అమ్మ

అమ్మ !! అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మ  ఏం  చేసినా గొప్పే !! ఎలా ఉన్నా గొప్పే!! మా అమ్మని మించిన అమ్మ ఎవరికీ ఉండదు అంటాం. కదా ?  నేను కూడా అదే  చెబుతూ మా  అమ్మ గురించి  మొదలు పెడుతున్నాను. 

మా అమ్మమ్మ, తాతయ్యలకు పెళ్లయిన చాలా  కాలానికి (ఆ రోజుల్లో ) పుట్టిన మొదటి సంతానం మా అమ్మ లలితా  కుమారి గారు.  లేక లేక పుట్టిందని వాళ్ళ నానమ్మ మహాలక్షమ్మ గారు మహా గారాబం చేసేదిట ఈవిడని.  అమ్మకి ముగ్గురు చెల్లెళ్ళు , ఒక్క తమ్ముడు.  అందరి పెద్ద పిల్లల్లాగే చిన్నప్పటి నుండీ ఇంట్లో పనులకి సహాయం చేయడం, చెల్లెళ్లని తమ్ముడిని చూసుకోవడం చేసేది. చాలా బాగా చదువుకునేది కూడా.  రేణిగుంటలో 10వ తరగతి చదువుకుంది.  స్కూల్ ఫస్ట్.  కాలేజీ timeకి  బిట్రగుంట వచ్చేసారు.  బిట్రగుంటలో కాలేజీ లేదు. ఆ ఊరు నుండీ కాలేజీకి వెళ్లాలంటే రోజూ నెల్లూరు వెళ్ళేవాళ్ళు.  అమ్మ కూడా అలా PUC, BSc Biology మొదటిఏడు వరకూ నెల్లూరు వెళ్ళి చదువుకుంది. అమ్మ నెల్లూరులో కాలేజీ నుంచీ వస్తూ ఇంట్లోకి కూరలు కొనుక్కొచ్చేదిట.  చిన్నతనం నుండీ అమ్మకి కుట్లు, అల్లికలు, ముగ్గులు ఇలాంటివి చాలా అలవోకగా చేసేది.  ఈ లోపల మహాలక్షమ్మ గారు అమ్మ పెళ్ళి చూసి వెళ్ళాల్సిందే  అని పట్టుబట్టడంతో మా నాన్నగారి సంబంధం దొరకడంతో  ఆ కాలేజీ చదువుకి  స్వస్తి చెప్పించేసి పెళ్లి జరిపించేసారు మా తాతయ్య.  

అత్తగారింట్లో పెద్ద వదినగా అడుగుపెట్టింది.  అత్తగారితో పేరంటాలకు వెళ్ళడం.  పెద్ద ఆడపడుచుతో  కలిసి గబగబా పని ముగించేసి, వదినామరదళ్ళు  ఆ  అత్తగారికి చెప్పకుండా మాట్నీకి వెళ్ళడం. ఇంట్లో ట్యూషన్ తప్పించుకోవడానికి సాయంత్రం ఆటలాడుకోవడానికి వెళ్ళిపోయిన చిన్న ఆడపడుచుని, మరిదిని  ట్యూషన్ టీచర్ వచ్చేసరికి వదినామరదళ్ళు  కలిసి వీధంతా తిరిగి వెతుక్కు రావడం.  ఇలా మొదలయింది అత్తవారింటి బంధం.  (ఆవకాయ పెట్టి నాకు courier చేస్తుంది.  అదే డబ్బాలో  ఆవిడ మరిది, ఆడపడుచులకి కూడా పెడుతుంది.  వాళ్ళకి వెంటనే ఇచ్చేదాకా ఊరుకోదు. ‘Phone అన్నా చేస్తే వాళ్ళే పట్టుకుపోతారు. కనీసం ఫోన్  కూడా చేయడానికి తీరిక లేదాయే నీకు’ అని నాకే class పీకుతుంది. వాళ్లిద్దరూ అంటే ఎప్పుడూ చిన్న వాళ్ళే  కిందే లెక్క ఆవిడకి.) .

తరువాత మేము పుట్టడం,  బళ్ళకి  వెళ్ళడం అలా సమయం గడిచిపోయింది. నేను 6 వ తరగతిలో తెలుగు నుంచీ English medium మారాను. ఆ మారటంతో నాకు కష్టంగా ఉందని ప్రతీ సబ్జెక్టు కి నోట్సు వ్రాసి పెట్టేది. మా తమ్ముడికి చదువంటే ఎక్కడలేని దుఃఖం వచ్చేది. వెక్కి వెక్కి ఏడ్చేవాడు 😀 . ఒక్కగానొక్క కొడుకు చదువుకోడేమోనని ఈవిడ వాడితోపాటు కూర్చుని దుఃఖపడేది. 

