అమ్మమ్మ

నవరాత్రులు  మొదలయ్యాయి.  మాములుగా అయితే దసరా ప్రతిరోజూ లలిత చదువుకుంటాను.  ఈ సారి  నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఒక్కొక్కరి గురించి వ్రాద్దామని అమ్మవారిని తలచుకుందాం అన్న ఆలోచన ఒకటి వచ్చింది.  అందుకే  ఇలా …. 

 కొంచెం personal గానే ఉంటాయేమో పోస్టులు

ముందు అమ్మమ్మ గురించి మొదలు పెడతాను.  

అమ్మమ్మ & ఆవిడ జీవితం గురించి వ్రాయాలంటే ఒక్క టపా సరిపోదు. కానీ కొంచెం క్లుప్తంగానే  వ్రాయడానికి ప్రయత్నిస్తాను. 

అమ్మమ్మ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది. తనకి  సొంత తోబుట్టువులు అంటే అన్నయ్య ఒక్కడే కానీ, పెదతండ్రి, మేనత్త పిల్లల్ని కలుపుకుంటే బోలెడు బలగం అమ్మమ్మకి. అమ్మమ్మకి ఇద్దరు పెదతండ్రులు. ఇద్దరు మేనత్తలు. అమ్మమ్మ ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. అన్నయ్య వచ్చి ‘అమ్మని నా  చేతులతో  పంపేసానమ్మా ‘ అని ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్ధం కాలేదుట అమ్మమ్మకి. అమ్మమ్మ తల్లి చనిపోయెనాటికే పెదతండ్రులిద్దరి భార్యలు కూడా చనిపోయారట . ముగ్గురు  అన్నదమ్ములు కూడా సవతితల్లులు  వస్తే తమ పిల్లల్ని సరిగ్గా చూడరేమోనని రెండో పెళ్లి చేసుకోలేదట.   ఈ పిల్లలందరినీ విధవరాలైన ఒక మేనత్త చూసుకునేది. ఆవిడే అమ్మమ్మకి  పురాణాలూ చెప్పేదిట. అమ్మమ్మ అందరిలోకి చిన్నది కావడంతో ఏదైనా తాయిలం తెస్తే ముందు అమ్మమ్మకి పెట్టి తరువాత అందరూ  తినేవారు. అలా తల్లి లేని పిల్ల అని అమితమైన గారాబంతో పెరిగింది అమ్మమ్మ. 

పదకొండేళ్ళు నిండగానే మా తాతయ్యతో వివాహం అయ్యింది. అప్పుడు ఆయనకి  పదమూడేళ్ళు. తన  పదహారో ఏట కాపురానికి వచ్చింది. అమ్మమ్మకి  కొన్ని ఏళ్ళ వరకు పిల్లలు కలుగలేదు. అటువంటప్పుడు ఆ రోజుల్లో  కొందరు  ద్వితీయ వివాహం చేసుకునేవారు. తాతయ్య తాను ఒక్కడే కొడుకయినా అటువంటి ఆలోచనలు రానివ్వలేదు. వారి ఇరువురికి  ఐదుగురు సంతానం, మనవళ్ళు & మనవరాళ్లు , ముని మనవరాళ్ళు  & ముని  మనవలు ..  చాగంటి గారు చెప్పినట్లు తామర  తంపర 🙂 .  

ఇంట్లో ఏ కూర  చేయాలి అన్న దగ్గర నుంచీ ఆవిడ  అత్తగారు, అంటే మా ముత్తవ్వ  గారిదే  decision making .  మా ముత్తవ్వ గారి చివరికోరిక మా అమ్మ పెళ్లి చూడాలి అని.  అందుకు   అమ్మని  కాలేజీకి పంపకుండా పెళ్లి చేయమని అడిగేదిట ఆవిడ. దేనికి అడ్డు చెప్పని అమ్మమ్మ అప్పుడు మాత్రం అమ్మని కాలేజీకి పంపాల్సిందే అని పట్టుబట్టింది. సాధారణంగా ఆడవారిలో ఎప్పుడో ఒకప్పుడు ‘ఈ చీర ఇలా ఉండాలి, ఈ నగ ఇలా వేసుకోవాలి’ అంటూ  ఒక కోరిక ఉంటుంది. అమ్మమ్మ ఎప్పడూ  ఏదో  ఒక విధంగా  ఇంకొకరికి సహాయం చేయడమే చూసాను కానీ నోటి నుంచీ ‘ఇది నా కోరిక’  అని ఎప్పుడూ  వినలేదు.

మా అమ్మ &  పిన్నులు, చిన్నప్పుడు ఎండాకాలం సెలవలు వస్తే  వెళ్లడానికి వాళ్ళకి అమ్మమ్మగారిల్లు లేదని ఏడ్చేవారట. అది దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ  మా అందరికీ ‘అమ్మమ్మ వాళ్ళ ఇల్లు’ అనే చెరిగిపోని తరిగిపోని జ్ఞాపకాన్ని అందించింది (అందులో మా తాతయ్య పాత్ర కూడా ఎక్కడా తీసిపోదు). ఎండాకాలం సెలవలు వస్తే చాలు, దాదాపు  ఓ ఇరవై నుంచీ పాతిక మందిమి అయ్యే వాళ్ళం. పొద్దున్నే కాఫీలు, పిల్లలకి వీవాలు, చద్దన్నాలు, భోజనాలు,తలంట్లు, మంచి నీళ్ళు  మోసుకొచ్చుకోడాలు,మధ్యలో బాలింతరాళ్ల & చంటిపిల్లల స్నానాలు, వాళ్ళకి  సాంబ్రాణి పొగలు, మడి & మహానైవేద్యాలు. ఆవకాయలు, మధ్యాహ్నం తాయిలాల తయారీ, పూల జడలు. . మధ్యలో ఊర్లో వారి చంటిపిల్లలకు స్నానాలు అలా ఒకటేమిటి ఇన్ని పనుల్లో తలమునకలైపోతున్నా ‘అమ్మలూ!! నాన్నా !!’ అంటూ మా అందర్నీ అమితమైన గారాబం చేసేది. ఎవర్నీ విసుక్కోవటం  నాకు గుర్తు లేదు. బహుశా అలా అందరం రావడం చాలా ఆనందం గా ఉండేదేమో ఆవిడకి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ మేనల్లుళ్ళు  (అంటే ఆడపడుచు పిల్లలు) ఈ రోజుకి కూడా ఎంతో ప్రేమగా & ఆప్యాయంగా ఉంటారు.  మా ముత్తవ్వగారు  చివరి రోజుల్లో మంచాన పడితే ఆవిడకి సేవ చేసింది.  అమ్మమ్మ చేసిన సేవకి, ఆవిడ ఏడ్చేదిట. 

ఎంత ఓపిక లేకపోయినా కూడా  అత్తగారి & మామ గారి తద్దినాలకి అమ్మమ్మే స్వయంగా వంట చేసి బ్రాహ్మలకి  వడ్డించేది. మా అమ్మ ‘భారతదేశంలో అన్ని చోట్లా  తర్పణాలు, పిండాలు పెట్టారు కదా. ఎందుకంత చాదస్తం‘ అంటే  కూడా వినకుండా ఓపికగా చేసేది.

ఆవరణలో ఆడవారందరూ ఈవిడ ప్రోత్సాహంతో దేవి భాగవతం లాంటివి పారాయణ చేసుకునే వారు.  కొంచెం తీరిక దొరికితే చాలు బుట్టలు అల్లడం, craft  చేయడం లాంటివి చేస్తూ ఉండేది.  

ఏ విషయాన్నయినా positive గానే చూస్తుంది ఆవిడ. అందుకే ఈ రోజుకి కూడా ‘పట్టు విడుపు ఉండాలమ్మా ‘ అంటూ మాకు ఏది ఎలా handle  చేయాలో చెబుతుంది.  

‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవరికీ  నీకున్న ఈ  అవగాహన & ఓర్పు లేదు.అసలు  నీకెలా వచ్చింది?’ అని అడిగాను. ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ  భయమేనే  అమ్మా!!  ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి నాకు.

తాతయ్య సేవకే ఆవిడ  పుట్టిందా అన్నట్లు,  ఆయన  పోయిన పన్నెండో రోజు  ఆవిడ కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి (అప్పటికే గ్లూకోమా వచ్చింది).  ఎప్పుడూ  ఏదో ఒక ప్రవచనం వింటూ గడుపుతోంది. ఇప్పటికైనా ఆవిడకి సేవ చేసుకుని తరించమని మా అందరికీ  భగవంతుడు వరం ఇచ్చాడేమో!! ఆ వరం ఇచ్చినా అందుకోలేని దురదృష్టవంతురాలిని నేను !! ఫోన్ కూడా చేయలేనంత తీరికతో ఉంటాను.  ఈ టపా  అయ్యాక చేసి మాట్లాడాలి. 

ఈ టపా మరీ నా వ్యక్తిగతంగా అనిపించచ్చు.  ఏ బడికి వెళ్లకుండా కేవలం పురాణాగాథలు విని ఇంత జీవిత పాఠం నేర్పించిన అమ్మమ్మలు  మనలో చాలా మందికే ఉంటారు. అందుకే  కేవలం నా మాటలలో ఉండిపోకుండా నా కుటుంబంలో తరువాతి తరం కూడా వారు కూడా తెలుసుకోవాలనే ఈ టపా !! 

బిట్రగుంట వాళ్ళతో తమాషాలా?

‘కృష్ణా ఎక్స్ ప్రెస్  లేటా ఏందీ ఈ రోజు?’  రైలు కూత విని అన్నారెవరో. 

‘అట్నేఉన్నట్టుందే !!’ 

ఆ రైలు దిగి వచ్చినవారెవరో  నిజమే అంటూ ధృవీకరించి చెప్పారు. 

ఇంకేం !! కృష్ణా ఎక్స్ ప్రెస్  లేటయ్యిందన్న వార్త గుప్పుమంది ఊర్లో.  చిన్నా పెద్దా అంతా దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు లేటయింది, ఏ స్టేషన్లో ఆలస్యం, ఏ బండి కోసం దీనిని ఏ ఊర్లో ఔటర్ లో ఆపేసి ఇలా అన్యాయం చేసారు వగైరా. 

