నా EAMCET కథ

నాకు ఒకే లక్ష్యం ఉండేది చిన్నప్పుడు. బీకామ్ చదవటం, బ్యాంకు లో క్లర్క్ పోస్టు తెచ్చుకోవడం. పదవ తరగతి ఉత్తీర్ణం కాగానే ఇంటర్మీడియట్ కి దరఖాస్తులు పెట్టుకోవడం మొదలు పెట్టాను. సెయింట్ ఆన్స్ లోనో, సెయింట్ ఫ్రాన్సిస్ లోనో CEC గ్రూప్ లో చేరిపోదాం అని నిర్ణయించేసుకున్నాను. అదే విషయం  మా నాన్నతో చెప్పాను. సరే అనేసారు. ‘ఓ పని చేయి ఎందుకైనా మంచిది. ఇంటి దగ్గరే కదా, రెడ్డి కాలేజీ లో కూడా ఓ దరఖాస్తు పడేయి’ అన్నారు. ‘CECతో పాటు MPC కూడా పెట్టు’ అన్నారు.  సరే ఎక్కడా రాకపోతే రెడ్డి కాలేజీ ఉంటుంది అనుకుని పెట్టేసాను. తీరా సెయింట్ ఫ్రాన్సిస్ లో రాలేదు. జీవితం లో చాలా కోల్పోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను.  సెయింట్ ఆన్స్ లో అనుకున్నట్లే సీటు వచ్చేసింది. చేరిపోవడం తరువాయి అనుకుంటున్న సమయం లో రెడ్డి కాలేజీ లిస్ట్ చూసి రమ్మన్నారు. MPC లో పేరు లేదు. హమ్మయ్య అని అనుకుంటుంటే,  మా నాన్న అమ్మని పిలిచి రెడ్డి కాలేజీ లో ఒక లెక్చరర్ పేరు చెప్పి, ‘ఆవిడకి  దీని సైన్స్, లెక్కల లో మార్కులు చెప్పి MPC లో సీటు  ఇస్తారేమో కనుక్కో’  అనేసారు. పరిస్థితి తారుమారు అయిపోతుంటే భయం వేసింది. అయినా కొంచం ధైర్యం గానే ‘MPC లో చేరను’ అని తేల్చి చెప్పేసాను. మా అక్క క్లాసుల మీద క్లాసులు పీకేసింది.  మా నాన్న మాటే వినదల్చుకోలేదు ఇదెంతలే  అనుకున్నా!! మా ఇంటి క్రింద ఉండే లెక్చరర్ ఒకావిడ బయటకి వెళ్తుంటే కనిపించి  ఏ గ్రూప్ అని అడిగి చెప్పగానే, నాకు క్లాసు  పీకింది ‘ ఈ రోజుల్లో CEC ఏంటమ్మా, MPC తీసుకుని ఇంజనీర్ అవ్వు ‘ అని.  చెప్పింది లెక్చరర్ కదా. కొంచం ఆలోచన మొదలయింది.  నాన్న నెమ్మదిగా ఒక్కటే చెప్పారు ‘MPC తీసుకో. రెండేళ్ళు  చదువు. నచ్చకపోతే డిగ్రీ లో బీకామ్ చేరు’ అని. ఇదేదో బానే  ఉంది అన్పించింది.  అమ్మ వెళ్ళటం ఆ లెక్చరర్ తో మాట్లాడటం, రెడ్డి కాలేజీ లో చేర్పించడం జరిగిపోయింది.

Agrwal classes నుంచి IIT  material  తెప్పించుకోమన్నారు. ‘ఉట్టికెక్కలేనమ్మ’ అన్న సామెత గుర్తొచ్చింది. వాళ్ళు పదవ తరగతి మార్కుల బట్టి material  పంపుతారు. నాకు ఎప్పుడు పంపాలీ అనుకున్నా. నా సైన్స్, లెక్కల మార్కులు నచ్చాయి కాబట్టి  పంపేస్తున్నాం అంటూ ఉత్తరం పంపారు వాళ్ళు. మొదటి సంవత్సరం ఇప్పటి పిల్లల్లా 900 తెచ్చుకోలేదు కానీ ఒక మాదిరి గా  బానే వచ్చాయి. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం.  విద్యానగర్ లో TRT quarters లో ఉండే  IIT  రామయ్య గారింటికి తీసుకెళ్లారు. ఆయన రెండవ సంవత్సరం లో తీసుకోవడం అసలు కుదరదు అని ఖచ్చితంగా చెప్పారు. అది తల్చుకుంటే అనిపిస్తుంటుంది, మా నాన్నగారు నా మీద మరీ ఆశలు  పెట్టుకున్నారేమో అని 🙂  ‘ఒకసారి EAMCET కోచింగ్ కి వెళ్ళిరా, వస్తే వస్తుంది లేకపోతే లేదు’ అంటూ శెట్టి ట్యూషన్ లో చేర్పించేసారు.  తెలీకుండా ఆ ఏడాది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను.

