ఈ నవరాత్రుల్లో నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఓ టపా వ్రాస్తాను అన్నాను. మొదటి రోజు వ్రాసేసాను. మళ్ళీ ఈ రోజు కుదిరింది.
ఈ రోజు నాకు ఇంకో ముఖ్యమైన వ్యక్తి. నానమ్మ . ఈవిడ గురించీ అంతే. క్లుప్తంగా వ్రాయడం అంటే కష్టమే. ఈవిడ పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగిందంతా తెలంగాణాలో. అంటే అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో. ఈ విషయం చాలా సార్లు ప్రస్తావించాను. నానమ్మ ఇంట్లో పెద్ద కూతురు. ఈవిడకి ఇద్దరు చెల్లెళ్ళు , ఇద్దరు తమ్ముళ్ళు . పెద్ద చెల్లెలు, చిన్న తమ్ముడు ఇప్పుడు లేరు. మా నానమ్మ పేరు చాలా అందమయిన పేరు. ఇందుమతి. దశరథుడి తల్లి పేరు.
మా ముత్తాత గారు మహబూబ్ కాలేజీలో పనిచేసేవారు. నానమ్మ బడికి వెళ్ళి కొంత చదువుకుంది. అంటే బహుశా ఎలిమెంటరీ బడి వరకూ అనుకోవచ్చు. ఈవిడకి అమ్మమ్మ లాగే చిన్నప్పుడే 12 ఏళ్ళకే పెళ్లి చేసారు. మా తాత గారు వాళ్ళు ఆంధ్ర వారు. పెళ్ళయ్యాక ఆయన కూడా హైదరాబాద్ రావటం జరిగింది. ఆయన బీకామ్ చదువు, బ్యాంకు ఉద్యోగం చేయడం అన్నీ ఈ రాష్ట్రంలోనే. మా నాన్న గారు పుట్టే సమయానికి రజాకార్ల ఉద్యమం మొదలయ్యేసరికి ఆడవారు ఉండటం క్షేమం కాదని ఇంట్లో ఆడవారందరినీ ఆంధ్ర కి పంపించివేశారట. అలా హైదరాబాద్ లో పుట్టవలసిన మా నాన్న గారు ఆంధ్రాలో పుట్టారు. మా నాన్న పుట్టినపుడు ఆవిడ వయసు 17 ఏళ్ళు. మొత్తం ఐదుగురు పిల్లలు, ఒక మనవడు & బోలెడు మనవరాళ్ళు , ముని మనవళ్ళు & మనవరాళ్లు . ముని మనవడు పుట్టాడని బంగారు మారేడు దళాలతో పూజ కూడా చేసుకుంది ఈవిడ.
చదువుకున్నది తక్కువే అయినా ప్రతీ విషయం తెలుసుకోవాలన్న కుతూహలం వలన ఏ విషయమైనా కొంత అవగాహన తో ఉంటుంది. చక్కటి జ్ఞాపకశక్తి కూడా. భాగవత పద్యాలూ , విష్ణు సహస్రం ఇలా కొన్ని పుస్తకం లేకుండా చదివేస్తుంది. ఈ రోజుకి కూడా. బోలెడు దేశ భక్తి గీతాలు పాడేస్తూ ఉంటుంది. ఒక రోజు ఫోన్ చేస్తే భాగవతంలో ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి’ పద్యం గుర్తు రాలేదుట. నన్ను అడిగింది. నాకు వెంటనే గుర్తు రాలేదు. నన్ను తిట్టింది ‘ ఏం చదువులో ఏమో ఏమీ తెలీదు మీకు ’ అని. ఇంతకీ ఎందుకు అడిగింది అంటే అమ్మమ్మకి చదివి దాని మీద చర్చించడానికట . (వాళ్లిద్దరి స్నేహం గురించి వ్రాయాల్సింది చాలా ఉంది. తరువాత ఎప్పుడైనా ). ఇప్పటికీ కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలు వ్రాసుకుని మరీ practice చేస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఏ ఆడపిల్ల పుట్టిన రోజయినా ‘బంగారు పాపాయి బహుమతులు పొందాలి’ అని పాట పాడుతుంది . 2017 లో నేను భారత దేశం వెళ్ళినపుడు ‘మిధునం’ పుస్తకం కొన్నాను. ఎక్కడికో వెళ్లి వచ్చేసరికి పుస్తకం చదివేసి ‘ చాలా బావున్నాయి కథలు ‘ అని చెప్పింది.
