కన్యాకుమారి

యావత్ భారతదేశం గురించి చెప్పేటప్పుడు తరచుగా మాట్లాడే మాట ‘ కాశ్మీరు నుండీ కన్యాకుమారి ‘ వరకూ అని. కన్యాకుమారి అనే ప్రదేశం భారతదేశానికి ఓ సరిహద్దు మాత్రమే కాదు. అమ్మవారు నివసించే ఓ పుణ్యక్షేత్రం కూడా. కన్యాకుమారి అమ్మవారు శివుని కోసం ఈనాడు అనబడే వివేకానంద rock మెమోరియల్ మీద తపస్సు చేసినది అని పురాణం. అమ్మవారి పాదాలు కూడా అక్కడ ఉంటాయి.

అమ్మవారు పెళ్ళి చేసుకోకుండా కన్యలాగా ఉండిపోవడానికి ఓ స్థల పురాణం/కథ ఉంది. బకంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కన్యాకుమారి అందరూ అక్కాచెల్లెళ్లు. వాళ్ళని పెళ్లిళ్లు చేసుకున్నాక శివుడు ఈవిడని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ చెప్పిన సమయానికి రాకపోవడం, ముహూర్త సమయం మించి పోవడంతో ఈవిడకి కోపం వచ్చి పెళ్ళి చేసుకోకుండా కన్యలా ఉండిపోతుంది. అంతేకాక ఆ పెళ్ళి మండపంలో ఉన్న వస్తువులని చూసి శపిస్తుంది. అందుకే అక్కడ ఇసుక రకరకాల రంగుల్లో కనిపిస్తుందని చెప్తారు.

2016 లో మేము కన్యాకుమారి వెళ్ళాము. ఆ అమ్మవారిని చూసాక గుడిలో ఏదో విగ్రహమా ఆ తల్లే అలా మనకి దర్శనం ఇస్తోందా అనేది ఆవిడని స్వయంగా దర్శనం చేసుకుంటేనే అర్ధమవుతుంది. అసలు అక్కడ నుంచీ కదలబుద్ధి కాదు. అంత అద్భుతం!!. ఈవిడ ముక్కు పుడక ఎంత మెరిసిపోతుంది అంటే నావికులకి దిక్సూచి లాగా ఉండేదిట. ఇక వివేకానంద rock మెమోరియల్. సముద్రం మధ్యలో ఉంటుంది. ఆయన ఆ సముద్రంలో ఈత కొడుతూ ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడే మూడు రోజుల పాటు ధ్యానంలో ఉండి పోయారు. అక్కడే వారికి జ్ఞానోదయం కలిగింది.

మేము వెళ్ళినపుడు హోటల్ సముద్రానికి ఎదురుగా తీసుకున్నాము. రూమ్ లో నుంచి గుడి, వివేకానంద rock మెమోరియల్, సూర్యోదయం అన్నీ కనిపిస్తాయి. పక్కనే ఓ చర్చినో ఏదో ఉంది. రాత్రి కాసేపు అయ్యేసరికి భక్తి గీతాలు మొదలు పెట్టారు. అర్ధరాత్రి వరకూ అదే తంతు. పుణ్యక్షేత్రానికి వచ్చామా ఇది వినడానికి వచ్చామా అనిపించింది. ఇదే అనుభవం కావాలంటే అమెరికాలోనే దొరుకుతుంది కదా. అక్కడిదాకా మేము ఎందుకు వెళ్లడం చెప్పండి? ఇది వేరే మతాన్ని దూషించడం కాదు. అమ్మవారి గుడి పక్కనే చర్చి ఏమిటి ? ఆ పాటలు ఏంటి ? భారత దేశంలో చర్చి అనేది కొత్తగా వచ్చింది. గుడి అంతకుముందే ఉండినదే కదా. ఇక్కడ ఇంకో మతాన్ని గౌరవించాలి అన్న ఇంగితం లేనిది ఎవరికి?

అంతకుముందు మధురలో కృష్ణుడుని చూద్దాం అని వెళ్తే ఇదే అనుభవం. పక్కన మసీదులో మైకులో ప్రార్థనలు.

ఇతర మతాల పుణ్యక్షేత్రాలలో వేరే మతాల వారు ఉంటారా ? హిందూ మతంలో పుణ్యక్షేత్రాలు అంటే భారతదేశంలోనే చూడాలి. ప్రపంచంలో ఇంకో చోట లేవు. మరి ఇంక పవిత్రత అనేది ఏముంటుంది? ఈ మాట అడిగితే ‘అన్నీ మతాలు ఒకటే. హిందువులకే ఈ మధ్య పిచ్చి పట్టి మతోన్మాదం ఎక్కువయింది’ అంటారు. ఒక పుణ్యక్షేత్రంలో ఆ దేవీదేవుళ్ళ తాలూకు ఆనవాళ్ళు మాయం అయి ఇంకేవో కనిపిస్తుంటే ఆ సంస్కృతి ఉన్నట్టా ? పోయినట్టా?

‘Rakalokam’ ఛానల్ లో కన్యాకుమారి మీద వారి వీడియో చూడండి. నా బాధ ఏంటో అర్ధమవుతుంది.

అమ్మపెట్టదు..అడుక్కోనివ్వదు..

మొన్న నాకు FB లో ఓ పోస్టు కనిపించింది. ఇస్కాన్ వారి ‘అక్షయ పాత్ర’ సంస్థ మీద.