అప్పట్లో  EAMCET ఒక్కొక్క యూనివర్సిటీ వారు నిర్వహించేవారు. ఆ ఏడాది REC వరంగల్ వారు నిర్వహించారు. దరఖాస్తు పెట్టాక acknowledgement కార్డు రాలేదు. మళ్ళీ ఏడుపు మొదలు !! మా తమ్ముడిని, నన్ను పిలిచి వరంగల్ REC కి ఎలా వెళ్లాలో ఒక map వేసి చూపించి, ఎవరిని కలవాలో చెప్పారు. ఒక రోజు పొద్దున్నే కృష్ణా ఎక్సప్రెస్ లో కాజీపేట లో దిగి ఆటోలో REC  క్యాంపస్ కి వెళ్ళాము.  ఆయన  పేరు గుర్తు లేదు కానీ, ఆయన  నాన్న పేరు  చెప్పగానే మమ్మల్ని కూర్చోబెట్టి, అన్ని వేల దరఖాస్తులలో ఎలా వెతికించారో తెలీదు కానీ  acknowledgement కార్డు ఇచ్చారు. వాళ్లింట్లోనే భోజనం కూడా పెట్టారు పాపం !! మళ్ళీఅదే రోజు సాయంకాలానికి  ఈస్ట్ కోస్ట్ లో సికింద్రాబాద్ వచ్చేసాం.  ఆ ప్రయాణం తలుచుకుంటే నాకు, మా తమ్ముడికి  – ఒక్కరమే ట్రైన్లో తెలీని ఊరు వెళ్లడం కనుక్కోడం – ఒక adventure గా అన్పిస్తుంది. ఆ రోజే మా తమ్ముడు ఎలాగైనా REC  లో చదవాలి అని నిశ్చయించేసుకున్నాడు కూడా !! నేను సాధించలేదు కానీ, వాడు సాధించేసాడు!! కాకపోతే వరంగల్ కాదు !! ఇక అది వేరే విషయం.

ఇక అసలు ఘట్టం !! EAMCET రోజు రానే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెంటర్ !! మా నాన్నే స్వయంగా తీసుకెళ్లి  దిగబెట్టారు.  కొన్ని రోజులకి  ఫలితాలు రానే వచ్చాయి!! నా నెంబర్ పక్కన నా ర్యాంకు. అది చూసి ఇంట్లో అందరూ ఎగిరిగెంతులే !! ఏదో  స్టేట్ ఫస్ట్ వచ్చాననుకుంటున్నారేమో !! కాదండీ !! నా ర్యాంకు 2680!! దానికే అంత సంబరం అంటారా 🙂 CEC తీసుకుందామనుకున్న నాకు ఇలాంటి ర్యాంకు రావడం వింతల్లో వింతే కదా !! మొత్తానికి అలా ఇంజనీర్ని అయ్యానండీ.

నాకొచ్చిన ర్యాంకు కి REC ఏం  వస్తుందిలే అన్ని నేను అసలు అప్లై చేయలేదు. ‘ఒక్కోసారి ఉన్నటుండి గవర్నమెంట్ వాళ్ళు  ladies quota అని చెప్తే ఏం చేస్తావు. ఓ అప్లికేషన్ పడేయటంలో తప్పులేదు కదా ‘ అని తనే స్వయంగా వరంగల్ కి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు. నిజంగానే ఆయన  చెప్పినట్లు, నా ఇంజనీరింగ్ అయిపోగానే , ladies quota పెట్టారు 🙂

ఈ కథంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్న నా పదవతరగతి మార్కులని బట్టి నేను ఏం  చదవగలనో తనే  నిర్ణయించేసుకుని  మనసులో సంకల్పం చేసేసుకున్నారు ‘ ఈ పిల్లని ఇంజనీరింగ్ చదివించేయాలని’ . బలవంతంగా రుద్దకుండా, ఎక్కడా కోపతాపాలకు తావి లేకుండా తాను చేయాల్సిందంతా సైలెంట్ గా చేసేసారు. మా పిల్లలతో కూడా ఇదే పద్ధతి పాటిద్దామనే ఎంతో ప్రయత్నిస్తుంటాను నేను.

ఇలా ప్రతి విషయంలో తెలీకుండా మాకు ఎన్నో పాఠాలు నేర్పేసారు మా నాన్న గారు. ఇప్పుడు మా పిల్లలకి నేర్పిస్తున్నారు 🙂 !!

ప్రకటనలు

వేసవి సెలవలు -1 పూలజడ

వేసవి సెలవలు రాగానే  అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయి బడి తెరిచే ఒక  వారం రోజుల ముందు వచ్చేవాళ్ళం. మా అమ్మ ఎక్కువ వచ్చేది కాదు. వచ్చినా ఒక రెండు రోజులు ఉండి  వెళ్లిపోయేవాళ్లు అమ్మా, నాన్న. ఇక మా ఇష్టమే ఇష్టం!! పిన్నులు, వాళ్ళ పిల్లలు, మావయ్య, ఆవరణ లో పిల్లలు. రోజులో  24 గంటలు సరిపోయేది కాదేమో మా ఆటలకి.  మా అమ్మమ్మ గారి ఊరు గురించి నా మొట్టమొదటి టపా చెరగని తరగని జ్ఞాపకాలు లో చెప్పాను .

రోజంతా ఆటలు. మధ్యాహ్నం తాటి ముంజలు తినడం.  సాయంత్రం పెరట్లో తులసి చెట్టు దగ్గర కందిపచ్చడి, కొత్త ఆవకాయ, మామిడి పండు తో భోజనాలు.  ఆరుబయట వేపచెట్టు కింద మంచాలు, పక్కలు వేసుకుని కబుర్లు.  మధ్యలో కరెంటు పోవడం. వెంటనే  లాంతరు (సాయంత్రం అవ్వగానే ఎప్పుడూ వెలిగే ఉండేది)  ఒత్తి పెద్దగా చేయడం.  ఈ రోజుల్లో ఏ క్యాంపింగ్ ట్రిప్ పనికొస్తుంది ఇటువంటి అనుభవాలతో !!

