కాలచక్రం

పొద్దున్నే పని కి రాగానే తేనీరు కలుపుకుంటూ బయటికి చూస్తుంటాను. కాలచక్రం ఎలా గడిచిపోతోందో కనిపిస్తుంటుంది ఇలాగా!!  జీవిత సత్యం ఏదో బోధపడుతున్నట్లు అనిపిస్తుంది.

అమెరికా లో  ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క అందాన్ని సంతరించుకుంటుంది. దానికి తోడు ఆ అందాలని మెరుగు పరచడానికి ల్యాండ్ స్కేపింగ్, ప్రతి ఇంటి వారు తోట మీద చూపించే  శ్రద్ధ వలన ప్రకృతి ఇంకా అందంగా కన్పిస్తుంది. చిన్నపుడు Deciduous forest (ఆకురాల్చు)  గురించి చదువుకోవడమే. ఇప్పుడు చూస్తున్నాను ఈ అందాలని !!

వసంతం

img_0297

 

గ్రీష్మం

img_0523

 

శరదృతువు

img_0751

 

హేమంతం

img_1105

 

తీర్పు పంచిన కాలక్షేపం

అమెరికా లో గురువులని, వైద్యులని వాళ్ళ ఇంటి పేరు తో పిలవటం పరిపాటి. మా చిన్నమ్మాయి సోషల్ టీచరే  ఇదివరకు మా పెద్దమ్మాయి టీచర్ కూడా.  మా పెద్దమ్మాయి ఆ క్లాస్ లో ఉన్నపుడు ఆవిడకి పెళ్లి కాలేదు. అప్పుడు ఆవిడ పేరు Mrs.A (పుట్టింటి పేరు). బడులు తెరిచాక తెల్సింది ఏంటంటే  ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారనీ. ఇక రోజు  ఆ పెళ్ళి సన్నాహాల కబుర్లు చెప్పేది మా చిన్నది. ఆవిడ పెళ్లి కి సెలవు పెట్టి వెళుతూ ’మీరు నన్ను ఈ రోజు   మాత్రమే Mrs.A పిలవండి. వచ్చాక Mrs.B అనాలి’ అని మురిసిపోతూ చెప్పి వెళ్లిందట. మొత్తానికి పెట్టిన  సుముహుర్తానికి  ఆ టీచర్ పెళ్లి అయ్యింది. పెళ్లవగానే ఆవిడ చెప్పిన ప్రకారం అత్తారింటి  పేరు Mrs.B కి మార్చుకుంది.  మా చిన్నది కూడా  ఆవిడ గురించి ఏదన్నా చెప్పాలంటే పేరు మార్చి చెప్పటం మొదలు పెట్టింది. ఒకసారి మా పెద్దమ్మాయి  మర్చిపోయి Mrs.A అని వ్యవహరిస్తూ  మాట్లాడేసరికి , చిన్నమ్మాయి -’ ఆవిడకి ఇపుడు పెళ్లయింది.  పేరు మార్చుకుంది. కాబట్టి ఇంకోసారి పాత పేరు పెట్టి పిలవకు’ అంది.  

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ వేడుక జరిగినా  ముందు మా నానమ్మ వచ్చేయాలి  అనుకుంటారు  మా నాన్న గారి అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు.మా అందరికీ  ఒక మంచి స్నేహితురాలు మా నానమ్మ.   చెప్తే ఆశ్చర్యం గా ఉంటుంది  కానీ, అమెరికా కి వచ్చి ఈ మనవరాలికి పురుడు పోసి, పత్యం కూడా పెట్టింది ఆవిడ!!  మా అమ్మాయిలకి  కూడా ఆవిడ కబుర్లు ఇష్టం. మా నాన్న, నానమ్మ వేరు వేరు కుటుంబాలు అని మా కెప్పుడూ తోచలేదు.   

ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే –  పెళ్లయ్యాక అత్తారింటి పేరు మార్చుకోవడం లో మురిసిపోయిన ఒక అమెరికన్ టీచర్, అదొక ఆచారం అని గ్రహించిన మా అమ్మాయి,  నానమ్మ  కూడా మన కుటుంబమే  అనుకున్న మేము.  ప్రపంచం లో ఒక్కొక్కరికి  ఒక్కొక్క  ఆచార వ్యవహారాలు.  ప్రతిదీ ఒక మూర్ఖపు ఆచారం గా తీసుకుని ఇది ఎందుకు పాటించాలి అని వితండవాదన  మొదలుపెడితే  ఎవరు ఏమి చేయలేరు!! ఏ సంబంధాన్నయినా  మనస్ఫూర్తి గా, ఆనందం గా  ఆదరించినపుడే  ఆ బాంధవ్యానికి  విలువ ఉంటుంది. అప్పుడే, ఆ బాంధవ్యాలు ఏ  కల్మషం  లేకుండా  ఉంటాయి.     

