ద్రోణాచార్యులవారు

చిన్నప్పుడు ఏకలవ్యుడి కథ చదువుకున్నపుడు ద్రోణాచార్యులవారు చాలా అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది. ఒక అవగాహన అంటూ వచ్చాక ఎందుకలా చేసారు అని కుతూహలంతో కూడిన ప్రశ్న ఒకటి వస్తుంది.

మొదట వచ్చే ప్రశ్న : ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా ఎందుకు ఆమోదించలేదు ? ద్రోణుడు ఏకలవ్యుడిని క్షత్రియుడు కానందున శిష్యుడుగా ఆమోదించలేదు. అది ఆ రోజున ఆయన  పాటించవలసిన ధర్మం. ఆ రోజు ఆమోదించబడ్డ ధర్మాన్ని, ఎవరైనా ఈ రోజున పాటిస్తే అది illegal అవుతుంది & అధర్మం క్రిందకి వస్తుంది. అది అన్యాయం కదా నేను ఆ రోజులలో జీవించి ఉండలేదు. కాబట్టి నాకు సమాధానం తెలియదు అనే చెప్తాను. ఈ రోజున దానిని అన్యాయం అని తీసుకున్నారు కాబట్టే ధర్మాలు మారాయి. దానికి అనుగుణంగా చట్టాలు వచ్చాయి.  ఆనాడు నేరంగా పరిగణించబడినది ఈనాడు  నేరం కాదు & vice-versa.   అమెరికాలో ఆడవారికి ఓటు హక్కు 1920 వచ్చింది. మరి 1920 ముందు, నాలాంటి వారు హక్కు లేకుండా ఓటు వేయటం నేరమేగా ?  కాబట్టి ద్రోణాచార్యుల వారు చేసింది నేరం/ అధర్మం కాదు.

ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడుని శిష్యుడిగా ఆమోదించకపోయినా, ఏకలవ్యుడు ఆయన విగ్రహం పెట్టి విద్య నేర్చుకున్నాడు. చాలా గొప్పగా చెప్పవలసిన విషయమే.

దీని తరువాత వచ్చే ప్రశ్న :   ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే  పక్షపాతం. కాబట్టి ద్రోణుడు అర్జునుడి కోసం బొటన వేలు గురుదక్షిణగా ఇవ్వమన్నాడు..

ద్రోణుడు కేవలం అర్జునుడి కోసం బొటన వేలు ఇవ్వమని అడగలేదు. అందులో చాలా ధర్మం దాగి ఉంది. చాగంటి గారు ఆయన  ప్రవచనంలో దానిని విశదీకరించిన  విధానం నాకు బాగా నచ్చింది. తనని చంపుతాడు అని తెలిసిన ద్రుష్టద్యుమ్నుడికే విద్య నేర్పగా లేనిది, ఏకలవ్యుడి విషయం లో ఎలా ధర్మం తప్పుతాడు? అస్త్రాలు, శస్త్రాలు తెలియాలంటే  కావల్సినది విద్యా నైపుణ్యం ఒకటే కాదు, వాటిని ఉపయోగించేటపుడు పాటించవలసిన విచక్షణ & ధర్మం.  శిష్యుడు ఎవరిమీద పడితే వారి మీద ప్రయోగించడు , కేవలం ధర్మానికే  ప్రయోగిస్తాడు అన్న నమ్మకం కలిగినప్పుడే  అవి గురువు శిష్యుడికి ధార పోస్తాడు. ఒక కుక్క మొరిగిందని, తనకి ఏకాగ్రత చెదిరిందని  కుక్క పై  ఏడు  బాణాలతో బాణప్రయోగం చేసేవాడు, మునుముందు ఏదైనా చేయవచ్చు. ఆయన  ధర్మం తప్పే వాడే అయితే , ఆ అస్త్రాలు తనని అవమానించిన ద్రుపదుడి  మీదనే ప్రయోగించవచ్చు కదా.  పోనీ కొడుకైన అశ్వద్ధామ కి నేర్పవచ్చును కదా. ఆర్మీ లో, నేవీ లో పని చేసేవారు ఎంతో క్రమశిక్షణ తో ఉంటారు.  ఏ  మాత్రం అదుపు తప్పినా శిక్షలు ఉండవా? ప్రమోషన్ నుంచి డిమోషన్  కి తెస్తారు. పైగా అటువంటి సంస్థలలో పెద్ద పదవులలో ఉండేవారిపై నిఘా ఉంటుందని కూడా అంటుంటారు.  సరిగ్గా ఆలోచిస్తే ద్రోణాచార్యులవారు ఏకలవ్యుడిని గురుదక్షిణ ఇవ్వటం కూడా  అంతే.

