వంశీ మాగంటి గారి ముఖపుస్తకం టపా

వంశీ మాగంటి గారి టపా ముఖపుస్తకంలో చూసాక, బ్లాగులో పంచుకుంటే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అనిపించి ఇక్కడ పంచుతున్నాను. ( Copy & Paste )

అయ్యా, అమ్మా
ఇది మామూలు పోష్టుల్లా కాక కాస్త ఓపిక చేసుకుని చదివితే సంతోషం. తమ తమ వాల్సు మీద పబ్లిక్ పోష్టు కింద షేర్ చేసుకుంటే మరింత సంతోషం.
ఆచరణలో సాధ్యమో కాదో నాకు తెలియదు కానీ, చెయ్యాలనుకునేవారికి కోటిదారులు చూపిస్తాడు ఆ పరమాత్ముడు అన్న విశ్వాసం నాకు ఉన్నది కనక మీలోకానీ, మీ బంధు మిత్రుల్లో కానీ ఈ దిశలో ఆలోచించి ఆచరణసాధ్యం చెయ్యగలరనుకుంటూ ఉన్నాను
ఇక సంగతిలోకి
ఈ కరోనా కాలం ఎంతో మంది కుటుంబాలకు వేదన మిగిల్చింది, ఇంకా మిగిలిస్తోంది
వైద్యులు, ఆ నారాయణులు, ఆ హరి అవతారాలు తమ శక్తులన్నీ ఒడ్డి హాస్పిటల్సులో ఆ వేదన తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముందుగా వారికి నమోవాకాలు. అయితే ఈ కాలంలో అందరూ హాస్పిటల్సుకు వెళ్ళలేని వారు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు. వారికి చిన్నా చితకా జబ్బులు వస్తే హాస్పిటల్సుకు వెడితే అదృష్టం బాగుండక ఉన్న చిన్న జబ్బులు కాక ఒకవేళ కరోనా అంటుకుంటుందేమోనన్న భయం ఆ పెద్దవారికీ, వారి కుటుంబసభ్యులకి ఉన్నది.
అలాటి భయం ఉన్నవారికి మేమున్నామంటూ ఆసరాగా ఎవరన్నా డాక్టర్లు, ప్రయివేటు ప్రాక్టీషనర్లు ముందుకు వస్తే బాగుంటుంది.
కాలనీకి ఒక పదిమంది డాక్టర్లు ఉన్నారనుకుంటే, ఆ పదిమంది కలిసో, విడివిడిగానో తమ విలువైన రోజులో ఒక రెండు గంటలు ఇలా పెద్దవారి చిన్నాచితకా జబ్బులకోసం కాలనీలో ఉన్న ఇళ్ళకు వెళ్ళి ఆ చిన్నపాటి వైద్యసహాయం అందించే ప్రయత్నం చేస్తే సకల మానవాళి మీకు 49 జన్మలు ఋణపడిపోయి ఉంటుంది.
పెద్దవాటికి, తమ చేతిలో లేని వాటికి, ఇంట్లో వైద్యం అందించలేము అనుకున్నవాటికి హాస్పిటల్సుకు ఎలాగూ వెళ్ళక తప్పదు అని పేషంటును చూసాక అది వారికే చెప్పెయ్యవచ్చు కూడా.
వయసులో ఉన్నవాళ్ళు తట్టుకోగలరు కాబట్టి ఈ సహాయం స్ట్రిక్టుగా, పూర్తిగా పెద్దవారికి మాత్రమే పరిమితం చెయ్యండి
ముందు చెయ్యవలసిన పనులు

డాక్టరు గారి వైపునుంచి:

 • ఒక డెడికేటెడు ఫోను నంబరు
 • పూర్తిగా వాయిసు మెసేజిలో ఉంచి చేసినవారి ఫోను నంబరు, పెద్దవారి వయసు జబ్బు వివరాలు, అడ్రసు అందులో విడిచేలా చెయ్యటం
 • ఆ ఫోనుకు వచ్చిన కాల్సును వచ్చిన ఆర్డరులో రాసుకుని, ఒక పట్టీ కాలంసులో తయారు చేసి వివరాలు డాక్టర్ గారికి అందచెయ్యటం(ఈ పై రెండిటికీ ఒక సహాయకుడి అవసరం ఉంటుంది. వారి జీతం పేషంటు దగ్గర వసూలు చేసే ఫీజులోంచి ఇవ్వవచ్చు)
 • ఈ విధానం ముందు తమ కాలనీ వారికే పరిమితం చెయ్యటం. తద్వారా తాము వెచ్చించే గంటా రెండు గంటల సమయం ప్రయాణాలకు ఖర్చు కాకుండా ఉంటుంది
 • జబ్బుల తీవ్రతను బట్టి ఎవరి ఇంటికి ముందు వెళ్ళాలో నిర్ణయించుకుని కానీ, దగ్గరలో ఉన్నవాటికి ముందు వెళ్ళటం కానీ చేసేలా చెయ్యవచ్చు
 • ప్రయాణపు సమయం కలిసి రావాలంటే వాయిస్ మెయిలి విడచిన వారికి ఫోను చేసి వారికి ఒక సమయం ఇచ్చి, ఆ సమయానికి వారు ఆ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి తమ ఇంటికి వెళ్ళటానికి వారు గైడ్ లా ముందు డ్రైవు చేసుకుంటూ తీసుకెళ్ళవచ్చు
 • తర్వాతి పేషంటుకు ముందు వెళ్ళినవారి అడ్రెసు ఇచ్చేలా చేస్తే, వారు అక్కడికి వచ్చి డాక్టరు గారిని తమ ఇంటికి తీసుకు వెళ్ళేలా చెయ్యటం (ఇది కొంచెం కష్టసాధ్యమే కానీ, గూగుల్ మాప్సు అవీ ఉన్న ఈ కాలంలో అంత కష్టం కాదనే అనుకుంటున్నాను. ఇది సులభం చెయ్యటానికి వేరే అయిడియాలు ఎవరికన్నా ఉండవచ్చు. అవి పంచుకోవచ్చు ఇక్కడ)
 • ఇవన్నీ తమకు సొంతంగా ఒక వెబ్సైటు ఉంటే కనక అది జనాలకు తెలిసేలా చేసి అందులో పేషంటు తరఫు వారు ఆ పెద్దల వివరాలు ఇచ్చేలా, వారికో కంఫర్మేషన్ నంబరు ఇచ్చేలా చేయవచ్చు
 • ఇంట్లోకి వెళ్ళేముందు పేషంటును, వారికి సంబంధించిన తతిమా వారందరినీ మాస్కులు ధరించేలా చెయ్యటం. అలా చేస్తేనే ఇంటికి వస్తామని ఖచ్చితంగా చెప్పటం. లోపలికి అడుగుపెట్టగానే ఎవరు మాస్కు వేసుకోకున్నా తిరిగి వెళ్ళిపోతామనో, ఆ వేసుకోని వారిని వేసుకునేలా చెయ్యటమో చెయ్యాలి
 • ప్రిస్క్రిప్షన్ కాయితాలు తీసుకువెళ్ళటం
 • వారి ఇంట్లో ఇతర ఏ వస్తువులని తాకకపోవటం
 • పేషంటు తరఫు వారికి కాష్ పేమెంటేనని చెప్పి, డబ్బులు తీసుకుని రసీదు ఇవ్వటం (జబ్బును బట్టి కాక విజిటుకు ఇంత అని ముందే ఫిక్సు చేసుకోవచ్చు).
 • లేదా ముందే విజిటుకు ఫీజు ఇంత అని కలెక్టు చెయ్యవచ్చు (దీని సాధ్యాసాధ్యాలు, ఇబ్బందులు కాస్త ఆలోచించాలి)
  -మరి లాబొరేటరీ టెష్టులు అవీ కావాల్సిన వాటికి ఎలా అన్న ప్రశ్న వస్తే – కాలనీ లాబుల్లో అంత జనాల ఒత్తిడి ఉండదు కనక, వాటిని వాడుకోవచ్చు అని అనుకోలు (లాబ్ టెష్టింగుల వారు కూడ ఇలాటి దిశగా ఆలోచించి తాము కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుంది)
  ఈ పైవాటికి మీలో ఎవరికన్నా డాక్టరు గారు ఇంకా చెయ్యవలసిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటే అవి మీరు ఇక్కడ పంచుకోవచ్చు

పేషంటు తరఫు నుంచి:

 • పైన చెప్పిన విధంగా ఫోనులోనో, వెబ్సైటులోనో పూర్తి వివరాలు వదలటం
 • డాక్టరుగారి వద్దనుంచి వచ్చిన కాలు ఇతర పనులన్నీ మానేసి తీసుకోవటం
 • వారు చెప్పిన సమయానికి, వారు చెప్పిన దగ్గరకు వెళ్ళి డాక్టరు గారికి గైడులా పనిచేసి మీ ఇంటికి తీసుకుని రావటం
 • ఇంట్లో వారందరినీ మాస్కులు వేసుకుని డాక్టరు గారికి దూరంగా ఉండటం
 • ఒక్క పేషంటు, డాక్టరు గారి మధ్య మాత్రమే మాటామంతీ ఉండేలా చెయ్యటం
 • డాక్టరు గారికి ఇవ్వవలసిన డబ్బులు రెడీగా చేతిలో ఉంచుకోవటం
 • డాక్టరు గారిచ్చిన ప్రిస్క్రిప్షను మందులు వేళ తప్పకుండా పెద్దవారికి అందించటం
 • డాక్టరు గారు వచ్చారని, తమకు, ఇంట్లో వేరేవాళ్ళకు ఉన్న ఇతర జబ్బుల గురించి చెప్పి దాని ట్రీటుమెంటు కూడా ఫ్రీగా ఆయన దగ్గరినుంచి గుంజాలని చూడకపోవటం
 • కాస్త రెస్పెక్టుఫుల్ గా ఉండటం

ఇలా చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనీ, పెద్దవాళ్ళకు ఒక భరోసా కల్పించిన వాళ్ళం అవుతామని, వారిని జాగ్రత్తగా చూసుకోగలం అనే ఇది కల్పించినందువల్ల వారి జబ్బు సగం డాక్టరు గారు రాకముందే నయమైపోవటం – ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
కాలనీలోనే కాబట్టి పెద్దవాళ్ళు లక్షల సంఖయ్లో ఉండరు కాబట్టి, పరిమితంగానే ఉంటారు. కాబట్టి ఆచరణలో ఇబ్బంది ఉండకూడదు అనుకుంటున్నాను.
ఇక మీ దయ, ఆ పెద్దవారి ప్రాప్తం.
ఆలోచించి ఎవరన్నా సుసాధ్యం చేస్తారని, ఈ పోష్టు షేరు చేసుకుంటే ఇంకెవరన్నా కూడా తమ తమ ఆలోచనలు చెప్పో, ఆచరణసాధ్యం చెయ్యటానికి నడుం కట్టుకుంటారని ఆశిస్తూ – ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, ఈ భూమ్మీద తన ప్రతిరూపాలుగా నిల్పిన ఆ డాక్టర్ల ఆశీర్వాదాలు పెద్దవాళ్ళ మీద, తద్వారా మనందరి మీదా ఉండాలని కోరుకుంటూ

– ఓం తత్ సత్!

మా ఇంట నాగులచవితి

ఈ రోజుల్లో  సోషల్ మీడియా  వచ్చి పండుగలన్నీ ఏంటో చాలా ‘famous’ అయిపోతున్నాయి.  మేము హైద్రాబాద్ లో ఉండటం(పట్నం వాతావరణం)  వలనో ఏమో  చిన్నపుడు కొన్ని పండగలు ఇంట్లో చేసేవరకూ తెలిసేది కాదు.  అందులో  నాగుల చవితి  ఒకటి. పండగ హడావిడి  పెద్ద  కనిపించేది కాదు. బడికి సెలవ ఉండేది కాదు. మా  అమ్మ instituteకి సెలవ అసలు ఉండేది కాదు.  ఇక పండగ వచ్చిన రోజు  ఆదివారం కాకపోతే మా అమ్మకి బోలెడు హడావిడి. పొద్దున్న లేచి చిమ్మిలి, పచ్చి చలిమిడి చేసి పూజ చేసుకుని పుట్టలో పాలు పోసి వచ్చేది. 

 పుట్టలో ఆవు పాలు మాత్రమే పోయాలి అన్నది ఓ నియమం. ఇక ముందు రోజు చాలా రకాల ప్రయత్నాలు చేసి  ఓ గ్లాసుడు పాలు  ఎలాగోలా సాధించే వాళ్ళం. 1980లకే  హైదరాబాద్ లో పాల ప్యాకెట్లకి అలవాటు పడిపోయాం కదా. ఆవిడ  పుట్టకి వెళ్తుంటే  నేనూ  తయారయ్యే దాన్ని. ఏంటో చదువు మానేసి ఇలాంటివన్నీ చేయడం అంటే హాయిగా ఉండేది ప్రాణానికి 🙂 . పుట్టకి బయలుదేరుతుంటే మా తమ్ముడు యధాప్రకారం పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించే వాడు మమ్మల్ని’ పుట్టలో పాము బయటికి వస్తే ఏం  చేస్తారు . పాలు  పోసి దండాలు పెడతారా? పరిగెత్తుకుని వస్తారా ? ‘ అంటూ.  అమ్మకి పిచ్చి కోపం వచ్చేది. ‘ఎందుకురా ఆ ప్రశ్నలు బయలుదేరుతుంటే ’ అనేది. 

