తీర్పు పంచిన కాలక్షేపం

అమెరికా లో గురువులని, వైద్యులని వాళ్ళ ఇంటి పేరు తో పిలవటం పరిపాటి. మా చిన్నమ్మాయి సోషల్ టీచరే  ఇదివరకు మా పెద్దమ్మాయి టీచర్ కూడా.  మా పెద్దమ్మాయి ఆ క్లాస్ లో ఉన్నపుడు ఆవిడకి పెళ్లి కాలేదు. అప్పుడు ఆవిడ పేరు Mrs.A (పుట్టింటి పేరు). బడులు తెరిచాక తెల్సింది ఏంటంటే  ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారనీ. ఇక రోజు  ఆ పెళ్ళి సన్నాహాల కబుర్లు చెప్పేది మా చిన్నది. ఆవిడ పెళ్లి కి సెలవు పెట్టి వెళుతూ ’మీరు నన్ను ఈ రోజు   మాత్రమే Mrs.A పిలవండి. వచ్చాక Mrs.B అనాలి’ అని మురిసిపోతూ చెప్పి వెళ్లిందట. మొత్తానికి పెట్టిన  సుముహుర్తానికి  ఆ టీచర్ పెళ్లి అయ్యింది. పెళ్లవగానే ఆవిడ చెప్పిన ప్రకారం అత్తారింటి  పేరు Mrs.B కి మార్చుకుంది.  మా చిన్నది కూడా  ఆవిడ గురించి ఏదన్నా చెప్పాలంటే పేరు మార్చి చెప్పటం మొదలు పెట్టింది. ఒకసారి మా పెద్దమ్మాయి  మర్చిపోయి Mrs.A అని వ్యవహరిస్తూ  మాట్లాడేసరికి , చిన్నమ్మాయి -’ ఆవిడకి ఇపుడు పెళ్లయింది.  పేరు మార్చుకుంది. కాబట్టి ఇంకోసారి పాత పేరు పెట్టి పిలవకు’ అంది.  

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ వేడుక జరిగినా  ముందు మా నానమ్మ వచ్చేయాలి  అనుకుంటారు  మా నాన్న గారి అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు.మా అందరికీ  ఒక మంచి స్నేహితురాలు మా నానమ్మ.   చెప్తే ఆశ్చర్యం గా ఉంటుంది  కానీ, అమెరికా కి వచ్చి ఈ మనవరాలికి పురుడు పోసి, పత్యం కూడా పెట్టింది ఆవిడ!!  మా అమ్మాయిలకి  కూడా ఆవిడ కబుర్లు ఇష్టం. మా నాన్న, నానమ్మ వేరు వేరు కుటుంబాలు అని మా కెప్పుడూ తోచలేదు.   

ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే –  పెళ్లయ్యాక అత్తారింటి పేరు మార్చుకోవడం లో మురిసిపోయిన ఒక అమెరికన్ టీచర్, అదొక ఆచారం అని గ్రహించిన మా అమ్మాయి,  నానమ్మ  కూడా మన కుటుంబమే  అనుకున్న మేము.  ప్రపంచం లో ఒక్కొక్కరికి  ఒక్కొక్క  ఆచార వ్యవహారాలు.  ప్రతిదీ ఒక మూర్ఖపు ఆచారం గా తీసుకుని ఇది ఎందుకు పాటించాలి అని వితండవాదన  మొదలుపెడితే  ఎవరు ఏమి చేయలేరు!! ఏ సంబంధాన్నయినా  మనస్ఫూర్తి గా, ఆనందం గా  ఆదరించినపుడే  ఆ బాంధవ్యానికి  విలువ ఉంటుంది. అప్పుడే, ఆ బాంధవ్యాలు ఏ  కల్మషం  లేకుండా  ఉంటాయి.     

భారత సుప్రీమ్ కోర్టు ఈ మధ్య ఒక అతీతమయిన కేసు లో –   భార్య, భర్త ను తన మీద ఆధారపడ్డ తల్లితండ్రుల నుంచి బెదిరించి విడదీయాలని చూస్తే ఆ భర్త విడాకులు ఇవ్వవచ్చు – అని  తీర్పు  ఇచ్చింది.   నేను మొత్తం తీర్పు చదవలేదు.  ఈ వార్త చదివిన ప్రతి చోటా  వ్యాఖ్యలు –  అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తన తల్లితండ్రులని , ఎందుకు వదిలేయాలి ? అబ్బాయి మాత్రం  తన తల్లితండ్రులని ఎందుకు వదలడు ? గృహ హింస ఇంకా ఎక్కువవుతుందేమో?  అబ్బాయిలు లేని అమ్మాయిల  తల్లి తండ్రుల సంగతి ఏంటి ? ఇన్ని వ్యాఖ్యలు చూసాక బహుశా ఈ తీర్పు హిందూ మత చట్ట ప్రకారం అయి ఉండవచ్చు అందుకే ఇంత స్వాతంత్య్రం గా వ్యాఖ్యలు చేసారు అని బాగా అర్ధమయ్యింది. ఇక, ఈ వ్యాఖ్యలు చేసే వారిలో సగం మంది నా లాంటి వారే ఉంటారు – తీర్పు మొత్తం చదివే ఓపిక లేక ఏదో ఒకటి వ్యాఖ్యానించటం🙂.

సోషల్ మీడియా వచ్చాక ఇటువంటి  విషయాలు పెద్ద చర్చగా మారుతున్నాయి. పైన ఉదహరించిన  వ్యాఖలను బట్టి, అన్ని ఏళ్ళు ఆ బాధను  అనుభవించిన భర్త ను చూసి కించిత్తు జాలి కూడా చూపించకుండా, దృష్టి అంతా ఒక సంప్రదాయం మీద పెట్టిన మనుష్యులని చూస్తే ఆశ్చర్యం వేసింది.  వారి ఆలోచనలు ఎంత పక్షపాతం గా ఉన్నాయో  అన్పించింది.  ఆ భర్త సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళాడు అంటే ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు అన్న విషయాన్నీ పూర్తిగా విస్మరించారు.  కనిపెంచిన ఆ తల్లి ఆవేదన గురించి ఎవరూ మాట మాట్లాడట్లేదు.ఆవిడా ఒక స్త్రీ/మాతృ  మూర్తే కదా మరి !!    వితండవాదనలకి అంతూ  పొంతు లేకుండా ఉంది. కొంత మంది ఇటువంటి తీర్పు చెప్పినందుకు పిటీషన్  పెట్టాలి అని కూడా వ్యాఖ్య చేసారు. ఇదిగో ఇవి నాకు ముఖ పుస్తకం లో,  వాట్సాప్ లోను కనిపించినవి.  రెండు గ్రూపుల నుంచి వచ్చాయి. వీటిని పంచేవారిని నేను తప్పు పట్టను. ఇవి తయారు చేసిన వారు,  వారి అభిప్రాయాన్ని ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం ఇది. పూర్తిగా సఫలీకృతం అయ్యారు కూడా !!