భారత సుప్రీమ్ కోర్టు ఈ మధ్య ఒక అతీతమయిన కేసు లో –   భార్య, భర్త ను తన మీద ఆధారపడ్డ తల్లితండ్రుల నుంచి బెదిరించి విడదీయాలని చూస్తే ఆ భర్త విడాకులు ఇవ్వవచ్చు – అని  తీర్పు  ఇచ్చింది.   నేను మొత్తం తీర్పు చదవలేదు.  ఈ వార్త చదివిన ప్రతి చోటా  వ్యాఖ్యలు –  అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తన తల్లితండ్రులని , ఎందుకు వదిలేయాలి ? అబ్బాయి మాత్రం  తన తల్లితండ్రులని ఎందుకు వదలడు ? గృహ హింస ఇంకా ఎక్కువవుతుందేమో?  అబ్బాయిలు లేని అమ్మాయిల  తల్లి తండ్రుల సంగతి ఏంటి ? ఇన్ని వ్యాఖ్యలు చూసాక బహుశా ఈ తీర్పు హిందూ మత చట్ట ప్రకారం అయి ఉండవచ్చు అందుకే ఇంత స్వాతంత్య్రం గా వ్యాఖ్యలు చేసారు అని బాగా అర్ధమయ్యింది. ఇక, ఈ వ్యాఖ్యలు చేసే వారిలో సగం మంది నా లాంటి వారే ఉంటారు – తీర్పు మొత్తం చదివే ఓపిక లేక ఏదో ఒకటి వ్యాఖ్యానించటం :).

సోషల్ మీడియా వచ్చాక ఇటువంటి  విషయాలు పెద్ద చర్చగా మారుతున్నాయి. పైన ఉదహరించిన  వ్యాఖలను బట్టి, అన్ని ఏళ్ళు ఆ బాధను  అనుభవించిన భర్త ను చూసి కించిత్తు జాలి కూడా చూపించకుండా, దృష్టి అంతా ఒక సంప్రదాయం మీద పెట్టిన మనుష్యులని చూస్తే ఆశ్చర్యం వేసింది.  వారి ఆలోచనలు ఎంత పక్షపాతం గా ఉన్నాయో  అన్పించింది.  ఆ భర్త సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళాడు అంటే ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు అన్న విషయాన్నీ పూర్తిగా విస్మరించారు.  కనిపెంచిన ఆ తల్లి ఆవేదన గురించి ఎవరూ మాట మాట్లాడట్లేదు.ఆవిడా ఒక స్త్రీ/మాతృ  మూర్తే కదా మరి !!    వితండవాదనలకి అంతూ  పొంతు లేకుండా ఉంది. కొంత మంది ఇటువంటి తీర్పు చెప్పినందుకు పిటీషన్  పెట్టాలి అని కూడా వ్యాఖ్య చేసారు. ఇదిగో ఇవి నాకు ముఖ పుస్తకం లో,  వాట్సాప్ లోను కనిపించినవి.  రెండు గ్రూపుల నుంచి వచ్చాయి. వీటిని పంచేవారిని నేను తప్పు పట్టను. ఇవి తయారు చేసిన వారు,  వారి అభిప్రాయాన్ని ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం ఇది. పూర్తిగా సఫలీకృతం అయ్యారు కూడా !!

14484805_528257340716804_8218217113821442794_n img_2124

హిందూ సంప్రదాయం (సనాతన ధర్మం) లో పెళ్లి అనేది ఇద్దరికీ మాత్రమే సంబంధించిన  విషయం కాదు. రెండు కుటుంబాలకి సంబంధించిన విషయము.  పెళ్లి చేసేటపుడు అటు ఏడు  తరాలు, ఇటు ఏడు  తరాలు చూసి చేయమన్నారు. అన్ని తరాలు చూడటం అంటే ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబానికి in and out అంతా  తెలిసి పోతుంది. పిల్ల, పిల్లవాడు పెళ్లికి  ముందు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెళ్లిలో ప్రవర చెప్పేటప్పుడు మూడు తరాల వారి పేర్లు చదువుతారు. శుభలేఖల లో కూడా కన్యాదాత తల్లి తండ్రులు ఉంటే  వారి పేరే వేస్తారు.  పెళ్ళిలో  పిల్ల మేనమామ, బావమరిది ఇలా ప్రతి ఒక్కరికి ఏదో  ఒక Role  ఉంటుంది. పెళ్లి అంటే ఎవరి వ్యక్తిగతం కాదు. ఇవన్నీ చూస్తే  సనాతన ధర్మం లో పెళ్లి  కేవలం ఒక  తంతు మాత్రం కాదు అని నాలాంటి సామాన్యులకి  కూడా అర్ధం అవుతుంది. అసలు సనాతన ధర్మం లో విడాకులు అన్నమాట లేనే లేదుట. అది వింటే ఎంత ఆశ్చర్యం వేసిందో !!  అంతర్జాలానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు సులువు గా ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న మా లాంటి వాళ్ళకి తెలుస్తున్నందుకు.

