నిజమైన విజయదశమి

అనుకున్న నాలుగు టపాలు  విజయవంతంగా విజయదశమి లోపు పూర్తి చేశాను.   ఈ నలుగురు నాకే కాదు.  ప్రతీ ఇంట్లోనూ ఉంటారు.  అందుకే అందరూ connect  అయ్యి చదివారు.  చదివిన వారందరికీ శతకోటి నమస్కారాలు. వీళ్ళ నలుగురే కాదు.  ఓపికతో వ్రాసుకుంటూ  వెళ్ళాలే   అడుగడుగునా బోలెడు మంది ‘అమ్మ’ లు మన జీవితాల్లో ఉంటారు.  

వీరి జీవితాలు గమనిస్తే  చిన్న చిన్న వాటికోసం అడుగడుగునా  యుద్ధమే.  మధ్యతరగతి జీవితం &  Economical status  ఒకటి.  సాంఘిక కట్టుబాట్లు  ఇంకొకటి.  ఒక వేళ  ఉద్యోగాలు చేసినా ఆర్థికంగా బాగానే ఉన్నా, ఒక కట్టుబాటు లోనే  ఉన్నారు. అత్తగార్లు , ఆడపడుచులు  అంటూ ఎంత తిట్టుకున్నా కలిసిపోవడం అనేది చాలా సామాన్యం.  

వీళ్ళందరికీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యాయి. డిగ్రీ పెట్టి కొలిచే చదువులు చదవకపోవచ్చు.  ‘ యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణా’  అని పురాణాలు చదివి బుద్ధిని ఉపయోగించారు. 

 ఒదిగి ఉండడం ఓడిపోయినట్లు కాదు అనటానికి  వీరి జీవితాలే  నిదర్శనం !! ( ‘బోల్డన్ని కబుర్లు’ గారి అమ్మ గారు  చెప్పిన మరచిపోలేని మాట) 

ఇటువంటి family support system ప్రపంచంలో ఎన్ని చోట్ల ఉంది ?  భారత దేశపు ఆడవారు ఈ రోజున అన్ని రంగాలలో ఎంతో పెద్ద బాధ్యత కలిగిన ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అంటే చెక్కు చెదరని భారతదేశపు కుటుంబ వ్యవస్థ. అందులో  ఏ మాత్రం  సందేహం లేదు. 

మరి భారత స్త్రీ కి ఎందుకు కట్టుబాట్లు ? 

భారతదేశం వెయ్యేళ్ళు పరాయివారి పరిపాలన లో ఉంది.  అనేక దాడులు జరిగాయి.  ముఖ్యంగా స్త్రీల మీద.  1971లో  బంగ్లాదేశ్ యుద్ధమప్పుడే లోనే  3 లక్షల మంది ఆడవారి మీద అత్యాచారాలు జరిగాయి అంటే వెయ్యేళ్ళ చరిత్రలో ఎన్ని జరిగివుంటాయో ఊహకు అందని విషయం.  ఇన్ని దారుణాలు జరిగినపుడు ఇంటిలోని ఆడవారిని ఏ ధైర్యంతో బయటకి పంపుతారు? అటువంటప్పుడు కట్టుబాట్లే క్షేమం కదా మరి ?  ఒకవిధంగా ఈ కట్టుబాట్ల మూలాన ఆడవారు ఆ ‘చదువు’లు చదవకపోవడం మంచిదే అయిందేమో కూడా. తెలుగు వారింట్లో గజేంద్ర మోక్షం పద్యాలూ, రుక్మిణీ కల్యాణాలు వినిపించేవా? సందేహమే !! ఆ ‘చదువు’ రాకపోవడం వల్లనే  చాదస్తం రూపంలో కొన్ని సంప్రదాయాలు, విలువలు  మిగిలే ఉన్నాయేమో కూడా .   

ఇటువంటి family support system విరిచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.  జరుగుతున్నాయి.  

‘ఏనాడూ  ధర్మం తప్పకు’ అని రాముడికి  చెప్పి అడవులకి పంపింది కౌసల్య. ఇన్నేళ్లు ఈ కుటుంబ వ్యవస్థ నిలబడింది అంటే  ఆడవారు  ధర్మాన్ని తప్పలేదు. తప్పుతున్న వారిని సరిదిద్దారు. కానీ ఆ ఆడవారే  ధర్మాన్ని వదిలేసేలాగా చేసే వ్యవస్థ తయారవుతుంటే ప్రతీ తల్లీ  ఓ ‘శక్తి ‘ లాగా ఎదుర్కోవాలి!! అప్పుడే నిజమైన విజయదశమి !!  

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !!  

అమ్మ

అమ్మ !! అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మ  ఏం  చేసినా గొప్పే !! ఎలా ఉన్నా గొప్పే!! మా అమ్మని మించిన అమ్మ ఎవరికీ ఉండదు అంటాం. కదా ?  నేను కూడా అదే  చెబుతూ మా  అమ్మ గురించి  మొదలు పెడుతున్నాను. 

మా అమ్మమ్మ, తాతయ్యలకు పెళ్లయిన చాలా  కాలానికి (ఆ రోజుల్లో ) పుట్టిన మొదటి సంతానం మా అమ్మ లలితా  కుమారి గారు.  లేక లేక పుట్టిందని వాళ్ళ నానమ్మ మహాలక్షమ్మ గారు మహా గారాబం చేసేదిట ఈవిడని.  అమ్మకి ముగ్గురు చెల్లెళ్ళు , ఒక్క తమ్ముడు.  అందరి పెద్ద పిల్లల్లాగే చిన్నప్పటి నుండీ ఇంట్లో పనులకి సహాయం చేయడం, చెల్లెళ్లని తమ్ముడిని చూసుకోవడం చేసేది. చాలా బాగా చదువుకునేది కూడా.  రేణిగుంటలో 10వ తరగతి చదువుకుంది.  స్కూల్ ఫస్ట్.  కాలేజీ timeకి  బిట్రగుంట వచ్చేసారు.  బిట్రగుంటలో కాలేజీ లేదు. ఆ ఊరు నుండీ కాలేజీకి వెళ్లాలంటే రోజూ నెల్లూరు వెళ్ళేవాళ్ళు.  అమ్మ కూడా అలా PUC, BSc Biology మొదటిఏడు వరకూ నెల్లూరు వెళ్ళి చదువుకుంది. అమ్మ నెల్లూరులో కాలేజీ నుంచీ వస్తూ ఇంట్లోకి కూరలు కొనుక్కొచ్చేదిట.  చిన్నతనం నుండీ అమ్మకి కుట్లు, అల్లికలు, ముగ్గులు ఇలాంటివి చాలా అలవోకగా చేసేది.  ఈ లోపల మహాలక్షమ్మ గారు అమ్మ పెళ్ళి చూసి వెళ్ళాల్సిందే  అని పట్టుబట్టడంతో మా నాన్నగారి సంబంధం దొరకడంతో  ఆ కాలేజీ చదువుకి  స్వస్తి చెప్పించేసి పెళ్లి జరిపించేసారు మా తాతయ్య.  