‘ఎవరు వస్తున్నారు ఆ రైల్లో? లేటయితే ఏమవుతుంది? ఎందుకింత  చర్చ?’ అన్న ప్రశ్నలు మాములు మానవులకి  రాక మానవు.

ఆ ప్రశ్నలకి సమాధానాలు ‘ఆ రైల్లో ఎవరూ రారు. లేటవుతే కొంపలేం అంటుకోవు. కానీ ఆ ఊర్లో అందరూ దిగులుపడతారు.అదే ఆ ఊరు గొప్పతనం. అదే మా బిట్రగుంట 🙂 🙂 !!’

StationBTTR

*******************************************************

నిన్న మా పెరట్లో పూసిన నాలుగు మల్లెపూలు జడలో పెట్టుకోగానే ఆ వాసన జ్ఞాపకాల వైపు లాక్కెళ్ళింది. పైగా ఈమధ్యే  మా కుటుంబం జూమ్ మీటింగ్ లో చెప్పుకున్న బిట్రగుంట కబుర్లు కూడా తాజాగా గుర్తున్నప్పుడే భండాగారంలో అట్టిపెట్టుకుందామని మొదలుపెట్టాను మళ్ళీ ఈ సోది!! కరోనా, ఎలెక్షన్లు, యుద్ధం ఇలాంటి వార్తలువినీ వినీ విసుగెత్తిపోతోంది కూడాను!!

ఇది వరకే చెప్పా కదా.  చెరగని తరగని జ్ఞాపకాలు లలో !! బిట్రగుంట వాళ్ళు అక్కడ ఆగే అన్ని రైళ్ళని నంబర్లతోటే పిలిచేవారు (ఒక్క కృష్ణా, పినాకిని ఎక్స్ ప్రెస్ లని తప్ప). 

హైదరాబాద్ – మద్రాస్ ఎక్స్ ప్రెస్ ని 53 లేదా 54 అనే వారు. 

కాకినాడ- తిరుపతి తిరుమల ఎక్స్ ప్రెస్ ని 87 లేదా 88. 

బొకారో స్టీల్ సిటీ ఎక్స్ ప్రెస్ 83 లేదా 84.

ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇలా ఏవో కొన్ని మాత్రం బాగా గుర్తుండిపోయాయి. 

 

మా బిట్రగుంట ఆవరణ స్నేహితులు ఉత్తరాలు వ్రాస్తే రైల్వే codes లో ఊర్ల పేర్లు చెప్పేవారు. BTTR – బిట్రగుంట  NLR – నెల్లూరు , BZA విజయవాడ. మా తాతయ్య చాలా సంబరపడేవారు మేము ఇలా ఊరి పేరు  చెప్పి రైల్వే కోడ్  చెప్తే.  అసలు ఆ రైలు భాష అర్ధం కావడానికి కొన్ని రోజులు బిట్రగుంట వాళ్ళతో ఉంటేనే అర్ధమవుతుంది.

 

స్టేషన్ లో రైలు దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు కొన్ని రైల్వే క్వార్టర్లు దాటి వెళ్ళాలి. రాత్రుళ్ళు అందరూ బయట నులక మంచాలు వేసుకుని పడుకునే వారు.  ఎప్పుడైనా నెల్లూరులో ఫస్ట్ షో చూసి తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి వచ్చేవాళ్ళం. అలా నులక మంచాలలో పడుకున్నవారు, ఎంత మాంఛి నిద్రలో ఉన్నా లేచి ‘ రైట్ టైమేనా బండి?  లేటా?’ అని అడిగి మళ్ళీ పడుకునేవారు. అలా ఒకరు కాదు. కనీసం ఇద్దరైనా అడిగేవారు. నిద్ర కూడా పోకుండా ఇదెక్కడ తాపత్రయం అని నవ్వుకునేవాళ్ళం హైదరాబాద్ నుంచీ సెలవలకి వెళ్ళిన మేము.

 

ఢిల్లీ నుంచీ మద్రాస్ వెళ్ళే తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఎంత స్పీడుగా వెళ్తుందో చెప్పేవాళ్ళు మా ఆవరణలో మాతో ఆడుకునే పిల్లలు. ఆ చెప్పేటప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో వెలుగులు!! ఎంత స్పీడో చూద్దామని దాన్ని చూడటానికి పొద్దున్నేలేచి వెళ్ళేవాళ్ళం. జయంతి జనతా ఎక్స్ ప్రెస్ , హౌరా మెయిల్,  నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఇలాంటివెన్నో మా కబుర్లలో వచ్చేవి కూడా.

 

ఇక అన్నిటికంటే స్పెషల్ ట్రైన్. GT Express!! Grand Trunk Express!! అసలు బిట్రగుంట చరిత్ర బ్రిటిష్ వారి వలన ఈ రైలు తోనే మారింది అని కూడా చదివాను ఎక్కడో .  లోకో షెడ్ లో ఒకేసారి 59 ఇంజిన్లు ఉండేట్లు కట్టారుట . ఇంజిన్ మార్చడం కూడా బిట్రగుంటలో చేసేవారు. బొగ్గు ఇంజిన్లు పోయి డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్లు వచ్చి, GT Expressకి బిట్రగుంటలో స్టాప్ ఎత్తేసినా కూడా చింత చచ్చినా పులుపు చావనట్లు మా బిట్రగుంట వాసులు అది వాళ్ళ సొత్తన్నట్లే డాబులు పోతూ మాట్లాడేవారు :).

BTTRSHED

ఇలా ఎక్స్ ప్రెస్ ల పేర్లు అన్నీ వింటుంటే మాకు వాటిని ఎక్కాలని మహా కోరికగా ఉండేది. మా నాన్నగారు కూడా LTC వెళ్ళినప్పుడు ఆ రైళ్లు అలాగే బుక్ చేసేవారు.  అలా జ్ఞాపకంగా ఉన్న రైళ్లు  తమిళనాడు ఎక్స్ ప్రెస్. దాంట్లో ఢిల్లీ నుంచీ  వరంగల్ వచ్చి అక్కడ నుండీ హైదరాబాద్  వచ్చాము.  ఇంకోసారి  విజయవాడలో  GT ఎక్కి నెల్లూరు లో దిగి తిరుపతి పాసెంజర్ లో తిరుపతి వెళ్ళాము.  పైగా ఫస్ట్ క్లాస్ లో వెళ్ళాము. బిట్రగుంటకి  వెళ్ళినపుడు గొప్ప చెప్పుకోవద్దూ మరి !! 

 

బిట్రగుంటలో ఇంకొక స్పెషల్ ఏంటంటే డ్రైవర్లు, గార్డులు కూడా మారేవారు. అది ఈ మధ్య దాకా ఉండేది. చాలా మంది డ్రైవర్లు విజయవాడ లో పని చేసినా కుటుంబాలు ఇక్కడే ఉండేవి. బిట్రగుంట వాళ్ళు ఎప్పుడైనా విజయవాడ నుంచీ వస్తూ ఉంటే  డ్రైవర్/గార్డ్ మనవాళ్ళా కాదా అని చూసుకునే వారు. ఏ బిట్రగుంట డ్రైవేరో అయితే ఆపమనేవారు. ఒకసారి మా నాన్నగారు GT ఎక్కబోతూ ‘బిట్రగుంటలో స్లో అవుతుందా’ అని ఇంజిన్ దగ్గరకి వెళ్ళి డ్రైవర్ని అడిగారట. ’స్లో అవుతే బిట్రగుంటలో దిగిపోదాంలే. మళ్ళా నెల్లూరు దాకా వెళ్లి ప్యాసెంజర్ ఎక్కడం దేనికి’ అనుకుంటూ. ‘బిట్రగుంటోళ్ళా మీరు?  స్లో ఎందుకండీ ఆపేస్తాను. నెమ్మదిగా దిగి వెళ్ళండి’ అని చెప్పి ఆపాడట ఆ డ్రైవర్. ఊర్లో ఏడ్రైవర్ ఫాస్ట్ గా వెళ్తాడో, ఏ డ్రైవర్ స్లో గా వెళ్తాడో అవి కూడా కథలు గా చెప్పుకునేవారు.. నెల్లూరు సినిమా వెళ్ళాలి అంటే డ్రైవర్ ని చూసి ‘ ఓయమ్మో!! Mr.x  ఉన్నాడు. ఇహ ఆయన తోలితే సినిమా చూసినట్లే ఈ రోజు’ . ఇలా అనుకునేవారు. గౌస్ అనే డ్రైవర్ కి చాలా మంచి పేరు. సాల్మన్ అనే డ్రైవర్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లాంటి సూపర్ ఫాస్ట్ లు నడిపేవాడు. అతనికి కూడా చాలా మంచిపేరు. సూపర్ ఫాస్ట్ అయినా సరే, ఊళ్ళో వాళ్ళు అడగటం ఆలస్యం రైలు ఆపేసేవాడు అనే వారు. పినాకిని ఎక్స్ ప్రెస్  పెట్టిన కొత్తల్లో బిట్రగుంటకి స్టాప్ ఇవ్వలేదు. ఊరుకుంటారా మరి? రోజూ బిట్రగుంట వచ్చేసరికి చైను లాగేవారు. అది ఎవరు లాగారు  అనేది కనిపెట్టడం ఎవ్వరి వల్లా కాని పని. అందుకని ఈ చైను లాగే బాధ నుంచీ తప్పించుకోవడానికి ఏ డ్రైవర్ అయినా సరే ఔటర్లో కాసేపు ఆపేవారు.

