ఎక్కడికి వెళ్ళినా చీర & చేనేత. దానితోటే ముడి పడిన సంస్కృతి. ఇంత కంటే అద్భుతం ఏముంటుంది కదా 🙂 .
ఈశాన్య రాష్ట్రం కావడంతో సాయంకాలం తొందరగా చీకటి పడుతుంది. పొద్దున్న తొందరగా వెలుతురు వచ్చేస్తుంది. మేము విమానం దిగి భోజనం చేసాక ఓ 3 గంటల సమయం ఉంది. మేము చూడాలి అనుకున్న రెండు main గుళ్ళలో ఏ గుడికి వెళ్ళే సమయం లేదు. బ్రహ్మపుత్ర నదికి అవతల కొన్ని గుళ్ళు ఉన్నాయి అని గూగుల్ లో చూసాను. డ్రైవర్ వాటి గురించి అంత బాగా తెలీదు అన్నాడు. అయినా వినకుండా పద పద మని వెళ్ళమన్నాను. చాలా దూరం వెళ్ళినా గుళ్ళ జాడ లేదు. అలా కాదని వెనక్కి తిరిగి దగ్గర్లో ఉన్న చేనేత గ్రామానికి వెళ్ళమన్నాను. కనుక్కోవడం చాలా తేలిక కూడా అయ్యింది.
ఓ రెండు కొట్లు తిరిగి , మగ్గం కూడా చూపించమని అడిగాము. వాళ్ళ పండగ ‘Bihu’ అని మగ్గం పనివారు రారు అని చెప్పి, మగ్గం మాత్రం చూపించారు. Motifs కోసం cardboard మీద కావలసిన design వేసుకుంటారు. customized డిజైన్ కూడా వేసి ఇస్తారు కావాలంటే. అస్సాం వారి చీరలు రకరాలు. 600- 60000 వరకూ ఉంటాయి. ‘Mekala Sador’ అని రెండు భాగాలుగా ఉంటుంది చీర. కొంగు భాగం. చీర భాగం. లంగా వోణి ల ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు వేసుకున్నా ఎబ్బెట్టుగా ఉండదు. నేను మా అమ్మాయికి కొన్నాను. చిన్న పాపల్లా feel అయి మా టీనేజ్ అమ్మాయిలతో పోటీలు ఓణీలు వేసుకునే 40 ఏళ్ళ టీనేజ్ ఆడవారు ఈ చీరలు కొనుక్కోవచ్చు :). Social media లో demand create చేస్తే ఈ చీరలకి గుర్తింపు వస్తుంది. Shefali గారి video పెడతాను. చూడచ్చు.
షాపులో చీరలు కొన్నాక, వారు టీ ఇచ్చారు. వారి పండగ అంటూ బియ్యప్పిండి, నువ్వులతో, కొబ్బరితో కజ్జికాయల్లాంటి పిండివంటలు పెట్టారు. బావున్నాయి. తిన్నాక బిల్లు ఇచ్చేసి వస్తుంటే కొట్టు వాళ్ళు ఒక తెల్లటి రంగుకి ఎర్రటి బోర్డర్ ఉన్న కండువా (Gamosa అంటారట) అందరికీ కప్పి అందరి కాళ్ళకి నమస్కారాలు చేసారు. ‘అయ్యో ఇదేంటి’ అని మేము మొహమాట పడితే ‘ఇది మా traditional కండువా. ఇలా వేసుకోవడం మా ఆచారం’ అంటూ చెప్పారు. ‘marketing’ అని మనం అనుకోవచ్చు. కానీ మేము అలా అనుకోలేదు. ఒక వేళ అలా అయినా అపురూపమైన భారతీయ చేనేత వారికి ఈ మాత్రం ‘marketing skills ‘ ఉన్నాయి అని గర్వపడచ్చు.
అనుకోకుండా ఇదో అనుభవం.
ఏదైనా ప్రదేశం చూడటానికి వెళ్తుంటే , కొంచెం రీసెర్చ్ చేస్తే ఇట్లాంటి ప్రదేశాలు miss అవ్వము. అనుకోకుండా చేసిన యాత్ర అవ్వటం మూలాన కొన్ని మేము miss అయి ఉండచ్చు కూడా. వెళ్లి వచ్చిన నాలాంటి వారు ఇలా చెప్తే పదిమందికి తెలుస్తుంది అని ఆశ
‘సంకల్ప బలం’ అనేది ఉంటే అమ్మ దయ అనేది ఎలా ఉంటుంది అనడానికి నాకు లభించిన ‘కామాఖ్య’ అమ్మ వారి దర్శనం. Dec లో మా నాన్న గారు ICU లో ఉన్నపుడు ‘l promised my wife that I will take her to Kamakhya temple in Assam. I couldn’t take her’ అని చెప్పారు. రెండు సార్లు book చేసి cancel చేసారుట. అదీ ఆయన బాధ. ‘అలాంటివి ఇపుడు ఏమీ అడగకండి. మీ ఆరోగ్యం బావుంటే చాలు’ అంది అక్క. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మేము ఆయనకి ఏ మాటా ఇవ్వలేదు. కానీ అమ్మవారు ఊరుకుంటారా మరి?
అమ్మని కాస్త ఎక్కడైనా తిప్పుదాం అని ఆలోచించి చాలా casual గా గౌహతి చూస్తే Hyderabad నుంచి nonstop flights ఉన్నాయి. ఆలోచన రాగానే మా ఆడపడుచుని కూడా అడిగాను. సరే అన్నారు. వెంటనే book చేసాము. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. నాలుగు రోజుల్లో ముగ్గురం అన్నీ చూసి వచ్చాము.
డిసెంబర్ లో భారత్ వచ్చి వెళ్ళాక జనవరి 5న ఓ టపాలో వ్రాసిన మాటలు ఇవి “ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాను. ఇక పై ఒక్క వారం రోజుల సెలవు సమయము ఉంటేభారత్ తప్ప ఇంకో చోటికి వెళ్ళను అని. చూడవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నది భారత్ లోనే అని నా ఉద్దేశ్యం. ఆ వారం సమయం లేకపోతే అమెరికాలో చుట్టు పక్కల ప్రదేశాలకి వెళ్లడం. భారత్ లో చూడవలసిన అద్భుతాలు చూడటానికి జీవితం సరిపోదు”
ఈశాన్య రాష్ట్రాల వైపు నా నాలుగు రోజుల mini trip అయ్యాక ఖచ్చితంగా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఊరు ఊరుకి , రాష్ట్రం దాటగానే సంస్కృతి మారిపోతుంది. కానీ ప్రతీ ఒక్కడూ భారతీయుడే. సద్గురు గారు చెప్పినట్లు తెలిసో తెలీకుండానో ప్రతీ ఒక్కరూ మాట్లాడేది ‘మోక్ష మార్గం & కర్మ సిద్ధాంతం’ గురించే.
ఇలా సాగింది మా నాలుగు రోజుల ప్రయాణం.
3 Nights/4 Days
Day 1 – Hyd to Guwahati . Visit to Sualkuchi village & saree shopping
Day 4 – Umiam lake sight seeing – Return back to Hyd
భారతీయులకి foreign country అంటే ఎంత పిచ్చి అంటే లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి సింగపూర్ లాంటి దేశాలు చూస్తారు కానీ భారత్ లో ఇటువంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి అని కూడా అనుకోరు . ఇవన్నీ ఏదో తీర్థయాత్రలు , పెద్దవాళ్ళకే అన్న అపోహలో ఉంటారు. మీ దేశంలో టూరిజం ని మీరే మెచ్చుకోకపోతే ఎవరు చూస్తారు? స్విట్జర్లాండ్ చూసి బావుంది అనుకున్నాను. కానీ అంతకు మించి ఉంది మేఘాలయ అనిపించింది నాకు. ఈ లెక్కన సిక్కిం ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవచ్చు. భారతీయులు తమ దేశంలో స్థలాలు చూసి/చూపించి టూరిజం ని ప్రోత్సహించాలి.
మా నాన్న గారు మార్చి 29, 2022న శరీరాన్ని విడిచి వెళ్ళారు .
క్లుప్తంగా చెప్పాలి అంటే ఆయనకి తెలియని విషయం అంటూ ఉండేది కాదు. అది బ్యాంకు ఉద్యోగం వల్ల కొంత, స్వతహాగా ఉన్న ఆసక్తి వలన.
