డాక్టర్ బాలుగారు చెప్పిన కథ

రాధా మండువ గారు ఒక కథ చెప్పి, పిల్లలకి చెబుతారా అని వ్రాసారు. అది చదివాక నాకు ఒక కథ గుర్తొచ్చింది.

ఈ టపా  వివేకానందుడు చెప్పిన బాట లో… చదివినవారికి డాక్టర్ బాలు గారు జ్ఞాపకం ఉండాలి. టపాలో చెప్పాను  కదా, డాక్టర్ బాలు గారు వచ్చినపుడు మా పిల్లలకి బోలెడు కబుర్లు చెప్పేవారని. అలా  చెప్పిన కథే ఇది!!

వారు MBBS  పూర్తి చేయగానే  గిరిజనులకి సేవ చేయాలి అని అత్యంత ఉత్సాహంతో  ఉన్నారట. ఆ గిరిజనుల ఉండే ప్రదేశాల దగ్గరికి వెళ్లారు.  వాళ్ళు వీరిని స్వాగతించడానికే చాలా కాలం పట్టిందట. అవకాశం ఎప్పుడు వస్తుందా వారికీ వైద్యం ఎప్పుడు చేయాలా అని వేచి ఉన్నారు.

అలా చూస్తుండగా ఒక రోజు ఒక అవకాశం రానే వచ్చింది. ఒక పదునాలుగేళ్ళ  (అవును మీరు చూసింది నిజమే 14 ఏళ్ళు ) అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయని ఈయనకి కబురొచ్చిందట. సాయంత్రం ఆరుగంటలకి. ఆ అమ్మాయి ఉండే ఇంటికి రోడ్డు లాంటిది ఏమి లేదు.  ఈయన తన మెడికల్ కిట్ పట్టుకుని వెళ్లి, ఆ అమ్మాయి తండ్రి అనుమతితో పరీక్షించారు. ఇంకో 12-15 గంటలు పడుతుంది అని చెప్పి, ఆ అడవిలో పాముపుట్ర ఉంటాయని భయం వేసి ( అలవాటు లేదుగా మళ్ళీ భయమే 🙂 ) వెనక్కి వచ్చారు. మరుసటి ఉదయం బయలుదేరుతుంటే ‘ఇంత పొద్దున్నే ఎక్కడికి ‘ ఒకావిడ పలుకరించింది. ‘ఫలానా చోటికి వెళుతున్నాను’ అంటే, ‘నువ్వెళ్ళి ఏం  చేస్తావు. ప్రసవం అయిపోయింది కదా’ అన్నది. వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు చాలా బాధ వేసింది బాలు గారికి!! అయినా సరే పుట్టిన బిడ్డ కళ్ళల్లో డ్రాప్స్ అయినా వేద్దాంలే అనుకుని వెళ్లారు.

వెళ్ళేసరికి  బాలింత, చంటిబిడ్డ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అనుమతి లేనిదే లోపలి వెళ్ళకూడదు!! అందుకని ఈయన బయటికి వచ్చి ఆ  చంటిబిడ్డను తనకు చూపించమని, బిడ్డను పరీక్ష చేసి మందు వేస్తానని చెప్పారు. ఆ అమ్మాయి తాను రానని, చూపించనని చెప్పింది.  అయినా కొంచెం సేపు వేచియున్నారు. ఇంక ఓర్పు నశించిపోయి , ‘డాక్టర్ అంటే మీకు అస్సలు నమ్మకం లేదు. నేనే లోపలికి వచ్చి చూస్తాను’ అని కోపంగా అరిచారు.  అప్పుడు లోపలి నుంచీ గట్టిన ఏడుస్తూ ‘ నాకున్న ఒక్క చీర రాత్రి పురిటి సమయంలో తడిసిపోయింది. అది ఉతికి ఇప్పుడు గుడిసెపైన ఆరేసారు . ఎండ పడ్డాక ఆరితే కట్టుకుందామని వేచి ఉన్నాను. దయ చేసి లోపలి రావద్దు ’  అంటూ సమాధానం వచ్చింది. అది విన్న బాలు గారు ఒక్కసారిగా స్థంభించి పోయారు. ‘ఎంత సేపు నేను డాక్టర్ని అని గొప్ప చెప్పుకుంటున్నానే కానీ వీరికి నిత్యావసరాలు కూడా లేవు అన్న సంగతి నేనెందుకు గ్రహించుకోలేకపోయాను’ అనుకున్నారు. ఈ కథ ఆయన  నోటి వెంట విన్నపుడు మా పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా స్థబ్దులమైపోయాం.