అత్తగారింట్లో పెద్ద వదినగా అడుగుపెట్టింది.  అత్తగారితో పేరంటాలకు వెళ్ళడం.  పెద్ద ఆడపడుచుతో  కలిసి గబగబా పని ముగించేసి, వదినామరదళ్ళు  ఆ  అత్తగారికి చెప్పకుండా మాట్నీకి వెళ్ళడం. ఇంట్లో ట్యూషన్ తప్పించుకోవడానికి సాయంత్రం ఆటలాడుకోవడానికి వెళ్ళిపోయిన చిన్న ఆడపడుచుని, మరిదిని  ట్యూషన్ టీచర్ వచ్చేసరికి వదినామరదళ్ళు  కలిసి వీధంతా తిరిగి వెతుక్కు రావడం.  ఇలా మొదలయింది అత్తవారింటి బంధం.  (ఆవకాయ పెట్టి నాకు courier చేస్తుంది.  అదే డబ్బాలో  ఆవిడ మరిది, ఆడపడుచులకి కూడా పెడుతుంది.  వాళ్ళకి వెంటనే ఇచ్చేదాకా ఊరుకోదు. ‘Phone అన్నా చేస్తే వాళ్ళే పట్టుకుపోతారు. కనీసం ఫోన్  కూడా చేయడానికి తీరిక లేదాయే నీకు’ అని నాకే class పీకుతుంది. వాళ్లిద్దరూ అంటే ఎప్పుడూ చిన్న వాళ్ళే  కిందే లెక్క ఆవిడకి.) .

తరువాత మేము పుట్టడం,  బళ్ళకి  వెళ్ళడం అలా సమయం గడిచిపోయింది. నేను 6 వ తరగతిలో తెలుగు నుంచీ English medium మారాను. ఆ మారటంతో నాకు కష్టంగా ఉందని ప్రతీ సబ్జెక్టు కి నోట్సు వ్రాసి పెట్టేది. మా తమ్ముడికి చదువంటే ఎక్కడలేని దుఃఖం వచ్చేది. వెక్కి వెక్కి ఏడ్చేవాడు 😀 . ఒక్కగానొక్క కొడుకు చదువుకోడేమోనని ఈవిడ వాడితోపాటు కూర్చుని దుఃఖపడేది. 

ఇక మాకై  మేమే చదువుకోవడం మొదలు పెట్టాము.  మా నాన్న ట్రాన్సఫర్ లు  వచ్చినా ఆయన వెళ్తూ మమ్మల్ని హైదరాబాద్ లో ఉంచేసారు.  అప్పుడు అమ్మ ఆంధ్ర యువతి  మండలిలో  కుట్టులో డిప్లొమా చేస్తాను అని మళ్ళీ విద్యకు శ్రీకారం చుట్టింది. ఎన్ని రకాల కుట్లు  కుట్టేదో. చాలా మంచి మార్కులతో  డిప్లొమా పాస్ అయింది. ఈవిడ కుట్టే విధానం చూసి ఎవరో చెప్పారు  గవర్నమెంట్ సర్టిఫికెట్ చేయమని.   అందుకు మళ్ళీ సెట్విన్ సంస్థలో Tailoring లో ఇంకో డిప్లొమా చేసి, గవర్నమెంట్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అనుకోకుండా దుర్గాబాయి దేశముఖ్ గారి సంస్థ అయిన  ఆంధ్ర మహిళా సభలో లో కుట్టు నేర్పే టీచర్ గా చేరింది. దాదాపు ఓ 17 ఏళ్ళ దాకా పని చేసింది. ఎంతో మంది దగ్గర ప్రశంసలు అందుకుంది. దుర్గాబాయమ్మ గారికి అంత్యంత  సన్నిహితురాలైన  సుగుణమణి  గారు కూడా అమ్మతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. మమ్మల్ని వాళ్ళింటికి కూడా తీసుకెళ్లేది. స్వయంకృషి మానసిక వికలాంగుల సంస్థ మంజులా కళ్యాణ్ గారు గారితో కూడా మంచి సాన్నిహిత్యం.  ఏదో  కుట్టు నేర్పడం ఒక్కటే కాదు. Challenged పిల్లలకి చెప్పాలి. కొంతమంది పిల్లలు ఎంత attach  అయిపోయేవారంటే, సాయంత్రం ఇంటికి వెళ్లమని  ఏడ్చేవారు. పిల్లల కోసం చెట్ల క్రింద కూర్చునే తల్లితండ్రులు కొందరయితే, పిల్లల stipend  ఎప్పుడు లాక్కుందామా అని ఎదురుచూసేవారు కొంతమంది. ఇలా ఎన్నో రకాల మనుష్యుల్ని , ఎన్నో మనస్తత్వాలని చూసింది అమ్మ. 

మా నాన్న కి  బ్యాంకు ఉద్యోగం కావడంతో ట్రాన్సఫర్ లు అవుతూ ఉండేవి. ఏ ఊరు  వెళ్ళినా  ఈవిడకి ఒక్కరే స్నేహితురాలు ఉండేవారు. వరంగల్ లో ప్రమీల పిన్ని, మహబూబ్ నగర్ లో శచీదేవి టీచర్ గారు,  ఆత్మకూరు లో తేజా అత్తయ్య ఇలా. ప్రమీల పిన్ని,శచీదేవి టీచర్ గారు ఎక్కడ ఉన్నారో తెలీదు. తేజా అత్తయ్య తో అన్ని దశాబ్దాల స్నేహం కొనసాగుతూనే ఉంది.  హైదరాబాద్ వచ్చాక  ఉద్యోగం లో  తన కొలీగ్ లే  స్నేహితులు. పొద్దున్నే 10 గంటలకల్లా అన్ని పనులు ముగించుకుని( మేము చిన్న పిల్లలమైనా సరే ) కబుర్లు చెప్పుకుంటూ  వాళ్ళకి వచ్చిన అల్లికలో కుట్లో  నేర్చేసుకునేవారు. ఈరోజుకి కూడా  అమ్మ ఊరికే కబుర్లు చెప్పదు. చేతిలో చిక్కుడు కాయలైనా ఒలుస్తూ  మాట్లాడుతుంది. మా అక్క , నేను అరుస్తుంటాము ‘ఏమిటే ఈ పని పిచ్చి’ అని. కానీ ఊరుకోదు. అమెరికా వస్తూ ఓ రెండు చీరలు తెచ్చుకుని వాటికి ఎంబ్రాయిడరీ చేసేస్తుంది. పోయినసారి మా దగ్గరికి వచ్చినపుడు కొడుకు కొనిచ్చిన ఐపాడ్ పెట్టుకుని యూట్యూబ్ లో ఏవో నేర్చేసుకుని సాయంత్రానికల్లా నేను  వచ్చేసరికి ‘ఇది చేసానే ఈ రోజు’ అని చెప్పేది. ఫొటోల్లో కాన్వాస్ మీద ముగ్గులు వీడియోలు చూసి వేసేసింది.  ఒకసారి ఏమీ తోచక పిల్లల crayons పెట్టి తెల్ల కాగితాల మీద రకరకాల ముగ్గులు  వేసింది. మా  ఇంటి చుట్టుపక్కల  walking లో వీళ్ళ లాంటి retired వారు పరిచయం అయ్యారు. వాళ్లందరికీ ఆ ముగ్గులని ఫోటో ఫ్రేముల్లో  పెట్టి ఇచ్చింది.  

