అమెరికాలో దోసావకాయ

Thanks  Giving రోజులు వచ్చేసరికి పండిన పంటలు కోయటం పూర్తి అవుతుందేమో మరి.   సూపర్ మార్కెట్ లలో దోసకాయలు, బీన్స్ లాంటి కూరలు చాలా తాజాగా కనిపిస్తూ ఉంటాయి . దాంతో ఫ్రిజ్ లో ఎప్పుడూ  దోసకాయలు ఉంటూనే ఉన్నాయి.

IMG_1145

ఈ మధ్య YVR  ‘అంతరంగం’ బ్లాగర్  గారు, దోసకాయల గురించిన టపా పెట్టేసరికి వెంటనే యమర్జంటుగా  దోసావకాయ పెట్టేసా!!తినడం, జాడీ కడగటం కూడా పూర్తయిందనుకోండి!!

వంటకాల మీద టపా పెడితే భలేగా ఉంటుంది. చేసిన పదార్థం కొంచెమే అయినా అందరూ  కళ్ళతో తిని మనసు నింపేసుకుంటారు. నాలుక తో తినే ప్రసక్తి లేదు కాబట్టి ‘ఉప్పు ఎలా ఉంది’, ‘నూనెక్కువయ్యిందా’ , ‘కారం ఇంకొంచెం పడితే బావుండేదా’  వంటి మాటలు అస్సలు ఉండవు. వంట చేసినవారికి వడ్డించినంత సంతృప్తి :).

IMG_1054

IMG_1055

 

IMG_1060

 

 

 

 

ఒక చిహ్నం

పారిస్ అనగానే ఎవరికైనా  గుర్తుకు వచ్చే చిహ్నం Eiffel  tower. ప్యారిస్ వెళుతున్నాం అని చెప్పగానే ,  అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే – ‘ముందే Eiffel  tower టిక్కెట్లు కొనుక్కోండి, త్వరగా అయిపోతాయి’ – అని. ఏమిటో అంత పడీ పడీ చూడాల్సిన వింత అనిపించింది.  వెళ్లి చూసాక కానీ అర్ధం కాలేదు ఏంటో!! అంతకంటే వింత విషయం ఏంటంటే ప్రపంచం నలుమూలల నుండీ కేవలం ఈ చిహ్నాన్ని చూడటానికి వస్తారు!! దాన్ని  కట్టడం అవసరమా అనవసరంగా అనేది ఆ దేశం వారికి బాగా తెలుసునేమో మరి !!

భారత దేశం అనగానే ప్రపంచంలో ఎవరికైనా గుర్తొచ్చే  చిహ్నం ఏంటి ? తాజ్ మహల్ . ఆ చిహ్నానికి ప్రత్యేకత ఏంటి ?  ఒక ప్రార్థనా మందిరమా లేక దేశం కోసం అసువులు బాసిన వీరుల కోసం కట్టినదా  ? ఏమిటి ఆ ప్రత్యేకత ? ఒక రాజు తన భార్యలలో తనకి ప్రీతిపాత్రురాలైన ఆవిడకి పాలరాతితో సమాధి కట్టించాడు. ఆవిడ  ఆయనకి ఏ పదో పన్నెండో సంతానం కంటూ చనిపోయింది. ఎన్ని గుడులు పిల్లలకి చూపిస్తామో తెలీదు కానీ, మా లాంటి NRI లు పిల్లలకి ఈ చిహ్నం చూపించి భారతదేశం చరిత్ర బాగా చెప్పేసినట్లు చాలా గర్వంగా కూడా మురిసిపోతాము.

‘temples అంటే పిల్లలకి బోర్ కదా ‘ అని కూడా చెప్పేసుకుంటాం!!ఎంత బాగా కట్టించాడని మురిసిపోతాం!!  పైన ఒక సమాధి, కింద ఒక సమాధి. ఏది నిజం సమాధినో , ఏది ఉత్తుత్తి సమాధినో అర్ధం కాదు. పైగా ఢిల్లీలో గాంధీ గారి సమాధికి ప్రదక్షిణం చేసినా చేయకపోయినా వీళ్ళ సమాధికి మాత్రం చెప్పులు విప్పి మరీ చుట్టూ ప్రదక్షిణం కూడా చేస్తాము !! ‘ఆ రాజు ఏంటి ? ఆయన  భార్య ఏంటి ? వాళ్ళ సమాధికి చెప్పులు విప్పి మరీ నేను ప్రదక్షిణం ఎందుకు చేయాలి’ ఆ ప్రశ్న వేసే నాథుడు లేడు ఆ దేశం లో !! ప్రపంచంలో అతి పెద్ద చరిత్ర కలిగిన దేశానికి, ప్రపంచంలోనే అతి ప్రాచీన నాగరికత కలిగిన దేశానికి, ప్రపంచం లోని పెద్ద కంపెనీ లకి  CEO దిగ్గజాలనీ అందిస్తున్న దేశానికి ఒక రాజుగారి భార్య సమాధి దేశచిహ్నమా ?

నిన్న సర్దార్  వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ ఆవిష్కరణ జరగటం మొదలు !!  పోస్టులు, వార్తలు, కార్టూనులు – ‘భారతదేశం లో అంత పేదరికం ఉన్నపుడు ఇటువంటివి అవసరమా ‘ అంటూ !! ఒక పత్రిక అయితే ‘ ఐఐటీ లు, ఐఐఎం లు బోలెడు కట్టేయచ్చు ఆ డబ్బుతో ‘ అని వ్రాసింది. ఎవరికి తోచినట్లు వారు వ్రాసేసారు !!  

