అస్సాం & మేఘాలయ – 2

Visit to Sualkuchi village & saree shopping 

ఎక్కడికి వెళ్ళినా  చీర & చేనేత.  దానితోటే  ముడి పడిన సంస్కృతి.  ఇంత కంటే అద్భుతం ఏముంటుంది కదా 🙂 . 

 ఈశాన్య రాష్ట్రం కావడంతో సాయంకాలం తొందరగా చీకటి పడుతుంది.  పొద్దున్న  తొందరగా వెలుతురు వచ్చేస్తుంది.  మేము విమానం దిగి భోజనం చేసాక ఓ 3 గంటల సమయం ఉంది. మేము చూడాలి అనుకున్న రెండు main గుళ్ళలో  ఏ గుడికి వెళ్ళే  సమయం లేదు.  బ్రహ్మపుత్ర నదికి అవతల కొన్ని గుళ్ళు ఉన్నాయి అని గూగుల్ లో చూసాను. డ్రైవర్ వాటి గురించి అంత బాగా తెలీదు అన్నాడు. అయినా వినకుండా పద పద మని వెళ్ళమన్నాను. చాలా దూరం వెళ్ళినా  గుళ్ళ  జాడ లేదు.  అలా కాదని వెనక్కి తిరిగి   దగ్గర్లో  ఉన్న  చేనేత గ్రామానికి వెళ్ళమన్నాను.  కనుక్కోవడం చాలా తేలిక కూడా అయ్యింది.  

ఓ రెండు కొట్లు  తిరిగి , మగ్గం కూడా చూపించమని అడిగాము. వాళ్ళ పండగ ‘Bihu’ అని మగ్గం పనివారు రారు అని చెప్పి, మగ్గం మాత్రం చూపించారు. Motifs కోసం cardboard మీద కావలసిన design వేసుకుంటారు.  customized  డిజైన్ కూడా వేసి ఇస్తారు కావాలంటే.  అస్సాం వారి చీరలు రకరాలు. 600- 60000 వరకూ ఉంటాయి.  ‘Mekala Sador’ అని రెండు భాగాలుగా ఉంటుంది చీర. కొంగు భాగం. చీర భాగం.  లంగా వోణి ల ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు వేసుకున్నా ఎబ్బెట్టుగా ఉండదు.  నేను మా అమ్మాయికి కొన్నాను.  చిన్న పాపల్లా feel  అయి మా టీనేజ్ అమ్మాయిలతో పోటీలు  ఓణీలు వేసుకునే  40 ఏళ్ళ టీనేజ్ ఆడవారు ఈ చీరలు కొనుక్కోవచ్చు :). Social  media లో  demand create  చేస్తే ఈ చీరలకి గుర్తింపు వస్తుంది.  Shefali గారి video  పెడతాను. చూడచ్చు. 

షాపులో చీరలు కొన్నాక, వారు టీ ఇచ్చారు. వారి పండగ అంటూ బియ్యప్పిండి, నువ్వులతో, కొబ్బరితో కజ్జికాయల్లాంటి పిండివంటలు పెట్టారు. బావున్నాయి. తిన్నాక  బిల్లు ఇచ్చేసి వస్తుంటే  కొట్టు వాళ్ళు  ఒక తెల్లటి రంగుకి ఎర్రటి బోర్డర్ ఉన్న కండువా (Gamosa అంటారట) అందరికీ కప్పి అందరి కాళ్ళకి  నమస్కారాలు చేసారు. ‘అయ్యో ఇదేంటి’ అని మేము మొహమాట పడితే  ‘ఇది మా traditional  కండువా. ఇలా వేసుకోవడం మా ఆచారం’ అంటూ చెప్పారు. ‘marketing’ అని మనం అనుకోవచ్చు. కానీ మేము అలా  అనుకోలేదు.  ఒక వేళ అలా అయినా అపురూపమైన భారతీయ చేనేత వారికి  ఈ మాత్రం ‘marketing skills ‘ ఉన్నాయి అని గర్వపడచ్చు.  