చాగంటి వారు చెప్పినదే  కాక, నాకు ఇంకో అంశం కూడా కనిపించింది ఇక్కడ. ఏకలవ్యుడు గురువు ఆమోదం లేకుండా అన్నీ విద్యలు  నేర్చుకున్నాడు. మరి ఆ గురువు ఆమోదం లేకుండానే  వాటిని ప్రయోగించడన్న నమ్మకం ఏంటి?  బహుశా ద్రోణాచార్యులవారికీ  ఇక్కడ అతడిపై నమ్మకం పోయిందేమో!! అమెరికాలో కాలేజిలకి దరఖాస్తు పెట్టుకోవాలంటే, టీచర్ recommendation ఇవ్వాలి. ఆ విద్యార్థి వినయవిధేయతలతో & క్రమశిక్షణతో  ఉంటేనే టీచర్ recommend  చేస్తారు. ఏ మాత్రం క్రమశిక్షణ లేకపోయినా ఇవ్వరు.

ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే  పక్షపాతం అంటారు. ఒక గురువు స్థానంలో నిలబడి ఆలోచిస్తే అర్ధం అవుతుంది ఆ పక్షపాతం ఏంటో.

  • అందుకు ముఖ్యంగా  చెప్పుకోవాల్సిన ఉదాహరణ – పారుపల్లి రామకృష్ణయ్య పంతులు  గారు మరియు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. పారుపల్లి వారికి  ఎంతో మంది శిష్యులు ఉన్నారు మరి మనకి బాగా తెలిసన వారు మంగళంపల్లి వారే !! ఎందుకు ? పారుపల్లి వారు బాలమురళి గారికి ఒక్కరికే సంగీతం నేర్పించారా ? లేదే !! అందరికీ  ఒకే పాఠం చెప్పుంటారు గా !!
  • ఇంకొక ఉదాహరణ. అమెరికాలో బడులలో ‘No child left behind’ అన్న చట్టం ఉంది.  అందరికి సమానమైన విద్య అని వారి ఉద్దేశ్యం. మన భారతదేశ సంతతి పిల్లల గురించి అతిశయోక్తి గా చెప్పడం అని కాదు కానీ, ఏకసంతాగ్రాహులు అనవచ్చు.   చాలా మటుకు ఈ ‘No child left behind’ కోవలోకి రారు.  దానితో తరగతిలో టీచర్ కొంచం advanced గానే చెప్పాల్సి వస్తుంది. వీరికి ఛాలెంజ్ ఇవ్వకపోతే,  అల్లరి చేసి టీచర్ని విసిగిస్తారు.

అర్జునుడికి విద్య ఉన్న శ్రద్ధకి, అందులోను అతడికి ఉన్న వినయవిధేయతలకి మరి ద్రోణాచార్యులవారు ప్రియశిష్యుడు అవ్వటం లో సందేహం లేదుగా  మరి ?

కర్ణుడు – రాజభక్తి

కర్ణుడి మీద క్రితం సారి టపా  వ్రాసినప్పుడు, కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి.  వ్యాఖ్యలు చూడగానే  చాలా సంతోషం వేసింది ఎందుకంటే   రామాయణ భారతాల ని చాలా  మంది చదువుతున్నారు/వింటున్నారు అని 🙂 . చదవటమే కాదు చాలా బాగా విశ్లేషిస్తారు అని కూడా అర్ధమయ్యింది.