14484805_528257340716804_8218217113821442794_n img_2124

హిందూ సంప్రదాయం (సనాతన ధర్మం) లో పెళ్లి అనేది ఇద్దరికీ మాత్రమే సంబంధించిన  విషయం కాదు. రెండు కుటుంబాలకి సంబంధించిన విషయము.  పెళ్లి చేసేటపుడు అటు ఏడు  తరాలు, ఇటు ఏడు  తరాలు చూసి చేయమన్నారు. అన్ని తరాలు చూడటం అంటే ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబానికి in and out అంతా  తెలిసి పోతుంది. పిల్ల, పిల్లవాడు పెళ్లికి  ముందు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెళ్లిలో ప్రవర చెప్పేటప్పుడు మూడు తరాల వారి పేర్లు చదువుతారు. శుభలేఖల లో కూడా కన్యాదాత తల్లి తండ్రులు ఉంటే  వారి పేరే వేస్తారు.  పెళ్ళిలో  పిల్ల మేనమామ, బావమరిది ఇలా ప్రతి ఒక్కరికి ఏదో  ఒక Role  ఉంటుంది. పెళ్లి అంటే ఎవరి వ్యక్తిగతం కాదు. ఇవన్నీ చూస్తే  సనాతన ధర్మం లో పెళ్లి  కేవలం ఒక  తంతు మాత్రం కాదు అని నాలాంటి సామాన్యులకి  కూడా అర్ధం అవుతుంది. అసలు సనాతన ధర్మం లో విడాకులు అన్నమాట లేనే లేదుట. అది వింటే ఎంత ఆశ్చర్యం వేసిందో !!  అంతర్జాలానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు సులువు గా ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న మా లాంటి వాళ్ళకి తెలుస్తున్నందుకు.

భారత దేశం ఒక ప్రజాస్వామ్య దేశం. పైన చెప్పిన ఈ తీర్పు హిందూ సంప్రదాయానికి సంబంధించినది. ఇటువంటి చట్టాలు  నచ్చనపుడు ఏ సంప్రదాయం లో కావాలంటే ఆ సంప్రదాయం లో పెళ్లి చేసుకోవచ్చు.  ఒకటి మాత్రం ఖచ్చితం!! పెళ్లి అంటే కేవలం ఒక తంతు అనుకుని, ఆ బంధానికి విలువ ఇవ్వకుండా  రచ్చ చేసుకునేవారికి (ఆడవారయినా/ మగవారయినా)  ఎన్ని చట్టాలు వచ్చినా, ఏ  సంప్రదాయమైనా  ఒకటే!!

అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తన తల్లితండ్రులని , ఎందుకు వదిలేయాలి ? అబ్బాయి మాత్రం  తన తల్లితండ్రులని ఎందుకు వదలడు? ఇది వరకు రోజుల్లో వ్యవసాయం, కుల వృత్తులు వంశపారంపర్యం  గా వచ్చేవి. అబ్బాయి తన తండ్రి నుంచే చాలా విద్యలు  నేర్చుకునేవాడు. ఉపాధి కోసం నేర్చుకునే విద్యను,  పెళ్లి చేసుకున్నాక కొత్తగా జీవితం లోకి వచ్చిన మావగారి  దగ్గర నేర్చుకోలేడు కదా!!  అంతే కాదు ఒక ఇల్లు కట్టుకుంటే  ఆ ఇంట్లో కొన్ని తరాల వారు జీవించేవారు. ఇంట్లో అబ్బాయిలు లేకపోతే ఎవరినయినా దత్తు తెచ్చుకునేవారు కూడా  విన్నాను.  అందుకే అమ్మాయి అత్త వారింటికి రావడం అనేది  ఆనవాయితీ  అయిఉండచ్చు.  రాను రాను కుల వృత్తులు వదిలేయడం, ఉద్యోగాల రీత్యా  పల్లెటూర్లు విడిచి పట్టణాలకు వలస వెళ్లడం మొదలయింది. ఇక ఇప్పుడు ఆ పట్టణాలు కూడా వదిలి విదేశాలకి వలస వెళ్తున్నాము.  ఇక  అమ్మాయిలు  అత్తగారింట్లో నే అతిథులు అవ్వలేదా?

అబ్బాయిలు లేని అమ్మాయిల  తల్లి తండ్రుల సంగతి ఏంటి ?  ఆస్థిలో సమాన హక్కున్నట్లే , కనిపెంచిన తల్లితండ్రుల బాధ్యత లో కూడ ఆడపిల్లకి సమాన  హక్కు ఉంటుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం. ఈ రోజుల్లో  అత్తగారిని, మామగారిని  వాళ్ళని గౌరవంగా చూసే అల్లుళ్లే కానీ, మధ్యతరగతి కుటుంబాలలో దశమగ్రహం అల్లుళ్ళు ఎవరు ఉండట్లేదు. దాని గురించి అంత వాపోవలసిన అవసరం లేదేమో !!

దురదృష్టవశాత్తూ  కొన్ని ఆచారవ్యవహారాలు దురాచారాలు గా మారుతుంటాయి. అవే విడాకులకు, గృహహింస కు దారి తీస్తుంటాయి.   వరకట్నం, కన్యాశుల్కం లాంటివి. ఇటువంటి వాటి నుంచీ  స్త్రీలని రక్షించడానికి చట్టాలు ఉండనే ఉన్నాయి . స్త్రీలు ఆ హింస ని , దూషణ ని భరిస్తూ వాటిని ఉపయోగించుకోకుండా తమకు తాము నిలబడక పోతే ఎవరు ఏం  చేయగలరు ?

కొన్ని ఆచారాలు ఎందుకు వస్తాయి అనటానికి ఒక మంచి ఉదాహరణ ,ఈ మధ్య  కష్టేఫలి  వారి  బ్లాగు లో చదివాను.  పెళ్లి లో పానకంబిందెలు ఎందుకిస్తారో వారి ఈ టపా లో  వ్రాసారు. ఆడపడుచులకు వెండి బిందెలు ఇవ్వమనటం క్రమంగా ఒక డిమాండ్ గా కూడా మారింది (నిజానికి వెండి బిందెలు ఏమి చేసుకుంటారో అర్ధం కాదు).  కట్నాలు ఇవ్వలేదని, ఆడపడుచు కి చీర సరిగ్గా పెట్టలేదని, ఆ మర్యాద జరగలేదని, ఈ మర్యాద జరగలేదని- ఇటువంటివే చిన్న చిన్న విషయాలు కాపురాలలో చిలికి చిలికి గాలివానలు అవుతాయి. ఈ రోజుల్లో ఆ గొడవలు విడాకుల దాకా వెళ్లిపోతున్నాయి!! My children and your children are playing with our children అనే  కొత్త ఆచారానికి నాంది పలుకుతున్నాయి!!