అలా  ఉండేరోజుల్లో, ఒక రోజు నాకు, మా అక్క కి  పూలజడలు వేయించాలని సంకల్పం చేసేది అమ్మమ్మ. రోజూ నాలుగవ్వగానే మల్లెపూల అబ్బాయి వచ్చి మల్లెమాలలు ఇచ్చి వెళ్ళేవాడు.  పూలజడల కోసం ఆరోజుకి మొగ్గలు  తెమ్మని అతనికే చెప్పేది అమ్మమ్మ. లేదా, లచ్చారెడ్డి తోట అని ఇంటి దగ్గరే ఒక మల్లెపూల తోట ఉండేది. అక్కడికి వెళ్లి మల్లెమొగ్గలు తెచ్చుకునేవాళ్ళం.

పూలు ఉండగానే సరికాదు కదా. జడ వేసేవారు కావద్దూ!!  వీధి చివర ఉండే కమలమ్మగారు కానీ,  పక్క వీధీ  ఉండే గోపాలయ్య గారి భార్య శాంతమ్మగారు కానీ వేసేవాళ్ళు. వాళ్ళకి  కుదురుతుందో లేదో ముందే అడిగి కనుక్కునేది అమ్మమ్మ. కమలమ్మ గారు జడ వేసినప్పుడు ఆ విశేషాలు గుర్తు లేవు కానీ శాంతమ్మగారు బాగా గుర్తు.   భోజనాలు అవగానే మొగ్గలని నీళ్ళల్లో వేసుకుని గిన్నెలతో , జడ కుప్పెలు, సవరాలు , వేరే అలంకరణ సామగ్రితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. గోపాలయ్య గారింట్లో అయితే అందరికీ  కాలక్షేపమే.  వారిది కిరాణా కొట్టు.  వచ్చేపోయే వారు ఎక్కువ. పూలజడల కార్యక్రమం వరండాలో పెట్టేవారు. అందరు ఎవరికీ తోచిన సలహా వారు ఇస్తూ, కబుర్లు చెప్తూ ఇలా సాగేది ఆ కార్యక్రమం.  వారికీ నలుగురు అమ్మాయిలు. చివరి అమ్మాయి మాతోటిది. మధ్యలో అప్పటికప్పుడు వెళ్లి అలంకరణ కోసం మా ఆవరణకి వెళ్లి అనార్కలి, మరువం, కనకాంబరాలు కోసుకొచ్చిపెట్టేది మాకు. వాళ్ళందరూ కొబ్బరిపుల్లలకి  మొగ్గలు గుచ్చి సహాయం చేసేవాళ్ళు.

సన్నగా ఉండే నా జడని సవరాలు పెట్టి పొడుగ్గా చాలా అందం గా వేసేవారు ఆవిడ.  అలా మల్లెలు, మరువం, కనకాంబరాలతో ఆవిడ వేసే జడ ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు వేయలేరు అని ఖచ్చితంగా చెప్తాను.  అయితే జడ కుప్పెల దగ్గర చిన్న రాజకీయం చేసేవారు  మా అమ్మమ్మ, ఆవిడా ఇద్దరునూ !! అప్పట్లో బంగారు నాగరం, బంగారు కుప్పెలు ఉండేవి.  అమ్మమ్మ, వాటిని పెద్ద మనవరాలని మా అక్కకి పెట్టమని రహస్యంగా  శాంతమ్మ గారికి చెప్పేది. పూసలు, తళుకులు, చమ్కీలు ఉండే కుప్పెలు, అనార్కలి పూవు( నాగరంలా)  నాకు పెట్టమని చెప్పేది. ఒకసారి ఆ రాజకీయం అర్ధమయ్యి నేను ఏడిస్తే, తళుకులు చూపించి ‘ప్రపంచం లో ఇంతకంటే అరుదైన కుప్పెలు లేవు’ అన్నట్లు చెప్పి  శాంతమ్మగారు నన్ను మైమరిపించారు.

ఇక్కడ గోపాలయ్య గారి కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా  చెప్పాలి.  మా అమ్మనాన్న పెళ్ళికి వాళ్ళిల్లు విడిది. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి మా అమ్మమ్మగారిల్లు విడిది. వాళ్ళ ఇల్లు కూడలి పక్కనే ఉండటంతో మేము రైలు దిగి వస్తుంటే వాళ్ళే వీధి లోకి వచ్చి   ‘ఏ బండికొచ్చారు ?లేటా ‘ అని అడుగుతూ మాకు ముందు స్వాగతం చెప్పేవారు.

IMG_0196
ఫోటోలో మామిడి చెట్టున్న ఇల్లే గోపాలయ్య గారిది

 

పూలజడ వేసాక  పరికిణీలు  వేసుకుని తయారయ్యేవాళ్ళం. పూలజడల కోసం మేము క్రొత్త పరికిణీలు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. మాచింగ్ గాజులు, లోలాకులు, పాపిటబిళ్ళ  అన్నీ  ఫాన్సీ స్టోర్ లో ముందే కొని పెట్టుకునే వాళ్ళం. ఆ విధంగా తయారయ్యి అందరి ఇళ్ళకి వెళ్లి పూలజడ చూపించి వచ్చేవాళ్ళం. ముందు శాంతమ్మ గారింటికి. తర్వాతే ఎవరింటికైనా.  ప్రతి ఇంటికి వెళ్ళగానే ‘ ఏంటమ్మా’ అనే వారు. అంటే ఎందుకొచ్చారన్నట్లు. దానికి మా సమాధానం ‘ పూలజడ చూపించడానికి వచ్చామండీ’ అని 🙂 ‘ఎవరు వేసారూ’ అంటూ  వెనక్కి తిరగమనేవారు. అలా అందరి ఇళ్ళు వెళ్లి వచ్చాక, మావయ్య ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటో తీయించేవాడు. అదేంటో కానీ ఒక్క ఫోటో కూడా లేదు.