ఇక వ్యాఖ్యలు ఏంటంటే  – కర్ణుడు  తనకి దుర్యోధనుడి మీద ఉన్నది  రాజభక్తి  (Loyalty).  అది  ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం లో చూపించాడు అని. ఇది నేను ఒప్పుకోను. (నా అభిప్రాయం మాత్రమే).  కర్ణుడి కి  అర్జునుడు అంటే అసూయాద్వేషం.  రెండు సంఘటనల వలన తెలుస్తుంది.   ఒకటి విలువిద్యా ప్రదర్శనము (దీని గురించి వేరే ఇంకో పోస్టు వ్రాస్తాను) . ఇంకొకటి ద్రౌపది స్వయంవరం. కర్ణుడు రాగద్వేషాలకు లోబడ కుండా ధర్మం తెల్సిన వాడయితే,  ప్రతి సారి దుర్యోధనుడిని శాంత పరచేవాడు కానీ, అతడి వినాశనానికి దారి తీసేలా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేవాడు కాదుగా!!  దుర్యోధనుడి రెచ్చగొట్టడం లో తన ఆనందాన్ని వెతుక్కున్నాడనిపిస్తుంది.   జూదానికి పిలవడం లో , ఘోషా యాత్ర కి పిలవడం లో  కర్ణుడు ముఖ్య పాత్రే వహించాడు.   దానిని బట్టి కర్ణుడిది రాజభక్తి అనచ్చా అనేది నాకు సందేహమే.

ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం లో కర్ణుడి పాత్ర క్షమించరాని నేరం క్రిందకి వస్తుంది. నేరం చేసినవాడికి  ఎప్పుడో ఒకప్పుడు  పశ్చాత్తాపం కలగటం సహజం.  అంత మాత్రాన శిక్ష పడకుండా ఉండదు కదా.  చేసిన నేరానికి శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలి.  

అసలు ఒక ఉగ్రవాది అనే వాడు ఎలా పుట్టుకొస్తాడు ? పుట్టుకతో ఎవరూ  ఉగ్రవాది అవ్వరు కదా. పరిస్థితుల దృష్ట్యా తాను అనుభవించిన  కష్టాల వలన ఆత్మనూన్యత లోపం అయ్యి సమాజం మీద ఒక విధమైన కసి పెంచుకుంటూ అలా తయారవుతాడు. మరి  ఇటువంటి వారి ని చూసి జాలిపడదామా ? ఉగ్రవాదం ని ఖండిద్దామా ?

కర్ణుడు లేకపోతే మహాభారతం లేదనే చెప్పచ్ఛేమో అని కూడా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కర్ణుడు ఈ విధం గా ప్రవర్తించటానికి  కారణం అతని పుట్టుక. కుంతీ దేవి చిన్నతనం ఉండే సహజమైన ఉత్సుకత తో చేసిన తప్పుకి బలి అయినవాడు  కర్ణుడు. అందుకే  రామాయణ భారతాలు ఎప్పుడో జరిగినా ఈ రోజుకి  మనకి కొన్ని విషయాలు చెప్పకనే చెప్తాయి.

మహాభారతం – కర్ణుడు

మా ఇంట్లో  మా వారికి కాలక్షేపం కాకపోతే మహాభారతం పాత  సీరియల్  చూస్తారు. నెమ్మదిగా ఆయనతో పాటు పుస్తకాలూ, హోంవర్కులు పక్కన పెట్టి మా అమ్మాయి కూర్చుంటుంది.  ఆ నేపథ్యం లో ఒకరోజు ‘దుర్యోధనుడి అసూయ కి  ఆజ్యం పోసిన వాళ్ళు ఇద్దరు  ఒకరు ధృతరాష్ట్రుడు , ఇంకొకరు కర్ణుడు’ అన్నాను.  ఆమాట కి మా వాళ్ళు ఇద్దరూ  ‘కర్ణుడు ఇంత నిక్కచ్చి గా చెడ్డవాడు’ అని  చెప్పడం ఎక్కడా  వినలేదని (ఇద్దరు కలిసి ఎన్ని పుస్తకాలూ చదివారో తెలీదు. మహాభారతం టీవీ సీరియల్ మాత్రం బాగా చూస్తారు) వాదన మొదలు పెట్టారు.  