 

అమెరికా లో పిల్లల సంరక్షణ

నేను ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. అమెరికా లో ఉండే తెలుగు వారి మీద వ్యాసం. కొన్ని విషయాలు  చెప్పారు వ్యాసకర్త. అమెరికా లో కూడా నక్షత్రం,వారం చూసి పిల్లల్ని కనేవారు , పుట్టబోయేది ఆడపిల్ల  అని  తెలియాగానే  ఏడ్చే వాళ్ళు ఉంటారు అని…  ఆ వ్యాసం చదివాకా  అమెరికా లో ఇలాంటి చాదస్తులు ఉంటారా అన్పిస్తుంది. కానీ ఉన్నారు అందునా మన తెలుగు వాళ్ళే!!  అమెరికా లో పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడి  ఉండేవారి లో  ఇటువంటి వారు కూడా ఉంటారు అని చెప్పడం  మంచిదే. మంచి విషయం ఎంచుకున్నారు వ్యాసానికి అన్పించింది. అంత వరకూ  వ్యాసం బాగానే ఉంది. 

వ్యాసం లో నాకు కన్పించిన లోపం ఏంటంటే వ్యాసకర్త అవసరం లేని విషయాలు కూడాప్రస్తావించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే కొందరు భారతీయ తల్లులు,   పిల్లల్ని డే కేర్ సెంటర్ ల లో విడిచిపెట్టడం ఇష్టం లేక భారతదేశం లో ఉండే తల్లితండ్రుల దగ్గరికి పంపుతుంటారు.  లేకపోతే  తల్లితండ్రుల్ని పిలిపించుకుంటారు పిల్లల్ని చూసుకోవడానికి.  అటువంటి కుటుంబాల  గురించి ఆ  వ్యాసం లో వ్రాసారు  ఆ వ్యాసకర్త.  పిల్లలు పుట్టాకే తల్లితండ్రులు గుర్తొస్తారని, తల్లులకు సమన్లు పంపుతారని, జీతం బాగా పొదుపుచేయచ్చని  ఇలా తల్లుల్ని ఉచిత బేబీ సిట్టర్ లాగా చూస్తారని, పిల్లల ఎదుగుదల స్కైప్ లో చూసి ఏడుస్తుంటారని, అత్యాశ అని ఇలా అనవసర విషయాలతో ఒక రకమైన వ్యంగ్యం తో కూడుకున్న వ్యాసం లాగా అన్పించింది నాకు.    

డబ్బుల సంగతి పక్కన పెడితే, డేకేర్ లో పిల్లల్ని డే కేర్ లో పెట్టడానికి ఎందుకు ఇష్టపడరో, ఆ సాధక బాధకాలు ఏంటో నాకు తెలిసినంత వరకూ  చెప్తాను.   ఎముకలు కొరికే చలి లో, ఒక్కోసారి మంచు లో మంచి నిద్రలో ఉండే  చంటి పిల్లల్ని పొద్దుటే లేపి, డే కేర్ లో దింపాలి.  ఆహారం ఎంత చక్కగా వండిచ్చినా  డేకేర్ వాళ్ళు  శ్రద్ధగా పెట్టరు. పిల్లలు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు. అమెరికన్ డే కేర్ ల లో అయితే పిల్లలకి ఏడాది దాటగానే  వాళ్ళంతట వాళ్ళే తినాలంటారు. మన పిల్లలు తినరు. సాయంత్రం వరకు ఒక్కోసారి తిండి లేకుండా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే –  ఏడాది లోపు పిల్లలకయితే  రోగ నిరోధక శక్తీ తక్కువ ఉంటుంది. వారిని తీసుకెళ్లి డేకేర్ లలో పెడితే, చీటికీ మాటికీ జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి డే కేర్ వాళ్ళు కూడా, వేరే పిల్లలకి కూడా అనారోగ్యాలు వస్తాయని  తగ్గు ముఖం పట్టే  వరకు రానివ్వరు. పిల్లలకి జలుబు వచ్చింది అనే దానికంటే ఆఫీస్ కి సెలవు పెట్టాలి అన్న బాధ ఎక్కవయిపోతుంది. దానితో  అటు ఆఫీస్ లోను సరిగ్గా పని చేయలేరు. ఇటు పిల్లలని సరిగ్గా చేసుకోలేరు.  నాకు తెల్సిన స్నేహితురాలికి తల్లి లేదు. అత్తగారు చేయలేని మనిషి. ఆరువారాల పాపని తీసుకెళ్లి డేకేర్ లో పెట్టారు భార్యాభర్తలు. ఉద్యోగం వదలుకోలేని పరిస్థితి లో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇవన్నీ ఆలోచించే  చాలా మంది పిల్లలని చూసుకోవడానికి (ముఖ్యం గా ఏడాది లోపు ఉన్న పిల్లలని) ఇండియా నుంచి తల్లితండ్రుల్ని రమ్మని అడుగుతారు. వాళ్ళు రాలేని  పక్షం లో పిల్లలని ఇండియా కి పంపుతారు.  నేను ఇప్పటివరకు చూసిన  కుటుంబాలలో, ఓపిక లేని తల్లితండ్రులు  అమెరికా కి రాలేము అంటున్నారు.  ఓపిక  ఉన్న వారు అత్యంత ఉత్సాహం తో  మనువల ని, మనవరాళ్ల ను చూసుకుంటున్నారు.  అంతే కానీ అమెరికా లో నివసించే తెలుగు వారు వ్యాసకర్త చెప్పేంత వ్యాపార ధోరణి లో మాత్రం లేరు.

భారత దేశం నుంచి అమెరికా కి వచ్చే అమ్మాయిలు బాగా చదువుకున్న వారే అయి ఉంటున్నారు. అటువంటి వారు  ఉద్యోగం మానేయలేరు కదా. ఇంత చదువు చదువుకుని ఇంట్లో కూర్చోవటం ఏమిటి అన్పిస్తుంది.  

ఒకప్పుడు నేనూ  పైన చెప్పిన వ్యాసకర్త లాగే ఎందుకింత అత్యాశ అని ఆలోచించేదాన్ని. డబ్బు ఇంత అవసరమా అని అనిపించేది.  కనీసం పిల్లలు పెద్దవాళ్ళయ్యాక  ఉద్యోగాలు చేయవచ్చు కదా అనుకునేదాన్ని కూడా!!  కానీ,  కొన్ని స్వానుభవాలు, ఇతరుల అనుభవాలు చూసాక మరియు చూస్తున్నాకా,   నా అభిప్రాయం ఈ విధం గా మార్చుకున్నాను  :  అమెరికా లో ఎటువంటి పరిస్థితి లో అయినా సరే ఇద్దరు ఉద్యోగాలు తప్పనిసరిగా చేయాలి.  అమెరికా జీవితం పేక మేడ లాంటిది అని చెప్పవచ్చు. అన్నీ బాగా ఉన్నపుడు అందమైన జీవితం లాగే ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం పోయినా, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బ తిన్నా ఒక్క సారి  జీవితం అంతా  తారుమారు  అయిపోతుంది. భారత దేశం లోను ఇదే పరిస్థితి వస్తోంది కూడా !! ఈ విషయాల గురించి ఇంకొక టపా  లో వ్రాస్తాను.

తోటి తెలుగు మాతృమూర్తులని  ఆ విధంగా క్రించపరచినందుకు చాలా  బాధ వేసి ఈ టపా వ్రాయడం జరిగింది.   ఏ తల్లయినా ఎప్పుడైనా  ఏ పని చేసినా  పిల్లల కోసమే చేస్తుంది అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశ్యం. డబ్బు కోసం అత్యాశ అనుకుంటే అసలు అమెరికాకే వలస రానక్కరలేదేమో కదా !!