ఈ కథ ఎప్పటిదో కాదు. 1988 ప్రాంతంలో అనుకుంటాను. అంటే అప్పటికి భారతదేశానికి  స్వాతంత్య్రం వచ్చి 40 ఏళ్ళు !!

గొప్ప విషయం ఏంటంటే ఆ చిన్న వయసులో డాక్టర్ బాలు గారు ఒక సంకల్పం పెట్టుకోవడమే  కాదు. నా ఒక్కడి వలన ఏమవుతుందిలే వెనుకకి తిరుగకుండా దానిని కొనసాగించారు కూడా !!ఈ రోజున SVYM  ఎన్నో జీవితాల్లో వెలుగు నింపింది. జీవితానికి పరమార్థం అంటే అదే కదా !!

ఏది విజయం?

“Go on bravely. Do not expect success in a day or a year. Always hold on to the highest. Be steady. Avoid jealousy and selfishness. Be obedient and eternally faithful to the cause of truth, humanity, and your country, and you will move the world.” – Swami Vivekananda

వివేకానందుల వారు చెప్పవలసినది చాలా సులభంగా పైన రెండు ముక్కల్లో చెప్పేసారు. అసలు ఈ పదం ‘Success’ అంటే ‘విజయం’ అనే దానికి ఏది ప్రామాణికం గా తీసుకుంటున్నాం ?పోటీప్రపంచంలో కప్పులు గెలుచుకోవడమా ? మంచి కాలేజీలో చదవటమా ? డబ్బు సంపాదించడమా ? ఉద్యోగమా ? పదవులా ? సంబంధ బాంధవ్యాలా ? ఏది చెప్పాలి మన పిల్లలకి ? వివేకానందుల వారు చెప్పినట్లు ‘స్వార్ధము’ & ‘అసూయ ‘ లేకుండా, ఏ విషయంలో అయినా ‘Success’ అంటే ‘విజయం’ సాధ్యమవుతుందా? అదీ ఈ రోజుల్లో ??

ఉరుకులు పరుగులు!! 24 గంటలలో 36 గంటల పనులు చేయాలి. పిల్లల్ని మంచి కాలేజీలలో చేర్చాలి అన్న తపన!! అందుకు ఏ పోటీ కనిపిస్తే అది!!. ఏ కోర్సు కనిపిస్తే అది!! ఎవరు ఏం చేస్తే అది !! గొఱ్ఱెలమందలో ఒక గొఱ్ఱె ఏం చేస్తే మిగితా గొఱ్ఱెలు అదే చేసినట్లు !!మనబడి చెప్పే వేమన శతకాలు వద్దు. పంచతంత్ర కథలు అసలొద్దు. బాలవికాస్ లాంటి తరగతులు మాలాంటి వాళ్ళకి కానే కాదు. Volunteer గంటలు కావాలి కానీ volunteering వద్దు. Parenting classes మాకోసం కాదు.

‘ఏమిటి ఇలా వింతగా మాట్లాడుతున్నారు’ అంటే –

అమెరికాకి వలస వచ్చి మా లాంటి తలితండ్రులు పిల్లలకి చక్కటి చదువులు చెప్పించి తీర్చిదిద్దటంలో చాలా ‘విజయా’లు సాధిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొన్ని అపశృతులు కూడా వినిపిస్తున్నాయి. ముందు ముందు ఇటువంటివి ఇంకా ఎక్కువ వింటామేమో అన్న భయం కూడా వేస్తోంది.