ఈ వాదన అయిన కొన్ని రోజులకే కష్టేఫలి వారు వారి బ్లాగులో కర్ణుడి గురించి వ్రాయటం మొదలు పెట్టారు.  నా వాదన తో ఇంకొకరు ఏకీభవిస్తున్నట్లనిపించింది.  

రామాయణం కానీ, భారతం కానీ ఏ పుస్తకం  అయినా కావచ్చు కాక.  పుస్తకం చదివాకా అన్వయం చేసుకోవలసినది మనమే. ఇదివరకు నా ముందు టపా లో చెప్పినట్లు connect Text to Self, Text to Text, Text to World  చేసుకుని అన్వయించుకోవాలి. అలా భారతం విన్నాకా, కొంచం చదివాకా –  కర్ణుడి గురించి నేను అన్వయించుకున్నది  & నాకు వచ్చిన అభిప్రాయమే ఈ టపా.

కర్ణుడు కుంతీ దేవి కి పుట్టిన సంతానమే  కానీ ధర్మ సంతానం కాదు. అవునన్నా కాదన్నా నిజం. కర్ణుడి స్వభావం కూడా ఈ విషయం తో ముడిపడి  ఉన్నది  అన్న సంగతి కూడా  ఒక వాస్తవం.

మహాభారతం లో కర్ణుడి ని అసలు క్షమించకూడదు అని అనిపించిన ఘట్టం  ఇది:

ధర్మరాజు జూదం లో  ఓడిపోయాక , దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపుతాడు ద్రౌపది ని తీసుకు రమ్మని.  దుశ్శాసనుడు ఆవిడని జుట్టు పట్టుకు ఈడ్చుకుని రాగా, వికర్ణుడు  లేచి ఇది అన్యాయం అని  చెబితే,  కర్ణుడు వికర్ణుడి తో ఈ విధం గా అంటాడు.

karna1

పైగా ద్రౌపది ని గురించి ,  ‘ఈవిడ బంధకి కాబట్టి వివస్త్ర ను చేసినా తప్పు లేదు’ అంటాడు  కూడా !!
karna2

దుశ్శాసనుడ చేత అవమానించబడి ద్రౌపదీ  దేవి దుఃఖపడుతుంటే ఈ మాట కూడా అంటాడు :

karna3

ఈ మాట విన్న దుర్యోధనుడు తన తొడ చూపించాడు.  ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కూడాను. అసలు దుర్యోధనుడిని ఈ విధం గా రెచ్చగొట్టేందుకే ఆ మాట అన్నట్లు కూడా అన్పిస్తుంది.

పైన చెప్పిన పద్యాలూ ఈ లంకె లో చూడవచ్చు.

మహాభారతము – సభా పర్వం – ద్వితీయాశ్వాసము. http://ebooks.tirumala.org/Product/Book/?ID=1874

కర్ణుడు తన సహజ కవచకుండలాలు దానం ఇవ్వటం మూలాన,  కుంతీ దేవి సంతానం అని మహాభారతం లో అతనికి చివర వరకు తెలియకపోవడం వలన  –  ఒక విధమైనటువంటి  జాలి కర్ణుడు మంచివాడే అనిపించేలా చేస్తుంది.

ఎప్పుడో జరిగినది  మహాభారతం.  అయినా  వస్త్రాపహరణం  ఘట్టం చదువుతున్నా, సీరియల్ లో చూస్తున్నా, మనసు ఈ అన్యాయాన్ని భరించలేదు. మరి ఆ రోజున కళ్లెదుట కనిపిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలమా ? ద్రౌపది అంత దుఃఖిస్తుంటే  ఆ సభ లో సంతోషపడుతూ ఆనంద పడ్డవారు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు. ఏమి మాట్లాడకుండా వారి మౌనం తో దానికి ఆమోద ముద్ర వేసిన వారు గాంధారీ ధృతరాష్ట్రులు.  పైన చెప్పిన ముగ్గురితో సంతోషపడటమే కాకుండా ఇన్ని మాటలు మాట్లాడుతూ  రెచ్చగొడుతూ  ఆజ్యం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందిన వాడు కర్ణుడు.  మన  నిజ జీవితం ఇటువంటి వాడిని ఏమని అంటాము ? శాడిస్ట్  అని కాదా ?

