పెర్ల్ హార్బర్ పర్యటన

“టోర్నమెంట్ పెర్ల్ హార్బర్ రోజు కాదు ఎనిమిదో తారీఖున” అన్నాడు లారెన్స్, మా అమ్మాయి లెగో లీగ్ కి కోచ్. డిసెంబర్ ఏడో  తారీఖు అనటానికి బదులు పెర్ల్ హార్బర్ రోజు అని చెప్పడం విని చాలా ఆశ్చర్యపోయాను అతను చెప్పిన విధానానికి. ‘ఆ రోజు  ఎంత బాగా గుర్తుంది ఇతనికి’ అని మనసులో అనుకున్నాను.  పెర్ల్ హార్బర్ రోజు – లారెన్స్ లాగా చాలా మంది అమెరికన్ల కి మర్చిపోలేని రోజు.  రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్  అమెరికా హవాయిరాష్ట్రం  లోని పెర్ల్ హార్బర్ మీద  దాడి జరిపి భీభత్సం సృష్టించిన  రోజు.

IMG_0723

అమెరికా వారి Naval  station అయిన పెర్ల్ హార్బర్ –  హోనులులు  నగర సమీపం లోనే ఉన్నది.  మేము  ఈ పెర్ల్ హార్బర్  లో  దాదాపు నాలుగు  గంటలు గడిపాము. ఈ  ప్రదేశం లో USS Arizona స్మారకము,  Mighty Mo/USS Missouri  అనబడే  యుద్ధ నౌక స్మారకము, USS Oklahoma  స్మారకము,  USS Bowfin Submarine అనే  మ్యూజియం మొదలైనవి చూసాము.

USS Arizona అంటే –  డిసెంబర్ 7 ,1941 రోజున  జపాన్ వారు జరిపిన దాడి లో చిన్నాభిన్నమైన  ఒక యుద్ధ నౌక.  USS Arizona స్మారకము అంటే – ఆ దాడి  లో ఆ నౌక లో మరణించిన దాదాపు 1200 యుద్ధ వీరుల కోసం నీటి లో కట్టిన ఒక స్మారకము.   ఈ USS Arizona స్మారకమును చూడడానికి  యాత్రికులను  ఒక పడవ లో తీసుకువెళ్తారు. యాత్రికులు పడవ ఎక్కవలసిన నిర్దిష్ట సమయం వారికి  ఇచ్చిన టికెట్టు మీద ఉంటుంది. ఈ పడవ  ఎక్కేముందు మనకి ఒక 23 నిమిషాల చిన్న డాక్యుమెంటరీ చూపిస్తారు. ఆ చిత్రం లో  జపాన్ వారు ఎందుకు దాడి  చేసారు, ఏ  విధం గా  యుద్ధ నౌకలను మట్టు పెట్టారు, సాక్షుల కథనాలు  చూపిస్తారు. ఆ చలనచిత్రం చూసిన తరువాత గుండె బాధ తో బరువెక్కి పోయింది. నీటి లో తేలియాడుతూ , 75 ఏళ్ల  తరువాత  కూడా కూలిన ఓడ నుంచి  చమురు ఓడుతూ ఆ స్మారకం చుట్టూ  ఉన్న ఆ యుద్ధ నౌక శకలాలని చూసాక మరీను!!

Mighty Mo/USS Missouri  ఒక యుద్ధ నౌక/మ్యూజియం.  జపాన్ వారు లొంగి పోయినప్పుడు ఈ నౌక లోనే వ్రాత పూర్వకం గా ఒప్పందం జరిగింది.  ఒక విధం గా రెండవ ప్రపంచ యుద్ధం అధికారం గా  ముగిసిన స్థలం అని చెప్పవచ్చు. ఆ రోజున వాడిన కలములు (Pens) కూడా ప్రదర్శన గా ఉంచారు.  నౌక అంతా తిరిగి  చూసాక ఆ రోజుల్లోనే  అమెరికా వారు ఎంత  సాంకేతిక పరిజ్ఞానం వాడారా  అన్పించింది. ఈ  యుద్ధ నౌక ని కొరియా, గల్ఫ్ యుద్ధాలలో కూడా ఉపయోగించారుట.  