 

ఇందులో ఓ చిన్న పిట్ట కథ: 

నేను మొట్టమొదటిసారి అమెరికా వచ్చినపుడు చెన్నైలో విమానం ఎక్కాను. అమెరికాలో ఉండే మాబావగారు నాకు తోడుగా Frankfurt  వరకూ వచ్చి , అక్కడ నేను మారాల్సిన విమానము ఎక్కిస్తాను అని చెప్పడంతో ఆయన తోటే విజయవాడ నుండీ చెన్నై బయలుదేరాం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కాము. మా బావగార్లు, మావారి కజిన్లు, అమ్మ, నాన్న, తమ్ముడు ఇలా అందరం. మా మావయ్య బిట్రగుంటలోనే పని చేసేవాడు( బుకింగ్ క్లర్క్) . నేనెప్పుడు బయలుదేరుతున్నానో కనుక్కుని తను కూడా చెన్నై వస్తానని చెప్పాడు. మేము ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బిట్రగుంటలో ఆగింది. మావాళ్ళందరూ  ‘ఇక్కడ ఆగదు కదా.ఆగిందేంటి’ అనుకుంటున్నారు. నేను ‘మా మావయ్యఎక్కి ఉంటాడేమో అందుకని ఆగింది’ అన్నా. అమెరికా బావగారు తెల్లబోయి ‘అదేంటి’ అన్నారు. ఇప్పుడు ఆయనకి గుర్తుందో లేదో కానీ ఈ కథంతా చెప్పా. చెన్నైలో దిగగానే మా మావయ్యని చూసి మా బావగారికి మతిపోయింది. 

**************************************************************************

ఎప్పుడో 1880ల్లో  బిట్రగుంటలో  రైల్వే కంటోన్మెంట్  వచ్చింది  అని చెప్తారు. అక్కడ  ఉన్న ఆ భవంతులని  కానీ, లోకోషెడ్ ని కానీ   ఓ చరిత్ర క్రింద చూపించి  ఓ మ్యూజియం లాగా  చేయవలసింది పోయి రైల్వే వారు ఆ లోకోషెడ్ scrap  క్రింద అమ్మేసి  ఆ అవశేషాలు కూడా  లేకుండా చేసారు అని విన్నాను. తెలుగు మీడియం స్కూల్ కి కూడా అదే గతి పట్టించారు అన్నారు మరి. ఆ రైల్వే వైభవం చూసిన మాకు ఇటువంటివి వింటుంటే బాధగా ఉంటుంది.

Photos Source : Google

నన్ను దడిపించిన ‘అల్లరి’

నేను అమెరికా వచ్చిన కొత్తల్లో  మావారు నన్ను తన స్నేహితుడొకాయనకి పరిచయం చేస్తూ ‘ ఇదిగో! ఈవిడా హైద్రాబాదే ‘ . ఆయన చాలా సంబర పడిపోయి  ‘ఎక్కడ’ అన్నారు. ‘నల్లకుంట & విద్యానగర్’ అని చెప్పి ‘ మీది’ అన్నాను. ఆయన ‘టప్పాచ పుత్ర. తెలుసా?’ అన్నారు. నాకు  బాగా నవ్వొచ్చేసింది. ఆపుకుంటూ ‘ఎప్పుడూ వెళ్ళలేదు కానీ విన్నాను’ . ఆయనకి నేను నవ్వు ఆపుకుంటున్నానని అర్ధమయ్యింది. ఆయన నవ్వేసి ‘ ఆ ఏరియా ఎందుకు తెలీదండీ తెలుస్తుంది. కర్ఫ్యూ  ఏరియా కదా’  అన్నారు.

నా చిన్నప్పుడు హైదరాబాద్లో బోనాలో, నిమజ్జనమో అంటే ముందు వచ్చేది  కర్ఫ్యూ. ఇక రంజాన్ కూడా కలిస్తే కర్ఫ్యూ పండగే !! రేడియో లోనో, టీవి లోనో చెప్పేవారు ‘టప్పాచ పుత్ర, ఆసిఫ్ నగర్, చాదర్ ఘాట్,  మంగళ్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్ , చార్మినార్, అఫ్జల్ గంజ్…..(ఇంకా ఏవో ) ప్రాంతాలలో కర్ఫ్యూ విధించడమైనది’ అంటూ. ఆ ప్రకటన వచ్చినపుడు  మా మావయ్య మాతోనే ఉంటే, ‘ఏవిటే మీఊర్లో పేటల పేర్లు. టప్పాచ పుత్ర ఏమిటి? అర్ధంతెలుసా నీకు? బిట్రగుంటలో పేర్లు చూడండే ఎంత బావుంటాయో’ అని ఏడిపించేవాడు. కోపం వచ్చేది నాకు. ‘బోగోలు ఏమన్నా బావుందా’ అని పెద్ద వాదన వేసుకునేదాన్ని. ఏదో snow season లాగా కర్ఫ్యూ season  అది. ఆ ప్రాంతాలలో బళ్ళకి సెలవులు. అందుకే అంత బాగా గుర్తుండిపోయాయి.

మా నాన్న మావయ్య వాళ్ళు సైదాబాద్లో ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇంటి నుంచీ వస్తూ సైదాబాద్ బస్టాండ్లో మేము కోటి బస్సుకోసం వచ్చి నిల్చున్నాము. వాళ్ళ అబ్బాయి శ్రీను మమ్మల్ని బస్సు ఎక్కిస్తానని వచ్చాడు. ఓ కూరల కొట్టు పక్కనే నిల్చున్నాం మేము. ఇక ఒక కథ మొదలు పెట్టాడు. కర్ఫ్యూ వదిలిన సమయంలో ఆ  కూరల కొట్టు దగ్గర తల్వార్లు పెట్టి ఎలా పొడుచుకున్నారో చాలా detailed గా ‘అరే ! ఎట్లా పొడుచుకున్నార్ తెల్సా ‘ అంటూ కళ్ళకి కట్టినట్లు చెప్పాడు. నేను దడుచుకోవడం చూసి మా నానమ్మ ‘వాడు అన్నీ కోతలు కోస్తాడు’ అని చెప్పింది మాకు. తరువాత కొన్నాళ్ళకి వాళ్ళ ఇంట్లో పైన గదులు వేసి ఇల్లు గృహప్రవేశం అన్నారు. ఆ సాయంత్రానికల్లా కర్ఫ్యూ ( నాకు తెలిసిందల్లా ఒక్కటే. According to శ్రీను, కర్ఫ్యూ అంటే చంపేస్తారు)!! అమ్మ ఆవిడకి సహాయం అంటూ ముందే వెళ్ళిపోయింది. ఆవిడని దింపడానికి నాన్న, వాళ్లతో బాటే తమ్ముడు బండి మీద వెళ్లిపోయారు. దేనికైనా భయపడని మా నానమ్మేమో అమెరికాకి వెళ్ళింది. నన్ను, మా అక్క ని బడికి వెళ్లి వచ్చాక బాబాయి & పిన్నితో కలిసి రమ్మని చెప్పారు. పిన్నేమో కొత్త. అక్కకి పిరికిదాన్నని చులకన. భయపడి చచ్చా !! కోటి వెళ్లెవరకూ బానే ఉన్నా. తరువాత  కోటిలో బస్సు దగ్గర ఆ జనాలని చూసి ఏడుపు తన్నుకు వచ్చేసింది. నా ఏడుపు చూసి ఆటో మాట్లాడాడు బాబాయి. వాడి ఛార్జీలకు దడుసుకుని మళ్ళీ బస్సే ఎక్కించారు. బస్సులో అందరూ నాకేదో అయ్యిందనుకున్నారు. మొత్తానికి క్షేమంగానే వెళ్ళాము. ఎలా వచ్చామో మరి గుర్తు లేదు.

ఇప్పుడు నవ్వొస్తుంది కానీ ఆరోజుల్లో భయపడి చచ్చేవాళ్ళు జనాలు.  నాకు తెలిసి కొందరు ఈ గొడవల వల్ల భయపడి ఎంత చవకగా వచ్చినా అటువైపు ఇల్లు కూడా కొనుక్కునేవారు కాదు.

‘గుజరాత్ అల్లర్లు’ అంటూ ఎవరో మాట్లాడుతూ  ఉంటే, నన్ను దడిపించిన ఈ ‘అల్లరి’ కూడా నాకు గుర్తొచ్చింది.

ఏదో అందరితో పంచుకుందామని సరదాగా వ్రాసిన టపా

వేసవి సెలవలు – 3 సినిమా

వేసవి సెలవలలో బిట్రగుంటలో సినిమా చూడటం కూడా ఓ మరచిపోలేని జ్ఞాపకం మాకు.

కొత్త సినిమాలు చూడాలి అంటే బిట్రగుంట థియేటర్లలో వచ్చేవి కాదు. ఇక నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. దానికోసం ముందే ఓ పెద్ద ప్రణాళిక వేసుకునేవాళ్ళం. మాట్నీకి వెళ్ళాలి  అంటే భోజనాలు చేసి హౌరా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాలి. మా మావయ్య, పిన్ని, కొంతమంది పెద్దపిల్లలం మాత్రమే వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ భోజనాలు తొందరగా పెట్టేసేది పాపం.

ఆ హౌరా  ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా వస్తే మాత్రం అంతే సంగతులు!! సాయంత్రం కృష్ణా ఎక్స్ ప్రెస్  వరకూ ఇంకో బండి ఉండేది కాదు. బిట్రగుంట నుంచి నెల్లూరు కి బస్సు లు పెద్దగా ఉండేవి కాదు. ఇక ఆ రోజుకి  సినిమా ప్రోగ్రాం ‘కాన్సల్’ అనేవారు. అలా మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (No 53/54)  లో రాత్రి భోజనాల సమయానికి ఇల్లు చేరేవాళ్ళం.

నెల్లూరులో నాకు గుర్తున్న థియేటర్ లు,  ‘అర్చన’ థియేటర్ & ‘కృష్ణా, కళ్యాణి, కావెరీ ‘ అని మూడు థియేటర్లు కలిపిన కాంప్లెక్స్.  మా మావయ్య ఆ మూడు థియేటర్లకి తీసుకెళ్ళినపుడల్లా ‘ మీ హైదరాబాద్ లో ఏ థియేటర్ పనికొస్తుందే  వీటి ముందు’ అనేవాడు. ‘ అసలు మహేశ్వరి పరమేశ్వరి’ చూసావా అంటూ పోట్లాడేవాళ్ళం నేను & మా అక్క. (మావయ్య తో అంత పోట్లాడేదాన్ని కానీ, ‘మహేశ్వరి పరమేశ్వరి’ నేనే ఎప్పుడూ  వెళ్ళలేదు. వెళదామని ఇప్పుడు అనుకున్నా అంత తీరికా, ఓపికా రెండూ లేవు. అంతా మార్చేసారని విన్నాను)

‘అహ నా పెళ్ళంట’, ‘డాన్స్ మాస్టర్’ నెల్లూరు లోనే చూసాము. ‘క్షణక్షణం’ నెల్లూరులో చూసిన ఆఖరి సినిమా అనుకుంటా.

