అమ్మమ్మ

నవరాత్రులు  మొదలయ్యాయి.  మాములుగా అయితే దసరా ప్రతిరోజూ లలిత చదువుకుంటాను.  ఈ సారి  నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఒక్కొక్కరి గురించి వ్రాద్దామని అమ్మవారిని తలచుకుందాం అన్న ఆలోచన ఒకటి వచ్చింది.  అందుకే  ఇలా …. 

 కొంచెం personal గానే ఉంటాయేమో పోస్టులు

ముందు అమ్మమ్మ గురించి మొదలు పెడతాను.  

అమ్మమ్మ & ఆవిడ జీవితం గురించి వ్రాయాలంటే ఒక్క టపా సరిపోదు. కానీ కొంచెం క్లుప్తంగానే  వ్రాయడానికి ప్రయత్నిస్తాను. 

అమ్మమ్మ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది. తనకి  సొంత తోబుట్టువులు అంటే అన్నయ్య ఒక్కడే కానీ, పెదతండ్రి, మేనత్త పిల్లల్ని కలుపుకుంటే బోలెడు బలగం అమ్మమ్మకి. అమ్మమ్మకి ఇద్దరు పెదతండ్రులు. ఇద్దరు మేనత్తలు. అమ్మమ్మ ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. అన్నయ్య వచ్చి ‘అమ్మని నా  చేతులతో  పంపేసానమ్మా ‘ అని ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్ధం కాలేదుట అమ్మమ్మకి. అమ్మమ్మ తల్లి చనిపోయెనాటికే పెదతండ్రులిద్దరి భార్యలు కూడా చనిపోయారట . ముగ్గురు  అన్నదమ్ములు కూడా సవతితల్లులు  వస్తే తమ పిల్లల్ని సరిగ్గా చూడరేమోనని రెండో పెళ్లి చేసుకోలేదట.   ఈ పిల్లలందరినీ విధవరాలైన ఒక మేనత్త చూసుకునేది. ఆవిడే అమ్మమ్మకి  పురాణాలూ చెప్పేదిట. అమ్మమ్మ అందరిలోకి చిన్నది కావడంతో ఏదైనా తాయిలం తెస్తే ముందు అమ్మమ్మకి పెట్టి తరువాత అందరూ  తినేవారు. అలా తల్లి లేని పిల్ల అని అమితమైన గారాబంతో పెరిగింది అమ్మమ్మ. 

పదకొండేళ్ళు నిండగానే మా తాతయ్యతో వివాహం అయ్యింది. అప్పుడు ఆయనకి  పదమూడేళ్ళు. తన  పదహారో ఏట కాపురానికి వచ్చింది. అమ్మమ్మకి  కొన్ని ఏళ్ళ వరకు పిల్లలు కలుగలేదు. అటువంటప్పుడు ఆ రోజుల్లో  కొందరు  ద్వితీయ వివాహం చేసుకునేవారు. తాతయ్య తాను ఒక్కడే కొడుకయినా అటువంటి ఆలోచనలు రానివ్వలేదు. వారి ఇరువురికి  ఐదుగురు సంతానం, మనవళ్ళు & మనవరాళ్లు , ముని మనవరాళ్ళు  & ముని  మనవలు ..  చాగంటి గారు చెప్పినట్లు తామర  తంపర 🙂 .  

ఇంట్లో ఏ కూర  చేయాలి అన్న దగ్గర నుంచీ ఆవిడ  అత్తగారు, అంటే మా ముత్తవ్వ  గారిదే  decision making .  మా ముత్తవ్వ గారి చివరికోరిక మా అమ్మ పెళ్లి చూడాలి అని.  అందుకు   అమ్మని  కాలేజీకి పంపకుండా పెళ్లి చేయమని అడిగేదిట ఆవిడ. దేనికి అడ్డు చెప్పని అమ్మమ్మ అప్పుడు మాత్రం అమ్మని కాలేజీకి పంపాల్సిందే అని పట్టుబట్టింది. సాధారణంగా ఆడవారిలో ఎప్పుడో ఒకప్పుడు ‘ఈ చీర ఇలా ఉండాలి, ఈ నగ ఇలా వేసుకోవాలి’ అంటూ  ఒక కోరిక ఉంటుంది. అమ్మమ్మ ఎప్పడూ  ఏదో  ఒక విధంగా  ఇంకొకరికి సహాయం చేయడమే చూసాను కానీ నోటి నుంచీ ‘ఇది నా కోరిక’  అని ఎప్పుడూ  వినలేదు.