గణేశుడి పూజ

వినాయక చవితి, నిమజ్జనం  ఎప్పుడో అయిపోయి దసరా కూడా వచ్చేస్తుంటే  ఈ టపా ఇప్పుడు పెట్టానంటారా ? వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్లు, ఈ టపా కట్టి  దాదాపు రెండు వారాలు  అయినా పోస్టు చేయడం కుదరలేదు. ఇండియా వెళ్లి జెట్ లాగ్, బెంగ  తీరేసరికి కొంచం సమయమే పట్టింది. ముఖపుస్తకాలలో,  బ్లాగుల్లో వినాయకుళ్ళని చూసాక, మా బాలవికాస్ చేసే  వినాయక చవితి పండగ గురించి తప్పక వ్రాయాలన్పించింది.  Better late than never అంటారు కదా !!

గత 30 ఏళ్ళు గా, ఈ పండగని ప్రతి ఏడాది  చాలా ప్రత్యేకమైన రీతిలో  చేయిస్తున్నారు మా బాలవికాస్  వారు. మా బాలవికాస్ వారు జరిపే ఈ వేడుకను 2008 లో PBS ఛానల్ వారు వారి డాక్యుమెంటరీ “The Asian & Abrahamic Religions: A Divine Encounter in America లో  చిత్రీకరించడం కూడా జరిగింది.

ఆ ప్రత్యేకతలు ఏమిటంటే:

ఈ పూజ ని పిల్లలు మాత్రమే   చేస్తారు…  అంతే కాదు…  వినాయ చవితి  కథలు, గణపతి కి భజనలు, పాటలు, పూజా  విధానం, ఫల శృతి,  పురుష సూక్తం, మంత్రం పుష్పం, హారతి  ఇవన్నీ కూడా పిల్లలే చెప్తారు…. అవును పిల్లలే!!   అదే మా బాలవికాస్ ప్రత్యేకత!!  మా బాలవికాస్  గురువులు ఏ  ప్రార్థనయినా, మంత్రమైనా  పఠించేముందు అర్ధం తెలుసుకోవాలి అంటారు. అందుకే పిల్లలు ఈ వేడుకలో ఫలశృతి దగ్గర నుంచీ  మంత్రం పుష్పం వరకూ స్పష్టం గా పఠించి, వాటి అర్ధం కూడా వచ్చిన ప్రేక్షకులకి ఆంగ్లం లో విడమరచి చెప్తారు.  రాజోపచారాలు కూడా చాలా శాస్త్రోక్తం గా చేస్తారు.   నృత్యం దర్శయామి అన్నపుడు పిల్లలు నాట్యం చేస్తారు. గీతం శ్రావయామి అన్నపుడు పాటలు పాడతారు.  

img_1334

ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ముఖ్య పూజకి మూడు అడుగుల మట్టి గణపతిని కూడా మా బాలవికాస్ మునుపటి విద్యార్థుల మాతృమూర్తి ఒకరు  చేస్తారు. ఆవిడ ఎప్పట్నించీ  చేస్తున్నారో, 11 ఏళ్ల బట్టీ  మా పిల్లలని బాలవికాస్ తీసుకువెళ్లే,  నాకు కూడ తెలియదు.. పూజకి కొన్ని రోజుల ముందు కొంత మంది వాలంటీర్లు మట్టి తెచ్చి ఆవిడకి ఇస్తారు. ఒక్కొక్క సారి ఆ మట్టిలో  రాళ్ళూ ఉంటాయి. అలాంటప్పుడు  దానిని జల్లించి, రాళ్లు లేకుండా ఏరి, తడిపి  ఆ మట్టి తో వినాయకుడిని చేస్తారు. ఆ రోజుకి గణపతికి క్రొత్త పంచె కడతారు.  పొద్దుటికల్లా  విగ్రహాన్ని తయారుచేయడానికి ఒక్కోసారి ఆవిడ రాత్రంతా శ్రమించిన రోజులు ఉన్నాయిట.  పాలవెల్లి కూడా వారి కుటుంబమే తాయారు చేసింది.  

img_1327-1

ముందు రోజు  రాత్రి  కొంత మంది వాలంటీర్లు  మండపం, స్టేజి అలంకరిస్తారు. పొద్దున్నే వినాయకుడిని తెచ్చి అప్పుడు పాలవెల్లిని అలంకరిస్తారు.

మా బాలవికాస్ పిల్లలే కాక అందరు పిల్లలూ  ఈ వేడుక కి ఆహ్వానితులే.   వచ్చిన ప్రతి పిల్లలకీ  ఒక పళ్లెం లో  చిన్న వినాయకుడి విగ్రహం, పత్రీ, పూలు  ఇచ్చి పూజ చేయిస్తారు. ఆ విగ్రహం ఇంటికి తీసుకెళ్ళచ్చు. కానీ ఒక నియమం మీద మాత్రమే …   అది ఏంటంటే తీసుకెళ్లిన పిల్లలు ప్రతి రోజు క్రమం తప్పకుండా వినాయకుడిని ధ్యానించుకోవాలి.   

img_1332

 

img_1333

దాదాపు పిల్లలు, పెద్దలు కలిపి 400 మంది దాకా ఈ వేడుకకి విచ్ఛేస్తారు. పూజ అయ్యాక అందరికీ  ఉండ్రాళ్ళ ప్రసాదం తో చక్కటి భోజనం వడ్డిస్తారు మా బాలవికాస్  తల్లులు. పూజంతా అయ్యాక ఒక పైప్ తో పిల్లలతోటే నీళ్లు పోయించి విగ్రహాన్ని నిమజ్జనం చేయిస్తాము.  ఈ పూజా కార్యక్రమం అంతా ఒక గుడిలో జరుగుతుంది.  

ఈ గణపతి పూజ వేడుక కి  దాదాపు రెండు నెలల నుంచి తయారవుతుంటారు బాలవికాస్  పిల్లలు.  పదేళ్లు దాటిన ఒక  అమ్మాయిని మరియు ఒక  అబ్బాయిని Master of Ceremonies గా పిల్లలే  ఎన్నికల ద్వారా ఎంచుకోవడం జరుగుతుంది. ఎన్నికల పోటీ బాగానే ఉంటుందండోయ్ !! ఎన్నికలలో నిలుచున్న పిల్లలు వారిని ఎందుకు ఎన్నుకోవాలో ముందు గా చెప్తారు – మేము చాలా  బాగా స్పష్టం గా మాట్లాగలమనో , స్టేజి మీద మాట్లాడటం భయం లేదనో  కాబట్టి మమ్మల్నే  ఎన్నుకోండి అంటూ రకరకాల ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటారు.  అదొక వేడుక గా ఉంటుంది. ఈ  Master of ceremonies కాక  పూజ లోని ప్రతి భాగాన్ని  ఒక్కొక్కరికీ  ఇవ్వటం జరుగుతుంది.    ఐదేళ్ల పిల్లల దగ్గరనుంచి పదిహేనేళ్ల  పిల్లల వరకు మైకు పట్టుకుని ఈ కథలని  విచ్చేసిన ప్రేక్షకులకు  చెప్పడానికి  ఉత్సాహం గా ముందుకు వస్తారు.ఆ విధం గా ఎండాకాలం సెలవలు ఉన్న రెండు నెలలు ప్రాక్టీసులు చేస్తారు పిల్లలు.   