బిట్రగుంటలో  రెండు థియేటర్ లు ఉండేవి. ఒకటి ‘పంచ రత్న’. ఇంకొకటి ‘సాజిద్’.  ‘పంచ రత్న’ ఇంటికి దగ్గరలో విశ్వనాథ రావు పేటలో ఉండేది. అప్పట్లో కొత్తగా ఊర్లో కొంచం అధునాతనంగా వచ్చింది. ‘సాజిద్’ పాత  థియేటర్ . రైల్వే బ్రిడ్జికి అవతల పక్క ఉండేది. అందుకని అక్కడ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘సాజిద్’ లో చూసిన  ఒకే ఒక్క సినిమా ‘జీవనపోరాటం’ . కొత్త సినిమా లో అలా వెంటనే ‘సాజిద్’ లో రావటం అదే మొదటిసారి. 

అలా ఎక్కువగా ‘పంచ రత్న’ కే  వెళ్ళేవాళ్ళం. ‘పంచ రత్న’ లో   25 పైసలు, 75 పైసలు, 1.50 టికెట్లు ఉన్నట్లు గుర్తు.  నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి ఇద్దరం డబ్బులు ఏదో ఆదా  చేద్దామని, 75 పైసలు కొనుక్కుని , ఇంటెర్వల్ లో 1.50 కి వచ్చి కూర్చునేవాళ్ళం. అలాంటి  కక్కుర్తి పనులు చేసినందుకు మా పిన్ని బాగా తిట్టేది. మా పిన్నికి నాకు క్షణం పడేది కాదు. ‘పెద్ద గయ్యాళిరా బాబు’  అనుకునేదాన్ని. ఇక్కడ మా పిన్ని గురించి ఒకటి చెప్పాలి. తను నాకు తలకి నూనె రాసి జడ ఎంత గట్టిగా వేసేదంటే, నా తల automaticగా ముందుకి వచ్చేది. అలా తల ముందుకి పెడితే  ‘ఎందుకలా చూస్తావే కొంగా’ అని తిట్టేది. మా గోల భరించలేక అమ్మమ్మే జడ వేసేసేది నాకు. నిస్వార్థమైన ప్రేమ అమ్మానాన్నలకు మాత్రమే ఉంటుంది అంటారు. ఈ రోజుకి కూడా అంతే ప్రేమ చూపిస్తుంది మా పిన్ని.  ఫోన్ చేస్తాను అని చెప్తే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తా !!

బిట్రగుంటలో సినిమా అంటే, సినిమా బండి వచ్చేది. ‘ నేడే చూడండి, నేడే చూడండి’ అంటూ. ఆవరణలో పిల్లలందరం పరిగెత్తుకెళ్ళి బండి దగ్గరికి వెళ్లి  ఏ సినిమానో, ఎన్ని రోజులో తెలుసుకుని వచ్చేవాళ్ళం. వెళ్లాలో వద్దో మా పిన్ని నిర్ణయించేసేది. ఫస్ట్ షో 7:00 కి ఉండేది. సినిమా చూసి వచ్చాక ఇంటికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళం. మేము వచ్చేసరికి అందరూ  పక్కలు వేసుకుని నిద్రకి ఉపక్రమిస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మమ్మ సినిమాకి వెళ్ళివచ్చినవారందరికీ స్టీల్ బేసిన్లో ముద్దలు కలిపి పెట్టేది. ఒక్కోసారి పూరీలాంటి టిఫిన్ లు చేసి ఉంచేది. అమ్మమ్మ, తాతయ్య మాతో ఎప్పుడూ  సినిమాకి రాలేదు.

మా పిల్లల ఎండాకాలం సెలవలు చూస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి. అమెరికాలో ( మా ఊర్లో అయితే ) సెలవలు ఉన్న పది వారాలు, వారానికి రెండు సినిమాల చొప్పున free  movies, వారాంతం అదనంగా outdoor movies ఉంటాయి. వీళ్ళ చిన్నపుడు ఆ free movie కోసం పొద్దున్నే లేచి, breakfast తిని పరిగెత్తడం కూడా అప్పుడే ఒక జ్ఞాపకం గా అయిపోయింది.  ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మారిపోతుంటే, కాలం ఎంత తొందరగా పరుగెత్తుతోందా అనిపిస్తోంది!!

 

వేసవి సెలవలు – 2 ఉయ్యాల

నేను బ్లాగు టపా  వ్రాయటం అంటే ముందు  బిట్రగుంట, రామాయణభారతాలు  నిల్చుంటున్నాయి. అందుకే  మా బిట్రగుంట విశేషాలతో మళ్ళీ …..

బిట్రగుంటలో మా అమ్మమ్మగారింట్లో ఉయ్యాల బల్ల ఉండేది. పెద్దలకీ, పిల్లలకీ అది పెద్ద ఆకర్షణ.  మధ్య హాలులో పెద్ద ఇనుప గొలుసులతో దూలాలకి వేసి ఉండేది . ఆ పక్కనే మా తాతయ్య పెద్ద పడకుర్చీ ఉండేది. ఆ హాలులోనే  ఓ సోఫా, టీవీ( తర్వాత రోజుల్లో ), ఇనప్పెట్టె, ఓ చెక్క కుర్చీ, అక్కడే అల్మరా లో  పెద్ద బుష్ రేడియా  ఉండేవి. ఉయ్యాల బల్ల ఎంత పెద్దది అంటే ఒకేసారి పదిమంది పిల్లలు కూర్చోవచ్చు దాని మీద. అంత పెద్ద బల్ల.  ఈ ఉయ్యాల మీద ఊగాలని, మా అమ్మ పెళ్లయిన క్రొత్తల్లో ఆవిడ పుట్టింటికి వచ్చినపుడల్లా,   ‘వదినతో వెళ్తా ‘ అంటూ మా బాబాయి (మా నాన్నగారి తమ్ముడు)  కూడా వచ్చేసేవాడట.

uyyala

ఎవరు ఇంటికి వచ్చినా  ముందు ఉయ్యాల మీద కూర్చునేవారు.  ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మమ్మల్ని లేచి వెళ్లి బయటకి వెళ్ళి ఆడుకోమని వారు. మేము చాలా సీరియస్ గా ఉయ్యాల మీద ఆట ఆడేటప్పుడు ఎవరైనా వస్తే మాకు చాలా కోపం వచ్చేది. కానీ తాతయ్యకి భయపడి వెళ్లిపోయేవాళ్ళం.

పొద్దున్నే లేచిలేవగానే  కాసేపు ఉయ్యాల మీద కూర్చొనే వాళ్ళం. పళ్ళుతోముకోగానే అమ్మమ్మ ఇచ్చిన viva అక్కడే తాగేవాళ్ళం. మాతో పాటే తాతయ్య పడకుర్చీలో కూర్చుని కాఫీ తాగేవాళ్ళు.  ఓ చిన్న సైజు మీటింగ్ ఉండేది. ఆ సమయంలో విజయవాడ స్టేషన్ నుంచి వచ్చే భక్తి రంజని పాటలు వినేవాళ్ళమేమో. ఇప్పటికీ  కొన్ని పాటలు వినగానే తెలియకుండానే పాడేస్తూ ఉంటాను.  

మధ్యాహ్నం పూట  ఎండ ఎంత తీక్షణంగా ఉన్నా, అది మా ఆటలకి ఏ మాత్రం ఆటంకం గా అనిపించేది కాదు.  నా బెస్టు ఫ్రెండ్స్ ఎవరంటే  ఆవరణలో నివాసం ఉండే వాసుదేవరావు గారి అబ్బాయి శ్రీను, శారదాంబగారమ్మాయి  గాయత్రీ, కామకోటిగారమ్మాయి వరలక్ష్మి.  మేమందరం ఆవరణ లో రోజుకొకరింట్లో వరండాలో, ముఖ్యం గా రమాదేవి గారి వరండా లో  బుడ్లతో ఆటలు ఆడుతూనే ఉండేవాళ్ళం.  రమాదేవి గారి భర్త రామచంద్రరావు గారు రైల్వే స్కూల్ టీచర్.  వాళ్ళు ఎండాకాలం సెలవలు  రాగానే విజయవాడ వెళ్ళిపోయేవారు.  అందుకే వాళ్ళ వరండా ఎప్పుడూ  ఖాళీగానే ఉండేది.  మేము వాళ్ళని  చూసింది చాలా తక్కువ. స్నేహితులందరిలోకి గాయత్రి బుద్ధిమంతురాలు. మధ్యాహ్నం అవ్వగానే ‘ఎండగా ఉందే’ అని పెద్దవాళ్ళు పిలవకుండానే ఇంటికి వెళ్ళేది. నేను, వరలక్ష్మి, శ్రీను ఆట continue  చేసేవాళ్ళం పెద్దవాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టి పిలుచుకెళ్లేదాకా!! మా చివరాఖరి పిన్ని, మావయ్య ఇద్దరూ  డిగ్రీ చదువుతుండేవాళ్లు. వాళ్ళే  మా Care takers, మా అమ్మమ్మ కి పెద్ద helpers. ఎవరైతే ఎండలో ఆడుతున్నారో వాళ్ళని,   వడదెబ్బ తగులుతుందని చెప్పి ఇంట్లోకి పట్టుకెళ్ళేవాళ్ళు. మావయ్య నన్ను బాగా గారాబం చేసేవాడు. తన మాట అస్సలు వినేదాన్ని కాదు. అదే పిన్ని అయితే హడల్ !! అందుకే పిన్ని వచ్చేది నన్ను తీసుకెళ్లడానికి. తిట్టుకుంటూ వెళ్లేదాన్ని.