మా అమ్మ &  పిన్నులు, చిన్నప్పుడు ఎండాకాలం సెలవలు వస్తే  వెళ్లడానికి వాళ్ళకి అమ్మమ్మగారిల్లు లేదని ఏడ్చేవారట. అది దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ  మా అందరికీ ‘అమ్మమ్మ వాళ్ళ ఇల్లు’ అనే చెరిగిపోని తరిగిపోని జ్ఞాపకాన్ని అందించింది (అందులో మా తాతయ్య పాత్ర కూడా ఎక్కడా తీసిపోదు). ఎండాకాలం సెలవలు వస్తే చాలు, దాదాపు  ఓ ఇరవై నుంచీ పాతిక మందిమి అయ్యే వాళ్ళం. పొద్దున్నే కాఫీలు, పిల్లలకి వీవాలు, చద్దన్నాలు, భోజనాలు,తలంట్లు, మంచి నీళ్ళు  మోసుకొచ్చుకోడాలు,మధ్యలో బాలింతరాళ్ల & చంటిపిల్లల స్నానాలు, వాళ్ళకి  సాంబ్రాణి పొగలు, మడి & మహానైవేద్యాలు. ఆవకాయలు, మధ్యాహ్నం తాయిలాల తయారీ, పూల జడలు. . మధ్యలో ఊర్లో వారి చంటిపిల్లలకు స్నానాలు అలా ఒకటేమిటి ఇన్ని పనుల్లో తలమునకలైపోతున్నా ‘అమ్మలూ!! నాన్నా !!’ అంటూ మా అందర్నీ అమితమైన గారాబం చేసేది. ఎవర్నీ విసుక్కోవటం  నాకు గుర్తు లేదు. బహుశా అలా అందరం రావడం చాలా ఆనందం గా ఉండేదేమో ఆవిడకి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ మేనల్లుళ్ళు  (అంటే ఆడపడుచు పిల్లలు) ఈ రోజుకి కూడా ఎంతో ప్రేమగా & ఆప్యాయంగా ఉంటారు.  మా ముత్తవ్వగారు  చివరి రోజుల్లో మంచాన పడితే ఆవిడకి సేవ చేసింది.  అమ్మమ్మ చేసిన సేవకి, ఆవిడ ఏడ్చేదిట. 

ఎంత ఓపిక లేకపోయినా కూడా  అత్తగారి & మామ గారి తద్దినాలకి అమ్మమ్మే స్వయంగా వంట చేసి బ్రాహ్మలకి  వడ్డించేది. మా అమ్మ ‘భారతదేశంలో అన్ని చోట్లా  తర్పణాలు, పిండాలు పెట్టారు కదా. ఎందుకంత చాదస్తం‘ అంటే  కూడా వినకుండా ఓపికగా చేసేది.

ఆవరణలో ఆడవారందరూ ఈవిడ ప్రోత్సాహంతో దేవి భాగవతం లాంటివి పారాయణ చేసుకునే వారు.  కొంచెం తీరిక దొరికితే చాలు బుట్టలు అల్లడం, craft  చేయడం లాంటివి చేస్తూ ఉండేది.  

ఏ విషయాన్నయినా positive గానే చూస్తుంది ఆవిడ. అందుకే ఈ రోజుకి కూడా ‘పట్టు విడుపు ఉండాలమ్మా ‘ అంటూ మాకు ఏది ఎలా handle  చేయాలో చెబుతుంది.  

‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవరికీ  నీకున్న ఈ  అవగాహన & ఓర్పు లేదు.అసలు  నీకెలా వచ్చింది?’ అని అడిగాను. ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ  భయమేనే  అమ్మా!!  ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి నాకు.