భారతదేశం లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్ర కి కాంట్రాక్టు ఇచ్చారు. అక్షయ పాత్ర సంస్థ వారు పొద్దున్నే వేడి వేడి గా వారి అత్యాధునికమైన వారి వంటశాలలలో శుభ్రంగా వండి సమయానికి పిల్లలకి పెడతాము అని చెప్తారు. కావాల్సిన పోషకాలు, రుచి వాటికీ ప్రమాణాలు ఉన్నాయి అని చెప్తారు. ఆయా వీడియోలు కూడా వారి వెబ్సైటు లో ఉంటాయి. చూడచ్చు ఎవరైనా. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వీళ్ళకి విరాళం ఇస్తుంటుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకి అదనంగా వారి వంటశాలలకి, రవాణాకు ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ విరాళాలు ఆ అదనపు ఖర్చుకు వాడతాము అని చెప్తారు వారు. నేను విరాళం ఇద్దామని ఫోన్ చేస్తే ‘ ముందు వచ్చి మేము చేసే పని చూడండి. పొద్దున్నే రండి’ అని చెప్పారు. అంటే వారు చేసే పనిమీద వారికి నమ్మకం ఉన్నట్లే కదా!! నేను ఇస్కాన్ భక్తురాలిని కాదు. అన్నదానం చేస్తే మంచిది అన్న సదుద్దేశ్యమే. అన్నీ సంస్థల్లాగే అందులో కూడా లోపాలు ఉండవచ్చు.కాదని చెప్పను. వాదించను.

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పెట్టేసాం అంటే చాలదు కదా!! ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఎవరు వండుతారు, ఎలా వండుతారు, నాణ్యత ..ఇలా చాలా చూడాలి. నాకు తెలిసి బళ్ళలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టినపుడు, అది టీచర్లకి పెద్ద ప్రహసనం. దాని మీద కూడా చాలా కార్టూన్లు కూడా వచ్చేవి టీచర్లు వండుతున్నట్లు, లెక్కలు చూసుకుంటున్నట్లు. ఇదంతా తలనొప్పి అని కొన్నిసార్లు టీచర్లు మాకు మధ్యాహ్న భోజన పథకం వద్దు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వద్దు అంటే ఎలా? కొంత మంది పిల్లలు కేవలం ఆ తిండి కోసమే బడికి వస్తారు. మాకు తెలిసిన ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా ఉండేవారు హైద్రాబాద్ లో. ఆవిడ చెప్పేవారు, కొన్ని సార్లు పిల్లలు, ముఖ్యం గా 10 వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నప్పుడు ఆకలికి తట్టుకోలేక పోయేవారని. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం అంటూ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు. ఇలాంటి పిల్లలకోసం ప్రభుత్వం funds ఇస్తుంటే, ఆ డబ్బు నొక్కేయడం కోసం కాచుకుని కూర్చుని ఉంటారు కొందరు. కొన్ని సార్లు పదార్థాలు సరిగ్గా వండక , food poisoning తో పిల్లలు చనిపోయిన వార్తలు కూడా చూసాము. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకుంటూ శుభ్రంగా, వేడి వేడిగా, పోషకాలతో తిండి అందిస్తాం అంటూ ఈ సంస్థ ముందుకి వచ్చింది. నాకు తప్పేమీ కనిపించలేదు అందులో!!

ఈ సంస్థ గురించి FB లో ఆ పోస్టు వ్రాసినావిడ బాధ ఏంటో కొన్ని ముక్కల్లో చెప్తాను. ఎవరో ఏంటో చెప్పను. ఆవిడకి అంత కీర్తి రావడం కూడా నాకు ఇష్టం లేదు. పోస్టులో పిల్లలకి భోజనాన్ని సరి అయిన సమయానికి వేడి వేడిగా అందిస్తున్నారా లేదా, నిధులు దుర్వినియోగం చేస్తున్నారా , పాచిపోయినవి పెడుతున్నారా వంటి విషయాలు ఏమీ లేవు. గుడ్డు అనేది మెనూ లోపెట్టకుండా, ఉల్లివెల్లుల్లి లేకుండా చప్పటి శాఖాహారం మాత్రమే పెడుతున్నారూ .నచ్చక పిల్లలు పడేస్తున్నారు.బ్రాహ్మణ భోజనం పెట్టడం అవసరమా ? వచ్చేపిల్లలు కూలీల పిల్లలు. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉల్లి, వెల్లుల్లి వేసుకుని తింటారు. అటువంటప్పుడు ఇలా చప్పటి తిండి ఎలా తింటారు? అన్నం తినేటపుడు ‘హరే కృష్ణ ‘ మంత్రం పిల్లలతో తప్పనిసరిగా చెప్పిస్తున్నారు. వేరే మతాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటోంది. దళితులు వండుతుంటే పిల్లలు తినట్లేదని ప్రభుత్వాలు ‘అక్షయపాత్ర’ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారట.

ఆవిడ మాట్లాడిన మాటల్లో రెండే విషయాలు చెప్తాను..‘గుడ్డు’ ని మెనూలో పెట్టకపోవడం. ఇతర మతాల పిల్లలు కృష్ణ మంత్రం జపించడం. మాంసాహారం తినేవాడికోసం గుడ్డు పెడితే శాఖాహారం తినేవాడు ఆ రోజు ఏమి చేస్తాడు? ఇతర మతాల వాళ్ళు ఒకరో ఇద్దరో కృష్ణ మంత్రం జపిస్తే వచ్చేసిన బాధ, శాఖాహారం తినేవాడు మాంసాహారం తినలేకపోతే రాదేం? అవసరం ఉన్నచోట మైనారిటీ, అనవసరమైతే మెజారిటీనా?

రుచి నచ్చక పిల్లలు పడేస్తుంటే ఇంతపెద్ద పోస్టు వ్రాసే బదులు ‘అక్షయపాత్ర’ వారికే చెప్పచ్చు కదా?

ఈ పోస్టు చూడగానే అర్ధమయ్యింది ఏంటంటే ఈవిడది ఏదో ‘వాదం’ లేదా ‘ఇజం’ . ఏదైనా వాదించుకోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు.తప్పులేదు. కానీ ఒకరు నిర్వహిస్తున్నబాధ్యతని వేలు ఎత్తి చూపించి మాట్లాడటం ఎప్పుడు చేయవచ్చు? వాడికి అప్పగించిన బాధ్యత వాడు అస్సలు సరిగ్గా చేయకపోయినా, వాడి కంటే మనం బాగా చేయగలిగినా తప్పకుండా మాట్లాడవచ్చు. ఎక్కడ హిందూ మతం అని ఉంటే అక్కడ ఈ ‘ఇజం’ మాట్లాడేవాళ్ళకి అన్నీబాధ లొచ్చేస్తాయి. అది కూడా హిందువులకే!! వీళ్ళ బాధ ఏంటో ఎన్నటికీ అర్ధం కాదు నాకు!! ఇండియా లాంటి దేశాలు ఎప్పటికీ ‘Developing’’ దేశం గా ఉండిపోవడానికి కారణం చిన్నచిన్న విషయాలు కూడా అధిగమించకపోవడమే !! నాకు తెలిసి ఇండియా ‘Malnutrition in Children’ దేశాలలో పై స్థానాలలో ఉంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు తలవంచుకోవలసిన విషయం కదూ!!

