ధరిత్రి దినోత్సవం

ధరిత్రి దినోత్సవం (Earth day) వచ్చి వెళ్ళింది పోయిన వారం !! ముఖ పుస్తకం లో ఒక చెట్టు బొమ్మ పెట్టేసి అందరికీ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాము. లేదా పెట్టినవారికి  లైకులు నొక్కాము . పశ్చిమ దేశాల పుణ్యమా అని ఈ విధం గా ఏడాదికి  ఒక రోజైనా  భూమాత ని  తలుచుకుంటుంన్నందుకు సంతోషించాలో  లేక కాకరకాయ ని కీకర కాయ అనే పరిస్థితి వస్తోంది అని విచారించాలో అర్ధం కావట్లేదు.  అమెరికా లో ఈ మధ్య లో  ఎక్కువ గా వింటున్న పదాలు   ‘Natural’, ‘Go Green’, ‘Recycle and Reuse’.  ఈ మధ్య ఈ పదాలు అక్కడ నుండి ఎగురుకుంటూ వచ్చి భారత దేశం లో కూడా విన్పిస్తున్నాయి!! భారత దేశానికీ ఈ పదాలు కొత్తేమో కానీ పదాలు చేయమంటున్న పనులు మాత్రం భారత దేశపు సంస్కృ తికి కొత్తేం కాదు.   

పోయిన ఏడాది ధరిత్రి దినోత్సవం రోజు  అనుకోకుండా  ఒక పుస్తకం చదివాను. అపర్ణ మునుకుట్ల గునుపూడి గారు వ్రాసిన ఘర్షణ కథలు. అన్నీ కథలు చాలా బావుంటాయి.  కౌముది /సుజని రంజని లోనో కూడా చదివినట్లు గుర్తు. చిన్న చిన్న కథల తో ఎన్నో విషయాలు చెప్పారు.  అందులో నన్ను చాలా  ఆకర్షించిన కథ.  ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారో చెప్పిన కథ. ఇది వరకు రోజులలో, ఇంటికి ఉన్న ద్వారాల అన్నిటి ముందు బియ్యం పిండి తో ముగ్గు వేసి ద్వారం దగ్గరే బెల్లం కలిపిన జావ పోసేవారుట .  దానితో ఇంటి లోపలికి  తిండి కోసం వచ్చే చీమలు వాటికి కావలసిన తిండి ద్వారం ముందే ఉండేసరికి అక్కడే ఆగిపోతాయి. ఆ తిండి తినేసరికి వాటికీ ఒక  రోజు గడిచిపోతుంది. అంటే  చీమలు ఇంటి లోపలి కి రాకుండా ‘Natural’ గా నివారించడం అన్న మాట. మన ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఎలా రోజు వారీ జీవితం ఎలా గడపాలో  చెప్పే ఒక  చిన్న ఆచారం.  అంతే కాదు!! ముగ్గు వేయటం అనేది ఒక కళ –  ఆంగ్లం లో చెప్పాలంటే ‘Fine motor skill’. Geometrical patterns అంటూ ఎవరూ పాఠం చెప్పకుండానే నేర్చుకునే self learning lesson.