తాతయ్య సేవకే ఆవిడ  పుట్టిందా అన్నట్లు,  ఆయన  పోయిన పన్నెండో రోజు  ఆవిడ కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి (అప్పటికే గ్లూకోమా వచ్చింది).  ఎప్పుడూ  ఏదో ఒక ప్రవచనం వింటూ గడుపుతోంది. ఇప్పటికైనా ఆవిడకి సేవ చేసుకుని తరించమని మా అందరికీ  భగవంతుడు వరం ఇచ్చాడేమో!! ఆ వరం ఇచ్చినా అందుకోలేని దురదృష్టవంతురాలిని నేను !! ఫోన్ కూడా చేయలేనంత తీరికతో ఉంటాను.  ఈ టపా  అయ్యాక చేసి మాట్లాడాలి. 

ఈ టపా మరీ నా వ్యక్తిగతంగా అనిపించచ్చు.  ఏ బడికి వెళ్లకుండా కేవలం పురాణాగాథలు విని ఇంత జీవిత పాఠం నేర్పించిన అమ్మమ్మలు  మనలో చాలా మందికే ఉంటారు. అందుకే  కేవలం నా మాటలలో ఉండిపోకుండా నా కుటుంబంలో తరువాతి తరం కూడా వారు కూడా తెలుసుకోవాలనే ఈ టపా !! 

వేసవి సెలవలు – 3 సినిమా

వేసవి సెలవలలో బిట్రగుంటలో సినిమా చూడటం కూడా ఓ మరచిపోలేని జ్ఞాపకం మాకు.

కొత్త సినిమాలు చూడాలి అంటే బిట్రగుంట థియేటర్లలో వచ్చేవి కాదు. ఇక నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. దానికోసం ముందే ఓ పెద్ద ప్రణాళిక వేసుకునేవాళ్ళం. మాట్నీకి వెళ్ళాలి  అంటే భోజనాలు చేసి హౌరా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాలి. మా మావయ్య, పిన్ని, కొంతమంది పెద్దపిల్లలం మాత్రమే వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ భోజనాలు తొందరగా పెట్టేసేది పాపం.

ఆ హౌరా  ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా వస్తే మాత్రం అంతే సంగతులు!! సాయంత్రం కృష్ణా ఎక్స్ ప్రెస్  వరకూ ఇంకో బండి ఉండేది కాదు. బిట్రగుంట నుంచి నెల్లూరు కి బస్సు లు పెద్దగా ఉండేవి కాదు. ఇక ఆ రోజుకి  సినిమా ప్రోగ్రాం ‘కాన్సల్’ అనేవారు. అలా మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (No 53/54)  లో రాత్రి భోజనాల సమయానికి ఇల్లు చేరేవాళ్ళం.

నెల్లూరులో నాకు గుర్తున్న థియేటర్ లు,  ‘అర్చన’ థియేటర్ & ‘కృష్ణా, కళ్యాణి, కావెరీ ‘ అని మూడు థియేటర్లు కలిపిన కాంప్లెక్స్.  మా మావయ్య ఆ మూడు థియేటర్లకి తీసుకెళ్ళినపుడల్లా ‘ మీ హైదరాబాద్ లో ఏ థియేటర్ పనికొస్తుందే  వీటి ముందు’ అనేవాడు. ‘ అసలు మహేశ్వరి పరమేశ్వరి’ చూసావా అంటూ పోట్లాడేవాళ్ళం నేను & మా అక్క. (మావయ్య తో అంత పోట్లాడేదాన్ని కానీ, ‘మహేశ్వరి పరమేశ్వరి’ నేనే ఎప్పుడూ  వెళ్ళలేదు. వెళదామని ఇప్పుడు అనుకున్నా అంత తీరికా, ఓపికా రెండూ లేవు. అంతా మార్చేసారని విన్నాను)

‘అహ నా పెళ్ళంట’, ‘డాన్స్ మాస్టర్’ నెల్లూరు లోనే చూసాము. ‘క్షణక్షణం’ నెల్లూరులో చూసిన ఆఖరి సినిమా అనుకుంటా.

బిట్రగుంటలో  రెండు థియేటర్ లు ఉండేవి. ఒకటి ‘పంచ రత్న’. ఇంకొకటి ‘సాజిద్’.  ‘పంచ రత్న’ ఇంటికి దగ్గరలో విశ్వనాథ రావు పేటలో ఉండేది. అప్పట్లో కొత్తగా ఊర్లో కొంచం అధునాతనంగా వచ్చింది. ‘సాజిద్’ పాత  థియేటర్ . రైల్వే బ్రిడ్జికి అవతల పక్క ఉండేది. అందుకని అక్కడ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘సాజిద్’ లో చూసిన  ఒకే ఒక్క సినిమా ‘జీవనపోరాటం’ . కొత్త సినిమా లో అలా వెంటనే ‘సాజిద్’ లో రావటం అదే మొదటిసారి. 