మా పిల్లల్ని ఈ విధం గా తీర్చి దిద్దుతున్న గురువుల గురించి ఎంత చెప్పినా  తక్కువే!! అందుకే వారి గురించి టపా  వ్రాసే ముందు బాలవికాస్ చేసే కార్యక్రమాలు ఒక్కొక్కటీ ముందు వ్రాస్తున్నాను.

విజయవాడ జంక్షన్

విజయవాడ రైల్వే స్టేషన్ లో  రైళ్లు ఆగిపోయాయి అన్న వార్త చదివాకా , ఈ రోజు భండారు శ్రీనివాస రావు గారి బ్లాగు చదివాకా  కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఎండాకాలం సెలవల్లో ఒక్కోసారి మేము పిల్లలం ముగ్గురమే కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బిట్రగుంట కి వెళ్లేవారం.  పగటి పూట  ప్రయాణం కాబట్టి మా నాన్న గారు కూడా బాగా ప్రోత్సహించేవారు మమ్మల్నే వెళ్ళమని.  పొద్దున్న 6 ఆరింటికి సికింద్రాబాద్ లో ఎక్కితే సాయంత్రం 5:40 కి బిట్రగుంట చేరుకునేవాళ్ళం. అస్సలు పడుకోకుండా అన్ని స్టేషన్లు లెక్కపెట్టేవాళ్ళం.  అందుకే  ప్రతి స్టేషన్ పేరు బాగా గుర్తుంది పోయింది ఈ రోజు వరకూ  కూడా.  విజయవాడ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఊరికి సగం ప్రయాణం అయినట్లు లెక్క.  దగ్గరికి వచ్చేసినట్లేగా !! విజయవాడ రాగానే భోజనాలు మొదలు పెట్టేవాళ్ళం.  ఒకవేళ మంచినీళ్లు లేకపోయినా విజయవాడ లో దిగి పట్టుకోవచ్చు ట్రైన్ ఎక్కువ సేపు ఆగుతుంది అని.   ఒక్కోసారి విజయవాడ లో ఉండే  మా పిన్ని కుటుంబం కూడా కృష్ణా ఎక్స్ ప్రెస్ లో  మాతో కలిసేవారు. మా తమ్ముడు తిట్టుకుంటూ , మమ్మల్ని కొరకొరా చూస్తూ,  చిన్నవాళ్ళయిన పిన్నికొడుకులకి కిటికీ సీటు ఇచ్చేవాడు. విజయవాడ స్టేషన్  దాటగానే కృష్ణ బ్రిడ్జి చూడటం,  నాణాలు విసరటం!!  ఆ బ్రిడ్జి చూడటం ఈ రోజు కి కూడా ఒక మధుర అనుభూతి లా అన్పిస్తుంది. మా అమ్మాయి కూడా  మొన్న భారత దేశం వెళ్ళినపుడు  మొదటిసారి ఆ బ్రిడ్జి చూసి ఒక్కసారిగా  ‘wow’ అంది. అర్ధరాత్రి ఎంత నిద్ర మత్తులో అయినా బ్రిడ్జి  శబ్దం రాగానే  తెల్సిపోతుంది విజయవాడ దాటిందో లేదో !!   

ఎండాకాలం ముగియగానే, బిట్రగుంట నుంచి తిరిగి వచ్చేటపుడు హైదరాబాద్-మద్రాస్ ఎక్స్ ప్రెస్ లో వచ్చేవాళ్ళం. ఆ బండి లో  రిజర్వేషన్ దొరక్కపోతే , మా నాన్న గారు హైదరాబాద్ లో నే విజయవాడ  నుంచి నరసాపూర్  ఎక్సప్రెస్  లో టిక్కెట్లు కొనేవారు. అదెలా చేసారో ఆ రోజుల్లో నాకైతే తెలీదు. ఆ విషయం టెలిగ్రామ్/ఉత్తరం ద్వారా మా తాతయ్య కి చెప్పేవారు.  మేము  బిట్రగుంట నుండి లింక్ ఎక్స్ ప్రెస్ (ఇప్పుడు చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్  అనుకుంటా)  లో  విజయవాడ వెళ్లి అక్కడ  నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కేవారం.  ఆ విజయవాడ ప్లాటుఫారం మీద క్యారేజీ తీసి భోజనాలు పెట్టేది మా అమ్మ.  లేకపోతే టైం ఉంది అనుకుంటే గాంధీనగర్ లో మా నాన్న స్నేహితుడయిన మావయ్య వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం . అప్పుడు మాత్రం విజయవాడ స్టేషన్, బ్రిడ్జి చూస్తే మహా చిరాకుగా ఉండేది. మరి ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా  !! ఒకసారి నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి  ఆరోజు  ఏదో ఆడుకోవాలని   ప్లాన్ చేసుకున్నాం. ఉన్నట్టుండి మా తాతయ్య వచ్చి బయలుదేరాలి అన్నారు. గబగబా భోజనం చేసి మధ్యాహ్నానికల్లా లింక్ ఎక్స్ ప్రెస్  ఎక్కాము .  మా నాన్న మీద ఆ రోజు ఎంత కోపం వచ్చిందో !!

1980 లో అనుకుంటా.  విజయవాడ-గూడూరు సెక్షన్ మాత్రమే ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉండేవి. సికింద్రాబాద్ వెళ్లే బళ్ళు విజయవాడ లో ఎలక్ట్రిక్ నుంచి డీజిల్ ఇంజిన్ కి మారేవి. బిట్రగుంట నుంచి విజయవాడ వరకు చాలా  ఫాస్ట్ గా వచ్చినట్లు అన్పించేది.

ఎప్పుడూ  ప్రయాణీకులతో 24 గంటలు అనౌన్సమెంట్ లతో  కళకళలాడిపోయే  నిశ్శబ్దం గా  విజయవాడ జంక్షన్ ఎలా ఉంటుందా అన్పించింది ఈ రోజు.

ఇండియా ట్రిప్

ప్రతి రెండేళ్లకో మూడేళ్లకో  వెళ్లే ఏ రెండో మూడో వారాలకే  ఎన్నో ప్రణాళికలు.. .. ఉన్న ప్రతి క్షణాన్నీ  ఆస్వాదించాలన్న తపన.. ఆత్మీయులైన ప్రతి ఒక్కరినీ  కలవాలన్న ఆరాటం..

దుబాయ్ లో బయలుదేరిన విమానం చక్రాలు తెలుగు నేలను తాకగానే  ఇంటికి వచ్చేసాం అంటూ గెంతులు వేసే మనసు..

img_2172

ఎప్పుడొస్తారా చూద్దాము అనే కుటుంబ సభ్యుల ఎదురుచూపులు, బంధువులు & స్నేహితుల  ఆప్యాయమైన పలకరింపులూ & ఆహ్వానాలు, ‘ఎప్పుడొచ్చావు’ అంటూ తలుపు కొట్టి పలకరించే చుట్టూ పక్కల వారు,  శ్రావణమాసపు పేరంటాలు,  కమ్మనైన తాజా కూరల తో,  పిండివంటల తో కొసరి కొసరి వడ్డించే విందు భోజనాలు….