cococomplete‘Recycle & Reuse’   – కొబ్బరి చిప్ప తో మా అమ్మ గారు చేసిన పూరిల్లు

ఒకప్పుడు మనం  ‘Natural’ గా కుంకుడు కాయల తో తలంటుకునే వారం. షాంపూ తో తలంటు కోవడం అంటే స్టేటస్ సింబల్ లా ఉండేది. కొన్ని కుంకుడు కాయలు కొనుక్కుంటే చాలు ఆ వారం ఇంటిల్లిపాది తలంటి కి వచ్చేవి. చవకగా, ‘ Natural’ గా ఉండేది. మరి షాంపూ రుద్దుకోవడం స్టేటస్ సింబల్  అయిపోతే షాంపూ తయారు చేసేవాడి స్టేటస్ ఎలా పెరగటం ? పావలా  కి పది పైసల టీ పొడి పొట్లాల లో కూడా అమ్మడం  చూసాక కానీ వాడి బుర్రకి  అర్ధ అయిఉండదు ఆ కిటుకు ఏంటో , భారత దేశం లో వ్యాపారం ఎలా చేయాలో.  వెంటనే మన చేతుల్లో రూపాయ షాంపూ సాచేట్  పెట్టేసాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితం లో  కుంకుడు కాయల కొట్టుకుని, వేడి నీళ్ళల్లో నానపట్టే  సమయం ని వృధా చేసుకుని తల జిడ్డు వదిలించుకోవడం దేనికని మనమూ ఈ విధమైన సుఖానికి అలవాటు పడిపోయాము. అటువంటి సుఖానికి అలవాటు పడి మన  పిల్లలకి ఆ కుంకుడు పళ్ళు  ఏంటో, ఆ చెట్లు ఎలా ఉంటాయో బడి లో  ఒక field trip  పెట్టి నేర్పాల్సిన పరిస్థతి తెచ్చుకుంటున్నాము !! ఆ రూపాయ షాంపూ సాచేట్ తో మన తలని రసాయనాలతో తడుపుతున్నాము, drains ని రసాయనాలతో నింపుతున్నాము, కత్తిరించిన  సాచేట్  ముక్కల తో landfills  నింపుతున్నాము. అంతే కాదు కొందరి జీవనోపాధి కూడా పోగోడుతున్నాము.   చింతపండు, కుంకుడు కాయలు, తేనె  వంటివి గిరిజనులు అడవుల నుండి సంతలలో తెచ్చి అమ్మే ఉత్పత్తులు.  వాటికీ డిమాండ్  ఉన్నపుడే వారికీ జీవనోపాధి ఉంటుంది మరి !!  

రోజు పొద్దున నిద్ర లేవగానే భూమాత మీద, కేవలం మన పాదం మోపినందుకే  భూదేవిని బాధ పెడుతున్నందుకు క్షమాపణ కోసం  “ సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే // “ అంటూ శ్లోకం చెప్పుకుంటూ భూమి ని సస్య శ్యామలం (‘Evergreen’)  చేయవలసిన మనం –  తాత్కాలిక సుఖం కోసం , రోజువారీ దినచర్య తొందర కోసం, అనవసర ఆర్భాటాల కోసం  – మన సంస్కృ తికి  అవసరం లేనటువంటి వివిధ దేశాల పద్ధతులను ఎండమావుల వెంటపడ్డట్టు ‘Go Green’  అనే పదం తో పాటు ఎగుమతి చేసుకుంటున్నమేమో  కదా!!

రామాయణం – ఒక అద్భుత కావ్యం

అందరికీ  శ్రీరామనవమి శుభాకాంక్షలు !! ఈ రోజు పొద్దున్నే శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ whatsapp లో ఒక  అద్భుతమైన సందేశం వచ్చింది.  దాని సారంశం ఇది:  రాజ్యాల కోసం పోరాడిన రాజుల చరిత్రలు  కాలగర్భం తో పాటు  కలిసిపోయాయి.  తండ్రి కి ఇచ్చిన మాట కై రాజ్యం అక్కరలేదని అడవులకి వెళ్ళిన శ్రీరామచంద్రుడు చక్రవర్తి లా మన హృదయా లలో నిలిచి రాజారాముడు అయ్యాడు.  రామాయణాన్ని అర్ధం చేసుకునే రీతి లో అర్ధం చేసుకుంటే ఈ విధం గానే ఆలోచిస్తాము.

