మా పార్కు లో తామర పూలు & జలచరాలు

‘YVR  అంతరంగం’ వారి బ్లాగు చూసాక గుర్తొచ్చింది మా ఇంటి దగ్గర పార్కులో తీసిన చిత్రాలు బ్లాగులో పెట్టడం మర్చిపోయాను అని.  కొలనులో తామరపూలు విరగబూసి ఉన్నాయి. చిన్న తాబేళ్లు బోలెడు కనిపించాయి. ఇంటి పక్కనే ఉన్న ఇంతటి ప్రకృతి సంపద ని పెట్టుకుని ఎక్కడికో వెళ్తుంటాం ఏమిటా అని ఆశ్చర్యం వేసింది.   

 

IMG_9587

 

IMG_9605

IMG_9614
ఈ చిత్రాలలో  తాబేళ్ళని పట్టుకోండి చూద్దాం 🙂

 

IMG_4407

 

IMG_9615
పొద్దున్నే బోలెడు కబుర్లు చెప్పేసుకుంటున్నాయి 

IMG_4410

 

IMG_9620

అమ్మలగన్నయమ్మ

మా అమ్మాయిని Middle  school లో ఉండగా, బళ్ళో దింపేటపుడు రోజూ ఒక దృశ్యం కనపడేది.  బడి దగ్గర సందు చివర ఓ వాకిట్లో, ఒక చేతిలో కాఫీ కప్పు పట్టుకుని, ఇంకో చేతిలో చిన్న కూతురిని ఎత్తుకుని,  బడి లోపలికి వెళ్తున్న పెద్ద కూతురిని కళ్ళతో బళ్ళో దింపుతూ ఓ మాతృమూర్తి కనిపించేది. ఆ రెండేళ్లు దాదాపుగా ప్రతి రోజూ ఇదే దృశ్యం !!

నాకు ఒక కొరియన్ స్నేహితురాలు ఉంది. ఈ మధ్య కలిసినపుడు చెప్పింది,  వాళ్ళ అమ్మాయికి హై స్కూల్ కెమిస్ట్రీ లో మార్కులు సరిగ్గా రావట్లేదని.  ‘ట్యూషన్ పెట్టించక పోయావా’ అంటే, ‘వాళ్ళు ఎంత చెప్పినా నేను చెప్పుకుంటే ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పవచ్చును కదా’ అంది.   

నిన్న మా అమ్మాయి బళ్ళో ఒకావిడ ని కలిసాను. PTA కి సంబంధించిన  ఒక volunteering service activity కి ఆవిడ coordinator . ఆవిడ పిల్లలిద్దరూ గ్రాడ్యుయేట్ అయిపోయారు. ‘అయినా ఎందుకొస్తున్నాను అంటే ఈ  పిల్లలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా తృప్తినిస్తుండడం తో మానలేకపోతున్నాను’ అన్నారు. ఆవిడని కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాను. ఆ వినయం, నమ్రత చూస్తుంటే ఎంత బావుంటుందో చెప్పలేను !!

మా  బాలవికాస్  గురువు గారి సతీమణి !! మేమందరం  ఆవిడని ‘ఆంటీ ‘ అంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే  డొక్కా సీతమ్మ గారిలాగా అర్ధరాత్రి వారింటికి ఎవరు వెళ్ళినా ఏదో  ఒకటి పెట్టనిదే పంపరు.

ఫేస్బుక్ లోకి వచ్చినపుడల్లా సునీతా  కృష్ణన్ గారి పేజీ చూడకుండా వెళ్ళలేను. ఇక ఆవిడ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఓ ‘మహిషాసురమర్ధిని’ !!