దానికి తోడు, ఈ సోషల్ మీడియా పుణ్యమా అని, మాయ బజార్ సినిమాలో సత్యపీఠమల్లే, కొన్ని సార్లు మనుష్యుల నైజాలు తెలిసిపోతున్నాయో ఏంటో మరి!! జరిగిన ఘటనలు / విషయాల గురించి చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. నన్ను చాలా బాధ పెట్టిన అంశం ఏంటంటే, ఏమాత్రం sensitivity అన్న sense కూడా లేకుండా ప్రవర్తించిన/ప్రవర్తిస్తున్న సాటి తల్లితండ్రుల తీరు. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ కదా !!

ఈ రోజు ఎక్కడో దాచుకున్న వివేకానందుల వారి ఈ సూక్తి కనిపించి, అసలు ‘విజయం’ అనే మాటకి అర్ధమేంటా అనిపించింది. పిల్లలకి ఏం నేర్పిస్తున్నామా అనిపించింది అంతే !!

మనకు లేని క్రమశిక్షణ, నైతికత పిల్లలకి రమ్మంటే?

మొన్న వారాంతం  ఒక రోజు త్యాగరాజదినోత్సవం, ఒక రోజు అన్నమయ్య దినోత్సవం మా గుడిలో.  పొద్దున్న 10:15 కి పంచరత్న కృతుల బృందగానంతో మొదలయ్యి , రాత్రి 9 కి మా అమ్మాయి గానం తో ముగిసింది. మధ్యలో ఒక రెండు గంటలు తప్ప రోజంతా అక్కడే గడిపాము మేము. గుడి మాకు 10 నిమిషాల దూరం ఉండటం కూడా మాకు ఒక advantage అయిందని చెప్పాలి.  ఈ రెండు రోజులు పాడినవారికి  మైకులు పెట్టడం, పేర్లు చదవటం, పాడినవారికి  సహవాయిద్యకారులని (accompanists) పెట్టడం చేసారు ఆ కార్యక్రమ నిర్వాహకులు, ఒక మహానుభావులు. వారి ఓపిక కి నా జోహార్లు _/\_. వారి పిల్లలు ఎవరూ ఈ కార్యక్రమం లో పాల్గొనలేదు. ఇక సహవాయిద్యకారులు ఎవరో పెద్దవారు కాదు. హై స్కూల్ పిల్లలు. ఈ రెండు రోజులు పొద్దున్నించీ  రాత్రి వరకు ఎవరు ఏ కృతి పాడితే  దానికి అనుగుణంగా (ముందు ప్రాక్టీస్ లేదు) వాయించటం వీళ్ళ పని. హై స్కూల్ అంటే ఎంత హోంవర్కులు ఉంటాయో తెల్సు కదా !! ప్రోగ్రాం అంతా అయ్యాకా మా అమ్మాయికి, ఇంకొక అమ్మాయికి వారు  చేసిన తప్పులు సరిదిద్దుకోవడం చెప్పారు ఆయన.  ఓపికగా విన్నారు ఈ పిల్లలు కూడా !! ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా ఒక వైపు. ఇంకొక వైపు  కూడా ఉంది.

చాలా చికాకు పెట్టే అంశం!!  పిల్లలు కాసేపు స్టేజి ఎక్కి పాడగానే కెమెరాలు పుచ్చుకుని తయారయిపోతారు  కొంతమంది(అందరూ  కాదు) తల్లితండ్రులు. వీరికి వారికీ పిల్లల కార్యక్రమం వరకు కూర్చునే  ఓర్పు కూడా  ఉండదు.  వారి పిల్లలలాంటి వారే ఇంకొకరు పాడితే  వచ్చి ప్రోత్సహించాలి  అన్న ఇంగితం అంతకంటే ఉండదు. పైగా పిల్లలని ఇలాంటి కార్యక్రమాలకి  తీసుకువచ్చిన సంగీతం టీచర్ ని ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు.  ఇక వారి పిల్లల ప్రోగ్రాం పదినిమిషాలు అవ్వగానే గబగబా బ్యాగులు సర్దుకుని వెళ్లిపోతుంటారు. పోనీ, ఉన్న కాసేపు కూడా మిగితా వారి పాటలు వినరు. అదే బడిలో జరిగే orchestra/band లాంటి వాటికి చివరి వరకు మాట్లాడకుండా కూర్చుంటారు.  ఎవరి కన్నీరు  తుడవటానికి  వస్తారో,  ఎందుకు వస్తారో భగవంతుడికే తెలియాలి.