ఒక రోజు పెళ్ళికి- పెళ్లికి విచ్చేసిన ప్రతి జానెడు కడుపుకి  150 రకాల వంటలు, food court లు & పదివేలకి తగ్గని పట్టు చీరలు !! ఏ అవసరం ఉందని అంత విచ్చలవిడిగా ఖర్చుపెడ్తున్నారు ? ప్రపంచంలో ఎవరూ  ఖర్చు పెట్టనంతగా రికార్డు స్థాయిల్లో ఖర్చు చేసేస్తారు ఒక రోజు పెళ్ళికి . అప్పుడు గుర్తు రారేం ఈ పేదవారు మరి ?? ‘నా డబ్బు నా ఇష్టం. ఇది ప్రజల డబ్బు ‘ అంటూ  సమాధానం ఖచ్చితంగా వస్తుంది !! నిజమే !! మీ డబ్బు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రశ్న మీరు ఒక ప్రశ్న వేసినపుడు, మీ సామాజిక బాధ్యత మీకు తెలీదా ?  బాధ్యత తెలిస్తే ఖర్చు పెట్టే ప్రతీ పైసా ఆలోచించుకుని ఖర్చు పెట్టరా ?? ఒక రోజు పెళ్లే – శుభలేఖలు అచ్చు వేసేవారూ , చీరలు నేసే వారు, నగలు చేసేవారు , వంటలు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, పెళ్లి హాల్ వారు, ఆ హాల్ లో పనిచేసేవారు, ఆఖరికి ఓలా  క్యాబ్ వారు – ఇలా ఎంతో మందికి ఉపాధి కలిపిస్తుండగా, అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన విగ్రహం ఎవరికీ ఉపాధి కలిపించదంటారా ?

ప్రపంచం లో ఏ కట్టడమైనా ఎందుకు కట్టాలి అని అనుకుంటే, మనుష్యుల చరిత్ర , ఉనికి తెలిసేవి కాదు. ట్యాంక్ బండ్ మీద బుద్ధుడి విగ్రహం  పెడుతున్నప్పుడు పడవ ప్రమాదం జరిగింది. కొంతమంది పోయినట్లు కూడా గుర్తు!! ఈ రోజున నెక్లెస్ రోడ్డు మీదకి షికారుకి వెళ్లి ఆ విగ్రహం దగ్గర ఫోటోలు దిగేవారిలో,  ఆ రోజు రామారావు గారిని తిట్టిన వాళ్ళు కూడా ఉండవచ్చు. భార్య కోసం ప్రజల సొమ్ము ఖర్చుపెట్టిన షాజహాన్ ని మెచ్చుకుంటూ అదే భారతచిహ్నంగా అనుకుంటాం కానీ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం లో ముఖ్య పాత్ర వహించి, భారత దేశాన్ని మొత్తం ఏకం చేసిన మహాత్ముడికి ఈ విధంగా నివాళి ఇవ్వటం సరికాదు అని ఎందుకు అనుకోవాలి ?

ఈ రోజు వరకు అక్టోబర్ 31 అంటే ఇందిరా గాంధీ గారు అసువులు బాసిన రోజుగానే నాకు గుర్తుండి  పోయింది. . అమెరికాకి వచ్చాక Halloween పండుగ ఆ రోజని తెలిసింది . నా నలభైయేళ్ల జీవితం లో  నిన్న మొట్ట మొదటి సారి తెలిసింది అక్టోబర్ 31 ‘ఉక్కు మనిషి’, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మ దినం అని. సిగ్గుపడాలో లేక సోషల్ మీడియా కి ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్ధం కాని  పరిస్థితి!!

ఈ రోజున ఆ విగ్రహం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది కాబట్టే,  ‘అసలు అంత పెద్ద విగ్రహం పెట్టిన వ్యక్తి ఎవరు’ అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలగటం సహజం. ఈ విధంగానైనా  ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించడం భారతీయులు గర్వంగా భావించాలి. ఈ రోజున భారతదేశం ఇలా ఉండటానికి కారణమయిన ముఖ్యమైన మూల పురుషులలో ఒకరు ఈ మహాత్ముడు!! పాఠ్యాంశాలలో వీరి గురించి చెప్పడం పెద్దగా ఉండదు. నేను వీరి గురించి నా కాలేజీ జీవితం తరువాతే తెలుసుకున్నాను. చదువుకున్నదాన్ని నాకే సరిగ్గా తెలియలేదు.  సామాన్య ప్రజానీకానికి ఎలా తెలియాలి మరి ?? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించేది గాంధీ గారి విగ్రహం!! భారతదేశంలో గాంధీ గారి పేరు ఉన్న వీధి & విగ్రహం లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాగే అంబేద్కర్ గారు !! ఒక సామాన్యుడికి వారందరూ దేశానికి ఏమి చేసారో కూర్చోబెట్టి పాఠాలు చెప్పకుండానే ఈ చిహ్నాలు చెబుతాయి.

ఎన్నో భాషలు , ఎన్నో మతాలు !! ప్రపంచంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే భారతదేశమే !!  మరి ఆ భారతదేశంలో ఉండాలి కదా Statue of Unity!!

ప్యారిస్ అనగానే  Eiffel tower, అమెరికా అనగానే Statue  of Liberty ఎలా గుర్తొస్తాయో, ఇంకో వందేళ్ళకి ప్రపంచంలో  భారతదేశం అనగానే Statue of Unity నే తప్పకుండా గుర్తుకు వస్తుంది అని ఆశిద్దాం !!