Time  management  అంటే మా అమ్మని చూసే నేర్చుకోవాలి. ఏదైనా సమయానికే.    ఏ రోజయినా సరే ఎంత హడావిడి అయినా సరే మడి కట్టుకుని పూజ చేసుకుని బయటికి వెళ్తుంది.  ఆవిడ  చదివే స్తోత్రాలు నాకు అలా నోటికొచ్చేశాయి. సరే ఇక అందరి అమ్మల్లాగే వంట చేస్తే అమృతం. ఇల్లు సర్దితే అద్దం. ఎంత సాదా కాటన్ చీర అయినా గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుని కట్టుకునేది. ఆ చీరకే అందం వచ్చిందా అన్నట్లు.

 మా చిన్నప్పటి  నుండీ అమ్మకి ప్రతీది పూస గుచ్చినట్లు మాకు చెప్పడం అలవాటు. మేం చిన్నవాళ్ళం అర్ధం కాదు అనుకునేది కాదు. ఆవు-పులి కధ ఎన్ని సార్లు చెప్పినా వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళం .అంత బాగా చెప్పేది. మా పిల్లలకి కూడా చిన్నప్పుడు అదే ఇష్టంగా ఉండేది. . మా అందరికీ BFF అంటే అమ్మే. 

ఇక నాన్నతో. అమ్మ, నాన్న ఇద్దరూ ఎవరి లోకంలో వాళ్ళున్నట్లే ఉంటారు. పోట్లాడుకున్నట్లే ఉంటారు.  కానీ ఇద్దరికీ common interest లు భలే ఉంటాయి. సంగీత కచేరీలకి వెళ్ళడం. యాత్రలు చేయడం. కాఫీ తాగుతూ మా అందరి గురించి చెప్పుకోవడం.  సంగీతం వినడం, పాత  ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఇవన్నీ నాన్నే  అమ్మకి అలవాటు చేసారు. 

అమ్మకి  తను  అందరిలా డబ్బు తెచ్చే ఉద్యోగం చేయలేదని ‘ఏదోలే  ఓ కుట్టు టీచర్ ని’ అని  అనుకుంటూ ఉండేది. రెండేళ్ళ  క్రితం,  అమ్మవాళ్ళు అమెరికాకి వచ్చ్చి తిరిగి  భారతదేశం వెళ్లేముందు మా ఊరి airport లో ఒకమ్మాయి (అమ్మాయి అనకుండా ఆవిడ అనచ్చేమో ) అమ్మని చూసి నవ్వుతూ ‘లలితా మేడం’ అంది. ఆ అమ్మాయి caretaker కి అర్ధం కాలేదు ఎవరిని పిలుస్తుందో అని. అమ్మ చెప్పింది ఆ caretaker గారికి ‘ ఓ పాతికేళ్ళ క్రిందట తనకి  కుట్టు నేర్పించాన’ని. ఆవిడ మాటి మాటికీ తను చేసిన పని విలువని  డబ్బుతో కొలుచుకుంటూ, ‘నిజమే కాబోలు ఎందుకు అమ్మ చేసే ఉద్యోగం పనికి రాని పనేమో’  అని మాకు తెలీకుండానే అనుకునేట్లు చేసింది.  డబ్బు కోసం ఉద్యోగం అందరం చేస్తాము. లోకమంటే తెలీని ఆ అమ్మాయికి  అమ్మ అంతలా  గుర్తుండి  పోయిందీ అంటే ఈవిడ చేసిన పని విలువ కట్టలేము అని ఆ రోజు నాకనిపించింది. . మనం మనిషి చేసేపనిని  డబ్బు రూపంలోనే కొలవటం ఆపేసిన రోజున విలువలని కూడా గుర్తిస్తాము. 

అదండీ అమ్మ గురించి. 

అత్తగారు

నా  జీవితంలో ఇంకో ముఖ్యమైన అమ్మలాంటి వ్యక్తి .  మా అత్తగారు.

‘మీ అబ్బాయి నన్ను కలవడానికి వస్తా అన్నారు కదా నిన్న. మేము హోటల్ లో ఉన్న రూము నెంబర్ లో చెప్తామని ఫోన్ చేసానండీ.  ఫలానా రూమ్ నెంబర్  అని చెప్పగలరా ?’ అని నేను అడగటం. 

‘అమ్మాయ్ చంద్రికా.  మీ అత్తగారికి ఇంగ్లీష్ రాదే  అమ్మా !  నువ్వు తెలుగులోనే చెప్పాలి’   అని అటుపక్క నుంచీ నవ్వుతూ సమాధానం రావటం.  ఇదండీ  మా అత్తగారికి నాకు జరిగిన మొట్టమొదటి సంభాషణ. 

విజయవాడలో మా నిశ్చితార్థం అయింది. అది అయిన  మరునాడు,  మళ్ళీ అమెరికా వస్తే కుదరదు అని అమ్మమ్మ , తాతయ్య వాళ్ళతో కలిసి బిట్రగుంట వెళదామనుకున్నాను.  పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకుంటే, మా వారు వచ్చి నాకు ఏదో  కొనాలి (మాట్లాడ్డానికి ఒక సాకు)  కాబట్టి మధ్యాహ్నం వెళ్ళమని మమ్మల్ని అడిగారు. సరే అని కృష్ణా express లో వెళదామని నిర్ణయించుకున్నాం. అమ్మ వాళ్ళు  హైదరాబాద్  వెళ్లిపోయారు. హోటల్ లో ఉన్నాము. అక్కడ ఎక్కడ ఉన్నామో  చెప్దామని ఫోన్ చేస్తే మా అత్తగారు చెప్పిన మాట ఈ సంభాషణ. మా నానమ్మ లాగే మా అత్తగారు కూడా నన్ను చూడటానికి పెళ్లి చూపులలో రాలేదు . నిశ్చితార్ధం రోజే చూడటం.

మా అత్తగారికి ఊహ తెలియక ముందే  తల్లీతండ్రీ ఇద్దరూ లేరు.  అత్తయ్య గారికి  ఒక అన్నయ్య, ఒక చెల్లెలు.   వీళ్లందరినీ ఆవిడ  పిన్ని పెంచారు.  ఆ మామ్మ గారు( అత్తగారి పిన్ని) ఇంకా ఉన్నారు. కొంచెం పెద్దయ్యాక అన్నయ్య అక్కచెల్లెలిద్దరిని చూసుకున్నారు. ఎటువంటి పరిస్థుతులలో ఉండేవారు అంటే అక్కచెల్లెలిద్దరికి  ముఖానికి వేసుకునే పౌడర్  కూడా ఉండేది కాదట.  ఒకసారి గోడమీద సున్నం పూసేసుకున్నారట.  వాళ్ళ అన్నయ్య అది చూసి బాధపడి పౌడర్  కొనుక్కొచ్చారు.  