పిల్లలు సంగీతంలో / నృత్యంలో ఒక స్థాయికి రావాలంటే ఎంతో  కృషి అవసరం. నాట్యం గురించి నాకు తెలియదు కానీ, సంగీతం అంటే చిలుక పలుకుల్లా టీచర్ చెప్పిందే కాదు, వినికిడి తో నేర్చుకునేది అనంతం!! అందరికీ  పనులు ఉంటాయి. ఊర్లో అయ్యే అన్నీ కార్యక్రమాలకి వెళ్ళమని నేను అనటం లేదు. కానీ, మన పిల్లలు చేసే activities లో కూడా సమయం లేనట్టు , ఆ టీచర్లనో , నిర్వాహకులనో ఉద్ధరించడానికి వచ్చాము అనుకుంటే ఎలా? అన్నమయ్య దినోత్సవానికి  వెళ్ళాలి అనుకున్నాను నేను. కానీ అవ్వలేదు. ఇటువంటివి ప్రోగ్రాం లు 2007 నుంచి చూస్తున్నాను. కొందరు పిల్ల్లలు ఎక్కడ వేసిన గొంగళీలా అక్కడే ఉన్నారు. అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు కొందరు!!   తేడా ఎక్కడ మరి?

ఆ కార్యక్రమ నిర్వాహకులు  మా అమ్మాయితో ఒకటే మాట చెప్పి చాలా ప్రోత్సహించారు  ‘ ఎంత సేపు పాడతావో పాడు. పైన గుళ్లో ఆయన  ఉన్నాడు. ఇక్కడ నేను ఉన్నాను వింటాను. ఎవరు ఉన్నారా లేదా అని ఆలోచించద్దు’  అని . మన కళలు జీవించాలి అని శ్రమిస్తూ, పిల్లలని ఉచితం గా ఈ విధంగా ప్రోత్సహిస్తుంటే, ఆ మాత్రం సహనం, ఓర్పు తల్లితండ్రులకే లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది ? మనకి మనం నిర్మించుకున్న చిన్న సంఘం ఇది. దానిలో భాగం అవ్వాలి అనుకోవాలి. మన పని అయిపోగానే వీళ్ళతో ఏం  పని అన్నట్లు ఉంటే  ఎలా?

అంతకుముందు వారం,  మా  మనబడి వార్షికోత్సవం ‘పిల్లల పండుగ‘ జరిగింది.  నేను  చూసిన  ఐదవ  వార్షికోత్సవం.  ప్రతి తరగతి నుంచి పిల్లలు పద్యం /పాట/ నాటిక/రూపకం ప్రదర్శిస్తారు.   సినిమా అన్న ప్రసక్తి  ఉండదు. కర్ణాటక సంగీత గాత్రం , అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి, భరత  నాట్యం కూడా ఉండవు. కేవలం తెలుగు నాటికలు, పద్యాలూ.  చెప్పుకుంటూ పోతే చాలా  అద్భుతాలే !! కానీ అక్కడా ఇదే తంతు!! ఎవరి పిల్లలది అయిపోగానే వారు బ్యాగులు సర్దుకుని వెళ్లడం. వాళ్ళ పిల్లల కార్యక్రమం కాకపోతే గట్టిగా కబుర్లు చెప్పుకోవడం!!

నేను ఇలా అందర్నీ విమర్శిస్తూ చాలా  గొప్పదాన్ని అయ్యానని కాదు. నేను ఇలాంటి తల్లితండ్రుల లెక్క లోకే వస్తానేమో కూడా. నన్ను నేను గమనించుకుంటూ నేర్చుకుంటున్న పాఠాలు ఇవి. మనకు లేని క్రమశిక్షణ, నైతికత పిల్లలకి రమ్మంటే ఎక్కడనుంచి వస్తుంది? వంద రకాల కార్యక్రమాలలో ఆ పిల్లలని పెట్టి, ఏ ఒక్క దాని మీద వాళ్ళకి ఆసక్తి పెంచుకునే ఆలోచనకి  కూడా సమయం ఇవ్వకుండా, మన జీవితాలే కాదు వాళ్ళ జీవితాన్ని కూడా ఒక Task oriented జీవితంలా మార్చేస్తున్నామేమో ఆలోచించండి!!