అనుకోకుండా ఇదో అనుభవం.  

ఏదైనా ప్రదేశం  చూడటానికి వెళ్తుంటే , కొంచెం రీసెర్చ్ చేస్తే  ఇట్లాంటి ప్రదేశాలు miss  అవ్వము.  అనుకోకుండా చేసిన యాత్ర అవ్వటం మూలాన కొన్ని మేము miss  అయి ఉండచ్చు కూడా.  వెళ్లి వచ్చిన నాలాంటి వారు ఇలా చెప్తే పదిమందికి తెలుస్తుంది అని ఆశ

అస్సాం & మేఘాలయ – 1

‘సంకల్ప బలం’ అనేది ఉంటే అమ్మ దయ అనేది ఎలా ఉంటుంది అనడానికి నాకు లభించిన ‘కామాఖ్య’ అమ్మ వారి దర్శనం.  Dec లో మా నాన్న గారు ICU లో ఉన్నపుడు ‘l promised my wife that I will take her to Kamakhya temple in Assam. I couldn’t take her’ అని చెప్పారు. రెండు సార్లు book చేసి cancel చేసారుట. అదీ ఆయన బాధ. ‘అలాంటివి ఇపుడు ఏమీ అడగకండి. మీ ఆరోగ్యం బావుంటే చాలు’ అంది అక్క. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మేము ఆయనకి ఏ మాటా ఇవ్వలేదు. కానీ అమ్మవారు ఊరుకుంటారా మరి? 

 అమ్మని కాస్త ఎక్కడైనా తిప్పుదాం అని ఆలోచించి చాలా casual గా గౌహతి చూస్తే Hyderabad నుంచి nonstop flights ఉన్నాయి. ఆలోచన రాగానే మా ఆడపడుచుని కూడా అడిగాను. సరే అన్నారు. వెంటనే book చేసాము. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. నాలుగు రోజుల్లో ముగ్గురం అన్నీ చూసి వచ్చాము.

డిసెంబర్ లో భారత్  వచ్చి వెళ్ళాక  జనవరి 5న ఓ టపాలో వ్రాసిన మాటలు ఇవి “ఒకటి  మాత్రం  నిర్ణయించుకున్నాను.   ఇక పై ఒక్క వారం  రోజుల సెలవు సమయము ఉంటేభారత్  తప్ప ఇంకో చోటికి వెళ్ళను అని. చూడవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నది  భారత్ లోనే అని నా ఉద్దేశ్యం.  ఆ వారం సమయం లేకపోతే అమెరికాలో చుట్టు  పక్కల ప్రదేశాలకి వెళ్లడం.  భారత్  లో చూడవలసిన అద్భుతాలు చూడటానికి జీవితం సరిపోదు”

ఈశాన్య రాష్ట్రాల వైపు నా నాలుగు రోజుల mini trip  అయ్యాక ఖచ్చితంగా అదే మాట మళ్ళీ  మళ్ళీ చెప్తున్నాను. ఊరు ఊరుకి , రాష్ట్రం దాటగానే సంస్కృతి మారిపోతుంది.  కానీ ప్రతీ ఒక్కడూ భారతీయుడే. సద్గురు గారు చెప్పినట్లు  తెలిసో తెలీకుండానో  ప్రతీ ఒక్కరూ మాట్లాడేది ‘మోక్ష మార్గం & కర్మ సిద్ధాంతం’ గురించే. 

ఇలా సాగింది మా నాలుగు రోజుల ప్రయాణం. 