వాహనాల శబ్దాలు, హారన్  మోతలు,  ఎటు చూసినా నడిచే జనాలు, రోడ్డు పక్కనే తినుబండారాల బండ్లు,   రద్దీగా ఉండే దుకాణాలు,  ఏ  workout చేయకుండానే మొహాన  చమటలు పట్టించే ఎండ…

…..  అవే విమానం చక్రాలు ఆ నేలను వీడగానే మళ్ళీ  ఎప్పుడు వెళదామా అన్న ఆలోచనలు…

img_1036

అన్నీ  కలిపితే ….ప్రతి ప్రవాసుడికీ  ముఖ్యమైనది …  ప్రియమైనది .. .  అత్యంత మధురమైనది…   ‘ఇండియా ట్రిప్‘ – భారతదేశయాత్ర.

 

చాగంటి వారు మరియు వారి ప్రవచనములు

ఇంట్లో రోజూ వారీ  పని, పిల్లలు, వాళ్ళ బడులు , హోంవర్కులు అనేవి అందరికీ  ఉండే   బాధ్యతలు.అమెరికా లో నివాసించే మా లాంటివారికయితే  రెండు సంస్కృతుల  మధ్య పిల్లల ని పెంచటం అనేది ఇంకా అదనపు బాధ్యత. ఈ వత్తిడి తట్టుకోవడానికి ఒక్కొక్కరం  ఒక్కో విధానం ఆచరిస్తుంటాము. పుస్తకాలు, సినిమాలు, పూజలు… ఇలా రకరకాలు. నేను అనుసరించే  విధానం తెలుగు పత్రికలు చదవటం, పాటలు, సంగీతం  వినటం. ఇలా అనుకోకుండా ఒక రోజు బ్రహ్మశ్రీ చాగంటి గురువు గారి ‘గంగావతరణ  ఘట్టం’ ప్రవచనము  వినడం జరిగింది. దీనిని గురించి  నా పాత టపా రామాయణం – ఒక అద్భుత కావ్యం లో చెప్పడం జరిగింది.  అలా చాలానే ప్రవచనాలు విన్నాను. ఏ  విషయమైనా ఇంకో కోణం లో నుంచి చూడటం మొదలు పెట్టాను.  ఆ విధం గా ప్రవచనాలు నన్ను నేను సంస్కరించుకోవడానికి, ఈ వత్తిడి నుంచి కాపాడుకోవడానికి  అన్పించింది.  

కానీ ఒక రెండు రోజుల క్రితం  అనుకోకుండా చాగంటి గారి ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ లో చూసాక ఆయన చెప్పిన విషయం విని అంతకుమించి ఆలోచించలేకపోయానే అనుకున్నాను.

ఇంటర్వ్యూ మొత్తం రెండు భాగాలు గా  ఉంది.  లంకెలు ఇస్తున్నాను.

మొదటి భాగం https://www.youtube.com/watch?v=D4jsD6ewKk8

రెండవ భాగం https://www.youtube.com/watch?v=20YxX5rECE0

ఆ ఇంటర్వ్యూ  లిఖిత పూర్వకం గా  ఈ లంకె లో ఉన్నది.  వీడియో చూడలేని వారు ఇది చదువుకొనవచ్చును.

http://www.sakshi.com/news/family/leelalu-stories-in-the-dark-is-not-a-service-to-the-community-273240

విజయ్ కుమార్  గారు చాగంటి వారి ని  “యువత కి సమాజ హితమే భక్తి అని చెప్పడానికి మీరేం చేస్తారు? ” అని ఒక ప్రశ్న వేశారు.  దానికి చాగంటి వారు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరు విని తీరాలి.  చాగంటి గారు ప్రవచించిన భాగవతం విని, బీటెక్  చదువుతున్న ఒక అమ్మాయి  చేసిన సమాజ సేవ గురించి వివరించారు.  అది నేను వివరించేకన్నా ఆయన చెప్పినది  వింటేనే  బావుంటుంది.

సాక్షి వారి వెబ్సైటు లోనే ఈ విధంగా వ్రాసారు:

“నేను ఒకప్పడు భాగవతం గురించి చెబుతూ కృష్ణలీలలన్నీ కథలు కాదు సమాజసేవని చెప్పాను. పూతన సంహారం సమాజసేవ. కాళీయమర్దనం యమునానది నీళ్లు పాడవకుండా చేసిన సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషం పొందాడు. అవే మనం నేర్చుకోవాలని చెప్పా. ఆ తర్వాత కొద్దిరోజులకి ప్రవచనానికి వెళ్లిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి. ఎవరు నువ్వనడిగితే బీటెక్ చదువుకుంటున్నాను, మీకు నమస్కారం చేయాలని వచ్చానంది. నేను ప్రవచనానికి వెళుతున్నానమ్మా మళ్లీ వెనక్కివచ్చి నీతో మాట్లాడే సమయం లేదన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు కనబడ్డారు చాలు నమస్కారం అంది. ఇద్దరం లిఫ్టులో దిగుతుండగా నాకు నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగాను. మీ మాటల వల్ల ప్రేరణ చెందానని చెప్పడంతో ఆశ్చర్యపోయి ఏం ప్రేరణ చెందావని అడిగా. మీరు చెప్పిన కృష్ణలీలలు సమాజ సేవన్నారు అది ప్రేరణ కల్పించిందని, నా స్థాయిలో సమాజ సేవ చేశానంది. కారెక్కబోతున్నవాడిని ఆగి ఏం సమాజ చేశావని అడిగాను. ప్రతిరోజూ ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటానని, నిరక్షరాస్యులు, రూపాయి లేని వాళ్లకి, ఓపి టికెట్ రాయడం రానివారికి సహాయపడతానని చెప్పింది. వాళ్లకి వార్డులు చూపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, మందులిప్పించి పంపిస్తానంది. ఈ మధ్య ఇంట్లో కాలుజారి పడిపోయిన ఒక గర్భిణీని ఇక బతకదు అన్న స్థితిలో తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన ఉపకారం వల్ల ఆవిడ బతికి ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఆ పిల్లకు తన పేరు పెట్టుకున్నారని, అది తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పింది.

నేను కారెక్కి వెళ్లిపోతున్నవాడిని ఆగి ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్లి పసుపు కుంకుమలు, బట్టలూ ఇచ్చి పంపాను. దీన్ని ఒకసారి టీవీ లైవ్‌లో చెప్పాను. దాన్ని చూసి చాలామంది పిల్లలు ఇది తమకు నచ్చిందంటూ తాము కూడా సమాజ సేవ చేస్తున్నామని ఉత్తరాలు రాశారు”  

చాగంటి గారివి కొన్ని గంటల  ప్రవచనాలు విన్నాను నేను. వినటానికి మాత్రం చక్కగా విన్నాను.  కానీ ఒక్కరోజు కూడా పైన చెప్పిన అమ్మాయి లాగా ఎందుకు ఆలోచించలేదు అని నన్ను నేను  ప్రశ్నించుకున్నాను.