ఎందుకిలా ఎవరో ఒకరి గురించి పొంతన లేకుండా  చెప్తున్నాను అంటారా ? రోజూ లలితా దేవిని స్మరిస్తున్నంతసేపూ ఆ అమ్మవారు ఇన్ని అవతారాలతో  నా నిత్య జీవితంలో దర్శనం ఇస్తుంటే, ఆ మహత్యాన్ని ఈ నవరాత్రులలో ఈ విజయదశమి రోజు అందరితో పంచుకోకపోతే ఎలా ?

మా అమ్మమ్మ తన ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. తల్లి లేని పిల్ల అని ఉమ్మడి కుటుంబంలో అమితమైన గారాబంతో పెరిగింది. ‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవ్వరికీ  నీకున్న ఈ అవగాహన & ఓర్పు లేదు.అసలు నీకెలా వచ్చింది కదా ?’ అని మా  అమ్మమ్మతో అంటే, ఓ చిన్న నవ్వు నవ్వి, . ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ భయమేనే  అమ్మా!! ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు దాగున్నాయి కదా అనిపించింది నాకు!!

కిష్కింద కాండలో సీతాదేవి ఆభరణాలను చూపించినపుడు లక్ష్మణుడు వెంటనే గుర్తుపట్టిన ఆభరణాలు ఆవిడ  కాలి గజ్జెలు/అందెలు. కాలి ఆభరణాలు మాత్రమే ఎలా గుర్తుపట్టగలిగాడు అంటే, రోజూ ఆవిడ పాదాలకి నమస్కరించేవాడు.  ఆ పాదాలే ఆయన మనసులో ఉండటం వలన వెంటనే గుర్తు పట్టగలిగాడు.

వైష్ణవుడు అనేవాడు  ప్రతి స్త్రీ లో మాతృమూర్తి ని చూస్తాడు అంటూ  ‘పర్ స్త్రీ జేనే మాత్ రే ‘అన్నారు నరసింహ మెహతా!!

ఒక పురుషుడు ప్రతి  స్త్రీలో తల్లిని చూడాలి. అదే విధంగా  స్త్రీ కూడా ప్రతి పురుషుడు తనని చూసి నమస్కరించే విధంగానే ఉండాలి. అప్పుడే ఇలాంటి పండగలకి సార్థకత అనేది ఉంటుంది.

అందరికీ  విజయదశమి శుభాకాంక్షలు !!

డాక్టర్ బాలుగారు చెప్పిన కథ

రాధా మండువ గారు ఒక కథ చెప్పి, పిల్లలకి చెబుతారా అని వ్రాసారు. అది చదివాక నాకు ఒక కథ గుర్తొచ్చింది.

ఈ టపా  వివేకానందుడు చెప్పిన బాట లో… చదివినవారికి డాక్టర్ బాలు గారు జ్ఞాపకం ఉండాలి. టపాలో చెప్పాను  కదా, డాక్టర్ బాలు గారు వచ్చినపుడు మా పిల్లలకి బోలెడు కబుర్లు చెప్పేవారని. అలా  చెప్పిన కథే ఇది!!

వారు MBBS  పూర్తి చేయగానే  గిరిజనులకి సేవ చేయాలి అని అత్యంత ఉత్సాహంతో  ఉన్నారట. ఆ గిరిజనుల ఉండే ప్రదేశాల దగ్గరికి వెళ్లారు.  వాళ్ళు వీరిని స్వాగతించడానికే చాలా కాలం పట్టిందట. అవకాశం ఎప్పుడు వస్తుందా వారికీ వైద్యం ఎప్పుడు చేయాలా అని వేచి ఉన్నారు.

