పనికిమాలిన వాదనలు

మా పెద్దమ్మాయి KG లో ఉండగా back to school night కి వెళ్ళాము. మా జీవితంలో, ఇక్కడ బళ్ళల్లో, ఇలాంటివి ఎలా ఉంటాయో తెలుసుకోవడం మొట్ట మొదటి సారి!!. అంటే ఆ రోజున ఆ తరగతి టీచర్ తాను ఆ సంవత్సరం ఏ విధంగా బోధిస్తారో, పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటారో చెప్తారు. వెళ్ళగానే మా టీచర్ గారి మొదటి ప్రశ్న ‘ మీలో ఎంత మంది మీ పిల్లలు బడి నుంచీ ఇంటికి రాగానే, వారి బ్యాక్ ప్యాక్ లు మీరే సర్దేసారు ? ‘, ముప్పావు వంతు మందిమి గొప్పగా చేతులెత్తేసాం !! దాని ఆవిడ వెంటనే ‘ Please never do that !! ‘ అని చెప్పారు. ‘పిల్లలు వాళ్ళంతట వాళ్ళు కొన్ని పనులు చేసుకోవడం అలవాటు చేయాలి. అది వారి బాధ్యతే అని గుర్తు చేయాలి. అందులో ముఖ్యమైనవి వాళ్ళ లంచ్ బాక్స్ తీయడం, బ్యాక్ ప్యాక్ లో సర్ది పెట్టేయడం. అన్నిటికీ మేము ఉన్నాము అంటూ చేయద్దు’ అన్నారు. KG తరగతి అంటే పెద్దగా చదవటం ఉండేది కాదు. ఎక్కువగా పిల్లల క్రమశిక్షణ మీద focus చేసేవారు.
ఆరవ తరగతిలో బళ్ళో ఓ 5 గంటల పాటు మీ అమ్మాయి సమాజసేవ చేయాలి లేకపోతే మార్కులు తగ్గుతాయి అని చెప్పారు. మళ్ళీ ఎనిమిదో తరగతి లోనూ దాదాపు అంతే. 8 గంటలు కావాలి అని చెప్పినట్లు గుర్తు. ఇక హైస్కూల్ పాస్ అవ్వడానికి 50 గంటల సమాజసేవ ఉండాలి అన్నారు. ఇప్పుడు ఆ పనిలో పడ్డాం!! ఇక పిల్లలు Girls/Boys scouts, National Honor roll society లాంటి వాటిల్లో ఉంటే ఆ నియమాలు వేరుగా ఉంటాయి. 30 గంటల నుంచీ 100 గంటల వరకూ సమాజ సేవ చేయాల్సి ఉంటుంది. కాలేజీల దరఖాస్తుల గురించిన నేపథ్యంలో, ఈ మధ్య తెలిసినది ఏంటంటే కొన్ని medical programs కి, హై స్కూల్ లోనే 450 గంటలు medical field లోనే సమాజ సేవ చేయాలిట. minimum requirement అట !!
సమాజ సేవ అంటే? homeless shelter లలో, నర్సింగ్ home లో వృద్ధులకి సేవ, ఓ గుళ్లోనూ, చర్చిలోను ఏదైనా పండుగలలో సహాయం చేయటం, చిన్న పిల్లలకి హోంవర్కులు చేయించడం , ఆసుపత్రులలో అయితే డిశ్చార్జ్ చేసేటపుడు రోగి ని wheel చైర్ కూర్చోబెట్టి కారు దాకా దింపడం ఇలా రకరకాలు. ఏమొస్తోంది దాని వలన అంటే – ఒక సామజిక బాధ్యత. ఎంత మ్రొక్కుబడిగా చేసినా ఒక విత్తనం నాటినట్లే కదా!!
ఇలా ఎన్నో చేసే అమెరికాలో పిల్లలు చాలా బుద్ధిమంతులు అని నేను చెప్పడం లేదు. ఈ రోజుకి మా అమ్మాయి లంచ్ బాక్స్ తీయదు. మరుసటి ఉదయం వెతుక్కోవాల్సిందే. ఎప్పుడూ ఫోన్లోనే సగం జీవితం గడుపుతుంది. తనకి కావాల్సిన పిండివంటలు బ్రహ్మాండంగా చేసుకుంటుంది కానీ ఇంటో ఒక్క పని చేయదు. అటువంటిది ఈ సమాజ సేవ చేయడానికి వెళ్ళినపుడు పార్కుల్లో చెత్త ఏరివేయడం, టీచర్ గారి పుస్తకాలూ సర్దిపెట్టడం, నర్సింగ్ హోమ్ లోని వృద్ధులతో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మాట్లాడ్డం వంటివి బాగానే చేస్తుంది.