కంప్యూటర్ లు వచ్చాక ఆ రోజుల్లోనే ఓ పక్క ఉద్యోగం చేస్తూనే COBOL నేర్చుకున్నారు. Internet వచ్చాక email ఎలా వ్రాయాలో మొదలు పెట్టి , networking దాకా నేర్చేసుకున్నారు. ఇంట్లో ఎవరిదైనా సరే తనే ఆ computer fix చేసేవారు. ఎప్పుడూ అందరికీ hard drive ఒకటి తెచ్చుకుని backup చేసి ఇచ్చే వారు. ఇక smart phones తో కూడా అలాగే చేసేవారు. BSNL వాళ్ళ కంటే మా నాన్నకే బాగా తెలిసేది .
ఆ BSNL అంటే మహా ఇష్టం. ‘public sector ని అంటే ఊరుకోను’ అని ఖచ్చితంగా మొహాన చెప్పేవారు. Facebook లో కూడా చాలా active గా ఉండేవారు. తెలుగు బ్లాగులు నాకు పరిచయం చేసింది మా నాన్న గారే . ‘కూడలి’ చూపించారు. ‘కష్టేఫలి’ శర్మ గారి బ్లాగు గురించి , శర్మగారి చెప్పే విషయాలు చాలా నచ్చేది ఆయనకి. ‘ భండారు’ వారు ఆయనకి ముఖపుస్తకంలో పరిచయమే.
‘మోదీ’ ఇష్టమే కానీ ‘opposition లేకపోవడం పెద్ద drawback. భక్తుల్లా మాట్లాడతారు మీరంతా. అసలు విమర్శించకూడదు అన్నట్లు ఉంటే ఎలా’ అని మాతో పెద్ద వాదనలు వాదించేవారు.
ఎంత ఓపిక లేకపోయినా లేచి ఆ కంప్యూటర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి ఓ అరగంట సేపు ముఖపుస్తకం లో గడిపేవారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మనవళ్ళు , మనవరాళ్ళు analysis ఇవ్వమని అడిగారు. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మాట్లాడారు.
అందుకే ఆయన వెళ్ళిపోయాక ఆ 13 రోజులు మేము ‘ Celebrating Life of Mr.Google’ అనే title ఇచ్చాము. ఆయన లేని మా జీవితాలని మాములుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాము.
మా అక్కయ్య ముఖపుస్తకం లో వ్రాసిన టపా కూడా పదిలంగా బ్లాగులో దాచుకుందామని ఇక్కడ post చేస్తున్నాను.
చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయి 3 వారాలు కావస్తోంది. ఆయన లేరు అనే నిజం ఇంకా జీర్ణం అవట్లేదు. మరి కన్న తండ్రి కదా అలాగే ఉంటుంది అన్నారు ఎవరో. నాన్న just నాన్న మాత్రమే కాదు కదా.
మా Facebook friend. సంగీత, సాహిత్య మిత్రులు. , a curious learner , a mischievous kid who would change all our gadget passwords and watch fun.
అందుకే ఎన్నో విధాలుగా ప్రతి నిమిషం నాన్న ని miss అవుతున్నా. అమ్మ అనేది ” ఎప్పుడు ఆ పుస్తకాలు కంప్యూటర్లు తప్ప పిల్లలకు ఏం పెట్టాలి ఏంఇవ్వాలి అని ధ్యాస లేదు” అని. నాన్న ఇచ్చిన ఆస్తి దేనికి కొలమానం.???
మంగళంపల్లి వారి “నగుమోము” enjoy చెయ్యటం నేర్పింది నాన్న. త్యాగరాజ పంచమికి పంచరత్నాలు live తిరువాయుర్ నుంచి చూడటం, ఎక్కడ మంచి కచేరి వున్నా తీసుకెళ్లడం. దాదాపు ప్రతి పెద్ద కళాకారులని లైవ్ లో చూడగలగటం నేర్పింది నాన్నే .
రేడియో వినిపించడం మాత్రమేనా, ఆలిండియా రేడియో కి పట్టుకెళ్లి అక్కయ్యలని, మామయ్యాలని ఏకాంబరాన్ని చూపించింది మా మొహల్లో excitement తెచ్చింది నాన్న.
రైల్ అందరూ ఎక్కుతారు. ఇంజిన్ ఎక్కించారు, స్టేషన్ లో సిగ్నల్ రూమ్ కి పట్టుకెళ్లారు. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో A/C First class ఎక్కించారు, just ఆ feel కోసం.(డబ్బు వుండి కాదు, LTC లో మరి కాస్త వేసుకుని), ఒకసారి రామేశ్వరం.నుంచి మద్రాసు దాకా Heritage Compartment లో పట్టుకెళ్లి మా ముగ్గురికి రాజుల కాలం ఫీల్ తెప్పించారు.
LTC లో కాస్త డబ్బు చేర్చి మొదటి సారి మాకు flight ఎక్కిన అనుభవం నాన్న వల్లే. చాలమంది మా తోటి స్నేహితుల parents డబ్బులు దాచుకుంటే, నాన్న మమ్మల్ని దేశం లో తిప్పని ప్రదేశం.లేదు.
ముగ్గుర్ని తీసుకుని పెరేడ్ గ్రౌండ్స్ లో రంజీ ట్రోఫీ మాచ్ కి పట్టుకెళ్లి, స్టాండ్స్ లో కూర్చుని మాచ్ చూడటం లో థ్రిల్ చూపించారు.
పానిపురి తినాలన్న మిర్చి బజ్జి అయినా , మంచి కాఫీ అయిన నాన్నే.
Survey of India లో మాప్ లు తెచ్చి how to read maps చెప్పింది నాన్నే.
పుస్తకాల విషయంలో చెప్పనక్కర్లేదు. నాకు పుస్తకాల పిచ్చి నాన్న వల్లే. చిన్నపుడు మొగల్ లైబ్రరీ కి వెళ్లడం తో మొదలయింది మా book friendship.”ఇదిగో ఈ bookచదువు” అంటూ ఇంటికి వెళ్ళగానే ఒకటి విసిరేసేవారు. ‘దుమ్ము ఉంటుంది, ఆయాసం వస్తుంది’ అని అమ్మ అరుస్తున్నా, నా ఆఫీస్ కి వచ్చి ‘Book Exhibition కి వెళ్దాం అమ్మకి చెప్పకు’ అంటూ ఆ పుస్తక వ్యసనానికి మూలం నాన్న. అమ్మ అనేది “ఆడపిల్ల వచ్చింది ఒక చీర పెట్టామా లేదా అక్కర్లేదు, ఆ పుస్తకాలు ఇస్తే చాలా?” అని. చాలాదా!!కోట్ల రూపాయల విలువ . పుస్తకం కాదు. అది చదివి ఆయనతో చేసే డిస్కషన్. ఆయన reasoning. In this society emotions are over rated than practicality అని నవ్వేవారు.
ప్రతి విషయం మీద ఒక view ఉండాలి అని అనేవారు. అటు politics అయిన, ఇటు మతపర విషయం అయినా, సాంఘిక విషయాలు అయినా చర్చ జరగలసిందే. నాకు తెలిసి మా ముగ్గురికి ఒక్కసారి కూడా text booksచదవమని చెప్పింది లేదు. అయినా మెమెప్పుడు చదువు నిర్లక్ష్యం చేసింది లేదు.
ఎప్పుడు తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ fiction, travelogues, national geographic magazines, readers digest. ఒకటేమిటి అన్ని రకాల బుక్స్. నా ట్రావెల్ పిచ్చి కి, ఎప్పటికయినా జీవితం లో భూభ్రమణం చేయాలనే నా కోరిక కి బీజం నాన్నే.
బాపు రమణలని , బుడుగు ని పరిచయమ్ చేసింది నాన్న.
కున్నకుడి “కావేరి ” వయోలిన్ రుచి చూపించింది నాన్న.
Lalgudi violin కానీ “west meets east” by రవి శంకర్ కానీ , మంచి హిందీ పాటలు కానీ వినటం అలవాటు చేసింది నాన్న. . రిటైర్ అయిన వాళ్ళు , అమెరికా వెళ్లిన పెద్దవాళ్ళు ఎంతో మంది బోర్ బోర్ అంటుంటే, నాన్న మాత్రం లైబ్రరీ కో, మైక్రో సెంటర్ కో వెళ్లి అలా రోజులు గడిపే వారు. అలా ఒక కంప్యూటర్ ముందు వేసుకుని గంటలు గడిపేసే వారు ఒక్క రోజు ఆయన నోట్లో బొర్ అనే.మాట వినలేదు.
enjoying life has nothing to do with physical assets అని అనడానికి నాన్నే నిర్వచనం.