భారత దేశం ఒక ప్రజాస్వామ్య దేశం. పైన చెప్పిన ఈ తీర్పు హిందూ సంప్రదాయానికి సంబంధించినది. ఇటువంటి చట్టాలు  నచ్చనపుడు ఏ సంప్రదాయం లో కావాలంటే ఆ సంప్రదాయం లో పెళ్లి చేసుకోవచ్చు.  ఒకటి మాత్రం ఖచ్చితం!! పెళ్లి అంటే కేవలం ఒక తంతు అనుకుని, ఆ బంధానికి విలువ ఇవ్వకుండా  రచ్చ చేసుకునేవారికి (ఆడవారయినా/ మగవారయినా)  ఎన్ని చట్టాలు వచ్చినా, ఏ  సంప్రదాయమైనా  ఒకటే!!

అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తన తల్లితండ్రులని , ఎందుకు వదిలేయాలి ? అబ్బాయి మాత్రం  తన తల్లితండ్రులని ఎందుకు వదలడు? ఇది వరకు రోజుల్లో వ్యవసాయం, కుల వృత్తులు వంశపారంపర్యం  గా వచ్చేవి. అబ్బాయి తన తండ్రి నుంచే చాలా విద్యలు  నేర్చుకునేవాడు. ఉపాధి కోసం నేర్చుకునే విద్యను,  పెళ్లి చేసుకున్నాక కొత్తగా జీవితం లోకి వచ్చిన మావగారి  దగ్గర నేర్చుకోలేడు కదా!!  అంతే కాదు ఒక ఇల్లు కట్టుకుంటే  ఆ ఇంట్లో కొన్ని తరాల వారు జీవించేవారు. ఇంట్లో అబ్బాయిలు లేకపోతే ఎవరినయినా దత్తు తెచ్చుకునేవారు కూడా  విన్నాను.  అందుకే అమ్మాయి అత్త వారింటికి రావడం అనేది  ఆనవాయితీ  అయిఉండచ్చు.  రాను రాను కుల వృత్తులు వదిలేయడం, ఉద్యోగాల రీత్యా  పల్లెటూర్లు విడిచి పట్టణాలకు వలస వెళ్లడం మొదలయింది. ఇక ఇప్పుడు ఆ పట్టణాలు కూడా వదిలి విదేశాలకి వలస వెళ్తున్నాము.  ఇక  అమ్మాయిలు  అత్తగారింట్లో నే అతిథులు అవ్వలేదా?

అబ్బాయిలు లేని అమ్మాయిల  తల్లి తండ్రుల సంగతి ఏంటి ?  ఆస్థిలో సమాన హక్కున్నట్లే , కనిపెంచిన తల్లితండ్రుల బాధ్యత లో కూడ ఆడపిల్లకి సమాన  హక్కు ఉంటుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం. ఈ రోజుల్లో  అత్తగారిని, మామగారిని  వాళ్ళని గౌరవంగా చూసే అల్లుళ్లే కానీ, మధ్యతరగతి కుటుంబాలలో దశమగ్రహం అల్లుళ్ళు ఎవరు ఉండట్లేదు. దాని గురించి అంత వాపోవలసిన అవసరం లేదేమో !!

దురదృష్టవశాత్తూ  కొన్ని ఆచారవ్యవహారాలు దురాచారాలు గా మారుతుంటాయి. అవే విడాకులకు, గృహహింస కు దారి తీస్తుంటాయి.   వరకట్నం, కన్యాశుల్కం లాంటివి. ఇటువంటి వాటి నుంచీ  స్త్రీలని రక్షించడానికి చట్టాలు ఉండనే ఉన్నాయి . స్త్రీలు ఆ హింస ని , దూషణ ని భరిస్తూ వాటిని ఉపయోగించుకోకుండా తమకు తాము నిలబడక పోతే ఎవరు ఏం  చేయగలరు ?

