ఓ స్వీయానుభవం

చాలా రోజుల తర్వాత బ్లాగు తాళాలు తెరిచాను 🙂 

మిత్రులొకరు కొన్ని భారతదేశం CAA చట్టం గురించి నిరసనల వీడియోలు పంచారు. ఆ వీడియోల చూసాక పోస్టు పెట్టాలనిపించింది.. కాస్తోకూస్తో వార్తలు follow అయ్యి, వాదనలు వాదించే నాకు అవతలి వాడు ఏం వాదిస్తున్నాడో తెలుసు. అసలు ఏదీ పట్టించుకోని వాడికీ ఇటువంటి అనుభవం ఎదురవ్వచ్చు. కొన్ని కొన్నివిషయాలు మనం పట్టించుకోకపోయినా మనం తెలీకుండానే ఎలా ఇరుక్కుంటామో అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఓ రెండు వీడియోల్లో నిరసన చేస్తున్న వాళ్ళని ఎందుకు నిరసన చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఆ చట్టం గురించి తప్ప అన్ని విషయాలు చెప్తున్నారు. అసలు NRC/CAA/ CAB అంటే ఏంటో చెప్పమన్నారు .C ఏంటో A ఏంటో B ఏంటోవారి నోటికొచ్చిన పదాలు చెప్పేసారు. నాకు ఈ మధ్య ఎదురైన ఓ అనుభవం చెప్తాను.
***********************************************************************
ఆగష్టు 6, 2019 న సుష్మా స్వరాజ్ గారి గురించి తెల్సింది. ఆవిడని గురించే ఆలోచనలు బుర్రలో తిరుగుతున్నాయి.. .. అనారోగ్యంతో ఉన్న ఓ మనిషి మృత్యువు అనేది చాలా మాములు విషయమే కావచ్చు. కానీ ఆరోజే ఎందుకు జరగాలి అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆ మానవాతీత శక్తి గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇంతలో నాకు తెలిసిన పాకిస్తాన్ సంతతి కి చెందిన ఓ స్నేహితురాలు కనిపించి మాట్లాడింది. మాములుగా అయితే వాకింగ్ వెళ్తూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటాము. ఆ రోజు ఉన్నట్టుండి ‘మోదీ ఏం చేసాడో తెల్సా? కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించేసాడు’ అంటూ మొదలు పెట్టింది. నాకు ఆ సంభాషణ పొడిగించడం అంత ఇష్టం లేదు.

‘ ఏదో constitution మార్పు. అదేముంది? అలా చేస్తే కాశ్మీర్లో ఆర్థికంగా బావుంటుంది. గొడవలు తగ్గుతాయి అని చెబుతున్నారు. అంతే!!‘

‘లేదు లేదు నీకు తెలీదనుకుంటాను. Indian ఆర్మీ వాళ్ళు మనుష్యుల్ని చంపేస్తున్నారు. ’

‘ఎవరు చెప్పారు?’

‘వాట్సాప్లో బోల్డు వీడియోలు వచ్చాయి. పంపిస్తా చూడు కావాలంటే!!’ (కొంచెం కోపంగా అదేదో నేనే చంపేస్తున్నట్లు)

‘కర్ఫ్యూ ఉంది అన్నారు. అలా ఉంటే వీడియోలు ఎలా వచ్చాయి? పైగా నెట్ కూడా లేదు అన్నారు?……..?’ (ఆ రోజు వార్తలతో ఇంతకు మించిన సమాచారం లేదసలు)

‘ఏమో అదంతా నాకు తెలీదు’
(ఇంకా సంభాషణ జరిగింది. క్లుప్తంగా వ్రాయటం అయింది)

ఇంతకీ గమ్మత్తేంటంటే ఊహ కూడా తెలియని వయసులో పాకిస్తాన్ని వదిలి అమెరికాకి వచ్చేసిన ఓ అమ్మమ్మ ఆవిడ . చదువుకున్నా కూడా 370, 35A అన్న మాటలు ఏంటో కూడా తెలీదు(ఆ మాటకొస్తే నాకూ తెలీదు. ఓ సంవత్సరం క్రిందట ఆ మాటలు విన్నాను. విడమరచి చెప్పమంటే నేనూ చెప్పలేను. ఆ వీడియోలో వాళ్ళలాగా ). ఆవిడకి తెలిసిందల్లా ఒక్కటే ‘మోదీ & అతని హిందూ పార్టీ’. అది కూడా ఆవిడ స్వయానా తెలుసుకున్నది కాదు. వాట్సాప్ జ్ఞానం మాత్రమే!!

విషయాన్ని ఇద్దరం అంతటితో వదిలేసాం కాబట్టి అంతా బావుంది. అలా కాకుండా ఏ మాత్రం క్షణికావేశాలకి లోబడితే …..??
***********************************************************************
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ‘వీధుల్లోకి రండి. నిరసనలు చెప్పండి’ ‘No protests from Andhra! Shame on us!!’ అంటూ. అవతలవాడ్ని రెచ్చగొట్టి వాడు జైలుకి వెళ్ళాకో వాడిప్రాణాలు పోయాకో వీళ్ళు మళ్ళీ ఇంకో కొత్త పోస్టుతో రెడీగా ఉంటారు.
ఇలాంటి వారు వాట్సాప్ లో పంచిన జ్ఞానము మూలంగానే నా స్నేహితురాలు వచ్చి నన్ను తిట్టినంత పనిచేసింది. ‘Hindu-phobia’ అంటే ఏంటో కాసేపు చదవటమే. స్వీయానుభవం ఈ రూపంలో అయితే కానీ తెలిసి రాలేదు.