మా మావగారితో పెళ్ళి . నలుగురు పిల్లలు. మా మావగారు very well planned గా పిల్లలకి ,ఆవిడకి ఎక్కడా ఏ లోపం రాకుండా  చూసేవారు……. ఆడపిల్ల పెళ్ళి అయ్యి , మిగిలిన పిల్లలు చక్కటి చదువులు చదువునే సమయంలో కుటుంబానికి  అనుకోని  ఓ పెద్ద ఉపద్రవం.   మా మావగారు హఠాత్తు గా accident లో పోయారు. అటు చిన్నపెద్ద కానీ పిల్లలు. సహజంగానే ఎవర్నీ పల్లెత్తు మాట అనని మనస్తత్వం ఆవిడది.  దానికి తోడు చదువు కూడా లేదు. ఎవరు ఎలా చెప్తే అలా నమ్మారు  ఆవిడ.  ఆ భగవంతుడి దయవల్ల మావారు వాళ్ళు చదువుకుని settle అయ్యారు. 

ఎప్పుడూ పిల్లల్ని తిట్టే వారు కాదు ఆవిడ.  అందులోనూ తండ్రి లేని పిల్లలు అని కూడా అవ్వచ్చు.  మనవలని & మనవరాళ్ళని అంతే. అసలు ఆవిడ  పిలుపే చాలా ఆప్యాయంగా ఉండేది ‘ఏమిటే అమ్మాయ్ ‘ అంటూ. పెళ్లయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యాక మా మావగారి ఫోటోకి నమస్కారం చేస్తుంటే,  ‘ ఆ పక్కన ఉన్నది మా అత్తగారు & మావగారు. వాళ్ళే మనకి మూలా విరాట్టులు . ముందు వాళ్ళకి  నమస్కారం చేయండి’ అని చెప్పారు.  ఇదే మాట  మా పెద్దమ్మాయిని తీసుకువెళ్ళినపుడు కూడా  చెప్పారు.  

మన పెద్దవాళ్ళు చేసే పనులు చాదస్తం లా అనిపిస్తాయి.  పొరపాటున పనిమనిషి రావడం ఆలస్యం అయి ఇంటి ముందు ముగ్గు లేకపోతే  ఈవిడ ఎంత ఓపిక లేకపోయినా నీళ్లు చల్లి వేసేవారు .  ‘ఎందుకు ఆ అమ్మాయి వస్తుంది లేకపోతే ఎవరో ఒకరు ఉన్నారు  కదా ‘  అని పిల్లలు అరిస్తే   ‘ఏమో నాన్నా ! వేయకపోతే తోచదు’ అనేవారు.  పక్కనే ఉండే తోడికోడలు, ఆడపడుచులు  స్నేహితురాళ్ళు  ఈవిడకి.  మా వారి మేనత్త ‘ దాన్ని రోజూ చూసి పలకరించక పోతే తోచదే’ అని చెప్పారు నాతో.  నేను  మొదటిసారి వెళ్ళినపుడు  వినాయకచవితి అని మా తోడికోడలు , నేను  కలసి ఇల్లు కడిగితే మురిసిపోయారు ఆవిడ.   మా మావగారి తద్దినానికి మడి  కట్టుకుని బ్రాహ్మలకి వడ్డించానని తెగ సంబరపడిపోయారు. మా అమ్మతో కూడా చాలా సార్లు చెప్పారట ‘  ఈ మాత్రం చేసిందండీ చాలు ‘ అని. 

మా అత్తగారితో నేను కలిసి ఉన్నది చాలా తక్కువ.  నేను  మొదట రెండు సార్లు భారత దేశం వెళ్ళినప్పుడు ఉండటమే అత్తగారితో ఉండటం అంటే.  నేను తరచూ ఉత్తరాలు వ్రాసేదాన్ని.  ఆవిడ కూడా వ్రాస్తూ ఉండేవారు. మా పిల్లల ఫోటోలు, వీడియోలు తరచూ పంపేదాన్ని. 

2001 లో అప్పటికీ camcorder లో కూడా క్యాసెట్లు ఉండేవి. అవి VCRలో చూసేందుకు ఒక cable పెట్టి record  చేసేవాళ్ళం.  నేను  ఇండియా వెళ్తున్నానని ఇక్కడ మా తోడికోడలు వాళ్ళ అమ్మాయి వీడియో, ఇంటి గృహప్రవేశం  వీడియో అన్నీక్యాసెట్ లో record  చేసి నాకు పోస్ట్ చేసింది.  నేను దాన్నిఇండియాలో వీడియో షాపులో NTSC కి మార్పించాను.  అత్తయ్యగారు వీడియో చూడటానికి VCR మా ఆడపడుచు ఏర్పాటు చేసింది.  అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ  పని చేసింది  అందరం ఆడవాళ్ళమే.  recording చేయాలి.  ఆ manual  చదవాలి.  అదీ ఇంట్లో చిన్న పిల్లలతో చేసాము.  ఆవిడకి ఏదో  చెప్పేయాలి, సంతోష పెట్టాలి అన్న ఆత్రం మా అందరికీ. 

ఫోటోలు పంపిస్తే అందరికీ, ముఖ్యంగా ఆవిడ  పిన్నికి చూపించేవారు.  ఈమధ్య ఆ మామ్మ గారికి ఫోన్ చేస్తే ‘మీ ఫోటోలు కనిపించాయి పిల్లలు ఏవో సర్దుతుంటే ‘ అన్నారు. అలా మా అత్తగారు ఏవి పంపినా ఆ  చూసినవే చూసుకుంటూ & చూపిస్తూ  మురిసిపోయేవారు.  

ఇప్పుడంటే వీడియో calls , internet  ఎలా పడితే అలా వచ్చాయి.  అప్పట్లో mail  చెక్ చేసుకోవాలన్నా కూడా పెద్ద తతంగం..  తరువాత  Reliance  call  వచ్చాక ఫోన్లు బాగానే చేసేవాళ్ళం. మా వారి కన్నా నేనే ఫోన్ చేసేదాన్ని. ప్రతీ విషయం పూస గుచ్చినట్లు చెప్పాలి కదా. .పిల్లలు కూడా ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పేవారు.  ఒక సారి  రెండు గంటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి.  ‘బిల్లు ఎంత వస్తుందో ఏమో చూసుకోవే ‘ అని tension  ఆవిడకి. 

నేను మొదటిసారి తిరుగు ప్రయాణం అవుతుంటే  ‘అస్సలు ఉన్నట్లే లేదు ‘ అన్నారు.  అప్పటికి వెళ్ళడానికి వారం  ఉంది.  ‘మీరూ హైదరాబాద్  వచ్చేయచ్చు కదా అత్తయ్య గారు. అమ్మ వాళ్ళతో , మీతో కలిసి ఉన్నట్లు ఉంటుంది’ అనగానే  వచ్చేసి నాతో పాటూ ఉన్నారు. వీళ్ళింటికి ఎందుకు వెళ్లడం అనుకోలేదు. అలా అందరూ కలిసి ఉంటే  ఎంత ఆనందంగా అనిపించిందో.  ఆవిడ జీవితంలో మొట్టమొదటి & చివరి సారి  నాకోసం airport  కి వచ్చారు. 