చిన్నపుడు రాజాజీ మెచ్చిన రామాయణం  చదివాను.  కొన్ని చలన చిత్రాలు చూసాను. చందమామ లో ధారావాహిక గా చదివాను.   తరవాత టీవీ లో ధారావాహిక గా చూసాను.  MS రామారావు గారు గానం చేసిన సుందరకాండ విన్నాను. మా అమ్మాయి HSS వారి పోటీ ‘కౌన్ బనేగా రామాయణ్  ఎక్స్ పెర్ట్ ? ‘ లో పాల్గొన్నపుడు తనతో పాటు  చదివాను.  ఇన్ని చదివినా  కొన్ని ప్రశ్న లు మదిలో మెదులుతూ ఉండేవి. ఏమిటి  రామాయణం గొప్పదనం అని.   రాముడు ఒక రాజు అంతే కదా, ఎందుకు దేవుడు అయ్యాడు అని. రాముడు కి ఇంత మంది భక్తులు ఏంటి అని. తులసీదాసు, త్యాగరాజు, మొల్ల, భద్రాచల రామదాసు, గాంధీజీ, చలన చిత్ర దర్శకులు బాపు… ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు మంది. రామకోటి ఎందుకు వ్రాయటం అని ఇలా చాలా ప్రశ్నలు ….. .

నాకు ఏదైనా పని చేసుకున్తున్నపుడు ఏ  పాటలో  వింటూ చేసుకోవడం పని  చేసుకోవడం అలవాటు. అలా పోయిన ఏడాది ఒక రోజు అనుకోకుండా, గురువు గారు   చాగంటి వారి ప్రవచనం రామాయణం లోని గంగావతరణ ఘట్టం విన్నాను. ఎంత అధ్బుతం  గా చెప్పారంటే మాటల్లో చెప్పలేను!!  వారికి నా వందనములు!!  ఇక అది మొదలుకొని  ఆ  యు ట్యూబ్ లింక్ లోనే  ‘Sri Sampoorna Ramayanam Day1’ నుంచి మొదలు పెట్టి, 42 రోజులు పూర్తిగా విన్నాను. నలభై రెండు భాగాలూ వినడానికి  దాదాపు ఒక ఏడాది పట్టింది నాకు.  నాతో పాటే మధ్య మధ్య లో మా పిల్లలు కూడా ఓ చెవి పడేసేవారు. అంత అధ్బుతమైన ప్రవచనం విన్నాక రామాయణం విశిష్టత ఏంటో అర్ధం అయింది.  నాకు వచ్చే ఎన్నోప్రశ్నలకి సమాధానం తెలిసింది. నా ఆలోచనా ధోరణి చాలా మారిందనే చెప్పాలి. ఇప్పుడు నాకు రామదాసు కీర్తన అయినా,  త్యాగరాజు కీర్తన అయినా  వింటుంటే వారు రాముడిని ఎంత బాగా అర్ధం చేసుకున్నారో అర్ధం అయింది.

గురువు గారు  చాగంటి వారు  చెప్పినట్లు,  మన రోజూవారి జీవితం లో  రామాయణం పాత్రలు కన్పిస్తూనే ఉంటాయి. నేను రామాయణం గురించి మాట్లాడేంతటి దాన్ని కాదు కానీ,  నాకు నేను  అన్వయించుకున్న రెండు ఉదాహరణలు చెప్తాను.

ఒకటి:

సుందరకాండ లో హనుమ అతి సుందరమైన లంక ని చూస్తారు. ఆయన  ఒక కోతి, అందునా  బ్రహ్మచారి. మనసు ఎంత చంచలం గా ఉండాలి అటువంటి లంక ని చూస్తే ?  అయినా  తను చేయవలసిన పనిమీద దృష్టి  మీదే మనసు నిమగ్నం చేసారు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ  అయింది.  చీటికి మాటికి  ముఖ పుస్తకం, whatsapp చూసే మనం ప్రతి రోజు హనుమ ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో  ఉంది.