అలా ఎక్కువగా ‘పంచ రత్న’ కే  వెళ్ళేవాళ్ళం. ‘పంచ రత్న’ లో   25 పైసలు, 75 పైసలు, 1.50 టికెట్లు ఉన్నట్లు గుర్తు.  నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి ఇద్దరం డబ్బులు ఏదో ఆదా  చేద్దామని, 75 పైసలు కొనుక్కుని , ఇంటెర్వల్ లో 1.50 కి వచ్చి కూర్చునేవాళ్ళం. అలాంటి  కక్కుర్తి పనులు చేసినందుకు మా పిన్ని బాగా తిట్టేది. మా పిన్నికి నాకు క్షణం పడేది కాదు. ‘పెద్ద గయ్యాళిరా బాబు’  అనుకునేదాన్ని. ఇక్కడ మా పిన్ని గురించి ఒకటి చెప్పాలి. తను నాకు తలకి నూనె రాసి జడ ఎంత గట్టిగా వేసేదంటే, నా తల automaticగా ముందుకి వచ్చేది. అలా తల ముందుకి పెడితే  ‘ఎందుకలా చూస్తావే కొంగా’ అని తిట్టేది. మా గోల భరించలేక అమ్మమ్మే జడ వేసేసేది నాకు. నిస్వార్థమైన ప్రేమ అమ్మానాన్నలకు మాత్రమే ఉంటుంది అంటారు. ఈ రోజుకి కూడా అంతే ప్రేమ చూపిస్తుంది మా పిన్ని.  ఫోన్ చేస్తాను అని చెప్తే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తా !!

బిట్రగుంటలో సినిమా అంటే, సినిమా బండి వచ్చేది. ‘ నేడే చూడండి, నేడే చూడండి’ అంటూ. ఆవరణలో పిల్లలందరం పరిగెత్తుకెళ్ళి బండి దగ్గరికి వెళ్లి  ఏ సినిమానో, ఎన్ని రోజులో తెలుసుకుని వచ్చేవాళ్ళం. వెళ్లాలో వద్దో మా పిన్ని నిర్ణయించేసేది. ఫస్ట్ షో 7:00 కి ఉండేది. సినిమా చూసి వచ్చాక ఇంటికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళం. మేము వచ్చేసరికి అందరూ  పక్కలు వేసుకుని నిద్రకి ఉపక్రమిస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మమ్మ సినిమాకి వెళ్ళివచ్చినవారందరికీ స్టీల్ బేసిన్లో ముద్దలు కలిపి పెట్టేది. ఒక్కోసారి పూరీలాంటి టిఫిన్ లు చేసి ఉంచేది. అమ్మమ్మ, తాతయ్య మాతో ఎప్పుడూ  సినిమాకి రాలేదు.

మా పిల్లల ఎండాకాలం సెలవలు చూస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి. అమెరికాలో ( మా ఊర్లో అయితే ) సెలవలు ఉన్న పది వారాలు, వారానికి రెండు సినిమాల చొప్పున free  movies, వారాంతం అదనంగా outdoor movies ఉంటాయి. వీళ్ళ చిన్నపుడు ఆ free movie కోసం పొద్దున్నే లేచి, breakfast తిని పరిగెత్తడం కూడా అప్పుడే ఒక జ్ఞాపకం గా అయిపోయింది.  ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మారిపోతుంటే, కాలం ఎంత తొందరగా పరుగెత్తుతోందా అనిపిస్తోంది!!