కాదేదీ కవితకనర్హం లాగా ఒక చిన్న రైల్ ప్రయాణం అయినా, ఒక పుస్తకం అయిన, ఒక పాట అయిన , స్నేహితులతో గడపటం అయిన జీవితాన్ని అంత enjoy చెయ్యచ్చు అని తెలుసుకుంది నాన్న వల్లే. చిన్నతనం లొనే తండ్రిని పోగొట్టుకుని, పెద్దకొడుకుగా గంభీరంగా బాద్యతలు తీసుకున్న నాన్నే మా ఆదర్శం మరి.
జీవిత కాలం నాన్నతో ప్రాణస్నేహితులు గా ఉన్న శివరాం మామయ్య ,సోమశేఖర్ మామయ్య , రంగనాథ్ మామయ్య ల, అనుబంధంలాతో (uncle అనే పిలుపు లేవు అందరిని మామయ్య అనాల్సిందే) స్నేహం విలువ చెప్పారు నాన్న. సక్సెస్ అంటే నాన్న definition వేరే.
Technologyఆంటే ప్రాణం నాన్నకి. అన్ని నేర్చికుని మనవళ్ళ computer passwords మార్చేసి వాళ్ళని ఏడిపించిన Modern తాత.. Computer time కోసం పిల్లలతో సమానం గా పొట్లాడిన చిన్న పిల్లాడు నాన్న. అలాంటి నాన్న ఏదో కొత్త technology తో స్వర్గం నుంచి wifi లో contact లోకి తొందరగా రాకపోతారా!!!
హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ మాట్లాడేవారిని బోలేడు మందిని చూస్తున్నాను భారత్ లో . FB లో కూడా request లు వస్తుంటాయి. చాలా బాధ కలిగిస్తున్న అంశం ఏంటంటే మగవారే మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద మాట్లాడే ఆడవారు చాలా తక్కువ. అసలు లేరు అనను. ఉన్నా బయటికి మాట్లాడాలి అని నియమం కూడా లేదు. కాబట్టి, నాకు కనబడక పోయి ఉండచ్చు కూడా. ఏది ఏమయినా ఉన్నవారు మాత్రం చాలా తక్కువ శాతం. ఒక్కటి మాత్రం సత్యం. ఆ ఉన్నవారు మాత్రం దుర్గ మాతలే . కాబట్టి నేను అనేది ఏంటంటే హిందూ ధర్మం భూమి మీద ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ శాతం పెరగాలి.
కానీ అందుకు భిన్నంగా ఈ విషయంలో ఆడవారు ఎందుకు ఇంత నిర్లిప్తతగా ఉంటున్నారు ?
ఇది వరకు రోజుల్లో ఆడవారు బయటికి వెళ్ళి చదువుకునే వారు కాదు. ఇంట్లోనే అన్నీ నేర్చుకునేవారు. ఇందుకు గజేంద్ర మోక్షమో , పోతన పద్యాలూ ఉదాహరణలు. మా అమ్మమ్మ కి తల్లి లేకపోయినా అన్నీ మేనత్త దగ్గర నేర్చుకుంది. అందుకే ఈ రోజుకి కూడా Balanced గా మాట్లాడుతుంది. Time management, Human relationships, values ఇటువంటివి ఈ తరం ఏ బడికీ వెళ్లకుండానే నేర్చుకుంది. తరువాతి తరం క్రమంగా చదువుకోవడం ఉద్యోగాలు చేయడం మొదలయింది. అక్కడ నుంచీ మొదలయింది మార్పు!! ‘సమానంగా డబ్బు సంపాదిస్తేనే తప్ప మనకి విలువ లేదు’ అన్న mindset నుండీ → ‘సంపాదిస్తున్నాను . అయితే ఏంటి? నీ మాట వినాలా? ఉంటే ఉండు. పోతేపో ‘ (లేదా) ‘ నాకు డబ్బుంది పెళ్ళెందుకు ?’ వరకు.
ఇది వరకు స్త్రీలకి సమయం దొరికితే :
టీవీ లు లేకపోవడం ఉన్నా ఛానెల్స్ లేకపోవడం వల్ల పుస్తకాలు చదవడం ఉండేది. రేడియో వినడం ఉండేది. కబుర్లు చెప్పుకుంటూ crafts చేసుకునేవారు. బుట్టలు అల్లడం, పూసలతో బొమ్మలు చేయడం (ఇవి కూడా తులసి కోటలు , వెంకటేశ్వర స్వామి , దేవుడి మందిరం వంటివి) ఇప్పుడు టీవీ సీరియల్స్ చోటు చేసుకున్నాయి. వాట్సాప్ లో ఏ పూజలు ఎలా చేయాలి అంటూ చాదస్తం తో కూడిన సందేశాలు, వీడియోలు. ఎందుకు చేస్తున్నాం అనే లాజిక్ పోయింది. ( సరదాగా కట్టుకుందాం అని దసరాల్లో చీరల రంగులు పెట్టా ఒకసారి. లలితా సహస్రనామం గుంపులో. ఇక పండగ తేదీల గురించి, చీరల రంగుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సరే పూజ చేసాక ఒక నామం గురించి చెప్పినా వినే స్థితిలో ఉండరు.) సరే. ఇక కిట్టీ పార్టీలు. అవి ఎందుకు చేస్తారో అవి అర్ధం కాదు. ఒకప్పుడు డబ్బుల్లేక ఒక వస్తువు ఏర్పరుచుకోవడానికి ఇలాంటివి ఏవో పెట్టుకున్నారు. అవి కాస్తా ఇప్పుడు ఒక socializing events లాగా అయ్యాయి. ఇదొక కోణం. “కట్టిన చీర కట్టకూడదు. పెట్టిన నగ పెట్టకూడదు” సోషల్ మీడియా వల్ల ఒక రకమైన పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాదు ‘మా కిచెన్ చూడండి , ఈ చీర కొనుక్కోండి, ఈ కొత్త వంటకం చేయండి’ లాంటి వీడియోలు. ఒకప్పుడు సమయాన్ని సద్వినియోగ పరచుకునే వారు crafts అటువంటివి పూర్తిగా మర్చిపోయారు. ఉన్న కళలని కూడా చంపేసాయి. ఉన్న కొద్దిపాటి సమయం వీటికే అంకితం చేస్తున్నారు. Basically , తర్కం తో కూడిన mindset పోయింది.
ఆడవాళ్లదేనా తప్పు . మగవారిది లేదా అంటే ఎందుకు లేదు? బోలెడు. ఓ నవల వ్రాయగలిగినంత ఉంది. భారత్ వచ్చాక కొంత మంది స్నేహితురాళ్ళని కలవాలనుకుని ‘walking వెళదామా సరదాగా’ అని ఎవరిని అడిగినా ఆదివారం కూడా రాలేనంత తీరికగా ఉంటున్నారు . మధ్యాహ్నం రెండు తరవాతే వస్తారు. ఇంట్లో వాళ్ళ పనులు ఉంటాయి. టిఫిన్లు, పూజలు, భోజనాలు, మళ్ళీ సాయంత్రం వంటలు. అందుకని వాళ్ళ permissions తీసుకోవాలి. 40 దాటిన ఆడవారికి permission ఏమిటి అసలు? ఒక్క రోజుకి త్యాగం చేయరు ఈ మగవారు . ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని బట్టి ఒక సామాన్య స్త్రీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంత కష్టమో ఊహించచ్చు. స్త్రీ వాదం పుట్టింది అంటే పుట్టదా మరి ? అటువంటి స్త్రీలు ధైర్యం గా ముందుకి వెళ్లడం మాట పక్కన పెడితే , ఆత్మ నూన్యత కి గురి కాకుండా ఉంటే చాలు.
ఒక సంస్కృతిని తరవాతి తరానికి అందించే విషయంలో స్త్రీదే ముఖ్య పాత్ర. శివాజీ తల్లి కావచ్చు. వివేకానందుడి తల్లి కావచ్చు. . పురాణాల్లో సీతా దేవి, ద్రౌపది, కుంతీ దేవి ఒక్కొక్క స్త్రీ ఎంతటి వ్యక్తిత్వం ? అటువంటి భారత స్త్రీ, అసలు తన కుటుంబ వ్యవస్థ నుంచీ ఎన్నో విధాలుగా దూరం అయిపోతోంది. ఇంక సంస్కృతి కోసం పోరాటం ఏమి చేస్తుంది?