IMG_0197
వారి ఇల్లు ఉన్న వీధి

ఒక్కోసారి ఆవరణలో మా స్నేహితురాలు  వరలక్ష్మి కూడా మాతోపాటు పూలజడ వేసుకునేది.  అంత మందికి ఎలా వేసేదా  ఆవిడా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది. మా మావయ్య ఎవరి జడలు నలగకుండా ఉంటాయో చూద్దాం అనే పోటీ పెట్టేవాడు. ఇక రాత్రంతా పడుకోకుండా దానిని కాపాడటం సరిపోయేది.

అదండీ  నా పూలజడ కథ. అమాయకంగా ఉండే ఆ రోజులే వేరు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే Electronic gadgets వలన సగము ఇటువంటి చిన్ని చిన్ని సరదాలకు , ఆనందాలకు మనం ఎంత దూరం అయిపోతున్నామా  అనిపిస్తుంది.

విన్నకోట వారి విలువైన వ్యాఖ్య

మాలిక, శోధిని, తెలుగు బ్లాగులు అనుసరించేవారికి విన్నకోట వారి పరిచయం అక్కరలేదు. ఆయన  వ్రాసే చక్కటి వ్యాఖ్యలే నా లాంటి బ్లాగర్లకి పెద్ద విటమిన్లు అని చెప్పచ్చు. ఆయన  వ్యాఖ్య చూసినప్పుడల్లా ఎవరో ఒక బ్లాగరు వారిని  బ్లాగు ప్రారంభించమని అడుగుతుంటారు. దానికి ఈ రోజు వారు అన్న మాట ‘అందరూ  పల్లకి ఎక్కితే మోసేవారు ఎవరు’ అని _/\_!!  మొన్న ఈ మధ్య ఈ రోజుల్లో వస్తున్న సినిమాల  మీద ఆయన వ్యాఖ్య రూపం లో చెప్పిన ఈ విలువైన మాట  చాలా ఆలోచింపచేసేదిగా  అనిపించి, దానిని ఒక చోట పెట్టడం & అందరికి పంచడం చాలా అవసరం అనిపించింది. అందుకు నా బ్లాగే  ఎందుకు ఉపయోగించకూడదు అనిపించింది. వారి అనుమతి తో  ఈ టపా :

సినిమా వినోదానికే అంటుంటారు సరే. అయితే ఎంత వినోదం కోసమైనా, వ్యాపారం కోసమైనా కాస్తైనా సమాజం పట్ల బాధ్యత చూపించాలిగా. ఒక వయసు దాటిన ప్రేక్షకులు ఆఁ ఏదో తీసారులే అనుకుని పెద్దగా పట్టించుకోపోవచ్చు. కానీ యువత మీద, అంతగా విశ్లేషణ చేయలేనివారి మీద, సినిమా వారిని పిచ్చిగా వ్యక్తిపూజ చేసే వారి మీద సినిమాల ప్రభావం ఎంత తీవ్రంగా పడుతోందో ఈనాటి సమాజంలో కనిపిస్తూనే ఉంది. పాతకాలంలో నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల నిర్మాణంలో బాధ్యతారాహిత్యం చూపించలేదే. మరి వారు మాత్రం వినోదం కోసం తీయలేదా, వ్యాపారం చేయలేదా?

తర్వాత తర్వాత సినిమాలు మాస్ కోసం తీస్తున్నాం అనే ధోరణి ఎక్కువైపోయింది. మాసే బాసూ మనల్ని ఈరోజున ఈ లెవెల్లో నిలబెట్టింది అంటూ అన్యాపదేశంగా తన గురించి సినిమాలో తనే డైలాగులు చెప్పుకున్న “ఘనమైన” స్టార్లూ ఉన్నారు. మాస్ కోసమంటూ అర్ధంపర్ధంలేని, భౌతికశాస్త్ర సూత్రాలకు కూడా అతీతమైన విన్యాసాలు ఎక్కువైపోయినాయి – గ్రాఫిక్స్ వచ్చిన తరవాత మరీ కోతికి కొబ్బరికాయ దొరికినట్లయపోయింది. అడుగడుగునా విపరీతమైన హింస చూపించడం రివాజయిపోయింది – బహుశః అదే హీరోయిజం అనే భ్రమలో, మాస్ కి నచ్చుతుంది అనే భ్రమలో.  

నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమించానంటూ వెంటబడడం, పెళ్ళింట్లోనుంచి పెళ్ళికూతుర్ని తప్పించడం – హీరోయిజమా? వికారమా? సంస్కారరాహిత్యమా? బాధ్యతారాహిత్యమా? మనకి పంచే వినోదమా? అటువంటి సినిమాలు యువత మీద చెడు ప్రభావం చూపించవంటారా? అది సమాజానికి మంచేనా?

ఇక ఆ డాన్స్ లు చెప్పనక్కరలేదు – హీరో వెనకాలో 20 మంది, హీరోయిన్ వెనకాలో 20 మంది హఠాత్తుగా ప్రత్యక్షమౌతారు. అసలవి “డాన్సులా”? చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ మాస్టారు చేయించిన డ్రిల్ లాగానూ, కుంటి నడక లాగానూ, ఒళ్ళు నెప్పులన్నవాళ్ళు ఒళ్ళు విరుచుకున్నట్లూనూ ఉంటాయి. పైగా జుగుప్స కలిగించేట్లు వెనక్కి తిరిగి పృష్టభాగం ఊపులు – అదీ కెమేరా మీదకొచ్చి – అంటే ప్రేక్షకుల మొహాలమీద ఊపడం. అదేమంటే మాస్ కోసం. పాతకాలం సినిమాల్లోనూ డాన్సులుండేవి (ఇప్పుడంత అసభ్యంగా కాదు), ఫైట్లుండేవి (ఇప్పుడంత బీభత్సంగా కాదు), మరి ఆ రోజుల్లోనూ మాస్ ఉండేవారు, వాళ్ళూ సినిమాలు చూసేవారు, శతదినోత్సవాలూ జరిగేవి.  