మన నిజ జీవితం లో  సంఘటనలు ఆలోచిస్తే , ఎక్కడైనా  రేప్ కేసు జరిగితే ఏమంటున్నాము ? తాత్సారం చేయకుండా  వాడికి ఉరిశిక్ష వేయాలి అని. ఎందుకు  ఉరిశిక్ష ? క్షమించరాని నేరం చేసాడు కాబట్టి !! ఢిల్లీ నిర్భయ కేసు చూడండి . అందులో  ఒక మైనర్ కూడా  ఉన్నాడు. చిన్న వాడు అన్న ఒక నెపం ఉంది. అంత మాత్రం చేత అతనిని వదిలి పెట్టగానే,  ఎంత మంది మనసు దానికి  అంగీకరించింది ? తప్పు ఎవరు చేసినా తప్పే  చిన్న, పెద్దా అనే తేడా లేదు అనే గా అనుకున్నాము?  జాలి పడ్డామా?  లేదే?  మరి మహాభారతం లో చివర కర్ణుడు బాధ  పడ్డాడు, కవచ కుండలాలు ఇచ్చాడు  అనుకోగానే ఎందుకు మంచివాడు అనుకోవాలి ? ద్రౌపది ని అవమానించిన వాడు దుశ్శాసనుడే  అయినా అంతటికి సూత్రధారి కర్ణుడు.

నాకు అందుకే  దుర్యోధనుడి కంటే మహాభారతం లో కర్ణుడే మహా ప్రమాదకారమైన  వ్యక్తి గా అనిపిస్తాడు.

వింటే భారతమే వినాలి – 1

చాగంటి వారి మహాభారతం వింటున్నాను.  ఆది పర్వం, సభా పర్వం  అయ్యాయి.  తెల్సిన వారొకరు  ముందు విరాటపర్వం వినమని చెప్పారు. అందుకని విరాట పర్వం మొదలు పెట్టాను. వింటున్నప్పుడు ఏదో మామూలు  కథ లాగా అనిపించినా, రోజు వారీ  జీవితం ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతున్నట్లే ఉంటుంది.

ఎప్పుడో వ్రాసి పెట్టుకున్న  టపా అంచెలంచెలు గా వ్రాస్తూ  రెండు భాగాలు గా ఈ రోజు  పూర్తి చేయడం అయింది.

ఒక రోజు చాగంటిగారి ప్రవచనం మహాభారతం ఆదిపర్వం 45 /51 భాగం  వింటున్నాను.  చివరగా దాదాపు అరగంట  ఉంది అనగా మరీ రాత్రి అవుతోందని  ఆపేసి పడుకున్నాను. మర్నాటి పొద్దున్న లేవగానే ఆపేసిన భాగం పెట్టాను. ఆ రోజు  నవరాత్రుల మొదటి రోజు.  మహత్తు ఏంటంటే మిగిలిన భాగం అంతా  కూడా  ద్రౌపది  దేవి గురించి.  ద్రౌపది దేవి ఒక అయోనిజ. అమ్మవారు  కాబట్టే అన్ని కష్ఠాలు భరించింది, ఆవిడ ఎవరు అన్నదాని  మీద  చాగంటి వారు ఆ అరగంట లో  ద్రౌపది  దేవి గురించి చాలా అద్భుతం గా వివరించారు.  ఆ కాస్త చాలు భారతం ఎందుకు అంత గొప్పదో తెలుసుకోవడానికి!! అనుకోకుండా ఈ  ఏడాది నవరాత్రులు ఆ విధం గా మొదలయినందుకు చాలా ఆనందం గా అన్పించింది.