ఇవి చూడటం అన్నీ ఒక ఎత్తయితే, ఆ  రోజు పొద్దున్నే యుద్ధం చూసిన  ఒక సాక్షి ప్రత్యక్షం గా మనతో మాట్లాడటం ఒక ఎత్తు.. ఒక  93 ఏళ్ళ  Veteran ఒకరు చక్రాల బండి లో, అంత మండుటెండ లో తను ఆనాడు చూసింది చెప్పారు. ఆయన  మా పిల్లలు వేసిన  ప్రశ్నలకి సమాధానాలు చెప్పి,  వారి బడులలో పంచమని కొన్ని కరపత్రాలు కూడా ఇచ్చారు.  ఆ వయసు లో ఆయన దేశభక్తి చూస్తే చెయ్యెత్తి నమస్కరించాలి అన్పించింది మాకు. ఈ కధనాలు  విన్నాక  యుద్ధం అంటే ఏంటో దగ్గరినుంచి  చూస్తున్నట్లు అన్పించింది.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఈ ప్రదేశం చూసి వచ్చిన తరువాత – అమెరికా వారు జపాన్ పై అణు బాంబు లతో చేసిన దాడి అనివార్యమేమో కదా అన్న అభిప్రాయం కలిగింది .  ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే !! నేను అమెరికా లో పుట్టి పెరిగిన దానను  కాదు.   ఈ స్థల పర్యటన, వారు వివరించిన విధానము  నాకే అటువంటి అభిప్రాయం కలిగించింది. మరి  అమెరికా లో పుట్టి పెరిగే పిల్లలకి, వారి బడులలో నేర్పే ఈ యుద్ధ కథనం వింటే దేశభక్తి, గౌరవం ఎంత గా పెంపొందుతాయో కదా అన్పించింది. అందుకేనేమో అమెరికన్లు పెర్ల్ హార్బర్ రోజుని అంతగా గుర్తు పెట్టుకుంటారు మరి !!

హవాయి దీవులు -2

మేము సందర్శించిన ఇంకో ద్వీపం ఉఆహు. హవాయి రాష్ట్ర రాజధాని అయిన హోనులులు నగరం ఈ  ఉఆహు ద్వీపం లోనే ఉన్నది. ఇక్కడ చూడదగినవి చాలా ప్రదేశాలు  ఉన్నా  సమయం సరిపోకపోవడం వలన మేము కొన్ని మాత్రమే చూసాము.   పెర్ల్ హార్బర్,  డోల్  వారి అనాస తోట (డోల్  ప్లాంటేషన్), పాలినేషియన్ సాంస్కృతిక  కేంద్రం.

2015-09-04 18.49.36

డోల్  వారి అనాస తోట లో అనాస పళ్ళు ఒకటో రెండో తప్పించి పెద్ద గా లేవు. కోతలు అయిపోయాయి అని చెప్పారు. మాకు ఇక్కడ చాలా సమయం వృధా అయిపొయింది అన్పించింది. ఇక్కడ మమ్మల్ని పైనాపిల్  ఎక్స్ ప్రెస్ అనే చిన్న బొమ్మ రైలు ఎక్కించి, తోట చూపిస్తాము అని ఒక మైదానం లో తిప్పారు.  తిప్పినంత సేపు డోల్ వారి చరిత్ర అంతా  చెప్పుకుంటూ వచ్చారు. అనాస పండు బ్రెజిల్ నుంచి స్పానిష్ వారి ద్వారా హవాయి కి వచ్చిందట. జాన్ డ్రమ్మండ్  డోల్  అనే అమెరికన్ అతను 1800 ప్రాంతాలలో హవాయి లో  అనాస  తోటలను పెంచి వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ వ్యాపారం ఎంత బాగా వృధ్ధి  చేసాడంటే హవాయి అంటే పైనాపిల్, పైనాపిల్ అంటే  హవాయి అన్నట్లు అయ్యిందిట.  ఈ డోల్  ప్లాంటేషన్ లో  ఎర్ర రంగు అనాస ఒక వింత!!