 3 Nights/4 Days

 Day 1  – Hyd to Guwahati . Visit to Sualkuchi village & saree shopping 

 Day 2 –  Kamakhya  &  Umananda temples 

 Day 3  –  Shillong  & Cherrapunji -Water falls & Sight seeing

Day 4  –  Umiam lake sight seeing – Return back to Hyd

  

భారతీయులకి  foreign country  అంటే ఎంత పిచ్చి అంటే లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి సింగపూర్ లాంటి  దేశాలు చూస్తారు  కానీ భారత్  లో ఇటువంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి  అని కూడా  అనుకోరు . ఇవన్నీ ఏదో  తీర్థయాత్రలు , పెద్దవాళ్ళకే  అన్న అపోహలో ఉంటారు.  మీ దేశంలో  టూరిజం ని  మీరే  మెచ్చుకోకపోతే ఎవరు చూస్తారు?  స్విట్జర్లాండ్ చూసి బావుంది అనుకున్నాను. కానీ అంతకు మించి ఉంది మేఘాలయ అనిపించింది నాకు.  ఈ లెక్కన సిక్కిం ఎలా ఉంటుందో  ఇక ఊహించుకోవచ్చు. భారతీయులు తమ దేశంలో స్థలాలు చూసి/చూపించి  టూరిజం ని  ప్రోత్సహించాలి. 

మళ్ళీ తీరిక దొరికినపుడు ఇంకొన్ని విశేషాలతో ..

Celebrating Life of Mr.Google

మా నాన్న గారు  మార్చి  29, 2022న  శరీరాన్ని విడిచి వెళ్ళారు .  

క్లుప్తంగా చెప్పాలి అంటే ఆయనకి తెలియని విషయం అంటూ ఉండేది కాదు.   అది బ్యాంకు ఉద్యోగం వల్ల  కొంత, స్వతహాగా ఉన్న ఆసక్తి వలన.

కంప్యూటర్ లు వచ్చాక ఆ రోజుల్లోనే  ఓ పక్క ఉద్యోగం చేస్తూనే COBOL నేర్చుకున్నారు. Internet  వచ్చాక email  ఎలా వ్రాయాలో మొదలు పెట్టి ,  networking దాకా నేర్చేసుకున్నారు.  ఇంట్లో ఎవరిదైనా సరే తనే  ఆ computer  fix  చేసేవారు.   ఎప్పుడూ అందరికీ  hard drive  ఒకటి తెచ్చుకుని backup  చేసి ఇచ్చే వారు.  ఇక smart  phones తో కూడా  అలాగే చేసేవారు.  BSNL వాళ్ళ కంటే మా నాన్నకే  బాగా తెలిసేది .  

ఆ BSNL  అంటే మహా ఇష్టం. ‘public sector ని అంటే ఊరుకోను’  అని ఖచ్చితంగా మొహాన చెప్పేవారు.  Facebook లో కూడా చాలా active గా ఉండేవారు.  తెలుగు బ్లాగులు నాకు పరిచయం చేసింది మా నాన్న గారే .  ‘కూడలి’ చూపించారు.  ‘కష్టేఫలి’  శర్మ గారి బ్లాగు గురించి , శర్మగారి చెప్పే విషయాలు చాలా నచ్చేది ఆయనకి.  ‘ భండారు’ వారు ఆయనకి ముఖపుస్తకంలో పరిచయమే. 

‘మోదీ’ ఇష్టమే కానీ ‘opposition లేకపోవడం పెద్ద drawback. భక్తుల్లా మాట్లాడతారు మీరంతా.  అసలు విమర్శించకూడదు అన్నట్లు ఉంటే  ఎలా’  అని మాతో పెద్ద వాదనలు వాదించేవారు.  

ఎంత ఓపిక లేకపోయినా లేచి ఆ కంప్యూటర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి  ఓ అరగంట సేపు ముఖపుస్తకం లో గడిపేవారు. రష్యా యుక్రెయిన్  యుద్ధం గురించి మనవళ్ళు , మనవరాళ్ళు  analysis ఇవ్వమని అడిగారు.  ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మాట్లాడారు. 

అందుకే ఆయన వెళ్ళిపోయాక  ఆ 13 రోజులు  మేము ‘ Celebrating Life of Mr.Google’ అనే title  ఇచ్చాము.  ఆయన  లేని మా జీవితాలని మాములుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. 

నా పాత  టపాల  లంకెలు :

నా EAMCET కథ
మహనీయ మధురమూర్తే

మా అక్కయ్య ముఖపుస్తకం లో  వ్రాసిన టపా కూడా పదిలంగా  బ్లాగులో దాచుకుందామని  ఇక్కడ post  చేస్తున్నాను. 

చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయి 3 వారాలు కావస్తోంది.
ఆయన లేరు అనే నిజం ఇంకా జీర్ణం అవట్లేదు.
మరి కన్న తండ్రి కదా అలాగే ఉంటుంది అన్నారు ఎవరో.
నాన్న just నాన్న మాత్రమే కాదు కదా.


మా Facebook friend. సంగీత, సాహిత్య మిత్రులు. , a curious learner , a mischievous kid who would change all our gadget passwords and watch fun.


అందుకే ఎన్నో విధాలుగా ప్రతి నిమిషం నాన్న ని miss అవుతున్నా.
అమ్మ అనేది ” ఎప్పుడు ఆ పుస్తకాలు కంప్యూటర్లు తప్ప పిల్లలకు ఏం పెట్టాలి ఏంఇవ్వాలి అని ధ్యాస లేదు” అని.
నాన్న ఇచ్చిన ఆస్తి దేనికి కొలమానం.???


మంగళంపల్లి వారి “నగుమోము” enjoy చెయ్యటం నేర్పింది నాన్న. త్యాగరాజ పంచమికి పంచరత్నాలు live తిరువాయుర్ నుంచి చూడటం, ఎక్కడ మంచి కచేరి వున్నా తీసుకెళ్లడం. దాదాపు ప్రతి పెద్ద కళాకారులని లైవ్ లో చూడగలగటం నేర్పింది నాన్నే .


రేడియో వినిపించడం మాత్రమేనా, ఆలిండియా రేడియో కి పట్టుకెళ్లి అక్కయ్యలని, మామయ్యాలని ఏకాంబరాన్ని చూపించింది మా మొహల్లో excitement తెచ్చింది నాన్న.


రైల్ అందరూ ఎక్కుతారు. ఇంజిన్ ఎక్కించారు, స్టేషన్ లో సిగ్నల్ రూమ్ కి పట్టుకెళ్లారు.
తమిళనాడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో A/C First class ఎక్కించారు, just ఆ feel కోసం.(డబ్బు వుండి కాదు, LTC లో మరి కాస్త వేసుకుని), ఒకసారి రామేశ్వరం.నుంచి మద్రాసు దాకా Heritage Compartment లో పట్టుకెళ్లి మా ముగ్గురికి రాజుల కాలం ఫీల్ తెప్పించారు.

LTC లో కాస్త డబ్బు చేర్చి మొదటి సారి మాకు flight ఎక్కిన అనుభవం నాన్న వల్లే.
చాలమంది మా తోటి స్నేహితుల parents డబ్బులు దాచుకుంటే, నాన్న మమ్మల్ని దేశం లో తిప్పని ప్రదేశం.లేదు.


ముగ్గుర్ని తీసుకుని పెరేడ్ గ్రౌండ్స్ లో రంజీ ట్రోఫీ మాచ్ కి పట్టుకెళ్లి, స్టాండ్స్ లో కూర్చుని మాచ్ చూడటం లో థ్రిల్ చూపించారు.


పానిపురి తినాలన్న మిర్చి బజ్జి అయినా , మంచి కాఫీ అయిన నాన్నే.

Survey of India లో మాప్ లు తెచ్చి how to read maps చెప్పింది నాన్నే.

పుస్తకాల విషయంలో చెప్పనక్కర్లేదు.
నాకు పుస్తకాల పిచ్చి నాన్న వల్లే. చిన్నపుడు మొగల్ లైబ్రరీ కి వెళ్లడం తో మొదలయింది మా book friendship.”ఇదిగో ఈ bookచదువు” అంటూ ఇంటికి వెళ్ళగానే ఒకటి విసిరేసేవారు.
‘దుమ్ము ఉంటుంది, ఆయాసం వస్తుంది’ అని అమ్మ అరుస్తున్నా, నా ఆఫీస్ కి వచ్చి ‘Book Exhibition కి వెళ్దాం అమ్మకి చెప్పకు’ అంటూ ఆ పుస్తక వ్యసనానికి మూలం నాన్న.
అమ్మ అనేది “ఆడపిల్ల వచ్చింది ఒక చీర పెట్టామా లేదా అక్కర్లేదు, ఆ పుస్తకాలు ఇస్తే చాలా?” అని. చాలాదా!!కోట్ల రూపాయల విలువ . పుస్తకం కాదు. అది చదివి ఆయనతో చేసే డిస్కషన్. ఆయన reasoning. In this society emotions are over rated than practicality అని నవ్వేవారు.