లోపలి వెళ్లేసరికి హాల్ లో అన్నీ దిండ్లు కిందవేసి, తలుపులన్నీ బిడాయించి ఉండేవి.  అమ్మమ్మ ‘ ఎండసెగ తగులుతుంది ఆటలు ఆపి పడుకోండర్రా’ అనేది. ఇక్కడ మొదలయ్యేది అసలు కథ!! మా పిన్ని ఉయ్యాల బల్ల మధ్యలో కూర్చొని పెద్ద పిన్ని పిల్లలని, మమ్మల్ని అటు ఇద్దరినీ, ఇటు ఇద్దరినీ పడుకోబెట్టి పెద్ద ఊపులు ఊపి  రెండు నిమిషాల్లో నలుగురు పిల్లల్ని నిద్రపుచ్చేసేది. అలా ఒక రెండు బ్యాచీలన్నా  ఉండేవి. ఆ తరువాత  మా మావయ్య పనేంటంటే ఇలా పడుకున్న వాళ్ళని నెమ్మదిగా ఎత్తుకుని disturb  కాకుండా కింద నేలమీద పడుకోబెట్టడం.  మా పెద్ద పిన్ని కొడుకు చాలా అల్లరి వాడు. వాడు ఓ పట్టాన  నిద్రపోయేవాడు కాదు. వాడికి రెండు సార్లు ఉయ్యాల  treatment  ఉండేది. మా మావయ్య ఎత్తుకుని తీసుకొచ్చి పడుకోబెట్టగానే, కళ్ళు మూసుకున్నట్లు నటించేవాడు. నెమ్మదిగా లేచి, దేవుడింట్లోకి వెళ్లి  కజ్జికాయల అల్మరా  తెరిచి, ఏవో ఒకటి తినేసేవాడు!!.

IMG_1550
కికిటికీ క్రింద కజ్జికాయల అల్మారా ఉండేది. (గీత కనిపిస్తోంది)

ఈ నిద్ర కార్యక్రమం అయ్యాక  పెద్దలకి కాఫీలు, పిల్లలకి కజ్జికాయలు/ అరిసెలు వంటి తాయిలాలు ఉండేవి. లేకపోతే ముంజెలు. సాయంత్రం నాలుగు అవ్వగానే సముద్రం గాలి పెరట్లో తాకేది. మల్లెపూల అబ్బాయి వచ్చి మాలలు ఇచ్చి వెళ్ళేవాడు.  మా తాతయ్య డ్యూటీ కి వెళ్లకుండా ఇంట్లో ఉంటే, పడకుర్చీ తీసుకెళ్లి పెరట్లో వేసుకునే వారు. అక్కడ వేసుకుని కూర్చుని కాఫీ తాగేవారు. సాయంత్రం అయ్యాక పెరట్లోనించి వాకిట్లో అరుగు దగ్గరకి చేరేది కుర్చీ. అది పడకుర్చీ అంటే ‘పడక’ కుర్చీనే !! కాళ్ళు జాపుకుని పడుకోవచ్చు. చాలా పెద్దది. హల్లో  పడకుర్చీ లేకపోతే  మాకు ఉయ్యాలని పెద్ద ఊపులు ఊపడానికి బోలెడు స్థలం ఉంటుంది కదా. అందుకని చాలా సంబరపడిపోయేవాళ్ళం.  

IMG_1535
పెరట్లో  వంటిల్లు దగ్గర

ఇక సాయంకాలం స్నానాలు అవ్వగానే మా పిన్ని, కామకోటిగారి పెద్దమ్మాయి సుమతి కలిసి  పిల్లలందరినీ  తీసుకుని రాములవారి గుడికి తీసుకెళ్లేవారు. గుడినుంచి వచ్చాక అన్నాలు పెట్టడానికి కొంచెం సమయం ఉండేది. ఆ సమయంలో  మా activity అంతా ఉయ్యాల  దగ్గరే.  ఒక్కోసారి మా పిన్ని అందర్నీ ఉయ్యాల  మీద కూర్చోబెట్టి ఊపుతూ పాటలు పాడేది.అలా  మా అందరికీ  ‘హిమగిరి తనయే’ నోటికి వచ్చేసింది.  ఒక్కోసారి మా మావయ్య పిల్లలందరినీ  లైన్ లో నిల్చోబెట్టి ఒక్కొక్కరినీ ఉయ్యాలని ఎక్కించి , గట్టిగా పట్టుకోమని,  ఉయ్యాలని పైన దూలం వరకూ  పట్టుకెళ్ళేవాడు. మాకు అదేదో roller  coaster  rideలాగా ఉండేది.  ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ లైన్ లో నిల్చునే వాళ్ళం.  పిన్నీ, మావయ్య లేకపోతే ఇక రైలాట మొదలు పెట్టేవాళ్ళం. ఈ ఆట ఆడినవాళ్ళు  ప్రపంచంలో బిట్రగుంట పిల్లలు  తప్ప ఎవరూ  ఉండరనే  అనుకుంటాను

రైలాట :

అంటే ఉయ్యాల ఒక రైలు అన్న మాట. బిట్రగుంట కదండీ మరీ !!. చెప్పా కదా మా ఊరి స్పెషల్ !! ఉయ్యాల ఊపేవాళ్లు  డ్రైవర్లు. పక్కన కూర్చునే వాళ్ళు ప్యాసెంజర్లు. ఆవరణలోని  పిల్లలు చాలా మంది  చేరేవాళ్ళు ఆటలో. ఎప్పుడూ  ట్రైన్ విజయవాడ నుంచి నెల్లూరు వెళ్ళేది. అందరికీ  నిద్రలో లేపినా  తెల్సిన స్టేషన్లు అవే కదా మరి. ట్రైన్ నంబర్లు, పేర్లు, ఏ స్టేషన్లో ఆగుతాయి అంతా క్షుణ్ణంగా తెలుసు అందరికీ.  అందుకే ఎప్పుడూ  విజయవాడ – నెల్లూరు సెక్షన్లోనే నడిచేది బండి.   ఏ GT express, Tamilnadu Express, Gangakaveri  express, Jayanthi Janatha express అనో పేరు పెట్టుకునేవాళ్ళం. ఇటువంటి super fast  అయితే ఎక్కడా ఆగవు కాబట్టి  ఆటకి అంత బావుండలేదని ఒక్కోసారి కృష్ణా ఎక్సప్రెస్ పేరు కూడా పెట్టుకునేవాళ్ళం. ఆటలో రైలులోని పాసెంజర్లు నీళ్లు నింపుకోడానికి ట్రైన్ దిగేవాళ్ళు. వాళ్ళ సీటు ఇంకొకరు  కొట్టేసేవాళ్ళు. దెబ్బలాట !! స్టేషన్ లో నీళ్ల పంపు అంటే ఇనప్పెట్టె హ్యాండిల్స్. వెయిటింగ్ రూమ్ ఏంటంటే  సోఫా, చెక్క కుర్చీ!! స్టేషన్ లో కాఫీ, టీ అమ్మేవారు ఉండేవారు. తెనాలి స్టేషన్ లో పాలకోవా అమ్మేవారు కూడా ఉండేవారు.  ఇలా సాగేది మా ఆట.

ఎండాకాలం సెలవలు అయిపోయి తిరిగి ప్రయాణం అవుతుంటే  ‘అయ్యో ఉయ్యాల వదిలేసి వెళ్ళిపోవాలి’ అని బాధ కలిగేది. ఈ రోజుల్లో పరిభాషలో చెప్పాలంటే ‘We’ll miss you’  అనుకునేవాళ్లం.

ఆ ఉయ్యాల ఇప్పటికీ  అమ్మమ్మ వాళ్ళు  నెల్లూరులో ఉన్న అపార్టుమెంటులో కూడా ఉంది. మా పిల్లలు కూడా ఎక్కారు. మా అమ్మమ్మకి  వాళ్ళు పెట్టిన పేరు ‘swing  తాతమ్మ’.  మా చిన్నదయితే ఆ ఉయ్యాల వదలదు. అమెరికాలో మా ఇంట్లో కూడా అటువంటి ఉయ్యాల పెట్టుకోవాలని నా కోరిక.  ఎప్పటికి తీరేనో మరి !!

అదండీ  మా ఉయ్యాల కథ ….

మిధునం’ కథ లోని అప్పదాసు గారు మా ఇంట్లో

నేను అమెరికా వచ్చిన కొత్త. అప్పటికి ఇంకా భారతదేశం లో కొన్ని ప్రదేశాలకి ఉత్తరాలు వ్రాసుకునే రోజులే !! ఏ వస్తువు చూసినా ఏ కొట్టుకి వెళ్లినా వింతగా ఏదైనా కనిపిస్తే నాకు వెంటనే దూరంలో ఉన్న నా కుటుంబంతో పంచుకోవాలని అనిపించే రోజులు. ఒకసారి వాకింగ్ కి వెళ్తుంటే, ఒక అమెరికన్ చిన్న లాగు(shorts), చేతులు లేని(sleeveless) చొక్కా వేసుకుని walkman headphones, నల్లకళ్ళ జోడు పెట్టుకుని జాగింగ్ చేస్తున్నాడు. మాములుగా అయితే వింతేమి కాదు. కానీ అతని వేషధారణ, ఆ మిట్టమధ్యాహ్నం పరుగెత్తడం నా కుటుంబంతో పంచుకుంటే అన్పించింది. అందులో ముఖ్యంగా మా తాతయ్యకి చెబితే ఏమంటారో అని ఒక్కసారి తలుచుకున్నాను. ఆయన చూసిఉంటే ‘ వీడెవడమ్మా !! మిట్టమధ్యాహ్నం ఇట్టా పరిగెడుతున్నాడు ? మన బిట్రగుంటలో అయితే కుక్కలు తరమవూ ?’ అనేవారేమో అన్పించింది. ఇక అంతే!! నవ్వు ఆపుకోలేక అతను చూస్తే బాగోదని తిరిగి ఇంటికి వచ్చేసాను.