చదవక ముందు కాకరకాయ చదివాకా కీకరకాయ అన్నారట. ‘మానవసేవే మాధవ సేవ’, ‘దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న’ అని, ‘Arise,awake and do not stop until the goal is reached’ అంటూ ఎన్నో నేర్పిన దేశంలో, నిన్న టీవీ9 లో జాఫర్ గారి కార్యక్రమం చూస్తే అసహ్యం వేసింది!! ప్రతి ఊర్లో అందర్నీ పోగేసి ‘ప్రేమించాలా/లేచిపోవాలా’ అనే టాపిక్ మీద ‘కొట్టుకోండి’ అనే కార్యక్రమాలు పెట్టినట్లున్నారు. నీకెలా తెలుసు అని మాత్రం అడగద్దు 🙂. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటే ఇండియాలో మనుష్యులకు బుద్ధి అనేది ఉందా అనిపిస్తోంది. కొంతమంది ఆడపిల్లలు ‘ మాకు కావాల్సిన బట్టలు కొనిస్తారు. అన్నీ చేస్తారు. మాకు కావాల్సిన వాణ్ణి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు? 20 ఏళ్ళు పెంచుతారు. 80 ఏళ్ళు జీవితాంతం ఉండాల్సిన వాడిని మేమే చూసుకుంటాం’ అంటూ వాదిస్తున్నారు. విజయవాడ లో డాక్టర్ సమరం గారు మాట్లాడిన మాటలు వింటే మతిపోయింది నాకు. ‘తల్లితండ్రులు పిల్లలు తమ ఆస్థి అనుకుంటున్నారు. 14 ఏళ్ళకి పిల్లలకి ఇండివిడ్యువాలిటీ మొదలవుతుంది. పిల్లలు తల్లితండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రేమించాము అంటే అది ప్రేమే కాబట్టి అంగీకరించండి ప్రేమ వివాహాలు చేసుకోండి. arranged పెళ్లిళ్లు వద్దు. మా ఇంట్లో అందరం అలాగే చేసుకున్నాం. అందరం బావున్నాం’  ఇదా ఇలా పెద్దవారు యువతకి ఇచ్చే సందేశం?? దీనికి విపరీతంగా చప్పట్లు !! ప్రేమించాను అని ఎవడైనా చెప్పి వేశ్యాగృహాలకి అమ్మివేస్తే, ఈ పెద్దమనిషి వచ్చి వాళ్ళ పిల్లని రక్షించి తెచ్చిస్తాడా ? ఎన్ని జరగట్లేదు?? సునీత కృష్ణన్ గారి బ్లాగు చదవని వాళ్ళు చదవండి !! ప్రపంచం ఎంత భయంకరమైనదో తెలుస్తుంది !!
ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని ఎక్కడైనా ఎవరైనా ప్రోత్సహం ఇస్తుంటే, పెళ్ళే జీవితలక్ష్యం అని మాట్లాడే ఈ పిల్లలని చూసి ఏమనాలో అర్ధం కావట్లేదు నాకు. ఏదో ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి ‘పథకం పెడితే తెగ విమర్శలు చేసారు కొందరు స్త్రీ వాదులు. ఇటువంటి వాదనలు ఖండిచట్లేదా వీరు ??
వేలకి వేలు, లక్షలు కుమ్మరించి తల్లితండ్రులు చచ్చేట్టు కష్టపడి చదివిస్తుంటే టీవిల్లో ఇటువంటి పనికిమాలిన వాదనలు !! కొన్ని కాలేజీలు చాగంటి గారిని, గరికపాటి గారిని వచ్చి విద్యార్థులకి సందేశం ఇవ్వమని చెప్తున్నారు. చాగంటి గారి వెబ్ సైట్ లో విద్యార్థులకి ఇచ్చిన స్పీచ్ లు ఎవరైనా వినచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం !!