సినిమా తీసేవాళ్ళ దృక్పథం ఎంతలా మారిపోయిందో తెలుస్తోంది. వీళ్ళని బయట జనాలు గుడ్డిగా అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే జనం ఎంతగా ప్రభావితులైపోతున్నారో అనిపిస్తుంది. వీళ్ళని ప్రత్యక్షదైవాలన్నట్లు జనాలు వెర్రిగా ఆరాధించడం – వాళ్ళని చూసి చొంగ కారిపోవడమొకటే తక్కువ.  

ఇటువంటి ధోరణులు సామాజిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయనే బాధ్యత కరువైపోతోందే అన్నదే “సామాజిక స్పృహ” కొరవడింది అంటే. పైగా నిరంతర మీడియా కవరేజ్ లు, వీళ్ళనే ఆధారం చేసుకునే టీవీ షో లు 24 గంటలూ. జనాలకి వేరే ప్రపంచం లేకుండా తయారయేంత ప్రభావం పడుతోంది.

తాము నటించే సినిమాలలోనే కాక ఇటువంటి బాధ్యతారాహిత్యం ఈ సోకాల్డ్ “సెలెబ్రిటీలు” మోడల్ చేసే అడ్వర్టైజ్మెంట్లలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి : ఓ సాఫ్ట్ డ్రింక్ సీసా కోసం భవనాల మీదనుంచీ, బ్రిడ్జిల మీదనుంచీ, కొండల మీదనుంచీ దూకినట్లు చూపిస్తున్న ప్రకటనలలో నటించే మోడల్ – పైగా పేరున్న నటుడు కూడానూ – కొంచమయినా బాధ్యత కలిగున్నవాడు అనగలమా? నిజజీవితంలో ఇటువంటి విన్యాసమే అనుకరించబోయి ఓ కుర్రవాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న సంగతి తెలిసి కూడా ఆ కంపెనీ తమ పద్ధతి మార్చుకోలేదంటే, ఆ “సెలెబ్రిటీ” వాటికి మోడల్ చేస్తూనే ఉన్నాడంటే – డబ్బు వ్యామోహానికి, బాధ్యతారాహిత్యానికి, సమాజంపట్ల నిర్లక్ష్యానికి, insensitivity కి పరాకాష్ఠ అనవద్దూ ! తెర మీద ఓ disclaimer పడేసి చేతులు దులుపుకోవడం. పైగా స్వేచ్ఛ అనే సాకుతో ప్రభుత్వాన్ని టీవీ మీద ఆంక్షలు సెన్సార్ పెట్టనీయకపోవడం.  

మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటుంటారు సినిమా వాళ్ళు చాలా తెలివిగా. మీరు తీస్తున్నవే మేం చూస్తున్నాం అని జనాలు అనే వాదమే సరైనది. ఎందుకంటే జనాలకి ఛాయిస్ ఏమీ లేదు, చిత్రనిర్మాణంలో జనాల పాత్ర ఏమీ లేదు. విడుదలకు ముందు కీలక పాత్ర పోషించవలసిన ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ వారే న్యాయం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి – ఎందుకంటే డబ్బొకటే ప్రాధాన్యమైపోయిన నిర్మాతలు, దర్శకులు, నటులు ఈ విలువలు పట్టించుకుంటారని ఆశించడం అనవసరం.

ఇంతలా భ్రష్టు పట్టిపోయిన రంగంలో కె.విశ్వనాథ్ లాంటి మహానుభావుడు వంటరిగా ధైర్యం చేసి సంస్కారవంతమైన సినిమాలు తీస్తే ఆయనకు అత్యున్నత పురస్కారం వచ్చినప్పుడు తప్పులు పట్టే ప్రయత్నం చెయ్యడం మాత్రమే కొంతమంది జనాలకు చేతనయినదిలా తోస్తోంది.


ఎవరి అభిప్రాయాలు, అభిరుచులు వారివి, కానీ సినిమాలు బాధ్యతాయుతమైన వినోదం అందించాలి, తాము జీవిస్తున్న సమాజం యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం అనే స్పృహ కలిగుండాలి అని సమాజం expect చేస్తుంది అని సినిమా వాళ్ళు తెలుసుకోవాలి.

 

మనకు లేని క్రమశిక్షణ, నైతికత పిల్లలకి రమ్మంటే?

మొన్న వారాంతం  ఒక రోజు త్యాగరాజదినోత్సవం, ఒక రోజు అన్నమయ్య దినోత్సవం మా గుడిలో.  పొద్దున్న 10:15 కి పంచరత్న కృతుల బృందగానంతో మొదలయ్యి , రాత్రి 9 కి మా అమ్మాయి గానం తో ముగిసింది. మధ్యలో ఒక రెండు గంటలు తప్ప రోజంతా అక్కడే గడిపాము మేము. గుడి మాకు 10 నిమిషాల దూరం ఉండటం కూడా మాకు ఒక advantage అయిందని చెప్పాలి.  ఈ రెండు రోజులు పాడినవారికి  మైకులు పెట్టడం, పేర్లు చదవటం, పాడినవారికి  సహవాయిద్యకారులని (accompanists) పెట్టడం చేసారు ఆ కార్యక్రమ నిర్వాహకులు, ఒక మహానుభావులు. వారి ఓపిక కి నా జోహార్లు _/\_. వారి పిల్లలు ఎవరూ ఈ కార్యక్రమం లో పాల్గొనలేదు. ఇక సహవాయిద్యకారులు ఎవరో పెద్దవారు కాదు. హై స్కూల్ పిల్లలు. ఈ రెండు రోజులు పొద్దున్నించీ  రాత్రి వరకు ఎవరు ఏ కృతి పాడితే  దానికి అనుగుణంగా (ముందు ప్రాక్టీస్ లేదు) వాయించటం వీళ్ళ పని. హై స్కూల్ అంటే ఎంత హోంవర్కులు ఉంటాయో తెల్సు కదా !! ప్రోగ్రాం అంతా అయ్యాకా మా అమ్మాయికి, ఇంకొక అమ్మాయికి వారు  చేసిన తప్పులు సరిదిద్దుకోవడం చెప్పారు ఆయన.  ఓపికగా విన్నారు ఈ పిల్లలు కూడా !! ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా ఒక వైపు. ఇంకొక వైపు  కూడా ఉంది.