నెల్లూరు యాసలో, మొహంలో ఏ మాత్రం నవ్వులేకుండా చాలా సీరియస్ గా మా తాతయ్య సరదాగా చెప్పే మాటలు తలచుకుని తలచుకుని నవ్వుకుంటాము మేమందరమూ !! ముఖ్యంగా ‘మిథునం ‘ సినిమాలో అప్పదాసులా రుచులకి రకరకాల పేర్లు పెట్టేవారు. మా చుట్టలావిడ ఒకసారి బీట్ రూట్ హల్వా చేసింది. ‘ ఈ నల్ల లేహ్యం ఏందమ్మా ‘ అన్నారు. వెంటనే ఆవిడ మొహం పాలిపోయింది. మహారాష్ట్ర వారు శ్రీఖండ్ అనే స్వీట్ చేస్తారు. దాని పేరు ‘ శ్రీకంఠంట తల్లీ. పెరుగులో చక్కర వేసి గిలకొట్టారు వాళ్ళు ‘ అనేవారు. ఒకసారి ఉత్తరదేశ యాత్రలకి వెళ్లి ‘రాజ్ మా ‘తిన్నారు. ‘ అబ్బో రాజమ్మ కూర అట. తినలేకపోయాము తల్లీ’ అన్నారు. మా తమ్ముడు ఒకసారి ఇడ్లీలు చేస్తే ‘మల్లెపూవులా మెత్తంగున్నాయిరా ‘ అన్నారు. ఏదైనా పదార్థం తిని బావుంటే, వెంటనే మా అమ్మమ్మతో ‘ ఏమే ఇట్టా అమృతం లా ఎప్పుడైనా చేశా ? అడిగి నేర్చుకో ‘ అనేవారు. ఆవిడా అలాగే ‘ ఆ !! నేర్చుకుంటా!! నాకేమన్నా వస్తేగా ‘ అనేది. పండగరోజుల్లో ఎక్కువగా తిన్నానేమో అనుకుని అమ్మమ్మని జీలకర్ర కాషాయం ఇచ్చేదాకా సతాయించేవారు.

ఇంట్లో పెద్ద ఇనపెట్టె ఉండేది. నెల్లూరు జిల్లాలో పాత ఇనుప వస్తువులకి ఉల్లిపాయలు ఇచ్చేవారు. ఆ ఇనపెట్టె ఖాళీగా ఉండి పెద్దస్థలం కేటాయించాల్సివస్తోందని, ‘ఈ ఇనుపెట్టె అమ్మితే సరి. జీవితానికి సరిపడా ఎర్రగడ్డలిచ్చిపోతారు’ అనేవారు!!

ఆయనెప్పుడూ రైళ్లు, టిక్కెట్ల గురించే మాట్లాడుతారు అని, కొంత మంది పిల్లలు ఆయనని ‘రైలు తాత’ అని పిలిచేవారు.

‘ఈనాడు’ పేపర్ ఆ చివరనుంచి ఈ చివరివరకు చదివి ఎప్పటికప్పుడు ప్రతి కరెంటు పొలిటికల్ టాపిక్ మాట్లాడేస్తుంటారు. కొన్ని ఉదాహరణలు :
‘ ఉత్త పెడద్రపోడుట కదమ్మా కొత్త అధ్యక్షుడు. అందర్నీ వెళ్ళమంటున్నాడట. నిజమేనా ?’
‘ ఈ ముక్కోడు ఏందమ్మా తెలంగాణా తెలంగాణా అని ఒకటే గోల గా ఉందే ?’
‘పిల్ల అంత దూరం నుంచి ఫోన్ చేస్తే దాని క్షేమ సమాచారం అడగకుండా ఎవరి గురించో ఎందుకు మాట్లాడుతారు ‘ ఫోన్ లో మనవరాలి మాట కోసం తపించే అమ్మమ్మ అరిచినా వినేవారు కాదు.
పైగా ‘ మీ అమ్మమ్మకి కుళ్ళమ్మా నేను మాట్లాడితే’ అనేవారు. ఆయన మాటలు ఎంత ఇష్టం అంటే 55cents /minute ఉన్న రోజుల్లో అమ్మవాళ్లతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయనకి మాత్రం ఫోన్ చేసి మాట్లాడేవారం మేము.

ఆయనకి అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పి ఎన్ని గదులో , ఎన్ని బాత్రూములో చెప్పాను.
నాలుగు బాత్రూములు అని చెప్పగానే ‘చాలా తల్లీ’ అన్నారు. దాని మీద కూడా రకరకాల జోకులు వేశారు.

తాతయ్య కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించే విధానం చూస్తే భలే ఆశ్చర్యం వేసేది. సాయంత్రం పూట ఉప్పుని ‘లవణం’ అనేవారు. పొరపాటున కూడా ఉప్పు అనేవారు కాదు. అమ్మమ్మని తప్ప ఎవ్వర్నీ ‘ఏమే ‘ అని సంబోధించేవారు వారు కాదు. అమ్మమ్మని పేరు పెట్టి పిలిచేవారు కాదు. ప్రతి విషయం అమ్మమ్మకి చెప్పాల్సిందే. తప్పు కానీ ఒప్పు కానీ!! రైల్వే పాస్ ఉంది అన్న వంక పెట్టి అన్ని తీర్థయాత్రలు చేసారు. ప్రతి చోటా పితృదేవతలకు తర్పణాలు వదిలారు. ప్రతి మాటకి ముందు ‘భగవంతుడి దయ వల్లన’ అనేవారు.

చిన్న కొసమెరుపు ఏంటంటే పొద్దున్న ఏమి తిన్నానో సాయంత్రం కల్లా మర్చిపోయే ఆయన, క్రితం ఆగష్టులో ఇండియా వెళ్ళినపుడు:
‘గాంధీ ని చూసారా తాతయ్య ఎప్పుడైనా?’
‘ ఆ !!చూచాగా . కానీ రెండు సార్లు సోమవారం అయింది’
‘సోమవారం అయితే ఏంటి ?’
‘ మౌన వ్రతంగా ఆయన !! మాట్లాడడు!!’
90 ఏళ్ళ, మా తాతయ్య చెప్పింది విని ఆయన జ్ఞాపశక్తికి ఖంగుతిన్న నేను, మా అక్క కొడుకు సెల్ లో గూగులమ్మ ని అడిగాం ‘సోమవారం గాంధీ గారు మౌన వ్రతమా ‘ అని. ‘నిజమే’ అని చెప్పింది ఆవిడ!!

జీవితం అంటే డబ్బు. డబ్బు అంటే జీవితం అనుకోవడం చాలా సామాన్యం. చాలా సహజం. డబ్బు ముఖ్యమే కానీ ఆ డబ్బుతో ఉన్నంతలో సంతృప్తిగా ఎలా జీవించాలో మాకు చెప్పకనే చెప్పిన ఉన్నతమైన వ్యక్తి మా తాతయ్య. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి విషయంలో ఆయననే తలచుకునేలా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి అనుభూతులు …

ఒక్కరోజు ఆసుపత్రిలో చేరడం అనేది తెలియదు. మిథునం లో చెప్పినట్లు శంఖుచక్రాల్లాంటి షుగరు, బీపీ అన్న మాట కూడా ఎరుగరు ఆయన. 91 ఏళ్ళు దర్జాగా మహరాజులా తనకి కావాల్సినవి చేయించుకుంటూ, నిన్న తొలి ఏకాదశి నాడు చేతి గడియారంలో సమయం చూసుకుంటూ భార్య, కూతుర్లు, కొడుకు, కోడలు అందరు పక్కనే ఉండగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు.

ఆయనకి మోక్షం ప్రసాదించాలని ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ….ఈ చిన్నిటపా ఆయన కోసం _/\_

వేసవి సెలవలు -1 పూలజడ

వేసవి సెలవలు రాగానే  అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయి బడి తెరిచే ఒక  వారం రోజుల ముందు వచ్చేవాళ్ళం. మా అమ్మ ఎక్కువ వచ్చేది కాదు. వచ్చినా ఒక రెండు రోజులు ఉండి  వెళ్లిపోయేవాళ్లు అమ్మా, నాన్న. ఇక మా ఇష్టమే ఇష్టం!! పిన్నులు, వాళ్ళ పిల్లలు, మావయ్య, ఆవరణ లో పిల్లలు. రోజులో  24 గంటలు సరిపోయేది కాదేమో మా ఆటలకి.  మా అమ్మమ్మ గారి ఊరు గురించి నా మొట్టమొదటి టపా చెరగని తరగని జ్ఞాపకాలు లో చెప్పాను .

రోజంతా ఆటలు. మధ్యాహ్నం తాటి ముంజలు తినడం.  సాయంత్రం పెరట్లో తులసి చెట్టు దగ్గర కందిపచ్చడి, కొత్త ఆవకాయ, మామిడి పండు తో భోజనాలు.  ఆరుబయట వేపచెట్టు కింద మంచాలు, పక్కలు వేసుకుని కబుర్లు.  మధ్యలో కరెంటు పోవడం. వెంటనే  లాంతరు (సాయంత్రం అవ్వగానే ఎప్పుడూ వెలిగే ఉండేది)  ఒత్తి పెద్దగా చేయడం.  ఈ రోజుల్లో ఏ క్యాంపింగ్ ట్రిప్ పనికొస్తుంది ఇటువంటి అనుభవాలతో !!

అలా  ఉండేరోజుల్లో, ఒక రోజు నాకు, మా అక్క కి  పూలజడలు వేయించాలని సంకల్పం చేసేది అమ్మమ్మ. రోజూ నాలుగవ్వగానే మల్లెపూల అబ్బాయి వచ్చి మల్లెమాలలు ఇచ్చి వెళ్ళేవాడు.  పూలజడల కోసం ఆరోజుకి మొగ్గలు  తెమ్మని అతనికే చెప్పేది అమ్మమ్మ. లేదా, లచ్చారెడ్డి తోట అని ఇంటి దగ్గరే ఒక మల్లెపూల తోట ఉండేది. అక్కడికి వెళ్లి మల్లెమొగ్గలు తెచ్చుకునేవాళ్ళం.