 

టీనేజ్ కి వచ్చాక అమ్మానాన్న శత్రువుల్లా కనపడ్డం, తమ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అనుకోవడం పిల్లల్లో మాములే !! అగ్ని కణికలు!! పిల్లలకి సామజిక బాధ్యత గుర్తు చేసే చల్లటి కబుర్లు చెప్పి ఈ అగ్నిని చల్లార్చాలి కానీ సమరం గారి లాంటి వారి మాటలు చెప్పి అగ్నికి ఆజ్యం పోసి ఏం సాధిస్తున్నట్లు ?

ఎవరో జిలేబి Fans మరి!!

అబ్బే  మరేం లేదు.

ఈనాడు లో క్రిందటి ఆదివారం జిలేబి మీద వ్యాసం వచ్చింది. అది ఇక్కడ పంచుతున్నాను. చదువుతుంటే నాకెవరో గుర్తొచ్చారు మరి 🙂

నా టపా పేరు చూసి పరుగెత్తుకుంటూ వచ్చారంటేనే అర్థమయిపోతుంది మీకు ఏ ‘జిలేబి’  కావాలో !! కదా ??

eenadujilebi

http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27301

వీరి వీరి గుమ్మడి పండు…గారు !!

బ్లాగులోకం లో మనుష్యులం ఒకరికి ఒకరం తెలియదు. కాసేపు కాలక్షేపానికి బ్లాగులోకానికి వచ్చి అందరూ బ్లాగులు వ్రాసుకుంటూ , కామింటుతూ, వాదనలు చేస్తూ, ఆ వాదనలు శృతిమించి వాతావరణం వేడిగాఅయిపోతూ ఉంటే   ‘ When its Hot its Really Cool’ అంటూ ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా వచ్చి ఒక కందం  విసిరిపోయే వారెవరో బ్లాగులోకం లో అందరికీ తెలుసు.

వారి కోసమే మాలికలో వ్యాఖ్యలు చూస్తుంటాను  !! వారు సరదాగా వ్రాసేవి, అందర్నీ ఆటపట్టించడం చూస్తుంటే  భలే సరదాగా అనిపిస్తుంది (విషయాన్నీ సీరియస్ గా తీసుకోకుండా)  ప్రతి బ్లాగు చక్కగా చదువుతారు. చదివిన వెంటనే వ్యాఖ్య పెట్టేస్తారు. అసలు కొన్ని సార్లు ఆ పద్యాలూ చూసి ఆ బ్లాగులుకి వెళ్లి చదివిన రోజులున్నాయి.

ఒకసారి ‘  మా హరిబాబు గారిలాగా ఇంకా కొంచం గరం మసాలా ఉండాలి. మీ వ్యాసం రిజెక్టెడ్ !!’ అంటూ   ‘ రౌడీ రాజ్యం’ బ్లాగులో వారి వ్యాఖ్య చూసి నాకు నవ్వగాలేదు. ఇంకోసారి  ‘శోధిని కామెంట్ల సెక్షన్ మూసివేసాం అని వ్రాయగానే, ‘మళ్ళీ ఎప్పుడు తెరుస్తారండీ’ అంటూ అమాయకంగా మొహం పెట్టి  అడగటం. విన్నకోట వారు, ‘ఇంకా నయం నామీద పద్యం కట్టలేదు’ అన్న వెంటనే, ‘ఇదిగో పద్యం అడిగారుగా ‘ అంటూ ఒక పద్యం విసిరారు 🙂  

అన్నిటికీ & అందరికీ  నవ్వు తెప్పిస్తూ … అందరికీ  ఆరోగ్యాన్ని పంచి ఇచ్చే ఈ గుమ్మడిపండు గారు ఎవరో కానీ నేను మాత్రం ఆవిడ /ఆయన  ఫాన్ ని (నన్ను తిట్టుకున్నా సరే!!) .