నాకు ఈమధ్య సమయం చిక్కక పోస్టులు కూడా పెట్టడం లేదు. అటువంటిది ఇటువంటి వాటిని చదివి నాకెందుకులే అని ఊరుకోలేకపోయాను. వీళ్ళు ఎంత సంఘ సేవ చేస్తారో కానీ, చిన్నపిల్లలకి కాస్తో కూస్తో మంచి భోజనం అందజేస్తున్నారు అనుకోకుండా ఏమంత్రం చదివారు అంటూ మాట్లాడుతుంటే ఇంతకంటే మనుష్యులు ఎదగలేరా అని రోత పుడుతోంది.

కావలసినప్పుడే స్త్రీ వాదం

మూడు సార్లు విడాకుల మంత్రం జపిస్తే  శిక్ష అని, ఈ మధ్యనే చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అటువంటి  స్త్రీ వాదులం , స్త్రీ హక్కుల కోసం పోరాడతాం అని చెప్పుకునే బాజా వాయించుకునే వారి  గోడల మీద ‘ఆ విషయం’ తప్ప అన్నీ ఉంటాయి. ఒకసారి ఈ చర్చ వచ్చినపుడు ఒక స్త్రీ వాదిని అడిగాను ‘ వారి చట్టం ప్రకారం రెండు పెళ్ళిళ్ళు  సమ్మతమే కదా !! అది ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నట్లు కాదా ‘ అని. అందుకు సమాధానం ‘ హిందువులలో కూడా బోలెడు మంది రెండో పెళ్ళిళ్ళు  చేసుకుంటున్నారు.’ నేను అడిగిన దానికి సమాధానం వచ్చినట్లా రానట్లా మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడో, ఎప్పుడో స్త్రీ కి అన్యాయం జరిగి ఉన్నప్పుడు ఆ మతంలో ఇటువంటివి నియమాలు  పెట్టారేమో తెలీదు నాకు. అటువంటప్పుడు ఆ మతాన్ని తిట్టడం , స్త్రీకి హక్కులే కలిపించలేదు అనడం ఎంతవరకూ సమంజసం ? అసలు తెలిసీ తెలియని దాని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుందా?

ఇలాంటి వారి స్త్రీ వాదుల  లాజిక్కులు విని & చూసి కొంత మంది ఆడవాళ్లు చాలా తెలివితేటలతో , ఉన్న స్వేచ్ఛ సరిపోనట్లు  ,‘‘ఆడవాళ్లు వేదాలు నేర్చుకోవచ్చా? పురుష సూక్తం చదవచ్చా ? రుద్రం చదవచ్చా ? పితృకార్యం చేయచ్చా? తలకొరివి పెట్టచ్చా ‘ అని అనే ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నిజంగా, కొన్ని ప్రశ్నలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారినే అడగటం చూసాను. ప్రశ్నలు అడగండీ అంటే వీరికి దొరికిందే ఛాన్సు!! ఎవరిని ఏ ప్రశ్నలు వేయాలో అర్ధం కాదు వీళ్ళకి అనిపించింది.  కొన్ని పనులు ఆడవారు, కొన్ని పనులు మగవారు చేయాలనీ చెబుతారు. చెప్పినపని చేయకుండా వద్దన్న పని చేయాలనుకోవడం వితండ వాదన కాకపోతే ఏంటి ?

ఇప్పుడు శబరిమల గురించి స్త్రీలు పెద్ద విజయం సాధించినట్లా ? దేశంలో ఉన్న గుడులు చూడటానికి సమయం లేదు.  శబరిమల ఒక్కటీ చూసి జన్మ సాఫల్యం చేసుకుంటారు కాబోలు పాపం!! అయ్యప్ప స్వామిని నమ్మే స్త్రీలు, ఆయన కథని కూడా నమ్ముతారు. ఆ కథని  నమ్మేవారు సుప్రీంకోర్టు కాదు కదా ఎవరు దిగి వచ్చి చెప్పినా ఆ ఆలయంలోకి అడుగుపెట్టరు.

అయ్యప్ప గుళ్లో స్త్రీలకి అనుమతి గురించి పోరాడే వాళ్ళని చూస్తే ఎంత  హాస్యాస్పదం గా అనిపిస్తుందంటే సగం మంది ‘నాస్తికులం’ అంటారు !! మరి ఏ దేవుడికి ఏం చేస్తే వీళ్ళకెందుకు ?? పురాణాలని ఆధారం చేసుకుని స్త్రీలని భారత దేశంలో హింసించారుట !! అందుకని వీళ్ళకి చాలా బాధ పాపం!! పదేళ్ళ  క్రితం ఏం జరిగిందో తెలీదు, గుర్తుండదు. వేలఏళ్ళక్రితం జరిగిన విషయాలు మాత్రం కళ్ళకి కట్టినట్లే చెప్తారు. మరి టైం మెషిన్ ఉందేమో వాళ్ళ దగ్గర 🙂