వివేకానందుడు చెప్పిన బాట లో… (పునఃప్రచురణ)

‘Is that ‘Chaganti?’

‘No. You know him. Come and see!!’

‘Oh….  !! Dr.Balooo!!’  

ఈ చివరి మాట వింటే ఆయన ఎవరికో దగ్గరి చుట్టమో లేక స్నేహితుడో అనుకుంటారు.  ఇది నేను ఒక వీడియో చూస్తున్నపుడు నాకు మా పదేళ్ళమ్మాయికి జరిగిన సంభాషణ.

మనం అందరం, స్వామి వివేకానంద గురించి మాట్లాడతాము, ఆయన సూక్తులని (quotes) ముఖ పుస్తకం లో, whatsapp లో  స్నేహితులతో పంచుకుంటాము. మహా అయితే ఆయన  వ్రాసిన పుస్తకం చదువుతాం.  మనలో ఎంత మంది ఆయన  చెప్పినది పాటించడానికి ప్రయత్నిస్తున్నాము? అటువంటి వారు ఎక్కడుంటారు లేరు అంటారేమో !!  స్వామి వివేకానంద చెప్పింది అక్షరాలా పాటించి దేశానికి  సేవలందిస్తున్న వారు  ఉన్నారు.  అటువంటి వారిని చూసి మాట్లాడే భాగ్యం కూడా మా బాలవికాస్ బడి ద్వారా నా లాంటి సామాన్యులకి లభించింది.

ఈనాడు ఆదివారం పత్రిక లో సచిత్ర కథనాలు భాగం లో ప్రతి వారం ఒక లాభాపేక్ష లేని సంస్థ  గురించి వ్రాస్తుంటారు. ఆ విధం గా బహుశా 2005/2006 మధ్యన , ఈనాడు ఆదివారం  Online పత్రిక తిరగవేస్తుంటే ఒక సంస్థ  గురించిన వ్యాసం కనపడింది. ఆ వ్యాసం సారంశం ఏంటంటే  స్వామి వివేకానంద  చెప్పినది అక్షరాలా  పాటించడానికి  కొంత మంది డాక్టర్లు కర్ణాటక లో మారుమూల గ్రామాలలో ఒక సేవా  కార్యక్రమం ప్రారంభించారు అని.  సాధారణంగా గవర్నమెంట్ కాలేజీలలో మెడిసిన్ చదువుకున్న డాక్టర్లు అంటే అమెరికా కో  వెళ్లి  స్థిరపడతారు. లేదా  ఏదైనా మంచిప్రైవేటు ఆసుపత్రులలో పని చేస్తారు. మంచి మెరిట్ తో చదువుకున్నవారు అయి ఉంటారు కాబట్టి డబ్బు గడించడం పెద్ద సమస్య కాదు వారికి.  ఏదో సినిమాలలో పల్లెల్లో వైద్యం చేసే హీరోలని చూస్తాము.  కానీ నిజజీవితం లో జీవితాన్ని ఈ విధం గా దేశసేవ కి  అంకితం చేయడం మనం సాధారణం గా  చూడము కదా !! అందుకని ఆ సంస్థ బాగా గుర్తుండిపోయింది. ఒక రోజు వారంతం లో పిల్లల ‘activities’ భాగం లో మా వారు మా అమ్మాయిని  బాలవికాస్ బడికి  కి తీసుకెళ్ళారు. ఇద్దరూ ఇంటికి రాగానే కర్ణాటక నుండి ఒక డాక్టర్ గారు  వచ్చారని,  గిరిజనులకి సేవ చేస్తున్నారని చెప్పారు.  నాకు వెంటనే ఈ వ్యాసం స్ఫురించింది.  నా అంచనా నిజమైంది !! ఈనాడు లో చదివిన సంస్థ  ఆ వచ్చిన వారిది  ఒకటే సంస్థ !! అదే  Swami Vivekananda Youth Movement – SVYM!! ఈ సంస్థను స్థాపించినవారు డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం.  ఈ సంస్థ వివరాలు, వారు చేసే సేవలు  http://www.svym.org/  లో చూడవచ్చు. 2015 సంవత్సరం లో Best NGO in India Award కి ఎంపిక అయింది.