ఎక్కడెక్కడో , ఎన్నెన్నో జిలేబీలే గురించి చెప్పిన ఈ వ్యాసం  అసలు సిసలైన ‘జిలేబి’ గురించి చెప్పడం మరచిపోయినట్లున్నారు!!

Photo : ఈనాడు ఆదివారం మ్యాగజిన్

పిల్లి Brain

నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ర్యాగింగ్ ఉండేది. భయంకరంగా కాకపోయినా కొంచెం ఉండేది. కొన్ని సార్లు చాలా సరదాగా కూడా ఉండేది. వాళ్ళని మేము రాగ్ చేసామో వాళ్ళు మమ్మల్ని రాగ్ చేసారో ఇది చదివి చెప్పండి !!
Immediate సీనియర్స్ అంటే మా కంటే ఒక సంవత్సరం పెద్దవాళ్ళు బాగా చేసేవారు. బహుశా క్రిందటేడు సీనియర్స్ బారిన పడి ఉండటం మూలానో ఏమో, జూనియర్లు ఎప్పుడు వస్తారా వీళ్ళ పనిపడదాం అనుకునేవారు.
మొదటిరోజున పెద్దగా ర్యాగింగ్ లేదు. ‘హమ్మయ్య’ అనుకుని (రోజూ ఇలాగే ఉంటుందనుకుని), నేను, అప్పుడే పరిచయమయిన స్రవంతి, అంతకుముందు కౌన్సిలింగ్ లో పరిచయమయిన రాజ్యలక్ష్మి ( ఎంసెట్ లో నాకు, తనకి ఒకటే ర్యాంక్) బస్టాప్ లో కూర్చున్నాం. సీనియర్ ఒకతను వచ్చాడు. చాలా చక్కగా అమాయకుడిలా తల దువ్వుకుని, ఇన్ షర్ట్ చేసుకుని మా దగ్గరికి వచ్చాడు. రావటమే తన పేరు చెప్పుకుని (వాళ్ళ పేరు తొందరగా చెప్పరు. ‘ o mighty mighty senior, we are your dirt dirty juniors’ అని పద్యం చెప్పుకోవాల్సిందే), ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. మనిషి వాలకం చూసి భయం లేకుండా సంతోషంగా సమాధానాలు ఇవ్వటం మొదలు పెట్టేసాం. ముఖ్యంగా నేను, స్రవంతి. ఇంటర్మీడియేట్ లో సబ్జెక్టులలో ఏవి కష్టం ఏవి సులువో తెలుసుకున్నాడు. కెమిస్ట్రీ మాకు సులువు అని చెప్పడం జరిగింది. ‘అయితే ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను. ఏమి రాగ్ చేయను. దానికి సమాధానం చెప్పాలి’ అన్నాడు . సరే అడగమన్నాం. ‘ ఈ కెమికల్ రియాక్షన్ ఏంటి , KI +2S → ?’