‘స్వస్తిక్’ గుర్తు గురించి మాట్లాడొచ్చా?

హిందువుల పండుగలప్పుడు ముఖ్యంగా దీపావళి ముగ్గులలో సర్వసాధారణంగా కనిపించేది స్వస్తిక గుర్తు. ఇది శుభానికి సంకేతం. ఇది భారతీయ హిందువులకి అందరికీ తెలిసినదే.

అమెరికాకి వలస వచ్చాక కానీ కొందరు హిందువులకి తెలియదు ఇది ఎక్కడపడితే అక్కడ వాడితే ప్రమాదాల్లో ఇరుక్కుంటారని. ముఖ్యంగా భారతదేశం నుండీ వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా తెల్సుకోవాలి.

ఈ మంగళప్రదమైన గుర్తుని 45 డిగ్రీల కోణంలో తిప్పి తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం యూదు జాతి మీద ప్రయోగించి మారణహోమం సృష్టించారు కొందరు దుర్మార్గులు. అందుకే ఈ గుర్తుని ఒక ‘hate symbol ‘ గా అమెరికాలో పరిగణిస్తారు. కొన్ని రాష్ట్రాలు, బడులు చట్టాలు కూడా చేసాయి.

మూడు రోజుల క్రితం ఒక ప్రభుత్వ కార్యాలయంలోని లిఫ్ట్ లో ఈ గుర్తు కనిపించిందని అమెరికా అధ్యక్షులు ఇటువంటి హింసాత్మకమైన ఆలోచనలకి ఇక్కడ చోటు లేదు అని స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు. ఎవరు పెట్టారు ఏమిటీ అనేది కూడా investigation కూడా జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఆయన చెప్పింది అక్షరాలా సరియైనదే. దాన్లో సందేహం లేదు.

ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే అమెరికా లో హిందువులు కూడా నోరు విప్పి మాట్లాడాలి. మాట్లాడకపోతే కూడా జరిగే నష్టాలు ఉంటాయి. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు. ఇదివరకు రోజుల్లో ఇంట్లోనే పూజలు చేసుకునే వాళ్ళం. బాధ లేదు. ఇప్పుడు పూజ చేసాక దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఆ స్వస్తిక్ గుర్తు కలశం మీద ఉండవచ్చు . తోరణాలలో ఉండచ్చు. ముగ్గులలో ఉండచ్చు. పని చేసే కార్యాలయాలలో అవి ఉన్న ఫోటోలు పంచుకుంటే, అవతల వ్యక్తికి హిందూ మతం మీద అవగాహన లేకపోతే మీ గురించి రిపోర్ట్ వెళ్ళిపోతుంది . తప్పులేదు. చెప్పా కదా ఇక్కడ బడులలో కూడా చట్టాలు చేసారు. ఆ బడులకు వెళ్ళే హిందూ పిల్లలు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒక పక్క ‘మన సంస్కృతి కాపాడు’ అంటాము. ఓ పక్క ‘బయట దీని గురించి అస్సలు ఏమీ మాట్లాడకు’ అంటాము. సోషల్ మీడియాలో వాగ్యుద్దాలే జరుగుతుంటాయట. అమెరికాలో అవతల వారికి ఏ ఇబ్బందీ కలిగించకుండా ఎవరి మతం వారు పాటించవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందర్నీ కలుపుకు పోవడమే ఉద్దేశ్యం. నేను బహిరంగంగా హిందూ మత గొప్పదనం గురించి చెప్పమని చెప్పట్లేదు. తెలియని వారికి అవగాహన కలుగ జేయండి అంటున్నాను. Jewish స్నేహితులు ఉన్నట్లయితే వారితో interfaith పెట్టి చెప్పవచ్చు. వారి పిల్లలకి మన పిల్లలకి dialogue ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంటి చుట్టు పక్కల వారికీ చెప్పవచ్చు. మన బాధ మనం చెప్పకపోతే ఎవరూ వచ్చి చెప్పరు. వారికి తెలియదు కాబట్టి.

HAF వారు దీని గురించి చాలా పోరాటాలే చేసారు. న్యూయార్కు రాష్ట్రం లో చట్టం రాకుండా ఆపగలిగారు. మనం ఏమీ కష్టపడకుండానే చక్కటి వీడియో కూడా రూపొందించారు. అవి పంచుకుంటే చాలు. https://www.hinduamerican.org/swastika-reporters-guide

వీలైతే వీరికి donation కూడా ఇవ్వండి. వీరి ‘Dharma Ambassador’ కార్యక్రమంలో పాల్గొనండి. 5 నిముషాలలో హిందూమతం అంటే తెలియని వారికి ఎలా చెప్పాలో నేర్పిస్తారు. ప్రతీ నెలా ఒక session ఉంటుంది. Online లోనే .

వ్యాఖ్యానించండి