రెండు:

నేను పద్మశ్రీ పురస్కారం గ్రహీత ,ప్రముఖ  సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్  గారు ముఖపుస్తం అనుసరిస్తూ ఉంటాను. ‘స్వరక్ష’ అనే ప్రచార కార్యక్రమం(campaign)  చేస్తున్నారు. ఆ కార్యక్రమం లో భాగం గా ఒక వీడియో చూసాను. ఒక కార్యకర్త , అలా నిర్భంధమైన అమ్మాయిలు ఎన్ని బాధలకి గురి అవుతారో చెప్పి, వారు ఎవరినీ నమ్మలేనిస్థితి కి ఎలా చేరుకుంటారో చెప్తున్నాడు. నాకు వెంటనే గుర్తుకు వచ్చిన సన్నివేశం  సుందరాకాండ లో హనుమ సీతా దేవిని నమ్మించడానికి చేసిన ప్రయత్నం. లంక లో ఆ చెట్టు క్రింద అన్ని నెలల పాటు  అదే చిరిగిన చీర తో, తిండి లేకుండా ,రోజు రాముడిని తిట్టి పోసే రావణుడు, రాక్షస స్త్రీ ల మధ్య  ఒంటరి పోరాటం చేసిన సీత కి,  ఈ రోజున ఇలా చిక్కుకున్న  అమ్మాయిలకీ తేడా ఏమన్నా ఉందా అన్పించింది.  ఆ రోజున హనుమంతుడు ఎంత కష్టపడ్డారో  సీత నమ్మించేందుకు, ఈ రోజు ఇలాంటి rescue  operations చేసే వారు అంతే కష్టపడ్తున్నారు అన్పించింది.  అక్కడ చిక్కుకున్నఅమ్మాయిలు  కూడా ఏదో మాయలేడి ని చూసి మోసపోయే వారే  కదా!!అమ్మాయిలని అటువంటి చోట్లకి చేర్చి ఆనందించే వారలకీ  రామాయణం లోని శూర్పణఖ పాత్ర కి తేడా ఏమన్నా ఉందా?  

సుందరాకాండ లో సీత తనని తాను హనుమంతునికి పరిచయం చేసుకుంటూ ‘పరిణయమయిన పన్నెండు ఏళ్ళు  అనుభవించితిని భోగ భాగ్యములు’ అంటుంది. ఎంత గొప్ప మాట !! ‘మొగడు మెచ్చిన తాన కాపురం లోన మొగలి పూలా  గాలి ముత్యాల వాన’  అన్న పాట  గుర్తొస్తోందా ?

ఒక్క మాట లో చెప్పాలంటే  – రామాయణం మన రోజూవారి జీవితం లో ఒత్తిడి తగ్గించే మాత్ర !!రామాయణాన్ని చదువుదాం చదివిద్దాం !!  ఎలా ఉండాలో నేర్చుకుందాం !!

చెరగని తరగని జ్ఞాపకాలు

దేవుడు వరం ఏదైనా అడిగితే కాలయంత్రం (Time-machine) ఎక్కించి  నా  చిన్నతనం లోని మధురమైన  ఘట్టాలకు  తీసుకెళ్ళమని కోరుకుంటాను. . ఎండాకాలం సెలవలు, మామిడి పళ్ళు, మల్లెపూలు, అమ్మమ్మ గారి ఊరు…