భారత సంతతి/హిందువులు అనగానే ప్రపంచానికి తెలిసింది ‘Caste’ అంటే కులము అన్నమాట. ఆ మాట తప్పించుకుని అమెరికా వచ్చేసాం అనుకున్నా అమెరికాలో ‘caste based discrimination’ అంటూ పెట్టి , ఇది ‘ south Asians’ కి మాత్రమే apply అవుతుంది అని చెప్తున్నారు. కాలేజీల్లో మొదలు పెడుతున్నారు. ఇక నెమ్మదిగా corporate ప్రపంచంలో కూడా మొదలుపెడతారు. అమెరికాలో చాలా మంది తల్లితండ్రులు పిల్లలకు కులం అనేది చెప్పరు . బడిలో History తరగతిలోనో , World religions తరగతిలోనో చాలా మటుకు ‘caste’ అన్న పదం వింటారు. ఇక పై అందరం పిల్లలకి ఏ కులం లో పుట్టామో చెప్పాలేమో. ఒక వేళ కులం తెలిసినా ఏ కులం పెద్దదో , ఏ కులం చిన్నదో చెప్పుకోవాలేమో మరి. మా నోటితోనే మా చరిత్రని వక్రీకరించి/ హీనంగా చెప్పాల్సిన సందర్భం వచ్చేసిందేమో.
దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. రామానుజాచార్యులు వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎందుకు జీయర్ స్వామి వారి వీడియోలు చూపించి నానా యాగీ చేయడం మొదలు పెట్టారో. . ప్రపంచంలో నీచమైన జాతి ఉన్నది అంటే ఈ వీడియోలు చూపించి, నీచాతి నీచంగా స్వామి గారి గురించి మాట్లాడే మనుష్యుల జాతి మాత్రమే.
ఇంకొందరు ఇంత ఖర్చుతో ఈ విగ్రహం అవసరమా అని అంటున్నారు. ప్రపంచంలో ప్రతీ హిందువు ఐడెంటిటీ అద్వైతం/ద్వైతం అన్న సిద్ధాంతం ఏది ఎక్కడా చెప్పకుండా కులం అనేది ఓ identity చేసారు. దారుణం ఏంటంటే కర్మ ఫల సిద్ధాంతాన్ని కూడా కులముతో ముడి పెడతారు. హిందూ మతంలో పుట్టిన భావి తరాలవారు ‘నా identity నా కులం కాదు’ అని ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చెప్పుకునేందుకు ఏదీ వద్దా? ‘మానవులంతా సమానమే ‘ అంటూ చెబుతూ ఇప్పుడు ఈ విగ్రహం ముందు ముందు చెప్పుకునే చరిత్ర అవ్వబోతోంది. కాబట్టి ‘ ఈ విగ్రహానికి అవసరమా ? ఇంతా ఖర్చా ‘ అని అడిగేవారు దయచేసి అలా మాట్లాడవద్దు మనవి . ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అవసరం ఉంది
ఇది వరకు పటేల్ గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో వ్రాసిన టపా
హిందూ మతం/హిందూ సంస్కృతి/భారతీయత /సనాతన ధర్మం అనేది ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోకెల్లా ప్రాచీనమైనది. ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కానీ చరిత్రలో కనుమరుగయ్యాయి. ఇంకా ప్రాణంతో ఉన్న సంస్కృతి ఇదొక్కటే. ఈ సంస్కృతి రక్షించుకునేందుకు తమదైన రీతిలో అనేక ధార్మిక సంస్థలు పోరాడుతున్నాయి. అందులో ఒక సంస్థ గురించి చెప్తాను. వారు చేస్తున్న దైవసేవ ఏ ఆర్భాటము లేకుండా ఏదో చిన్నదిగా ఉన్నట్లు కనిపించినా , భావితరాలని హిందూ మతం పాటించేటట్లు చేస్తుంది అని నాకు అనిపించింది. అదే కదా సంస్కృతిని కాపాడటం అంటే?
హిందూ మతం అనగానే అందరూ మాట్లాడేది కులము & కుల వివక్ష. ‘నిర్వాణ శతకం వంటివి చెప్పిన ఈ మతంలో వివక్ష లేదు. భగవంతుడికి అందరూ ఒక్కటే’ అని ఎన్ని చెప్పినా , పాటించేది మానవ మాత్రులం కాబట్టి కుల వివక్ష లేదు అని ఎవరం అనలేము. కానీ దానినే ఒక అవకాశంగా తీసుకుని మత మార్పిడులు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే. వారి నమ్మకం వారిది. వారు మారుస్తారు. మరి , ఎవరైనా మతం ఎందుకు మారతారు ?
ఏదైనా సమస్య వచ్చినపుడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఎవరైనా ఆ సమయంలో దైవాన్నే నమ్ముతారు. ఆ దైవాన్ని తలచుకునే వ్యవస్థే లేకుండా పోతే? ఏ ప్రార్థనా స్థలం కనిపిస్తే అక్కడికి వెళతారు. ఆ విధంగా చాలా మంది హిందువులు మతం మారిపోతున్నారు. చాలా చోట్ల ఈ గుళ్ళు అంటే గ్రామ దేవత వ్యవస్థ అనేది కనుమరుగు అయిపోతోంది.. అన్నీ ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయాలు కావు. ఓ రావి చెట్టు కిందో/ ఊరవతల నో ఉంటాయి. కొన్ని గుళ్ళు physical గా ఉన్నా పాడుబడిపోయి దీపారాధనకు కూడా నోచుకోవడం లేదు. ఈ వ్యవస్థ ఇలా దూరం అవ్వడం వల్ల, ఏదైనా సమస్య వచ్చినవాడికి వారి కుల దైవం అందుబాటులో లేనట్లే. అంతే కదా? సమస్య వచ్చినపుడే కాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం పెళ్లి , బారసాల లాంటివి కావచ్చు. ముందు కులదేవత కి పూజ చేస్తారు. చాగంటి గారు ఓ ప్రవచనం లో చెప్పారు గ్రామదేవతల విశిష్టత గురించి. ఒక ఊరులో మొదట వచ్చినవారు ఇల్లు కట్టుకునే ముందు ఊరి మొదటిలో ఓ దేవత ని ప్రతిష్టించి ఆ దేవతకి పేరు పెట్టె వారు. పోలేరమ్మ అనో, తలుపులమ్మ అనో అలా . అటువంటి అమ్మ మనకి అండగా ఉంది అన్న నమ్మకం వారిలో కలిగించాలి కదా?
దానధర్మ అనే ఒక సంస్థ తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రామదేవతల గుళ్ళు పునరుద్ధించడం, ప్రతిష్టించడం అనే కార్యక్రమం చేపట్టారు. Venkat Vutukuri గారు దానిని స్థాపించారు. వారు అమెరికాలోనే ఉంటారు. సంస్థ website లంకె ఇస్తున్నాను. అన్నీ వివరాలు చూడవచ్చు. వారు ఈ కార్తీకమాసంలో Pooja kit లను ఇటువంటి 2500 దేవాలయాల లో అందజేస్తారు. ఒక్కొక్క kit లో ఆ నెలకు సరిపడా నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు ఉంటాయి. ఒక్కొక్క kit 516/- రూపాయలు మాత్రమే. మీ ఎన్ని గుళ్ళకి ఇవ్వగలిగితే అంత ఇవ్వవచ్చు. ఈ గుళ్ళలో భక్తులు ఎంత శ్రద్ధగా చేస్తారో చూస్తే అద్భుతం అనిపిస్తుంది. మన సంస్కృతిని వదిలివేయకుండా కాపాడుతున్నందుకు ఈ గ్రామాలలో ప్రజలకు చేతులెత్తి నమస్కరించచ్చు. ఎన్ని kits సహాయం చేయగలిగితే అన్ని చేయండి. అమెరికా వారికీ కేవలం $8. ఎంతమందికి ఈ సందేశం చేరవేయగలితే అంత బావుంటుంది. ఆ గుళ్ళలో దీపాలు వెలిగించిన వారం అవుతాము.
Myindmedia లో Venkat Vutukuri గారి ప్రసంగాలు విన్నాను. సంస్థ facebook పేజీలో ఏమి చేస్తున్నారో చూసాను. వారితో మాట్లాడితే ‘ మీరు విన్నారండీ. అదే సంతోషం. మీరు ఎంత వీలవుతే అంతే సహాయం చేయండి’ అన్నారు. ఆశ్చర్యం వేసింది నాకు . కనుమరుగవుతున్న సంస్కృతిని రక్షించుకోవాలన్న తపన వారి మాటలలో వినిపించింది.
శనివారం, అక్టోబర్ 23 న ఇస్కాన్ వారు బంగ్లాదేశ్ లో దేవాలయాలపై జరిగిన దాడులకు నిరసన వ్యక్తం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తనలతో కూడిన నిరసనకు పిలుపునిచ్చారు.