చాలా చికాకు పెట్టే అంశం!!  పిల్లలు కాసేపు స్టేజి ఎక్కి పాడగానే కెమెరాలు పుచ్చుకుని తయారయిపోతారు  కొంతమంది(అందరూ  కాదు) తల్లితండ్రులు. వీరికి వారికీ పిల్లల కార్యక్రమం వరకు కూర్చునే  ఓర్పు కూడా  ఉండదు.  వారి పిల్లలలాంటి వారే ఇంకొకరు పాడితే  వచ్చి ప్రోత్సహించాలి  అన్న ఇంగితం అంతకంటే ఉండదు. పైగా పిల్లలని ఇలాంటి కార్యక్రమాలకి  తీసుకువచ్చిన సంగీతం టీచర్ ని ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు.  ఇక వారి పిల్లల ప్రోగ్రాం పదినిమిషాలు అవ్వగానే గబగబా బ్యాగులు సర్దుకుని వెళ్లిపోతుంటారు. పోనీ, ఉన్న కాసేపు కూడా మిగితా వారి పాటలు వినరు. అదే బడిలో జరిగే orchestra/band లాంటి వాటికి చివరి వరకు మాట్లాడకుండా కూర్చుంటారు.  ఎవరి కన్నీరు  తుడవటానికి  వస్తారో,  ఎందుకు వస్తారో భగవంతుడికే తెలియాలి.

పిల్లలు సంగీతంలో / నృత్యంలో ఒక స్థాయికి రావాలంటే ఎంతో  కృషి అవసరం. నాట్యం గురించి నాకు తెలియదు కానీ, సంగీతం అంటే చిలుక పలుకుల్లా టీచర్ చెప్పిందే కాదు, వినికిడి తో నేర్చుకునేది అనంతం!! అందరికీ  పనులు ఉంటాయి. ఊర్లో అయ్యే అన్నీ కార్యక్రమాలకి వెళ్ళమని నేను అనటం లేదు. కానీ, మన పిల్లలు చేసే activities లో కూడా సమయం లేనట్టు , ఆ టీచర్లనో , నిర్వాహకులనో ఉద్ధరించడానికి వచ్చాము అనుకుంటే ఎలా? అన్నమయ్య దినోత్సవానికి  వెళ్ళాలి అనుకున్నాను నేను. కానీ అవ్వలేదు. ఇటువంటివి ప్రోగ్రాం లు 2007 నుంచి చూస్తున్నాను. కొందరు పిల్ల్లలు ఎక్కడ వేసిన గొంగళీలా అక్కడే ఉన్నారు. అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు కొందరు!!   తేడా ఎక్కడ మరి?

ఆ కార్యక్రమ నిర్వాహకులు  మా అమ్మాయితో ఒకటే మాట చెప్పి చాలా ప్రోత్సహించారు  ‘ ఎంత సేపు పాడతావో పాడు. పైన గుళ్లో ఆయన  ఉన్నాడు. ఇక్కడ నేను ఉన్నాను వింటాను. ఎవరు ఉన్నారా లేదా అని ఆలోచించద్దు’  అని . మన కళలు జీవించాలి అని శ్రమిస్తూ, పిల్లలని ఉచితం గా ఈ విధంగా ప్రోత్సహిస్తుంటే, ఆ మాత్రం సహనం, ఓర్పు తల్లితండ్రులకే లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది ? మనకి మనం నిర్మించుకున్న చిన్న సంఘం ఇది. దానిలో భాగం అవ్వాలి అనుకోవాలి. మన పని అయిపోగానే వీళ్ళతో ఏం  పని అన్నట్లు ఉంటే  ఎలా?

అంతకుముందు వారం,  మా  మనబడి వార్షికోత్సవం ‘పిల్లల పండుగ‘ జరిగింది.  నేను  చూసిన  ఐదవ  వార్షికోత్సవం.  ప్రతి తరగతి నుంచి పిల్లలు పద్యం /పాట/ నాటిక/రూపకం ప్రదర్శిస్తారు.   సినిమా అన్న ప్రసక్తి  ఉండదు. కర్ణాటక సంగీత గాత్రం , అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి, భరత  నాట్యం కూడా ఉండవు. కేవలం తెలుగు నాటికలు, పద్యాలూ.  చెప్పుకుంటూ పోతే చాలా  అద్భుతాలే !! కానీ అక్కడా ఇదే తంతు!! ఎవరి పిల్లలది అయిపోగానే వారు బ్యాగులు సర్దుకుని వెళ్లడం. వాళ్ళ పిల్లల కార్యక్రమం కాకపోతే గట్టిగా కబుర్లు చెప్పుకోవడం!!

