డిజిటల్ ఇండియా

మొన్న ఒకరు ఇరవై డాలర్లకి చిల్లర  ఉందా అని అడిగారు. అసలు చేతిలో డబ్బే లేదన్నాను. ఒక రెండు వారాలయిందేమో డబ్బు నగదు రూపం లో లేకపోవడం.  ఇండియాలో అందరూ  లైన్లలో నుంచుని  నగదు తెచ్చుకుంటూ ఉంటే  నేను ఇలా ఎలా ఉండగలుగుతున్నాను అన్పించింది.గుడి హుండీ లోను, గుడి భోజనశాల లో తినడానికి (వాళ్ళు కూడా ఇప్పుడు క్రెడిట్  కార్డులే తీసుకుంటున్నారు), పిల్లల బడులలో చిన్న చిన్న ఫండ్ రైజింగ్ లకి తప్ప నగదు తో పెద్ద అవసరం ఉండదు.  కొంత మంది ఇంట్లో పని చేసి వెళ్లే మెయిడ్ కి, గడ్డి కోసే వారికీ నగదు ఇస్తుంటారు.  అమెరికా కి వచ్చిన కొత్తల్లో ఇండియన్ కొట్ల  లో నగదు అడిగేవారు. ఇప్పుడు వారు సైతం చిన్న మొత్తానికి కూడా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు.  ఖరీదైనవి బంగారం,వెండి నాణేల రూపం లో  కాయిన్ ఎక్స్చేంజి లాంటి వాటిల్లో కొంటే,  వాళ్ళు నగదు పుచ్చుకుంటారు. చెక్ కూడా పుచ్చుకుంటారు. నాకు తెల్సి నంత వరకు చెక్ ఇచ్చిన పక్షం లో వారి  అకౌంట్ లో కి డబ్బు వచ్చాకే  నాణెం చేతిలో పెడతారు(ట). ఇంకొకటి ఏంటంటే కొనుగోలుదారు  పుట్టు పూర్వోత్తరాలు మొత్తం అన్నీ వ్రాయించుకున్నాకే  వస్తువు చేతుల్లోకి పెడతారు (ట).  ఇంక నగదు రూపం ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఈ దేశం లో ?

ఈ దేశం కి  వలస వచ్చిన వారు  పని చేయడం మొదలు పెట్టకముందే చేయవలసిన పని సోషల్ సెక్యూరిటీ నెంబర్ దరఖాస్తు పెట్టుకోవడం.  ఇక డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అన్నీ  దానికే ముడి వేస్తారు. నెమ్మదిగా మన జుట్టు వారి చేతిలో పెట్టినట్లే లెక్క.  దీనితో  తుమ్మినా దగ్గినా అన్నీ తెల్సి పోతాయి.  10 సెంట్లు బాకీ ఉన్నా ముక్కు పిండి మరీ వసూలు  చేస్తారు.  ఎవరికైనా రుణపడి ఎగ్గొట్టి, ఏదైనా లోన్ అప్లై చేశామా అంతే. మన పుట్టుపూర్వత్రాలు అన్నీ  లెక్క కట్టి చెప్పి వడ్డీ రేటు పెంచేస్తారు  అప్పు ఇచ్చేవారు. దానితో సక్రమం గా జీవితం గడపాలి అనుకునేవాడి జీవితం ఎప్పుడూ సాఫీ గానే  గడిచిపోతుంది.  చిన్న తప్పు జరిగిందా అంతే!! చిత్రగుప్తుడు పాపాల చిట్టా విప్పినట్లు మన విషయాలు అన్నీ మనకే చదివేస్తారు.