నాకు ఈ నిరసన గురించిన message వాట్సాప్ లో వచ్చింది. facebook లోనూ వచ్చింది. కాబట్టి చాలా మందికి తెలుసు అనే అనుకున్నాను. ఆ నిరసనలో చాలా మంది నాకంటే ముందరే వచ్చేసి ఉంటారు అనుకుంటూ DC వెళ్ళాను. ఎందుకంటే DC Metro లో ఏ celebration అన్నా protest అన్నా తప్పకుండా వెళ్తారు చాలా మంది. అంతకు ముందు BLM protests, Women’s march కి కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. నేనెప్పుడూ దేనికీ పెద్దగా వెళ్ళను. అది celebration కావచ్చు. protest కావచ్చు.
ఒకరిద్దరు స్నేహితులని అడిగాను. పనుల వత్తిడి రాలేము అని చెప్పారు. నేను మాత్రం చాలా పట్టుదల గా వెళ్లి పాల్గొనాలని నిశ్చయించుకున్నాను. ఎందుకో కారణాలు చెప్తాను.
ఇస్కాన్ వారి కమ్మటి భోజనం తిన్నాను. Steve Jobs అంతటి వారు ఇస్కాన్ వారు పెట్టిన ప్రసాదాన్ని మర్చిపోలేదు. ఇక ఇస్కాన్ వారి సంస్థ అక్షయపాత్ర రోజూ వేలమందికి వేడి వేడి గా వడ్డిస్తూ అన్నం పెడుతోంది. నేను కూడా ఆ సంస్థకి కొద్దో గొప్పో విరాళం కూడా ఇచ్చాను. ‘నువ్వు ఎవరు ? ఏమిటి? ఎక్కడ నుంచీ వచ్చావు ‘ అని ప్రశ్నలు వేయకుండా భోజనం పెట్టడం అనే పుణ్యకార్యాన్ని మించినది ఇంకొకటి లేదు. అటువంటి వారి గుడిని attack చేసి, ఆ భక్తులని చంపేసి ఓ బావిలో పడేయటం అంత దుర్మార్గం ఇంకోటి లేదు అనే చెప్తాను. వాళ్ళు చేసిన సేవకు డబ్బుతో విరాళం ఇచ్చి డబ్బుతో కొలవలేం కదా ? వెళ్ళి భజన లో పాల్గొని మద్దతు తెలపడమే కదా చేయాల్సింది. చేద్దాం అనుకున్నాను.
ఇస్కాన్ వారి గుడితో పాటు కొన్ని వందల గుళ్ళు పగలగొట్టారు. అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసారు. నవరాత్రుల్లో రోజూ అమ్మవారిని పూజించాను. క్రమం తప్పకుండా మహిషాసురమర్దని స్తోత్రం, సౌందర్యలహరి , దేవీస్తుతి , లలిత సహస్రం చదివాను. బాలవికాస్ పిల్లలతో సరస్వతీ పూజ చేయించాను. అటువంటి ఆ అమ్మని, అదే విజయదశమి రోజు అంత దారుణంగా అవమానిస్తే హాయిగా ఎలా నిద్రపోగలను ? అంటే ఆ ‘అమ్మ’ నిజం కాదా ? ఆవిడో విగ్రహం మాత్రమేనా ? సరే ఆవిడ కేవలం విగ్రహమే. ఆంధ్రా లో ఎన్నో విగ్రహాలని పగలగొడుతూనే ఉన్నారు ఇదీ ఒకటి లే అని వదిలేయనా ? అమ్మవారు ఓ విగ్రహమే అనుకుంటే , అదే రోజు, మరి కేవలం ‘ఆ అమ్మని పూజించారు’ అని ఎంతో మంది అమ్మలని మానభంగాలని చేసి అవమానించారు . వారిలో బాలా త్రిపుర సుందరి అని భావించి మనం పూజించే చిన్న చిన్న ఆడ పిల్లలు కూడా ఉన్నారు.
మా పిల్లలు విన్నా వినకున్నా నేను చెప్పేది ఒకటే ’ఈ వైదిక సంస్కృతి ని మర్చిపోవద్దు. ఏ రూపం లో అయినా దాన్ని ముందు తరాలకి అందించండి’ అని. బాల వికాస్ లో పిల్లలకి కొద్దో గొప్పో అదే మాట చెప్తున్నాను. నా మాతృభాషని తరువాత తరాల వారికీ అందించే ప్రయత్నమూ చేస్తున్నాను. మరి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ఎవరు ? నా లాగా వలస వెళ్ళినవారా ? కాదుగా . కొన్ని వందల సంవత్సరాల నుంచీ అక్కడే ఉంటూ భాషను, సంస్కృతి ని కాపాడుకుంటున్నవారు. ఒక్క మాట లో వారి గురించి చెప్పాలి అంటే ‘Indigenous’. కాశ్మీర్ పండితులు కాశ్మీరు వదిలి వెళ్లిపోయారు. . పాకిస్తాన్ లో 2017 వరకూ హిందూ పెళ్ళి చట్టప్రకారం అంగీకారం కాదు. ఈమధ్య ఓ హిందూ పిల్లవాడు ఆకతాయిగా ప్రార్థనా స్థలంలో ఏదో చేసాడని వాడిని ఉరి తీయలేదని హిందూ దేవాలయాన్ని బద్దలు కొట్టారు పాకిస్తాన్ లో extremists. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు తిరిగి పాలనలోకి రాగానే ప్రపంచమంతా వణికిపోయింది అక్కడి వారి బ్రతుకులు తలచుకుని. ఇటువంటి దేశాలలో ఇంకొక సంస్కృతి తో బ్రతకడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అవునన్నా కాదన్నా నిజం ఇది. ఓ సోషల్ మీడియా పోస్టుకి చూసి అంత దారుణంగా react అవ్వటం అనేది ప్రపంచమంతా ఆలోచించవలసిన విషయం. ఎంతో మందిని నిరాశ్రయులని చేసారు. ఆలయాలను ధ్వంసం చేసారు. హత్యలు, మానభంగాలు. ఎంతో స్నేహంగా ఉండే పక్కింటి వాడు ఎలా మారతాడో అన్న భయంతో బంగ్లాదేశ్ లోని హిందువులు ఇంకొకరిని నమ్మలేరు. అయినా కూడా ఇవన్నీ పక్కన బెట్టి ,నిలదొక్కుకుని గుళ్ళలో పూజలు చేసారు కొందరు. సోషల్ మీడియాలో ఇంత పోస్టులు పెట్టి ఇన్ని నీతులు చెప్పే నేను ఏం పనికొస్తాను వాళ్ళ ముందర ?
భారత్ లో పుట్టాను. అమెరికాకి వలస వచ్చాను. ఈ రెండు దేశాల్లో ఉండటం అనేది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఈ దేశాల్లో ఎవరికి నచ్చిన మతం, సంస్కృతి పాటించచ్చు. శాంతియుతమైన రీతిలో కష్టం చెప్పుకునే హక్కు కూడా ఉంది ఈ దేశాల్లో. ఇస్కాన్ వారి పరమ శాంతియుతమైన నిరసన కూడా నేను నమ్ముకునే ఆ పరమాత్మ నామాన్ని ఉచ్చరించడమే. పైగా తప్పు చేసిన వాడు మారణ హోమాన్ని సృష్టించి రెండు స్నేహ సంబంధమైన దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించి తప్పించుకున్నాడు. . అటువంటి వాడికి శిక్ష పడకపోతే ఎలా ? ఇవన్నీ ఆలోచించాక ఈ నిరసన లో పాల్గొనకపోతే నన్ను నేనే మోసగించుకుంటున్నాను అని అనిపించింది. వెళ్లి వచ్చాక నా కర్తవ్యం నేను చేసాను అన్న సంతృప్తి.
నాకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అనే అలవాటు కొంచెం ఉంది. చందమామలు, పత్రికలు, యద్దనపూడి/మల్లాది గారి నవలలు. బాలానందం లాంటి కార్యక్రమాలు. దానికి తోడు ఇంట్లో వాతావరణం కూడా. మా తాత గారు నా ఊహ తెలిసేసరికి లేరు. కానీ ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రరీ maintain చేసేవారు. ఆ అలవాటు మా తాత గారి చిన్న చెల్లెలు ( మా నాన్న మేనత్త) , మా నానమ్మకి , మా నాన్నకి వచ్చింది. వీళ్లంత కాకపోయినా కాస్తో కూస్తో పుస్తకం చదవాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఎండాకాలం సెలవల్లో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తే అక్కడా చందమామ, కొన్ని వార పత్రికలూ ఉండేవి.
