శ్రావణ మాసం మూడో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాను. ఈ పండగ ఎండాకాలం సెలవల్లో రావటం వలనో ఏమో మా పిల్లలకి బాగా తెలుసు ఏమి చేస్తానో. వాళ్ళే నాకు తోరం కట్టేవారు కూడా. మొన్న వ్రతానికి ముందర రోజు రాత్రి పడుకునేటప్పుడు మా పెద్ద పిల్ల వచ్చి ‘ రేపు నాకేమి పెద్ద పని లేదు. నీకొచ్చి సహాయం చేయనా ‘ అంటే , ‘ఏమొద్దులే. శ్రీ సూక్తం & మంత్రపుష్పం చదువు ఆ టైం కి వచ్చి’ అన్నాను. ‘ఓ అదెంత పని ‘ అన్నట్టు చెప్పింది. పొద్దున్న లేచి 5 రకాల వంటలు చేసి , అమ్మ వారిని తయారు చేసి 9:30 కల్లా కూర్చున్నాను. అబ్బో మా ఇంటి మా మాలచ్చి వచ్చేస్తుంది , శ్రీ సూక్తం చెప్పేస్తుంది అనుకున్నా. కథ చదివి హారతి సమయానికి గంట వినిపించి మావారు మాత్రం వచ్చారు. ఆయన ఆశీర్వచనం తీసుకుని, ప్రసాదం తిని మీటింగు కి వెళ్ళిపోయా. అది ముగించి ఇక భోజనానికి వచ్చేసరికి భోజనం చేయడానికి పిల్ల సిద్ధంగా ఉంది. ‘అదేంటే రాలేదు పూజకి’ అంటే, ‘వచ్చాను. దండం పెట్టుకుని చెప్పాను . ప్రసాదం అనుకున్నది తీసుకుని తిన్నాను’ అంది. తోరం కట్టాను. కట్టించుకుంది.
ఇదంతా చదవగానే ‘అమ్మో అమెరికా పిల్ల . ఆ మాత్రం చేస్తే కూడా తల్లి ఆక్షేపిస్తోంది’ అనిపిస్తోంది కదా. మీకు ఎందుకలా అనిపిస్తోంది ఒకసారి ఆలోచించుకోండి.
మా పిల్లలు దాదాపు 2ఏళ్ళ వయసు నుంచీ నిద్ర లేవగానే స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకోకుండా వంటింట్లోకి వచ్చేవారు కాదు. బోలెడు శ్లోకాలు, వాటికీ అర్ధాలు చెప్పేవారు. బాలవికాస్ కి వెళ్ళడం ఒకటి కావచ్చు. మేము నేర్పించింది కావచ్చు. ఈరోజుకి కూడా చాలా మటుకు అలాగే ఉంటారు . కానీ కొన్ని కొన్ని మానేశారు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలా నాడు కాదు కదా ఇక్కడ పుట్టి పెరిగిన భారతీయ పిల్లలకి తమకి తాము ఎక్కడ వారో , తమ ఉనికి ఏంటో చాలా అయోమయం గందరగోళం ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే బాలవికాస్ లో గురువులు రావు గారి గురించి మాకు తెలియడం మా పిల్లలు ఆ తరగతులకు వెళ్లడం జరిగింది. బాలవికాస్ అనేది ఏ సంస్థకి చెందినది కాదు. ఆయన వారి పిల్లలతో జరిగిన కొన్ని experiences వలన 32 ఏళ్ళ క్రితం ఈ సంస్థ ( సంస్థ అనటానికి కూడా నేను ఇష్టపడను. కుటుంబం అంటాను) ప్రారంభించడం జరిగింది. శ్లోకాలు , వాటి అర్థాలు , Homeless shelter ల లో సేవ, ఇక్కడి వారితో మన ఉనికి కోల్పోకుండా ఎలా కలిసిపోవడం, interfaith లు ఇలా ఎన్నో చెప్తారు. ఆ తరగతికి వెళ్లిన పిల్లలలో తమ ఉనికి ఏంటో తెలుసుకునేలా ఓ విత్తనం నాటారు.
ఈ విత్తనం అనేది ఎంత బలంగానే ఉన్నా , దాని వలన చెట్టుకి చీడ పట్టడం లేదేమో కానీ ఆశించినంత ఫలాన్ని ఇవ్వటం లేదు. ఈ సోషల్ మీడియా తాకిడికి, చుట్టుపక్కల వారి వైఖరికి తట్టుకోలేకపోతోందా అనిపిస్తోంది ఒక్కోసారి.