పాలినేషియన్ సాంస్కృతిక  కేంద్రం  Disney Park మాదిరి గా ఒక పెద్ద Theme Park. పూర్తి గా చూడటానికి  ఒక రోజు పట్టచ్చు. అన్ని రకాల పాలినేషియన్ సంస్కృ తుల వారు నృత్యాల తో,  రక రకాల విద్యలతో వారి రోజువారి జీవితం ఎలా ఉండేదో  చూపిస్తారు. కొబ్బరి చెట్టు ఎక్కడం, కొబ్బరి కాయ పీచు తీయటం, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లటం, టోపీ లు చేయటం, అగ్గి రాజేయటం లాంటివి ఇందులో కొన్ని. ఆ కొబ్బరి బుట్టలు అచ్చం గా మన తాటాకు  బుట్టల్లాగే ఉన్నాయి.  ఇంత డబ్బు పెట్టింది ఇవి చూడడానికా అని మాకు అన్పించింది. కానీ మా పిల్లలకి మాత్రం అన్నీ  వింతగానే అన్పించాయి. అక్కడ అన్ని షో లు అయ్యాక  చివరగా సాయంత్రం  ‘Ha Breath of Life’ అని ఒక రెండు గంటల షో చూసాము. పేరుకు తగ్గట్టు గానే  ఈ షో లో ఒక హవాయి జాతి వీరుడి జీవితం ఎలా ఉండేదో  ఒక  నృత్య రూపకం ద్వారా  వివరిస్తారు.  పిల్లవాడి పుట్టుక, తండ్రి దగ్గర విలువిద్యలు నేర్చుకోవడం,పెళ్లి, శత్రువులతో పోరాడటం వంటివి.  Fire dance తో, పాటలతో, drum  లాంటి వాయిద్యాల సమ్మేళనం తో చాలా బావుంది.  తల్లి, తండ్రి, భార్య, భర్త ఇలా ఒక హవాయి కుటుంబం కలిసి మెలిసి ఎలా ఉంటుందో చాలా  చక్కగా చూపించారు.

పాలినేషియన్ సాంస్కృతిక  కేంద్రం ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం వారు నడుపుతారు. ఇక్కడ పని చేసే కళాకారులంతా  అక్కడ చదివే విద్యార్థులే అని చెప్పారు. విశ్వవిద్యాలయం నడిపేది LDS అనే Church వారు. 1800 ప్రాంతం లో మతం మార్చుకున్న హవాయి వాసులకి  ఒక సమావేశ ప్రదేశం కోసం ఈ ప్రాంతం లో భూమి కొని ఈ చర్చి ని నెలకొలిపారట.  వచ్చిన సందర్శకుల కి ఈ కేంద్రం పక్కనే ఉన్న విశ్వవిద్యాలయం, LDS Church వారి temple కూడా చూపిస్తారు. ఈ  హవాయి జాతి వారికి  ఒక జీవనోపాధి కల్పించటం,  విశ్వవిద్యాలయ బోధన చేయటము కోసం ఈ కేంద్రం నెలకొల్పాము అని చర్చి వారు చెప్పారు.  