అలా చూస్తుండగా ఒక రోజు ఒక అవకాశం రానే వచ్చింది. ఒక పదునాలుగేళ్ళ  (అవును మీరు చూసింది నిజమే 14 ఏళ్ళు ) అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయని ఈయనకి కబురొచ్చిందట. సాయంత్రం ఆరుగంటలకి. ఆ అమ్మాయి ఉండే ఇంటికి రోడ్డు లాంటిది ఏమి లేదు.  ఈయన తన మెడికల్ కిట్ పట్టుకుని వెళ్లి, ఆ అమ్మాయి తండ్రి అనుమతితో పరీక్షించారు. ఇంకో 12-15 గంటలు పడుతుంది అని చెప్పి, ఆ అడవిలో పాముపుట్ర ఉంటాయని భయం వేసి ( అలవాటు లేదుగా మళ్ళీ భయమే 🙂 ) వెనక్కి వచ్చారు. మరుసటి ఉదయం బయలుదేరుతుంటే ‘ఇంత పొద్దున్నే ఎక్కడికి ‘ ఒకావిడ పలుకరించింది. ‘ఫలానా చోటికి వెళుతున్నాను’ అంటే, ‘నువ్వెళ్ళి ఏం  చేస్తావు. ప్రసవం అయిపోయింది కదా’ అన్నది. వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు చాలా బాధ వేసింది బాలు గారికి!! అయినా సరే పుట్టిన బిడ్డ కళ్ళల్లో డ్రాప్స్ అయినా వేద్దాంలే అనుకుని వెళ్లారు.

వెళ్ళేసరికి  బాలింత, చంటిబిడ్డ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అనుమతి లేనిదే లోపలి వెళ్ళకూడదు!! అందుకని ఈయన బయటికి వచ్చి ఆ  చంటిబిడ్డను తనకు చూపించమని, బిడ్డను పరీక్ష చేసి మందు వేస్తానని చెప్పారు. ఆ అమ్మాయి తాను రానని, చూపించనని చెప్పింది.  అయినా కొంచెం సేపు వేచియున్నారు. ఇంక ఓర్పు నశించిపోయి , ‘డాక్టర్ అంటే మీకు అస్సలు నమ్మకం లేదు. నేనే లోపలికి వచ్చి చూస్తాను’ అని కోపంగా అరిచారు.  అప్పుడు లోపలి నుంచీ గట్టిన ఏడుస్తూ ‘ నాకున్న ఒక్క చీర రాత్రి పురిటి సమయంలో తడిసిపోయింది. అది ఉతికి ఇప్పుడు గుడిసెపైన ఆరేసారు . ఎండ పడ్డాక ఆరితే కట్టుకుందామని వేచి ఉన్నాను. దయ చేసి లోపలి రావద్దు ’  అంటూ సమాధానం వచ్చింది. అది విన్న బాలు గారు ఒక్కసారిగా స్థంభించి పోయారు. ‘ఎంత సేపు నేను డాక్టర్ని అని గొప్ప చెప్పుకుంటున్నానే కానీ వీరికి నిత్యావసరాలు కూడా లేవు అన్న సంగతి నేనెందుకు గ్రహించుకోలేకపోయాను’ అనుకున్నారు. ఈ కథ ఆయన  నోటి వెంట విన్నపుడు మా పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా స్థబ్దులమైపోయాం.

ఈ కథ ఎప్పటిదో కాదు. 1988 ప్రాంతంలో అనుకుంటాను. అంటే అప్పటికి భారతదేశానికి  స్వాతంత్య్రం వచ్చి 40 ఏళ్ళు !!

గొప్ప విషయం ఏంటంటే ఆ చిన్న వయసులో డాక్టర్ బాలు గారు ఒక సంకల్పం పెట్టుకోవడమే  కాదు. నా ఒక్కడి వలన ఏమవుతుందిలే వెనుకకి తిరుగకుండా దానిని కొనసాగించారు కూడా !!ఈ రోజున SVYM  ఎన్నో జీవితాల్లో వెలుగు నింపింది. జీవితానికి పరమార్థం అంటే అదే కదా !!