 ఆ రోజంతా మా అమ్మ ఉపవాసం. సంవత్సరంలో ఒక్క సారి  చేసే ఆ చిమ్మిలి తినడం కోసం నేనూ ఆవిడతో ఉపవాసం ఉన్నరోజులు ఉన్నాయి. ఆ రోజు కత్తి  పెట్టుకోకూడదు అనే ఇంకో నియమం కూడా ఉండేది అనుకుంటా.  మరునాడు  ఓ బ్రహ్మచారిని  పిలిచి భోజనం పెట్టి తరువాత  తను  తినేది.  ఆ రోజు చేసే వంటల్లో నిమ్మకాయ పులిహోర, పాయసం, చిక్కుడు కాయ-వంకాయ కూర తప్పని సరిగా ఉండేవి.  అప్పుడే తాజాగా చిక్కుళ్ళు వస్తాయనో లేక కత్తి  లేకుండా తరగ గలిగే కూరగాయ  అనో   ఏమో మరి. ఆ బ్రహ్మచారి  ఎవరంటే మా తమ్ముడికి స్నేహితుడు గౌతమ్. రమ్మనగానే వచ్చేవాడు. పొద్దున్నే 8 గంటలకల్లా అన్ని రకాల వంటల తో వడ్డించేసేది మా అమ్మ. మొహమాటానికో మరి ఏమీ  అనేవాడు కాదు గౌతమ్. గౌతమ్ తో పాటు  మాకు కూడాను 🙂

అమెరికాలో  ఏ పండగకి  సెలవా ఉండదు. అయినా ఏదో పూజలు చేసేసి ఇలా ఫోటోలు  తీసి ఆనందపడతాము. ఆఫీస్, మీటింగులు  గోల. మరీ ఇంట్లోనించి పనేమో. ఒక్కోసారి పొద్దున్నే స్నానం చేసే తీరిక కూడా ఇవ్వరు. నా అదృష్టం ఈ రోజు.  ఏ హడావిడీ  లేకుండా ఇలా పూజ  చేసుకున్నాను.  ఈ రోజు చిమ్మిలి చేస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి.  ప్రసాదం కదా అని నోట్లో పెడుతుంటే  మా అమ్మాయి మొహం చేదుగా పెట్టి తిన్నది. ఈ చిన్న చిమ్మిలి ముక్కకోసం ఎంత ఎదురుచూసేవాళ్ళం. ఇది వీళ్ళ లెక్కలో రాదు కదా అనిపించింది.

పుట్టలో పాలు  పోయలేదా అని అడగద్దు.  అమెరికాలో పుట్టల కోసం ఎక్కడికీ వెళ్లనక్కరలేదు. పాలు  పోసి చిమ్మిలి  నైవేద్యం పెట్టే ధైర్యం ఉండాలే కానీ,  ఒక్కోసారి పెరట్లోనే  నాగదేవతలు ప్రత్యక్షమైపోతాయి :). 

Women empowerment అంటే?

తాజా ఎన్నికల్లో జో బిడెన్, కమలా హారిస్  గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటోంది అమెరికా. మొదటి మహిళా ఉపాధ్యక్షురాలి పదవిని అధిరోహిస్తున్న కమలగారిని అమెరికా ఆడపిల్లల కళ్ళలో ఎన్నో సంబరాలు. 

Women’s empowerment అంటూ ఎన్నెన్నో చెప్పేస్తున్నారు అందరూ.  ఆడయినా మగయినా ఓ లీడర్ అంటే ఓ factory లోనో, ఓ బళ్ళోనో, ఓ కాలేజిలోనో తయారవ్వరు. ముందర ఇంట్లోనే తయారవుతారు. అమ్మో నాన్నో తెలిసో తెలీకుండానో ఆ పిల్లలని ప్రభావితం చేస్తారు. ఓ జీజాబాయి  ఛత్రపతి శివాజీని  తయారు చేస్తే , నెహ్రు గారు ఓ ఇందిరాగాంధీని తయారు చేసారు. కల్నల్ అనూప్ కుమార్ సక్సేనా గారు ఓ గుంజన్ సక్సేనా గారిని తయారు చేసారు. చెప్పుకుంటూ పోతే బోలెడుమంది.