 

వేసవి సెలవలు -1 పూలజడ

వేసవి సెలవలు రాగానే  అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయి బడి తెరిచే ఒక  వారం రోజుల ముందు వచ్చేవాళ్ళం. మా అమ్మ ఎక్కువ వచ్చేది కాదు. వచ్చినా ఒక రెండు రోజులు ఉండి  వెళ్లిపోయేవాళ్లు అమ్మా, నాన్న. ఇక మా ఇష్టమే ఇష్టం!! పిన్నులు, వాళ్ళ పిల్లలు, మావయ్య, ఆవరణ లో పిల్లలు. రోజులో  24 గంటలు సరిపోయేది కాదేమో మా ఆటలకి.  మా అమ్మమ్మ గారి ఊరు గురించి నా మొట్టమొదటి టపా చెరగని తరగని జ్ఞాపకాలు లో చెప్పాను .

రోజంతా ఆటలు. మధ్యాహ్నం తాటి ముంజలు తినడం.  సాయంత్రం పెరట్లో తులసి చెట్టు దగ్గర కందిపచ్చడి, కొత్త ఆవకాయ, మామిడి పండు తో భోజనాలు.  ఆరుబయట వేపచెట్టు కింద మంచాలు, పక్కలు వేసుకుని కబుర్లు.  మధ్యలో కరెంటు పోవడం. వెంటనే  లాంతరు (సాయంత్రం అవ్వగానే ఎప్పుడూ వెలిగే ఉండేది)  ఒత్తి పెద్దగా చేయడం.  ఈ రోజుల్లో ఏ క్యాంపింగ్ ట్రిప్ పనికొస్తుంది ఇటువంటి అనుభవాలతో !!

అలా  ఉండేరోజుల్లో, ఒక రోజు నాకు, మా అక్క కి  పూలజడలు వేయించాలని సంకల్పం చేసేది అమ్మమ్మ. రోజూ నాలుగవ్వగానే మల్లెపూల అబ్బాయి వచ్చి మల్లెమాలలు ఇచ్చి వెళ్ళేవాడు.  పూలజడల కోసం ఆరోజుకి మొగ్గలు  తెమ్మని అతనికే చెప్పేది అమ్మమ్మ. లేదా, లచ్చారెడ్డి తోట అని ఇంటి దగ్గరే ఒక మల్లెపూల తోట ఉండేది. అక్కడికి వెళ్లి మల్లెమొగ్గలు తెచ్చుకునేవాళ్ళం.

పూలు ఉండగానే సరికాదు కదా. జడ వేసేవారు కావద్దూ!!  వీధి చివర ఉండే కమలమ్మగారు కానీ,  పక్క వీధీ  ఉండే గోపాలయ్య గారి భార్య శాంతమ్మగారు కానీ వేసేవాళ్ళు. వాళ్ళకి  కుదురుతుందో లేదో ముందే అడిగి కనుక్కునేది అమ్మమ్మ. కమలమ్మ గారు జడ వేసినప్పుడు ఆ విశేషాలు గుర్తు లేవు కానీ శాంతమ్మగారు బాగా గుర్తు.   భోజనాలు అవగానే మొగ్గలని నీళ్ళల్లో వేసుకుని గిన్నెలతో , జడ కుప్పెలు, సవరాలు , వేరే అలంకరణ సామగ్రితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. గోపాలయ్య గారింట్లో అయితే అందరికీ  కాలక్షేపమే.  వారిది కిరాణా కొట్టు.  వచ్చేపోయే వారు ఎక్కువ. పూలజడల కార్యక్రమం వరండాలో పెట్టేవారు. అందరు ఎవరికీ తోచిన సలహా వారు ఇస్తూ, కబుర్లు చెప్తూ ఇలా సాగేది ఆ కార్యక్రమం.  వారికీ నలుగురు అమ్మాయిలు. చివరి అమ్మాయి మాతోటిది. మధ్యలో అప్పటికప్పుడు వెళ్లి అలంకరణ కోసం మా ఆవరణకి వెళ్లి అనార్కలి, మరువం, కనకాంబరాలు కోసుకొచ్చిపెట్టేది మాకు. వాళ్ళందరూ కొబ్బరిపుల్లలకి  మొగ్గలు గుచ్చి సహాయం చేసేవాళ్ళు.