ప్రతి విషయం మీద ఒక view ఉండాలి అని అనేవారు.
అటు politics అయిన, ఇటు మతపర విషయం అయినా, సాంఘిక విషయాలు అయినా చర్చ జరగలసిందే. నాకు తెలిసి మా ముగ్గురికి ఒక్కసారి కూడా text booksచదవమని చెప్పింది లేదు. అయినా మెమెప్పుడు చదువు నిర్లక్ష్యం చేసింది లేదు.

ఎప్పుడు తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ fiction, travelogues, national geographic magazines, readers digest. ఒకటేమిటి అన్ని రకాల బుక్స్.
నా ట్రావెల్ పిచ్చి కి, ఎప్పటికయినా జీవితం లో భూభ్రమణం చేయాలనే నా కోరిక కి బీజం నాన్నే.

బాపు రమణలని , బుడుగు ని పరిచయమ్ చేసింది నాన్న.

కున్నకుడి “కావేరి ” వయోలిన్ రుచి చూపించింది నాన్న.

Lalgudi violin కానీ “west meets east” by రవి శంకర్ కానీ , మంచి హిందీ పాటలు కానీ వినటం అలవాటు చేసింది నాన్న.
.
రిటైర్ అయిన వాళ్ళు , అమెరికా వెళ్లిన పెద్దవాళ్ళు ఎంతో మంది బోర్ బోర్ అంటుంటే, నాన్న మాత్రం లైబ్రరీ కో, మైక్రో సెంటర్ కో వెళ్లి అలా రోజులు గడిపే వారు. అలా ఒక కంప్యూటర్ ముందు వేసుకుని గంటలు గడిపేసే వారు
ఒక్క రోజు ఆయన నోట్లో బొర్ అనే.మాట వినలేదు.


enjoying life has nothing to do with physical assets అని అనడానికి నాన్నే నిర్వచనం.


కాదేదీ కవితకనర్హం లాగా
ఒక చిన్న రైల్ ప్రయాణం అయినా, ఒక పుస్తకం అయిన, ఒక పాట అయిన , స్నేహితులతో గడపటం అయిన జీవితాన్ని అంత enjoy చెయ్యచ్చు అని తెలుసుకుంది నాన్న వల్లే.
చిన్నతనం లొనే తండ్రిని పోగొట్టుకుని, పెద్దకొడుకుగా గంభీరంగా బాద్యతలు తీసుకున్న నాన్నే మా ఆదర్శం మరి.


జీవిత కాలం నాన్నతో ప్రాణస్నేహితులు గా ఉన్న శివరాం మామయ్య ,సోమశేఖర్ మామయ్య , రంగనాథ్ మామయ్య ల, అనుబంధంలాతో (uncle అనే పిలుపు లేవు అందరిని మామయ్య అనాల్సిందే) స్నేహం విలువ చెప్పారు నాన్న.
సక్సెస్ అంటే నాన్న definition వేరే.


Technologyఆంటే ప్రాణం నాన్నకి. అన్ని నేర్చికుని మనవళ్ళ computer passwords మార్చేసి వాళ్ళని ఏడిపించిన Modern తాత.. Computer time కోసం పిల్లలతో సమానం గా పొట్లాడిన చిన్న పిల్లాడు నాన్న.
అలాంటి నాన్న ఏదో కొత్త technology తో స్వర్గం నుంచి wifi లో contact లోకి తొందరగా రాకపోతారా!!!