ఇక మాకై  మేమే చదువుకోవడం మొదలు పెట్టాము.  మా నాన్న ట్రాన్సఫర్ లు  వచ్చినా ఆయన వెళ్తూ మమ్మల్ని హైదరాబాద్ లో ఉంచేసారు.  అప్పుడు అమ్మ ఆంధ్ర యువతి  మండలిలో  కుట్టులో డిప్లొమా చేస్తాను అని మళ్ళీ విద్యకు శ్రీకారం చుట్టింది. ఎన్ని రకాల కుట్లు  కుట్టేదో. చాలా మంచి మార్కులతో  డిప్లొమా పాస్ అయింది. ఈవిడ కుట్టే విధానం చూసి ఎవరో చెప్పారు  గవర్నమెంట్ సర్టిఫికెట్ చేయమని.   అందుకు మళ్ళీ సెట్విన్ సంస్థలో Tailoring లో ఇంకో డిప్లొమా చేసి, గవర్నమెంట్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అనుకోకుండా దుర్గాబాయి దేశముఖ్ గారి సంస్థ అయిన  ఆంధ్ర మహిళా సభలో లో కుట్టు నేర్పే టీచర్ గా చేరింది. దాదాపు ఓ 17 ఏళ్ళ దాకా పని చేసింది. ఎంతో మంది దగ్గర ప్రశంసలు అందుకుంది. దుర్గాబాయమ్మ గారికి అంత్యంత  సన్నిహితురాలైన  సుగుణమణి  గారు కూడా అమ్మతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. మమ్మల్ని వాళ్ళింటికి కూడా తీసుకెళ్లేది. స్వయంకృషి మానసిక వికలాంగుల సంస్థ మంజులా కళ్యాణ్ గారు గారితో కూడా మంచి సాన్నిహిత్యం.  ఏదో  కుట్టు నేర్పడం ఒక్కటే కాదు. Challenged పిల్లలకి చెప్పాలి. కొంతమంది పిల్లలు ఎంత attach  అయిపోయేవారంటే, సాయంత్రం ఇంటికి వెళ్లమని  ఏడ్చేవారు. పిల్లల కోసం చెట్ల క్రింద కూర్చునే తల్లితండ్రులు కొందరయితే, పిల్లల stipend  ఎప్పుడు లాక్కుందామా అని ఎదురుచూసేవారు కొంతమంది. ఇలా ఎన్నో రకాల మనుష్యుల్ని , ఎన్నో మనస్తత్వాలని చూసింది అమ్మ. 

మా నాన్న కి  బ్యాంకు ఉద్యోగం కావడంతో ట్రాన్సఫర్ లు అవుతూ ఉండేవి. ఏ ఊరు  వెళ్ళినా  ఈవిడకి ఒక్కరే స్నేహితురాలు ఉండేవారు. వరంగల్ లో ప్రమీల పిన్ని, మహబూబ్ నగర్ లో శచీదేవి టీచర్ గారు,  ఆత్మకూరు లో తేజా అత్తయ్య ఇలా. ప్రమీల పిన్ని,శచీదేవి టీచర్ గారు ఎక్కడ ఉన్నారో తెలీదు. తేజా అత్తయ్య తో అన్ని దశాబ్దాల స్నేహం కొనసాగుతూనే ఉంది.  హైదరాబాద్ వచ్చాక  ఉద్యోగం లో  తన కొలీగ్ లే  స్నేహితులు. పొద్దున్నే 10 గంటలకల్లా అన్ని పనులు ముగించుకుని( మేము చిన్న పిల్లలమైనా సరే ) కబుర్లు చెప్పుకుంటూ  వాళ్ళకి వచ్చిన అల్లికలో కుట్లో  నేర్చేసుకునేవారు. ఈరోజుకి కూడా  అమ్మ ఊరికే కబుర్లు చెప్పదు. చేతిలో చిక్కుడు కాయలైనా ఒలుస్తూ  మాట్లాడుతుంది. మా అక్క , నేను అరుస్తుంటాము ‘ఏమిటే ఈ పని పిచ్చి’ అని. కానీ ఊరుకోదు. అమెరికా వస్తూ ఓ రెండు చీరలు తెచ్చుకుని వాటికి ఎంబ్రాయిడరీ చేసేస్తుంది. పోయినసారి మా దగ్గరికి వచ్చినపుడు కొడుకు కొనిచ్చిన ఐపాడ్ పెట్టుకుని యూట్యూబ్ లో ఏవో నేర్చేసుకుని సాయంత్రానికల్లా నేను  వచ్చేసరికి ‘ఇది చేసానే ఈ రోజు’ అని చెప్పేది. ఫొటోల్లో కాన్వాస్ మీద ముగ్గులు వీడియోలు చూసి వేసేసింది.  ఒకసారి ఏమీ తోచక పిల్లల crayons పెట్టి తెల్ల కాగితాల మీద రకరకాల ముగ్గులు  వేసింది. మా  ఇంటి చుట్టుపక్కల  walking లో వీళ్ళ లాంటి retired వారు పరిచయం అయ్యారు. వాళ్లందరికీ ఆ ముగ్గులని ఫోటో ఫ్రేముల్లో  పెట్టి ఇచ్చింది.  