సన్నగా ఉండే నా జడని సవరాలు పెట్టి పొడుగ్గా చాలా అందం గా వేసేవారు ఆవిడ.  అలా మల్లెలు, మరువం, కనకాంబరాలతో ఆవిడ వేసే జడ ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు వేయలేరు అని ఖచ్చితంగా చెప్తాను.  అయితే జడ కుప్పెల దగ్గర చిన్న రాజకీయం చేసేవారు  మా అమ్మమ్మ, ఆవిడా ఇద్దరునూ !! అప్పట్లో బంగారు నాగరం, బంగారు కుప్పెలు ఉండేవి.  అమ్మమ్మ, వాటిని పెద్ద మనవరాలని మా అక్కకి పెట్టమని రహస్యంగా  శాంతమ్మ గారికి చెప్పేది. పూసలు, తళుకులు, చమ్కీలు ఉండే కుప్పెలు, అనార్కలి పూవు( నాగరంలా)  నాకు పెట్టమని చెప్పేది. ఒకసారి ఆ రాజకీయం అర్ధమయ్యి నేను ఏడిస్తే, తళుకులు చూపించి ‘ప్రపంచం లో ఇంతకంటే అరుదైన కుప్పెలు లేవు’ అన్నట్లు చెప్పి  శాంతమ్మగారు నన్ను మైమరిపించారు.

ఇక్కడ గోపాలయ్య గారి కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా  చెప్పాలి.  మా అమ్మనాన్న పెళ్ళికి వాళ్ళిల్లు విడిది. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి మా అమ్మమ్మగారిల్లు విడిది. వాళ్ళ ఇల్లు కూడలి పక్కనే ఉండటంతో మేము రైలు దిగి వస్తుంటే వాళ్ళే వీధి లోకి వచ్చి   ‘ఏ బండికొచ్చారు ?లేటా ‘ అని అడుగుతూ మాకు ముందు స్వాగతం చెప్పేవారు.

IMG_0196
ఫోటోలో మామిడి చెట్టున్న ఇల్లే గోపాలయ్య గారిది

 

పూలజడ వేసాక  పరికిణీలు  వేసుకుని తయారయ్యేవాళ్ళం. పూలజడల కోసం మేము క్రొత్త పరికిణీలు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. మాచింగ్ గాజులు, లోలాకులు, పాపిటబిళ్ళ  అన్నీ  ఫాన్సీ స్టోర్ లో ముందే కొని పెట్టుకునే వాళ్ళం. ఆ విధంగా తయారయ్యి అందరి ఇళ్ళకి వెళ్లి పూలజడ చూపించి వచ్చేవాళ్ళం. ముందు శాంతమ్మ గారింటికి. తర్వాతే ఎవరింటికైనా.  ప్రతి ఇంటికి వెళ్ళగానే ‘ ఏంటమ్మా’ అనే వారు. అంటే ఎందుకొచ్చారన్నట్లు. దానికి మా సమాధానం ‘ పూలజడ చూపించడానికి వచ్చామండీ’ అని 🙂 ‘ఎవరు వేసారూ’ అంటూ  వెనక్కి తిరగమనేవారు. అలా అందరి ఇళ్ళు వెళ్లి వచ్చాక, మావయ్య ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటో తీయించేవాడు. అదేంటో కానీ ఒక్క ఫోటో కూడా లేదు.

IMG_0197
వారి ఇల్లు ఉన్న వీధి

ఒక్కోసారి ఆవరణలో మా స్నేహితురాలు  వరలక్ష్మి కూడా మాతోపాటు పూలజడ వేసుకునేది.  అంత మందికి ఎలా వేసేదా  ఆవిడా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది. మా మావయ్య ఎవరి జడలు నలగకుండా ఉంటాయో చూద్దాం అనే పోటీ పెట్టేవాడు. ఇక రాత్రంతా పడుకోకుండా దానిని కాపాడటం సరిపోయేది.

అదండీ  నా పూలజడ కథ. అమాయకంగా ఉండే ఆ రోజులే వేరు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే Electronic gadgets వలన సగము ఇటువంటి చిన్ని చిన్ని సరదాలకు , ఆనందాలకు మనం ఎంత దూరం అయిపోతున్నామా  అనిపిస్తుంది.