కావలసినప్పుడే స్త్రీ వాదం

మూడు సార్లు విడాకుల మంత్రం జపిస్తే  శిక్ష అని, ఈ మధ్యనే చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అటువంటి  స్త్రీ వాదులం , స్త్రీ హక్కుల కోసం పోరాడతాం అని చెప్పుకునే బాజా వాయించుకునే వారి  గోడల మీద ‘ఆ విషయం’ తప్ప అన్నీ ఉంటాయి. ఒకసారి ఈ చర్చ వచ్చినపుడు ఒక స్త్రీ వాదిని అడిగాను ‘ వారి చట్టం ప్రకారం రెండు పెళ్ళిళ్ళు  సమ్మతమే కదా !! అది ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నట్లు కాదా ‘ అని. అందుకు సమాధానం ‘ హిందువులలో కూడా బోలెడు మంది రెండో పెళ్ళిళ్ళు  చేసుకుంటున్నారు.’ నేను అడిగిన దానికి సమాధానం వచ్చినట్లా రానట్లా మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడో, ఎప్పుడో స్త్రీ కి అన్యాయం జరిగి ఉన్నప్పుడు ఆ మతంలో ఇటువంటివి నియమాలు  పెట్టారేమో తెలీదు నాకు. అటువంటప్పుడు ఆ మతాన్ని తిట్టడం , స్త్రీకి హక్కులే కలిపించలేదు అనడం ఎంతవరకూ సమంజసం ? అసలు తెలిసీ తెలియని దాని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుందా?

ఇలాంటి వారి స్త్రీ వాదుల  లాజిక్కులు విని & చూసి కొంత మంది ఆడవాళ్లు చాలా తెలివితేటలతో , ఉన్న స్వేచ్ఛ సరిపోనట్లు  ,‘‘ఆడవాళ్లు వేదాలు నేర్చుకోవచ్చా? పురుష సూక్తం చదవచ్చా ? రుద్రం చదవచ్చా ? పితృకార్యం చేయచ్చా? తలకొరివి పెట్టచ్చా ‘ అని అనే ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నిజంగా, కొన్ని ప్రశ్నలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారినే అడగటం చూసాను. ప్రశ్నలు అడగండీ అంటే వీరికి దొరికిందే ఛాన్సు!! ఎవరిని ఏ ప్రశ్నలు వేయాలో అర్ధం కాదు వీళ్ళకి అనిపించింది.  కొన్ని పనులు ఆడవారు, కొన్ని పనులు మగవారు చేయాలనీ చెబుతారు. చెప్పినపని చేయకుండా వద్దన్న పని చేయాలనుకోవడం వితండ వాదన కాకపోతే ఏంటి ?

ఇప్పుడు శబరిమల గురించి స్త్రీలు పెద్ద విజయం సాధించినట్లా ? దేశంలో ఉన్న గుడులు చూడటానికి సమయం లేదు.  శబరిమల ఒక్కటీ చూసి జన్మ సాఫల్యం చేసుకుంటారు కాబోలు పాపం!! అయ్యప్ప స్వామిని నమ్మే స్త్రీలు, ఆయన కథని కూడా నమ్ముతారు. ఆ కథని  నమ్మేవారు సుప్రీంకోర్టు కాదు కదా ఎవరు దిగి వచ్చి చెప్పినా ఆ ఆలయంలోకి అడుగుపెట్టరు.

అయ్యప్ప గుళ్లో స్త్రీలకి అనుమతి గురించి పోరాడే వాళ్ళని చూస్తే ఎంత  హాస్యాస్పదం గా అనిపిస్తుందంటే సగం మంది ‘నాస్తికులం’ అంటారు !! మరి ఏ దేవుడికి ఏం చేస్తే వీళ్ళకెందుకు ?? పురాణాలని ఆధారం చేసుకుని స్త్రీలని భారత దేశంలో హింసించారుట !! అందుకని వీళ్ళకి చాలా బాధ పాపం!! పదేళ్ళ  క్రితం ఏం జరిగిందో తెలీదు, గుర్తుండదు. వేలఏళ్ళక్రితం జరిగిన విషయాలు మాత్రం కళ్ళకి కట్టినట్లే చెప్తారు. మరి టైం మెషిన్ ఉందేమో వాళ్ళ దగ్గర 🙂