కొన్ని ఆచారాలు ఎందుకు వస్తాయి అనటానికి ఒక మంచి ఉదాహరణ ,ఈ మధ్య  కష్టేఫలి  వారి  బ్లాగు లో చదివాను.  పెళ్లి లో పానకంబిందెలు ఎందుకిస్తారో వారి ఈ టపా లో  వ్రాసారు. ఆడపడుచులకు వెండి బిందెలు ఇవ్వమనటం క్రమంగా ఒక డిమాండ్ గా కూడా మారింది (నిజానికి వెండి బిందెలు ఏమి చేసుకుంటారో అర్ధం కాదు).  కట్నాలు ఇవ్వలేదని, ఆడపడుచు కి చీర సరిగ్గా పెట్టలేదని, ఆ మర్యాద జరగలేదని, ఈ మర్యాద జరగలేదని- ఇటువంటివే చిన్న చిన్న విషయాలు కాపురాలలో చిలికి చిలికి గాలివానలు అవుతాయి. ఈ రోజుల్లో ఆ గొడవలు విడాకుల దాకా వెళ్లిపోతున్నాయి!! My children and your children are playing with our children అనే  కొత్త ఆచారానికి నాంది పలుకుతున్నాయి!!

 

అమెరికా లో పిల్లల సంరక్షణ

నేను ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. అమెరికా లో ఉండే తెలుగు వారి మీద వ్యాసం. కొన్ని విషయాలు  చెప్పారు వ్యాసకర్త. అమెరికా లో కూడా నక్షత్రం,వారం చూసి పిల్లల్ని కనేవారు , పుట్టబోయేది ఆడపిల్ల  అని  తెలియాగానే  ఏడ్చే వాళ్ళు ఉంటారు అని…  ఆ వ్యాసం చదివాకా  అమెరికా లో ఇలాంటి చాదస్తులు ఉంటారా అన్పిస్తుంది. కానీ ఉన్నారు అందునా మన తెలుగు వాళ్ళే!!  అమెరికా లో పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడి  ఉండేవారి లో  ఇటువంటి వారు కూడా ఉంటారు అని చెప్పడం  మంచిదే. మంచి విషయం ఎంచుకున్నారు వ్యాసానికి అన్పించింది. అంత వరకూ  వ్యాసం బాగానే ఉంది. 

వ్యాసం లో నాకు కన్పించిన లోపం ఏంటంటే వ్యాసకర్త అవసరం లేని విషయాలు కూడాప్రస్తావించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే కొందరు భారతీయ తల్లులు,   పిల్లల్ని డే కేర్ సెంటర్ ల లో విడిచిపెట్టడం ఇష్టం లేక భారతదేశం లో ఉండే తల్లితండ్రుల దగ్గరికి పంపుతుంటారు.  లేకపోతే  తల్లితండ్రుల్ని పిలిపించుకుంటారు పిల్లల్ని చూసుకోవడానికి.  అటువంటి కుటుంబాల  గురించి ఆ  వ్యాసం లో వ్రాసారు  ఆ వ్యాసకర్త.  పిల్లలు పుట్టాకే తల్లితండ్రులు గుర్తొస్తారని, తల్లులకు సమన్లు పంపుతారని, జీతం బాగా పొదుపుచేయచ్చని  ఇలా తల్లుల్ని ఉచిత బేబీ సిట్టర్ లాగా చూస్తారని, పిల్లల ఎదుగుదల స్కైప్ లో చూసి ఏడుస్తుంటారని, అత్యాశ అని ఇలా అనవసర విషయాలతో ఒక రకమైన వ్యంగ్యం తో కూడుకున్న వ్యాసం లాగా అన్పించింది నాకు.    