మా నానమ్మ ఒక modern బామ్మ గారు అని చెప్పచ్చు.
ఆశర్యం ఏంటంటే మా అమ్మ నాన్న పెళ్ళికి , పెళ్లి చూపులకి ఈవిడ వెళ్ళలేదు. అమ్మని Direct గా పెళ్లిలోనే చూసింది. అప్పటికి ఈవిడ వయసు ముప్ఫైల్లోనే ఉంది. ‘విడిదిలో దిగగానే అందరూ పెళ్ళికొడుకు తల్లి అంటుంటే ఏమిటోగా అనిపించింది’ అని చెప్తుంటుంది. కోడళ్ళు పని చేయాలి , ఇలా ఉండాలి , అలా ఉండాలి అన్న restrictions ఏమీ పెట్టదు. కావాల్సిందల్లా ఆవిడ కబుర్లు వినాలి లేదా ఆవిడకి కబుర్లు చెప్పాలి. చిన్న పిల్లల నుంచీ పెద్ద వారి వరకూ అందరితో కబుర్లు చెప్పేస్తుంది. మా అమ్మాయికి చిన్నప్పుడు cinderalla కథ english లో చదివి వినిపిస్తే ఆశ్చర్యం గా ‘ She can read English’ అన్నది మా అమ్మాయి. చిన్న పిల్లల్తో అలా ఉంటుంది. .. . కొంచెం టీనేజ్ పిల్లలు అయితే నెమ్మదిగా డిస్కషన్ పెట్టి వాళ్ళకి girl friend/ boy friend ఉన్నారో కొన్ని నిముషాల్లో కనుక్కుంటుంది (మా cousin ఒకమ్మాయి డాక్టర్. తను ఒక typical teenager లా కాక ఎప్పుడూ volunteering /సేవ అంటూ చెప్తూ ఉండేది. ఈవిడ చూసి చూసి ఒక రోజు , ‘ ఇది & దీని పిచ్చి సేవ గోల. ఇట్టా అయితే ఇంక boy friend ఏం దొరుకుతాడు దీనికి ?’ అన్నది.) …. కొంచెం పిల్లలు, సంసారం అంటూ మాట్లాడేవారితో వాళ్ళ సాధక బాధకాలు అన్నీతనకి చెప్పేలా మాట్లాడుతుంది. ఇక తన వయసువారితో ఆరోగ్యం, భాగవతం లాంటివి. అందుకే నానమ్మ అంటే మాకు ఎప్పుడూ excitement.
వంట అందరూ అద్భుతంగా చేస్తారు. ఆ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఈవిడకి.
ఇక మెచ్చుకుంటే అంతే. మళ్ళీ మళ్ళీ చేయడానికి ఏ మాత్రం బద్ధకించదు.
చపాతీ మా నానమ్మ చేసినట్లు ఎవ్వరూ చేయలేరు. అంత మెత్తగా round గా భలే చేస్తుంది.
ఆడపిల్ల అంటే ఉద్యోగం చేయాలి , తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేది ఆవిడ మాటల్లో బాగా వినిపిస్తుంటుంది. ‘బంగారు పాపాయి’ పాడినపుడల్లా అదే message ఇస్తుందా అనిపిస్తుంది. స్వతంత్రం గా ఉండాలి అంటుంది. పెద్ద వయసు వచ్చాక అలా ఉండటం కుదరదు అని చెప్పినా వినదు.