ఈ సంస్థ ఎలా ఆవిర్భవించిందో మా బాలవికాస్ బడికి విచ్చేసిన  డాక్టర్ బాలు ఈ విధం గా  మా పిల్లల కి చెప్పారు:

అందరి లాగే ఒక మాములు మధ్య తరగతి కుటుంబం పుట్టిన ఆయన  మంచి మార్కులతో PUC పాస్ అయి ఇంజనీరింగు కాలేజిలో  చేరారు.  చేరిన మొదటి రోజే  సీనియర్సు చేసిన రాగింగు తట్టుకోలేక పోయారుట. మరుదినం ఇంట్లో కూర్చోలేని స్థితి.  ఏం  చేయాలో తోచలేదు ఆయనకి.  కాలేజి వెళదామని బయలుదేరారు. కానీ కాలేజి దగ్గరవుతున్నకొద్దీ భయం!! కాలేజికి వెళ్ళకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా కాలక్షేపం చేయాలి. ఎదురుగుండా రామకృష్ణ ఆశ్రమం కన్పించింది.  ఇంక రోజు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారుట.  అక్కడ  ఆశ్రమ సన్యాసి ఒకరు  ఈయనని గమనించసాగారు. ఆ సన్యాసి ముందు  కాస్త బుద్దిమంతుడిలా కన్పించడానికి  అక్కడి గ్రంధాలయం లో స్వామి వివేకానంద వ్రాసిన పుస్తకాలూ చదవటం మొదలు పెట్టారు. అదే తన జీవితాన్ని మార్చేసింది అంటారు డాక్టర్ బాలు.  ముఖ్యం గా ‘His call to the Nation’ ,  మరియు ‘To the Youth of India’.  మెడిసిన్ లో సీట్ వస్తే తప్పకుండా  స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణసేవ కే  తన జీవితం అంకితం చేస్తాను అని మనసు లో సంకల్పించుకున్నారు.  ఆశ్చర్యకరం గా ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి  మెడిసిన్ లో సీటు వచ్చినట్లు ఒక టెలిగ్రామ్ వచ్చిందట.  ఆ విధం గా మెడిసిన్ చదవటం, SVYM  ఆవిర్భవించబడటం  జరిగింది.  “Such is the power of Swamiji’s works, that no person who reads and comprehends his nationalistic message can sit quiet without responding”  అని చెప్తారు డాక్టర్ బాలు.

IIT , VIT, Cornell వంటి విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చే ఆయన  మా పిల్లలు కోసం, వచ్చిన ప్రతిసారి దాదాపు రెండు గంటలు సమయాన్ని కేటాయించి పిల్లలు  వేసే ప్రశ్నలన్నీ చాలా  ఓర్పు గా సమాధానాలు చెప్తారు.  ఇప్పుడు అర్ధం అయిఉంటుంది  మా అమ్మాయి ‘ఈయన నాకెందుకు తెలీదు’ అన్నట్లు మాట్లాడిందో.  వారు మా పిల్లలకి కథల రూపం లో చెప్పిన గాధలు మనసుని కదలించి వేసాయి. ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతున్న డాక్టర్ బాలు గారి లో  అటువంటి ధృడసంకల్పాన్ని కలిగించిన స్వామి వివేకానంద నిజం గా ఒక అవతార పురుషుడే కదా అన్పిస్తుంటుంది!!

డాక్టర్ బాలు గారి ప్రసంగం ఒకటి ఈ వీడియో లో చూడండి. ఈ పదిహేను నిమిషాల వీడియో లో ఈనాటి యువత  చేయాలో గుర్తు చేసారు. వీడియో లో డా. బాలు ఒక విషయం లో స్వామి వివేకానంద చెప్పినది తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినది తప్పు ఎలా అవుతుంది?ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది !!

https://www.youtube.com/watch?v=KzJs0Kgrp8A

ఈ ఒక్క  వీడియో షేర్ చేస్తే సరిపోతుంది గా ఇంత టపా,  ఇంత ఉపోద్ఘాతం అవసరమా అని అన్పించవచ్చు. డాక్టర్ బాలు లాంటి వ్యక్తుల గురించి చదివి – ఈ దేశం నాకు ఏమిచ్చింది, ప్రభుత్వం ఏమిచ్చింది అని అనుకోకుండా నేను ఈ దేశానికీ, ఈ సమాజానికి ఏమిస్తున్నాను అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటారన్న ఆశ తో మీ ముందుకి ఈ టపా !!