బైడెన్ గారికి మాట తడబడుతుంది (stuttering). ఒకసారి ఆయన చిన్నపుడు టీచర్ ఆయనని అనుకరిస్తూ మాట్లాడి bully  చేసిందట. ఏడ్చుకుంటూ వచ్చిన జో ని చూసిన  తల్లి వెంటనే ఆయనని టీచర్ దగ్గరికి తీసుకువెళ్ళి గట్టిగా సమాధానం ఇచ్చిందట. కమలా హారిస్ గారు ముందు చెప్పిన మాట ‘ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే మా అమ్మే’. Women empowerment అంటే ఇదే కాదా? 

కౌసల్య రాముడు వనవవాసానికి వెళ్ళేముందు చద్దన్నం మూట కట్టిచ్చినట్లు ఓ మాట చెప్పిందట. ‘ఎంత కష్టం వచ్చినా ధర్మం విడవకు’ అంటూ. అందుకే  ఈ రోజుకి  శ్రీరామచంద్రుడిని తల్చుకుంటాము. Women empowerment అంటే ఇదే కాదా? 

నాకెప్పుడూ చాగంటి గారు చెప్పే ఓ మాట గుర్తుండిపోతుంది.   ‘ధర్మం అనేది ఎదుటివాడిని ప్రవర్తన బట్టి మారదు’ అని. ఓ ఉగ్రవాది గాయపడి పోలీసు కస్టడీలో ఉన్నపుడు ఓ డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ విషం ఇచ్చి చంపేయడుగా?

ఇప్పుడు ఈ  ఎన్నికల నేపథ్యంలో  నాకు జరిగిన  కొన్ని అనుభవాలు పంచుకుంటాను. .

***************************************

ఒకటి :

 ఈ అమెరికా ఎన్నికలలో మొదటి  debate రోజు ట్రంప్ బైడెన్ గారిని మాట్లాడనివ్వలేదు. బైడెన్ గారికి మాట తడబడుతుంది (stuttering) అని చెప్పా కదా . బైడెన్ విసిగిపోయి’ ఈ clown తో ఏం చెప్తాను’ అన్నారు. ‘ఒక రోజు కాదు 8 ఏళ్ళు  గద్దె మీద కూర్చుని ఇదేం మాటరా ‘ అని ముఖపుస్తకం లోవ్రాసాను. తరువాత బాలు గారి ఓ వీడియో చూస్తుంటే ‘clown ‘ అనే మాటని గురించి చెప్పడం విన్నాను. దాని మీద ఓ టపా  పెట్టాను.  ఇక అంతే!!  నేనో ట్రంప్ ఫ్యాన్  అన్నట్లు ముద్ర వేసేసుకున్నారు. వ్యాఖ్యలు  వెల్లువలా వచ్చి పడ్డాయి ‘మీరు ట్రంప్ ని ఖండించలేదు’ అని. ‘ట్రంప్  అతడి మాటని అడ్డుకున్నాడు.అది తప్పే. కానీ దూషించలేదు.  బైడెన్ పదవిలో ఉన్న ఓ అధ్యక్షుడిని ఆ మాట అనకూడదు. అతను చెడ్డవాడు కావచ్చు.అది ధర్మం కాదు ‘ అని నేను చెప్పినా అర్ధం కాలేదు ఎవరికీ.  కొంతమంది వారి స్నేహితుల జాబితా లోంచి తీసేసారు.

నేను మాట్లాడినది తప్పా ఒప్పా  అన్న తర్జన భర్జన నాలో!!తరువాత ఇదిగో ఈ వార్త కనిపించింది.

https://www.hindustantimes.com/world-news/joe-biden-regrets-calling-donald-trump-a-clown-during-debate/story-BRlsXV7cnibmJ5JxEJqEzH.html

 బైడెన్ ‘I should have said, this is a clownish undertaking, instead of calling him a clown,’  అంటూ తన తప్పుని తప్పుగా ఒప్పుకున్నారు.