సనాతనధర్మంలో అసలు ఆడవారు  మోక్షాన్ని పొందటానికి మార్గమే సూచించలేదని, వివక్ష చూపించటానికి ఈ మధ్య ఒకచోట వాదన – ముఖ్యంగా విధవరాలైన స్త్రీలకి, పెళ్లిళ్లు కానీ స్త్రీలకి  !! ‘ధర్మం అనేది ఎప్పుడూ మారుతుంది దేశకాలాలతో’ అని అర్ధం చేసుకునేవారికి ఏ ధర్మం & శాస్త్రం బోధించనక్కరలేదన్నసంగతి ఎంత కాలానికి బోధపడుతుందో నాకైతే అర్ధం కాదు. ఉదాహరణ చెప్తాను. భర్త చనిపోతే, కొడుకులు లేనందున అల్లుడిని మావగారికి తలకొరివి పెట్టమని అడిగిందట ఓ మహా ఇల్లాలు. ఆ అల్లుడు తలకొరివి పెట్టి, పెట్టినందుకుగాను ఉంటున్న ఇల్లు కూడా ఖాళీ చేసి మొత్తం ఆస్థి నా పేరుమీద వ్రాస్తావా లేదా అని అత్తగారి నెత్తిన  కూర్చున్నాడట. అలాంటప్పుడు శాస్త్రం చెప్పినది ఆచరించక్కర్లేదు అంటాను నేనైతే!! ఆవిడే భర్తకి తల కొరివి పెట్టవల్సిందేమో అనుకున్నాను కూడా !!

నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంత మంది వ్యక్తులు పని కట్టుకుని సమాజాన్ని, ఎప్పుడూ  ఏదో విధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ,వాదోపవాదనలు చేయడం, తెలిసీ తెలియని మనుష్యుల మనస్సుల లో విషపు బీజాలు నాటడం  చేస్తున్నారు. దాని వలన ఇటువంటి ఫలితాలు!! అంత క్రితం ఒకసారి చెప్పాను కదా , ఒకాయన స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తూనే రావణాసురుడు తప్పేమి చేయలేదు అన్నట్లు మాట్లాడారు.   శ్రీరామ నవమి రోజు రాముడిని తిట్టడం సరిపోతుంది వీళ్ళకి. వినాయక చవితి రోజు మాత్రమే నీళ్ల కాలుష్యం, శబ్ద కాలుష్యం గుర్తొస్తుంది వీళ్ళకి. దీపావళి కి సరేసరి !! పొగ కాలుష్యం ఉండనే ఉంది !! ఆ మధ్య గోవు మాంసం నిషేధం జరిగినపుడు కొంతమంది ఏకంగా కథలే వ్రాసేసారు. ఇంత కథలు వ్రాసినవారు , ప్రతి పండగకి  ఏదో ఒకటి పోస్టు చేసేవారు, అన్యమతానికి వచ్చేసరికి నోరు మెదపరు. మరి భయమా ? గౌరవమా ? వేరేమతాలని ఆగౌరవపర్చాలి, అవమానించాలి అని నేను అనడం లేదు. ఏ మతంలో పద్ధతి ఆ పద్ధతి ఉంటుంది. ఆ నమ్మకాలని గౌరవించాలి. మనం కోరుకున్న మార్పు చట్టాలతో వస్తోందా ? . ఒక మనిషి ఇంకొక మనిషి మీద గౌరవ మర్యాదలు ఇవ్వటానికి చట్టాలు ఎంత వరకూ పనిచేస్తాయి ?  ‘sensitivity’ అనేది ఒకటి ఉంటుంది. అది లేకపోతే ఏ చట్టము ఏమీ చేయలేదు.

‘సీత శీలాన్ని అనుమానించడం, నిండు గర్భిణిని అడవులకు తోలడం …ఇవి మన పిల్లలకు నేర్పిద్దామా? ‘

ఈ మధ్య వచ్చిన  ‘కాలా’ చలనచిత్రం గురించిన ఒక వాదనలో,  రావణుడుని సమర్థిస్తూ ‘రావణుడు తప్పు చేసాడు. అయినా పీడిత జనుల కోసం పోట్లాడాడు’ అన్నారు ఒకరు.  ‘అయితే రావణాసురుడి గురించి పిల్లలకి నేర్పుదామా ‘ అన్న నా ప్రశ్న కి సమాధానంగా ఇంకో ప్రశ్న వేశారు. ఇది వారికే కాదు. సామాన్య మానవులకి కూడా వచ్చే సందేహం.

ఈ పోస్ట్ రామాయణం మీద వితండవాదన చేసేవారికి మాత్రం కాదు. రామాయణం ఎంత సహృదయం తో  విన్నా, వితండవాదన చేసేవారి వాదనలు విని సామాన్యులకి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సామాన్యుల కోసమే ఈ టపా. ఎవర్నీ  నమ్మించాలన్న ఆతృత నాకేమాత్రం లేదు. నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు. వితండవాదన కోసం వ్యాఖ్యలు చేస్తే అవి ప్రచురించను. రాముడి మీద వాదోపవాదాలు చేయడానికి ఎంతటి వారం మనం ?

ఇవన్నీ నా ఆలోచనలు మాత్రమే. రామాయణంని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటే నన్ను క్షమించండి _/\_

దశరథుడు రాముడిని పిలిచి ‘పొద్దుటే నీ పట్టాభిషేకం’ అన్నాడు. అలా చెప్పిన  కాసేపటికే ‘మీ నాన్నగారు నాకు మాటిచ్చారు నువ్వు అడవులకి వెళ్ళాలి ’ అని కైకేయి చెప్పింది.  రాముడు తనకి పట్టాభిషేకం చేస్తానన్నపుడు ఒకేలా ఉన్నాడు. రాజ్యం నీకు కాదు అన్నపుడు ఒకేలా ఉన్నాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషయం. రామాయణం ఏదో  కథగా వింటూ రాముడు దేవుడు అనుకుంటే పెద్ద ప్రభావం ఉండదు మనకి. మన నిజజీవితంలో ఆ విధంగా ఉండటం అంత సులభమేం కాదు. ఈ చిన్న ఉదాహరణ ఆయనకి రాజ్యకాంక్ష లేదు అని చెప్తోంది. అంత రాజ్యకాంక్ష ఉన్నవాడైతే ఆ రోజే తండ్రిగారి మీద తిరగబడి లాక్కునే వాడే కదా ?

మరి వనవాసం నుంచీ వచ్చాక పట్టాభిషేకం చేసుకున్నాడు!! ఎందుకు ?