. నేను, స్రవంతి potassium iodide . sulphur కి రియాక్షన్ ఏంటా అని తెగ ఆలోచించడం మొదలు పెట్టాము. అడిగిన సీనియర్ వీరుడు సన్నగా నవ్వడం మొదలుపెట్టాడు. ‘ఆలోచిస్తూ ఉండండి ‘ అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి ‘ ఈ వెధవకి సమాధానం చెప్పడం ఏంటే తన్నేవాడు లేకపోతే’ అంది. ‘ఏమైంది’ అన్నాం ఆశ్చర్యంగా . ‘వాడు అడిగిన ప్రశ్న ఏంటో మీకు అర్ధమవ్వలేదని నాకు బాగా అర్ధమయ్యింది’, అని ఏమని అడిగాడో విడమరచి చెప్పింది. ‘ఆ.. ‘ అని నోరువెళ్ళబెట్టి , వెంటనే తెగ నవ్వుకున్నాం!! చేతులు పట్టుకుని బస్సులో ఎక్కేసాం !!
ఆ రోజు నుంచీ, మళ్ళీ నా చేయి ఇంకొకరు వచ్చి పట్టుకుని మమ్మల్ని విడగొట్టే వరకు విడవలేదంటే నమ్మండి !! రెండో సంవత్సరం, మా సర్వే లెక్చరర్ ‘ఆ చేతులు విడవండి’ అని చెప్తే ‘ మేము విడవం’ అని ఖచ్చితంగా జవాబు చెప్పేసింది స్రవంతి. ఆయన ముందు కొంచెం బిత్తరపోయి తరువాత నవ్వేసి వెళ్లిపోయారు. నా అప్పగింతలు సమయంలో నేను అమెరికా వెళ్ళిపోతున్నానని అది ఏడుస్తుంటే , మా బావగారు వెళ్ళి ‘ మీ ఫ్రెండ్ గురించి మీరు అంత బెంగ పెట్టుకోనక్కరలేదు. బాగా చూసుకుంటాం’ అని చెప్పారట. సెంటిమెంటు నుంచీ మళ్ళీ కాలేజీకి వచ్చేస్తాను
అలా ఆ ప్రశ్న అడిగిన అబ్బాయికి మేమే ఓ పేరు పెట్టాం. ఆ పేరేంటో విడమరచి చెప్పనక్కర్లేదనుకుంటా 🙂 అసలు పేరు కంటే మా అందరికీ ఆ పేరే గుర్తుండిపోయింది. ఇంకో అబ్బాయి ఎప్పుడూ నన్ను లంచ్ కి పిలిచేవాడు. అతనికి ఓ పేరు పెట్టేసాం ‘ లంచ్ అనిల్’ అని. ఇంకో సీనియర్ కి కూడా ఎందుకో తెలీదు కానీ ‘decent fellow’ అని పేరు పెట్టాం !!
ఒక రోజు నేను, నా స్నేహితురాలు విరామ సమయం లో మంచినీళ్లు తాగుతుండగా ఇద్దరు సీనియర్స్ అనూప్, మనోహర్ వచ్చి పిలిచారు. రోజు వాళ్ళు ,మేము ఇంటినుంచీ మెహదీపట్నం వరకూ ఒకే బస్సులో వచ్చేవాళ్ళం. అందుకే పాపం అసలు మమ్మల్ని rag చేయలేదు. చెప్పాలంటే తర్వాత తర్వాత మేమే వాళ్ళని ఏడిపించామేమో కూడా!! అనూప్ ‘మాకేదైనా కానుకలు ఇస్తారేమో అనుకున్నాము’ అన్నాడు. మేము ఒకరి మొహాలు ఒకరము చూసుకుని ‘ఎందుకు’ అన్నాం. అనూప్ ‘ఈ రోజు ఏంటో తెలీదా ‘ అన్నాడు. వెంటనే ‘వాలెంటైన్స్ డే ‘ అన్నాడు. అంటే మాకు ఇద్దరికీ అర్ధం కాలేదు. ‘ ఏం చేస్తారు ఆ రోజు ‘ అని