ద్రుపదుడు అర్జునుడుని  అల్లుడు గా పొందడానికి  కూతురి పుట్టాలని యాగం చేస్తాడు.  ఆ యాగం నుంచీ  పుట్టిన ఆడపిల్ల  ద్రౌపది. మత్య్స యంత్రం చేధించిన వారికే పిల్లనిస్తాను అని స్వయంవర ప్రకటన ఇస్తాడు ద్రుపద మహారాజు.  అర్జునుడు మాత్రమే ఛేదిస్తాడు.  స్వయంవరానికి వచ్చిన రాజులంతా అర్జునుడు ఒక బ్రాహ్మణుడు అను.కుంటారు. మత్య్స యంత్రాన్ని చేధించినవాడు అర్జునుడే అన్న అనుమానం కూడా ఎవరికీ కలుగదు. ద్రౌపది కూడా బ్రాహ్మణుడే అనుకుని  అర్జునుడి మేడలో వరమాల వేస్తుంది.  స్వయంవరం తరువాత భీమార్జునులతో  వారు ఉన్న నివాసానికి వెళ్తుంది.  ఇవన్నీ అందరికీ  తెలిసిన విషయాలే !!

ఇక్కడ నుంచీ, వేరొక దృష్టి కోణం లో ఇక కొన్ని విషయాలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది !! రోజూ  పంచ భక్ష్య పరమాన్నాలతో భుజించే ఆమె, పాండవులు భిక్షాటన చేసి తెచ్చిన భిక్షని అందరికీ  వడ్డించి తాను తింటుంది.  హంస తూలికా తల్పం పైన నిదురించే ఆమె, కటిక నేలపై పడుకుంటుంది. కుంతి  ఎలా చెప్తే ఆలా వింటుంది.  ఇక్కడ ఏంటంటే ఆవిడ దేనికి దుఃఖపడదు. పైపెచ్చు సంతోషం గా ఉంటుంది. పంచపాండవులందరినీ  పెళ్లి చేసుకోవడం లో కూడా  ఆవిడ నిర్ణయం ఏది లేదు.  ఆ విధం గా పెళ్లి చేసుకోవాల్సివచ్చినపుడు ఆవిడ  దుఃఖపడినట్లు  కూడా ఎక్కడా అనిపించదు.  ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాగంటి గారు  ద్రౌపదీ దేవి వివాహం గురించి చెబుతూ, ‘మీలో ఎవరైనా వ్యాసుడంతటి వాడు వచ్చి చెప్తే పిల్లని అలా  ఐదుగురికి ఇచ్చి వివాహం చేస్తారా లేక ద్రుపదుడిలాగా ఆలోచిస్తారా ? ‘ అని ప్రవచనం వింటున్నవారిని ప్రశ్నించారు.  ఎవరూ  సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ‘ ఎవరైనా మీలాగే ఆలోచిస్తారు. మీ ఆలోచన తప్పు కాదు. అలవాటు లేని ఆచారం అంటే ఎవరూ  ఆమోదించరు’ అన్నారు. (Sri changanti.net/ మహాభారతం/ఆది పర్వం 45/51  24:00-26:00).

ప్రతి విషయం లో  ద్రౌపది  దేవి చూపించిన ఓర్పు, ఆమోదం(acceptance) చూసి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది అన్పించింది. స్వయంవరంలో మత్య్స యంత్రం చేధించిన వాడు ఎవరో ఆవిడకి తెలియదు. ఆవిడ తండ్రి చెప్పిన నిబంధన ప్రకారం  మత్య్స యంత్రం చేధించాడు, కాబట్టి వరమాల వేసి అతడితో వచ్చేసింది. “అయ్యో !!నేను అర్జునిడి ని చేసుకోవాల్సినదానను, కానీ ఇతను ఎవరో తెలీదు  ఇతని మెడలో  వరమాల ఎందుకు వేసాను” అని బాధపడలేదు.   అదే విధం గా  గమనించవలసినది   ఏంటంటే, ఏ విషయాన్నీ ఆమోదించకూడదో అది ద్రౌపది  దేవి ఆమోదించలేదు కూడా !! తనని అవమానించిన దుర్యోధన, కర్ణ, దుశ్శాసనులను విడిచిపెట్టనివ్వలేదు. యుద్ధం జరిగేలా చేసింది. దీని నుంచి నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఒక  స్త్రీ మూర్తి  వ్యక్తిత్వం ఎలా ఉండాలో ఎలా ఉంటుందో  చెప్తుంది ద్రౌపది దేవి వ్యక్తిత్వం.  