Time  management  అంటే మా అమ్మని చూసే నేర్చుకోవాలి. ఏదైనా సమయానికే.    ఏ రోజయినా సరే ఎంత హడావిడి అయినా సరే మడి కట్టుకుని పూజ చేసుకుని బయటికి వెళ్తుంది.  ఆవిడ  చదివే స్తోత్రాలు నాకు అలా నోటికొచ్చేశాయి. సరే ఇక అందరి అమ్మల్లాగే వంట చేస్తే అమృతం. ఇల్లు సర్దితే అద్దం. ఎంత సాదా కాటన్ చీర అయినా గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుని కట్టుకునేది. ఆ చీరకే అందం వచ్చిందా అన్నట్లు.

 మా చిన్నప్పటి  నుండీ అమ్మకి ప్రతీది పూస గుచ్చినట్లు మాకు చెప్పడం అలవాటు. మేం చిన్నవాళ్ళం అర్ధం కాదు అనుకునేది కాదు. ఆవు-పులి కధ ఎన్ని సార్లు చెప్పినా వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళం .అంత బాగా చెప్పేది. మా పిల్లలకి కూడా చిన్నప్పుడు అదే ఇష్టంగా ఉండేది. . మా అందరికీ BFF అంటే అమ్మే. 

ఇక నాన్నతో. అమ్మ, నాన్న ఇద్దరూ ఎవరి లోకంలో వాళ్ళున్నట్లే ఉంటారు. పోట్లాడుకున్నట్లే ఉంటారు.  కానీ ఇద్దరికీ common interest లు భలే ఉంటాయి. సంగీత కచేరీలకి వెళ్ళడం. యాత్రలు చేయడం. కాఫీ తాగుతూ మా అందరి గురించి చెప్పుకోవడం.  సంగీతం వినడం, పాత  ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఇవన్నీ నాన్నే  అమ్మకి అలవాటు చేసారు. 

అమ్మకి  తను  అందరిలా డబ్బు తెచ్చే ఉద్యోగం చేయలేదని ‘ఏదోలే  ఓ కుట్టు టీచర్ ని’ అని  అనుకుంటూ ఉండేది. రెండేళ్ళ  క్రితం,  అమ్మవాళ్ళు అమెరికాకి వచ్చ్చి తిరిగి  భారతదేశం వెళ్లేముందు మా ఊరి airport లో ఒకమ్మాయి (అమ్మాయి అనకుండా ఆవిడ అనచ్చేమో ) అమ్మని చూసి నవ్వుతూ ‘లలితా మేడం’ అంది. ఆ అమ్మాయి caretaker కి అర్ధం కాలేదు ఎవరిని పిలుస్తుందో అని. అమ్మ చెప్పింది ఆ caretaker గారికి ‘ ఓ పాతికేళ్ళ క్రిందట తనకి  కుట్టు నేర్పించాన’ని. ఆవిడ మాటి మాటికీ తను చేసిన పని విలువని  డబ్బుతో కొలుచుకుంటూ, ‘నిజమే కాబోలు ఎందుకు అమ్మ చేసే ఉద్యోగం పనికి రాని పనేమో’  అని మాకు తెలీకుండానే అనుకునేట్లు చేసింది.  డబ్బు కోసం ఉద్యోగం అందరం చేస్తాము. లోకమంటే తెలీని ఆ అమ్మాయికి  అమ్మ అంతలా  గుర్తుండి  పోయిందీ అంటే ఈవిడ చేసిన పని విలువ కట్టలేము అని ఆ రోజు నాకనిపించింది. . మనం మనిషి చేసేపనిని  డబ్బు రూపంలోనే కొలవటం ఆపేసిన రోజున విలువలని కూడా గుర్తిస్తాము. 

అదండీ అమ్మ గురించి. 

వ్యాఖ్యానించండి