నానమ్మ ‘భయంగా అనిపించింది ‘ అంటూనే చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. నాకు చిన్నపుడు పిన్నీసు నోట్లోకి వెళ్ళి గొంతులో ఇరుక్కు పోయింది. కోటిలో ENT hospital లో చేర్చారు. ఆ రాత్రంతా పాపం నాతోటే మేలుకుని ఉండటం నాకు బాగా గుర్తు. operation theater లోకి వెళ్తుంటే ఆవిడని రమ్మని నేను ఏడుస్తున్నాను. ఈవిడ ఎంత ధైర్యం అంటే ‘వచ్చేస్తా’ అని లోపలి వచ్చేస్తోంది . వాళ్ళు మీరు రాకూడదమ్మా ‘ అని ఆపేసారు. అదృష్టం కొద్దీ అది ఏ ఆపరేషన్ లేకుండా forceps తో వచ్చేసింది. ఇంకొక సంఘటన కూడా. మా పిన్ని ( మా అమ్మ చెల్లెలు) అత్తగారు మహావీర్ cancer హాస్పిటల్ లో చనిపోతే ఆవిడ శరీరం దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతుంటే నానమ్మ వెళ్ళి ఆవిడ చీర మార్చిందట. ఆ విషయం మా పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.
ఈవిడ జీవితంలో రెండు విషాదాలు. ఈవిడ 48 ఏళ్ళ కే మా తాతగారు పోయారు. ఆవిడకి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్న కోడలు కాన్సర్ వలన చిన్న వయసులోనే వెళ్ళిపోయింది.
భర్త లేని స్త్రీలు, అందులో ముసలి వారు చక్కగా తయారవుతే మన సమాజం లో ఆశ్చర్యంగా చూస్తారు. . అవునన్నా కాదన్నా నిజం. మా నానమ్మ తనకి కావలసిన చీర ఏ రంగు కావాలో చెప్పి మరీ కొనుక్కుంటుంది. matching blouse, fall ఉండాల్సిందే. covid ముందు మా తమ్ముడి కొడుకు ఒడుగు అయింది. నేను, మా అక్క చాలా హడావిడిగా ఇంటికి వచ్చాము మా నాన్నని తీసుకెల్దాము అని. ఈవిడ నింపాదిగా ‘ ఏ చీర కట్టుకోవాలో చెప్పి పోండీ ఇద్దరూ ‘ అని అడిగింది. ఆ హడావిడిలో నవ్వు , కోపం రెండూ వచ్చాయి. ఆలోచిస్తే అనిపించింది ఆవిడ మునిమనవడి ఒడుగు అంటే ఆవిడకి చాలా ముఖ్యమైనదే కదా అని.
మా అత్తయ్య మా చిన్నప్పుడే అమెరికా వచ్చేసింది. ఆవిడ డెలివరీ 1980 లో అనుకుంటాను, మా నానమ్మ ఒక్కతే ఎయిర్ ఇండియా లో వచ్చేసింది. అదీ ఏ wheelchair లేకుండా. ఏదన్నా మాట్లా డాలీ అంటే హిందీలో communicate చేసిందట. ‘wheelchair ఏమిటే కాళ్ళుండగా . కనుక్కుని వెళ్ళాలి కానీ ఏమిటీ భయం ‘ అంటుంది. నా మొదటి డెలివరీకి మా అమ్మ రాలేకపోయింది. మా నానమ్మ ఇక్కడే ఉంది అప్పుడు. తనే సహాయం చేసింది. ఈమధ్య వరకూ అమెరికాకి బాగానే ప్రయాణం చేసింది. ఇక్కడ మా స్నేహితులు చాలా మంది చూడగానే ‘ మీ అత్తగారా’ అంటారు. ‘కాదు మా నానమ్మ’ అంటే ఆశ్చర్యం వేస్తుంది.
చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో కబుర్లు …
అమ్మమ్మ & నానమ్మ ల ప్రేమ పొందటం మా అదృష్టం.