చెరగని తరగని జ్ఞాపకాలు

దేవుడు వరం ఏదైనా అడిగితే కాలయంత్రం (Time-machine) ఎక్కించి  నా  చిన్నతనం లోని మధురమైన  ఘట్టాలకు  తీసుకెళ్ళమని కోరుకుంటాను. . ఎండాకాలం సెలవలు, మామిడి పళ్ళు, మల్లెపూలు, అమ్మమ్మ గారి ఊరు…

img_0188

అనగనగా ఒక  ఊరు. మా అమ్మమ్మ గారి ఊరు, ఒక పల్లెటూరు. పల్లెటూరు అనగానే పచ్చటి  పొలాలు గుర్తుకు రాక మానవు.  కానీ అవన్నీ మా  ఊర్లో ఉండవు. అన్నీ పల్లెటూర్ల లాగా ఉంటే ఇంక  మా ఊరి ప్రత్యేకత ఏముంటుంది? మా ఊరి  పేరు బిట్రగుంట.  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ- గూడూరు సెక్షన్ లో ఉండే ఒక స్టేషన్. ఒకానొకప్పుడు స్టీమ్ ఇంజిన్లు ఉన్న రోజుల్లో  రైల్వే వైభోగం తో వెలిగి పోయిన ఊరు.  1885 లో  బ్రిటిష్ వారు, ఇక్కడ మంచి నీటి కొరత  లేనందున ఇక్కడ స్టీమ్ ఇంజిన్ లోకో షెడ్ ని  నిర్మించారు. ఈ నమూనా  ని  కొత్త ఢిల్లీ లోని రైలు మ్యూజియం  లో చూడవచ్చు.  భారత దేశం లో ఇటువంటివి రెండే ఉండేవి. ఈ లోకో షెడ్ ఎన్నో కుటుంబాలకి  జీవనాధారం కల్పించింది. రైల్వే వారి పాఠశాలలు (తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో ),  ఒక రైల్వే ఆసుపత్రి ఉండేవి. వచ్చేపోయే రైళ్ళలో డ్రైవర్ లు  మరియు గార్డ్ లు కూడా  మా బిట్రగుంట లోనే మారే  వారు.  ఇప్పటికి కూడా అనుకుంటాను. రైలు లో భోజనాలు లో కూడా బిట్రగుంట నుంచే అందించేవారు. అంతే కాదు రైల్వే క్వార్టర్ లు, రైల్వే ఇన్సిట్యూటు, పార్కు,రన్నింగ్ రూం  అన్నీ ఉన్నఒక పెద్ద  రైల్వే కంటోన్మెంట్  బిట్రగుంట .  రైల్వే డాక్టర్లు, టీచర్లు,  లోకో షెడ్ లో పని చేసేవారు, డ్రైవర్ లు, గార్డ్ లు ఇలా ఇంత మంది రైల్వే ఉద్యోగులతో, వారి కుటుంబాలతో  ఊరు కళకళలాడుతూ ఉండేది.  

కోడి కూత  విని పల్లె నిద్ర లేచింది అంటారు.  పొద్దున్నేతిరుపతి నుండి  వచ్చే ‘కోచి’ బండి కూత  లో మా ఊరు  నిద్ర లేచేది. తిరుమల ఎక్స్ ప్రెస్  రాక  తో నిద్రపోయేది.  రైళ్ళ ని పేర్ల తో కాక వాటి సంఖ్యలతో  సంభోదించటం మా బిట్రగుంట వారి ప్రత్యేకత.అంతే కాదండోయ్ !! బిట్రగుంట వారి కి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది. అది తర్వాత చెప్తాను.

మా తాత  గారి స్వస్థలం బిట్రగుంట దగ్గర అగ్రహారం అనే పల్లెటూరు కావటం, ఆయన  కూడా ఒక రైల్వే ఉద్యోగి  కావటం తో కుటుంబం తో ఇల్లు కట్టుకుని బిట్రగుంట లో పూర్తి గా స్థిరపడ్డారు. మా అమ్మమ్మ గారిల్లు అంటే పెద్ద కాంపౌండ్, దానికి ఒక గేటు,  అమ్మమ్మ వాళ్ళు ఉండే  ఇల్లు కాక  దాదాపు ఇంకో ఐదు ఇళ్ళు , ఒక పూరిల్లు, పెద్ద బావి , అన్నీ  ఇళ్ళకి మధ్య లో  ఒక వడ్ల కొట్టు, దానిని అనుకుని ఒక సిమెంట్ అరుగు అన్నీ కలిపి ఆవరణ అనే వాళ్ళం.  అంటే ఇప్పటి పరిభాష లో చెప్పాలంటే  ఒక గేటెడ్ కమ్యూనిటీ.  వడ్ల కొట్టు వెనకాల ఒక పెద్దబాదం చెట్టు, వడ్లకొట్టు పక్కనే పెద్ద వేప చెట్టు, కొబ్బరి, సపోటా, బూరుగు, మామిడి, జామ, ములగ, అరటి, ముద్దా మందారం, కరివేప, బంగారు గంటలు, పసుపు మందారం, నంది వర్ధనం, నిత్యమల్లె చెట్ల తో ఆవరణ లో ఎప్పుడూ పచ్చదనం తో నిత్య నూతనం గా ఉండేది. రైల్వే క్వార్టర్ దొరకని రైల్వే ఉద్యోగులంతా  ఆవరణ లో అద్దెకి ఉండేవారు.  ఈ కుటుంబాలన్నిటి తో  ఆవరణ ఎప్పుడూ చాలా సందడి గా ఉండేది.

IMG_1521

అమ్మమ్మని పిన్ని గారని, తాతయ్యని బాబాయి గారని పిలిచేవారు. పిల్లలు అమ్మమ్మగారు, తాతయ్య గారు అని పిలిచేవారు.అమ్మమ్మ,తాతయ్య  ఇద్దరూ కూడా అలాగే  universal అమ్మమ్మ తాతయ్య లాగే  ఉండేవారు. వారిద్దరికీ తెలిసినది- సాటి మనిషికి చేతనైన సహాయం చేయటం, ఉన్నంత లో సంతోషం గా నిజాయితీ తో జీవితం గడపడటం.   నాకు తెలిసి ఏ  రోజున కూడా ఇద్దరూ, ఫలానా వారికి ఆ వస్తువు  ఉంది మాకు లేదు అన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జ్ఞాపకం లేదు.   తాతయ్య  దక్షిణ మధ్య రైల్వే లో చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ గా రిటైర్ అయ్యారు.  చేసిన ఉద్యోగం అంటే ఎనలేని గౌరవం తాతయ్యకి.  ఎవరు టికెట్ తీసుకోకపోయినా జరిమానా కట్టకపోతే ఊరుకునే వారు కాదు. జరిమానా డబ్బులు కట్టలేక ప్రయాణీకుల చేతుల్లో ఉన్న బంగారం అమ్మించిన ఘటనలు ఉన్నాయి. పైన చెప్పాను కదా బిట్రగుంట వారికి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది అని.అది ఏంటంటే  బిట్రగుంట నుంచి నెల్లూరు, కావలి కి రైలు లో ప్రయాణించేవారు ఎట్టి పరిస్థితి లోను టికెట్  కొనరు.  రైలు అంటే చాలు అది బిట్రగుంట కే సొంతం అన్న ధోరణి లో ఉంటారు. అలాంటిది, ఈయన బండి లో టికెట్ చెక్ చేయటానికి వస్తున్నారు అంటే , కొంత మంది భయపడి ప్రయాణం ఆపుకునేవారు.  ఆయన రిటైర్ అయ్యాక కూడా ఆయన్ని చూసి భయపడి తప్పుకునే వారు !!  ఇక మా  అమ్మమ్మ..   అటువంటి అపురూపమైన అమ్మమ్మ ఎవరికీ ఉండదేమో అన్పిస్తుంది నాకు !!  ఇంటికి వచ్చిన ప్రతి వారినీ  ఆప్యాయం గా పలకరించడం తప్ప ఈ రోజుల్లో వినపడే ‘ఇగో’ అనే పదానికి అర్ధం తెలీదు అమ్మమ్మకి.  అమ్మమ్మ, ఆవిడ  జీవితం  గురించి చెప్పడానికి  ఒక పోస్టు చాలదు.

IMG_1540

…ఈ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న కొద్దీ , తాతయ్య తెచ్చిన మావిడిపళ్ళతో  రసం వేసి, అమ్మమ్మ కలిపి పెట్టిన కమ్మటి తీయని పెరుగన్నం లాగా ఉంటాయి. చిన్న చిన్న వాటికే పెద్ద సంతృప్తి  పొందే ఆ కమ్మటి రోజులే వేరు !!