విరాటపర్వం లో  కూడా  ద్రౌపదీ  దేవి గురించి చెప్పారు చాగంటి వారు.  ఆదిపర్వం లో కంటే విరాటపర్వం లో  బాగా చెప్పారనిపించింది. విరాటపర్వం లో ద్రౌపది, కుంతీ, గాంధారి ముగ్గురి గురించి చెప్పారు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 6/24 16:00- చివర && 7/24 మొదలు – 3:30). ప్రతి ఒక్కరు వినవలసినవి !!

ఈ ముగ్గురి స్త్రీ జీవితాలు చూపించి జీవితం లో ఏ తప్పులు చేయకూడదు అని భారతం చెప్పిందో, అటువంటి తప్పులు చేసే దిశ లోనే పయనం చేస్తూ ఫెమినిజం అంటూ రంగు పులుముతున్నారు సోషల్ మీడియా లో  ఈ మధ్య . పైగా కొన్ని అంశాల మీద టీవీ లో వాదోపవాదనలు, కథలు !!   

‘అమ్మాయి అత్తగారింటికే  ఎందుకు వెళ్ళాలి? అబ్బాయి అత్తగారింటికి రావచ్చు కదా!!’ .

‘పెళ్లే  చేసుకోవాలా ? సహజీవనం చేస్తే సరిపోదా ?’.

‘ మా బట్టలు మా ఇష్టం. ఏదైనా వేసుకుంటాం’ . ‘It’s my choice’ .

బట్టలు డిజైన్ చేసేవాడు దుశ్శాసనుడి  కంటే దారుణం గా ఆలోచించి ఆడపిల్లల దుస్తులు తాయారు చేస్తుంటే, దాన్ని ఫాషన్, ఛాయస్ అనే పేరు తో ఆమోదిస్తున్నాం.  మగవాడికి కూడా  అటువంటి  దుస్తులు తయారు  చేయమని అడగట్లేదు ఆడవారెవరూ  కూడా !! సినిమాల్లో, వాట్సాప్ లో  ఆడవారిని  అవమానిస్తూ జోకులు (ట). ఆడవారే వాటిని ప్రోత్సహిస్తుంటారు కూడా !!  భర్త పోయాక పుట్టింటికి వెళ్లకుండా ధైర్యం గా పిల్లలని తీసుకుని అత్తవారింటికి వెళ్లిన కుంతీ దేవిని చూసి తమకు తామై ఎలా నిలబడాలో నేర్చుకోవాలి ఈ రోజున ఆడపిల్లలు.

ఆసక్తి గా అనిపించే ఇంకొక విషయం.అర్జునుడికి ఏదైనా విద్య నేర్చుకోవాలంటే అన్నీ అనుకూలమే. కానీ కర్ణుడికి ప్రతిదీ ప్రతికూలం.  అందుకే కర్ణుడు, అర్జునుడి కంటే శక్తి వంతుడు. కానీ ఒక్కొక్కటి పోగొట్టుకుని కర్ణుడు బలహీనుడు అయ్యాడు. ఒక్కొక్కటి  అర్జునుడు  పొంది బలవంతుడయ్యాడు. (Sri changanti.net/ మహాభారతం/విరాట పర్వం 10/24 43:00-46:00 ) ఎందుకు అలా  జరిగింది అనేది ఒక జీవిత పాఠం. బలహీనుడయినా అన్ని అస్త్రశాస్త్రాలు  అర్జునుడు ఎలా సాధించాడు అనేది ఒక విద్యార్థి తెలుసుకోవలసిన ముఖ్యాంశం.