గణేశుడి పూజ

వినాయక చవితి, నిమజ్జనం  ఎప్పుడో అయిపోయి దసరా కూడా వచ్చేస్తుంటే  ఈ టపా ఇప్పుడు పెట్టానంటారా ? వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్లు, ఈ టపా కట్టి  దాదాపు రెండు వారాలు  అయినా పోస్టు చేయడం కుదరలేదు. ఇండియా వెళ్లి జెట్ లాగ్, బెంగ  తీరేసరికి కొంచం సమయమే పట్టింది. ముఖపుస్తకాలలో,  బ్లాగుల్లో వినాయకుళ్ళని చూసాక, మా బాలవికాస్ చేసే  వినాయక చవితి పండగ గురించి తప్పక వ్రాయాలన్పించింది.  Better late than never అంటారు కదా !!

గత 30 ఏళ్ళు గా, ఈ పండగని ప్రతి ఏడాది  చాలా ప్రత్యేకమైన రీతిలో  చేయిస్తున్నారు మా బాలవికాస్  వారు. మా బాలవికాస్ వారు జరిపే ఈ వేడుకను 2008 లో PBS ఛానల్ వారు వారి డాక్యుమెంటరీ “The Asian & Abrahamic Religions: A Divine Encounter in America లో  చిత్రీకరించడం కూడా జరిగింది.

ఆ ప్రత్యేకతలు ఏమిటంటే:

ఈ పూజ ని పిల్లలు మాత్రమే   చేస్తారు…  అంతే కాదు…  వినాయ చవితి  కథలు, గణపతి కి భజనలు, పాటలు, పూజా  విధానం, ఫల శృతి,  పురుష సూక్తం, మంత్రం పుష్పం, హారతి  ఇవన్నీ కూడా పిల్లలే చెప్తారు…. అవును పిల్లలే!!   అదే మా బాలవికాస్ ప్రత్యేకత!!  మా బాలవికాస్  గురువులు ఏ  ప్రార్థనయినా, మంత్రమైనా  పఠించేముందు అర్ధం తెలుసుకోవాలి అంటారు. అందుకే పిల్లలు ఈ వేడుకలో ఫలశృతి దగ్గర నుంచీ  మంత్రం పుష్పం వరకూ స్పష్టం గా పఠించి, వాటి అర్ధం కూడా వచ్చిన ప్రేక్షకులకి ఆంగ్లం లో విడమరచి చెప్తారు.  రాజోపచారాలు కూడా చాలా శాస్త్రోక్తం గా చేస్తారు.   నృత్యం దర్శయామి అన్నపుడు పిల్లలు నాట్యం చేస్తారు. గీతం శ్రావయామి అన్నపుడు పాటలు పాడతారు.  

img_1334

ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ముఖ్య పూజకి మూడు అడుగుల మట్టి గణపతిని కూడా మా బాలవికాస్ మునుపటి విద్యార్థుల మాతృమూర్తి ఒకరు  చేస్తారు. ఆవిడ ఎప్పట్నించీ  చేస్తున్నారో, 11 ఏళ్ల బట్టీ  మా పిల్లలని బాలవికాస్ తీసుకువెళ్లే,  నాకు కూడ తెలియదు.. పూజకి కొన్ని రోజుల ముందు కొంత మంది వాలంటీర్లు మట్టి తెచ్చి ఆవిడకి ఇస్తారు. ఒక్కొక్క సారి ఆ మట్టిలో  రాళ్ళూ ఉంటాయి. అలాంటప్పుడు  దానిని జల్లించి, రాళ్లు లేకుండా ఏరి, తడిపి  ఆ మట్టి తో వినాయకుడిని చేస్తారు. ఆ రోజుకి గణపతికి క్రొత్త పంచె కడతారు.  పొద్దుటికల్లా  విగ్రహాన్ని తయారుచేయడానికి ఒక్కోసారి ఆవిడ రాత్రంతా శ్రమించిన రోజులు ఉన్నాయిట.  పాలవెల్లి కూడా వారి కుటుంబమే తాయారు చేసింది.  

