ఒక అంత్యేష్టి సంస్కారానికి వెళ్లి విచలిత మనసుతో ఉన్న నన్ను మా వారు, మా అమ్మాయి భగవద్గీత ప్రవచనం కి తీసుకెళ్లారు. అక్కడ స్వామిజీ చెప్పిన కర్మ యోగ శ్లోకం 21 మనసు ని బాగా పట్టుకుంది. నాకు భారతం లో ఇంకో కోణం కూడా కన్పించింది.
అరణ్య పర్వం లో కొలను దగ్గర చనిపోయిన తన అతి పరాక్రమ వంతులైన నలుగురి తమ్ముళ్లను చూసి విచలితుడు అయి కూడా ఓర్పు తో యక్షప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. అంత బాధలోనూ ఒక్క తమ్ముడికే జీవితం ప్రసాదిస్తాను అంటే, మాద్రి కొడుకైన నకులుడిని ఇవ్వమని అడిగాడు. యక్ష ప్రశ్నలలో నన్ను ఎప్పుడూ ఆలోచింప చేసే ప్రశ్న – ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం) ( వికీ సౌజన్యం తో ).
భగవద్గీత, విష్ణు సహస్రనామం రెండూ కూడా పంచమ వేదం గా భావించే మహాభారతమే ప్రసాదించింది. చాలా మంది భావన ఏంటంటే జీవితం చివరి దశ లో ఉన్నపుడు భగవద్గీత చదువుకోవాలి అని. అది సరి కాదు. భగవద్గీత మనిషి కి మానసికం గా చాలా బలం, స్వాంతన చేకూరుస్తుంది. ఆ విషయాన్నీ మనము పూర్తిగా విస్మరిస్తున్నాము. నేను అమెరికా లో కొందరి జీవితాల గురించి విన్నాను. వారి జీవితాలలో అన్ని కష్టాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోయాను. చెపితే నమ్మరేమో కానీ వారు అనుసరించిన మార్గం భగవద్గీత !!
ఇలా ఎన్నో విషయాలు చెప్పే రామాయణ మహాభారతాలని చదివి లేదా విని మనం స్ఫూర్తి పొందాలి, నేర్చుకోవాలి. అవి వదిలేసి(ఆక్షేపిస్తూ ), ఎన్ని పుస్తకాలూ చదివినా నేర్చుకునేది ఏమి ఉండదు అంటాను నేను. ముఖ్యం గా యువతరం వీటిని చదవాలి. సమాజం చదివేటట్లు చేయాలి. ఇవేవో మత గ్రంధాలు అనుకుంటే అక్కడే పెద్దపొరపాటు చేస్తున్నట్లు లెక్క. రామాయణ భారతాలు వినవలసిన రీతి లో వింటే ఎంతటి కౌన్సిలింగ్ కూడా పనికి రాదు.
చాగంటి వారి మాటల్లో “ఇతిహాసము – ఇతి హా అసము. ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు”. రామాయణ భారతాలు యదార్థగాథలు అని ఖచ్చితం గా నమ్మే వాళ్ళల్లో నేను ఒక దాన్ని. ఈ రోజుల్లో చాలా మంది చేసే వాదన ‘ ఇలా జరిగాయా పెట్టాయా!! అన్నీ కట్టు కథలు’ . నాకు ఇంకొక చిరాకు కలిగించే విషయం. రామాయణ భారతాలని Indian Mythology అనటం. Mythology అంటే Collection of myths. పోనీ Myth అనే అనుకున్నా – కథ ల్లో కాలక్రమం ఎలా ఉంటుంది? కట్టు కథలే అయితే ఇంత పెద్ద కథలు వ్రాయటానికి జరిగిన విషయాలే కొంత కల్పితం జోడించి కథ గా మలచి ఉండచ్చు కదా. కౌముది పత్రిక లో మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు, యద్దనపూడి సులోచన రాణి గారు వారి ఒక్కొక్క నవల, ఆ పాత్రల గురించి చెప్పారు. (వ్యాసాల పేర్లు నాకు గుర్తుకు లేవు ). నవలలలో కొన్నిపాత్రలు వారి నిజ జీవితం లో తారసపడ్డారు !! ఈ మధ్య కథలు, కవితలు వ్రాసే వారు ఏ విషయం/అంశం మీద ప్రేరణ చెంది వ్రాస్తున్నారో చెప్తున్నారు. మరి వాల్మీకి, వ్యాసడంతటి వారు వారి ఇష్టం వచ్చినట్లు కల్పితం వ్రాస్తారా?
తెలుగు ప్రథమ భాష గా చదువుకున్న నా లాంటి దానికే కవిత్రయం వ్రాసిన ఆంధ్ర మహా భారతం చదివే శక్తి భగవంతుడు ప్రసాదించలేదు. అందుకే శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి లాంటి మహానుభావులు చెప్తున్నది వింటుంటే ఎవరో పూనుకుని ఆయన తో చెప్పిస్తున్నట్లే అన్పిస్తుంది _/\_. సాంకేతిక పరిజ్ఞానం తో Sri changanti.net ద్వారా కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్న మా లాంటి వారందరికీ అందజేస్తున్న వారికీ శతకోటి నమస్కారాలు.