img_0188

అనగనగా ఒక  ఊరు. మా అమ్మమ్మ గారి ఊరు, ఒక పల్లెటూరు. పల్లెటూరు అనగానే పచ్చటి  పొలాలు గుర్తుకు రాక మానవు.  కానీ అవన్నీ మా  ఊర్లో ఉండవు. అన్నీ పల్లెటూర్ల లాగా ఉంటే ఇంక  మా ఊరి ప్రత్యేకత ఏముంటుంది? మా ఊరి  పేరు బిట్రగుంట.  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ- గూడూరు సెక్షన్ లో ఉండే ఒక స్టేషన్. ఒకానొకప్పుడు స్టీమ్ ఇంజిన్లు ఉన్న రోజుల్లో  రైల్వే వైభోగం తో వెలిగి పోయిన ఊరు.  1885 లో  బ్రిటిష్ వారు, ఇక్కడ మంచి నీటి కొరత  లేనందున ఇక్కడ స్టీమ్ ఇంజిన్ లోకో షెడ్ ని  నిర్మించారు. ఈ నమూనా  ని  కొత్త ఢిల్లీ లోని రైలు మ్యూజియం  లో చూడవచ్చు.  భారత దేశం లో ఇటువంటివి రెండే ఉండేవి. ఈ లోకో షెడ్ ఎన్నో కుటుంబాలకి  జీవనాధారం కల్పించింది. రైల్వే వారి పాఠశాలలు (తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో ),  ఒక రైల్వే ఆసుపత్రి ఉండేవి. వచ్చేపోయే రైళ్ళలో డ్రైవర్ లు  మరియు గార్డ్ లు కూడా  మా బిట్రగుంట లోనే మారే  వారు.  ఇప్పటికి కూడా అనుకుంటాను. రైలు లో భోజనాలు లో కూడా బిట్రగుంట నుంచే అందించేవారు. అంతే కాదు రైల్వే క్వార్టర్ లు, రైల్వే ఇన్సిట్యూటు, పార్కు,రన్నింగ్ రూం  అన్నీ ఉన్నఒక పెద్ద  రైల్వే కంటోన్మెంట్  బిట్రగుంట .  రైల్వే డాక్టర్లు, టీచర్లు,  లోకో షెడ్ లో పని చేసేవారు, డ్రైవర్ లు, గార్డ్ లు ఇలా ఇంత మంది రైల్వే ఉద్యోగులతో, వారి కుటుంబాలతో  ఊరు కళకళలాడుతూ ఉండేది.  

కోడి కూత  విని పల్లె నిద్ర లేచింది అంటారు.  పొద్దున్నేతిరుపతి నుండి  వచ్చే ‘కోచి’ బండి కూత  లో మా ఊరు  నిద్ర లేచేది. తిరుమల ఎక్స్ ప్రెస్  రాక  తో నిద్రపోయేది.  రైళ్ళ ని పేర్ల తో కాక వాటి సంఖ్యలతో  సంభోదించటం మా బిట్రగుంట వారి ప్రత్యేకత.అంతే కాదండోయ్ !! బిట్రగుంట వారి కి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది. అది తర్వాత చెప్తాను.

మా తాత  గారి స్వస్థలం బిట్రగుంట దగ్గర అగ్రహారం అనే పల్లెటూరు కావటం, ఆయన  కూడా ఒక రైల్వే ఉద్యోగి  కావటం తో కుటుంబం తో ఇల్లు కట్టుకుని బిట్రగుంట లో పూర్తి గా స్థిరపడ్డారు. మా అమ్మమ్మ గారిల్లు అంటే పెద్ద కాంపౌండ్, దానికి ఒక గేటు,  అమ్మమ్మ వాళ్ళు ఉండే  ఇల్లు కాక  దాదాపు ఇంకో ఐదు ఇళ్ళు , ఒక పూరిల్లు, పెద్ద బావి , అన్నీ  ఇళ్ళకి మధ్య లో  ఒక వడ్ల కొట్టు, దానిని అనుకుని ఒక సిమెంట్ అరుగు అన్నీ కలిపి ఆవరణ అనే వాళ్ళం.  అంటే ఇప్పటి పరిభాష లో చెప్పాలంటే  ఒక గేటెడ్ కమ్యూనిటీ.  వడ్ల కొట్టు వెనకాల ఒక పెద్దబాదం చెట్టు, వడ్లకొట్టు పక్కనే పెద్ద వేప చెట్టు, కొబ్బరి, సపోటా, బూరుగు, మామిడి, జామ, ములగ, అరటి, ముద్దా మందారం, కరివేప, బంగారు గంటలు, పసుపు మందారం, నంది వర్ధనం, నిత్యమల్లె చెట్ల తో ఆవరణ లో ఎప్పుడూ పచ్చదనం తో నిత్య నూతనం గా ఉండేది. రైల్వే క్వార్టర్ దొరకని రైల్వే ఉద్యోగులంతా  ఆవరణ లో అద్దెకి ఉండేవారు.  ఈ కుటుంబాలన్నిటి తో  ఆవరణ ఎప్పుడూ చాలా సందడి గా ఉండేది.