రాముడు వనవాసంలో ఉండగా   భరతుడు వచ్చాడు. రాముడి పాదుకలు పట్టుకెళ్ళి , తాను నందిగ్రామంలో ఉన్నాడు. తనకి రాజ్యం వద్దు గాక వద్దు అన్నాడు.

యుద్ధం ముగిసాక , సీతాదేవిని అందరి ముందర పిలిచి చెప్పాడు.అప్పుడే సీతాదేవి ఎన్ని అడగాలో అన్నీ అడిగిందట ఆయనని.  అగ్నిప్రవేశం చేయమని రాముడు అడగలేదు. కానీ ఆవిడ అగ్నిప్రవేశం చేస్తుంటే అడ్డుకొనలేదు కూడా. ఎందుకలా ??

భరతుడు రాజ్యం తీసుకోడు. ప్రజలందరూ రాముడికే  ఓటు వేశారు. కాబట్టి ఆయనే రాజు అవుతాడు. రాముడు అయోధ్య చేరిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన  ఏకపత్నీ వ్రతుడు. కాబట్టి సీతాదేవి పక్కన ఉండాలి. కాబోయే పట్టపురాణిని ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనకూడదు అనేది ఆయన  ఉద్దేశ్యం. అది avoid చేయడానికి లంకలోనే ఈ తంతు జరిగింది.

ఇంత చేసాడు కదా మరి ఎందుకు పరిత్యజించాడు ? ఒక్కరెవరో అన్నమాటకే  అలా వదిలిపెట్టేయాలా ? (అసలు ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలోని లేదు. ‘లవకుశ’ సినిమా చూసి అందరం మాట్లాడేవారమే !!)

ఈ రోజుల్లో మంత్రులకి గెలవాలి, ఆకుర్చీలో కూర్చోవాలి అన్న తపనే కానీ, 100 మందిలో 90 మంది ఓటు  వేస్తే 10 మందికి ఓటు ఎందుకు వేయలేదు అన్న సంగతి ఆలోచించరు . ఆ పది మంది గురించి ఆలోచించేవాడే రాముడు. 100% perfect  గా ఉండాలి ఆయనకి. అందుకే అది రామరాజ్యం అయింది.

విముక్త కథలలో అనుకుంటాను. రచయిత్రి ‘రాముడు ఆర్యుడు . రాజ్యదాహం అందుకే’ అని వ్రాసారు. ఒక ఆర్మీ ఆఫీసర్, fire  fighter , పోలీస్ ఆఫీసర్ మా కుటుంబాలే మాకు ముఖ్యం అనుకుంటే ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తారు? అలాగే ఒక రాజుకి భార్య ముఖ్యమా? రాజ్యం  ముఖ్యమా ? భార్య కోసం రాజ్యం వదులుకుంటే ఆ రాజుని ఈ రోజుకి కూడా ఎందుకు గుర్తుంచుకుంటాము?

రాజు కదా ఆ విధంగా సీతని అన్నవాడిని  శిక్షించచ్చు . Sadhguru గారు ఈ మధ్య కవిత గారి ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పారు. ప్రతి నేరానికి శిక్షలు, చట్టాలు అంటూ పోతే అవేమి ఆడదానికి సహాయం చేయవు. మనుష్యులలో  ‘Sensitivity’ ని develop చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని. రాముడు ఇక్కడ చేసింది అదే!!

రాముడు సీత అనుమానించడం, అవమానించడం ఏమీ  చేయలేదు. రంధ్రాన్వేషణ చేసేది మనము. ‘మోడీ భార్య ఏం  చేస్తోంది ? ట్రంప్ గారికి ఎంత మంది భార్యలు? ఒబామా గారి భార్య వేసుకున్న బట్టలేంటి ? లేడీ డయానా గారు భర్తని వదిలేసి ఎవరితో కారులో వెళుతున్నారు ?వెంటబడి పీక్కుతిందామా ? చిరంజీవి కూతురు రెండో పెళ్లి బాగా జరిగిందా ?రేణు దేశాయ్ గారు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నారు? ’  ఇలాంటివి మనకి కావాలి. ఆ లేకితనాన్ని ఖండించలేక, చేతగాక రాముడిని నిందిస్తున్నాము.

అసలు ఇవన్నీ కాదు. రాముడు విప్లవాత్మకంగా ఆలోచించి అవన్నీ  పట్టించుకోకూడదు అంటారా ? రాముడు మామూలు మానవుడిగా బ్రతికుదామని అనుకున్నాడు. అది గుర్తుంచుకోవాలి.  ‘అవతల వాళ్ళు ఏమి అన్నా పట్టించుకోకూడదు’ అనుకుంటాము. అది అంత సులభమా ? మనం పట్టించుకోకపోయినా పట్టించుకునేలా చేస్తుంది సమాజం. రాముడు ఏవి పట్టించుకోకుండా ఉండలేడు. ఎందుకంటే సీతాదేవి మీద ఉన్న అనురాగం అటువంటిది.

రాముడికి వచ్చింది పెద్ద ధర్మ సంకటం. ఆరోజుకి  ఏది ధర్మమో అదే చేసాడు ఆయన . రాముడు ధర్మం తప్పితే ఆయన  గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

కాబట్టి రాముడిని తప్పు పట్టడం మానేసి సీతని నింద  చేసిన వాడి గురించి పిల్లలకి నేర్పించి ఆలోచింపజేయండి. వాడికీ  మనకీ తేడా ఉండాలి కదా ??

ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!

