వెళ్లకుండా చూడటమే ఈ  Inquisition.  మతం మారటమే  కాదు. కట్టు, బొట్టు, భాష  అన్నీ మార్చుకోవాలి. తిండి  విషయాలలో కూడా వీరు చెప్పిన నియమ నిబంధనలే పాటించాలి.  ఇలా మారిన  వారి మీద ఎల్ల  వేళలా నిఘా ఉండేది. వారు ఏమాత్రం  ఏమరుపాటుగా ఉన్నా/ పాత  ఆచారాలు పాటించినా విచారణ ఉండేది.  విచారణ అంటే మాములుగా కాదు.  యమభటులు నరకంలో వేసే శిక్షలు కూడా అంత దారుణంగా ఉండవు.   

భారత దేశంలో గోవా మొట్ట మొదట Portugal  colony  అయ్యింది.  కొద్ది  కాలానికే గోవా ప్రజల మీద ఈ  Inquisition రుద్దబడింది. . ఈ portugal వారు గోవాలో  మత  ప్రచారం చేయడానికి ముందే, గోవాలో  ప్రజల్లో  క్రైస్తవులు ఉండటం వారిని చాలా ఆశ్చర్యపరచింది.  చెప్పా కదా వారి target యూదులు. ఆ యూదులతో పాటు  హిందువుల మీద కూడా ఈ Inquisition రుద్ధి వారిని  కూడా యూదులతో పాటూ చాలా హింసించారు. ఈ Inquisition బాధలు తట్టుకోలేక  ప్రజలు  గోవా వదిలి  చుట్టూ ఉన్న ప్రాంతాలకి వలస వెళ్లారు.  Shefali  vaidya  గారి videoలు   చూస్తే తెలుస్తుంది. ఆ వలసలు ఎలా జరిగాయో చాలా బాగా చెప్పారు ఆవిడ .  

మొట్ట మొదటి సారి నేను 1994లో  గోవా వెళ్ళాను. మనుష్యుల కట్టు, బొట్టు & ఇళ్ళు చూసి ఇది ఇండియానా అని అనుమానం వచ్చింది మాకు.  హిందూ సంస్కృతి  చాలా తక్కువ కనిపిస్తుంది. అంత  అందమైన  గోవాలో మన పూర్వీకుల కన్నీటి గాధలు ఉన్నాయి అంటే నమ్మబుద్ధి కాదు .

Shefali గారు చెప్పినది నమ్మకపోతే ఈ లంకెలో పుస్తకం ఉంది.  చదుకోవచ్చు

https://quod.lib.umich.edu/e/eebo/A37503.0001.001?view=toc

ముఖపుస్తకంలో నా పోస్టులలో  ఒకసారి  30 ఏళ్ళ  క్రిందట జరిగిన కాశ్మీరీ హిందువుల మీద దాడి  గురించి వ్రాసాను.  ఈమధ్య  50 ఏళ్ళ  క్రిందట బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరిగిన హత్యాకాండ గురించి రుజువులతో  కూడా  వ్రాసాను. పట్టుమని  పాతిక  వేలిముద్రలు  కూడా  రాలేదు ఆ  పోస్టులకి.   30 ఏళ్ళ  క్రితం జరిగిన వాటి గురించే మాట్లాడము. ఇక  450 ఏళ్ళ  క్రిందట అంటే చాలా చాలా  light  మనకి. అంటే  మనం అసలు దేనికీ కూడా  స్పందించమా అంటే అలాంటిదేం లేదు.   ట్రంప్  గారి గురించి ఒక మాట అనగానే  పెద్ద జాత్యహంకారి అని ఎంతో మంది ఖండించారు. ఏ జాతి వారికి  అన్యాయం జరిగినా మనకే జరిగినంత స్పందించే మనం, మన జాతికి  & మన  పూర్వికులకి జరిగిన అన్యాయాల గురించి ఒక మాట కూడా అనలేమా ?మాట  అనటం పక్కన పెట్టండి. ఏమి  జరిగిందో కూడా తెలుసుకునే  ప్రయత్నం కూడా చేయము.  ఓ వీడియో  చూడటానికి కూడా సమయం ఉండనంత బిజీ మనం. 

హిందువులు/భారతీయులు  ‘మేము ఎవరి మీద  దాడులు చేయలేదు.  కానీ  మా  మీద మత  మార్పిడులు , హింస, దురాక్రమణలు  ఇవన్నీ జరిగాయి’ అని చెప్తాము/చెప్తారు/చెప్తూనే ఉంటారు . చెప్పడం మంచిదే. కానీ అది చరిత్రలో పునరావృత్తి కాకుండా ఉండాలి అంటే, ప్రపంచానికి  తెలియజేసే ప్రయత్నాలు చేయాలి.  తెలియజేయడం అంటే ఇతర మతస్థులని దుమ్మెత్తి పోయడం కాదు. వారిని అగౌరవపరచకకూడదు.   ఇటువంటివి పాఠ్యాంశాలలో ప్రవేశ పెట్టేలా చేయాలి. Pope గారు క్షమాపణలు చెప్పేలా చేయాలి. అడగనిదే  అమ్మైనా పెట్టదు  అని  సామెత. నీ సంస్కృతి మీద  జరిగిన దాడి  గురించి నువ్వు చెప్పకపోతే Pope గారో / బ్రిటిష్ వారో  వచ్చి “అయ్యో! ప్రపంచంలో అందరికీ  క్షమాపణలు చెప్పాము.  మీకు చెప్పడం మరిచాము “ అనరు కదా  .

కెనడాలో ఏడు తరాల పాటు  వారి జాతి అంతరించిపోయేలా చేస్తే వారు కూడగట్టుకుని వచ్చి ప్రశ్నిస్తున్నారే ? హిందువులు  ఇన్ని కోట్లమందిమి ఉన్నాము.

ఆ మాత్రం ప్రశ్నించలేమా ?