అడిగాము. ‘వీళ్ళెవరు రా బాబు‘ అన్నట్లు ఒక వెర్రి వాళ్ళని చూసినట్లు చూసాడు. అంత అమాయకం గా ఉన్న మమ్మల్ని ఏడ్పిస్తున్నందుకు మనోహర్ కి చాలా మొహమాటం వేసి స్టైల్ గా ఆంగ్లంలో ‘That’s okay. That’s okay’ అంటూ అనూప్ ని పక్కకి లాక్కెళ్లి పోయాడు. అప్పట్లో గూగులమ్మ, ఇంటర్నెట్ లాంటివి ఏవి లేవు. ఎప్పటికో కానీ మాకు ఈ ‘డే’ ఏంటో తెల్సి రాలేదు. తరువాత తలుచుకున్నపుడల్లా నవ్వే నవ్వు మాకు !!
ఒకసారి సుధీర్ , స్రవంతిని రిజర్వు బ్యాంకు బస్టాప్ లో చూసాడు. ఆ సంగతి స్రవంతితో చెబుదామని ‘నిన్ను రిజర్వు బ్యాంకు దగ్గర చూసాను’ అన్నాడు. దానికి అది ‘ ఏ బ్రాంచ్ ‘ అందిట. సుధీర్ మళ్ళీ ‘ రిజర్వు బ్యాంకు ‘ అంటే, మళ్ళీ రెట్టింపుతో ‘ ఏ బ్రాంచ్ ‘ అందిట. సుధీర్ కి ఒళ్ళు మండిపోయి ‘ కొడతా పిల్ల నిన్ను!! రిజర్వు బ్యాంకుకి బ్రాంచ్ ఉంటుందా ‘ అని అరిచాడు. స్రవంతి అక్కడే పడీ పడీ నవ్వు!! నాకు చెప్తే నవ్వే నవ్వు!!
ఇంకో రోజు నవ్వాపుకోలేక లేడీస్ రూమ్ కి వచ్చి పడీ పడీ నవ్వింది. ‘ఏమయిందే ’ అంటే, దీన్ని ఎవరో రాగ్ చేద్దామని ఓ సీనియర్ తీసుకెళ్లాడుట . పక్కనే ఉన్న ఇంకో సీనియర్ ని పరిచయం చేసాడు. చేసిన వాడు ఊరుకోకుండా ఈవిడకి చెప్పాడట ‘ వీడు చాలా స్మార్ట్. CAT brain’ అన్నాడట . స్రవంతి ‘ ఆహా’ అలాగా అన్నట్టు బుర్ర ఊపింది. ఆ సీనియర్ ఏదో దీన్ని ఏడిపిద్దామని ‘నీకసలు CAT brain అంటే ఏంటో తెలుసా ‘ అన్నాడట . అంటే ‘IIM లో admission తెచ్చుకునేంత బుర్ర’ అని అతడి ఉద్దేశ్యం. ఇదేమో చాలా గొప్పగా , ‘ఆ… తెలుసు. పిల్లి brain కదా !!’ అని సమాధానం ఇచ్చింది. అడిగిన వాడు తలబాదుకుని ‘ వెళ్ళు తల్లీ. మా వాడి పరువు తీస్తున్నావు ‘ అని చెప్పాడట!! ఈ రోజుకి ఆ ‘పిల్లి brain’ పేరేంటో అస్సలు తెలీదు. గుర్తు లేదు మాకు !!
పిల్లలం అనుకుని వాళ్ళు మమ్మల్ని రాగ్ చేసారో, వాళ్ళని మేము ‘పిల్లుల్ని’ చేసామో తెలీదు !!
ఏదో సరదాగా వ్రాసింది తప్ప, ఎవర్నీ క్రించపరచడానికి కాదు. జంతువులని క్రించపరచారు అంటూ వ్యాఖ్యలు మొదలపెట్టద్దు.