img_1327-1

ముందు రోజు  రాత్రి  కొంత మంది వాలంటీర్లు  మండపం, స్టేజి అలంకరిస్తారు. పొద్దున్నే వినాయకుడిని తెచ్చి అప్పుడు పాలవెల్లిని అలంకరిస్తారు.

మా బాలవికాస్ పిల్లలే కాక అందరు పిల్లలూ  ఈ వేడుక కి ఆహ్వానితులే.   వచ్చిన ప్రతి పిల్లలకీ  ఒక పళ్లెం లో  చిన్న వినాయకుడి విగ్రహం, పత్రీ, పూలు  ఇచ్చి పూజ చేయిస్తారు. ఆ విగ్రహం ఇంటికి తీసుకెళ్ళచ్చు. కానీ ఒక నియమం మీద మాత్రమే …   అది ఏంటంటే తీసుకెళ్లిన పిల్లలు ప్రతి రోజు క్రమం తప్పకుండా వినాయకుడిని ధ్యానించుకోవాలి.   

img_1332

 

img_1333

దాదాపు పిల్లలు, పెద్దలు కలిపి 400 మంది దాకా ఈ వేడుకకి విచ్ఛేస్తారు. పూజ అయ్యాక అందరికీ  ఉండ్రాళ్ళ ప్రసాదం తో చక్కటి భోజనం వడ్డిస్తారు మా బాలవికాస్  తల్లులు. పూజంతా అయ్యాక ఒక పైప్ తో పిల్లలతోటే నీళ్లు పోయించి విగ్రహాన్ని నిమజ్జనం చేయిస్తాము.  ఈ పూజా కార్యక్రమం అంతా ఒక గుడిలో జరుగుతుంది.  

ఈ గణపతి పూజ వేడుక కి  దాదాపు రెండు నెలల నుంచి తయారవుతుంటారు బాలవికాస్  పిల్లలు.  పదేళ్లు దాటిన ఒక  అమ్మాయిని మరియు ఒక  అబ్బాయిని Master of Ceremonies గా పిల్లలే  ఎన్నికల ద్వారా ఎంచుకోవడం జరుగుతుంది. ఎన్నికల పోటీ బాగానే ఉంటుందండోయ్ !! ఎన్నికలలో నిలుచున్న పిల్లలు వారిని ఎందుకు ఎన్నుకోవాలో ముందు గా చెప్తారు – మేము చాలా  బాగా స్పష్టం గా మాట్లాగలమనో , స్టేజి మీద మాట్లాడటం భయం లేదనో  కాబట్టి మమ్మల్నే  ఎన్నుకోండి అంటూ రకరకాల ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటారు.  అదొక వేడుక గా ఉంటుంది. ఈ  Master of ceremonies కాక  పూజ లోని ప్రతి భాగాన్ని  ఒక్కొక్కరికీ  ఇవ్వటం జరుగుతుంది.    ఐదేళ్ల పిల్లల దగ్గరనుంచి పదిహేనేళ్ల  పిల్లల వరకు మైకు పట్టుకుని ఈ కథలని  విచ్చేసిన ప్రేక్షకులకు  చెప్పడానికి  ఉత్సాహం గా ముందుకు వస్తారు.ఆ విధం గా ఎండాకాలం సెలవలు ఉన్న రెండు నెలలు ప్రాక్టీసులు చేస్తారు పిల్లలు.   

మా పిల్లల్ని ఈ విధం గా తీర్చి దిద్దుతున్న గురువుల గురించి ఎంత చెప్పినా  తక్కువే!! అందుకే వారి గురించి టపా  వ్రాసే ముందు బాలవికాస్ చేసే కార్యక్రమాలు ఒక్కొక్కటీ ముందు వ్రాస్తున్నాను.