నేను ఇలా అందర్నీ విమర్శిస్తూ చాలా  గొప్పదాన్ని అయ్యానని కాదు. నేను ఇలాంటి తల్లితండ్రుల లెక్క లోకే వస్తానేమో కూడా. నన్ను నేను గమనించుకుంటూ నేర్చుకుంటున్న పాఠాలు ఇవి. మనకు లేని క్రమశిక్షణ, నైతికత పిల్లలకి రమ్మంటే ఎక్కడనుంచి వస్తుంది? వంద రకాల కార్యక్రమాలలో ఆ పిల్లలని పెట్టి, ఏ ఒక్క దాని మీద వాళ్ళకి ఆసక్తి పెంచుకునే ఆలోచనకి  కూడా సమయం ఇవ్వకుండా, మన జీవితాలే కాదు వాళ్ళ జీవితాన్ని కూడా ఒక Task oriented జీవితంలా మార్చేస్తున్నామేమో ఆలోచించండి!!

ఈసారి నిజంగానే బాహుబలి-2 చూసాం

‘కొంచం మహాభారతం లా ఉంది’ బాహుబలి-1 చూసాక  మా వారి వ్యాఖ్య. రోజు మహాభారతం చూసే ఈయనకి  అలానే ఉంటుంది అని సరిపెట్టుకున్నా. మా పిల్లల పట్టుదల మీద ఈ రోజు మొత్తానికి బాహుబలి-2 చూసాం. యూట్యూబ్ కాదండీ బాబు !! సినిమా హాలు లోనే $15 టికెట్ పెట్టి చూసాం. కేవలం పిల్లల కోసం, మూడు గంటలు ఎలాగో అలా  భరిద్దాం అనుకున్నాను. ‘బావుందా’ అని అడిగితే ‘బావుంది’ అనే చెప్తాను. చిన్నపిల్లలని ఇంత ఆకర్షించింది. అది నేను గమనించింది . పిల్లలు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. అందుకు ఆ సృజనాత్మకతని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.

నేనూ  కళ్ళు అప్పగించి చూసాను..   బహుశా ఏ కళ్ళు పెట్టి చూస్తే అవే  కన్పిస్తాయేమో. ‘ఇందుగలడు  అందులేడని’ .  చెప్పా కదా ఇదివరకే. ఏదైనా నేను  ‘text to text’ లంకె పెట్టి చూస్తాను అని.

చాగంటి గారి భాగవతం వింటున్నాను. 25/120, 57:00 దగ్గర కర్దమ ప్రజాపతి వివాహం గురించి చెబుతూ  స్వయంభూమనువు  యొక్క రాజ్యం  పేరు బహిష్మతి/బ్రహిష్మతీ అని చెప్పారు.  యజ్ఞవరాహమూర్తి భూమి కోసం వెతుకుతున్నపుడు అయన వెంట్రుకలు పడి  వచ్చిన భూమి అట అది.  ‘మహిష్మతి’ అంటే వెంటనే  అదే గుర్తు వచ్చింది నాకు. సినిమా లో చాలా సృజనాత్మకం  గా అన్పించిన  అంశం ఏంటంటే – సినిమా మొదలు పెట్టి పెట్టగానే చాలా వైవిధ్యం గా వినాయకుడికి చేసిన పూజ.

సినిమాలో నేను ధర్మరాజుని, భీముడిని, అర్జునిడిని చూసాను. ద్రౌపది కూడా   కన్పించింది. ధృతరాష్ట్రుడు,  దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారు కన్పించారు. ఇంతమంది ఉంటే  భీష్ముడు కనిపించకుండా ఉంటాడా ? ఆయన  కూడా కనిపించాడు. మధ్యలో రామాయణం కూడా కన్పించిందండి. ఎక్కడో చెప్పను. చూసినవారే  కనిపెట్టగలగాలి. అయితే  రావణాసురుడు లేడు.

అక్కడక్కడా పిల్లలు చూడనటువంటివి ఉన్నాయేమో అన్పించింది. వెంటనే దానికి మా అమ్మాయి సమాధానం – ‘ భీముడు దుర్యోధనుడిని చంపిన రోజు, అందరు భయపడతారు. గుర్తు లేదా’ అంది.  నిజమే కదా  Gettysburg field trip  తీసుకెళ్లి, అమెరికా లో  అంత్యంత భయంకర యుద్ధం జరిగింది ఇక్కడే అంటూ పోయిన సైనికుల సమాధులను చూపిస్తున్నాం కదా అన్పించింది.

Last but not least  –  హీరోయిన్ అంటే అసహ్యంగా చిత్రీకరిస్తూ , కేవలం పాటలకు మాత్రమే వారిని చూపిస్తూ ఆడవారు అంటే ఇంతే దిగజారుడు గా సినిమాలు చూపిస్తున్న తరుణం లో,  స్త్రీ అంటే రామాయణ , మహాభారతాలు ఏ విధం గా చూపించాయో  ఈ తరానికి కొత్త సీసాలో పోసి అదే విధం గా చూపించిన రాజమౌళి గారికి నా వందనాలు _/\_

అందుకే మళ్ళీ  అదే చెప్తాను – రామాయణభారతాలు చదవండి & చదివించండి !!