ఐరోపా యాత్ర – ఒక చిన్న సంఘటన

బ్లాగు ముఖం చూసి చాలా రోజులయింది.  వ్రాయవలసినవవి బోలెడు ఉన్నాయి. సెలవల్లో ఐరోపా వెళ్ళాము. వెళ్లే ముందు హడావిడి, వచ్చాక అలసట.  లండన్, పారిస్, స్విట్జర్లాండ్. జర్మనీ బోర్డర్ లో ఒక చిన్న ఊరు వెళ్ళివచ్చాము. 15 రాత్రులు/16 రోజులు.  ప్రయాణం కబుర్లు నెమ్మదిగా ఒక్కొక్కటి వ్రాస్తున్నాను.

40038363_1959722564120464_2974206763047321600_o

 

రాగానే గబగబా వ్రాసేసిన విశేషం ఇది:

ఈ పదిహేను రోజుల ప్రయాణంలో  చాలానే చూసాము…అందచందాలు కొన్ని ప్రకృతి సృష్టి అయితే కొన్ని మానవుడి సృష్టి..   చాలానే నేర్చుకోవాలి అనుకున్నాను… ముఖ్యంగా ‘మాతృభాష’ & ‘సంస్కృతి’ !! ఒక చిన్న సంఘటన నాలో ఆలోచనా దుమారాన్నిలేపింది. పారిస్ లో ఒక చిన్న మెట్రో రైలు స్టేషన్ లో,  ‘ నేను మూడు రోజుల మెట్రో టిక్కెట్టు కొనుక్కున్నాను. రేపు పొద్దున్న ప్రయాణానికి కూడా చెల్లుతుందా’ అని నేను ఆంగ్లంలో అడిగిన ప్రశ్న తీరు కౌంటర్లో కూర్చున్న ఆవిడకి అర్ధం కాలేదు.  ‘ అంత గబగబా చెబితే, నేను నీకు సమాధానం చెప్పను. కాబట్టి నెమ్మదిగా చెప్పు’ అంటూ కొంచం కోపంగా ‘అవసరం నీది’ అన్నట్లు సైగలతో ఫ్రెంచ్ లో చెప్పింది. నా ఆంగ్ల భాష అంత బావుందా అని ఏడవాలో సంతోషించాలో అర్ధం కాని పరిస్థితి!! గతి లేక వచ్చావు అన్నట్లున్న ఆ మాట తీరు చూసి, ఇలాంటి దేశాన్ని చూడటానికి వచ్చి డబ్బు ఎందుకు తగలబెట్టాను అనిపించింది. ఇక్కడే కాదు. స్విట్జర్లాండ్ లో Mt.Titlis  టికెట్టు కౌంటర్ లో వారు కూడా ఒక నవ్వు అనేది లేకుండా, అడిగిన ప్రశ్నలకి విసుక్కుంటూ సమాధానం ఇస్తున్నారు. నా లాంటి యాత్రికులు పదిమంది వస్తే అటువంటి వారికి వారి పొట్ట నిండుతుంది అన్న సంగతి తెలీదా అనిపించింది. వీరిని చూస్తుంటే నాకు వచ్చిన ఆలోచన ఒకటే!! ఆంగ్లేయుడు వాడి సరుకు భారతదేశం లో అమ్ముకోవడానికి వచ్చి, తిష్ట వేసి వాడి భాష నేర్పించి మన మాతృభాషలని, మన సంస్కృతిని మృత్యుముఖం లో  నెట్టి వేసాడు. బట్టలు అమ్ముకోవడానికి వచ్చిన వాడిని అంత నెత్తిన పెట్టుకున్నాం. ఆ రోజున వాడికి మన పూర్వికులు, ఈ విధంగా సమాధానాలు ఇచ్చి ఉన్నట్లయితే, ఈ రోజున తిండి,బట్ట,నీడ కోసం పొట్టపట్టుకుని ప్రపంచంలో పలు చోట్లకి వలస వెళ్ళం కదా అనిపించింది. మన భాష & మన సంస్కృతి పట్ల మనకే నమ్మకం లేకపోవడం కారణం కాదా ?? చీరలు,పంచెలు కట్టుకోము. బొట్టు పెట్టుకోము. మంగళ సూత్రాలు. మెట్టెలు అంటే ఫాషన్ కి సరిపోవు. తెలుగులో మాట్లాడితే నామోషి. తెలుగులో వ్రాస్తే అది చదవటం మహా విసుగు.  మనం ఎవరం? మన పిల్లలు ఎవరు !! మనకే తెలీదు !!