అమెరికా వచ్చేటపుడు బరువు అని ఒక్క పుస్తకం తెచ్చుకోలేదు. కొత్తల్లో పెద్దగా realize కాలేదు. తరువాత ఏదో miss అవుతున్నాను అనిపించి, అనుకోకుండా ‘ఈమాట’ పుస్తకం కనిపించింది. అన్నీ గబగబా చదివేసాను. అప్పట్లో ఇలా అమెరికాలో తెలుగు రచయితలు ఉంటారని కూడా తెలీదు. తరువాత సుజన రంజని, అదే కౌముది అయ్యింది. క్రమం తప్పకుండా చదివేదాన్ని. ఇప్పటికీ చదువుతాను. అలా ఈ ప్రయాణంలో 2015లో కనిపించిన పత్రిక ‘సారంగ ‘ .
India’s Daughter డాక్యుమెంటరీ మీద ఓ వ్యాసం చదవడంతో మొదలయింది ‘సారంగ ‘ తో పరిచయం. అమెరికా రచయితలే ఉన్నా, ఎక్కడో తేడా అనిపించింది. కలాం గారు పోయిన మరునాడే ‘ఛస్తున్నాం ఈయన చెప్పిన కలలు కనలేక’ అంటూ ఆయన మీద బోలెడు విమర్శలు, విమర్శలతో కూడుకున్న కవిత్వాలు. మనుష్యులా లేక వీళ్ళు రాక్షసులా అనిపించింది.
తరువాత దాద్రి లో lynching incident అయింది. చాలా బాధాకరం. నేనూ అది ఖండిస్తాను. దాన్ని glorify చేస్తూ international media మాట్లాడటం, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు మాట్లాడటం ఒక వంతు అయితే, ఆ lynching incident మీద కవిత్వాలు, కథలు వ్రాసారు ఈ పత్రికలో. అప్పుడే చందు తులసి అనే రచయిత గోమాంసం గురించి కథ వ్రాసారు. ఆ కథ పేరు గుర్తులేదు. మొట్టమొదటి సారి ఒక public platform లో చాలా వాదన చేసాను. అప్పుడర్ధమయ్యింది నాకు ఇలా వామపక్ష వాదులు ఉంటారు. వారి ఆలోచనాధోరణి ఇలా ఉంటుంది అని.
బ్రాహ్మణులను తిడుతూ కథలు, బ్రాహ్మణ రచయితలను విమర్శిస్తూ వ్యాసాలు చాలా వచ్చేవి. ఎడిటర్లు వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటూనే కొన్ని moderate చేసేవారు. కొన్ని సగం పబ్లిష్ చేసేవారు.
ఈ వ్యాఖ్యలన్నీ తెలుగు బ్లాగు అగ్గ్రిగేటర్ లో వచ్చేవి. ఆ సంగతి కూడా నాకు తెలీదు. ఇవన్నీ నాతో పని చేసే కిషోర్ కి చెప్తే , ఈ లోకాన్ని విడిచి ఎక్కడున్నాడో కానీ ఓ సలహా పడేసాడు. ‘ నువ్వే feed create చేస్తున్నావు. వాళ్ళకి పాపులారిటీ కావాలి. అందుకే నీలాంటి వాళ్ళని పట్టుకోవడమే కావాలి వారికి. నీ వాదన వినిపించాలి అంటే నువ్వే బ్లాగు మొదలుపెట్టు. ’ అన్నాడు.
అది అర్ధమయ్యి ‘నిజమే ఈ గోలంతా ఎందుకు, నా పాటికి నేను బ్లాగు వ్రాసుకుందాం’ అని ఆ పత్రికలో వ్యాఖ్యానించడం మానేసాను. అలా బ్లాగుకి శ్రీకారం చుట్టడం అయింది.
కథలు, నవలలు చదవటం ఎప్పుడూ ఇష్టమే. ఊర్లో ఉన్న బుక్ క్లబ్ లో చేరాను. అందులో కొందరు వామపక్షం. ఎక్కువ వామపక్ష సాహిత్యం suggest చేసేవారు. వామపక్ష సాహిత్యం ఎలా ఉంటుంది అంటే హిందూ ధర్మం/ బ్రాహ్మణులు అంటే మూఢ ఆచారాలు, కుల వివక్ష, అస్పృశ్యత , స్త్రీల పట్ల గౌరవం లేకపోవడం, రాముడు ఆర్యుడు. .. ‘విముక్త కథలు’ , ‘రామాయణ విషవృక్షం’ ఇందులో ఉదాహరణలు. ఈ సాహిత్యం చదువుతున్నపుడు notice చేసింది ఏంటంటే ఎంతసేపూ ఈ వాదన exclusion కే కానీ inclusion కి కాదు. సరే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాణానికి ఇంకో వైపు చూడాలి అన్న ఆలోచనలో ఉండేదాన్ని.. అభిప్రాయాలు వేరు అయినా అందరమూ చదివేది ఒకటే కదా అని చాలా రోజులు సమయం కుదిరినా కుదరకపోయినా వెళ్లేదాన్ని. ఈ కరోనా వచ్చాక commute కూడా కలిసి రావడం తో online లోనే చక్కగా నడిచేవి.
క్లబ్ లో గొల్లపూడి వారి ‘సాయంకాలమైంది’ నవల మీద చర్చ చేసాం. అది అంతటితో ఆగకుండా గొల్లపూడి వారిని తిట్టడం పనిగా ఇంకో group వారు FBలో చర్చ చేసారు. ఆ పుస్తకం suggest చేసింది నేనే. అంతటి మహా రచయితని అనవసరంగా అవతలి వారికి గుర్తు చేసి మహాపరాధం చేసానా అని చాలా బాధ వేసింది.
తరువాత సారంగలోని A matter of little difference కథ మీద FB లో బోలెడు వాదనలు వచ్చాయి. ఆ వాదనలలో బ్రాహ్మణులు విలన్లు అన్న ధోరణిలో మాట్లాడటం జరిగింది.
ఇన్ని రకాల పుస్తకాలు చదివి ఎన్నో అన్యాయాలు ఖండించే నాతోటి బుక్ క్లబ్ వారు, సారంగలోని A matter of little difference కథ గురించి ‘జంధ్యా మూర్ఖులు’ అన్న ఒక ప్రఖ్యాత రచయిత మాటని కనీసం ఖండించను కూడా లేదు. నాలాగా నాణానికి ఇంకో వైపు అన్న ప్రసక్తి వీరికి లేదు అనిపించింది. అవతల వైపు నుండీ ఏ వాదన ఉండదు. . దానితో క్లబ్ లో ఉండాలా వద్దా అన్న ఆలోచన మొదలయింది.
ఇలాంటి తర్జన భర్జనలో Esther గారి బైబిల్ చరిత్ర చెబుతున్న వీడియో ఒకటి కనిపించింది. బైబిల్ చదవటం మొదలు పెట్టాను.(దాని గురించిన పాత టపా చూడవచ్చు) అంతే కాదు హైదరాబాద్ బుక్ క్లబ్ వారు కళావంతుల గురించి నిర్వహించిన కార్యక్రమం విన్నాను. యశోదా ఠాకూర్ గారి ఆరుగంటల podcast విన్నాను.
ఇవన్నీ చూసాక ఈ వామపక్ష ధోరణి కేవలం హిందూ మతానికే వర్తిస్తుంది అని స్పష్టంగా అర్ధమయ్యింది. కొంత మంది స్వార్థపరులు ఉన్నాయా , కొంతమంది నిజంగా పూర్తిగా నమ్ముతారు. విషయం అర్ధమయ్యాక అటువంటి పుస్తకాలూ, కథలు చదవలేదు/ చదవలేను.
క్లబ్ కి good bye చెప్పేసాను.
అతి సామాన్యమైన ఓ గృహిణిని నేను. ఈ అసలు విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఆరేళ్ళు పట్టింది. అంటే తెల్సుకోవాలనుకునేవారు నాకంటే ఇంకా తొందరగా తెలుసుకుంటారు.
సత్యం అనేది ఒకటే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బోలెడు దారులు. ఆ వెళ్తున్న దారినే సత్యం అనుకుంటే …
బంగ్లాదేశ్లో ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే ముందు గుర్తొచ్చిన వారు ఈ వామపక్ష వాదులు. మాములుగా కాలక్షేపానికి యద్దనపూడి నవలలు చదువుకునే నన్ను ఇలా మార్చిన వామపక్ష వాదులకి సదా రుణపడి ఉన్నాను అని చెప్పడానికే ఈ టపా.