సనాతనధర్మంలో అసలు ఆడవారు  మోక్షాన్ని పొందటానికి మార్గమే సూచించలేదని, వివక్ష చూపించటానికి ఈ మధ్య ఒకచోట వాదన – ముఖ్యంగా విధవరాలైన స్త్రీలకి, పెళ్లిళ్లు కానీ స్త్రీలకి  !! ‘ధర్మం అనేది ఎప్పుడూ మారుతుంది దేశకాలాలతో’ అని అర్ధం చేసుకునేవారికి ఏ ధర్మం & శాస్త్రం బోధించనక్కరలేదన్నసంగతి ఎంత కాలానికి బోధపడుతుందో నాకైతే అర్ధం కాదు. ఉదాహరణ చెప్తాను. భర్త చనిపోతే, కొడుకులు లేనందున అల్లుడిని మావగారికి తలకొరివి పెట్టమని అడిగిందట ఓ మహా ఇల్లాలు. ఆ అల్లుడు తలకొరివి పెట్టి, పెట్టినందుకుగాను ఉంటున్న ఇల్లు కూడా ఖాళీ చేసి మొత్తం ఆస్థి నా పేరుమీద వ్రాస్తావా లేదా అని అత్తగారి నెత్తిన  కూర్చున్నాడట. అలాంటప్పుడు శాస్త్రం చెప్పినది ఆచరించక్కర్లేదు అంటాను నేనైతే!! ఆవిడే భర్తకి తల కొరివి పెట్టవల్సిందేమో అనుకున్నాను కూడా !!

నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంత మంది వ్యక్తులు పని కట్టుకుని సమాజాన్ని, ఎప్పుడూ  ఏదో విధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ,వాదోపవాదనలు చేయడం, తెలిసీ తెలియని మనుష్యుల మనస్సుల లో విషపు బీజాలు నాటడం  చేస్తున్నారు. దాని వలన ఇటువంటి ఫలితాలు!! అంత క్రితం ఒకసారి చెప్పాను కదా , ఒకాయన స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తూనే రావణాసురుడు తప్పేమి చేయలేదు అన్నట్లు మాట్లాడారు.   శ్రీరామ నవమి రోజు రాముడిని తిట్టడం సరిపోతుంది వీళ్ళకి. వినాయక చవితి రోజు మాత్రమే నీళ్ల కాలుష్యం, శబ్ద కాలుష్యం గుర్తొస్తుంది వీళ్ళకి. దీపావళి కి సరేసరి !! పొగ కాలుష్యం ఉండనే ఉంది !! ఆ మధ్య గోవు మాంసం నిషేధం జరిగినపుడు కొంతమంది ఏకంగా కథలే వ్రాసేసారు. ఇంత కథలు వ్రాసినవారు , ప్రతి పండగకి  ఏదో ఒకటి పోస్టు చేసేవారు, అన్యమతానికి వచ్చేసరికి నోరు మెదపరు. మరి భయమా ? గౌరవమా ? వేరేమతాలని ఆగౌరవపర్చాలి, అవమానించాలి అని నేను అనడం లేదు. ఏ మతంలో పద్ధతి ఆ పద్ధతి ఉంటుంది. ఆ నమ్మకాలని గౌరవించాలి. మనం కోరుకున్న మార్పు చట్టాలతో వస్తోందా ? . ఒక మనిషి ఇంకొక మనిషి మీద గౌరవ మర్యాదలు ఇవ్వటానికి చట్టాలు ఎంత వరకూ పనిచేస్తాయి ?  ‘sensitivity’ అనేది ఒకటి ఉంటుంది. అది లేకపోతే ఏ చట్టము ఏమీ చేయలేదు.