బాహుబలి సినిమా యూట్యూబ్ లో చూసేసామోచ్

మొన్న ఆదివారం బట్టలు లాండ్రీ లో వేసి, గబగబా నాలుగు చేతులతో మడత పెడుతూ బాహుబలి యూట్యూబ్ లో చూడటం మొదలుపెట్టాము నేను, మావారు. నిన్న సోమవారం తో బట్టలు మడత పెట్టడం, బాహుబలి చూడటం రెండు పూర్తయిపోయాయి. మా పెద్దమ్మాయి మంగళవారం పరీక్షకి గది తలుపు వేసుకుని చదువుకుంటోంది. సినిమా అయ్యాక మా వారు గట్టిగా అరిచినట్లే పెద్ద పిల్లని పిలిచారు. నాకు అర్ధం కాలేదు ఎందుకు అంత కంగారుపడుతూ పిలిచారో !! అది ఏమయ్యిందో అనుకుంటూ పాపం పరిగెత్తుకు వచ్చింది. పిల్ల రాగానే, చాలా ఆత్రం గా “అంతేనా ? అదే ending ఆ? అదేవిటే కట్టప్ప అలా బాహుబలిని చంపేశాడు? ఎందుకు చంపాడు ?” అని ప్రశ్నల పరంపర కురిపించారు మా వారు. దానికి ఏం చేయాలో తెలీక తలపట్టుకుంది. ఆ సమయం లో మా అమ్మాయిని చూస్తే స్వర్ణకమలంలో ఎద్దుబండి లో కూర్చున్న భానుప్రియ గుర్తొచ్చింది. వెంటనే చెప్పింది “అది తెలుసుకోవడానికే గా నాన్నా అందరూ చూస్తున్నారు !!నా పరీక్ష అవ్వగానే అందుకేగా తీసుకెళ్లండి అని అడుగుతున్నాను” అని. ఇంతకీ నేను, మా వారు యూట్యూబ్ లో చూసిన సినిమా ఏంటంటే బాహుబలి-1!!

తెలుగు సినిమాల విషయంలో మా వారి టైం మెషిన్ అమెరికా వలస వలన పాత version లో నడుస్తోంది. అందుకే “మగధీర సినిమానా ? హీరో ఎవరు ? రాంచరణ్ తేజా నా ? అతనెవరు ?పెద్ద యాక్టరా ఏంటి ? “ అన్న ప్రశ్నల నుండి, ఏడాది క్రితం కొన్న స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ పుణ్యం తో ఇప్పుడిప్పుడే ఇలా బాహుబలి చూడటం మొదలయ్యి update అవుతోంది!!

నీతి : సినిమా అంటే పిచ్చి లేని మాలాంటి పిచ్చివాళ్ళు కూడా ఉంటారు

కళా తపస్వి

‘శంకరాభరణం’ చలనచిత్రం చూడటం చాలా బావుంది అనుకోవడమే  కానీ అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అన్నది నేను ఎప్పుడూ  ఆలోచించలేదు.   రాగం పేరు పెట్టారు కాబోలు అనే చాలా రోజులు అనుకున్నాను. దానిపై  చాగంటి గారి మూడు రోజుల( దాదాపు 5 గంటలు) విశ్లేషణ/ప్రవచనము విన్నాక, ‘శంకరాభరణం’ ఎటువంటి చలనచిత్రమో  అర్ధం అయింది.  అసలు ఒక చలనచిత్ర దర్శకుడి ఆలోచన ఏంటి, ఎంత అద్భుత సృష్టి అనుకుని మళ్ళీ  ‘శంకరాభరణం’ చూసాను.  రొటీన్ గా  ఉండే  హీరో,  హీరోయిన్ , ప్రేమ, పెళ్లి అనే విషయాలే  ఉండని అద్భుతమైన  తెలుగు చలనచిత్రం బహుశా  శంకరాభరణమేనేమో !!

 విశ్వనాథ్ గారి  సినిమాలలో కొన్ని సన్నివేశాలలో ఒక పెద్ద విషయాన్ని చాలా మాములుగా ఉండేట్లు చూపిస్తారు. ఒకటో లేక  మహా అయితే రెండో డైలాగులతో సారాంశం నిండి ఉంటుంది.  అటువంటి సన్నివేశాలలో నాకు చాలా  ఇష్టమైనవి – ‘శంకరాభరణం’ లో  శంకర శాస్త్రి గారు తులసిని  మడినీళ్ళు తెచ్చి వంట చేయమని చెప్పే సన్నివేశం .  ‘స్వర్ణకమలం’ లో భానుప్రియ అక్కని ఇంటి యజమాని కొడుకు పెళ్లి చేసుకోమని అడగటం. ఆ  సన్నివేశం మాటలలో చెప్పలేము. ‘సంగీతం తప్ప ఏమి లేదు అంటున్నాడు వద్దని చెప్పేయ్’ అంటే – పచ్చడి ప్యాకెట్ కొవ్వొత్తి దగ్గర అతికిస్తూ  ‘నాకూ  ఉన్నది అదేగా ‘ అన్న ఒక్క మాట. అలా ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది. అదే విధం గా ‘స్వర్ణకమలం’ లో వేదం చదువుకున్న ఒక ఘనాపాఠీ  ని ఒక మాములు గుమాస్తా  ‘టైం వేస్ట్’ అంటూ  అవమానించే తీరు.  

 చిరంజీవి అంటే స్టెప్పులు వేసి డాన్స్ చేసే హీరో. అందుకు భిన్నంగా ఆయనని ఎంతటి మహానటుడో నిరూపింప చేసిన  సినిమాలు   ‘ఆపద్బాంధవుడు’, ‘స్వయం కృషి’, ‘శుభలేఖ’. ఒక్క చిరంజీవి లోనే కాదు  ప్రతి నటుడి లో ఇంకో కోణం పరిచయం చేసారు విశ్వనాధ్ వారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో !!

విశ్వనాథ్ గారికి  దాదా సాహెబ్ పాల్కే పురస్కారం రావటం చాలా సంతోషంగా అనిపిస్తోంది.  వారిని మనసారా అభినందిస్తూ ఈ చిన్ని టపా  _/\_