రెండు: 

తరువాత ట్రంప్ కి కోవిడ్  అన్నారు. ‘Dettol  తాగండీ’ అంటూ జోకులతో ఇంకొకరు. 

ఒక దేశాధ్యక్షుడికి ఒంట్లో బాగుండలేనప్పుడు జోకులు వేసేంత స్థాయికివచ్చేసారు.

పైగా ‘ అతడు మాట్లాడినప్పుడు తప్పు లేదా’ అంటూ.

మూడు :

నవరాత్రుల మొదలయిన మూడో రోజనుకుంటా. ఫోటో షాప్ చేసిన దుర్గాదేవి ఫోటో ఒకటి ట్విట్టర్ లో వచ్చింది. ఎవరు పెట్టారు ఏమిటీ అనేది ఇప్పుడనవసరం. ఫోటో చూసి  కడుపులో దేవినట్లయింది నాకు. తరువాత ఇంకో టపా  పెట్టాను నా ఖచ్చితమైన అభిప్రాయంతో. దానికి కూడా వ్యాఖ్యలు వచ్చాయి ‘దానిదేముంది’ అంటూ. 

నాలుగు:

ట్రంప్ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్తాను అంటే ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో దానికి స్పందనగా ఇంకో టపా  పెట్టాను. ‘అతనికి హక్కు ఉంది ఇది డెమోక్రసీ కాబట్టి’ అని. అంతే!! ఇక దొరికి పోయాను :). 

ఈ రోజు సుబ్రమణ్యస్వామి  ఓ పోస్టు  పెట్టారు ‘ట్రంప్ సుప్రీమ్ కోర్టుకి వెళ్ళవచ్చు. రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందీ’ అంటూ 

*********************************

నేను తప్పుగా మాట్లాడుతున్నానా అన్నట్లు నా self confidence ని, నా logical thinkingని  దెబ్బ తీసినట్లనిపించాయి ఈ వ్యాఖ్యలన్నీ. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేను విషయం ఏమి చెబుతున్నానో కూడా తెలుసుకోకుండా, కనీసం అర్ధం కూడా చేసుకోకుండా మాట్లాడినది చాలా మటుకు ఆడవారే. నేనేమీ జర్నలిజం చదివిన దాన్ని కాదు. నేను మీడియా రిపోర్టర్ని అంత కన్నా కాదు. నేను లేని రోజున  నా ఆలోచనలేంటో నా తరవాతి తరానికి తెలియజేసే  వెసులుబాటు కలిపించిన సాంకేతికతని ఉపయోగించుకుంటున్న ఓ మాములు గృహిణిని. ఆ నేపథ్యంలో ఎన్నో విషయాలు తెల్సుకుంటున్నాను & నేర్చుకుంటున్నాను. ఒకటి  చెప్పబోయి ఇంకొక అర్ధం వచ్చేలా  చెప్పి ఉండవచ్చు. నేను వ్రాసిన దాంట్లో తప్పులు  దొర్లవచ్చు కూడా. ఆ తప్పు దొర్లినపుడు  ఏదో భూమి తల్లక్రిందులైనట్లు వీరు మాట్లాడటం ఏమిటీ?  జో బైడెన్ గారు తన తప్పుని తప్పుగా చెప్పినప్పుడు,  నేను ఎంతటి దాన్నని నా అహంకారాన్ని సమర్థించుకుంటాను? క్షమాపణలు చెప్పడానికి కూడా వెనుకాడను.

ఓ తప్పుని తప్పుగా గుర్తించకుండా & నాణేనికి ఇంకో వైపు ఉంటుంది అన్న దృష్టికోణం వంక కూడా చూడకుండా women empowerment అనే మాటకే అర్ధం ఉందో లేదో తేల్చుకోవాల్సిన నిర్ణయం వీరికే వదిలేస్తున్నా!! 

నాకు చాలా తెలుసు అని అహంకారంగా చెప్పట్లేదు. ఈ చిన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు సముద్రమంత ఉన్నాయి. తెలుసుకుందాం.అందరికీ పంచుదాం!! రాబోయే తరాలని తీర్చిదిద్దుదాం!! ఈ సోషల్ మీడియా యుగంలో సమాజానికి అవసరం లేదు అనుకునే విషయాల గురించి అసలు తలవద్దు అంటా నేనయితే!! 

చివరగా:  రామాయణం చదవండి/వినండీ  &  చదివించండీ 

If you educate a woman, you educate a family, if you educate a girl, you educate the future.