అనుకున్న నాలుగు టపాలు విజయవంతంగా విజయదశమి లోపు పూర్తి చేశాను. ఈ నలుగురు నాకే కాదు. ప్రతీ ఇంట్లోనూ ఉంటారు. అందుకే అందరూ connect అయ్యి చదివారు. చదివిన వారందరికీ శతకోటి నమస్కారాలు. వీళ్ళ నలుగురే కాదు. ఓపికతో వ్రాసుకుంటూ వెళ్ళాలే అడుగడుగునా బోలెడు మంది ‘అమ్మ’ లు మన జీవితాల్లో ఉంటారు.
వీరి జీవితాలు గమనిస్తే చిన్న చిన్న వాటికోసం అడుగడుగునా యుద్ధమే. మధ్యతరగతి జీవితం & Economical status ఒకటి. సాంఘిక కట్టుబాట్లు ఇంకొకటి. ఒక వేళ ఉద్యోగాలు చేసినా ఆర్థికంగా బాగానే ఉన్నా, ఒక కట్టుబాటు లోనే ఉన్నారు. అత్తగార్లు , ఆడపడుచులు అంటూ ఎంత తిట్టుకున్నా కలిసిపోవడం అనేది చాలా సామాన్యం.
వీళ్ళందరికీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యాయి. డిగ్రీ పెట్టి కొలిచే చదువులు చదవకపోవచ్చు. ‘ యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణా’ అని పురాణాలు చదివి బుద్ధిని ఉపయోగించారు.
ఒదిగి ఉండడం ఓడిపోయినట్లు కాదు అనటానికి వీరి జీవితాలే నిదర్శనం !! ( ‘బోల్డన్ని కబుర్లు’ గారి అమ్మ గారు చెప్పిన మరచిపోలేని మాట)
ఇటువంటి family support system ప్రపంచంలో ఎన్ని చోట్ల ఉంది ? భారత దేశపు ఆడవారు ఈ రోజున అన్ని రంగాలలో ఎంతో పెద్ద బాధ్యత కలిగిన ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అంటే చెక్కు చెదరని భారతదేశపు కుటుంబ వ్యవస్థ. అందులో ఏ మాత్రం సందేహం లేదు.
మరి భారత స్త్రీ కి ఎందుకు కట్టుబాట్లు ?
భారతదేశం వెయ్యేళ్ళు పరాయివారి పరిపాలన లో ఉంది. అనేక దాడులు జరిగాయి. ముఖ్యంగా స్త్రీల మీద. 1971లో బంగ్లాదేశ్ యుద్ధమప్పుడే లోనే 3 లక్షల మంది ఆడవారి మీద అత్యాచారాలు జరిగాయి అంటే వెయ్యేళ్ళ చరిత్రలో ఎన్ని జరిగివుంటాయో ఊహకు అందని విషయం. ఇన్ని దారుణాలు జరిగినపుడు ఇంటిలోని ఆడవారిని ఏ ధైర్యంతో బయటకి పంపుతారు? అటువంటప్పుడు కట్టుబాట్లే క్షేమం కదా మరి ? ఒకవిధంగా ఈ కట్టుబాట్ల మూలాన ఆడవారు ఆ ‘చదువు’లు చదవకపోవడం మంచిదే అయిందేమో కూడా. తెలుగు వారింట్లో గజేంద్ర మోక్షం పద్యాలూ, రుక్మిణీ కల్యాణాలు వినిపించేవా? సందేహమే !! ఆ ‘చదువు’ రాకపోవడం వల్లనే చాదస్తం రూపంలో కొన్ని సంప్రదాయాలు, విలువలు మిగిలే ఉన్నాయేమో కూడా .
ఇటువంటి family support system విరిచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి.
‘ఏనాడూ ధర్మం తప్పకు’ అని రాముడికి చెప్పి అడవులకి పంపింది కౌసల్య. ఇన్నేళ్లు ఈ కుటుంబ వ్యవస్థ నిలబడింది అంటే ఆడవారు ధర్మాన్ని తప్పలేదు. తప్పుతున్న వారిని సరిదిద్దారు. కానీ ఆ ఆడవారే ధర్మాన్ని వదిలేసేలాగా చేసే వ్యవస్థ తయారవుతుంటే ప్రతీ తల్లీ ఓ ‘శక్తి ‘ లాగా ఎదుర్కోవాలి!! అప్పుడే నిజమైన విజయదశమి !!
అమ్మ !! అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మ ఏం చేసినా గొప్పే !! ఎలా ఉన్నా గొప్పే!! మా అమ్మని మించిన అమ్మ ఎవరికీ ఉండదు అంటాం. కదా ? నేను కూడా అదే చెబుతూ మా అమ్మ గురించి మొదలు పెడుతున్నాను.
మా అమ్మమ్మ, తాతయ్యలకు పెళ్లయిన చాలా కాలానికి (ఆ రోజుల్లో ) పుట్టిన మొదటి సంతానం మా అమ్మ లలితా కుమారి గారు. లేక లేక పుట్టిందని వాళ్ళ నానమ్మ మహాలక్షమ్మ గారు మహా గారాబం చేసేదిట ఈవిడని. అమ్మకి ముగ్గురు చెల్లెళ్ళు , ఒక్క తమ్ముడు. అందరి పెద్ద పిల్లల్లాగే చిన్నప్పటి నుండీ ఇంట్లో పనులకి సహాయం చేయడం, చెల్లెళ్లని తమ్ముడిని చూసుకోవడం చేసేది. చాలా బాగా చదువుకునేది కూడా. రేణిగుంటలో 10వ తరగతి చదువుకుంది. స్కూల్ ఫస్ట్. కాలేజీ timeకి బిట్రగుంట వచ్చేసారు. బిట్రగుంటలో కాలేజీ లేదు. ఆ ఊరు నుండీ కాలేజీకి వెళ్లాలంటే రోజూ నెల్లూరు వెళ్ళేవాళ్ళు. అమ్మ కూడా అలా PUC, BSc Biology మొదటిఏడు వరకూ నెల్లూరు వెళ్ళి చదువుకుంది. అమ్మ నెల్లూరులో కాలేజీ నుంచీ వస్తూ ఇంట్లోకి కూరలు కొనుక్కొచ్చేదిట. చిన్నతనం నుండీ అమ్మకి కుట్లు, అల్లికలు, ముగ్గులు ఇలాంటివి చాలా అలవోకగా చేసేది. ఈ లోపల మహాలక్షమ్మ గారు అమ్మ పెళ్ళి చూసి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టడంతో మా నాన్నగారి సంబంధం దొరకడంతో ఆ కాలేజీ చదువుకి స్వస్తి చెప్పించేసి పెళ్లి జరిపించేసారు మా తాతయ్య.
అత్తగారింట్లో పెద్ద వదినగా అడుగుపెట్టింది. అత్తగారితో పేరంటాలకు వెళ్ళడం. పెద్ద ఆడపడుచుతో కలిసి గబగబా పని ముగించేసి, వదినామరదళ్ళు ఆ అత్తగారికి చెప్పకుండా మాట్నీకి వెళ్ళడం. ఇంట్లో ట్యూషన్ తప్పించుకోవడానికి సాయంత్రం ఆటలాడుకోవడానికి వెళ్ళిపోయిన చిన్న ఆడపడుచుని, మరిదిని ట్యూషన్ టీచర్ వచ్చేసరికి వదినామరదళ్ళు కలిసి వీధంతా తిరిగి వెతుక్కు రావడం. ఇలా మొదలయింది అత్తవారింటి బంధం. (ఆవకాయ పెట్టి నాకు courier చేస్తుంది. అదే డబ్బాలో ఆవిడ మరిది, ఆడపడుచులకి కూడా పెడుతుంది. వాళ్ళకి వెంటనే ఇచ్చేదాకా ఊరుకోదు. ‘Phone అన్నా చేస్తే వాళ్ళే పట్టుకుపోతారు. కనీసం ఫోన్ కూడా చేయడానికి తీరిక లేదాయే నీకు’ అని నాకే class పీకుతుంది. వాళ్లిద్దరూ అంటే ఎప్పుడూ చిన్న వాళ్ళే కిందే లెక్క ఆవిడకి.) .
తరువాత మేము పుట్టడం, బళ్ళకి వెళ్ళడం అలా సమయం గడిచిపోయింది. నేను 6 వ తరగతిలో తెలుగు నుంచీ English medium మారాను. ఆ మారటంతో నాకు కష్టంగా ఉందని ప్రతీ సబ్జెక్టు కి నోట్సు వ్రాసి పెట్టేది. మా తమ్ముడికి చదువంటే ఎక్కడలేని దుఃఖం వచ్చేది. వెక్కి వెక్కి ఏడ్చేవాడు 😀 . ఒక్కగానొక్క కొడుకు చదువుకోడేమోనని ఈవిడ వాడితోపాటు కూర్చుని దుఃఖపడేది.