నేను 2013 లో భారత దేశం వెళ్ళినపుడు  నాకు స్మార్ట్ ఫోన్ లేదు. ఉన్న  ఫోన్ కి టెక్సటింగ్ లేదు. దాంతో SMS లు ఎలా ఇస్తారో కూడా నాకు అసలు ఆలోచనే  లేదు అని చెప్పాలి.  నాకు స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్తే చాలా మంది ఒక వెర్రి దాన్ని చూసినట్లు చూసారు. అమెరికా నుంచి ఏదైనా కావాలా అంటే ‘ఇక్కడ దొరకని వస్తువ’ అంటూ ఏమి లేదు అమెరికా గొప్పేంటి అన్నట్లు సమాధానాలు కూడా వచ్చాయి.  2016 లో మళ్ళీ భారతదేశం వెళ్ళాను. ఈ సారి, 2015 లో కొన్న iphone 5S తో వెళ్ళాను. ఈసారి ఇంకా చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఇంక వాట్సాప్ లేని వారంటూ అతి తక్కువ గా  కన్పించారు. వెళ్లిన ప్రతి ఇంట్లో Wifi . వెంటనే చాలా  వేగం తో   కనెక్ట్   అయిపోయేది  అది కూడా. హైదరాబాద్, నెల్లూరు , రామేశ్వరం ఎక్కడ అని అడగొద్దు. అన్ని చోట్ల !!  Ola, Uber cabs వచ్చాయి. మన చిరునామా చెప్పకుండానే  మనం నిల్చున్న చోటికి వచ్చి టాక్సీ వాడు తీసుకెళ్లడం నాకు , చెప్పద్దూ . నిజం గా ఆశ్చర్యం వేసింది భారత దేశంలోనేనా  ఉంది నేను అని . మా నాన్న గారూ  పాల బిల్లు క్రెడిట్ కార్డు తో చెల్లించటం ఇంకొంచం  ఆశ్చర్యం వేసింది. ఈ మధ్య ఇంకొక స్నేహితురాలు  ప్రతిదానికి ఆధార్ అడుగుతున్నారు అని ఆధార్   కార్డు అప్లై చేయడం కోసం ఇండియా వెళ్తున్నట్లు చెప్పింది. ఇవన్నీ విని ఇండియా డిజిటల్ ఇండియా అయిపోయిందని నిర్ధారించుకున్నా !!

మోడీ గారు వచ్చి నోట్లు రద్దు చేయటం, అందరూ  ఒక తుగ్లక్ పని చేశాడంటూ తిట్టడం, పేద వారికీ ఇబ్బంది కలగింది అని చెప్తుండటం చూసాక పైపై మెరుగులు చూసి డిజిటల్ ఇండియా అయిపోయింది అనుకోవడం నేను పప్పులో కాలేసేసానని అర్ధమయింది.  

మోడీ గారు చేద్దామనుకున్న డిజిటల్ ఇండియా  ఒకటి.  కానీ పాపం  దేశ జనాభా  డిజిటల్ ఇండియా  అంటే – online pizza order చేయడం, flip cart, amazon ల లో కొనుక్కోవడం, whatsapp లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలు పంపడం, కరపత్రాలు పంచడం, dubmash లు తయారుచేయటం,  ముఖపుస్తకం లో రచ్చబండ లు నిర్వహించడం – అనుకున్నారేమో 🙂

ముఖ పుస్తకం ,బ్లాగులు, వాట్సాప్ ఏ విధమైన సోషల్ మీడియా చూసినా  నగదు గురించే గోల.  ATM లైన్లు బారులు తీరి ఉన్నాయి అని.  చిన్న వ్యాపారులకే ఇబ్బంది కలిగింది అని చెప్తున్నారు.  నిజమే. ఇబ్బంది పడేది తోపుడు బండి వ్యాపారాలు, చిన్న దుకాణాల వారు, చిరు వ్యాపారాల వారు. వారి దగ్గర క్రెడిట్ కార్డు మెషిన్ లు ఉండవు.  ఇక్కడ నాకు అర్ధం కానిది ఏంటంటే  మోడీ వచ్చిన తరువాత జన్  ధన్ పథకం క్రింద ఈ చిరు వ్యాపారాల వారు బ్యాంకుల్లో ఖాతాలు  తెరిచారు కదా……  మొబైల్ లో ప్రతి దానికి  వాట్సాప్ ని చాలా తెలివి గా వాడే వారు డబ్బులు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చిరు వ్యాపారాల వారి ఖాతాలలో వేయటం మొదలు పెట్టచ్చు కదా ? సగం బాధలు తగ్గుతాయి కదా ?

వెంటనే అవగతం అయింది. భారత దేశం లో ప్రతి సమస్య అంత సులభం గా ఎందుకు పరిష్కారం అవుతుంది:) అవ్వదు కాక అవ్వదు. .

ఎందుకంటే :

  1. చాలా మంది కి  ఆధార్ కార్డు ఉండి  ఉండదు. ఎందుకు ? ఆధార్ కి కావాల్సింది  ఓటర్ రిజిస్ట్రేషన్ & చిరునామా. అవి లేవు అంటారు. ఓటర్ రిజిస్ట్రేషన్ ఉండకపోతే  ఓట్లు ఎలా వేసి ఉంటారు ? అది తెలీదు.
  2. ఆధార్ కార్డు ఉన్నా, బ్యాంకు లో ఖాతా ఉండి  ఉండదు. ఎందుకు? అది తెలీదు
  3. ఖాతా ఉన్నా అందులో వేయడం ఇష్టం ఉండదు . ఎందుకు ? ఎందుకంటే సంపాదన ఎంతో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. తెలిస్తే ఏమవుతుంది ? పన్ను కట్టాల్సి వచ్చినా రావచ్చు.  ఎందుకు పన్నుకట్టరు  ? ఎవ్వరూ  పన్ను కట్టరు  నేనెందుకు కట్టాలి?

అందరికీ  భారత  దేశం చైనా లాగానో , అమెరికా లాగానో మారిపోవాలి . కానీ అమెరికా లో వారానికి 40 గంటలు ఖచ్చితం గా పని చేయాలన్న తపన అక్కర్లేదు. చైనా వాళ్ళ లాగా గొడ్డుల్లా  కష్టపడటం అంత కంటే ఇష్టం ఉండదు. అన్నీ  ఉచితం గా ఇచ్చేయాలి.  

అసలు సోషల్ మీడియా లో  చిల్లర ఇబ్బంది గా ఉంది అని చెప్పేవారు, ఎంత మంది చదువు రాని వారితో ఆధార్ దరఖాస్తు చేయించారు ? ఎంత మంది చిన్న వ్యాపారాల వారితో బ్యాంకు ఖాతాలు  తెరిపించారు? దేశ  సేవ అంటే ఇటువంటి చిన్న చిన్న పనులే. కాలేజీలలో చదివే పిల్లలతో ఇటువంటి వాలంటీర్ పనులు చేయించవచ్చు  నేమో .

డిజిటల్ ఇండియా అంటే ఒక చిరు చేనేత కార్మికుడు అమెరికా లో ఉన్న మాలాంటి వారితో  online వ్యాపారం చేయటం, సైకిల్ మీద తిరిగి పూలు అమ్ముకునే  ఒక పూల  వ్యాపారి mobile banking వాడటం వంటివి, అంతే కానీ pizza hut లో online pizza order మాత్రం కాదు. నగదు తో ముడి పెట్టే పనులు ఎంత నివారిస్తే అంత మంచిది.

మహనీయ మధురమూర్తే

“వస్తా వట్టిదే పోతా వట్టిదే

ఆశ  ఎందుకంటా ?

చేసిన ధర్మము చెడని పదార్థము.

చేరును నీ వెంటా”

 తరుచుగా వినే పాట అయినా ఈ రోజు వింటుంటే  తెలియకుండా కనుల వెంట నీరు కారింది. బాలమురళి కృష్ణ గారి గురించి వ్రాద్దామనుకుని ఎప్పుడో సగం వ్రాసిన ఈ టపా కి ఆయన పోయిన రోజుననే  ముగింపు ఇవ్వవలసి వస్తుంది అనుకోలేదు.

ఐదేళ్ల వయసు నుంచీ  మేము రోజూ  విన్న పాటలు బాలమురళి కృష్ణ  గానాలు, సుబ్బులక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (అయినా ఒక్క రాగం కూడా గుర్తు పట్టలేను.  మంగళ హారతి పాటలు పాడటానికి తప్ప ఎందుకు పనికి రాను).  “పొద్దుగాలే  మొదలు పెట్టిండా  మీ నాన్న పాటలు వినుడు ?”   ఆడుకోవడానికి వెళ్తున్న మమ్మల్ని  మా ఇంటి ఓనర్  పెద్ద రెడ్డి గారు నవ్వుతూ అడిగే ప్రశ్న . రోజూ పొద్దున్నే రెండు పెద్ద స్పీకర్లతో  గ్రామ్  ఫోన్  ప్లేయర్ లో బాలమురళి కృష్ణ  కీర్తనలు పెట్టేవారు మా నాన్న. మా నాన్న గారి ఉద్యోగరీత్యా   తెలంగాణ లో మేము ఉండిన  ఒక చిన్న పల్లెటూరి లో ఇలా పెద్ద సౌండ్ తో సంగీతం వినటం  అందరికీ  కొంచం వింతగా అనిపించేది.

మాకు ఊహ తెలిసాక మా నాన్నగారు  ఎన్ని  సినిమాల కి  వెళ్లారో / తీసుకెళ్లారో  వేళ్ళ మీద లెక్కపెట్ట వచ్చేమో  కానీ ఆయన వెళ్లిన సంగీత కచేరీలు, ముఖ్యం గా బాలమురళి వి –  లెక్క నాకు మాత్రం గుర్తు లేదు. . కొన్నిసార్లు మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు. ఈ రోజుల్లో లాగా అందరికి కార్లు ఉన్నట్టుంటే  ఆయన  వెళ్లిన ప్రతి కచేరి కి మేము వెళ్ళేవాళ్ళమేమో.  ఉండేది టు వీలర్ కావటం తో  మా అమ్మ మాత్రమే వెళ్ళేది.   మా నాన్న కి ఒక స్నేహ బృందం ఉండేది. వీళ్లందరినీ ‘బాలమురళి ఫాన్స్’ అనచ్చేమో.  ఆ స్నేహితుల్లో ఒకరు కొడుకు పుడితే ‘బాలమురళి కృష్ణ’ అని కూడా నామకరణం చేసారు. మోర్సింగ్ వాయించే వాద్యకారునికి వీళ్ళు ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు.  కచేరి లో వీళ్ళందరూ ఒక చోట చేరి,  వీరు కోరుకున్న కీర్తనలు చిట్టీ  మీద వ్రాసి వేదిక పై గాన కచేరి చేస్తున్న  బాలమురళి గారికి ఇచ్చేవారు.  బాలమురళి  ఆంధ్ర దేశం లో కచేరీలు మానేసాక వీళ్ళందరికీ పిచ్చి పట్టినట్లయిందనే చెప్పాలి.

బాలమురళి  కచేరి అంటే మాకు  వినోదం గా అనిపించేది . అందుకే  మేము ఎప్పుడూ  ఆయన కచేరి కి వెళ్ళడానికి సుముఖం గా ఉండేవారం.   ఇక ఆయన వాయిద్య సహకార బృందం లో మృదంగం ఎల్లా వెంకటేశ్వరా రావు గారు వాయిస్తున్నారు అంటే  చెప్పనే అక్కర్లేదు. వినోదమే వినోదం !! బాలమురళి కృష్ణ  ముఖ్యం గా స్వరాలూ వేస్తూ పక్కన వారిని నవ్వుతూ చూడటం.  నాకు బాగా గుర్తు ఏంటంటే ‘ఎంత ముద్దు ఎంత సొగసు’ అన్న దానికి  ఆయన  మూతి సున్నాలా చుట్టి  పాడేవారు .   ‘నగుమోము’,’ త్రిపుర సుందరి’ వంటివి బాలమురళి నోటా విన్నాక ఎవరివీ  వినబుద్ధి కాదు. ఆయన  ముద్ర పడిపోయిందేమో వాటికి  అన్పిస్తుంది.  అసలు బాలమురళి కృష్ణ గాత్రం ఒకసారి అలవాటు పడ్డాక ఇంకొకరిది అలవాటు చేసుకోవడానికి ఎంత కష్టమో!! మా అమ్మాయి సంగీతం గురువులు కూడా ‘ఆయన  సంగీతం ఎక్కువ వినకు. ఆయన లాగా ఎవరు పాడలేరు . He is not for beginners” అని చెప్తుంటారు.

మా నాన్నగారికి బాలమురళి కృష్ణ గానం ఎంత ఇష్టం అంటే  అసలు గ్రామ్  ఫోన్ ప్లేయర్ కూడా ఆ గాత్రం వినడానికే కొన్నారనుకుంటా. ఒక్కొక్క రికార్డు 50-100 రూపాయల దాక ఉండేది. కొత్తది రావటం ఆలస్యం వెంటనే కొనుక్కొచ్చుకునే వారు. మా చుట్టాలలో కొంత మంది విచ్చలవిడిగాఇలా డబ్బు ఖర్చు పెడతారు అని  చెప్పుకునేవారు కూడా.  ఇప్పుడు అవన్నీ అంతే జాగ్రత్త గా mp3 లలో కి మార్చి hard drive లో పెట్టి అడిగినవాళ్లందరికి ఇస్తుంటారు.  నాకు ఇచ్చిన వాటిని  సీడిల లోకి మార్చి  కారులో వింటూ ఉంటాను.లేని రికార్డులు అంటూ  లేవు మా నాన్న గారి దగ్గర!!

2010 లో  Cleveland ఆరాధన  లో జరిగిన  బాలమురళి కృష్ణ, సుధా రఘునాథన్   కచేరి కి మా పిల్లలని కూడా తీసుకుని వెళ్ళాము. అప్పటికి మా పిల్లలు చిన్నవాళ్ళనే చెప్పాలి  !! దాదాపు ఆ రెండు గంటల కచేరి లో ఒక్కసారి కూడా  వెళ్దామా  అని అడగలేదు. పైగా తర్వాత కూడా ఇంకో రెండు కచేరీలకి అడగగానే ఉత్సాహం గా వచ్చారు.  అంత చిన్న పిల్లల్ని కూడా మంత్రం వేసి కూర్చో పెట్టే శక్తి  ఆయన  గాత్రం కే  ఉంది 🙂  ఈ మధ్య మా అమ్మాయి ‘క్షీర సాగర విహార’  అన్న ఉత్సవ సాంప్రదాయ కీర్తన నేర్చుకుని ‘బాలమురళి పాడినట్లే  వచ్చిందా లేదా’ అని అడిగింది మా నాన్న గారిని.

Cleveland ఆరాధన లో మా అమ్మాయి కొనుక్కున్న టీషీర్ట్ , ఆయన  మమ్మల్ని ఆశీర్వదించి చేసిన ఆటోగ్రాఫ్ !! మా అమ్మాయి తెలుగు లోనే ఆటోగ్రాఫ్ చేయమని కోరితే ‘ఎవరూ అడగలేదే నన్నుఇలా ‘ అంటూ నవ్వుతూతెలుగులోనే ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.

2011 లో అనుకుంటాను.  మజుందార్ తో జుగల్బందీ కచేరి చూసాము . మజుందార్ గారు ఆయన  వేణువులు అన్నీ పక్కన పెట్టేసి ఏది కూడా బాలమురళి గాత్రానికి సరిపోవు అని చెప్పేసారు. ఇది నా కళ్ళతో నేను స్వయం గా చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి మహనీయుడిని చూడగలిగిన తరం లో పుట్టానా అని ఆనందం వేసింది.

మా నాన్నగారి కుటుంబం లో ఎవరికీ  సంగీతం రాదు.తెలియదు.  బాలమురళికృష్ణ గాత్రం విని  ఎందుకు మా నాన్నగారికి అంత ఆసక్తి వచ్చిందో  భగవంతుడి కృప ఏమో అన్పిస్తుంది.

సంగీతం అంటేనే  బాలమురళి. బాలమురళి అంటేనే సంగీతం. అందుకే ఆయనెప్పుడూ  ‘బాలమురళి కృష్ణుడే ‘!!

పదునైన ఆయుధం

జరుగుతున్న విషయాలు  చూస్తూ  చాగంటి గారు చెప్పిన ప్రవచనం కి  వాటిని ముడి పెడుతుంటే అన్పిస్తోంది, ప్రవచనాలు నా మట్టి  బుర్రకి కూడా ఎక్కుతున్నవీ అని!!  నేను ప్రవచనము చెప్పే స్థాయి కి రావాలంటే ఇంకో జన్మ ఎత్తా లేమో, కానీ నేను అన్వయించుకున్నది ఈ టపా లో విశిదీకరించడానికి ప్రయత్నిస్తాను.

చాగంటి గారు వారి ప్రవచనా ల్లో  ఒకటికి పది సార్లు చెప్తారు ‘మాట’ అనే దాని గురించి. రంపపు కోత  కంటే అనరాని మాటలే గాయపెడతాయి అన్నారట బలిజేపల్లి వారు.  మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. నిజమే.  కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా  నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది నాకు .

ముఖ్యం గా సుందరకాండ లో  హనుమంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు. ఈ రోజే కష్టేఫలి శర్మ గారు వారి బ్లాగులో వారు చాలా బాగా చెప్పారు “ఎంత చెప్పినా తక్కువే తార గురించి. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే తార, వాలిని, వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే మీతమ్ముడు తిరిగి వచ్చాడని, నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చరిస్తుంది. వాలి వినడు, అది వేరు. తన సంభాషణా చాతుర్యం తో, కోపంతో వచ్చిన లక్ష్మణుని చల్లపరుస్తుంది. చెప్పిన మాటలు చూడండి. ” చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా,నేనూ దక్కేము, భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా………….”, అని మత్తుతో కనులు మూసుకుపోతున్న సమయంలో కూడా మాటాడగల్గిన చతుర. మరి కొంచం ముందుకెళితే కనబడేది, మండోదరి, యీమె కూడా తన సంభాషణా చతురత చూపింది కాని, రావణుని వంటి కాముకుని వద్ద పని చేయలేదు. సుందర కాండలో సీత హనుమల సంభాషణ వొక అద్వితీయ ఘట్టం. ఇద్దరు గొప్పవారు మాటాడితే యెలా వుంటుంది అన్నది, చదువుకుని ఆనందిచాలి, నాకు చెప్పగల తాహతు లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నా. హనుమ నవ వ్యాకరణ పండితుడట.’’

తండ్రి కైకేయి కి ఇచ్చిన మాటకై   అడవులకి  వెళ్ళాడు శ్రీరాముడు. మారీచుడు రాముడిలా గొంతు పెట్టి అరిచినపుడు, రాముడికి ఏమయిందోనన్న ఆతృత తో  సీతా దేవి  లక్ష్మణ స్వామి తో ‘నన్ను చేపడదామని ఆలోచిస్తున్నావేమో’  అన్న అనకూడని  ఒక్క మాట రామాయణం నే మార్చేసింది.  ‘ఏడాది లంక లో ఉన్న సీత’ అన్న ఒక రజకుడి మాట విని భార్య నే పరిత్యజించాడు  శ్రీరాముడు. కుంతీ దేవి ‘బిక్ష ను అందరూ  పంచుకోండి’ అన్న మాట అసలు మహా భారతం కథనే నడిపించింది.

రామాయణ భారతాల నుంచి ఈ రోజుకి తిరిగి వచ్చేస్తే  …… డోనాల్డ్ ట్రంప్ గారు, ఓట్ల కోసం గత పద్దెనిమిది నెలలలో తన  నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడి , మాటలే ఆయుధాలుగా వాడుకుని  అధ్యక్షుడి పదవిని కైవసం చేసుకున్నారు. ఈ రోజున ఆ పదవి దొరికింది కానీ,  ఈ నిరసనలు, గోలలు చూస్తుంటే ఆయన  మాటలే  ఆయనకు పాశాలై  చుట్టుకుంటున్నాయి అన్పించింది.

కష్టేఫలి శర్మ గారన్నట్లు  “పంచేద్రియాలలో ఒకటైన నరం లేని నాలుక చేసేవి రెండే పనులు. ఒకటి రుచి చూడటం. రెండు మాట్లాడ్డం. “.  అసలు ఈ నాలుక ని నియంత్రించుకుంటే చాలేమో.  అన్నీ  విధాలుగా  బాగుపడచ్చు  🙂

కొసమెరుపు : ఈ టపా పెట్టే  ముందు యాధృచ్చికం గా చాగంటి గారి భారత ప్రవచనం విన్నాను. సభా  పర్వం  15/26  భాగం.  శిశుపాలుడు రాజసూయా యాగం లో కృష్ణుడి కి అగ్రపూజ చేసినందుకు ధర్మరాజు తూలనాడినప్పుడు మాట్లాడిన మాటలు. చివరి పదిహేను నిముషాలు చాగంటి వారు ‘మాట’ గురించే చెప్పారు. ఈ ఘట్టం లో శిశుపాలుడు గురించి చెప్తుంటే నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి. మోడీ నోట్లని రద్దు చేస్తున్నట్లు చెప్పగానే ముందు మాట్లాడేసింది కేజ్రీవాల్ గారనుకుంటా :). విషయం తెలియక ముందు చాలా మంది చాలా మెచ్చేసుకున్నారు. లైన్లలో నిల్చుని కాళ్ళు నొప్పి పుట్టగానే ‘ముందు వెనుక ఆలోచించకుండా ఈ పని ఏమిటి’ అంటున్న వారు మొదలయ్యారు.  నాలిక కదా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది మరి !!  

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

బోల్డన్ని కబుర్లు వ్రాసే లలిత గారి టపా  చూసాక  శివోహం అనుకుంటూ  నా కళ్ళతో చూసే ఈ ప్రకృతి సౌందర్యాన్ని అందరి తో పంచుకోవాలనిపించింది.   కార్తీక మాసం లో పొద్దుటే ఈ పాట వింటూ నా  పనికి వెళ్తుంటాను.

14884448_1227601030665958_5793607989792244346_o

14991424_1232782426814485_2244025239957937457_o

 

14882270_1227601057332622_1391173639396297583_o

img_2892

img_2888

img_2886

img_2919

img_2915

img_2912

img_2928