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే – కొంతమంది ఆయన ప్రవచనాలు విని  సగమే అర్ధం చేసుకుని, మిగితా సగం వదిలేస్తున్నారు . అటువంటి వారు  చేసే చాదస్తపు  పనులు చూస్తే   చాగంటి వారంటే తెలియని వారికి  కూడా విసుగు కలుగజేస్తుంది.  దాని నుంచి ఆయనని చూస్తే తెలియని చికాకు, ద్వేషం మొదలవుతుంది.   ఉదాహరణ కి రోజుకి రెండుసార్లు సంధ్యావందనం చేయాలి అని  చెప్తే, అమెరికా లో మంచుతుఫాను పడ్డా ఇంట్లో పనులన్నీ ఆపేసి సంధ్యావందనం చేసే చాదస్తులు ఉన్నారు. గంధం పెట్టామా, బొట్లు పెట్టామా, కుడి వైపా , ఎడమ వైపా – ఇటువంటి చాదస్తాలు లెక్క ఉండవు !! నా అనుభవం లో ఒక ఉదాహరణ కూడా  చెప్తాను. అమెరికా లో దేనికి భయపడకపోయినా  అగ్గి అంటే భయపడతారు . ప్రతిదీ చెక్కలతో కట్టి ఉంటారు కాబట్టి. ఒక రోజు ఆయన, ‘ దీపం రోజు వెలిగించాలి ఇంట్లో’ అంటూ ఏదో చెప్తున్నారు. అది విని,  నాకున్న పరిస్థితి కి నూనె వేసి రోజూ దీపారాధన చేయలేను కదా. దేవుడి మందిరం లో ఒక చిన్న lamp పెట్టుకుని అదే దీపారాధన అనుకుంటాను. పండగ రోజులలో మాత్రమే దీపారాధన చేస్తాను. 

ఈ సోషల్ మీడియా లో కొందరు వీడియో లు తమకి  కావలసినంత మేరకి  కత్తిరించి పంచుతున్నారు. ఈ రెండు నిమిషాల వీడియో లు చూసి ఆయన ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో అర్ధం కాదు మొట్ట మొదట చూసిన వారికి.  42  రోజుల  రామాయణం, 35 భాగాల భారతం  విన్న నేనే,  పైన చెప్పిన అమ్మాయి లాగా ఒక్క రోజు ఆలోచించలేదు. ఈ రెండు నిమిషాల వీడియో చూసిన వారికి ఇక ఏ  అవగాహన వస్తుంది ఆయన ఏమి చెప్తున్నారో ?

చాగంటి వారు ప్రవచనం అనేది అందరికీ  ఒకటే చెప్తారు. ఇన్ని వేలమంది వింటూ ఉంటే, ప్రతి ఒక్కరికీ customize చేసి చెప్పలేరు కదా. మనకి ఏది కావాలో అది మనమే గ్రహించుకోవాలి!!  పైన చెప్పిన అమ్మాయి లాగా సమాజ సేవ చేయకపోయినా పరవాలేదు  కానీ  ఆయన చెప్పేది సమాజహితవు కోసమే అని అన్న ఒక్క విషయం గ్రహించగలితే  చాలు!!

శిక్ష వేస్తే సమస్య తీరిపోదు

చాలా రోజుల తరువాత స్నేహితురాలి దగ్గరనించి సందేశం. ‘ఏ వీడియో నో ఏ  సూక్తి ముక్తావళి’ పంపిందో అని చూసా.  ఒక కారు ప్రమాదం వార్త.  పేపర్ లో ఎప్పుడూ చదివే వార్త ల్లాగా పక్కన పెట్టా. కాసేపయ్యాక ఇంకొక సందేశం ‘ఎవరో గుర్తు పట్టావా ‘ అంటూ.  ఎవరో గుర్తు చెప్పేసరికి, బాధ మొదలయింది.  ఆ వార్త మొత్తం మళ్ళీ గబా గబా చదివాను. గుండె ని పిండేసినట్టయింది.  ఆ రోజు ఇక ఏ పని చేయబుద్ధి కాలేదు. ఏం  చేస్తున్నా ఆ వార్తే గుర్తు వస్తోంది. పెళ్ళై అమెరికా కి వచ్చేసాక  పెద్దగా మాట్లాడింది లేదు తనతో. తనకి ఇంతటి  కష్టం ఏంటి అని మనసు తొలిచేసింది. ఆ వార్త ఇటీవలే జరిగిన  పంజాగుట్ట లో జరిగిన కారు ప్రమాదం.  అందులో మరణించిన ఆ చిన్నారి రమ్య, తల్లి రాధిక నాకు స్నేహితురాలు.

మీడియా లో వచ్చిన వార్తలని బట్టి  నాకు అర్ధం అయింది ఏంటంటే –  కొందరు  కుర్రవాళ్ళు మిట్ట మధ్యాహ్నం బార్ కి వెళ్లి మద్యం సేవించారు. అందులో డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఒక ఇరవయ్యేళ్ళ కుర్రవాడు ఇంకొకరి కారు నడిపాడు. మద్యం త్రాగి నందు వల్ల  కారు అదుపు తప్పి, రాధిక  కుటుంబం  ప్రయాణిస్తున్న కారు మీద ఎగిరిపడింది.  ఇది వింటే ఎన్నో ప్రశ్నలు :

  • ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళు  బార్ల వెంట తిరగటం ఏంటి ?
  • అసలు మిట్ట మధ్యాహ్నం తాగడం ఏంటి ?
  • వీళ్ళ కి మద్యం అమ్మిన ఆ బార్ వాళ్ళు ఎవరు?
  • అంత డబ్బు కుర్రవాళ్ళకి ఎక్కడిది?
  • లైసెన్స్ కూడా లేకుండా తనది కాని  కారు నడపడటం ఏంటి ?
  • ఎంత వేగం తో వచ్చి ఉండకపోతే  కారు గాల్లో ఎగిరిపోతుంది?  

ఇటువంటి వారికి కఠిన శిక్ష పడాలనే అంటాను.  కానీ ఇతన్ని ఒక్కడ్ని శిక్షించినంత మాత్రాన  సమస్యలు తీరి పోతాయా ? రేపు ఇంకొకరు చేస్తారు. నేను పైన చెప్పిన  ప్రశ్నలకి  ఈ కుర్రవాడు ఒక్కడే నా  బాధ్యుడు? చుట్టూ ఉన్న సమాజం బాధ్యత కూడా లేదంటారా ?  చట్టాలు ఎంత కఠినం గా ఉన్నా,   ఈ పరిధిని అతిక్రమించకూడదు అన్న సామాజిక స్పృహ, నైతిక విలువలు మనలో ఉన్నపుడే  ఏవైనా పనికి వస్తాయి.  లేకపోతే పుస్తకాలకే పరిమితం అవుతాయి అని నా అభిప్రాయం.