ఇక మాకై మేమే చదువుకోవడం మొదలు పెట్టాము. మా నాన్న ట్రాన్సఫర్ లు వచ్చినా ఆయన వెళ్తూ మమ్మల్ని హైదరాబాద్ లో ఉంచేసారు. అప్పుడు అమ్మ ఆంధ్ర యువతి మండలిలో కుట్టులో డిప్లొమా చేస్తాను అని మళ్ళీ విద్యకు శ్రీకారం చుట్టింది. ఎన్ని రకాల కుట్లు కుట్టేదో. చాలా మంచి మార్కులతో డిప్లొమా పాస్ అయింది. ఈవిడ కుట్టే విధానం చూసి ఎవరో చెప్పారు గవర్నమెంట్ సర్టిఫికెట్ చేయమని. అందుకు మళ్ళీ సెట్విన్ సంస్థలో Tailoring లో ఇంకో డిప్లొమా చేసి, గవర్నమెంట్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అనుకోకుండా దుర్గాబాయి దేశముఖ్ గారి సంస్థ అయిన ఆంధ్ర మహిళా సభలో లో కుట్టు నేర్పే టీచర్ గా చేరింది. దాదాపు ఓ 17 ఏళ్ళ దాకా పని చేసింది. ఎంతో మంది దగ్గర ప్రశంసలు అందుకుంది. దుర్గాబాయమ్మ గారికి అంత్యంత సన్నిహితురాలైన సుగుణమణి గారు కూడా అమ్మతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. మమ్మల్ని వాళ్ళింటికి కూడా తీసుకెళ్లేది. స్వయంకృషి మానసిక వికలాంగుల సంస్థ మంజులా కళ్యాణ్ గారు గారితో కూడా మంచి సాన్నిహిత్యం. ఏదో కుట్టు నేర్పడం ఒక్కటే కాదు. Challenged పిల్లలకి చెప్పాలి. కొంతమంది పిల్లలు ఎంత attach అయిపోయేవారంటే, సాయంత్రం ఇంటికి వెళ్లమని ఏడ్చేవారు. పిల్లల కోసం చెట్ల క్రింద కూర్చునే తల్లితండ్రులు కొందరయితే, పిల్లల stipend ఎప్పుడు లాక్కుందామా అని ఎదురుచూసేవారు కొంతమంది. ఇలా ఎన్నో రకాల మనుష్యుల్ని , ఎన్నో మనస్తత్వాలని చూసింది అమ్మ.
మా నాన్న కి బ్యాంకు ఉద్యోగం కావడంతో ట్రాన్సఫర్ లు అవుతూ ఉండేవి. ఏ ఊరు వెళ్ళినా ఈవిడకి ఒక్కరే స్నేహితురాలు ఉండేవారు. వరంగల్ లో ప్రమీల పిన్ని, మహబూబ్ నగర్ లో శచీదేవి టీచర్ గారు, ఆత్మకూరు లో తేజా అత్తయ్య ఇలా. ప్రమీల పిన్ని,శచీదేవి టీచర్ గారు ఎక్కడ ఉన్నారో తెలీదు. తేజా అత్తయ్య తో అన్ని దశాబ్దాల స్నేహం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వచ్చాక ఉద్యోగం లో తన కొలీగ్ లే స్నేహితులు. పొద్దున్నే 10 గంటలకల్లా అన్ని పనులు ముగించుకుని( మేము చిన్న పిల్లలమైనా సరే ) కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి వచ్చిన అల్లికలో కుట్లో నేర్చేసుకునేవారు. ఈరోజుకి కూడా అమ్మ ఊరికే కబుర్లు చెప్పదు. చేతిలో చిక్కుడు కాయలైనా ఒలుస్తూ మాట్లాడుతుంది. మా అక్క , నేను అరుస్తుంటాము ‘ఏమిటే ఈ పని పిచ్చి’ అని. కానీ ఊరుకోదు. అమెరికా వస్తూ ఓ రెండు చీరలు తెచ్చుకుని వాటికి ఎంబ్రాయిడరీ చేసేస్తుంది. పోయినసారి మా దగ్గరికి వచ్చినపుడు కొడుకు కొనిచ్చిన ఐపాడ్ పెట్టుకుని యూట్యూబ్ లో ఏవో నేర్చేసుకుని సాయంత్రానికల్లా నేను వచ్చేసరికి ‘ఇది చేసానే ఈ రోజు’ అని చెప్పేది. ఫొటోల్లో కాన్వాస్ మీద ముగ్గులు వీడియోలు చూసి వేసేసింది. ఒకసారి ఏమీ తోచక పిల్లల crayons పెట్టి తెల్ల కాగితాల మీద రకరకాల ముగ్గులు వేసింది. మా ఇంటి చుట్టుపక్కల walking లో వీళ్ళ లాంటి retired వారు పరిచయం అయ్యారు. వాళ్లందరికీ ఆ ముగ్గులని ఫోటో ఫ్రేముల్లో పెట్టి ఇచ్చింది.
Time management అంటే మా అమ్మని చూసే నేర్చుకోవాలి. ఏదైనా సమయానికే. ఏ రోజయినా సరే ఎంత హడావిడి అయినా సరే మడి కట్టుకుని పూజ చేసుకుని బయటికి వెళ్తుంది. ఆవిడ చదివే స్తోత్రాలు నాకు అలా నోటికొచ్చేశాయి. సరే ఇక అందరి అమ్మల్లాగే వంట చేస్తే అమృతం. ఇల్లు సర్దితే అద్దం. ఎంత సాదా కాటన్ చీర అయినా గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుని కట్టుకునేది. ఆ చీరకే అందం వచ్చిందా అన్నట్లు.
మా చిన్నప్పటి నుండీ అమ్మకి ప్రతీది పూస గుచ్చినట్లు మాకు చెప్పడం అలవాటు. మేం చిన్నవాళ్ళం అర్ధం కాదు అనుకునేది కాదు. ఆవు-పులి కధ ఎన్ని సార్లు చెప్పినా వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళం .అంత బాగా చెప్పేది. మా పిల్లలకి కూడా చిన్నప్పుడు అదే ఇష్టంగా ఉండేది. . మా అందరికీ BFF అంటే అమ్మే.
ఇక నాన్నతో. అమ్మ, నాన్న ఇద్దరూ ఎవరి లోకంలో వాళ్ళున్నట్లే ఉంటారు. పోట్లాడుకున్నట్లే ఉంటారు. కానీ ఇద్దరికీ common interest లు భలే ఉంటాయి. సంగీత కచేరీలకి వెళ్ళడం. యాత్రలు చేయడం. కాఫీ తాగుతూ మా అందరి గురించి చెప్పుకోవడం. సంగీతం వినడం, పాత ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఇవన్నీ నాన్నే అమ్మకి అలవాటు చేసారు.
అమ్మకి తను అందరిలా డబ్బు తెచ్చే ఉద్యోగం చేయలేదని ‘ఏదోలే ఓ కుట్టు టీచర్ ని’ అని అనుకుంటూ ఉండేది. రెండేళ్ళ క్రితం, అమ్మవాళ్ళు అమెరికాకి వచ్చ్చి తిరిగి భారతదేశం వెళ్లేముందు మా ఊరి airport లో ఒకమ్మాయి (అమ్మాయి అనకుండా ఆవిడ అనచ్చేమో ) అమ్మని చూసి నవ్వుతూ ‘లలితా మేడం’ అంది. ఆ అమ్మాయి caretaker కి అర్ధం కాలేదు ఎవరిని పిలుస్తుందో అని. అమ్మ చెప్పింది ఆ caretaker గారికి ‘ ఓ పాతికేళ్ళ క్రిందట తనకి కుట్టు నేర్పించాన’ని. ఆవిడ మాటి మాటికీ తను చేసిన పని విలువని డబ్బుతో కొలుచుకుంటూ, ‘నిజమే కాబోలు ఎందుకు అమ్మ చేసే ఉద్యోగం పనికి రాని పనేమో’ అని మాకు తెలీకుండానే అనుకునేట్లు చేసింది. డబ్బు కోసం ఉద్యోగం అందరం చేస్తాము. లోకమంటే తెలీని ఆ అమ్మాయికి అమ్మ అంతలా గుర్తుండి పోయిందీ అంటే ఈవిడ చేసిన పని విలువ కట్టలేము అని ఆ రోజు నాకనిపించింది. . మనం మనిషి చేసేపనిని డబ్బు రూపంలోనే కొలవటం ఆపేసిన రోజున విలువలని కూడా గుర్తిస్తాము.