రామకోటి వ్రాసుకునేవారు తరచూ. (నేను రామకోటి వ్రాయడానికి ఆవిడే నాకు inspiration)  మాకు ఎవరికి కొంచం ఒంట్లో బావుండలేదు అన్నా ఆంజనేయస్వామి గుళ్లో  అప్పాలు , వినాయకుడి గుళ్లో ఉండ్రాళ్ళు నైవేద్యం చెప్పి పూజ చేయించేవారు.  నేను చివరిసారి ఆవిడకి ఫోన్ చేసినపుడు నాకు మోకాలు నొప్పి అని చెప్తే ‘పూజ చేయిస్తాను’ అన్నారు. చేయించకుండానే వెళ్లిపోయారు.  

నాకు అమ్మమ్మ, నానమ్మ ఉన్నట్లు మా పిల్లలకి అలాగే ఉండాలి అనుకునేదాన్ని.  దురదృష్టం . నేను మూడోసారి Indiaకి ఆవిడకి కర్మకాండ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది.  అన్నీ కార్యక్రమాలు అయ్యి తిరిగి బయలు దేరుతున్నపుడు  ట్రైన్ కదులుతుంటే  అనిపించింది ‘నా పిల్లల కోసం ఆత్రంగా ఎదురుచూసేందుకు ఈ ఊర్లో ఎవరున్నారు ఇంక’ అని కళ్ళలో తెలియకుండానే నీళ్ళొచ్చేసాయి. 

పిల్లలందరినీ portrait  తీయిద్దామని sears  వెళ్తే మా  చిన్న దాన్ని వాడు బుట్టలో కూర్చోబెట్టాడు. ఆ ఫోటో చూసి  ‘ఫోన్లేవే  దాని పెళ్ళికి ఉంటానో ఉండనో. అందుకే వాడు దాన్ని బుట్టలో కూర్చోబెట్టాడు’ అన్నారు.  ఆ ఫోటో చూసినప్పుడల్లా అదే మాట గుర్తొస్తుంది నాకు. 

 ‘ఆ మాత్రం చేసింది చాలు’ అని ఆవిడ అన్నట్లే,  ఆ తద్దినాల  రోజు వంట చేయడం, దీపం వెలిగించడం తప్ప నేను కూడా ఏమీ  చేయను.  

ఆవిడ వెళ్ళిపోయి 13 ఏళ్ళు అయినా,  పిల్లల గ్రాడ్యుయేషన్లు ,  మా బావగారి అమ్మాయి అరగేంట్రం లాంటివి ఇంట్లో ఏమి జరిగినా ఈవిడ ఉంటే ఎలా మురిసిపోయేది కదా అనిపిస్తుంది.  కుటుంబంలో అందరూ ఎంత ప్రేమగా ఉన్నా, ఆ మూల విరాట్టు ఉంటేనే ఆ  ‘unconditional  love ‘ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 

నానమ్మ

 ఈ నవరాత్రుల్లో నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఓ టపా వ్రాస్తాను అన్నాను.  మొదటి రోజు వ్రాసేసాను.   మళ్ళీ ఈ రోజు కుదిరింది.  

ఈ రోజు నాకు ఇంకో ముఖ్యమైన వ్యక్తి.    నానమ్మ . ఈవిడ గురించీ  అంతే.  క్లుప్తంగా వ్రాయడం అంటే కష్టమే.   ఈవిడ  పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగిందంతా తెలంగాణాలో.  అంటే అప్పట్లో  హైదరాబాద్ రాష్ట్రంలో.  ఈ విషయం చాలా సార్లు ప్రస్తావించాను.  నానమ్మ  ఇంట్లో పెద్ద కూతురు.  ఈవిడకి ఇద్దరు చెల్లెళ్ళు , ఇద్దరు తమ్ముళ్ళు . పెద్ద చెల్లెలు,  చిన్న తమ్ముడు ఇప్పుడు లేరు.   మా నానమ్మ పేరు చాలా అందమయిన పేరు.  ఇందుమతి.  దశరథుడి తల్లి పేరు. 

మా ముత్తాత గారు మహబూబ్  కాలేజీలో  పనిచేసేవారు.  నానమ్మ బడికి వెళ్ళి  కొంత చదువుకుంది. అంటే బహుశా ఎలిమెంటరీ బడి వరకూ అనుకోవచ్చు.   ఈవిడకి  అమ్మమ్మ లాగే  చిన్నప్పుడే  12 ఏళ్ళకే  పెళ్లి చేసారు.  మా తాత గారు వాళ్ళు  ఆంధ్ర వారు. పెళ్ళయ్యాక  ఆయన  కూడా  హైదరాబాద్ రావటం జరిగింది.  ఆయన  బీకామ్ చదువు, బ్యాంకు ఉద్యోగం చేయడం అన్నీ ఈ రాష్ట్రంలోనే.  మా నాన్న గారు పుట్టే సమయానికి రజాకార్ల ఉద్యమం మొదలయ్యేసరికి ఆడవారు  ఉండటం  క్షేమం కాదని ఇంట్లో ఆడవారందరినీ  ఆంధ్ర కి పంపించివేశారట. అలా హైదరాబాద్ లో పుట్టవలసిన మా నాన్న గారు ఆంధ్రాలో పుట్టారు.  మా నాన్న పుట్టినపుడు ఆవిడ  వయసు 17 ఏళ్ళు.  మొత్తం ఐదుగురు పిల్లలు, ఒక మనవడు & బోలెడు మనవరాళ్ళు , ముని మనవళ్ళు  & మనవరాళ్లు .  ముని మనవడు పుట్టాడని బంగారు మారేడు దళాలతో పూజ కూడా చేసుకుంది ఈవిడ.  

చదువుకున్నది తక్కువే అయినా ప్రతీ విషయం తెలుసుకోవాలన్న కుతూహలం వలన ఏ విషయమైనా  కొంత అవగాహన తో ఉంటుంది.   చక్కటి  జ్ఞాపకశక్తి కూడా. భాగవత పద్యాలూ , విష్ణు సహస్రం  ఇలా కొన్ని పుస్తకం లేకుండా చదివేస్తుంది. ఈ రోజుకి  కూడా.  బోలెడు దేశ  భక్తి గీతాలు పాడేస్తూ  ఉంటుంది. ఒక రోజు ఫోన్ చేస్తే   భాగవతంలో   ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి’  పద్యం గుర్తు రాలేదుట.  నన్ను అడిగింది. నాకు వెంటనే గుర్తు రాలేదు. నన్ను  తిట్టింది  ‘ ఏం  చదువులో ఏమో ఏమీ తెలీదు మీకు ’ అని.  ఇంతకీ ఎందుకు అడిగింది అంటే అమ్మమ్మకి చదివి దాని మీద చర్చించడానికట . (వాళ్లిద్దరి స్నేహం గురించి  వ్రాయాల్సింది  చాలా ఉంది.  తరువాత ఎప్పుడైనా ).  ఇప్పటికీ కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలు వ్రాసుకుని మరీ practice  చేస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఏ ఆడపిల్ల పుట్టిన రోజయినా ‘బంగారు పాపాయి బహుమతులు పొందాలి’ అని పాట పాడుతుంది .  2017 లో నేను భారత దేశం వెళ్ళినపుడు  ‘మిధునం’ పుస్తకం  కొన్నాను.  ఎక్కడికో వెళ్లి వచ్చేసరికి పుస్తకం చదివేసి  ‘ చాలా బావున్నాయి కథలు ‘ అని చెప్పింది. 