మరి యువతకి  సామాజిక స్పృహ, నైతిక విలువలు ఎవరు నేర్పిస్తారు ? తల్లి తండ్రులా ? ఉపాధ్యాయులా ? అన్ని వేళలా  ‘Live’  అందించే మీడియా వారా? పోలీసులా ? చట్టమా?

మన సినిమాలలో కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని, వేగం గా కారు/బైకు  నడుపుతూ   హీరో ప్రవేశించడం  జరుగుతుంటుంది. అలా  హీరో ని చూడగానే హాలులో ఈలలు మొదలవుతాయి.  ఇలా చేస్తే అమ్మాయిలు మనవెంట పడతారు కదా అనిపిస్తుంటుంది.  సినిమా నిజజీవితం లో ప్రవేశిస్తుంది.  దురదృష్టవశాత్తు  సినిమా హీరోలని  ఈ విధం గా అనుకరణ చేయడం మొదలుపెడతారు యువత!!

‘నేను తాగను. నాకు అలవాటు లేదు ‘ అన్న మాటలు ఎవరైనా చెప్తే, ‘అప్పుడప్పుడు కొంచం ఫార్మాలిటీ కి అన్నా తాగాలండి. ఇలా చేతులు ముడుచుక్కూర్చుంటే బాగోదు’  అంటూ హేళన ధ్వనించిన  మాటలు వినపడతాయి. లేదా  ‘మందు తాగని వాడు దున్నపోతై పుట్టున్’  అన్న రీతి లో హాస్యోక్తులు ఉంటాయి .  పైగా అటు పక్కకి వెళ్లి  ‘వీడొక పెద్ద మమ్ముగాడ్రా!!’ అంటుంటారు కూడా !! వేడుక ఏదైనా సరే మద్యం తాగితేనే ఆ వేడుక పూర్తయినట్లు  కొందరికి. ఇంకా సినిమాలలో , వాట్సాప్ , ముఖపుస్తకాలలో ‘మందు బాబులు’ అంటూ హాస్యోక్తులు సరే సరి!! ఇటువంటి మాటలు  చాలవా  యువత peer pressure కి లోనవ్వటానికి?

0.08% Blood alcohol చాలు మనిషి మెదడు ని మందగింపచేయడానికి  అంటారు ఇక్కడ DMV( Department of Motor Vehicles) వారు .  దీన్ని బట్టీ, పూర్తిగా మత్తు లోకి వెళ్లిన మనిషి కారు నడపడటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.   తుపాకీ పట్టుకు పేల్చే వాడికి, మద్యం తాగి నడిపే వాడికి ఏమీ తేడా లేనట్లే లెఖ్ఖ. తన జీవితమే కాదు ఇంకొకరి జీవితాన్ని కూడా ప్రమాదం లోకి త్రోస్తున్నాడు కదా . అంతే కాదు, మద్యం త్రాగిన వాడు విచక్షణా జ్ఞానం కోల్పోయి  క్రూర జంతువు కంటే హీనం గా ప్రవర్తిస్తాడు కూడా. అందుకు  భయంకరమైన ఉదాహరణ ఢిల్లీ నిర్భయ కేసు.  ఇప్పుడు భారతదేశం లో కూడా దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంట్లో కారు ఉంటోంది.  కాలేజీ కి వెళ్ళడానికి పిల్లలు  కారు/ బైకు నడుపుతున్నారు. విద్యాలయాలు తమ వంతు బాధ్యతగా  పిల్లలకి  Driver’s Education విషయం లో తప్పనిసరిగా  తరగతులు నిర్వహించాలి.   

నేను భారతదేశం వచ్చినపుడు గమనించిన కొన్ని విషయాలు చెప్తాను  –

ఏ షాప్ కి వెళ్లినా విపరీతమైన రద్దీ. చీరలు, నగలు అన్ని ఎందుకు కొంటారో అర్ధం కాదు. నేను మూడేళ్ళకి ఒకసారి వెళ్లి కొనుక్కునే సరుకు వీరు రోజూ  కొంటారా అన్పిస్తుంది.   ఒక బ్లౌజ్ మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటారు.  ఏ రెస్టారంట్ కి వెళ్లినా  లైన్ లో నిల్చునేటట్లు ఉంటారు. ఇంక పెళ్లి అంటే చెప్పలేము. ఎక్కడ లేని ఆర్భాటం!!  నూరు రకాల వంటలు, ఫుడ్ కోర్టులు (ఒక ఆడపిల్ల తండ్రి జీవితమంతా కూడబెట్టిన డబ్బు ఒక్క రోజు లో నీళ్ళల్లాగ ఖర్చు చేయటం).  ఇంత విచ్చల విడి గా డబ్బు ఖర్చుపెట్టడం నేను అమెరికా లో ఎక్కడా  చూడలేదు అంటే అతిశయోక్తి కాదేమో. భారత దేశం నిజం గా  బీద దేశమేనా  అన్పిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. డబ్బు ఉంటే ఖర్చుపెట్టడం తప్పు కాదు. ఇంత డబ్బు, సమయం ఇటువంటి వాటికి  వెచ్చించే  వారు సమాజ సేవ కి కొంత కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 

నేను షాపింగ్ కి వెళ్తున్నాను అంటే అందులో పెద్ద వింత కన్పించదు. రామకృష్ణ మఠం  వెళ్తున్నాను భోజనాలు పెట్టడానికి, అక్షయపాత్ర వంటిల్లు చూడ్డానికి వెళదామనుకుంటున్నాను అని చెప్తే నన్నొక తేడా మనిషి లాగా చూస్తారు.  సేవ  లేక service hours అన్న ప్రసక్తి  సామాన్య కుటుంబాలలో అంతగా లేదు. సేవాభావం  ఎప్పుడైనా ఎవరికైనా  ఒక బాధ అనుభవించినపుడు లేదా బాధ పడ్తున్న వారిని చూసినపుడో వస్తుంది. దాని నుంచే బాధ్యత అన్నదీ వస్తుంది. ఎప్పుడూ  పిల్లలకి ఏ  కష్టమూ లేకుండా సుఖమయమైన జీవితం చూపిస్తుంటే వారు మాత్రం ఏమి చేస్తారు ?  సామాజిక స్పృహ అన్నది లేకుండా  బాధ్యతా రహితంగానే తయారవుతారు.  అందరూ తల్లితండ్రులు అలా ఉన్నారని  చెప్పను కానీ  పిల్లల లో సేవాభావం కలుగజేస్తున్న తల్లితండ్రుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది.

ఇలాంటి  ప్రమాదాలు జరిగినపుడు మనకి నేరస్తుడి మీద ఆగ్రహం కలగటం సహజం.  కానీ వారి చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక మనిషిని నేరస్థుడి గా తయారు చేస్తుంది అని అంటాను నేను.  

ఈ వార్త చదివిన ప్రతి కుటుంబం,  వారి పిల్లలతో –  బాధ్యతారహిత  ప్రవర్తన ఒక ఆనందమయమైన జీవితం గడుపుతున్న కుటుంబాన్ని ఎంత  చిన్నాభిన్నం చేసిందో,  ఎంతటి దుష్పరిణామాలు కలుగచేస్తుందో తెలియజెప్పాలి.