నిన్నటికి మొన్న,  144 మంది ప్రయాణీస్తున్న విమానం. ఆకాశంలోకి  ఎగరగానే ఒక్క సారిగా engine failure. ఎంతో నైపుణ్యంతో ఏ మాత్రం తొణకకుండా  ఆ పైలట్ 143 మందిని యమలోకం నుండి భూలోకానికి చేర్చింది. కిటికీ అద్దం విరిగి, తోటి ప్రయాణీకురాలు  శరీరం సగం విమానం బయటికి వెళ్ళిపోతే, ఆవిడ ప్రాణాలు కాపాడాలని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలి లాగారు cowboy  టోపీ పెట్టుకున్న ఒక హీరో. ఇంకో ఇద్దరు ఆవిడకి ఊపిరిపోసి ప్రాణం కాపాడదాం అనుకున్నారు. ‘అంత నైపుణ్యంగల పైలట్ ఉన్న విమానంలో  ఉండటం వలన బ్రతికాం, లేకపోతే మా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిన రోజు కదా ‘ అనుకుంటున్నారు 143 మంది. ఊపిరిపోసినా ప్రాణాలు నిలువలేదు 144-143 =1 ఒకరికి.  ఎలా జరిగింది అంటే చెప్పగలమేమో కానీ ఎందుకు జరిగింది అన్న ప్రశ్న కి సమాధానం ఎవరు చెబుతారు?

జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే’ నిజం కాదా ? కాదనే వారున్నారు 🙂

అటువంటి వారి కోసమే ఎప్పుడో ఉగాది తర్వాత  వ్రాసుకున్న ఒక టపా ఇప్పుడు పోస్టు చేస్తున్నాను:

‘ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!’అంటూ  ఈ మధ్య  హేతువాదుల  గోల ఎక్కువయింది. పుస్తకాలు, ఫేస్బుక్  గోడలు, జాతకాల గురించి, పూజల గురించి ఎడ తెరపి లేకుండా అన్నీ సైన్స్ తోటే సాధ్యం అంటూ టీవిలో వాదనలు!! పండగల రోజుల్లో కూడా పొద్దున్నే టీవీల్లో ప్రత్యక్షమవుతున్నారట !! ఈ మధ్య జనాలకి  డబ్బులు ఎక్కువయ్యి పూజలు, మూఢభక్తి హెచ్చి వేలంవెర్రి ఎక్కువయ్యింది అని ఒప్పుకుంటాను. మూఢ నమ్మకాల గురించి తెలియజెప్పడం మంచిదే అంటాను. కానీ మూఢనమ్మకాలు తీసివేయడం దేవుడెరుగు 🙂 వెర్రిమొర్రి  వితండవాదన చేసి జనాల్లో ఉన్న కాస్త పాపభీతి అనేది కూడా లేకుండా చేస్తూ, సర్వమంగళం పాడిస్తున్నారు ఈ హేతువాదులు. కొండ నాలుకకు మందువేస్తే, ఉన్న నాలుక ఊడిందట!! వాళ్ళు చెప్పిందే అందరూ నమ్మి హేతువాదుల్లాగా మారిపోవాలనుకుంతున్నారో ఏంటో మరి!!  మొత్తానికి మతమార్పిడి చేసే గురువుల కంటే చాలా విసిగిస్తున్నారు అనిపిస్తోంది. ఎవరి నమ్మకాలు వారివి. ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించినంతకాలం ఎవరు ఏ సంప్రదాయాన్ని నమ్మినా తప్పులేదు. కానీ ఇంకొకరి నమ్మకాన్ని హేళన చేయటం, ‘నాన్సెన్స్’ అనే మాట  అనటమూ చూసాక ఓ టపా వ్రాయాలి అనిపించింది.

‘దేవుడనే వాడే లేడు. ఎవ్వరూ  చూడలేదు. ఉంటే చూపించండీ ‘ 

‘పూర్వజన్మలు , పాపాలు , పుణ్యాలు, మోక్షము  ఇవన్నీ చెత్త మాటలు. మనిషిని ఆకర్షించడానికి ఇవన్నీ చెప్పి పిచ్చి వాళ్ళని చేస్తారు’

ఈ రోజుల్లో టీవీలు, అంతర్జాలం, ముఖపుస్తకం , వాట్సాప్ వచ్చేసి అందరం  అన్నీ బోధిస్తూ మాట్లాడేస్తున్నాం కానీ, పూర్వం ఇవేమి ఉండేవి కాదు కదా !! మరి ఒక సామాన్యుడికి మంచేదో చెడేదో బోధిస్తూ వాడికి ఎటువంటి విపత్తు వచ్చినా  దాన్ని ఎదుర్కొని మనోధైర్యాన్ని ఇచ్చి, తిరిగి సమాజంలో జీవించేలా చేయడానికి ఏమిటి మార్గం ? ఈ రోజుల్లోలాగా వాడికి కౌన్సిలింగ్ అంటూ గంటకి $150 అంటే వారి పరిస్థితి ఏమయిపోవాలి?  

వేరే మతాల గురించి నాకు తెలీదు. వాటి గురించి మాట్లాడను. నాకు తెలిసినదే మాట్లాడతాను.  

