పెసర పచ్చడి

ఆరోగ్యకరమైనదీ, పొయ్యి జోలికి పోకుండా సులువుగా  చేసుకోగలిగినదీ  అయిన  తిండి పదార్థం అంటే,  చారు తరువాత ‘పెసరపచ్చడి’  అంటాను నేను.  సాధారణంగా సాయంత్రాలు పప్పు తింటే అరగదని ఇటువంటి రోటి పచ్చళ్ళు చేస్తుంటారు.   మా నానమ్మ చాలా అద్భుతంగా చేస్తుంది ఈ పచ్చడి. రెసిపీ చదివాక ఇందులో ఏముందండీ చేయటం అంటే నేను చెప్పలేను. ఆ పచ్చడి రుబ్బే విధానంతోటే రుచి వస్తుంది. .ఆవిడ చేసినట్లు రానే రాదు నాకు.

చాలా మంది చేస్తారు. గూగుల్ అంతా గాలించినా సరియైన ‘పెసరపచ్చడి’ ఫోటో కానీ రెసిపీ కానీ కనిపించలేదు నాకు. అందుకే తెలీని వారికి  తెలుస్తుంది అని ఈ రెసిపీ మరియు ఫోటో :

కావలసినవి:

నానబెట్టిన పెసరపప్పు (నీళ్లు వాడ్చేయాలి)

ఎండుమిర్చి

జీలకర్ర

తగిన ఉప్పు

పోపు (optional) :

ఓ చెంచాడు నూనె లోకి

జీలకర్ర

ఆవాలు

మినపప్పు

ఇంగువ

ముందు  ఎండుమిర్చి రెండు, మూడు ముక్కలుగా విరిచేసి కచ్చాపచ్చాగా (అంటే crushed  red  pepper flakes లాగా) దంచాలి.

నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, తగిన ఉప్పు  చేర్చి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.  నేను food processor  వాడతాను. అందుకే మరీ మెత్తగా రాదు.

తరువాత  కావాలంటే పోపు పెట్టుకోవాలి.

అన్నంలో కలుపుకుని  నెయ్యి  వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఎండుమిర్చి తగ్గించి పిల్లలకు పెట్టచ్చు. వడపప్పు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి మిగిలిన వడపప్పు ఇలా చేసేసుకోవచ్చు.

గూగుల్ లో రెసిపీలుచూస్తే మామిడికాయ లేకపోతే నిమ్మకాయ/ చింతపండు రసం పిండినట్లు  చెప్పారు. నన్నుఅడిగితే వద్దనే అంటాను. ఎందుకంటే పులుపు పదార్థాలు కలిపితే ఈ పచ్చడికి ఉన్న చక్కటి కమ్మటి రుచి పోతుంది.

అమెరికాలో దోసావకాయ

Thanks  Giving రోజులు వచ్చేసరికి పండిన పంటలు కోయటం పూర్తి అవుతుందేమో మరి.   సూపర్ మార్కెట్ లలో దోసకాయలు, బీన్స్ లాంటి కూరలు చాలా తాజాగా కనిపిస్తూ ఉంటాయి . దాంతో ఫ్రిజ్ లో ఎప్పుడూ  దోసకాయలు ఉంటూనే ఉన్నాయి.

IMG_1145

ఈ మధ్య YVR  ‘అంతరంగం’ బ్లాగర్  గారు, దోసకాయల గురించిన టపా పెట్టేసరికి వెంటనే యమర్జంటుగా  దోసావకాయ పెట్టేసా!!తినడం, జాడీ కడగటం కూడా పూర్తయిందనుకోండి!!

వంటకాల మీద టపా పెడితే భలేగా ఉంటుంది. చేసిన పదార్థం కొంచెమే అయినా అందరూ  కళ్ళతో తిని మనసు నింపేసుకుంటారు. నాలుక తో తినే ప్రసక్తి లేదు కాబట్టి ‘ఉప్పు ఎలా ఉంది’, ‘నూనెక్కువయ్యిందా’ , ‘కారం ఇంకొంచెం పడితే బావుండేదా’  వంటి మాటలు అస్సలు ఉండవు. వంట చేసినవారికి వడ్డించినంత సంతృప్తి :).