డబ్బుల సంగతి పక్కన పెడితే, డేకేర్ లో పిల్లల్ని డే కేర్ లో పెట్టడానికి ఎందుకు ఇష్టపడరో, ఆ సాధక బాధకాలు ఏంటో నాకు తెలిసినంత వరకూ  చెప్తాను.   ఎముకలు కొరికే చలి లో, ఒక్కోసారి మంచు లో మంచి నిద్రలో ఉండే  చంటి పిల్లల్ని పొద్దుటే లేపి, డే కేర్ లో దింపాలి.  ఆహారం ఎంత చక్కగా వండిచ్చినా  డేకేర్ వాళ్ళు  శ్రద్ధగా పెట్టరు. పిల్లలు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు. అమెరికన్ డే కేర్ ల లో అయితే పిల్లలకి ఏడాది దాటగానే  వాళ్ళంతట వాళ్ళే తినాలంటారు. మన పిల్లలు తినరు. సాయంత్రం వరకు ఒక్కోసారి తిండి లేకుండా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే –  ఏడాది లోపు పిల్లలకయితే  రోగ నిరోధక శక్తీ తక్కువ ఉంటుంది. వారిని తీసుకెళ్లి డేకేర్ లలో పెడితే, చీటికీ మాటికీ జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి డే కేర్ వాళ్ళు కూడా, వేరే పిల్లలకి కూడా అనారోగ్యాలు వస్తాయని  తగ్గు ముఖం పట్టే  వరకు రానివ్వరు. పిల్లలకి జలుబు వచ్చింది అనే దానికంటే ఆఫీస్ కి సెలవు పెట్టాలి అన్న బాధ ఎక్కవయిపోతుంది. దానితో  అటు ఆఫీస్ లోను సరిగ్గా పని చేయలేరు. ఇటు పిల్లలని సరిగ్గా చేసుకోలేరు.  నాకు తెల్సిన స్నేహితురాలికి తల్లి లేదు. అత్తగారు చేయలేని మనిషి. ఆరువారాల పాపని తీసుకెళ్లి డేకేర్ లో పెట్టారు భార్యాభర్తలు. ఉద్యోగం వదలుకోలేని పరిస్థితి లో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇవన్నీ ఆలోచించే  చాలా మంది పిల్లలని చూసుకోవడానికి (ముఖ్యం గా ఏడాది లోపు ఉన్న పిల్లలని) ఇండియా నుంచి తల్లితండ్రుల్ని రమ్మని అడుగుతారు. వాళ్ళు రాలేని  పక్షం లో పిల్లలని ఇండియా కి పంపుతారు.  నేను ఇప్పటివరకు చూసిన  కుటుంబాలలో, ఓపిక లేని తల్లితండ్రులు  అమెరికా కి రాలేము అంటున్నారు.  ఓపిక  ఉన్న వారు అత్యంత ఉత్సాహం తో  మనువల ని, మనవరాళ్ల ను చూసుకుంటున్నారు.  అంతే కానీ అమెరికా లో నివసించే తెలుగు వారు వ్యాసకర్త చెప్పేంత వ్యాపార ధోరణి లో మాత్రం లేరు.

భారత దేశం నుంచి అమెరికా కి వచ్చే అమ్మాయిలు బాగా చదువుకున్న వారే అయి ఉంటున్నారు. అటువంటి వారు  ఉద్యోగం మానేయలేరు కదా. ఇంత చదువు చదువుకుని ఇంట్లో కూర్చోవటం ఏమిటి అన్పిస్తుంది.  

ఒకప్పుడు నేనూ  పైన చెప్పిన వ్యాసకర్త లాగే ఎందుకింత అత్యాశ అని ఆలోచించేదాన్ని. డబ్బు ఇంత అవసరమా అని అనిపించేది.  కనీసం పిల్లలు పెద్దవాళ్ళయ్యాక  ఉద్యోగాలు చేయవచ్చు కదా అనుకునేదాన్ని కూడా!!  కానీ,  కొన్ని స్వానుభవాలు, ఇతరుల అనుభవాలు చూసాక మరియు చూస్తున్నాకా,   నా అభిప్రాయం ఈ విధం గా మార్చుకున్నాను  :  అమెరికా లో ఎటువంటి పరిస్థితి లో అయినా సరే ఇద్దరు ఉద్యోగాలు తప్పనిసరిగా చేయాలి.  అమెరికా జీవితం పేక మేడ లాంటిది అని చెప్పవచ్చు. అన్నీ బాగా ఉన్నపుడు అందమైన జీవితం లాగే ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం పోయినా, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బ తిన్నా ఒక్క సారి  జీవితం అంతా  తారుమారు  అయిపోతుంది. భారత దేశం లోను ఇదే పరిస్థితి వస్తోంది కూడా !! ఈ విషయాల గురించి ఇంకొక టపా  లో వ్రాస్తాను.

తోటి తెలుగు మాతృమూర్తులని  ఆ విధంగా క్రించపరచినందుకు చాలా  బాధ వేసి ఈ టపా వ్రాయడం జరిగింది.   ఏ తల్లయినా ఎప్పుడైనా  ఏ పని చేసినా  పిల్లల కోసమే చేస్తుంది అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశ్యం. డబ్బు కోసం అత్యాశ అనుకుంటే అసలు అమెరికాకే వలస రానక్కరలేదేమో కదా !!