మా నానమ్మ ఒక modern బామ్మ గారు అని చెప్పచ్చు. 

ఆశర్యం ఏంటంటే మా అమ్మ నాన్న పెళ్ళికి , పెళ్లి చూపులకి ఈవిడ వెళ్ళలేదు. అమ్మని Direct గా పెళ్లిలోనే చూసింది.  అప్పటికి ఈవిడ వయసు ముప్ఫైల్లోనే ఉంది. ‘విడిదిలో దిగగానే అందరూ పెళ్ళికొడుకు  తల్లి అంటుంటే ఏమిటోగా అనిపించింది’ అని చెప్తుంటుంది. కోడళ్ళు పని చేయాలి , ఇలా ఉండాలి , అలా ఉండాలి  అన్న restrictions  ఏమీ పెట్టదు. కావాల్సిందల్లా ఆవిడ  కబుర్లు వినాలి లేదా ఆవిడకి కబుర్లు చెప్పాలి.  చిన్న పిల్లల నుంచీ పెద్ద వారి వరకూ అందరితో కబుర్లు చెప్పేస్తుంది. మా అమ్మాయికి చిన్నప్పుడు cinderalla  కథ english లో చదివి వినిపిస్తే ఆశ్చర్యం గా ‘ She can read English’ అన్నది మా అమ్మాయి.  చిన్న పిల్లల్తో అలా ఉంటుంది. .. .  కొంచెం టీనేజ్ పిల్లలు అయితే నెమ్మదిగా డిస్కషన్ పెట్టి వాళ్ళకి girl friend/ boy  friend ఉన్నారో కొన్ని నిముషాల్లో కనుక్కుంటుంది (మా  cousin ఒకమ్మాయి డాక్టర్.  తను ఒక typical  teenager లా కాక ఎప్పుడూ volunteering /సేవ  అంటూ చెప్తూ ఉండేది.  ఈవిడ చూసి చూసి ఒక రోజు , ‘ ఇది & దీని పిచ్చి సేవ గోల. ఇట్టా అయితే ఇంక boy  friend ఏం దొరుకుతాడు దీనికి ?’ అన్నది.) …. కొంచెం పిల్లలు, సంసారం అంటూ మాట్లాడేవారితో వాళ్ళ సాధక బాధకాలు అన్నీతనకి చెప్పేలా మాట్లాడుతుంది. ఇక తన వయసువారితో ఆరోగ్యం, భాగవతం లాంటివి.  అందుకే నానమ్మ అంటే మాకు ఎప్పుడూ excitement.  

వంట అందరూ అద్భుతంగా చేస్తారు.  ఆ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఈవిడకి. 

ఇక మెచ్చుకుంటే అంతే.  మళ్ళీ మళ్ళీ చేయడానికి ఏ మాత్రం బద్ధకించదు. 

చపాతీ మా నానమ్మ చేసినట్లు ఎవ్వరూ చేయలేరు.  అంత మెత్తగా round గా భలే చేస్తుంది. 

ఆడపిల్ల అంటే ఉద్యోగం చేయాలి , తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేది ఆవిడ  మాటల్లో బాగా వినిపిస్తుంటుంది. ‘బంగారు పాపాయి’ పాడినపుడల్లా  అదే message ఇస్తుందా అనిపిస్తుంది.   స్వతంత్రం  గా ఉండాలి అంటుంది.  పెద్ద వయసు వచ్చాక అలా  ఉండటం కుదరదు అని చెప్పినా వినదు. 

నానమ్మ  ‘భయంగా అనిపించింది ‘ అంటూనే  చాలా ధైర్యంగా కూడా ఉంటుంది.  నాకు చిన్నపుడు పిన్నీసు నోట్లోకి వెళ్ళి గొంతులో  ఇరుక్కు పోయింది.  కోటిలో  ENT  hospital లో చేర్చారు. ఆ రాత్రంతా పాపం నాతోటే మేలుకుని ఉండటం నాకు బాగా గుర్తు.  operation theater లోకి వెళ్తుంటే ఆవిడని రమ్మని నేను ఏడుస్తున్నాను.  ఈవిడ ఎంత ధైర్యం అంటే ‘వచ్చేస్తా’  అని లోపలి వచ్చేస్తోంది .  వాళ్ళు   మీరు  రాకూడదమ్మా ‘ అని ఆపేసారు. అదృష్టం కొద్దీ అది ఏ ఆపరేషన్ లేకుండా forceps తో వచ్చేసింది.  ఇంకొక సంఘటన కూడా.  మా పిన్ని ( మా అమ్మ చెల్లెలు) అత్తగారు మహావీర్ cancer  హాస్పిటల్ లో చనిపోతే ఆవిడ  శరీరం దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతుంటే నానమ్మ వెళ్ళి  ఆవిడ  చీర మార్చిందట.  ఆ విషయం మా పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.  

ఈవిడ జీవితంలో  రెండు విషాదాలు. ఈవిడ 48 ఏళ్ళ కే  మా తాతగారు పోయారు.  ఆవిడకి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్న కోడలు కాన్సర్ వలన చిన్న వయసులోనే వెళ్ళిపోయింది. 

భర్త లేని స్త్రీలు, అందులో ముసలి వారు చక్కగా తయారవుతే మన సమాజం లో  ఆశ్చర్యంగా చూస్తారు. .  అవునన్నా కాదన్నా నిజం.  మా నానమ్మ తనకి కావలసిన చీర  ఏ రంగు కావాలో చెప్పి మరీ కొనుక్కుంటుంది. matching  blouse, fall  ఉండాల్సిందే.  covid  ముందు మా తమ్ముడి కొడుకు ఒడుగు అయింది.  నేను, మా అక్క చాలా హడావిడిగా ఇంటికి వచ్చాము మా నాన్నని తీసుకెల్దాము అని.  ఈవిడ నింపాదిగా  ‘ ఏ చీర కట్టుకోవాలో  చెప్పి పోండీ  ఇద్దరూ ‘ అని అడిగింది. ఆ హడావిడిలో నవ్వు , కోపం రెండూ వచ్చాయి. ఆలోచిస్తే అనిపించింది  ఆవిడ మునిమనవడి ఒడుగు అంటే ఆవిడకి  చాలా ముఖ్యమైనదే కదా అని.  

మా అత్తయ్య మా చిన్నప్పుడే అమెరికా వచ్చేసింది. ఆవిడ డెలివరీ 1980 లో అనుకుంటాను, మా నానమ్మ ఒక్కతే ఎయిర్ ఇండియా లో వచ్చేసింది. అదీ  ఏ wheelchair  లేకుండా. ఏదన్నా మాట్లా డాలీ  అంటే హిందీలో communicate  చేసిందట. ‘wheelchair  ఏమిటే కాళ్ళుండగా .  కనుక్కుని వెళ్ళాలి కానీ  ఏమిటీ భయం ‘ అంటుంది.  నా మొదటి డెలివరీకి మా అమ్మ రాలేకపోయింది. మా నానమ్మ ఇక్కడే ఉంది అప్పుడు.   తనే  సహాయం చేసింది. ఈమధ్య వరకూ అమెరికాకి  బాగానే ప్రయాణం చేసింది. ఇక్కడ మా స్నేహితులు  చాలా మంది చూడగానే  ‘ మీ అత్తగారా’ అంటారు. ‘కాదు  మా నానమ్మ’ అంటే ఆశ్చర్యం వేస్తుంది.  

చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో కబుర్లు …     

అమ్మమ్మ  & నానమ్మ ల ప్రేమ పొందటం మా అదృష్టం. 

అమ్మమ్మ

నవరాత్రులు  మొదలయ్యాయి.  మాములుగా అయితే దసరా ప్రతిరోజూ లలిత చదువుకుంటాను.  ఈ సారి  నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఒక్కొక్కరి గురించి వ్రాద్దామని అమ్మవారిని తలచుకుందాం అన్న ఆలోచన ఒకటి వచ్చింది.  అందుకే  ఇలా …. 

 కొంచెం personal గానే ఉంటాయేమో పోస్టులు

ముందు అమ్మమ్మ గురించి మొదలు పెడతాను.  

అమ్మమ్మ & ఆవిడ జీవితం గురించి వ్రాయాలంటే ఒక్క టపా సరిపోదు. కానీ కొంచెం క్లుప్తంగానే  వ్రాయడానికి ప్రయత్నిస్తాను. 

అమ్మమ్మ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది. తనకి  సొంత తోబుట్టువులు అంటే అన్నయ్య ఒక్కడే కానీ, పెదతండ్రి, మేనత్త పిల్లల్ని కలుపుకుంటే బోలెడు బలగం అమ్మమ్మకి. అమ్మమ్మకి ఇద్దరు పెదతండ్రులు. ఇద్దరు మేనత్తలు. అమ్మమ్మ ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. అన్నయ్య వచ్చి ‘అమ్మని నా  చేతులతో  పంపేసానమ్మా ‘ అని ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్ధం కాలేదుట అమ్మమ్మకి. అమ్మమ్మ తల్లి చనిపోయెనాటికే పెదతండ్రులిద్దరి భార్యలు కూడా చనిపోయారట . ముగ్గురు  అన్నదమ్ములు కూడా సవతితల్లులు  వస్తే తమ పిల్లల్ని సరిగ్గా చూడరేమోనని రెండో పెళ్లి చేసుకోలేదట.   ఈ పిల్లలందరినీ విధవరాలైన ఒక మేనత్త చూసుకునేది. ఆవిడే అమ్మమ్మకి  పురాణాలూ చెప్పేదిట. అమ్మమ్మ అందరిలోకి చిన్నది కావడంతో ఏదైనా తాయిలం తెస్తే ముందు అమ్మమ్మకి పెట్టి తరువాత అందరూ  తినేవారు. అలా తల్లి లేని పిల్ల అని అమితమైన గారాబంతో పెరిగింది అమ్మమ్మ. 

పదకొండేళ్ళు నిండగానే మా తాతయ్యతో వివాహం అయ్యింది. అప్పుడు ఆయనకి  పదమూడేళ్ళు. తన  పదహారో ఏట కాపురానికి వచ్చింది. అమ్మమ్మకి  కొన్ని ఏళ్ళ వరకు పిల్లలు కలుగలేదు. అటువంటప్పుడు ఆ రోజుల్లో  కొందరు  ద్వితీయ వివాహం చేసుకునేవారు. తాతయ్య తాను ఒక్కడే కొడుకయినా అటువంటి ఆలోచనలు రానివ్వలేదు. వారి ఇరువురికి  ఐదుగురు సంతానం, మనవళ్ళు & మనవరాళ్లు , ముని మనవరాళ్ళు  & ముని  మనవలు ..  చాగంటి గారు చెప్పినట్లు తామర  తంపర 🙂 .  

ఇంట్లో ఏ కూర  చేయాలి అన్న దగ్గర నుంచీ ఆవిడ  అత్తగారు, అంటే మా ముత్తవ్వ  గారిదే  decision making .  మా ముత్తవ్వ గారి చివరికోరిక మా అమ్మ పెళ్లి చూడాలి అని.  అందుకు   అమ్మని  కాలేజీకి పంపకుండా పెళ్లి చేయమని అడిగేదిట ఆవిడ. దేనికి అడ్డు చెప్పని అమ్మమ్మ అప్పుడు మాత్రం అమ్మని కాలేజీకి పంపాల్సిందే అని పట్టుబట్టింది. సాధారణంగా ఆడవారిలో ఎప్పుడో ఒకప్పుడు ‘ఈ చీర ఇలా ఉండాలి, ఈ నగ ఇలా వేసుకోవాలి’ అంటూ  ఒక కోరిక ఉంటుంది. అమ్మమ్మ ఎప్పడూ  ఏదో  ఒక విధంగా  ఇంకొకరికి సహాయం చేయడమే చూసాను కానీ నోటి నుంచీ ‘ఇది నా కోరిక’  అని ఎప్పుడూ  వినలేదు.

మా అమ్మ &  పిన్నులు, చిన్నప్పుడు ఎండాకాలం సెలవలు వస్తే  వెళ్లడానికి వాళ్ళకి అమ్మమ్మగారిల్లు లేదని ఏడ్చేవారట. అది దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ  మా అందరికీ ‘అమ్మమ్మ వాళ్ళ ఇల్లు’ అనే చెరిగిపోని తరిగిపోని జ్ఞాపకాన్ని అందించింది (అందులో మా తాతయ్య పాత్ర కూడా ఎక్కడా తీసిపోదు). ఎండాకాలం సెలవలు వస్తే చాలు, దాదాపు  ఓ ఇరవై నుంచీ పాతిక మందిమి అయ్యే వాళ్ళం. పొద్దున్నే కాఫీలు, పిల్లలకి వీవాలు, చద్దన్నాలు, భోజనాలు,తలంట్లు, మంచి నీళ్ళు  మోసుకొచ్చుకోడాలు,మధ్యలో బాలింతరాళ్ల & చంటిపిల్లల స్నానాలు, వాళ్ళకి  సాంబ్రాణి పొగలు, మడి & మహానైవేద్యాలు. ఆవకాయలు, మధ్యాహ్నం తాయిలాల తయారీ, పూల జడలు. . మధ్యలో ఊర్లో వారి చంటిపిల్లలకు స్నానాలు అలా ఒకటేమిటి ఇన్ని పనుల్లో తలమునకలైపోతున్నా ‘అమ్మలూ!! నాన్నా !!’ అంటూ మా అందర్నీ అమితమైన గారాబం చేసేది. ఎవర్నీ విసుక్కోవటం  నాకు గుర్తు లేదు. బహుశా అలా అందరం రావడం చాలా ఆనందం గా ఉండేదేమో ఆవిడకి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ మేనల్లుళ్ళు  (అంటే ఆడపడుచు పిల్లలు) ఈ రోజుకి కూడా ఎంతో ప్రేమగా & ఆప్యాయంగా ఉంటారు.  మా ముత్తవ్వగారు  చివరి రోజుల్లో మంచాన పడితే ఆవిడకి సేవ చేసింది.  అమ్మమ్మ చేసిన సేవకి, ఆవిడ ఏడ్చేదిట. 