IMG_1054

IMG_1055

 

IMG_1060

 

 

 

 

వంటలు, పిండి వంటలు

మా అమ్మ అటు బడికి వెళ్లడం ఆలస్యం, వంటల పుస్తకం పుచ్చుకుని మా అక్క , తమ్ముడు, నేను వంటింట్లోకి బయలుదేరే వాళ్ళం. తొందరగా అయ్యేవి మా తమ్ముడు చేసేవాడు. ఆలస్యమైనవి మా అక్క చేసేది. నేను వంట చేసిన ఆనవాళ్లు లేకుండా అన్నీ సర్ది , తుడిచేదాన్ని. ఎంత కష్టపడ్డా సాయంత్రం అవ్వగానే ‘ ఏం చేసుకున్నారర్రా’ అనే ప్రశ్న ఎదురయ్యేది . దొంగతనం బయట పడిపోయేది!! పండగ రోజులు దగ్గరికి వస్తుంటే ‘నూనె, పంచదార ( రేషన్ కదా ) అయిపోతాయి పండక్కి ఏమి ఉండవు’ అన్న హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా ఏదో పూనకం వచ్చినట్లు చేసేసేవాళ్ళం.
ఎందుకంత పూనకం వచ్చేది అంటే, అదంతా ఒక పుస్తకం మహిమ!! ఏంటా పుస్తకం అంటారా ? ఇదిగో – మాలతీ చందూర్ గారు వ్రాసిన ‘వంటలు, పిండి వంటలు’ .
IMG_4044
మా తమ్ముడికి ఎప్పుడూ బజ్జీలు వేసుకోవాలని. మా అక్కేమో కాదు పుస్తకం లో లిస్ట్ ప్రకారం వద్దాము అనేది. మా తీరని కోరిక ఏంటంటే పుస్తకం లో మొట్ట మొదటి వంటకం ‘ ఢిల్లీ దర్బార్’ చేయాలి అని. మా అమ్మ స్పెషల్ పిల్లలకి కుట్టు నేర్పేది. . ఆ బడికి పొద్దున్న 10 కి వెళ్లి సాయంత్రం 5కి వచ్చేసేది . మాకు సెలవలు ఉండేవి కానీ తనకి ఉండేవి కాదు. సెలవల్లో, ఇంట్లో ఉన్న సరుకులతోటే, ముందే ఏం చేయాలో ప్రణాళిక వేసుకునే వాళ్లం. అమ్మ వచ్చే లోపల, అవి చేసి, గుటుక్కున తినేయాలి కూడా !! బజ్జీలు చేస్తే సరిగ్గా తలా మూడు చేసుకుని తినేసే వాళ్ళం. మా అక్క కి ఎప్పుడూ జాంగ్రీ చేయాలనీ ఆత్రం !! చేస్తే జాంగ్రీ చేసేది లేకపోతే మైసూర్ పాక్ చేసేది. రెండూ దానికి కుదిరేవి కాదు. జాంగ్రీ అంటే గారెలు చక్కర నీళ్ళల్లో తింటున్నట్టు ఉండేది. . దానికి తోడు మిఠాయి రంగు ఉండేది కాదు. అవి చూడటానికి కూడా బావుండేవి కాదు. మైసూర్ పాకేమో సాగిపోయి హల్వా లాగా ఉండేది. ‘వద్దే ప్లీజ్’ అన్నా వినేది కాదు. దాని ధర్మమా అని నేను మైసూర్ పాక్ అవలీలగా చేస్తాను కానీ ఈ రోజుకి కూడా దానికి రానే రాదు.
రవ్వ దోస చేయాలి అంటే కొలతలకి ఇప్పటికీ అదే పుస్తకం. కుంపట్లో ఎలా చేయాలో చెబుతారు ఈవిడ. అంటే పుస్తకం ఎప్పటిదో ఊహించుకోవచ్చు!! వంటల కోసం ఎన్ని websites , బ్లాగులు, పుస్తకాలూ, టీవీ షోలు వచ్చినా కూడా ఈ పుస్తకం ముందు దిగదుడుపే. మేము ఇళ్ళు మారగానే, వంటింట్లో ముందు కూర్చునేది ఆ పుస్తకమే !! Ice cream, milk shakes నుంచీ ఊరగాయలు దాకా అన్నీ ఉంటాయి. నేను పుల్కాలు, బిర్యానీ, కారం సోమాస్ , బోలెడు పచ్చళ్ళు , రక రకాల దోసెలు, పొడులు నేర్చుకున్నాను. అంతే కాదు ఈ రోజుకి త్వరగా వంట అవ్వటానికి ఆవిడ ఇచ్చిన టిప్స్ పనికి వస్తాయి అంటే అతిశయోక్తి కాదు. మన అతిథులు వస్తే ఎలాంటి వంటలు చేయాలి, విదేశీ అతిథులు వస్తే ఎలాంటి వంటలు చేయాలి అని కూడా వ్రాసారు. ఇది ఒక గ్రంధం అని కూడా అనవచ్చేమో !!
ఈ రోజుల్లో అమ్మాయిలు ‘మాకు వంటలు రావు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం’ అని చెప్పడం ఫాషన్ అయిపొయింది. పైగా ఏదైనా పదార్థం పెట్టగానే ‘ రెసిపీ చెప్తారా’ అని అడుగుతారు. నిజంగా చేస్తారో లేదో భగవంతుడికి ఎరుక!! ‘ఉప్పు ఎంత వేస్తారు ?’ అనే వాళ్ళని చూసేనేమో ‘ముద్దపప్పు’ ఎలా చేయాలో కూడా రెసిపీలు పెట్టేస్తున్నారు బ్లాగర్లు. వంట అనేది ఒక కళ. ఆ కళని ఎలా ఔపోశన పెట్టాలో, ముఖ్యంగా ఇలా ప్రశ్నలు వేసేవారికి, ఈ పుస్తకం లో స్పష్టంగా చెప్తారు రచయిత్రి.
మాలతీ చందూర్ గారు అంటే ఇంట్లో వంటలు మాత్రమే చేసుకోలేదు !! అలాగని ఆవిడకి, యద్దనపూడి నవలల్లోలాగా ఏ నాయరో వంట చేసి పెట్టి ఉండడు కూడా !! మాలతీ చందూర్ గారు ఎంతో సాహిత్య సేవ చేసారు కూడా !! ఆ రోజుల్లో ఒక సాధారణ గృహిణికి ఎన్నో విషయాలు ఎంతో తేలికగా ఈ పుస్తకంలో చెప్పారు. అటువంటి ఆవిడ నుంచి ఎన్నో నేర్చుకోవలసిన స్త్రీలు, ఏమి నేర్చుకున్నానేర్చుకోకపోయినా కనీసం ఆ వంటలన్నా నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు.
IMG_4047
‘ఆడవాళ్ళని వంటింట్లో తోసేసారు, బంధించేసారు‘ అనే స్త్రీ వాదులతో నేను వాదించలేను కానీ, వంట అనేది స్త్రీని తన కుటుంబంతో ఒక విధమైన అనుబంధంతో పెనవేస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను. . అమ్మ కంచంలో వడ్డించి ‘నీకు ఇష్టమైన బెండకాయ కూర చేసాను. భోజనానికి రామ్మా ‘ అని పిలవగానే , పిల్లలకి ఆ ఆనందాన్ని మించిన ఆనందం ఏముంటుంది ??

అమెరికాలో అరటికాయ పొడి

అరటికాయ చూడగానే ‘అత్తగారి కథలు’ గుర్తుకు వచ్చి అరటికాయ పొడి చేశాను చాలా ఏళ్ల  తరువాత.  భానుమతి అత్తగారంత  నైపుణ్యం లేదనుకోండి 🙂

ముఖ పుస్తకం లో అరటికాయ పొడి చిత్రం పెట్టగానే అందరూ  తాయారు చేసిన విధానం చెప్పమని అడిగారు.  అందుకే  ఇలా ఓ టపా కట్టేసాను.

image1
కావాల్సిన పదార్థాలు  :

రెండు అరటి కాయలు (plantains కాకుండా  green bananas అని వేరుగా ఉంటాయి. అవే  బావుంటాయి)

తగినంత ఉప్పు  

నూనె – 2-3 చెంచాలు

పోపు కి కావాల్సినవి :

నాలుగు ఎండు మిర్చి (తినగలిగేంత కారం)

మినపప్పు

శనగపప్పు

ఆవాలు

జీలకర్ర

మెంతులు

ఇంగువ

అరటి కాయలు కడిగి  తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి

కాయలకి తడి లేకుండా పేపర్ టవల్ తో అద్దివేయాలి.  ముక్కలని  ఒక గిన్నెలో  నూనె వేసి కలపాలి  (tossing).  తడి ఉంటే ముక్కలు మెత్తగా అయిపోయి పొడి బాగా రాదు.  ఒక పళ్లెం లేక cookie sheet తీసుకుని  aluminimum/parchment sheet వేసి ముక్కలని సమానం గా పరచాలి.

12509176_1020397954719601_8427482910230701765_n
ఈ విధం గా అన్న మాట

 

400F  ఉష్ణోగ్రత తో 22-25 నిమిషాల పాటు ముక్కలు ఓవెన్ లో ఉంచాలి.   

పోపు తాయారు చేసుకుని , పోపు  & అరటి కాయ ముక్కలు చల్లారాక   – పోపు, bake చేసిన అరటి ముక్కలు అన్నీ  కలిపి  Grinder/food processor/mini chopper  లో వేసి పొడి చేయటమే.

అన్నం లో నెయ్యి వేసి కలుపుకుని తినటమే 🙂

 

గమనిక :

మాములుగా అయితే అరటి కాయలని నిప్పుల మీద కానీ గ్యాస్ మంట మీద  కాల్చి, తొక్క తీసి పొడి చేస్తారు. అమెరికా అరటి కాయలు అలా కాలతాయో లేదో తెలీదు అని oven లో  bake చేశాను.