పూలు ఉండగానే సరికాదు కదా. జడ వేసేవారు కావద్దూ!!  వీధి చివర ఉండే కమలమ్మగారు కానీ,  పక్క వీధీ  ఉండే గోపాలయ్య గారి భార్య శాంతమ్మగారు కానీ వేసేవాళ్ళు. వాళ్ళకి  కుదురుతుందో లేదో ముందే అడిగి కనుక్కునేది అమ్మమ్మ. కమలమ్మ గారు జడ వేసినప్పుడు ఆ విశేషాలు గుర్తు లేవు కానీ శాంతమ్మగారు బాగా గుర్తు.   భోజనాలు అవగానే మొగ్గలని నీళ్ళల్లో వేసుకుని గిన్నెలతో , జడ కుప్పెలు, సవరాలు , వేరే అలంకరణ సామగ్రితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. గోపాలయ్య గారింట్లో అయితే అందరికీ  కాలక్షేపమే.  వారిది కిరాణా కొట్టు.  వచ్చేపోయే వారు ఎక్కువ. పూలజడల కార్యక్రమం వరండాలో పెట్టేవారు. అందరు ఎవరికీ తోచిన సలహా వారు ఇస్తూ, కబుర్లు చెప్తూ ఇలా సాగేది ఆ కార్యక్రమం.  వారికీ నలుగురు అమ్మాయిలు. చివరి అమ్మాయి మాతోటిది. మధ్యలో అప్పటికప్పుడు వెళ్లి అలంకరణ కోసం మా ఆవరణకి వెళ్లి అనార్కలి, మరువం, కనకాంబరాలు కోసుకొచ్చిపెట్టేది మాకు. వాళ్ళందరూ కొబ్బరిపుల్లలకి  మొగ్గలు గుచ్చి సహాయం చేసేవాళ్ళు.

సన్నగా ఉండే నా జడని సవరాలు పెట్టి పొడుగ్గా చాలా అందం గా వేసేవారు ఆవిడ.  అలా మల్లెలు, మరువం, కనకాంబరాలతో ఆవిడ వేసే జడ ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు వేయలేరు అని ఖచ్చితంగా చెప్తాను.  అయితే జడ కుప్పెల దగ్గర చిన్న రాజకీయం చేసేవారు  మా అమ్మమ్మ, ఆవిడా ఇద్దరునూ !! అప్పట్లో బంగారు నాగరం, బంగారు కుప్పెలు ఉండేవి.  అమ్మమ్మ, వాటిని పెద్ద మనవరాలని మా అక్కకి పెట్టమని రహస్యంగా  శాంతమ్మ గారికి చెప్పేది. పూసలు, తళుకులు, చమ్కీలు ఉండే కుప్పెలు, అనార్కలి పూవు( నాగరంలా)  నాకు పెట్టమని చెప్పేది. ఒకసారి ఆ రాజకీయం అర్ధమయ్యి నేను ఏడిస్తే, తళుకులు చూపించి ‘ప్రపంచం లో ఇంతకంటే అరుదైన కుప్పెలు లేవు’ అన్నట్లు చెప్పి  శాంతమ్మగారు నన్ను మైమరిపించారు.

ఇక్కడ గోపాలయ్య గారి కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా  చెప్పాలి.  మా అమ్మనాన్న పెళ్ళికి వాళ్ళిల్లు విడిది. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి మా అమ్మమ్మగారిల్లు విడిది. వాళ్ళ ఇల్లు కూడలి పక్కనే ఉండటంతో మేము రైలు దిగి వస్తుంటే వాళ్ళే వీధి లోకి వచ్చి   ‘ఏ బండికొచ్చారు ?లేటా ‘ అని అడుగుతూ మాకు ముందు స్వాగతం చెప్పేవారు.

IMG_0196
ఫోటోలో మామిడి చెట్టున్న ఇల్లే గోపాలయ్య గారిది

 

పూలజడ వేసాక  పరికిణీలు  వేసుకుని తయారయ్యేవాళ్ళం. పూలజడల కోసం మేము క్రొత్త పరికిణీలు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. మాచింగ్ గాజులు, లోలాకులు, పాపిటబిళ్ళ  అన్నీ  ఫాన్సీ స్టోర్ లో ముందే కొని పెట్టుకునే వాళ్ళం. ఆ విధంగా తయారయ్యి అందరి ఇళ్ళకి వెళ్లి పూలజడ చూపించి వచ్చేవాళ్ళం. ముందు శాంతమ్మ గారింటికి. తర్వాతే ఎవరింటికైనా.  ప్రతి ఇంటికి వెళ్ళగానే ‘ ఏంటమ్మా’ అనే వారు. అంటే ఎందుకొచ్చారన్నట్లు. దానికి మా సమాధానం ‘ పూలజడ చూపించడానికి వచ్చామండీ’ అని 🙂 ‘ఎవరు వేసారూ’ అంటూ  వెనక్కి తిరగమనేవారు. అలా అందరి ఇళ్ళు వెళ్లి వచ్చాక, మావయ్య ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటో తీయించేవాడు. అదేంటో కానీ ఒక్క ఫోటో కూడా లేదు.

IMG_0197
వారి ఇల్లు ఉన్న వీధి

ఒక్కోసారి ఆవరణలో మా స్నేహితురాలు  వరలక్ష్మి కూడా మాతోపాటు పూలజడ వేసుకునేది.  అంత మందికి ఎలా వేసేదా  ఆవిడా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది. మా మావయ్య ఎవరి జడలు నలగకుండా ఉంటాయో చూద్దాం అనే పోటీ పెట్టేవాడు. ఇక రాత్రంతా పడుకోకుండా దానిని కాపాడటం సరిపోయేది.

అదండీ  నా పూలజడ కథ. అమాయకంగా ఉండే ఆ రోజులే వేరు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే Electronic gadgets వలన సగము ఇటువంటి చిన్ని చిన్ని సరదాలకు , ఆనందాలకు మనం ఎంత దూరం అయిపోతున్నామా  అనిపిస్తుంది.

విజయవాడ జంక్షన్

విజయవాడ రైల్వే స్టేషన్ లో  రైళ్లు ఆగిపోయాయి అన్న వార్త చదివాకా , ఈ రోజు భండారు శ్రీనివాస రావు గారి బ్లాగు చదివాకా  కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఎండాకాలం సెలవల్లో ఒక్కోసారి మేము పిల్లలం ముగ్గురమే కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బిట్రగుంట కి వెళ్లేవారం.  పగటి పూట  ప్రయాణం కాబట్టి మా నాన్న గారు కూడా బాగా ప్రోత్సహించేవారు మమ్మల్నే వెళ్ళమని.  పొద్దున్న 6 ఆరింటికి సికింద్రాబాద్ లో ఎక్కితే సాయంత్రం 5:40 కి బిట్రగుంట చేరుకునేవాళ్ళం. అస్సలు పడుకోకుండా అన్ని స్టేషన్లు లెక్కపెట్టేవాళ్ళం.  అందుకే  ప్రతి స్టేషన్ పేరు బాగా గుర్తుంది పోయింది ఈ రోజు వరకూ  కూడా.  విజయవాడ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఊరికి సగం ప్రయాణం అయినట్లు లెక్క.  దగ్గరికి వచ్చేసినట్లేగా !! విజయవాడ రాగానే భోజనాలు మొదలు పెట్టేవాళ్ళం.  ఒకవేళ మంచినీళ్లు లేకపోయినా విజయవాడ లో దిగి పట్టుకోవచ్చు ట్రైన్ ఎక్కువ సేపు ఆగుతుంది అని.   ఒక్కోసారి విజయవాడ లో ఉండే  మా పిన్ని కుటుంబం కూడా కృష్ణా ఎక్స్ ప్రెస్ లో  మాతో కలిసేవారు. మా తమ్ముడు తిట్టుకుంటూ , మమ్మల్ని కొరకొరా చూస్తూ,  చిన్నవాళ్ళయిన పిన్నికొడుకులకి కిటికీ సీటు ఇచ్చేవాడు. విజయవాడ స్టేషన్  దాటగానే కృష్ణ బ్రిడ్జి చూడటం,  నాణాలు విసరటం!!  ఆ బ్రిడ్జి చూడటం ఈ రోజు కి కూడా ఒక మధుర అనుభూతి లా అన్పిస్తుంది. మా అమ్మాయి కూడా  మొన్న భారత దేశం వెళ్ళినపుడు  మొదటిసారి ఆ బ్రిడ్జి చూసి ఒక్కసారిగా  ‘wow’ అంది. అర్ధరాత్రి ఎంత నిద్ర మత్తులో అయినా బ్రిడ్జి  శబ్దం రాగానే  తెల్సిపోతుంది విజయవాడ దాటిందో లేదో !!   

ఎండాకాలం ముగియగానే, బిట్రగుంట నుంచి తిరిగి వచ్చేటపుడు హైదరాబాద్-మద్రాస్ ఎక్స్ ప్రెస్ లో వచ్చేవాళ్ళం. ఆ బండి లో  రిజర్వేషన్ దొరక్కపోతే , మా నాన్న గారు హైదరాబాద్ లో నే విజయవాడ  నుంచి నరసాపూర్  ఎక్సప్రెస్  లో టిక్కెట్లు కొనేవారు. అదెలా చేసారో ఆ రోజుల్లో నాకైతే తెలీదు. ఆ విషయం టెలిగ్రామ్/ఉత్తరం ద్వారా మా తాతయ్య కి చెప్పేవారు.  మేము  బిట్రగుంట నుండి లింక్ ఎక్స్ ప్రెస్ (ఇప్పుడు చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్  అనుకుంటా)  లో  విజయవాడ వెళ్లి అక్కడ  నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కేవారం.  ఆ విజయవాడ ప్లాటుఫారం మీద క్యారేజీ తీసి భోజనాలు పెట్టేది మా అమ్మ.  లేకపోతే టైం ఉంది అనుకుంటే గాంధీనగర్ లో మా నాన్న స్నేహితుడయిన మావయ్య వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం . అప్పుడు మాత్రం విజయవాడ స్టేషన్, బ్రిడ్జి చూస్తే మహా చిరాకుగా ఉండేది. మరి ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా  !! ఒకసారి నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి  ఆరోజు  ఏదో ఆడుకోవాలని   ప్లాన్ చేసుకున్నాం. ఉన్నట్టుండి మా తాతయ్య వచ్చి బయలుదేరాలి అన్నారు. గబగబా భోజనం చేసి మధ్యాహ్నానికల్లా లింక్ ఎక్స్ ప్రెస్  ఎక్కాము .  మా నాన్న మీద ఆ రోజు ఎంత కోపం వచ్చిందో !!

1980 లో అనుకుంటా.  విజయవాడ-గూడూరు సెక్షన్ మాత్రమే ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉండేవి. సికింద్రాబాద్ వెళ్లే బళ్ళు విజయవాడ లో ఎలక్ట్రిక్ నుంచి డీజిల్ ఇంజిన్ కి మారేవి. బిట్రగుంట నుంచి విజయవాడ వరకు చాలా  ఫాస్ట్ గా వచ్చినట్లు అన్పించేది.

ఎప్పుడూ  ప్రయాణీకులతో 24 గంటలు అనౌన్సమెంట్ లతో  కళకళలాడిపోయే  నిశ్శబ్దం గా  విజయవాడ జంక్షన్ ఎలా ఉంటుందా అన్పించింది ఈ రోజు.

చెరగని తరగని జ్ఞాపకాలు

దేవుడు వరం ఏదైనా అడిగితే కాలయంత్రం (Time-machine) ఎక్కించి  నా  చిన్నతనం లోని మధురమైన  ఘట్టాలకు  తీసుకెళ్ళమని కోరుకుంటాను. . ఎండాకాలం సెలవలు, మామిడి పళ్ళు, మల్లెపూలు, అమ్మమ్మ గారి ఊరు…

img_0188

అనగనగా ఒక  ఊరు. మా అమ్మమ్మ గారి ఊరు, ఒక పల్లెటూరు. పల్లెటూరు అనగానే పచ్చటి  పొలాలు గుర్తుకు రాక మానవు.  కానీ అవన్నీ మా  ఊర్లో ఉండవు. అన్నీ పల్లెటూర్ల లాగా ఉంటే ఇంక  మా ఊరి ప్రత్యేకత ఏముంటుంది? మా ఊరి  పేరు బిట్రగుంట.  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ- గూడూరు సెక్షన్ లో ఉండే ఒక స్టేషన్. ఒకానొకప్పుడు స్టీమ్ ఇంజిన్లు ఉన్న రోజుల్లో  రైల్వే వైభోగం తో వెలిగి పోయిన ఊరు.  1885 లో  బ్రిటిష్ వారు, ఇక్కడ మంచి నీటి కొరత  లేనందున ఇక్కడ స్టీమ్ ఇంజిన్ లోకో షెడ్ ని  నిర్మించారు. ఈ నమూనా  ని  కొత్త ఢిల్లీ లోని రైలు మ్యూజియం  లో చూడవచ్చు.  భారత దేశం లో ఇటువంటివి రెండే ఉండేవి. ఈ లోకో షెడ్ ఎన్నో కుటుంబాలకి  జీవనాధారం కల్పించింది. రైల్వే వారి పాఠశాలలు (తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో ),  ఒక రైల్వే ఆసుపత్రి ఉండేవి. వచ్చేపోయే రైళ్ళలో డ్రైవర్ లు  మరియు గార్డ్ లు కూడా  మా బిట్రగుంట లోనే మారే  వారు.  ఇప్పటికి కూడా అనుకుంటాను. రైలు లో భోజనాలు లో కూడా బిట్రగుంట నుంచే అందించేవారు. అంతే కాదు రైల్వే క్వార్టర్ లు, రైల్వే ఇన్సిట్యూటు, పార్కు,రన్నింగ్ రూం  అన్నీ ఉన్నఒక పెద్ద  రైల్వే కంటోన్మెంట్  బిట్రగుంట .  రైల్వే డాక్టర్లు, టీచర్లు,  లోకో షెడ్ లో పని చేసేవారు, డ్రైవర్ లు, గార్డ్ లు ఇలా ఇంత మంది రైల్వే ఉద్యోగులతో, వారి కుటుంబాలతో  ఊరు కళకళలాడుతూ ఉండేది.  

కోడి కూత  విని పల్లె నిద్ర లేచింది అంటారు.  పొద్దున్నేతిరుపతి నుండి  వచ్చే ‘కోచి’ బండి కూత  లో మా ఊరు  నిద్ర లేచేది. తిరుమల ఎక్స్ ప్రెస్  రాక  తో నిద్రపోయేది.  రైళ్ళ ని పేర్ల తో కాక వాటి సంఖ్యలతో  సంభోదించటం మా బిట్రగుంట వారి ప్రత్యేకత.అంతే కాదండోయ్ !! బిట్రగుంట వారి కి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది. అది తర్వాత చెప్తాను.

మా తాత  గారి స్వస్థలం బిట్రగుంట దగ్గర అగ్రహారం అనే పల్లెటూరు కావటం, ఆయన  కూడా ఒక రైల్వే ఉద్యోగి  కావటం తో కుటుంబం తో ఇల్లు కట్టుకుని బిట్రగుంట లో పూర్తి గా స్థిరపడ్డారు. మా అమ్మమ్మ గారిల్లు అంటే పెద్ద కాంపౌండ్, దానికి ఒక గేటు,  అమ్మమ్మ వాళ్ళు ఉండే  ఇల్లు కాక  దాదాపు ఇంకో ఐదు ఇళ్ళు , ఒక పూరిల్లు, పెద్ద బావి , అన్నీ  ఇళ్ళకి మధ్య లో  ఒక వడ్ల కొట్టు, దానిని అనుకుని ఒక సిమెంట్ అరుగు అన్నీ కలిపి ఆవరణ అనే వాళ్ళం.  అంటే ఇప్పటి పరిభాష లో చెప్పాలంటే  ఒక గేటెడ్ కమ్యూనిటీ.  వడ్ల కొట్టు వెనకాల ఒక పెద్దబాదం చెట్టు, వడ్లకొట్టు పక్కనే పెద్ద వేప చెట్టు, కొబ్బరి, సపోటా, బూరుగు, మామిడి, జామ, ములగ, అరటి, ముద్దా మందారం, కరివేప, బంగారు గంటలు, పసుపు మందారం, నంది వర్ధనం, నిత్యమల్లె చెట్ల తో ఆవరణ లో ఎప్పుడూ పచ్చదనం తో నిత్య నూతనం గా ఉండేది. రైల్వే క్వార్టర్ దొరకని రైల్వే ఉద్యోగులంతా  ఆవరణ లో అద్దెకి ఉండేవారు.  ఈ కుటుంబాలన్నిటి తో  ఆవరణ ఎప్పుడూ చాలా సందడి గా ఉండేది.

IMG_1521

అమ్మమ్మని పిన్ని గారని, తాతయ్యని బాబాయి గారని పిలిచేవారు. పిల్లలు అమ్మమ్మగారు, తాతయ్య గారు అని పిలిచేవారు.అమ్మమ్మ,తాతయ్య  ఇద్దరూ కూడా అలాగే  universal అమ్మమ్మ తాతయ్య లాగే  ఉండేవారు. వారిద్దరికీ తెలిసినది- సాటి మనిషికి చేతనైన సహాయం చేయటం, ఉన్నంత లో సంతోషం గా నిజాయితీ తో జీవితం గడపడటం.   నాకు తెలిసి ఏ  రోజున కూడా ఇద్దరూ, ఫలానా వారికి ఆ వస్తువు  ఉంది మాకు లేదు అన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జ్ఞాపకం లేదు.   తాతయ్య  దక్షిణ మధ్య రైల్వే లో చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ గా రిటైర్ అయ్యారు.  చేసిన ఉద్యోగం అంటే ఎనలేని గౌరవం తాతయ్యకి.  ఎవరు టికెట్ తీసుకోకపోయినా జరిమానా కట్టకపోతే ఊరుకునే వారు కాదు. జరిమానా డబ్బులు కట్టలేక ప్రయాణీకుల చేతుల్లో ఉన్న బంగారం అమ్మించిన ఘటనలు ఉన్నాయి. పైన చెప్పాను కదా బిట్రగుంట వారికి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది అని.అది ఏంటంటే  బిట్రగుంట నుంచి నెల్లూరు, కావలి కి రైలు లో ప్రయాణించేవారు ఎట్టి పరిస్థితి లోను టికెట్  కొనరు.  రైలు అంటే చాలు అది బిట్రగుంట కే సొంతం అన్న ధోరణి లో ఉంటారు. అలాంటిది, ఈయన బండి లో టికెట్ చెక్ చేయటానికి వస్తున్నారు అంటే , కొంత మంది భయపడి ప్రయాణం ఆపుకునేవారు.  ఆయన రిటైర్ అయ్యాక కూడా ఆయన్ని చూసి భయపడి తప్పుకునే వారు !!  ఇక మా  అమ్మమ్మ..   అటువంటి అపురూపమైన అమ్మమ్మ ఎవరికీ ఉండదేమో అన్పిస్తుంది నాకు !!  ఇంటికి వచ్చిన ప్రతి వారినీ  ఆప్యాయం గా పలకరించడం తప్ప ఈ రోజుల్లో వినపడే ‘ఇగో’ అనే పదానికి అర్ధం తెలీదు అమ్మమ్మకి.  అమ్మమ్మ, ఆవిడ  జీవితం  గురించి చెప్పడానికి  ఒక పోస్టు చాలదు.

IMG_1540

…ఈ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న కొద్దీ , తాతయ్య తెచ్చిన మావిడిపళ్ళతో  రసం వేసి, అమ్మమ్మ కలిపి పెట్టిన కమ్మటి తీయని పెరుగన్నం లాగా ఉంటాయి. చిన్న చిన్న వాటికే పెద్ద సంతృప్తి  పొందే ఆ కమ్మటి రోజులే వేరు !!