అమెరికాలో చాలా మంది భారతీయులకి తమ తోటి తల్లితండ్రులు అంటే, పిల్లల్నిరోట్లో వేసి రుబ్బి ivy league కాలేజీల్లో డాక్టర్లు గా, ఇంజనీర్లుగా తయారు చేసేస్తారు ( చేయడానికి రెడీ గా ఉన్నా వాళ్ళే కదా చదవాల్సింది) అని ఒక అపోహ. స్పెల్లింగ్ బీలు ఏ పోటీ తీసుకున్నాఈ పిల్లలే గెలుస్తారు, ఆ తల్లితండ్రులు అలా తయారు చేస్తారు అని బళ్ళలో టీచర్ల కి కొంచెం చిరాగ్గానే ఉంటుంది. అలాంటి తల్లితండ్రులు లేరా అంటే ఉన్నారు. కానీ overall picture చూస్తే పిల్లల కోసం అన్నీ త్యాగం చేసి నోరు కట్టుకుని కాలేజీ చదివించే వారిలో భారతీయ తల్లితండ్రులు ముందు ఉంటారు. ఎక్కడ school district బావుంది అంటే అక్కడ ఇల్లు కొనుక్కోలేకపోతే అద్దెకి తీసుకుని చదివిస్తారు. పిల్లలకి ఏదన్నా activity ఉంటే పార్టీలకి వెళ్ళరు. ఎక్కువ నేరాలు అనేవి కూడా ఈ community లో చూడం. చెప్పాలి అంటే ఒక ఆదర్శపూరితమైన జీవితం గడిపే జాతి. కానీ వీరిలో ఉండే positive side అంతా పక్కన పడేసి అమెరికాలో వచ్చే ఈ famous comedy show లు చాలా మటుకు భారత్ నుండి వచ్చిన తల్లితండ్రులని హేళన చేస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది. tiktok లో Indian accent పెట్టి రకరకాల వీడియోలు. lilly singh, hasan minaj , never have i ever , match making అన్నిటిలో భారత దేశ సంస్కృతిని, తల్లితండ్రులని ఏదో నవ్వులాట గానో, చాదస్తం గానో చూపిస్తున్నారు అని చాలా బలంగా అనిపిస్తోంది. Stereotyping అనరా దీనిని? ఈ రోజు lilly singh వీడియో ఒకటి చూసాను. అమ్మ, నాన్న ఇల్లు clean చేస్తుంటే నాన్న కి నడుము పట్టేస్తే దాని మీద దరిద్రమైన కామెడీ చేసింది ఆ పిల్ల.
దీని ప్రభావం ఎంతలా ఉంటుంది అంటే మనం చేసే పనుల మీద మనకే నమ్మకం ఉండదు. లేదా పిల్లలకే మన పని మీద నమ్మకం ఉండదు. అభిప్రాయాలు మారతాయి. ఒక తాటి మీద ఉండటం జరగదు. చిన్న విషయాలలో పెద్దగా కనిపించదు. అదే పెళ్ళి లాంటి పెద్ద విషయానికి వచ్చేసరికి ఒక అఘాతం ఏర్పడచ్చు కూడా.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి బాలవికాస్ లో రామకోటి వ్రాసినందుకు రాముడి ఫోటో కానుకగా ఇచ్చారు మా అమ్మాయికి. అది వచ్చి మురిసిపోతూ చూపిస్తుంటే ఎవరో ‘ ఏమిటీ మరీ మీ చాదస్తం. పిల్లలకి రామకోటి ఎందుకు ‘ అన్నారు. ఆ క్షణంలో నాకు కూడా ఏమిటిలా చేసాను అనిపించింది. కానీ ఇన్నేళ్ళ తరువాత తన స్నేహితురాలికోసం ప్రార్థన చేయాలి అంటే నేను ఏమీ చెప్పకుండానే వ్రాసింది. తెలిసి తెలియని ఎవరో అన్న మాట నాలో ఒక సందిగ్థత వచ్చేలా చేసింది. నా సంస్కృతి ఒక చాదస్తం అన్నట్టు చేసింది. ఇతర సంస్కృతుల వారు నాటిన మనలో పేరుకుపోయి, గడ్డ కట్టేసిన ఆత్మనూన్యతా భావం విత్తనం. .
‘చాదస్తం ఎందుకు. light తీస్కోండి’
‘ మీరు అలా ఉంటారు కాబట్టే మీ పిల్లలు అలా తయారయ్యారు’ ఇటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ‘చాదస్తాలు ‘ follow అవ్వకపోయినా పరవాలేదు. follow అయ్యేవారిని , వింటున్న తరవాతి తరాన్ని వేలెత్తి చూపకండి. వేరే సంస్కృతులు చూడండి . ముఖ్యంగా యూదులని. ఏమి చేసినా గర్వంగా చెప్పుకుంటారు.
మా పిల్లలకి చిన్నపుడు శ్రీ సూక్తం చెప్పించింది ఎందుకు అంటే ముందు ముందు తప్పక పాటించి ఇంకో రెండు తరాలకి చెప్తారని ఆశతో . అంతే కానీ మధ్యలో ఆపేస్తారని కాదు. అంత expectation ఎందుకు అనుకోవచ్చు. ఇంత వివరంగా పుట్టుపూర్వోత్తరాల గురించి విలువలు ఇన్నేళ్లు కస్టపడి చెప్పిస్తే నాకు నచ్చినపుడే చేస్తా అంటే ఎలా ? ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఏమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ DISMANTLING GLOBAL HINDUTVA లాంటివి ఎందుకు ఖండించాలో అర్ధం కాదు. కాలేజీల్లో వారి గురువులు ‘మీరు ఉగ్రవాదులు. మీ పూర్వికులు ఉగ్రవాదం చేసారు’ అంటే అవునేమో అనుకుంటారు కూడా. తరువాత ‘చరిత్ర’ వీళ్ళని పక్కన పడేసి ఇంకో మలుపు తీసుకుంటుంది.