IMG_1521

అమ్మమ్మని పిన్ని గారని, తాతయ్యని బాబాయి గారని పిలిచేవారు. పిల్లలు అమ్మమ్మగారు, తాతయ్య గారు అని పిలిచేవారు.అమ్మమ్మ,తాతయ్య  ఇద్దరూ కూడా అలాగే  universal అమ్మమ్మ తాతయ్య లాగే  ఉండేవారు. వారిద్దరికీ తెలిసినది- సాటి మనిషికి చేతనైన సహాయం చేయటం, ఉన్నంత లో సంతోషం గా నిజాయితీ తో జీవితం గడపడటం.   నాకు తెలిసి ఏ  రోజున కూడా ఇద్దరూ, ఫలానా వారికి ఆ వస్తువు  ఉంది మాకు లేదు అన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జ్ఞాపకం లేదు.   తాతయ్య  దక్షిణ మధ్య రైల్వే లో చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ గా రిటైర్ అయ్యారు.  చేసిన ఉద్యోగం అంటే ఎనలేని గౌరవం తాతయ్యకి.  ఎవరు టికెట్ తీసుకోకపోయినా జరిమానా కట్టకపోతే ఊరుకునే వారు కాదు. జరిమానా డబ్బులు కట్టలేక ప్రయాణీకుల చేతుల్లో ఉన్న బంగారం అమ్మించిన ఘటనలు ఉన్నాయి. పైన చెప్పాను కదా బిట్రగుంట వారికి ఇంకొక  ‘ప్రత్యేకమైన ప్రత్యేకత’ ఉంది అని.అది ఏంటంటే  బిట్రగుంట నుంచి నెల్లూరు, కావలి కి రైలు లో ప్రయాణించేవారు ఎట్టి పరిస్థితి లోను టికెట్  కొనరు.  రైలు అంటే చాలు అది బిట్రగుంట కే సొంతం అన్న ధోరణి లో ఉంటారు. అలాంటిది, ఈయన బండి లో టికెట్ చెక్ చేయటానికి వస్తున్నారు అంటే , కొంత మంది భయపడి ప్రయాణం ఆపుకునేవారు.  ఆయన రిటైర్ అయ్యాక కూడా ఆయన్ని చూసి భయపడి తప్పుకునే వారు !!  ఇక మా  అమ్మమ్మ..   అటువంటి అపురూపమైన అమ్మమ్మ ఎవరికీ ఉండదేమో అన్పిస్తుంది నాకు !!  ఇంటికి వచ్చిన ప్రతి వారినీ  ఆప్యాయం గా పలకరించడం తప్ప ఈ రోజుల్లో వినపడే ‘ఇగో’ అనే పదానికి అర్ధం తెలీదు అమ్మమ్మకి.  అమ్మమ్మ, ఆవిడ  జీవితం  గురించి చెప్పడానికి  ఒక పోస్టు చాలదు.

IMG_1540

…ఈ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న కొద్దీ , తాతయ్య తెచ్చిన మావిడిపళ్ళతో  రసం వేసి, అమ్మమ్మ కలిపి పెట్టిన కమ్మటి తీయని పెరుగన్నం లాగా ఉంటాయి. చిన్న చిన్న వాటికే పెద్ద సంతృప్తి  పొందే ఆ కమ్మటి రోజులే వేరు !!