సనాతనధర్మం /వేదాంతం/తత్వబోధ/ హిందూమతం  తీసుకుంటే, సమాజం లో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పరిస్థితిని ఆలోచించి ఎన్ని తత్వబోధలు చేసారో వింటుంటే ఆశ్చర్యం అన్పిస్తుంది. ఒక కౌన్సిలర్ కూడా అన్ని విషయాలు చెబుతాడా అనేది సందేహమే !! ఈ concept  చూస్తే → ఈ శరీరం శాశ్వతం కాదు. చేసిన పాపపుణ్యాల బట్టి మోక్షప్రాప్తి లేకపోతే ఇంకో జన్మ. హేతువాదులు చెప్పినట్లు ఇది అబద్ధమే ట్రాష్ అనుకున్నా, తెలుసుకోవలసిన ఒక్క నిజం ఖచ్చితంగా చెప్తుంది శాస్త్రం.  ఒక మనిషికి ఆయుష్షు నూరేళ్ళు.అంటే ఆ నూరేళ్నూ బ్రతకడు కదా? ఓ ఎనభై ఏళ్ళు. ఆ ఎనభై తర్వాత తాను సున్నా అనుకోడు. కానీ తానెప్పుడూ భూమి మీద ఉండేవాడినే అనుకుంటూ ఉంటాడు. అందుకే నువ్వెప్పుడూ temporary వాడివేరా అని గుర్తుచేస్తుంటుంది  వేదాంతం. ఇవి వినీ వినీ ఒక మనిషికి తన శరీరం శాశ్వతం కాదు అనే వైరాగ్యం వస్తే చాలు, మంచి పనులు తప్ప చెడు పనులు చేయడానికి మనసు ఊరుకోదు. అలా కొంత కాకపోతే కొంతైనా introspection మొదలవుతుంది. ఫలానా పాపం చేస్తే వచ్చే జన్మ లో పిల్లిలానో/ బల్లిలానో  పుడతావు అంటే ఒక సామాన్యుడు నమ్మి ఉండవచ్చు. ఆ భయం ఉండేది కాబట్టి ఎప్పుడూ నిజాయితీ/ సద్బుద్ధి/నీతి/నియమాల తో ఉండేవాడు. పాపాలు అంటే ఉదాహరణలు చూస్తే : తల్లితండ్రుల మాట వినకపోతే పాపం, పెద్దలని గౌరవించకపోతే పాపం, హత్య చేస్తే పాపం, ఆత్మహత్య మహాపాపం, మాటలతో హింసిస్తే పాపం, చీమని చంపినా పాపం, చివరికి అసురసంధ్య వేళ  చెట్టుని ముట్టుకున్నా పాపం. బ్రతికి ఉన్నన్నాళ్ళూ మంచి పనులే చేయి అని చెప్పడం ఈ ముఖ్య ఉద్దేశ్యం. అలా కొద్దో గొప్పో పాపభీతి ఉన్నమనిషికి రొజూ టీవిలో యాంకర్ పక్కన కూర్చుని ‘ పాపం లేదు పుణ్యం లేదు. అంతా నాన్సెన్స్ ‘ చెబుతుంటే అంటే ఏమవుతుంది?

ఇక  ‘పూర్వజన్మ సుకృతం’ – ఈ మాట అంటే హేతువాదులకి ఎంత కోపమో  🙂

జబ్బు వలనో, ప్రమాదం వలనో , ఇంక దేని వలన కానీ  మృత్యువు సంభవించి కుటుంబసభ్యులని కోల్పోయిన వారికి ఏ కౌన్సిలింగ్ ఇస్తే వారి బాధ మాయమవుతుంది?  వారిని రోజు వేధించే ప్రశ్న ఒకటి ఉంటుంది. ‘నాకే ఎందుకు ఈ బాధ ?’ ‘why only me ?’. ఈ మధ్యఎవరైనా చనిపోతే  తరచుగా చూసే వ్యాఖ్య – ‘RIP. I Pray God to give enough strength to their family members’. నిజమే. అందరూ ప్రార్థిస్తారు  వారి కోసం. కానీ ‘దేవుడు’ అనే నమ్మకం కూడా కోల్పోయిన పరిస్థితి లో ఉంటారు వారి కుటుంబ సభ్యులు. అప్పుడు ఏమి చెప్పగలము? అటువంటి విపత్కర పరిస్థితులు  ఎదురైన వారికి, ‘అందరికీ అన్నీ ఉన్నాయి. నేను మాత్రమే చాలా కోల్పోయాను’ అన్న భావన తో విరక్తి కలిగి, సమాజం అంటే ఒక రకమైన ఏవగింపు, తెలియని కసి మొదలవుతుంది. ఆ ప్రభావం ఎప్పుడో ఎక్కడో  చూపించడం మొదలవుతుంది. అది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అటువంటి పరిస్థితులకే ‘ఏదో జన్మ లో పాపం. ఈ జన్మ లో వారి నుదుటి వ్రాత ’ అన్న కర్మసిద్ధాంతము & జన్మజన్మల వృత్తాంతాల కథలు, గాధలు  వచ్చాయి అనిపిస్తుంది. ఆ మాట నిజంగా పాపం చేసారనా ?? ఎంత మాత్రం కాదు. కేవలం అంత బాధ లో ఉన్న మనిషి డిప్రెషన్ లో కొనసాగకుండా, ’పోయిన జన్మలో ఏదో పాపం వలన ఇలా అయింది. పోనీ ఈ జన్మ లో అయినా దాన్ని రూపుమాపేలా చేసుకుందాం’ అనే నిర్ధారణ కి వచ్చి తిరిగి సర్దుకుని సమాజజీవనంలోకి ప్రవేశించేందుకు ఈ అస్త్రం!!  ఏ సిద్ధాంతాలయినా బ్రతికి ఉన్న మనిషికే కానీ చనిపోయిన వారికి కాదు అన్న సంగతి అందరికీ తెలుసు ఒక్క ఈ హేతువాదులకి తప్ప 🙂

దేవుడి పూజ చేస్తే పాపాలు పోతాయా ? రావణాసురుడు వేదం చదువుకున్నాడు. ప్రొద్దున్నే లేచి పూజలు కూడా ‘ శాస్త్రోక్తముగా  వేకువనే విధులన్నీ యొనర్చెను’ అని చెప్పారు. పూజ చేసాడుగా రావణాసురుడు? మరి పాపాలన్నీ హరించుకుపోవాలి కదా ?  పూజ చేసుకుంటున్నంత సేపు  ‘మదోత్కటుడై మదనతాపమున మరిమరి సీతను మదిలో నెంచెను’ అని కూడా చెప్పారు. !!

ఏది పుణ్యం? ఏది పాపం ?  మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకోవడమే పాపపుణ్యాలు  !! just an introspective!! చిత్తశుద్ధి తో చేసే పని తో స్వర్గం కనిపిస్తుంది !! చిత్తశుద్ధి లేకపోతే అనుక్షణం నరకమే కనిపిస్తుంది  !!

‘దేవుడు ఉంటే  కనిపిస్తాడు గా. లేనే లేడు . physical గా కనిపించనిదే  ఎలా నమ్ముతాం?’ . తన జీవితంలో రోజులు గడిచిపోతుంటే కాళికాదేవి కనిపించట్లేదని రామకృష్ణ పరమహంస  పొర్లి పొర్లి ఏడ్చారట. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడా అందరికీ ? ఏమో చెప్పలేము హేతువాదులకి కనిపించినా కనిపించచ్చు కూడా . ప్రహ్లాదుడు పుట్టినప్పటినుండీ ఆయననే తలచుకున్నా, ఆయనకి  కనిపించని వాడు హిరణ్యకశిపుడు అడగగానే ఒక్క ‘దెబ్బ’ కి కనిపించాడుగా !!

హేతువాదులూ , మీరు పూజలు చేయనక్కర్లలేదు. దేవుడిని నమ్మనక్కర్లలేదు.  దేవుడు లేడని నమ్మించనక్కర్లేదు. చెట్టు కొమ్మకి చీడ పట్టిందని చెట్టుని వేర్లతో మాత్రం  పీకేయకండి బాబు!!

Science gives knowledge, but not wisdom!!!

పురాణాలూ – వక్ర భాష్యాలు

ఈ టపా పురాణాల్ని గురించి  వక్రం గా మాట్లాడేవారికి మాత్రమే 🙂

ఈ రోజు ముఖపుస్తకం లో ఒక పోస్టు నా ఖర్మ కాలి  నా కళ్ళబడ్డది ‘రాముడికి మగపిల్లలు, కృష్ణుడికి మగపిల్లలు  శివుడికి మగపిల్లలే ఉన్నారు. అంతా పితృస్వామ్యం , పురుషాధిక్యత’. మొన్న ఎక్కడో ఇంకోటి ‘కృష్ణుడు దేవుడు కాబట్టి తప్పు చేసినా ఒప్పే అని చూపించేస్తారు భారతం లో ’ .  నా ఖర్మో ఏంటో మరి నాకే కన్పిస్తాయో తలా తోకా లేని పోస్టులు. శ్రీరామ నవమి రోజు కన్పించిన పోస్టులు ఇదిగో ఇలాంటివి    – ‘రాముడు బక్కగా ఉండేవాడు, ఇప్పుడు క్రూరం గా ఉన్నాడు’ .’శూర్పణఖ ముక్కు కోసారు’ . ‘భార్యని అడవుల పాలు చేసాడు’ ‘అగ్ని లో దూకమన్నాడు ‘. ‘బ్రాహ్మణుడి కోసం శంభూకుడి ని చంపాడు’ .ఈ రోజుల్లో ఎంత మందికి సంస్కృతం అర్ధం చేసుకోవడం వచ్చు? పోనీ కనీసం ఓ తెలుగు పద్యం చదవగానే తడుముకోకుండా  అర్ధం చెప్పగలరా? అంతెందుకు ఒక త్యాగరాజ కీర్తన అర్ధం చేసుకోలేరు కొంతమంది. అసలు, అత్యంత  సులువుగా ఉండే తెలుగు కథలనే చదవటం ఆపేస్తున్నరోజులు మొదలయ్యాయి. అటువంటిది ఏం తెలుసు అని  ఒక గ్రంధం గురించి మాట్లాడుతారు?  ఏం  తెలుసు అని ఒక సంస్కృతిని దుమ్మెత్తి పోస్తారు?

ఊర్మిళ నిద్ర వృత్తాంతం, రాముడు సీతని అడవులలో వదిలిపెట్టడం  అసలు వాల్మీకి రామాయణం లో  లేనే లేవని ఎంతమందికి తెలుసు? సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండ లో  ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు.  చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను. 

తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసిన ఆంధ్రమహాభారతం లో ఒక్క ద్రోణపర్వం మాత్రమే 840 పేజీలు ఉంది.(ఈ ద్రోణపర్వం లో ఎన్ని పేజీలు చదవటం  సులభమో  తెలీదు కానీ ద్రోణుడిని విమర్శించడం చాలా తేలిక కొంత మందికి.) ఇక ఈ లెక్కన మొత్తం భారతం ఎన్ని పేజీలుంటుందో ఆలోచించండి. ఆఫీసులో పని చేసి, ఇంట్లో పనులని , పిల్లల బాధ్యతలు  చూసుకుంటూ  ఉండే నావంటి ఒక సగటు వ్యక్తి ద్రోణపర్వం వంటి పుస్తకాలు  ఎన్ని చదవగలడు/దు ? రామాయణం, మహాభారతం , భాగవతం క్షుణ్ణంగా చదవటానికి  ఒక జీవితకాలం సరిపోదు.  అవునా ?  మరి దేనిని ఆధారంగా చేసుకుని మాట్లాడతారు ? ఓ మూడు గంటల సినిమా చూసి, ఓ లెఫ్టిస్ట్  వ్రాసిన పుస్తకం చదివో  అర్ధం పర్ధం లేని థియరీలు అల్లేయటం మర్యాదస్తులకి మంచిపద్ధతేనా !!  తందానా అంటూ వీరికి వేలిముద్రలు, వ్యాఖ్యలు చేసేవారుంటారు. ఇంకో ‘very sophisticated’ పిచ్చి జాడ్యం ఏంటంటే పురాణాలూ ఇంగ్లీష్ లో చదివి పిచ్చి ప్రేలాపనలు చేయడం!!. వీరితో అత్యంతప్రమాదం అసలు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ  నిజాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు అవతలవారు  కూడా.

పురాణాలన్నా, ప్రవచనాలన్నా  చదివి/విని తీరాలి & తప్పదు  అన్న నియమం ఏది లేదు. (డెమోక్రసీ అన్న పదం వేరే మతాల్లో ఉందో  లేదో నాకు  తెలీదు కానీ ఆ రోజుల్లో సనాతన ధర్మానికి మాత్రం ఉండేది అని ఖచ్చితంగా చెప్పచ్చు). చదవక/వినక పోయినావలన నష్టం ఎవరికీ లేదు. కానీ –  ఒక సంస్కృతి గురించి  ఒక  పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేటపుడు  original చదివి విమర్శించండి. పూర్తిగా తెలియని వాటి గురించి  మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదు. వ్యాసుల వారు, వాల్మీకి  వారు వారి పుస్తకాల మీద కాపీ రైట్స్ అందరికి ఇచ్చి వెళ్ళింది వాటిల్లో మంచిని చూడమని . అంతే కానీ వక్రభాష్యం చెప్పమని మాత్రం  కాదండీ !!