ఎంత ఓపిక లేకపోయినా కూడా  అత్తగారి & మామ గారి తద్దినాలకి అమ్మమ్మే స్వయంగా వంట చేసి బ్రాహ్మలకి  వడ్డించేది. మా అమ్మ ‘భారతదేశంలో అన్ని చోట్లా  తర్పణాలు, పిండాలు పెట్టారు కదా. ఎందుకంత చాదస్తం‘ అంటే  కూడా వినకుండా ఓపికగా చేసేది.

ఆవరణలో ఆడవారందరూ ఈవిడ ప్రోత్సాహంతో దేవి భాగవతం లాంటివి పారాయణ చేసుకునే వారు.  కొంచెం తీరిక దొరికితే చాలు బుట్టలు అల్లడం, craft  చేయడం లాంటివి చేస్తూ ఉండేది.  

ఏ విషయాన్నయినా positive గానే చూస్తుంది ఆవిడ. అందుకే ఈ రోజుకి కూడా ‘పట్టు విడుపు ఉండాలమ్మా ‘ అంటూ మాకు ఏది ఎలా handle  చేయాలో చెబుతుంది.  

‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవరికీ  నీకున్న ఈ  అవగాహన & ఓర్పు లేదు.అసలు  నీకెలా వచ్చింది?’ అని అడిగాను. ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ  భయమేనే  అమ్మా!!  ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి నాకు.

తాతయ్య సేవకే ఆవిడ  పుట్టిందా అన్నట్లు,  ఆయన  పోయిన పన్నెండో రోజు  ఆవిడ కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి (అప్పటికే గ్లూకోమా వచ్చింది).  ఎప్పుడూ  ఏదో ఒక ప్రవచనం వింటూ గడుపుతోంది. ఇప్పటికైనా ఆవిడకి సేవ చేసుకుని తరించమని మా అందరికీ  భగవంతుడు వరం ఇచ్చాడేమో!! ఆ వరం ఇచ్చినా అందుకోలేని దురదృష్టవంతురాలిని నేను !! ఫోన్ కూడా చేయలేనంత తీరికతో ఉంటాను.  ఈ టపా  అయ్యాక చేసి మాట్లాడాలి. 

ఈ టపా మరీ నా వ్యక్తిగతంగా అనిపించచ్చు.  ఏ బడికి వెళ్లకుండా కేవలం పురాణాగాథలు విని ఇంత జీవిత పాఠం నేర్పించిన అమ్మమ్మలు  మనలో చాలా మందికే ఉంటారు. అందుకే  కేవలం నా మాటలలో ఉండిపోకుండా నా కుటుంబంలో తరువాతి తరం కూడా వారు కూడా తెలుసుకోవాలనే ఈ టపా !! 

అమ్మవారిని పూజించండి. కనీసం ఈ పదిరోజులయినా !

ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నాను కానీ బ్లాగులో ఎక్కించడం మర్చిపోతున్నాను.
నవరాత్రులు మొదలయ్యాక పెట్టిన టపాలు ఒక్కొక్కటి పెడతాను.

మొదటి రోజు టపా 👇👇

కిష్కింద కాండలో సీతాదేవి ఆభరణాలను చూపించినపుడు లక్ష్మణుడు వెంటనే గుర్తుపట్టిన ఆభరణాలు ఆవిడ  కాలి గజ్జెలు/అందెలు. కాలి  ఆభరణాలు మాత్రమే ఎలా గుర్తుపట్టగలిగాడు అంటే,  రోజూ ఆవిడ పాదాలకి నమస్కరించేవాడు.  ఆ పాదాలే  ఆయన  మనసులో ఉండటం వలన వెంటనే గుర్తు పట్టగలిగాడు. 

వైష్ణవుడు అనేవాడు  ప్రతి స్త్రీ లో మాతృమూర్తి ని చూస్తాడు అంటూ  ‘పర్ స్త్రీ జేనే మాత్ రే ‘అన్నారు నరసింహ మెహతా!!

కొద్ది పాటి జ్ఞానం ఉన్న నేనే ఇన్ని ఉదాహరణలు చూపించి  హిందూ ధర్మం అంటే స్త్రీని ఎలా చూడాలో చెప్పగలుగుతున్నాను అంటే  ఎక్కడా హిందూ ధర్మ శాస్త్రాలలో ఆడవారిని కించపరిచే విధంగా చూడామని చెప్పలేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు.  కదా?

ఇంత స్పష్టంగా ఆడవారిని గౌరవప్రదాయకంగా చూడమంటుంటే మన భారతీయ సంస్కృతిలో  ఆడవారిని చులకనగా చూసే సంస్కృతి ఎప్పుడు మొదలయ్యింది  అనేది నాకెప్పుడూ వచ్చే ప్రశ్న. 

ఆడవారిని చులకనగా చూడటం అనేది భారతీయుల్లోనేనా ? ప్రపంచంలో ఎక్కడా లేదా ?ఉంది.  ఎందుకు లేదు!!. కేవలం రెండు ఉదాహరణలు చెప్తాను. 

1) ఈ మధ్య Goa Inquistion  మీద ఒక చిన్న పుస్తకం చదివాను.  అందులో ఒక ఆయుధం గురించి వ్రాసారు.  దాని పేరేంటి అంటే ‘ Breast  ripper ‘.   అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది గూగుల్ లో ఇదే పదం వాడి వెతకండి. చెప్తుంది. నేను ఇంతకంటే ఏమీ  చెప్పను. దాన్ని చూసి చులకన/క్రూరత్వమా అనేది ఎవరికి వారే తేల్చుకోవాల్సిన విషయం. 

2)‘కీచకుడుకి ఒళ్ళంతా కళ్ళే ‘ అంటారు.  ఈ రోజు టీనేజ్ అమ్మాయిల దుస్తులు తయారు చేసే designer  కూడా కీచకుడే.   ఆ దుస్తులు వేసుకున్న అమ్మాయిని వెకిలి చూపులు చూసేవాడు కీచకుడే. 

హిందూ ధర్మం నిలబడాలి అని మాట్లాడే ప్రతీ ఒక్క మగవారు అమ్మవారిని పూజించండి. కనీసం ఈ పదిరోజులయినా ! 

నా ఉద్దేశ్యంలో అమ్మవారిని పూజ చేయాల్సింది ఆడవారు కాదు. మగవారే చేయాలి.  మనస్సులో అమ్మవారు మెదులుతూ ఉంటే  ఎప్పుడూ వెఱ్ఱి మొఱ్ఱి  ఆలోచనలు రావు.  ప్రతి  స్త్రీలోనూ  తల్లిని చూడగలుగుతాడు. 

అదే విధంగా  స్త్రీ కూడా ఓ అమ్మవారిలాగా ప్రతి పురుషుడు తనని చూసి నమస్కరించే విధంగానే ఉండాలి. ‘నా ఒళ్ళు నా ఇష్టం ‘  అంటూ మాట్లాడి designer కీచకులను కాపాడితే , రావణాసురుళ్ళు తయారు  అవుతారు కానీ  శ్రీరామచంద్రులు అవ్వరు. అది గుర్తు పెట్టుకోండి.

అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు !!