కాషాయం

మా పిల్లలు బాలవికాస్  గణపతి పూజకి వెళ్ళినపుడు చిన్మయ మిషన్ స్వామి వచ్చి వీళ్ళని దీవించి ఓ కథో కబుర్లో చెప్పేవారు. పిల్లలందరికీ ఎంత బాగా నచ్చేదంటే కదలకుండా చక్కగా కూర్చొని ఆయన  చెప్పినదంతా వినేవారు.  ఆయన వస్తుంటే ఆయనకి స్వాగతం చెప్పడానికి బాలవికాస్ గురువు గారైన రావ్ అంకుల్ పిల్లలతో పూర్ణకుంభం పట్టించి ‘ న కర్మణా న ప్రజాయా’ అంటూ సన్యాస సూక్తం చదివించి వారికి స్వాగతం పలికించేవారు. సన్యాసి అంటే అంత గౌరవం ఇస్తారని నాకు మొదటి సారిగా  తెలిసింది.  మా పిల్లలకి అలా తెలియజెప్పడం  చాలా మంచిపనే అని అనుకుంటున్నాను ఈరోజున. 

 

ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచీ  బాబాలు, స్వాములు  అన్నా నాకు ఒక రకమైన చులకనా భావం ఉండేది. మా నాన్నపూజలు  చేయకపోయినా  రోజూ ఇంట్లో సంగీతమే వినిపిస్తూ ఉండేది. పైగా జాతకాలు చూడటం కూడా చేస్తుండేవారు. ఇక మా అమ్మ పొద్దున్న తనుకున్న కొద్దిపాటి  సమయాన్ని మడి, మడి  నీళ్ళు , పూజ,  నైవేద్యం లాంటి వాటితో బిజీగా నింపేసేది.. ఇంట్లో వాతావరణం ఇలా ఉన్నా, అలాంటి భావం ఎందుకుండదు తెలీదు.

 

మా తమ్ముడు పుట్టపర్తి బాబా గారి బడిలో చదువుకున్నాడు. ఇంటికొచ్చి భజనలు పాడుతూ  ఉండేవాడు. ఏడిపించేదాన్ని ‘బడికి వెళ్తున్నావా భజనలు చేస్తావా’ అని.  వాడికి కూడా నామోషీగా ఉండేది ఈ భజనలేంటి అని. ఇంటి ప్రక్కనే ఉన్న శివం గుడికి బాబాగారు వస్తే ఒక్కసారి కూడా దర్శనం చేసుకోకపోగా, . మేమున్న వీధిలో ఆగిపోయిన  ట్రాఫిక్ చూసి ఏంటో వెర్రిజనాలు అనుకునేదాన్ని.మా తమ్ముడు బడివాళ్ళు వీళ్ళని పుట్టపర్తి తీసుకెళ్లేవారు. మొట్టమొదటి సారి మాతమ్ముడు బాబాని దగ్గరగా చూడటమే కాదు, ఆయన విభూది వీడి చేతిలో పెడుతుంటే వేళ్ళు తగిలాయి. ఇంటికి వచ్చి , ‘మనం నవ్వకూడదు. ఆయనని చూస్తే నాకు ఒక రకంగా అయిపోయింది. అది అనుభవించాల్సిందే కానీ చెప్పలేను’ అన్నాడు. 

 

ఒకసారి శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ స్వామి వారు పక్కనే ఉన్నశంకర మఠంలో ఉన్నారు. ప్రతి రోజూ వారు సాయంత్రం తీర్థం ఇచ్చేవారు. అప్పుడే  మా అక్కపెళ్ళి. మా అమ్మమ్మ నానమ్మ ఇద్దరూ కలిసి పొద్దున్నుంచీ కూర్చుని పిండి వంటలు చేసేవారు. సాయంత్రం అవ్వగానే తీర్థం తీసుకుని దర్శనం చేసుకుని వచ్చేవారు. వాళ్ళని ఏడిపించేదాన్ని’ అయిందా దర్శనం’ అని.  ‘తీర్థం ఇస్తే పక్కకి వచ్చి తాగాలి. ఆయన మీద పడకూడదు’  అని వాళ్ళు చెప్పగానే, ‘ఏం?  ఈలోపల ఆయన నిష్ఠ  ఏమయిపోతుందిట?’  అంటూ ఎగతాళి. ‘తప్పు అలా అనకూడదు’ అన్నా లెక్కలేదు. అలా అని దేవుడు, భక్తి ఉండేది కాదా అంటే ఉండేది. పైగా షిరిడి సాయిబాబా జీవితచరిత్ర చదివేదాన్ని. కానీ చెప్తున్నాగా ఒక రకమైన చులకన. అలా చక్కటి అవకాశం ఉండి కూడా దర్శనం చేసుకోలేదు అలాంటి మహాత్ములని. ఈరోజున బాబా గారు పాడిన భజనలు వింటుంటే, ఎంత బాధగా ఉంటుందో.

 

అంటే ఇంట్లో వాళ్ళు చెప్పకుండా నాకు ఎక్కడనుంచీ వచ్చి ఉంటుంది  ఆ చులకనా భావం ?  ఆ రోజుల్లో ఉన్న మాధ్యమాలు సినిమాలు, నవలలు, వార్తా పత్రికలు కావచ్చేమో కూడా.   ఆమధ్యకాలం లో పుట్టపర్తి వారి మీద పత్రికలలో ఎన్నో కథనాలు వచ్చేవి.  ఒక్క విశ్వనాధ్ గారి సినిమాలు (శుభోదయం)  తప్పించి ఏ సినిమాలో అయినా సరే సన్యాసి అనగానే ఒకరకమైన హాస్యం. అంటే నేను చెప్తున్నది ఏంటంటే మన మాధ్యమాలు కాషాయదుస్తులు ధరించిన వారి గురించి చెడుగానే చెప్పారు/చెప్తున్నారు  కానీ వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పవలసిన తీరులో చెప్పలేదు/చెప్పట్లేదు. 

 

అలా  ఒకటి కాదు చాలా ఉంటాయి చెప్పాలంటే…..

 

అరటిపువ్వు సాములోరు , బంగారు మురుగు…… 

 

అప్పు చేసి పప్పు కూడు  సినిమా మొదలుకొని  కెవ్వుకేక, PK వరకూ సన్యాసే ఒక హాస్యం. 

 

Open heart with RK  కార్యక్రమం చూస్తుంటాం.  వేమూరి రాధాకృష్ణ జీయర్ స్వామిని, గరికపాటి వారిని, చాగంటి వారిని ఇంటర్వ్యూ చేసేప్పుడు ఒక మాట అంటాడు ‘ సాములు’ . తెలుగు  ఛానల్ కదా. తెలుగు రాదా ‘స్వాములు’ అనలేడా ? అనగలడు . కానీ అహంకారం కదా !! ‘స్వాములు’ అనడు. ‘దొంగ సాముల్ని ఏం  చేయాలి’ అని అడిగి  ఓ గొప్ప తెలివైన ప్రశ్న వేసాను  అనుకుని వంకరగా  నవ్వుతూ కాళ్ళూపుతుంటాడు. 

 

ఈ మధ్య అమెరికాలోనే  ఒకాయన కాషాయం రంగు కుర్తా వేసుకుని చీపురుని మంత్రదండంలా పెట్టుకుని ఫోటో పెట్టాడు.  అందరూ అదేదో జోకులా దానికి పగలబడి నవ్వుతున్నారు. 

 

మొన్నటికి మొన్నఎక్కడో ఓ మూల కూర్చొని పురాణం చెప్పుకుంటూ చెప్పుకునే  ఒక స్వామి నారాయణ్ గుడిలో  స్వామి ఆడవారిని ఏదో అన్నాడుట . ఇంత మాట అంటాడా అని గగ్గోలు పెట్టింది ఈ liberal media. అదీ ఏంటి? ఎప్పుడో చెప్పిన వీడియో. గుడి  website లో ఉన్నదాన్ని బయటికి పీకి మరి గోల పెట్టారు.

 

దొంగ సన్యాసులు లేరా అంటే ఉంటారు. కానీ అందర్నీ ఒకటే అని ఎలా చెప్తాము ? అందర్నీ ఒక గాటిన కట్టి  జోకర్లుగా,  విలన్లుగా చిత్రీకరిస్తుంటే రాను రాను ఎన్ని ఘోరాలు జరుగుతాయా అనిపిస్తోంది. కాషాయం ధరించడమే శాపమయిపోతోంది వాళ్ళకి.

 

అర్నబ్  గోస్వామి ఏంటి ఇంత గగ్గోలు పెడుతున్నాడు అని ఓ డిబేట్ చూద్దామని  చూసాను.  డిబేట్ మధ్యలో కట్టేసాను. అతని అరుపులకి  అనుకుంటే తప్పు. ఆ డిబేట్ లో కొన్ని  దృశ్యాలు చూసి  కళ్ళవెంట నీరు వచ్చింది. చూడలేక కట్టేసాను.  ఇద్దరు సాధువుల్ని పోలీసులు చూస్తుండగానే  బాది బాది చంపేశారు.చాలా  చాలా హృదయవిదారకంగా ఉంది ఆ దృశ్యం.  ప్రతీ దానికీ  గోల పెట్టే  మీడియా(ముఖ్యంగా Western media) దీన్ని ఎక్కడా చూపించడం కానీ చర్చ కానీ చేయలేదు. ఇంత అన్యాయం జరిగితే నాలుగు రోజులకి కూడా ఒక్క మాట అనకపోవడం రోతగా అనిపించింది. ఎందుకింత పక్షపాతం?

 

 ఇటువంటి విషయాలు హిందూ సంస్థలే వకాల్తా పుచ్చుకుని మాట్లాడనక్కరలేదు.   ‘తీవ్రంగా ఖండిస్తున్నాము’ అన్న ఒక్కమాట మనం అనలేమా?