పెర్ల్ హార్బర్ విశేషాలతో  మళ్లీ …

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

హవాయి దీవులు -1

మా చిన్నపుడు ఏదైనా ఊరు వెళ్లేముందు అక్కడ ఏమి చూడాలి ఏమి తెల్సుకోవాలి అన్న ఆసక్తి ని మా నాన్న గారు మాకు చక్కగా కలుగచేసారు. మిస్టర్  గూగుల్ గారు  లేని ఆ రోజుల్లో Survey of India వారి మ్యాప్ లు కొని,  లైబ్రరీ లో పుస్తకాలూ తెచ్చిఆ వెళ్ళే ప్రదేశం గురించి వివరించి చెప్పేవారు.  అందుకే  ఏ పర్యాటక ప్రదేశానికి  వెళ్ళినా  ఏమేమి  చూడాలో వాటి వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత  అంత క్షుణ్ణం  గా కాకపోయినా కొంతైనా  తెలుసుకోవాలి అనుకుంటాను.

చిన్నపుడు రెండవ ప్రపంచ యుద్ధం, హిరోషిమా నాగసాకి నగరాల పై అణుబాంబు దాడి  చదవటమే కానీ ఎందుకు జరిగింది అన్నది అంత లోతుగా తెలియదు. ఒక రోజు డిస్కవరీ ఛానల్ లోని పెర్ల్ హార్బర్   భీభత్సం గురించి చూసాక ఆ ప్రదేశం  చూడాలి అన్న ఆలోచన వచ్చింది.  మా అమ్మాయి  రెండవ ప్రపంచ యుద్ధం గురించి చదువుకుని ఉండటం వలన  తనకి కూడా ఈ ద్వీపాలని చూడాలని చాలా ఉత్కంఠ కలిగింది. ఆ విధం గా మా కుటుంబం అంతా  గత ఏడాది ఎండాకాలం సెలవల్లో అమెరికా లోని  50 వ రాష్ట్రమైన హవాయి యాత్ర కి వెళ్ళాము.

హవాయి రాష్ట్రము పసిఫిక్ సముద్రం లోని ఒక ద్వీపసమూహం (Archipelago). ఆ ద్వీపాలలో ఐదు ముఖ్యమైన ద్వీపాలు ఉన్నాయి. మేము అందులోని రెండు ద్వీపాలు సందర్శించాము. ఒకటి మావి,  ఇంకొకటి ఉఆహు.   IMG_0237

ఎక్కడ చూసినా  కొబ్బరి చెట్లు, రక రకాల రంగుల్లో మందారాలు, విరగ బూసిన  కాగితపు, గన్నేరు,సువర్ణ గన్నేరుల పువ్వులు,  నీలి సముద్రం, ఇంద్రధనుస్సులు, అందమైన సూర్యాస్తమయాలు, గల గలా పారే సెలయేరులు, జలపాతాలు  ఇదీ  హవాయి అంటే !!  విశ్వకర్మ సృష్టి అంటే ఇలాగే ఉంటుందేమో  అని  అనిపించేలా ఉంటుంది.  ఏ చెట్టు చూసినా విరగ పూసి/కాసి  ఉంటుంది.  ఒక్క వేప, సపోటా, నంది వర్ధనం తప్ప భారత దేశం లో సముద్ర తీరం దగ్గర కనిపించే చెట్లన్నీ చూసాము . అరటి, మామిడి, ములగ, బొప్పాయి, పనస, జిల్లేడు , బాదాం, తుమ్మ,  అనాస, సోంపు, మల్లె  ఇలాగా!! మావి దీవి లో  కొన్ని చోట్ల  జామ పళ్ళు , నేరేడు పళ్ళు రాలి పడిపోయాయి.  

ఈ హవాయి ద్వీపాలు సముద్రం లోని  అగ్నిపర్వతాలు బద్దలై, లావా ద్వారా  ఆవిర్భవించాయి.  హవాయి పెద్ద ద్వీపం అయిన Big Island లో ఇప్పటికి ఒక ప్రత్యక్ష అగ్నిపర్వతం ని చూడవచ్చు.  హవాయి చరిత్ర లో,  ఇక్కడ స్థానికులు 1500 ఏళ్ల  క్రితం పాలినేషియా నుంచి, నక్షత్రాల సమూహాన్ని ఆధారం చేసుకుని,  చిన్న చిన్నపడవలలో  (canoe) వలస వచ్చారని చెప్తారు.  వీరు మన లాగే రక రకాల దేవతలని ఆరాధన చేస్తారు.   1800 ప్రాంతం లో  protestant మిషనరీస్ వారి వలస తో  ఇక్కడ పాశ్చత్య నాగరికత మొదలయ్యిందట.  ఆ  తరువాత నెమ్మదిగా  అమెరికన్ colonists ల నియంత్రణ లోకి వచ్చి, 1953 లో అమెరికా 50 వ రాష్ట్రం అయింది.  వేరే దేశపు నియంత్రణ లో ఉంటే  ఈ ద్వీపాలు ఎలా ఉండేవో కానీ, అమెరికా రాష్ట్రం అయినందు వలన అందమైన పర్యాటక స్థలం గాను,  చాలా సురక్షితం  గాను ఉందేమో అనిపించింది మాకు.

ఉఆహు ద్వీపం,  రాజధాని నగరం అవ్వటం వలన కొంచం commercial గా అన్పించింది. మావి ద్వీపం లో అలా కాకుండా  ఏ హడావిడి ఎక్కువ లేకుండా ప్రశాంతం గా ప్రకృతి  అందాలతో నిండినట్లనిపించింది . మావి లో ముఖ్యం గా చూడవలసినవి  హలేకలా నేషనల్ పార్క్, రోడ్ టు హానా.  

హలేకలా (అంటే House of Sun)  అనే పర్వతం సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.  ఈ పర్వతం పైన సూర్యోదయం, సూర్యాస్తమయం  చాలా అందం గా  కన్పిస్తాయి.  మేము వెళ్ళినరోజు  మబ్బులు వచ్చి అంత బాగా కన్పించలేదు. అక్కడ ఉండే  నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజర్స్ సూర్యుడు ఉదయించే సమయానికి తప్పనిసరిగా హవాయి భాష లో ఒక మంత్రం పఠిస్తారు. ఇక్కడ రెండు అగ్నిపర్వతాల కారణం గా ఒక బిలం(crater)  ఏర్పడ్డది.  ఆ క్రేటర్ చూస్తుంటే మనం ఏ  అంగారక గ్రహమో రాలేదు కదా అన్పిస్తుంది.  అటువంటి చోట ఒకే ఒక రకమైన అరుదైన పువ్వు  చెట్టు కన్పిస్తుంది. దాని పేరు Silversword.  నిజంగానే ఆ ఎండ కి వెండి లా  మెరిసిపోతూ  ఉంటుంది.  ఈ అధ్బుతం ఏంటి అన్పిస్తుంది.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఈ రోడ్ టు హానా అనే దారి లో నేను పైన చెప్పిన హవాయి అందాలన్నీకన్పిస్తాయి. ఆ అందాలూ  మాటల్లో వర్ణించనలవి కాదు. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, అరటి పళ్ళు, బననా బ్రెడ్  మన భారత దేశం లో అమ్మినట్లే రోడ్డు మీద అమ్ముతుంటారు. 

మావి ద్వీపంలో  లహైన అనే ఊరిలో  150 ఏళ్ల  క్రితం భారత దేశం నుంచి తెచ్చిన మర్రివృక్షం ని కూడా చూడవచ్చు.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

హవాయి లో ఇంకొక ప్రత్యేకత వారి సంప్రదాయ హూల నృత్యం. ఈ  నృత్యం దేవుడి ని కొలిచేటపుడు చేసేవారుట.   ఈ సాంప్రదాయ పరంపర కొనసాగించడం కోసం చిన్నప్పటినుండే  ఈ నృత్యం నేర్పిస్తారు.   

ఇప్పటికే పెద్ద టపా  అయింది.  పెర్ల్ హార్బర్ ,ఉఆహు విశేషాలతో  మళ్లీ …