08/13/2021
ఎవరినైనా imitate చేయడం పద్ధతి కాదేమో కానీ inspire అవ్వచ్చు అనుకుంటా నేను. అందులో నాకు చాలా నచ్చే పోస్టులు Shefali Vaidya గారివి. వారి పోస్టు ఒకటి ఆలోచింపచేసింది. అందుకే ఈ పోస్టు ఈ శ్రావణ శుక్రవారం నాడు.
ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనన్ని రకరకాల దుస్తులు భారతదేశంలో ఆడవారికి ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.. ఏ మూలా వెళ్ళినా ఆ ప్రాంతంలో చీర అనేది ఓ వెరైటీ. కానీ Shefali గారు చెప్పినట్లు చీర కట్టుకోగానే ‘ఏంటి స్పెషల్ ‘ అని అడుగుతున్నాము అంటే చీర మనకి ఓ celebration. అప్పుడప్పుడు మాత్రమే కట్టుకునే వస్త్రం అయిపోయిందన్నమాట.
నేను పెళ్లయిన పది రోజులకే అమెరికా కి వచ్చేసాను. ఆ పెళ్లయిన కొత్తల్లో కొంచెం కొత్త పెళ్ళికూతురిలా కనిపించాలని రోజూ సాయంత్రం అవ్వగానే ఓ చీర కట్టుకుని, నల్లపూసలు వేసుకుని కూర్చునే దాన్ని. కొత్త కాపురం అని రోజుకో కొట్టు తిరిగి ఇంట్లోకి కావలసినవి కొనుక్కునే వారం. పైగా Thanks Giving అయి Christmas మొదలవ్వబోయే రోజులు. కొట్లు కూడా పండగ కళతో మెరిసిపోతూ ఉండేవి, మా వారు వచ్చేసరికి నేను ఇలా తయారయ్యి ఉండేసరికి మా వారికి అర్ధమయ్యేది కాదు. ‘రోజేంటి ఇలా ఉంటావు. ఏదో సినిమాల్లో చూపించినట్లు ’ అనేవారు. ఇద్దరం కలిసి టీ తాగేవరకు అలాగే ఉండి బట్టలు మార్చుకుని షాపింగ్ కి వెళ్ళేదాన్ని . ‘ఇది ఎక్కడి పిచ్చి? time అయిపోతోంది కదా’ అన్నా పట్టించుకునే దాన్ని కాదు. ‘కొత్త పెళ్లికూతురు. వేల మైళ్ళు దాటి వచ్చింది. ఏడుస్తే అమ్మ, నాన్న అంటే ఎక్కడ తెచ్చిపెట్టను ‘ అనుకుని తను కూడా పెద్దగా ఏమీ అనేవారు కాదు. అప్పట్లో ఎందుకలా కట్టుకున్నాను అంటే సమాధానం దొరకలేదు నాకు.. ..
ఇప్పుడు ఆలోచిస్తే …. పెళ్ళి కాక ముందు అన్ని రకాల చీరలు ఉండేవి కాదు. పెళ్లయ్యాక చీరలు ఉన్నాయి. కట్టుకుని మురిసిపోదాం అనుకునేలోగా ఎగిరి వచ్చేసా. పైగా రాగానే ఎముకలు కొరికే చలి. కట్టుకున్నా చూసి విశ్లేషించే ఆడవారు లేరు. ఆడవారు ఉన్నా jeans వేసుకోకపోతే, బొట్టు పెట్టుకుంటే వచ్చే నష్టాన్నే వివరించేవారు తప్పితే చీర కట్టుకుంటే లాభం ఏంటి అన్నవారు కనిపించలేదు. చీర, నల్లపూసలు, బొట్టు అంటూ సినిమాలు చూసి ముత్తైదువలా ఉండాలి అనుకున్నానా , లేకపోతే నాగరికత అంటూ తెలియని ఓ పల్లెటూరి దాన్నా అనిపించింది.
చీర రోజూ కట్టుకోలేకపోయానేమో కానీ ఈ రోజు వరకూ చాలా పట్టుదలగా బొట్టు, నల్లపూసలు, మంగళ సూత్రాలు, మెట్టెలు వదల్లేదు నేను. Travel చేసినా one gram నల్లపూసలు వేసుకునేదాన్ని. ఈ మధ్య కాలంలో భారత్ వెళ్తే చీరలే ఎక్కువ కట్టుకుంటున్నాను.
అంటే ఈ వలస వలన, చుట్టుపక్కల మారుతున్న సమాజంలో నా ఉనికి (అంటే identity) కోసం చాలా మధన పడ్డాను అని ఈ రోజు స్పష్టంగా అర్ధమవుతోంది. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే అన్ని రకాల సంస్కృతులని ఆహ్వానించే దేశానికి వలస రావడం. ఎపుడూ బొట్టు తోటే ఉండే మొహాన్ని అలవాటు చేసాను నా చుట్టుపక్కల వారికి. బొట్టు బిళ్ళ పొరపాటున పడిపోతే , ‘you look weird today’ అన్న వారు తయారయ్యారు.
ఆడపిల్ల కళకళలాడుతూ ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీ కళ అంటాము. అది ఏ దేశానికైనా వర్తిస్తుంది. ఆడవారు షాపింగ్ చేస్తారు అని ఏడిపించినా దేశంలో ఆర్థిక వ్యవస్థని చాలా మటుకు నియంత్రించేవారు వీరే అనేది సత్యం. ఓ Louis Vuitton కావచ్చు. Gucci కావచ్చు. Michael Kors కావచ్చు. Revlon కావచ్చు.
ఇన్ని చెప్పాక ఆలోచించండి ముఖ్యంగా భారత్ లో ఉండే స్త్రీలు. తన శ్రమని కళగా మార్చి చీరల రూపంలో ఎన్నో కళాఖండాలు చేసే ఓ మారుమూల పల్లెటూరిలో మగ్గం పట్టుకునే చేనేత కార్మికుడిని ‘కుబేరుడి’ని ఎలా చేయాలో ఆలోచించండి.
‘అదేంటండీ మొన్ననే కదా చీరలు, నగల గురించి మాట్లాడకుండా ఆలోచనాపద్ధతి మార్చుకోమన్నారు. మళ్ళీ ఇదేంటి’ నన్ను అనచ్చు. ఏ వస్తువు కి demand అనేది create చేయాలో మన చేతుల్లోనే ఉంది. ఆలోచనాపద్ధతి మారాలి. ఓ brand వస్తువ ఎంత గొప్పో అంత కంటే గొప్పవి చీర అనే కళాఖండాలు. ఓ Louis Vuitton సంచీ కొనడం ఎంత గొప్పగా చెప్తారో ఓ 500 రూపాయల చీర అనే కళాఖండాన్నీ గురించి ఇంకో నాలుగు రెట్లు ప్రచారం చేయండి. కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. ఇంకో తరం అది నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంది.

